11 February 2009

తెలుగు కథకి జేజేలు

తెలుగు కథకి నూరేళ్ళ పుట్టినరోజు,వచ్చేసంవత్సరం అంటే 2010,ఫిబ్రవరి లో.

ఏవిఁటీ,కథ పుట్టి వందేళ్ళేనా అని ఆశ్చర్యంగా ఉందా.

కథ కథ ఈనాటిది కాదు.ప్రతి మానవసమాజంలోను లిఖితరూపమైన సాహిత్యం ఆవిర్భవించక ముందే మౌఖిక సాహిత్యం ప్రచారంలో ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తాయి.మన ప్రాచీన సాహిత్యంలో కూడా వేదాలకు అనుబంధాలుగా కనిపించే ఐతరేయ బ్రాహ్మణం వంటివాటిలో అనేక నీతికథలు కనిపిస్తాయి.

ఇవన్నీ మౌఖికంగా ప్రచారంలో ఉన్న కథలు.వేదాలలో తేలిగ్గా స్పృశించి వదిలిన కథావస్తువులు అద్భుతమైన కథలుగా మారి పురాణాలుగా,ఇతిహాసాలుగా ప్రజలలో తరతరాలపాటు నిలిచిపోయాయి.పంచతంత్రకథలు,కాశీమజిలీ కథలు, పంచవింశతి కథలు ఇలా ఎన్ని కథలు ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్నాయి.

తెలుగు భాష లిఖితరూపం పొంది బాగా ప్రజాదరణ పొందే నాటికి ఈ పురాణేతిహాసాలన్నీ కావ్యరూపంలోకి మారి కథాకావ్యాలయ్యాయి. వస్తు కల్పనలో,అద్భుత చిత్రణలో, పాండిత్యంలో కవులు చూపిన కొత్తపోకడలు మరెన్నో శతాబ్దాలపాటు కవులకు ఆదర్శంగా,ప్రజారంజకం చేస్తూ నిలిచాయి.లిఖించబడని కథలెన్నో తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి.పేదరాశిపెద్దమ్మ కథలు,తెనాలిరామలింగడి కథలు,మర్యాద రామన్న కథలు సాహసానికి, చమత్కారానికి,తెలివికి ప్రతీకగా నిలిచాయి.

ఈ రకంగా చూస్తే కథలు మనకు,మన సమాజానికి కొత్తవి కాదు.

కానీ ఇరవయ్యవశతాబ్ది ఆరంభంనాటికి పాశ్చాత్య పాలనలో సంస్కృతి,నాగరికత,విద్యావిధానాలు మొదలైన వాటివలన వచ్చిన మార్పులెన్నో భారతీయ సాహిత్యంపైన ప్రతిఫలించాయి. ఇలా సాహిత్యంలో వచ్చిన మార్పులతో ఏర్పడిన కొత్త ప్రక్రియలు -కవిత్వంలో నవ్వకవిత్వం,భావకవిత్వం ,నవల,కథ లేక కథానిక ప్రక్రియలు ఏర్పడ్డాయి.

అగ్నిపురాణంలో ఏనాడో కథ గురించి ప్రస్తావించి,లక్షణాలు వివరించారు. పొందికగా ఉండి,పఠితకి సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలతో కూడి అద్భుతమైన మలుపుతో కథ ముగియాలని వివరించబడింది.ప్రాచీన కావ్యాలలో ఈ లక్షణాలతో కూడిన కథలు కనిపిస్తాయి కానీ శిల్పరీత్యా ఇంకా తీర్చిదిద్దినప్పుడే ఇవి మంచి కథలవుతాయని పండితుల అభిప్రాయం.

అందువల్ల కథ లేదా కథానిక అని మనం ఇప్పుడు అంటున్న ఈ కథ కొత్తప్రక్రియ.రూపంలోను, లక్షణంలోనూ మన ప్రాచీన సాహిత్యానికి భిన్నమైనది.ముఖ్యంగా నాటికి నేటికి కథ లో ఉన్న తేడా శిల్పం.

ఇప్పుడు ఆధునిక కాలంలో మనం కథ అని వ్యవహిస్తున్న పదం ఇంగ్లీషులోని షార్టుస్టోరీ కి పర్యాయ పదంగా వాడుతున్నాం..

ఆధునికసాహిత్యంలో సుమారుగా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఒకే సారి ఉద్భవించిన ప్రక్రియ ఈ షార్టు స్టోరీ.వస్తువు, శిల్పంవిషయంలో ఎంతో వైవిధ్యంతో మలచబడ్డాయి ఆధునిక కథలు.

ఆధునిక కథని నిర్వచించినప్పుడు పండితులు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కథ లో ఎత్తుగడ,నడక,ముగింపు, వీటిలో రచయిత చూపించే కొత్తదనం,నేర్పు,పరిమితమైన పాత్రలతో,ఒకానొక జీవితసత్యాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలుస్తుంది. ఆధునిక కథకి ప్రాణం -శిల్పం.ప్రాచీన సాహిత్యంలా కాకుండా ఆధునిక కథకి సమకాలిన మానవ జీవితమే వస్తువు.కథలో క్లుప్తత ముఖ్య లక్షణం కావడంవలన అనవసరమైన వర్ణనలు,అనవసరమైన పాత్రలు ఉండవు.కథలో ప్రతి సన్నివేశం,ప్రతి వాక్యం కూడా కథలోనే ప్రధాన కేంద్రం వైపే సాగిపోతాయి.వస్తువులో ఒక విలక్షణత్వం,మంచి ప్రారంభం,ముగింపు,పాత్రోచితమైన భాషను ప్రయోగించడంలో రచయిత ప్రదర్శించే నేర్పు ఇవన్నీ ఒక వస్తువు మంచి కథగా రూపొందడానికి తోడ్పడే అంశాలు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదట ప్రచురించబడిన కథ -దిద్దుబాటు.1910,ఫిబ్రవరి నెలలో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడింది. కథా రచయిత గురజాడ అప్పారావు.

19 వశతాబ్ది అర్థభాగంనుంచి వీరేశలింగం పంతులుగారు వెలార్చిన సంస్కరణోద్యమాలు,గిడుగు రామమూర్తి పంతులుగారి లాంటి సమకాలికుల వ్యావహారిక భాషోద్యమాలు,శాస్త్రీయ దృష్టి గురజాడ లో నవ్యసాహిత్యం- కవిత్వంలోనూ,వచనంలోనూ కొత్త పోకడలకు నేపథ్యం గానిలిచాయి.

అడుగుజాడ గురజాడది అదిభావికి బాట-అని తెలుగు ప్రజలు గురజాడని ఆధునిక సాహిత్యానికి మూల పురుషుడుగా గౌరవిస్తారు.తన కాలంలో అసలెప్పటికీ సాధ్యం కావేమో అని పించిన సంస్కరణభావాలను తన కవితలలోను కథలలోను వస్తువు,పాత్రలద్వారా ప్రతిఫలించి ముందుకాలానికి చూపు సారించిన ద్రష్ట గురజాడ అప్పారావు.

గురజాడ రాసిన కథానిక దిద్దుబాటు ఇంగ్లీషు షార్టుస్టోరీ నిర్వచనానికి,లక్షణాలకి అనుగుణంగా కనిపిస్తుంది.గురజాడ దీనికి మొదట పెట్టిన పేరు దిద్దుబాటు అయినా తరువాత కమలిని అని దీని పేరు మార్చడంలో ఉద్దేశం కూడా కథలో కనిపించని ప్రధానపాత్ర నాయిక-కమలిని ప్రత్యేకత నిరూపించడం కోసమే.

మొదటి దిద్దుబాటు కథలో సరళగ్రాంథిక భాష,సవరించిన దానిలో సరళ వ్యావహారికం కనిపిస్తాయి.కథలో ప్రధాన పాత్రలు రెండే.కనిపించని మరో పాత్రే కథానాయిక.చదువుసంధ్యలు నేర్చిన పడతి భర్తని తనకి అనుకూలంగా మార్చుకొని అతని లోని వేశ్యాలోలత్వాన్ని దూరం చేయడం ప్రధాన కధాంశం.స్త్రీలు చదువుకోవడం వలన కుటుంబానికే కాక సమాజానికి కూడా చాలా మేలు చేకూరుస్తుందని నిరూపించదలిచి ఈ వస్తువును తీసుకున్నారు.

వేశ్యలను ఉంచుకోవడం,వారి ఆటపాటలమధ్య ఆనందం పొందడాన్ని మగవారి అత్యంత సహజగుణంగా భావించే రోజులు కథకి నేపథ్యం.వేశ్య ఇంటినుంచి వచ్చిన భర్త, భార్య తన గదిలో కనిపించక వెతుక్కుంటాడు.పనివాడు తనకు తెలియదంటాడు.ఆమె రాసి పెట్టిన ఉత్తరం చూసి తనపై కోపించి ఆమె పుట్టింటికి వెళ్లి పోయిందని అర్థం చేసుకుంటాడు. తనకి బుద్ధి వచ్చిందని చెప్పమని,ఇంక వేశ్యలో జోలికి వెళ్ళనని పనివాడి ముందు ప్రమాణం చేసి భార్య పైన తన ప్రేమను వెల్లడిస్తాడు.ఎలాగయినా ఆమెని తిరిగి తీసుకురమ్మని పనివాడిని పంపిస్తాడు.మధురమయిన గాజుల చప్పుడు, మంచం కింద నుండి వినిపించిందని కథ ముగియటంలో భార్య ఎక్కడికీ వెళ్ళలేదని,భర్తని తన తప్పు తెలుసుకొనేలా చేసిన ప్రయత్నం అని పాఠకులకు తెలుస్తుంది.

