28 June 2010

రమణకి జేజే




అభినందన మందార మాల

అభినందన మందార మాల

ముళ్ళపూడి వెంకట రమణగారికి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఇరవయ్యవ శతాబ్దపు ద్వితీయార్థంలో పత్రికారంగం ద్వారా సాహిత్యలోకానికి పరిచయమై తెలుగు జర్నలిజాన్ని కొత్తమలుపుతిప్పి తెలుగుపాఠకులకు తన రచనల ద్వారా కొత్తరుచులు చూపిన ఖ్యాతి ముళ్ళపూడి వెంకట రమణగారిది.
 ప్రాచీన కావ్యాలలో హాస్యరసాన్ని అంగరసంగా గుర్తించారు కానీ అంగిరసంగా దానికి ప్రాధాన్యం ఇచ్చి చేయబడిన రచనలు చాలా తక్కువ. ఆధునిక సాహిత్యంలో ఆంగ్ల ప్రభావం వల్ల తెలుగులో అవతరించిన ప్రక్రియలలో  హాస్యప్రధానమైన రచనలు కనిపిస్తాయి

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యులుగా సంస్కరణ భావాలతో తెలుగు జాతిని ఉద్ధరించడానికి పూనుకున్నవారిలో  వీరేశలింగం, గురజాడ అప్పారావు ముఖ్యులు. కేవలం పాఠకుడిలో కావ్యానందం కలిగించడమే కాక రచనకు సాంఘిక ప్రయోజనం ఉండాలని నమ్మి రచనలు చేసారు వారు

అడుగుజాడ గురజాడది అది భావికి బాట అని గట్టిగా నమ్మినవాళ్ళలో  ముళ్ళపూడి వెంకట రమణగారు కూడా ఒకరు. సంఘంలోను, వ్యక్తుల లోను ఉన్న లోపాలను సంస్కరించి, పరిహరించడానికి హాస్యాన్ని బాణంగా  సెటైర్ ని  ములికిగా చేసి సమాజంమీద ప్రయోగించారు. ఆశించిన ప్రయోజనాన్ని సాధించారు.
 ముళ్ళపూడి వెంకట రమణ కలం బలం తెలిసిన విమర్శకులు ఆయనను ముళ్ళవాడి వ్యంగ్యట రమణ అనే పేరుతో కూడా సంబోధించారు. సున్నితంగా కనిపిస్తూనే, అవసరమయిన చోట్ల అతిఘాటుగా నసాళానికి అంటేలా  వ్యంగ్యంగా అధిక్షేపించడం ముళ్ళపూడి కలానికి  వెన్నతో పెట్టిన విద్య.

అల్లాటప్పా హాస్యం అనిపిస్తూ, జీవితాన్ని 
ఘాటుగా పోట్లతో విమర్శించగలడు. హాస్యం
ముళ్ళపూడి వాని వేడి తాకిడికి ఈడేరింది.
దానికొక సాంఘిక ప్రయోజనం ఏర్పడింది
అన్నారు ప్రముఖ విమర్శకులు కె.వి.రమణారెడ్డి.

