03 July 2008

మనలో మాట

ఈ మధ్య బ్లాగుల్లో మన ఆడవాళ్ళు రాస్తున్న కష్టాలన్నీ చదివి బండెడు కన్నీళ్లు ( ఓ చిరునవ్వుతో పాటు) ఒలికిస్తూ బోల్డు బాధ పడిపోయాను. ఎంతసేపూ ఆడవాళ్ళంటే వంటలు,పిల్లల పెంపకం వీటితోనే గడిపేస్తారని, గడిపేయాలని మగపుంగవుల కోరిక.  " మానూ మాకునుగాను,రాయీ రప్పను కానేకాను - మామూలు మడిసిని నేను.." అని చెప్పినా అర్ధం చేసుకోరు.

కేవలం ఆంటీ అన్న పిలుపు మనసుని ఎంత రంపపు కోత కోస్తుందో సుజాతగారెంత హృదయవిదారకంగా చెప్పారో. మన క్రాంతి పెళ్ళితో పాటు ఆంటీ అనే పిలుపు అప్పనంగా వచ్చి ఎలా అంటుకుందో నవ్వుతాలుకి చెప్పినట్టు చెప్పినా అందులో ఉన్న ఆడమనసు పడే బాధని ఎవరు అర్థం చేసుకుంటారు కనుక....


సుజాత గారివయసెంతో నాకు తెలీదు. నాకు మాత్రం నాలుగు పదులకి పైన ఒకటో రెండో...నేను ఎప్పుడు ఆంటీనయ్యానో తెలుసా... చెప్పనా...

నాకు పదహారు నిండి పదిహేడులోకి అడుగుపెట్టిన కొత్త. 
ఆబిడ్స్ లో మహబూబియా జూనియర్ కాలేజీలో ఇంటర్ లో జాయిన్ అయ్యాను. అక్కడినుండి ఆబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ దగ్గర బస్ ఎక్కుతూ ఉండేవాళ్ళం, చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని.
అక్కడ బస్టాపులో నుంచొని బస్ కోసం ఎదురుచూస్తూఉండగా....

 "ఆంటీ... ఆంటీ..." కాళ్ళు లాగేస్తోంది ఓ ఐదారేళ్ళ పాప...
"ఏయ్.. ఛీ వదులు.... వదులు... పో... " గట్టిగా కసిరింది మా ఫ్రెండు... 

ఇంతలో నా కాళ్ళకి చుట్టుకున్నాడు ఇంకో కుర్రాడు. 
"ఆంటీ... ఆంటీ.... పది పైసలియ్ ఆంటీ.... ఆంటీ.."
"ఏయ్ పోరి... ఇడువకు... గట్టిగ పట్టు...." తన చెల్లెల్ని హెచ్చరిస్తూ నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వదిలించుకుందామంటే వీలుకాదు. ఎలాగో ఒకలాగ రెక్కపట్టుకొని లాగేసాను. మళ్ళీ గబ గబా వచ్చి ఈసారి నడుము పట్టుకున్నాడు. మహా అయితే ఎనిమిదేళ్ళు ఉంటాయేమో..ఎంతలాగినా వదలడు...!!.
అవమానం, రోషం, ఉక్రోషం అన్నీ కలిపి జమిలిగా కంట్లోంచి నీళ్లు తెప్పించాయి. కొంచెం దూరంగా నిల్చొని వినోదం చూస్తున్నారు జనం. వాళ్ళలో కొందరు ఆకతాయి కుర్రకారు ఉత్సాహంగా చూస్తున్నారు.

ఆఖరికి నేను మా ఫ్రెండూ కలిసి బాగులన్నీ వెతికి రెండురూపాయి నాణేలు సంపాదించి వాళ్ళకి సమర్పించుకున్నాం. అడిగినది పది పైసలైతే రెండు రూపాయలిచ్చినందుకు ఉక్కిరిబిక్కిరైపోయాడా కుర్రాడు.
"ఆంటీ మంచిగుందిలే " అని ఓ కామెంటు పారేసి ఆ కుర్రాళ్ళ దగ్గరకెళ్ళిపోయారు ఇద్దరూ. వాళ్ళని ఏం అడగకుండానే వాళ్లు వీళ్ళకి ఏవో, ఎంతో మరి ఇచ్చారు.
మరో సారి వారం తేడాలో కోఠి బస్టాపులో నిలబడి ఉన్నాం, ఈసారి నేను, బియ్యే చదువుతున్న మా అక్కవరస అమ్మాయి. ఇద్దరు కుర్రాళ్లు పదే్ళ్ళ వాళ్ళు..... గబ గబా వచ్చి మా అక్క నడుము పట్టుకొని ఊపసాగారు. 