గురజాడ చేతిలో అద్భుతంగా ప్రాణం పోసుకున్నతెలుగు కథానిక క్రమక్రమంగా వికసించి,విస్తృతంగా వ్యాపించింది.ఎందరో రచయితలు తెలుగు కథ కి వస్తు వరణంలో,పాత్రచిత్రణలో,శిల్పనైపుణ్యంలో కొత్తతోవలు తొక్కి కథకి అంతర్జాతీయ స్ధాయిని ఆపాదించారు. గౌరవాలు దక్కించారు.ఎన్నో కథలు ప్రపంచంలో ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి.

క్రమంగా తెలుగులో పత్రికల ప్రచురణ బాగా ఊపందుకున్నాక కథలు రాసే రచయితలతో పాటు రచయిత్రులు కూడా పెరిగారు.పత్రికలు, రేడియోలు,టెలివిజన్ లు ఇలా ప్రసార మాధ్యమాలన్నిటిలోను కథ ఒక తప్పని సరిగా కావలసిన వినోద సాధనమైంది. సాంకేతిక పరిజ్ఞానం ఇనుమడించి కాలం 21వ శతాబ్దికి అడుగుపెట్టేనాటికి ప్రపంచం ఒక కుగ్రామంగా భావించే స్థాయికి మానవ సమాజం చేరుకుంది. ఇంటర్నెట్ పేరున అంతర్జాలం లో ఎన్నో సాహిత్య పత్రికలు ఆవిర్భవించాయి.తెలుగు కు సంబంధించి ఎన్నో పత్రికలు అంతర్జాలంలో ఉన్నాయి. పత్రికలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం వలన రచయితలు భారత దేశం బయట కూడా ఉండి రచనలు చేసే సౌకర్యం వచ్చింది.కథా వస్తువు భారతదేశం దాటి ప్రపంచంలో ఏ మూల నివసించిన వారి జీవితమైనా కావచ్చు.ఈ రకంగా వస్తువైవిధ్యం పెరిగింది.మానవజీవితంలో ఆవిష్కరింపబడని కొత్త కోణాలను కథారచయితలు స్పృశించి,సృజించగలుగుతున్నారు.

భాషలో కూడా ఎంతో మార్పు వచ్చింది. సరళ గ్రాంధిక భాషలో ప్రారంభమయిన కథ ప్రస్తుతం పూర్తిగా సరళమై, వ్యావహారికశైలిని సంతరించుకుంది.కొందరు రచయితల చేతిలోమాండలికభాషలోని మాధుర్యాన్నిఅద్దుకుంది.

ఆధునిక కథ కేవలం కాలక్షేపానికో,వినోదానికో మాత్రమే పరిమితంకాలేదు.వర్తమాన మానవుడి జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ, మానవసమాజాన్ని సహజాతిసహజంగా చిత్రించడమే కాక అందులోని వికృతిని,మానవస్వభావంలోని సున్నితకోణాలను చూపుతూనే మృగప్రవృత్తిని ఎండగట్టింది.ప్రజలలో ఒక మానసిక విప్లవం ఆవిర్భవించడానికి కథల ద్వారా రచయితలు ప్రయత్నం చేసారు. చక్కని శైలిలో సమకాలిన వస్తువుతో ప్రతిభావంతుడైన రచయిత చేతిలో మలచబడిన కథలు ప్రజల మానసిక ప్రవృత్తిలో మార్పుతెచ్చి మనిషిని దానవత్వం నుంచి మానవత వేపుకి దృష్టిసారించేలా చేయగలవని నిరూపించబడిన సత్యం.

ఈ వందేళ్ళుగా తెలుగు కథ జీవవాహినిగా ప్రవహిస్తూనే ఉంది.గురజాడ మొదలుగా నేటి వరకు ఎందరో రచయితలు తెలుగు కథానిక ప్రక్రియను జవజీవాలతో పరిపుష్టం చేస్తూనే ఉన్నారు.తెలుగు కథ సజీవస్రవంతిగా సాగిపోతూనే ఉంది,ఉంటుంది. వందేళ్ళ పుట్టిన రోజు చేసుకుంటున్న తెలుగు కథకి అందరం చప్పట్లు కొట్టి జేజేలు చెబ్దాం.

02 February 2009

ఆడాళ్ళూ..మీకు జోహార్లు

అమ్మ నాన్న టివి చూస్తున్నారు.
అమ్మ లేచింది, ’అబ్బా ..చాలా అలసటగా ఉంది. బాగా లేటయింది. ఇంక పడుక్కోవాలి’ అంటూ వంటింట్లోకి నడిచింది.

మర్నాడు పొద్దున్న వంటకి కావలసిన వస్తువులన్నీ చూసుకుంది.మర్నాడు సాయంత్రానికి వండుకోవలసిన కూరలు ఉన్నాయో లేదో చూసింది.

ఉప్పు,పంచదార,గోధుమపిండి,పోపు డబ్బాలు తెరిచి చూసింది ఎంత ఉన్నాయో అని. పొద్దున్నే అప్పటికప్పుడు అవి అయిపోతే నింపుకోవడం హడావిడి లో కుదరదు మరి.

పిల్లలు తినడానికి కార్న్ ఫ్లేక్స్ డబ్బా,బౌల్స్, స్పూన్స్ డైనింగ్ టేబిల్ మీద పెట్టింది.కాఫీ ఫిల్టర్ లో కాఫీ పొడి వేసి, స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టింది. లేవగానే కాఫీ కలపడంకోసం.

బాత్రూం లోకి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి విప్పి పడేసిన బట్టలు,తడి తువ్వాళ్లు వాషింగ్ మెషిన్ లో పడేసింది. ఉతికిన బట్టల లోంచి మర్నాడు పిల్లలకు కావలసిన యూనిఫామ్ బట్టలు ఇస్త్రీ చేసింది.లూజ్ గా ఉన్న నిక్కర్ బటన్ ని కుట్టి, సరిగా లేని జిప్ ని బాగుచేసింది.

హాల్లో టేబిల్ మీద పడి ఉన్న గేమ్,దానికి సంబంధించిన ముక్కలన్నీ ఎత్తి అట్టడబ్బాలో పెట్టి షెల్ఫ్ లో పెట్టింది.కార్డ్ లెస్ ఫోన్ ని ఛార్జింగ్ కోసం బేస్ లో పెట్టింది. సెల్ ఫోన్ లోకి చూసి ఛార్జర్ తీసి ప్లగ్ లో పెట్టింది.కింద పడి ఉన్న టెలిఫోన్ డైరెక్టరీని మళ్లీ ఫోన్ పక్కన పెట్టేసింది.

ముందురూమ్ లో ఇందాక వాడిపోతూ దిగాలు పడినట్టుగా కనిపించిన ఇండోర్ ప్లాంట్ గుర్తొచ్చి జగ్ లో నీళ్లు తీసుకెళ్లి మొక్కకి పోసింది. పొద్దున్న కి అది మళ్ళీ నిటారుగా నిల్చుంటుంది కళకళలాడుతూ.

పిల్లల టేబిల్ చూడగానే గుర్తొచ్చింది, బాబు టీచర్ కి రాయవలసిన ఉత్తరం, పిక్నిక్కి వెళ్ళడానికి కట్టవలసిన డబ్బు. లెటర్ రాసి,పర్సుతీసి డబ్బు లెక్క పెట్టి దాని పక్కనే పెట్టింది.టేబిల్ కింద మూల దాక్కొని ఉన్న టెక్ట్స్ బుక్ తీసి స్కూల్ బేగ్ పక్కన పెట్టింది. చిన్నవాడి పెన్సిల్ బాక్స్ తీసి చూసి పెన్సిల్ చెక్కి ఉందోలేదో చూసింది.రబ్బర్ అరిగిపోయి చిన్నదయిపోయింది. కొత్త రబ్బరు పెట్టి బాక్స్ లోపల పెట్టింది.

ముందురోజు స్నేహితురాలి పుట్టినరోజు కోసం కొన్న గ్రీటింగ్ కార్డు బయటకి తీసి సంతకం చేసి కవర్ పైన స్టాంప్ అంటించి అడ్రెస్ రాసి బేగ్ లో పెట్టుకుంది, వెళ్తూ దారిలో పోస్టు చెయ్యొచ్చని.ఆచేత్తోనే రాసి పెట్టుకున్న,అయిపోయిన సరుకుల లిస్ట్ ని కూడా బేగ్ లో పడేసింది.వెళ్తూ ఆ షాప్ లో ఇచ్చేయొచ్చు.

వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి అద్దంలో మొహం చూసుకొని, పళ్లు తోముకొని, పొడి చర్మానికి నిగారింపు తెచ్చే క్లీనర్ తో మొహం కడుక్కొని బెడ్ రూంలోకి వెళ్ళింది. ముడుతలు పోగొట్టే నైట్ క్రీం రాసుకుంటూ గోళ్ల వైపు చూసుకుంది. సగం పోయిన నెయిల్ పాలిష్ చూసి రిమూవర్ తో తుడుచుకొని చేతులు కడుక్కుంది.

’ఏమిటి...పడుక్కుంటున్నానన్నావ్...’భర్త ప్రశ్న వినిపించింది.
’ఆ..ఆ...పడుక్కుంటున్నా’నని జవాబు చెప్పి తలుపులు అన్నీ వేసి ఉన్నాయోలేదో చూసింది. పెంపుడు కుక్క తినే ప్లేట్ శుభ్రంగా ఉందో లేదో చూసి అందులో కొంచెం నీళ్లు పోసి పెట్టింది. వరండాలో లైట్ ఆర్పి, అన్ని గదులు చూసింది. పిల్లలగదిలో లైట్ వెలుగుతోంది. పాప ఇంకా పడుక్కోలేదు. పడుక్కోమంటే ఇంకా కొద్దిగా మిగిలిన హోంవర్క్ చేసి పడుక్కుంటానంటూ ఏవో కబుర్లు చెప్పింది. కబుర్లు వింటూనే అక్కడ పడి ఉన్న వస్తువులన్నీ సర్ది,బాబు దుప్పటిసరిగ్గా కప్పింది.

