05 August 2010

పేకాటోపదేశం

ఇండోర్ గేమ్స్ గా ఆడుకునే ఆటల్లో పేకాటదే అగ్రతాంబూలం అని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ పేకాట కి  పెళ్ళిళ్ళు, పిక్నిక్కులలో మంచి డిమాండ్ ఉంది. చతుర్ముఖ పారాయణం అని కొంచెం సంస్కృతంలో పిలుచుకున్నా చీట్లపేక అని చులకనగా చూసినా పేకాట కి ఉండే ప్రత్యేకత దానిదే.

అలనాడు కన్యాశుల్కంలో కూడా  గురజాడ అప్పారావు పేకాట సన్నివేశాన్ని మహా రసవత్తరంగా నిర్వహించారు. ఇప్పుడు పేకాటని బహిరంగప్రదేశాలలో నిషేదించాక ఎలా ఉందో కాని మా చిన్నప్పుడు ప్రతి పెళ్ళిలోను, వనభోజనాలప్పుడు, రైలు ప్రయాణాలలో  పదిమంది కలిసే సందర్భాలన్నిటిలోను దుప్పటి పరిచి పేకముక్కలు పంచుకునేవారు. హరిహరాదులు వచ్చి పిలిచినా పలకలేనంత మహా బిజీగా ఆడుకునేవారు. పెళ్ళిళ్ళలో మగ పెళ్ళివారికి విడిదిలో పేకాటకి ఏర్పాట్లు చేయడం, పేకాట బృందాలకి కాఫీలు, చిరుతిళ్ళు సప్లై చేయడం ఆడపెళ్లివారు జరపవలసిన ముఖ్యమయిన మర్యాదలలో  ఒకటేమో అనుకుంటాను. 

పేకాటలో బోల్డు రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట, రమ్మీ.   మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్లో  ముక్కలు పడడం  బట్టి గెలవడం ఉంటుంది. మూడుముక్కలాట కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట.  పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ముఖ్యమయినది. పదమూడు ముక్కలాటలో  సీక్వెన్స్, ట్రిప్లెట్, నాచురల్, జోకర్ వంటివి పారిభాషిక పదాలు.   రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు ఆడగాడి నైపుణ్యం, సమయానుకూలంగా స్పందించడం కూడా ముఖ్యమైన అంశాలే. ఇవన్నీ ఇప్పుడెందుకూ అంటే......

ఈ మధ్య పాత కాగితాలు సర్దుతూ ఉంటే మా నాన్నగారు ఎప్పుడో రాసిపెట్టుకున్న కాగితం దొరికింది.46 సంవత్సరాల క్రితం,  1964, అక్టోబరు 28నాటి నాటి ఆంధ్రప్రభ లో ప్రచురించబడిన ఓ కవితని చేత్తో రాసుకున్న కాగితం. కవిత పేరు మిడిల్ డ్రాప్. కవి పేరు వి. నారాయణరావు అని ఉంది.

పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ఆటని జీవితానికి అన్వయిస్తూ కొంచెం సరదాగాను, కొద్దిగా హెచ్చరికగాను, ఇంకొంచెం వైరాగ్యంతోను  చెప్పిన ఈ కవిత నాకు బాగా నచ్చింది.    కవిత రాసినవారు వి.నారాయణరావు - అంటే వెల్చేరు నారాయణరావుగారే అని గుర్తు అన్నారు మా నాన్నగారు. వెల్చేరునారాయణరావుగారు భాషా శాస్త్రవేత్తగా చాలా మందికి తెలుసు. ఆ కవితని ఇక్కడ ప్రచురిస్తున్నాను...ఆయన ఎక్కడ ఉన్నా కృతజ్ఞతాభినందనలతో.......


                       మిడిల్ డ్రాప్   

కావలసిన ముక్కొకటి తగలక పోతుందా అనుకున్నావు
కాంతా నయనాల కాంతులు చూసి భ్రమపడ్డావు
పన్నెండు ముక్కలు పండబెట్టుకోకుండా
కౌంట్ ఆర్ షో లో పెట్టుకున్నావు జీవితాన్ని
ఎప్పుడూ ఆశ పొడుగ్గానే ఉంటుంది
వచ్చేది జోకరనుకొని వెళ్ళు పేకలోకి
ట్రిప్లెట్లెప్పుడూ ఉండనే ఉన్నాయి
నాన్నా అమ్మా తమ్ముడూ లా సీక్వెన్సొకటి ఉంది
బతుకు కోసం కావలసిన రెండో సీక్వెన్సులో
పెయిర్ లోకి ముక్కలందడం లేదు ఇప్పటికీ
అవసరమయిన జోకరు కోసుకోవడం చేతకాలేదు
అమ్మాయిల  మనసుల్లా పక్కవాడి ఆట అర్థం కావడంలేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలి వాడి చేతిలో చిక్కింది
అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి అక్కర్లేని రాణులు
నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా
నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు
ఇక పెయిరయే అవకాశం లేదు
ఇప్పటికయినా 'మిడిల్ డ్రాప్' పడెయ్యి, నా మాట విను
చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు.....
(ఆంధ్ర ప్రభ 28.10.64)                   - వి. నారాయణరావు
  పేకాట ఆడడం తెలిసినవారికి ఈ కవితలోని పదార్థం(పదాల అర్థం)  బాగా అర్థం అవుతుంది. కవిత పేరే మిడిల్  డ్రాప్. రమ్మీ ఆటలో ముఖ్యమయిన పదం. ఎన్ని రౌండ్లు తిరిగినా ఆటలో కావలసిన ముక్కలు రాకపోతే, మన ఆటకి  పనికిరావని  పడేసిన ముక్కలు పక్కన కూర్చున్నవారికి పనికి వస్తుంటే, ఇంక ఆటని షో గా చూపించే అవకాశం రాదనుకున్నప్పుడు మిడిల్ డ్రాప్ చేస్తారు.

మనకు కావలసిన సమయంలో అవకాశాలు అందకపోవడం, మన వైఫల్యాలు అవతలి వాడి సాఫల్యానికి సహాయపడడం, మనం దక్కించుకుందామనుకున్న వస్తువు పక్కవాళ్ళకే దొరకడం  వంటివి జీవన వైఫల్యానకి గుర్తులు. వాటిని  పేకాటతో అన్వయించి చెప్పారు. చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు  అన్న మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తున్నా ఇప్పుడు కొందరు పాటిస్తున్న జీవన ధర్మమే కదా అది. అదే - బ్రతుకులోంచి మిడిల్ డ్రాప్.