"ఆంటీ.. ఆంటీ...పదిపైసల్..." అంటూ.
నాకు చెప్పలేనంత భయం వేసింది. నా దగ్గర బాగ్ లేదు.. చిల్లర అసలే లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే నాకు అనుభవంలోకి వచ్చిన సందర్భం అది. 
మా అక్క రెండు సార్లు కసిరింది.వాళ్లు వదలలేదు. మరీ గట్టిగా నడుము పట్టుకొని 'ఆంటీ.... ఆంటీ' అని ఒకటే గోల..
మా అక్క రెండు నిముషాలు చూసింది.

"ఉండు" అంది.
"ఎంత కావాలీ" అంది. 
"పది పైసల్"  అన్నాడు కుర్రాడు ఆనందంగా.
"వాళ్ళు ఎంత ఇస్తారు" అంది.
నాకు అర్థం కాలేదు. ఎవరు ఎంత ఇస్తారు..... ఎంత ఇవ్వాలి అని అడగబోయి కంగారులో అలా అడుగుతోందా అని. "రూపాయిస్తారు ఆంటి..." అన్నాడు
"నేను రెండిస్త. రూపాయలు గాదు, పదిపైసల్ బిళ్ళ ల్. ఏరా ...గిసుమంటిపనులు చెయ్యొచ్చురా... మళ్ళెప్పుడైన ఈడ కనిపించినవనుకో.పోలీసులను పిలుస్తా... చేస్తవా.." అంది మా అక్క వాడికి అర్థమయ్యే భాషలో.

"చెయ్య" అన్నాడు వాడు. 
రెండు పదిపైసల బిళ్ళలు తీసుకొని వాళ్ళు వెళిపోయారు.
అప్పుడు అక్క చెప్పింది. ఇదో కొత్త టెక్నిక్ అని. ఆడ పిల్లల్నేడిపించడానికి రౌడీ వెధవలు ఈ వీధి కుర్రాళ్ళని ఇలా వాడుకుంటున్నారని... కాలేజి చదివే ఆడపిల్లల నడుముని పట్టుకుని వేలాడడం, కాళ్ళు పట్టుకోవడం ఆ బాధ భరించలేక ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు వాళ్ళను వదిలించుకోవడం.

పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం...ఈ బాధని చూస్తూ జనం ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారో నాకు అర్థం కాలేదు. మాసిన తలలు, చిరిగిన బట్టలు,చీమిడి ముక్కులు,జారిపోతున్న లాగులు ఇవన్నీ ఆ వీధి బాలల మీద సానుభూతి కలిగించవలసిన అంశాలు. అంత ఉత్సాహంగా వాళ్ళు చేస్తున్న పని వల్ల పది పైసలు కొండొకచో రూపాయలు (నేను ఇచ్చానుగా)సులువుగా సంపాదించి ఉండవచ్చు. వాళ్లనలాటి పనులకు పురిగొల్పిన వాళ్ళు ఎంత దుర్మార్గులు.....
ఇదీ నా మొదటి "ఆంటీ" అనుభవం.
 అంతం కాదిది ఆరంభం అంటూ ప్రారంభమయిన ఆ అనుభవం నిర్విరామంగా, నిరంతరంగా, అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది.
ఆ తర్వాత కోఠీలో క్లిప్పులు, నాడాలు అమ్మే కుర్రాళ్ళు ' తీసుకో' ఆంటీ అని వెంటపడేవాళ్లు. పట్టుమని పదిహేడు నిండకుండానే ఆంటీ అనిపించుకున్నగొప్ప అనుభవం. నేను కూడా మా పక్కింటిఆవిడని, ఎదురింటి ఆవిడని అత్తయ్యగారు అనే పిలిచేదాన్ని... వాళ్ళకి అందంగా ఉన్న,వయసులో ఉన్న కొడుకులున్నప్పటికిన్నీ. ఎవరికీ కోడలు కాలేనప్పటికిన్నీ.
కానీ ఓ చిత్రమైన అనుభవం ఏమిటంటే.....
మా వెనక ఇల్లు కట్టుకున్న 'వెనకాంటీ'  మాత్రం అప్పట్లో తనకన్నా ఐదారేళ్లు పెద్దవాళ్లైన మా అమ్మని, నాన్నని ఆంటీ అని, అంకులని పిల్చేది ఫాషన్ గా మూతి తిప్పుతూ. మళ్లీ వాళ్ళాయన గురించి చెప్పినపుడేమో 'మీ అల్లుడు గారు' అనేది. మా అమ్మ మౌనంగా పంటి బిగువున భరించేది. మా నాన్న దవడ కండరం గట్టి పడేలా నోరు బిగించుకొని అదోలా చూసేవారు.