మర్నాడు తెల్లబట్టలు వేసుకోవలసిన రోజని గుర్తుచేసిన పాపని ఓసారి అభినందించి మళ్లీ తెలుపు బట్టలు తీసి ఇస్త్రీ చేసింది. తెల్లసాక్స్ల్,బూట్లు బయట పెట్టి,నల్లబూట్లు,కంపుకొడుతున్న సాక్స్ ఓ పక్కగా పెట్టింది. వేరుగా ఉతకాలి అవి.

మంచం మీదకు చేరుకుంటూ అలారం పీస్ తీసి టైం సరిగ్గా సెట్ చేసి ఉందో లేదో చూసుకుంది.మర్నాడు ఆఫీసుకు వేసుకోవలసిన బట్టలు సిద్ధం చేసి పెట్టుకుంది.

మంచం మీద వాలి కళ్లు మూసుకొని ఆ రోజు చేసిన పనులు,మర్నాడు చేయవలసిన పనులు అన్ని పునశ్చరణ చేసుకుంది. ఇందాక కాఫీ కోసం నీళ్లు పెట్టి దించాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని అనుమానం వచ్చి కంగారుగా కిచెన్ లోకి వెళ్లి చూసుకొని హమ్మయ్య అనుకొని వచ్చి పడుకుంది. పడుక్కునేముందు నిత్యం చేసుకునే ప్రార్థనని ఒక్కసారి మనసులోనే చేసుకొని కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకుంది.

టివి చూస్తూ కునికిపాట్లు పడుతున్న భర్త సోఫాలోంచి లేచాడు.నేను పడుక్కుంటున్నా అని జనాంతికంగా ప్రకటించి టివి ఆఫ్ చేసి రిమోట్ సోఫాలో పడేసి లైట్ ఆర్పి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద పడుక్కుని క్షణంలో నిద్రపోయాడు. మరో ఐదు నిముషాల్లో ఆగదిలో గుర్రు గుర్రుమని శబ్దం వినిపించింది. భార్య అసహనంగా కదిలి తలగడతో చెవిని మూసుకుంటూ నిద్రపోడానికి ప్రయత్నం చేసింది.

కథ కంచికి మనం వంటింట్లోకి.....

.ఇందులో ఏదేనా అభూతకల్పనగా అనిపిస్తోందా...లేదుకదా...

.ఆడవాళ్ళే ఎక్కువ కాలం జీవించడానికి కారణం బోధ పడిందా...అవునుకదా...

ఎంత జీవితమూ సరిపోదు,ఆడవాళ్లకి...ఎందుకంటే ఇతరుల కోసం కూడా జీవించాలి కాబట్టి...యముడు ముందుగా పర్మిషన్ కోసం వస్తే "వీటలేదని చెప్పించి-వీలుకాదని పంపిస్తాం".
అందుకే

ఆడాళ్ళూ....మీకు జోహార్లు...

(నెట్ లో ఫార్వర్డు చేయగా వచ్చిన "why women are so special"అన్న సందేశం స్ఫూర్తితో(రచయిత(త్రి) ఎవరో కాని వారికి నా కృతజ్ఞతలు)

06 January 2009

మరోసారి హార్ట్ బ్రేకింగ్

హార్ట్ బ్రేకింగ్ పేరుతో ప్రచురించబడిన ఈ కథ నా మొట్ట మొదటి కథ(బహుశః ఆఖరిది కూడానేమో).

సంచలన వార్తల పేరిట న్యూస్ ఛానెల్స్ అశ్లీలదృశ్యాల సమాహారాలను ప్రసారంచేస్తూ, విష సంస్కృతులకు వాహనాలవుతూ పసిపిల్లల పాల మనసులను కలుషితం చేస్తుంటే ఏమీ చేయలేని ఒక నిస్సహాయత మనసుని మంటల కొలిమిగా మార్చింది. ఆ ఆవేదనని మాటలలో పేరుస్తూ దృశ్యాలను కూరిస్తే ఈ కథ రూపొందింది.ఇదే నా కథకి నేపథ్యం.

వందల కథలను చదివిన అనుభవం నాతో ఒక్క మంచి కథ రాయించలేకపోయిందే అన్న నిరాశ ఉన్నా, పొద్దు వెబ్ పత్రిక నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించి నన్ను రచయిత్రిని చేసినందుకు ఎంతో సంతోషం కలిగింది.స్పందించిన పాఠకులకు, పొద్దు సంపాదకులకు నా అభివాదాలు-అభినందనలు.

కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న ప్రవీణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవెల ఇప్పటివరకూ ఎంత ప్రశాంతంగా ఉంది...... ఎక్కడిదీ ఘంటానాదం... ఎవరూ కనిపించరేం... వెనక్కి తిరిగి చూసింది. 

దేవుడి విగ్రహం రాయిలా నిలబడి ఉంది. రాయిలా ఉన్న తనను,తను సృష్టించిన మనిషి , తనని ఇంత అందమైన రూపంలో సృష్టించి నిలిపినందుకు గర్వపడుతూ ఒకింత దరహాస రేఖను తొణికిస్తూ ఉంది.
ఇంతకీ ఈ గంటనెవరు మ్రోగిస్తున్నట్టు...
దానికదే ఎలా మ్రోగుతోంది... ఆగదేం.....
అబ్బ.....బ్బ.... ఎలా దీన్ని ఆపడం... చెవులు శబ్దాన్ని భరించలేక పోతున్నాయి. అంతకంతకూ ధ్వని పెరిగిపోతోంది.. మెదడులో నాళాలు చిట్టిపోతాయా అన్నట్టుగా ఉందే....ఒద్దు.... భరించలేను...
గట్టిగా చెవులు మూసేసుకుంది.
ప్రవీణా.... లే....టైమ్ చూడు... లేటయి పోతోందని హడావిడి పడతావ్.... పరిచయమైన గొంతు విని ధైర్యంగా కళ్ళు తెరిచి చూసింది. గెడ్డం గీసుకోడానికి సిద్ధ పడుతూ చేతిలో రేజర్, బుగ్గల నిండా సబ్బునురుగు.....రవీంద్రని పోల్చుకున్నాక చటుక్కున లేచి మంచం దిగింది.
అనాలోచితంగానే గోడవేపు చూసి ఏడయిపోయిందే అని పరుగుపెడుతున్న ప్రవీణని చూసి నవ్వుకున్నాడు రవీంద్ర.
రాత్రి రకరకాల ఆలోచనలతో పక్కమీద దొర్లగా దొర్లగా ఎప్పుడో ఏ తెల్లారుఝామునో నిద్రాదేవి కరుణించింది. ఇంతకీ ఆ కల ఏమిటి...కలలకి అర్థం ఉంటుందా... ఉండదా ... ఉంటే ఏమిటి ఆ కల..... చెవులు రింగుమంటున్న ఆ నాదం ఇంకా మనసుని కలవరపెడుతూనే ఉంది.... అసంకల్పితంగానే రోజూ చేసే పనులన్నీ చేసుకుంటోంది ప్రవీణ.
తన కన్నా ముందే నిద్రలేచిన అత్తగారు వంటింటి బాధ్యత నెత్తినేసుకున్నట్టున్నారు. కాఫీ కప్ అందుకుంటూ ప్రవీణ అడిగింది ఆవిడని. చిన్నత్తయ్యగారు వాళ్ళు ఎన్ని గంటలకి వస్తున్నారూ అని.
ఏదీ వీడు తెమిలి వెళ్ళి తీసుకురావద్దూ... ఏ పదో పదకొండో అవుతుంది. ఏం తక్కువ దూరమా.... స్నానం చేసి వస్తున్న కొడుకునుద్దేశించి అందావిడ.
ఆవిడ చెల్లెలు,మరిది, కొడుకు, కోడలు ఏదో పెళ్లి కోసం ఈ ఊరొచ్చి ఆవిడని చూడడం కోసం ఇవాళ వస్తామన్నారు. అందుకే ఆవిడ హడావిడి. ప్రవీణకి కొత్త ఉద్యోగం... అప్పటికే పిల్లల కోసం రెండుసార్లు శలవలు వాడేసింది.మరి పెట్టడం కుదరదు. పిల్లలకి,రవీంద్ర కి శలవే కాబట్టి పని తొందరగా చెయ్యవలసిన అవసరం లేదు. అర్థం చేసుకొనే మనిషి కాబట్టి అత్తగారితో సమస్య లేదు.
రవీంద్ర వంటింట్లోకి తొంగి చూశాడు. ప్రవీణా... నువ్వు నిద్రలో ఉండగా ఏదో ఫోన్ వచ్చింది. చూశావా.. నేను బాత్రూంలో ఉన్నానప్పుడు.... చెప్పి వెళ్ళి పోయాడు.
తనని ఇంతసేపూ కలవర పరిచిన కలలోని గుడి గంటకీ, చెవి పక్కనే పెట్టుకొని పడుకున్న సెల్ ఫోన్ రింగ్ టోన్ కి లంగరు అందింది ప్రవీణకి. మనసు తేలిక పడింది.
సెల్ తీసి మిస్డ్ కాల్స్ చూసింది. ఆశ చేసింది. ఎందుకు చేసిందబ్బా
అనుకుంటూ ఆశ నంబరు డయల్ చేసింది.
అక్క గురించి ఏదో కంప్లైంట్ చేద్దామని వచ్చిన రాహుల్ క్షణ క్షణానికి అమ్మ మొహంలో మారుతున్న భావాలని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయాడు.
నిజంగానా.... అవునా... ఓకే... నేను మళ్ళీ చేస్తాలే... బై... అంటూ ఫోన్ కట్ చేసి రాహుల్ వేపు చూసింది ప్రవీణ. ఏమనుకున్నాడో మరి అమ్మతో ఏమీ చెప్పకుండానే వెళ్ళి పోయాడు, పాలు తాగేవా నాన్నా అన్న అమ్మ ప్రశ్నకి ఊ కొడుతూ.
ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణ ని గాల్లో తేలుస్తోంది. ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం. ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్.... ఇవాళ నాదే....
మనసులో పదే పదే అనుకుంటూ తనలో తనే మురిసి పోతోంది ప్రవీణ.
ఒత్తైన తలకట్టు,తీర్చిన పెదవులు,సూటిగా కోటేరేసిన ముక్కు, లేత మొహం.... ఇవన్నీ ఒక ఎత్తు కాగా చక్కని పలువరుస,స్పష్టమైన ఉచ్చారణ,భావగర్భితమైన మాట తీరు మరో ఎత్తు. ప్రవీణని చూసిన వెంటనే,కొద్ది పరిచయం తోనే ఎదుటి వ్యక్తిని ఆకర్షించే ఆకట్టుకోగల లక్షణాలు. ఒకప్పుడు ఆ వృత్తికి అవసరం లేదేమోమరి అని జనం టెలివిజన్ లో చూసే వాళ్ళని గురించి అనుకునే లక్షణాలన్నీ ప్రవీణలో మూర్తీభవించి ఉన్నాయి.
ప్రవీణకి న్యూస్ రీడర్ ఉద్యోగం అనుకోకుండా దొరికింది. ఇంటిపని,పిల్లల పెంపకంలో తలమునకలయి ఉద్యోగ ప్రయత్నమే మానుకుంది చాలాకాలం. పిల్లలు కొద్దిగా పెద్దయి అత్తగారు తమ దగ్గరే ఉండడానికి వచ్చిన తర్వాత బోలెడు తీరిక దొరికింది.న్యూస్ రీడర్స్ కావాలంటూ ఓ ఛానెల్ చేసిన ప్రకటన కళ్ళబడి,అప్లికేషన్ పంపించడం, ఎందరితోనో పోటీ పడి ఉద్యోగం సంపాదించుకోవడం అనుకోకుండానే జరిగిపోయాయి. 

ఉద్యోగం ప్రవీణ జీవితంలో కొత్త ఉత్సాహం నింపింది. రోజు రోజుకీ ఛానెల్స్ మధ్య పెరుగుతున్న స్పర్థ వల్ల కొత్త కొత్త సంచలనాత్మక వార్తలెన్నో వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ కి మాత్రం ఉద్యోగ జీవితం లో ఒక అసంతృప్తి ఉండిపోయింది.తను పనిచేసే ఛానెల్ లో ఇద్దరు కలిసి న్యూస్ చదువుతారు. ఒక సీనియర్ ని, ఒక జూనియర్ ని కలిపి వార్తలు ఇస్తారు. ముఖ్యమైన వార్తలన్నీ సీనియర్ కోటాలోకి వెళ్లిపోతున్నాయి. సాదా సీదా వార్తలు, షేర్ మార్కెట్ ధరలు, వాతావరణం తన ఖాతాలో పడుతున్నాయి. ఇష్టమైన వృత్తిలో ఉంటున్నా ముఖ్యమైన వార్తలని, జనం ఆసక్తిగా ఎదురుచూసే ముఖ్యాంశాలని తనే అందించాలన్న కోరిక తీరడంలేదు. ఇప్పట్లో తీరేది కూడా కాదని నిరాశ చేసుకుని ఉన్న ఈ సమయంలో వచ్చింది ఆశ ఫోన్. 

ఈ రోజు తనతో పాటు వార్తలు చదవవలసిన పల్లవికి చాలా అర్జెంట్ పని వచ్చి పడిందని ,సమయానికి మరెవరూ అందుబాటులో లేరు కనుక ఇద్దరి వార్తలూ ప్రవీణే చదవ వలసి ఉంటుందని చెప్పడానికే ఆశ ఫోన్ చేసింది. ప్రవీణ మనసులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారణం ఇంకోటి. వివరాలు ఇంకా వివరంగా తెలీక పోయినా చాలా ముఖ్యమైన వార్త బ్రేకింగ్ న్యూస్ గా రాబోతోందని. ఛైర్మన్ గారి కేబిన్ నుంచి అస్మదీయులు తస్కరించిన సమాచార మని ఆశ చెప్పిన మాట.

బ్రేకింగ్ న్యూస్ అంటే తమ ఛానెల్ ప్రయోజకత్వం వల్లనే వెలుగు చూసిన వార్తలు. వాటి ని పదే పదే ప్రసారం చేస్తూ ఊదరగొడతాయి ఛానెల్స్ . ఏ రాజకీయనాయకుడు ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడు అనో, ఏ సినిమా టాప్ హీరో కూతురు ఎవడితో లేచిపోయి ఎలా పెళ్ళి చేసుకుందో, ఏ మూల బాంబులు పేలి ఎన్ని జీవితాలు హతమారిపోయాయో అనో ఇవేగా బ్రే కింగ్ న్యూస్ లు.... ఇవాళ ఎవరికి మూడిందో....అనుకుంది ప్రవీణ.

ఏమయితేనేం... తన చిరకాలవాంఛ నెరవేరబోతోంది. పల్లవికి ఈ పూట అంత అర్జెంటు పని తగిలించిన దేవుడికి అభివాదాలు తెలుపుకుంటూ అద్దం ముందునుంచి కదిలింది ప్రవీణ.

ప్రవీణ బయల్దేరుతుండగా అన్నారు అత్తగారు. అందరం ఇంట్లోనే ఉంటాంగా.. ఆదివారం తీరిగ్గా న్యూస్ లో నిన్ను చూడొచ్చు.నువ్వు న్యూస్ చదువుతుండగా చూడాలని మా మాలక్ష్మి కి ఎప్పటినుంచో కోరిక. వాళ్ళ ఊళ్ళో మీ ఛానెల్ రాదు కదూ అని. 

ప్రవీణ గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న కోరిక తెలిసిన రవీంద్ర అభినందించాడు. పని ఎక్కువగా ఉంటే లేట్ అవచ్చని, దెబ్బలాడుకొని నాయనమ్మని, రాబోయే చుట్టాలని అవస్థ పెట్టొద్దని పిల్లల్ని హెచ్చరించి వెళ్ళింది ప్రవీణ.
* * *


ఏమిటింతకీ న్యూస్ ... తెలిసిందా.... అడిగింది ఆశని ప్రవీణ.
పూర్తిగా వివరాలు తెలీదనుకో. కాని సినిమా వాళ్ళకు సంబంధించినదనుకుంటా.
ఆశ మాటలు వినగానే ప్రవీణ మనసు గంతులు వేసింది.సినిమా వాళ్ళ న్యూస్ ఏదయినా సరే ఛానెల్స్ కి పండగే. జనానికి ఊపిరి బిగ పట్టి వినే ఆసక్తే. ఓహీరో తల్లి తండ్రులని తన్ని తగలేసాడనో,ఓహీరో మరో హీరోని చితక తన్నించాడనో న్యూస్ ఛానెల్స్ కి కొద్దిగా ఉప్పందితే చాలు... పోటీలు పడి మరీ మరీ ప్రసారం చేసేస్తారు.ప్రజలు సరే... విరగబడి చూస్తారు. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి స్వంతం... పబ్లికున నిలబడితే ఏమేనా అంటాం అన్న మహాకవి వాక్యాలు సినీ జీవులకి మరీ అన్వయిస్తాయేమో.

అందుకే సినిమాకి సంబంధించిన సంచలన వార్త లను ఏ ఛానెల్ వదులుకోదు.ఎంత రసస్ఫోరకంగా, ఉత్తేజపరిచేదిగా ఆ వార్తను ప్రసారం చెయ్యాలా అనే పనిలోనే టివి ఛానెల్స్ అన్నీ తలమునకలవుతాయి.

ఈ మధ్య విడుదలయిన జగత్ కంత్రీ,, బుజ్జిపండు, ఆటాపాటా సినిమాలకు సంబంధించిన దే ఆ న్యూస్ అని తెలిసింది ప్రవీణకి. అందులో చాలా అశ్లీలమైన దృశ్యాలున్నాయని,హీరో హీరోయిన్లతో రొమాన్స్ పేరిట చేసిన విచ్చలవిడి శృంగార సన్నివేశాలు సెన్సారు కత్తెరకు బలి కాకుండా బయటపడ్డాయని, కుటుంబసమేతంగా చూడవచ్చంటూ సర్టిఫికెట్ జారీ చేసిన బోర్డు వారిగురించి చాలా విశ్లేషణాత్మకమైన అంశాలతో వార్తా కథనాన్ని రాసాడు భరణి .
వార్త ప్రసారానికి ముందే బ్రేకింగ్ న్యూస్ అంటూ టివి తెర పై స్క్రోలింగ్ వార్త వెళ్ళింది. ముఖ్యమైన వార్త ప్రసారం కాబోతోందని, వార్తల కార్యక్రమం చూడమని ప్రేక్షకులకి పదే పదే సందేశాలు వెళ్ళాయి.

న్యూస్ చదవాల్సిన టైమ్ వచ్చింది. రికార్డింగ్ ప్రారంభమైంది.ప్రముఖ నిర్మాతలు నిర్మించిన ఆ చిత్రాలలో అసభ్యంగా ఉన్న సన్నివేశాలు, ఆడదాన్ని అంగడిబొమ్మని చేసి
ఆడిస్తున్న వాణిజ్య ప్రపంచ విధానాలని తీవ్రంగా నిరసిస్తూ రాసి ఉన్న వార్తలని ఎంతో స్పష్టంగా, భావయుక్తంగా చదివి రికార్డింగ్ ముగియగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ప్రవీణ.
డెస్క్ దగ్గర ఆ రోజు హాట్ టాపిక్ అదే. అక్కలు, అన్నలు, అమ్మా, నాన్న, పిల్లలతో నే కాదు, పెద్దగా పరిచయం లేని స్నేహితులతో కూడా కలిసి చూడలేనట్టుగా తయారయింది సినిమా వినోదం అని సుష్మ వాపోయింది.
సకుటుబంగా చూడవలసిన గొప్ప సినిమా అన్న ప్రకటనకి పడిపోయి ఉద్యోగం వచ్చిన కొత్తలో అమ్మా నాన్న తో కలిసి వెళ్ళిన శాంత సినిమా నిండా బూతుజోకులు, అక్కర్లేని బెడ్రూం దృశ్యాలు మరి చూడలేక మధ్యలోనే వచ్చేసిందిట.
హీరో హీరోయిన్ల శృంగార వీర విహారాన్ని చూడలేక చేష్టలుడిగి కూర్చుండిపోయిన అమ్మమ్మని అతి కష్టం మీద లేవదీసి తీసుకొచ్చిందిట పావని. ఒక్కొక్కళ్ళది ఒక్కో విషాదభరిత మైన అనుభవం.
ప్రవీణకి కూడా ఇలాటి అనుభవాలు పిల్లలు చిన్నగా ఉండగా ఎదురయ్యాయి. అందుకే పిల్లలు ఎదుగుతున్న వయసులో వారిమీద అనవసరమైన ప్రభావాలేం పడకూడదని ప్రయత్నిస్తుంది.శలవల్లోకూడా సినిమాలకు వద్దంటుంది.కార్టూన్, యానిమేషన్ సినిమాలంటే అందరికీ ఇష్టం కనుక అవే చూస్తారు.