నాకు ఒళ్ళు మండుకొస్తున్నా ఆవిడిచ్చే గుంటూరు గోంగూర పచ్చడిని తల్చుకొని 'అక్కా మరే.... బావగారింకా రాలేదా' అని వరస కలిపేదాన్ని. కానీ ఆవిడ వెనక ఆవిడెప్పుడూ నాకు వెనకాంటీయే. కానీ ఇప్పుడనిపిస్తుంది- ఆవిడని ఎంతమంది ఆంటీ అని పిలిచి చిత్రవధ చేసేరో... మా అమ్మ లాంటి సాధుజీవి దొరకగానే కసి తీర్చుకుందేమోనని.
ఈ విషయంలో మద్రాసు వాళ్ళు నయం... పనమ్మాయిలు, పూలమ్మే కుర్రాళ్లు, పాండీ బజారు లో పిన్నీసులమ్మేవాళ్లు అందరూ అక్కా అని నోరారా పిలిచేవాళ్లు. 

మొదట్లో ఆ పిలుపుకి పడిపోయి అవసరం ఉన్నా లేకపోయినా పిన్నులు నాడాలు తెగ కొని పడేసేదాన్ని. ఏ సొరుగులు తెరిచినా పిన్నులూ, కాళ్లకి చుట్టుకుంటూ సగం కట్ చేసిన నాడాలు పడుండేవి.
బీచికెళ్తే మల్లెపూలమ్మే చెల్లాయమ్మాయిలు, వేరుకడల్ అమ్మే తమ్ముళ్ళు అందరికీ న్యాయం చేసేదాన్ని. 
పాపం మా ఆయనంకుల్ నాకు భావుకత్వం ఎక్కువనుకొని నా పిలక జుట్టు మోయలేనన్ని మూరల పూలు కొనిపెట్టేవారు. ఆ కుర్రాళ్ళు స్కూలునుంచి వచ్చి ఈ జంగిడిలో వస్తువులు అమ్మి వాళ్ళ అమ్మా వాళ్ళకి సహాయం చేస్తున్నారని విని అవన్నీ కొంటున్నానని, బయటికొస్తే ఏతినుబండారాలు కొననివ్వని నేను ఇవన్నీ కొనడం వెనక కారణంగా చెప్పుకొని నాది జాలిగుండె అనుకొని  ఊహూ ఇదైపోయి కొని పెట్టేవాళ్ళు... అవన్నీ మర్నాడు చెత్తబ్బాయి పాలుచేస్తానని తెలిసినా.
అక్కడ చెత్త తీసుకెళ్ళే అబ్బాయి కూడా ' అక్కా' అనేవాడు. వాడికి అప్పుడే దించిన కుక్కర్లోంచి తీసిన వేడివేడి అన్నం, వేగుతున్న కూర ఇచ్చేసేదాన్ని. " పోదుం...పోదుం.." అంటున్నా దగ్గరుండి వడ్డించి మరీ అన్నం పెట్టేదాన్ని. ఈ దానకర్ణ బుద్ధి వెనక ఉన్న బలహీనతని మా అంకులొక రోజు కనిపెట్టేసారు (అంకులంటే మా ఆయనేలే..).

"హౌరా" అని హాశ్చర్యపోయేసి మళ్లీ వచ్చి ఈఊర్లో ఈ పిలుపు మామూలే ఆవటా అని, కొంప గుండం చేయొద్దని ఓ ఫైన్ మార్నింగునాడు నాకు వార్నింగిచ్చి ఆఫీసుకెళ్ళిపోయారు.
"అక్కా తక్కాళి వేణుమా" అంటూ వచ్చాడు కూరలబండివాడు. కిలో నలభై...!!! రెండుకిలోలు తూపించా తమ్ముడితో... ఇద్దరికోసం ఇన్ని కూరలా అన్న వాడి సందేహం నాకు అర్థమైనా.
ఇప్పుడు చెంపలు నెరుస్తూ, ముంగురులు వెండితీగల్లా మెరుస్తూ బయటపడుతూ
నిజంగా ఆంటీ వయసొచ్చేసింది. అలవాటయిపోయిన "ఆంటీ" పిలుపు పోయి - "అమ్మమ్మగారూ" అనో " బామ్మగారూ" అనో మారి పోదు కదా అని మనసులో ఓ భయం ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటుంది. 
అయినా ఈ కాలంపిల్లలు అలా పిలవను కాక పిలవరు. 
మహా అయితే గ్రాన్నీ.... అంటారేమో.
చూద్దాం. ఊళ్ళో అడ్డమయిన వాడికీ అమ్మమ్మనయ్యే యోగం కూడా ఉందా... 
ఏం బాధొ చ్చిపడిందిరా...... భగవంతుడా!!