అమ్మా మా ఫ్రెండ్సందరూ అన్ని సినిమాలు చూసి కథ చెప్తారే. ఎప్పుడు వినడమేనా... మేం కూడా చూడొద్దా అని తెలివిగా అడుగుతుంది పాప. ప్రవీణ సమాధానం మాత్రం నో.....
టివి చూసినా రిమోట్ పక్కన పెట్టుకొని ఛానెల్స్ మారుస్తూ చూడడమే ప్రవీణ పాలసీ. ఏమాత్రం అసభ్యంగా అనిపించినా సెన్సారు చేసేస్తుందని రవీంద్ర తనని ముద్దుగా కత్తెర అని పిలుస్తాడని కూడా తెలుసు.
కేవలం తన మొహాన్నే చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తుంటే ఇంట్లో వాళ్లు, చుట్టాలు ఎలా స్పందిస్తూ ఉంటారో అని ఊహల పల్లకిలో ఊరేగి దిగుతూ ఉండగా.... వార్తలు ప్రారంభం అయ్యాయి టివి లో.
ఒకేసారి అన్ని టివి తెరల మీద తన బొమ్మ కదులుతూ వార్తలు వినిపిస్తుంటే అందరూ ఒకేసారి బ్రేకింగ్ న్యూస్ అని గట్టిగా అరిచారు ప్రవీణని ఉత్సాహ పరుస్తూ. ముసిముసిగా నవ్వుతూనే వార్తలని శ్ర ద్ధగా వినసాగింది ప్రవీణ ఎక్కడైనా తప్పు దొర్లలేదు కదా అని.

న్యూస్ రీడర్ ముఖం పైనుంచి ఆ సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్ల ఫొటోలు, సినిమాలు చూసి వస్తున్న జనాల ప్రతిస్పందనలతో కూడిన వార్తలు వరుసగా వస్తున్నాయి. రోడ్లపైన పెద్దసైజలో తగిలించిన హోర్డింగులలో ఎలాంటి అశ్లీలమైన దృశ్యాలున్నాయో, పాదచారులకూ, వాహన చోదకులకూ అవి ప్రాణాంతకంగా ఎలా పరిణమించగలవో వివరిస్తూ, వారితోనే ఆమాటలు చెప్పిస్తున్నారు న్యూస్ రిపోర్టర్లు..మధ్య మధ్య స్టూడియోలో ప్రవీణ ముఖం చూపిస్తూ, వార్తలు సాగుతున్నాయి.

సినిమాలలో సభ్యతను మరిచిపోయి, హద్దులు చెరిపేస్తూ,క్లాసిక్స్ తీస్తారన్న పేరున్న దర్శకులు కూడా కాసుకు బానిసలవు తూ ఎలాంటి చిత్రాలు తీస్తున్నాన్నారో, ఎంత నీచానికి ఒడిగడుతున్నారో , అందుకు కారణాలను విశ్లేషిస్తూ ఆసక్తికరంగా సాగిపోతున్నాయి వార్తలు.
ఒక్కసారిగా ప్రవీణ ఉలిక్కి పడింది.
అదేమిటి.... అబ్బా... ఛీ...... అమ్మో........బాబోయ్....
తెరమీద ప్రసారం అవుతున్న ఒక్కో దృశ్యం ప్రవీణని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేస్తోంది.
సినిమాలలో అసభ్యమైన సన్నివేశాలను తొలగించడానికి సెన్సారు బోర్డు ఉందా ... లేదాఉంటే ఏం చేస్తోంది..క్లీన్ సర్టిఫికె ట్ ఇచ్చి ఉండకపోతే ఆ విషయం అందరికీ తెలిసే లా బోర్డులు తయారుచెయ్యక్కరలేదా అని విరుచుకు పడుతోంది మహిళాసమితి కన్వీనర్. అందరికీ నోటీసులు పంపించామని, తగిన చర్యలు తీసుకుంటామని, నిర్మాతలు ,థియేటర్ యజమానులు ఎంత గొప్పవారైనా వదిలేది లేదని హామీలు గుప్పిస్తున్నారు ఎస్పీలు, డీ ఎస్పీలు.
కాని ప్రవీణ అవన్నీ గమనించే స్థితిలో లేదు.
తెరమీద క్షణక్షణానికి మారిపోతున్న సన్నివేశాలన్నీ ఆమె మస్తిష్కంలో అలజడి రేపుతున్నాయి. తెరమీదకి అనుమతించకూడనివి, సెన్సారు కత్తెరకి బలిఅయినవి, హీరో హీరోయిన్ల పై చిత్రించిన ఉద్రేకపూరితమైన దృశ్యాలు, ఐటమ్ సాంగ్ అనే కొత్త ప్రక్రియతో ఒంటిమీద రుమాలు సైజుకు మించని బట్టతో డాన్సు పేరిట గెంతులేస్తున్న నటీమణుల అర్థ నగ్న దేహ ప్రదర్శనలు ఒక్కొక్కటిగా తెర మీద ఆవిష్కరింపబడుతున్నాయి. 

ఆడదాన్ని ఆటబొమ్మని చేసి ఆడిస్తున్న నేటి వ్యాపారమయ సమాజపు పోకళ్ళను నిరసిస్తూ వార్తా కధనాలు వెనక నుంచి వినిపిస్తున్నాయి. ఆ వార్తలు తమ గురించి కావేమోనన్నట్టుగా నవ్వుతూ, కవ్విస్తూ తమ అందాలను స్వేచ్ఛగా సంతోషంగా ప్రదర్శిస్తున్నారు ఆ భామలందరూ... పనిలో పనిగా అని దేశీయ చిత్రరంగం ఎంతగా చెడిపోయిందో చూపిస్తున్న దృశ్యాలతో పాటు ఏవో విదేశీ సినిమాలనుంచి సంపాదించిన క్లిప్పింగ్స్ కూడా వేయడం కనిపిస్తోంది.

ప్రవీణ బుర్ర పనిచేయడం మానేసింది. కళ్ళు మాత్రం రెప్ప అర్పకుండా ఎదుటి దృశ్యాలని చూపిస్తున్నాయి.
మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం... అనాగరిక వ్యవస్థనుంచి నాగరికత నేర్చుకొని ఉన్నతమైన విలువలను సామాజిక జీవన వ్యవస్థలో నెలకొల్పుకున్నాం... భారత దేశంలో ఏ చెట్టునడిగినా పుట్టనడిగినా మన సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుస్తుందే. 

యుగయుగాలుగా తరతరాలుగా భారత జీవనస్రవంతిలో అతి పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్న విలువలన్నీ డబ్బుకు అమ్ముడు పోవలసిందేనా...డబ్బు తప్ప ఈ ప్రపంచానికి కావలసినదేం లేదా...సభ్యత సంస్కారం పదాలకు అర్థాలు మారిపోయినట్టేనా....కొత్తతరానికి ఈ తరం నేర్పగలిగేదేమిటి..... పడిపోతున్నామని కూడా స్పృహ లేకుండా పాతాళానికి జారిపోతోందే...ఏ కొత్తవిలువలకీ ప్రస్థానం... ఏం సాధించడానికి...

చూపు బుల్లి తెరనే చూస్తున్నా తలలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ చూసిన శృగారమయ సన్నివేశాలనే వేర్వేరు వ్యాఖ్యానాలతో చూపుతూ వస్తున్నాయి దేశీ,విదేశి చిత్రభేదాలు లేకుండా. వాటినే చూపిస్తున్నయి కళ్ళు.

మరి చూడలేక పోయింది ప్రవీణ. నిర్దాక్షిణ్యంగా సెన్సారు కత్తెరకి బలి కావలసిన ఫ్రేములన్నీ చకచకమని మన ఇంట్లోకి , మన డ్రాయింగ్ రూములోకి, కుంటుంబ సహితంగా కూర్చొని ఆసక్తి గా, పనులన్నీ మానుకొని మరీ చూసే వార్తల్లోకి....... వచ్చేస్తున్నాయి.

అక్కడ ఇంట్లో పిల్లలు, ఇంటికొచ్చిన అతిథులు అందరూ తను కనిపిస్తుందని తప్పనిసరిగా కూచొని చూసే వార్తలు.....అందరూ ఇవన్నీ చూస్తున్నారా... అమ్మో..... నా పిల్లలు... నా పిల్లలు ఏవి చూడకూడదని తాపత్రయ పడతానో, ఆంక్షలు పెడతానో అవన్నీ చూస్తూ ఉన్నారా....వాళ్ళని సినిమాలు చూడనివ్వకుండా వార్తలు తెలుసుకోండిరా అని ఎప్పుడూ వార్తలే పెట్టేది కదా...ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చూశారా... వాళ్ళ వయసుకి, వాళ్ళకి అక్కర్లేని విషయాలన్నీ తన మొహం మీదుగా, తన మాటలమీదుగా వాళ్ళమనసులోకి ఇంకిపోతున్నాయా.......

ఎక్కడో గంట మ్రోగుతోంది.....టంగ్...టంగ్...... గంటలు ..ఒకటి ...రెండు...వందలు ....వేలు.... టంగ్...టంగ్....అంతకంతకూ శబ్దం భరించలేకపోతోంది ప్రవీణ..........

ట్రింగ్....ట్రింగ్... హాల్లో ఫోన్ మోగుతోంది. కరెంటు పోయిందని చిరాగ్గా పడుకొని ఉన్న రవీంద్ర ఫోన్ ఎత్తాడు.
రవీంద్ర గారూ....కొంచెం త్వరగా వస్తారా ....... ప్రవీణగారు కళ్ళు తిరిగి పడిపోయారు. ............రిసీవర్ మీద అతని చెయ్యి బిగుసుకుంది

03 January 2009

నాగావళి నవ్వింది

నాగావళి నవ్వింది. ఇది నేను చిన్నప్పుడు విన్నమాట. ఒక కధో,నవలో మరి.కాని సాహిత్యానికి సంబంధించినదే. కథలో పాత్రపేరు నాగావళి ఏమోమరి, నాకు తెలీదు.


ఆవయసులో చాలా ఆశ్చర్యంగా అనిపించిన పదం. ఎందువల్లనంటే...నేను పుట్టినదగ్గర్నుంచి దాదాపుగా పదకొండు సంవత్సరాల వయసు వరకు పెరిగినది నాగావళి నది ఒడ్డున. నాగావళి అంటే (ఏరు అనేవాళ్ళం) నదిగా మాత్రమే తెలిసిన రోజులవి.శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో నాగావళి ఒడ్డున కోటీశ్వరాలయం ఉన్న గుడివీధిలో కోవెల పక్కనే ఇల్లు,ఎదురుగా నది.ఆఇల్లు మాతాతగారికి స్వంతంకాదు. అద్దెఇల్లే.కాని మా అమ్మ చాలా చిన్నగా ఉన్నప్పుడు 1950 ప్రాంతాలలో ఆ ఇంట్లో కి అద్దెకి వచ్చి సుమారు 1987 వరకు అక్కడే ఉన్నారు.అమ్మ,నేను,నా తర్వాత 1984 వరకు అందరం ఆ ఇంట్లోనే పుట్టాం. అందువల్ల మా తాతగారి సంతానం ఎనిమిది మంది వాళ్ళ పిల్లలం పదహారుమందికీ ఆఊరు,ఆ ఇల్లు,ఆ నది వీటితో మానసికమైన బంధం పెనవేసుకుపోయింది.


అమ్మమ్మ తాతగారు ఇప్పుడు లేకపోయినా ఏ పెళ్ళిళ్ళో పేరంటాలో జరిగి విశాఖపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరం మూడుగంటలు ప్రయాణం చేసి శ్రీకాకుళానికి వెళ్ళవలసిందే. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు....అని పాడుకోవలసిందే. శ్రీకాకుళంలో మేము ఉండివచ్చిన ఇల్లు చూసి రావలసిందే.అక్కడ ఇంటి ఓనరుగారు-పేరు ఏదో ఉంది. మా పెద్దవాళ్ళకు తెలుసనుకోండి. ఆయనకి మా అమ్మవాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరే మాకు తెలుసు. ఆయన పేరు సరేగారు. ఆహా..అలాగా...సర్రే అయితేను...అంటూ ఉండేవారు. ఆయన ఊతపదమే ఆయన పేరయిపోయింది పిల్లలందరికీ. మీ అమ్మమ్మని పిలువు అని ఆయన లోపలికి పంపిస్తే అమ్మమ్మా సరేగాడు పిలుస్తున్నారు అని చెప్పి తుర్రుమనేవాళ్ళం, మా అమ్మమ్మ కంగారును గమనించకుండా. మేము ఎప్పుడో ఆయనకి ఆ పేరు చెప్పేస్తామేమోనని మా మామయ్యలు భయపడి మమ్మల్ని బెదిరిస్తూ ఉండేవారు కూడా.


ఆ సరేగారు అక్కడే ఉన్నారు(ఇంకా). వాళ్లు ఉన్న భాగాన్ని బాగా బాగుచేసి మార్పులు చేసుకున్నారుట చిన్న గుమ్మం తీసి పెద్ద గేటు పెట్టుకున్నారుట. మా వైపు ఉన్న భాగం మాత్రం ఏ మార్పూ లేదని అలాగే ఉందని చూసివచ్చిన అందరూ చెప్తూ ఉండేవారు.


ఇప్పుడు తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది పిల్లలు,వాళ్ళ పిల్లలు(మనవలు),బంధువులు, పెళ్ళిళ్లు అన్నీ ఆ ఇంట్లో ఎలా జరిగాయా అని. ముందు గుమ్మం దాటాక ఒక పొడూగు వరండా ఏ షేడ్ లేకుండా ....అది దాటితే కప్పువేసిన వరండా దానిని ఆనుకుని చిన్న బెడ్ రూమ్,వరండా దాటాక మళ్లీ వరండా ఒక వంటిల్లు.అంతే ఇల్లు. సగం ఇల్లు ఎండా వానలకి ఎండుతూ తడుస్తూ ఉండేది.వానాకాలంలో చూరు కారేది.బకెట్లు,గిన్నెలు,డేగిసాలు పెట్టేవాళ్ళం కారుతున్న చోట. వంటిల్లు కొంచెం పెద్దదే. అదే అందరికీ లివింగ్ రూమ్. అక్కడ పెద్ద గొలుసుల ఉయ్యాల. అందరూ కిందనో ఉయ్యాల మీదో సర్దుకునేవారు. అక్కడే కాఫీలు,టిఫిన్లు,భోజనాలు. వంటిల్లు దాటాక దూరంగా పెరట్లో ఎక్కడో లెట్రిన్. స్నానాలన్నీ ఔట్ డోరే. ఆడవాళ్లు స్నానం చెయ్యాలంటే ముందు గుమ్మంతలుపు, వరండా తలుపు వేసి వీలయినంతవరకు అంతా ఒక్కసారే కానిచ్చేసేవారు. మేం చిన్నవాళ్ళం కనుక మాకు ఏ బాధ లేదు. ఏట్లో(నాగావళి నదిలో) నీళ్ళెక్కువ లేవంటే చిన్న సబ్బుముక్క,చెంబు పట్టుకెళ్ళి అక్కడే స్నానం కానిచ్చేయడం. చల్దన్నం తినేసి స్కూల్ కెళ్ళిపోడం.


ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తుంది -ఇంతమంది ఆడవాళ్లు పురుళ్లు జరిగనప్పుడు,మిగతా సందర్భాలలో ఎంత ఇబ్బంది పడి ఉంటారోనని.స్నానం చెయ్యడానికి బాత్ రూమ్,సెప్టిక్ లెట్రిన్స్ లాంటి కనీస సదుపాయాలు లగ్జరీ గా తోచేవి కాబోలు. అవి అవసరం అన్న స్పృహ కూడా ఉందో లేదో అన్నట్టు గడిపేసేవారు. 1980 లతర్వాత ఊరిలో కొత్త కాలనీలు ఏర్పడ్డాక పాత ఇళ్ళలో కూడా చాలామంది మార్పులు చేసుకున్నారు. మా తాతగారి (సరేగారి) ఇంట్లో తప్ప. మా ఆఖరి మామయ్య పెళ్లి 1986 లో ఆ ఇంట్లో ఉండగానే జరిగింది.నాకు తెలిసి అదే అక్కడ జరిగిన ఆఖరి పెళ్ళి. ఆ తర్వాత మా పెద్దమామయ్య ఆ ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసాడు. మా ఉయ్యాల గొలుసులు మాత్రం తనతో తీసుకు వచ్చాడు. బల్ల అప్పటికే పగుల్తూ ఉందని వదిలేసాడు.మొత్తం మీద 1986 వరకు కూడా 50లలో మేం చూసిన రూపానికి అంగుళం మేర కూడా మార్పు లేని ఇల్లు అది.


నేను మా చెల్లి చిన్నప్పుడు ఆడుకున్న లక్క బొమ్మలు,సుమారు ఒకటిన్నర అడుగు ఎత్తులో ఉండేవి.నాది ఆడ బొమ్మ,చెల్లిది మగ బొమ్మ.ఒక్కోటీ రెండుకేజీల బరువుంటాయేమో. మా అమ్మ మగబొమ్మకి పాంటు,షర్టు,నా బొమ్మకి పరికిణీ,జాకెట్టు పర్మనెంటుగా కుట్టేసింది.వాటిని ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాళ్లం -కాళ్లమీద పడితే పచ్చడయిపోతాయర్రా అన్న పెద్దవాళ్ళదీవెనల మధ్య .తథాస్తు దేవతలు కూడా దీవించేవారు.ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా(బొమ్మలతో) వాటిని వదిలేవాళ్ళం కాదు. కానీ హైదరాబాదు వచ్చేసి ఎన్నిసార్లు మళ్లీ వెళ్ళాం..ఆ ఊరికి... మా బొమ్మలు అక్కడే ఉన్నాయి కదా. తెచ్చేసుకోవచ్చని తోచనేలేదు. ఆ ఇల్లు వదిలిపెడతానని మా మామయ్యే అనుకోలేదనుకుంటా.... మా ఉయ్యాల మంచం, మా పందిరిమంచం, వాటితోనే మా బొమ్మలు అనుకున్నాం. అన్నింటినీ వదిలేయాల్సి వస్తుందనుకోలేదు. ఆ బరువైన మా లక్కబొమ్మలు ఎవరికో ఇచ్చేసి వచ్చిందిట మా అత్త.


1986 లో ఆఖరిసారి ఆ ఇంట్లో ఉండడం,1992లో శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒకే ఒక సాయంకాలం చీకటిపడుతూ ఉండగా కోవెలకి మాత్రం వెళ్ళి మా శివుడిని,పార్వతిని నంది ని చూసి నాగావళి ఒడ్డుకి వెళ్ళాను. కొత్త కెమేరాతో నది ఒడ్డున నిల్చొని దూరంగా నది మలుపు తిరిగే వంపు కనిపించేలా ఓ ఫోటో తీసుకున్నాను.


మళ్ళీ ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు మా ఊరు వెళ్ళగలిగేను డిసెంబరు నెలాఖర్లో..ఊళ్ళో చాలా మార్పులు వచ్చేయి సహజంగానే.కానీ మరీ కొట్టొచ్చేంత కాదు. ఊరి చివర కొత్తగా కట్టిన కాలనీలు,షాపులు వాటిలో ఆధునికత కనిపించింది కానీ ఊరిమధ్య మా ఏడురోడ్ల జంక్షను, పాత బ్రిడ్జి అన్నీ పెద్ద మార్పు లేకుండానే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం మాత్రం బాగా కనిపిస్తున్నారు.పాత ఇళ్ళు,విరిగితే మళ్ళీ కట్టినట్టుగా ఉన్న గోడలు,ఇళ్ళముందు కంపు కాలువలు,ఇరుకు వీధులు అన్నీ అలాగే ఉన్నాయి.


ఎప్పటిలాగే గుడివీధిలోకి కారు వెళ్ళలేదు కనుక రావిచెట్టు కింద ఏటి గట్టు దగ్గర కారు పార్క్ చేసుకున్నాం. మాచిన్నప్పటి- కాదు... మా అమ్మమ్మ చిన్నప్పటి రావిచెట్టు అలాగే ఉంది పచ్చగా..చల్లటి గాలి విసిరి నన్ను పలుకరించింది. రావిచెట్టు బోదె మొదట్లో నాగదేవత పసుపు కుంకుమలు ఒంటినిండా పులుముకొని భక్తులు పోసిన పాలు,దీపాలు పెట్టి ఒలకపోసిన నూనెలతో జిడ్డుజిడ్డుగా అదో మాదిరి వాసన ల మధ్య కొలువుతీరి ఉంది.అక్కడనుంచి రెండు మెట్లు ఎక్కి పక్కకి తిరిగితే మా కోటీశ్వరుడి కోవెల. పదిమెట్లు కిందకి దిగి కోవెల లోపలికి వెళ్ళాలి.ఇదివరకు చుట్టు ఆవరణ చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని తగ్గించి కోవెలలోపల ఎక్కవమంది ఉండడానికి వీలుగా చేసి కోవెలభాగాన్ని విశాలంగా చేసారు. నంది చాలా పెద్ద నంది. లేపాక్షినంది బొమ్మలో ఉన్నట్టుగా మా నంది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ మేము నాలుగు స్తంభాలాట ఆడుకున్న మంటపం-అక్కడే పర్వదినాల్లో హరికథాకాలక్షేపాలు జరుగుతూ ఉండేవి, దాన్ని అక్కడనుంచి తీసి వేరేచోట కట్టారు. ఖాళీ ఆవరణకి ఎదురుగా ఉన్న మంటపాన్నికూల్చేసి మళ్ళీ ఏఉద్దేశంతో ఆ మూల కట్టారో నాకైతే అర్థం కాలేదు.


లోనికి ప్రవేశించగానే పెద్దగంట ఉందో లేదోనని వెతుక్కున్నాను. అది చాలా పెద్దసైజులో ఉండే పెద్ద గంట. అంతే కాక చాలా ఎత్తుకూడా. 6 అడుగులు ఉన్నవాళ్ళే దాన్ని నిలబడి కొట్టగలరు. లేదంటే పాదాలు పైకి లేపి ఎగిరి కొట్టవలసిందే. చిన్నప్పుడు పదేళ్ళొచ్చేదాకా పరిగెత్తివచ్చి పెద్దగంట కొట్టడాన్ని ప్రాక్టీసు చేసేదాన్ని. ఎప్పుడేనా అందక పోదా అని. ఇప్పుడు ఎంత మొహమాటం వదిలి ఎగిరినా అందలేదు. ఎలాగో ఒక్కసారి మాత్రం కొట్టగలిగాను.


కానీ మాశివుడు -మాశివుడు కాదు. మిగిలిన విషయాల్లో పెద్ద మార్పు లేదనుకున్నాను కానీ మా మూల విరాట్రూపం మాత్రం మారిపోయింది. నేలబారుగా ఉండే మా శివుడి పానవట్టం మూడడుగుల ఎత్తు పెంచుకొని, మరో పెద్ద లింగరూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ పాత లింగం అరిగిపోతోందని,కాశీనుంచి తెప్పించిన ఇంకోలింగాన్ని కవర్ లాగా పెట్టేమని ఏదో చెప్పారు. మా తరాలు మారినట్టే మా కోవెల అర్చకులలో మూడవతరం వచ్చింది-హరిబాబుగారి మనవడు ఆరోజు మాకు పూజ చేయించారు


చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు హైదరాబాద్ లో ఉంటే మేం అమ్మమ్మ దగ్గర ఉండేవాళ్ళం. సగంరోజు స్కూలు,సగంరోజు కోవెల లో స్నేహితులతో గడిపేసే వాతావరణం హైదరాబాదులో ఉండేది కాదు.ముఖ్యంగా ఒడ్డున ఎక్కువ లోతులేకుండా స్నానాలకి వీలుగా ఉండేది. ఎప్పుడంటే అప్పుడు నీళ్ళలో దిగినా ఆప్యాయంగా పిలిచి చల్లగా తడిపే మా నాగావళిని వదలడం ఇష్టంలేక అమ్మమ్మ దగ్గరే ఉండిపోయేవాళ్ళం. కోవెల్లో ఆడుకోవడం ఆకలేస్తే గర్భగుడిలోకి వెళ్లి ఓసారి లెంపలేసుకుని దండం పెట్టి మా హరిబాబుగారి ముందు చెయ్యిచాపితే ఆయన ఒకటో,రెండో అరటిపళ్లు,ఓ కొబ్బరి చిప్ప చేతిలో పెట్టేవారు.కొబ్బరిచిప్ప కొట్టుకుని(భాగం సరిగా ఇవ్వకపోతే కొట్టుకొని)తినేసి మళ్ళీ ఆటలు. మూలగా ,పక్కగా ఉన్న గదిలాంటి చిన్నగుడిలో శివలింగం,నిద్ర గన్నేరు చెట్టు ఉండేవి. ఆ గుళ్ళో మా అభిషేకాలు ఉత్తుత్తిమంత్రాలతో పూజలు అందుకునేవాడు మా శివుడు.


కోవెలలో దర్శనం అవగానే గబగబా బయటకి వెళ్లి మా కూర్మావతారం కోసం వెతుక్కున్నాను.కూర్మావతారం అంటే తాబేలు. మా కోవెల్లో ఏడెనిమిది దాక తాబేళ్ళుండేవి. అందులో చాలా పెద్ద తాబేలు ఉండేది.అది నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి 1992 లో నేను వెళ్ళినప్పుడు కూడా ఉంది. అరటిపళ్ళు చిన్న ముక్కలు చేసి వాటికీ వాటా ఇచ్చేవాళ్ళం.చిప్పలోంచి మెల్లగా తల బయటికి పెట్టి పండుని గబుక్కున లాక్కునేవి. ఒక్కోసారి వేళ్ళు కరిచేవి కూడా. ఆమధ్య తాబేళ్లను ఏటొడ్డు పార్కులో ఉంచితే సరిగా చూడక చనిపోయాయని, పెద్ద తాబేలు కూడా అప్పుడే పోయిఉంటుందని చెప్పింది ఓ పదేళ్ళ పిల్ల. మనసంతా ఓదిగులు ఆవరించుకుంది. ఇంకా పదిహేను వరకు తాబేళ్ళను ఇప్పుడు కోవెల ఆవరణలోనే ఉంచి పెంచుతున్నారు. వాటికి అరటిపళ్ళు పెట్టాం.మా చిన్నప్పటిలాగే డిప్ప లోంచి తల బయటికి పెట్టి పండుముక్కని ముందుకి లాక్కున్ని తిన్నాయవి.


కోవెల ఎదురుగా ఉన్న ఇంటి అరుగుమీద అచ్చమ్మ అరటిపళ్ళు కొబ్బరికాయలు,పూజాసామగ్రి, చిరుతిళ్ళు అమ్ముతూ ఉండేది.మా శ్రీకాకుళంజిల్లాకి ప్రత్యేకమైన పక్కకి వేసిన ముడి,పేద్ద ఎర్రటి బొట్టు,జాకెట్టులేని చీరకట్టు లతో అచ్చమ్మ, అచ్చంగా అందాలరాముడులో సూర్యకాంతంలాగా మమ్మల్ని కసురుతూ అరువులు పెట్టేది.ఆకలేస్తే అరటిపళ్లు,బిళ్లలు కొనుక్కునేవాళ్లం తనదగ్గర.ఇప్పుడాఇల్లు ఉంది కానీ గుమ్మం,అరుగు స్థానంలో పెద్ద గోడ ఉంది. గోడనానుకొని చిన్న దుకాణం వెలిసింది. అందులో ఉన్న కుర్రాడు కొబ్బరి కాయలు అమ్ముతున్నాడు. వాడు చిన్నప్పుడు మా ఇంట్లో చాలా కాలంపనిచేసి, మా అందరికి చంటిపిల్లలగా ఉన్నప్పుడు కాపు,నలుగులు పెట్టి నీళ్ళు పోసిన కనకమ్మ మనవడుట.ఇక్కడా మరో రెండు తరాలు మారాయి.


మా ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాను. ఇంటికి రిపేర్లు చేస్తున్నారు.తలుపులు తీసి ఉన్నాయి. ఆ పొడుగాటి వరండా ,ఆ చివార్న వంటింటి కిటికీవరకు ఓసారి కళ్ళనిండుగా చూసుకొని,కన్నీటి తెర అడ్డుపడుతూ ఉండగా మసకేసిపోయి అక్కడినుంచి కదిలి వచ్చేసాను. మా పిల్లలిద్దరూ గుమ్మానికి చెరో వేపు కూర్చొని ఓ ఫొటో తీసుకున్నారు.ఆ ఇంటి స్వరూపంలో మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.


మళ్ళీ రెండు మెట్లు దిగి రావిచెట్టు దగ్గర్నుంచి నది ఒడ్డుకు వచ్చాను. ఎదురుగా ఏనాడో పంతొమ్మిదో శతాబ్దంలో కట్టిన పాత బ్రిడ్జి కనిపిస్తూ ఉంది. బలహీనంగా ఉందని వాహనాల రాకపోకలు నిషేధించారుట. మంచి వరదల్లో ప్రవాహం బాగా ఉన్నప్పుడు కూడా మా ఇద్దరు మామయ్య లు తన స్నేహితులతో కలిసి బ్రిడ్జి మధ్యన నుంచొని నదిలోకి దూకేవాళ్ళు. ఈత కొట్టేవాళ్ళు....అదిగోనే మీ కోటి,బాబ్జీ అమ్మో అని మా ఫ్రెండ్సందరూ గట్టిగా అరిచేవాళ్ళు. మామయ్యలు చేస్తున్న సాహసాలకి నాకు మా చెల్లికి గర్వంగా ఉన్నా, ఇంట్లో చెప్తే చంపుతానన్న వార్నింగ్ వల్ల,ఏమేనా జరిగితే మా అమ్మమ్మ రియాక్షన్ ఎలాఉంటుందో తెలిసిన జ్ఞానంవల్ల ఏమీ చేయలేక బిక్కచచ్చి ఉండిపోయేవాళ్ళం. మామయ్య తిరిగి మా వైపు ఈదుతూ వచ్చేవరకు.



వర్షాకాలంలో ఒక్కోరోజు పొద్దున్నే లేపేవారు, ఏరొచ్చిందర్రా అని.కళ్లు నులుముకుంటూ పరిగెత్తేవాళ్ళం. ఎర్రటి నీళ్లు సుడులు తిరుగుతూ వడివడిగా పోతుండేవి.పెద్ద పెద్ద ముళ్ల చెట్లు, గుడిసె కప్పులు కూడా కొట్టుకుపోతూ ఉండేవి. అందులో మనుషులుండే వారేమో కూడా.ఆ నీళ్ళన్నీ రెండ్రోజులకల్లా ఎక్కడికి పోయేవో అర్థమయ్యేవి కాదు అప్పుడు. వేసవిలో అయితే ఎక్కడో తప్ప పెద్దలోతు లేకుండా సన్న పాయలుగా పారేది.సాధారణంగా బ్రిడ్జి ఉపయోగించకుండా ప్రవాహం ఉన్న చోట బట్టలు కొంచెం పైకెత్తి ఇసుకలో నడిచిపోతూ ఉండేవాళ్ళం ఏటొడ్డున ఉన్న మా చిన్నమ్మమ్మ ఇంటికి.వేసవిలో నీటి ఎద్దడి బాగా ఉండేది. మా పనిమనిషి ఏటినుంచి నీళ్లు మోసేది. మడి నీళ్లు మాత్రం మా అమ్మమ్మ తెచ్చుకోనేది. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మకి ముఫ్పై ఏళ్ళు.మేం నదిమధ్యలో ఇసుకని తవ్వి చెలమలు తీసేవాళ్ళం. ఒక్కోసారి ఉన్నట్టుండి స్వచ్ఛమైన ఆ నీళ్ళలో చిన్న చేపలు లుక లుకమని తిరిగేవి. కెవ్వున కేకలేసి ఇసుకని కప్పేసే వాళ్ళం.మా మామయ్యలు తోటి కుర్రాళ్లు తువ్వాళ్లు, చొక్కాలు వేసి చేపలు పట్టేవాళ్లు.మళ్లీ వదిలేసే వాళ్ళు.


పన్నెండో పదిహేనో మెట్లు ఉంటాయి నదిలోకి దిగడానికి. ఏనాటివో ఆ మెట్లు....అలాగే ఉన్నాయి ఎగుడు దిగుడుగా,అరిగి పోతూ. మధ్యలో ఓ వెడల్పు మెట్టు. దాన్ని పెద్ద మెట్టు అనేవాళ్ళం. నదిలో ప్రవాహం ఎక్కువ ఉంటే ఆ మెట్టు,పైన మరో రెండు మెట్లు మునిగిపోయేవి.


ఇప్పుడు పైమెట్టుమీద నిలబడి చూస్తే అలా నది వంపుతిరిగి వెళ్ళిపోతున్న సుందర దృశ్యం కనిపించలేదు. అడ్డుగా పెద్ద గోడ,లోపలికి చిన్న గది,మరోపక్క కూడా గోడ కట్టేసి మూసేసారు. నదిలో ప్రవాహం అంతంత మాత్రంగా ఉండగా ఒడ్డున పూడిక నిండిపోయి ముక్కుపుటాలు బద్దలయ్యే దుర్గంధం....చిన్ననాటి మమకారం,నదిలోకి దిగమని ముందుకు తోస్తూ ఉంటే,శుచిశుభ్రత నేర్పిన నాగరికత వెనక్కిలాగింది. అంత మురికిగా నల్లగా ఉన్న నీళ్ళలో చేతులు కాదు కదా కాళ్ళు కూడా పెట్టడానికి మనసు తనువు అంగీకరించలేదు. ఈ నీళ్ళలోనేనా అమ్మా... మీరు స్నానం చేసేవారు అని అనుమానంగా పాప అడిగిన ప్రశ్నకి అప్పుడు ఇలా ఉండేది కాదు అని చెప్పినా నమ్మదనిపించి ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాను.


నా చిన్ననాటి జీవతపు స్వప్నం చేదు గురుతుగా మారింది.జ్ఞాపకాల బరువుతో భారంగా కదులుతున్న నన్ను చూసి ఉపవాసాలతో చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తూఉన్నా మమ్మల్ని చూసినప్పుడల్లా ఆత్మీయంగా తన చేతుల్తో చుట్టేస్తూ ఆనందంగా నవ్వుతూ మా వైపు చూసే మా అమ్మమ్మని తలపిస్తూ మా నాగావళి నవ్వింది.

02 January 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెలుగుబ్లాగుల ప్రపంచంలోకి ఆర్నెల్లక్రితమే అడుగుపెట్టినా ఎక్కువగా రాయలేకపోయాను. రాసిన నాలుగు టపాలకి మీనుంచి మంచి స్పందననే పొందగలిగేను. తెలుగులో రాద్దామనుకోవాలే కాని బ్లాగును ప్రారంభించడం దగ్గర్నుంచి సాంకేతికపరమైన ఇబ్బందులను అధిగమించి బ్లాగులు రాయడం వరకు అడుగడుగునా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్న మిత్రులెందరో ఉన్నారు. వారంతా తమ విలువైన కాలాన్ని వెచ్చించి మాలాంటి వారికి ముఖ్యంగా తెలుగు భాషకి ఎంతో దోహదం చేస్తున్నారు. మీ కంప్యూటర్ కి తెలుగు నేర్పండి పుస్తకాన్ని చూసినప్పుడు ఎంతో ఉత్సాహం కలిగింది. కంప్యూటర్ లో తెలుగు సాఫ్ట్ వేర్ తో ఇన్స్కిప్ట్ కీబోర్డు వాడుతూ టైప్ చేయడం అలవాటయి ఉన్నా ఇంటర్నెట్ లో దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నానే అని బాధపడ్డాను. మొత్తంమీద యూనికోడ్ ని వాడుకోవడం నేర్చుకోగలిగాను. ఒకరోజు జ్యోతివలబోజు గారి వ్యాసం ఈనాడు ఆదివారంలో చదివాను.ఆవిడ గౌతమ్ గారి రెండురెళ్ళు ఆరు,క్రాంతి అప్పుడేమయిందంటే మొదలయిన బ్లాగుల గురించి వ్రాసినది చదివి నెట్ లో వెతికి చదివాను. హాస్యరచనలంటే ఎంతో ఇష్టపడే నేను మరి ఆగలేక మళ్లీ బ్లాగు ప్రారంభించడానికి సిద్ధపడ్డాను. హాస్యం చదవడానికే గాని రాయడానికి పనికిరానని తెలిసినా.

ప్రమదావనం బ్లాగు ప్రారంభించాను.మనలో మాట నా మనసులోని మాట సుజాతగారి బ్లాగు అప్పటికే ప్రసిద్ధంగా ఉందని తెలియక నేను మనలో మాట అని రాసుకున్నాను. తర్వాత తెలిసింది. ఇంకో పొరపాటు ఏమిటంటే వేరేపేరుతో లాగిన్ అయిఉన్న కంప్యూటర్ లో నేను బ్లాగుని రిజిస్టర్ చేసుకున్నాను. అందువల్ల మూడ్ వచ్చి రాద్దామనుకున్నా లాగిన్ అవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఎక్కువ రాయలేకపోయాను.సాంకేతికపరంగా నాకెదురైన ఇబ్బంది ఇది. అప్పటికే నాలుగుటపాలు రాసిఉండడం వల్ల వాటిని వదులుకోలేక,కొత్తవి రాయలేక అలా ఉండిపోయాను.

సరే....నేను రాసిన నాలుగు టపాలకీ వ్యాఖ్యలు రాసి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరకంగా అయినా కొత్తసంవత్సరంలో మళ్లీ మిమ్మల్ని పలుకరించినట్టవుతుందనే ఉద్దేశంతో ఈ టపా.
(ఇలా అయితే మళ్ళీ నా బ్లాగుని చూస్తారుకదా అనే నా దురుద్దేశం మీ అందరికీ తెలుసనుకోండి)