సమాజాన్ని అథిక్షేపించడానికి రచనలలో వస్తువరణంలో ఎంత కొత్తదనాన్ని చూపారో భాష ప్రయోగంలో కూడా అంతకన్నా ఎక్కువగా విలక్షణతను ప్రదర్శించారు ముళ్ళమూడి వెంకట రమణగారు.
తెలుగు భాషకి ఎన్నో కొత్త పదాలను, పదబంధాలను కల్పించారు. వాక్య విన్యానంలో ఎంతో వైవిధ్యం చూపించారు.
పదాలవిరుపులతో మాటల గారడీ చేసి చమత్కారంతో పాఠకులను సమ్మోహితులను చేసి తనవెంట లాక్కుపోయే గొప్పశైలి ముళ్ళపూడివెంకటరమణ గారికి ప్రత్యేకం.
రమణగారి రచనలలో ప్రధానంగా సమాజంలో  మధ్యతరగతి జీవితం కనిపిస్తుంది. వర్గానికి చెందిన వ్యక్తుల జీవితంలో కనిపించే అంశాలన్నీ ప్రదర్శిస్తాయి రమణగారి పాత్రలు. కష్టసుఖాలు, ఆశనిరాశలు,డబ్బు ఇబ్బందులు,ఒకరిపట్ల ఒకరికి ఉండే అపేక్షలు, అనుబంధాలతో పాటు అసూయలు, అవమానాలు కూడా అత్యంత సహజంగా  పాత్రలతో పాటు పాఠకులు కూడా అనుభవించగలుగుతారు.
పాత్రల సృష్టిలో ముళ్ళపూడి వెంకట రమణ పైన పలువురు  పూర్వ రచయితల, పురాణ గాథల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా గురజాడ కన్యాశుల్కం ప్రభావం ముళ్ళపూడి వెంకట రమణగారి అనేక రచనలలో కనిపిస్తుంది. తన  గిరీశం లెక్చర్లు  రచన లో గిరీశం పాత్రను పునఃసృష్టి చేసారు ముళ్ళపూడి వెంకట రమణ.
గురజాడ అప్పారావు నాడు సమాజంలో బాల్య వితంతు వివాహాలను అరికట్టే సంస్కరణల నేపథ్యంలో పెడధోరణులు పెచ్చురేగుతున్న సమయంలో కన్యాశుల్కంలో గిరీశం పాత్రను సృష్టించారుసంస్కరణ ముసుగులో వ్యక్తులు స్వలాభంకోసం తొక్కే అడ్డతోవలను వివరించారు. ముళ్ళపూడి వెంకట రమణ సమకాలిన సినిమా రంగాన్ని అధిక్షేపించడానికి, తద్వారా సంస్కరించడానికి గిరీశం పాత్రను తిరిగి సృష్టించారు.    గిరీశం ది ఎలెవెన్ కాజెస్ ఫర్ డీ జెనరేషన్ ఆఫ్ తెలుగు సిన్మా అంటూ  ఇచ్చే ఉపన్యాసాల్లో తెలుగు సినిమా రంగం లోని పెడధోరణులను, కధా వస్తువు, నటీనటుల విషయంతో సహా అన్నిటినీ అథిక్షేపిస్తూ హాస్యరచనగా తోపింప చేస్తూనే సున్నితమయిన చురకలు వేసారు.


1931 జూన్ 28 జన్మించారు ముళ్ళపూడి వెంకటరమణ. బాల్యంలో చాలా భాగం మద్రాసు పట్టణంలో గడిచింది. చిన్నతనం నుండి రచనా వ్యాసంగంలో ప్రతిభ కనపరిచిన రమణ గారు 14 సంవత్సరాల వయసులోనే బాలల కోసం బాల శతకం అనే నీతి శతకం రాశారు
బాలుడుగా ఉన్నప్పుడే బాల పత్రికలో  కథలు రాశారు. ఉదయభాను అనే రాతపత్రికను బాపుతో పాటుగా ప్రారంభించి సంపాదకత్వం నెరిపారు. నాటినుండే రమణరాతకు, బాపు గీతకు విడదీయరాని బంధం ఏర్పడింది.
1954 ప్రాంతాలలో ఆంధ్ర పత్రికలో ప్రవేశించి తన రచనలతో తెలుగువారి ఆదరాభిమానాలను విశేషంగా పొందారు ముళ్ళపూడి వెంకట రమణ.
అసలుపేరుతో, మారు పేర్లతో అనేకమైన రచనలు చేసారు. వ్యాసం రాసినా, సినిమా సమీక్షచేసినా ముళ్ళపూడి వారి ముద్ర దాని మీద గాఢంగా కనిపిస్తుంది.
1950-1965 మధ్య ముళ్ళపూడి వెంకట రమణ రచనలు ఆంధ్ర దేశంలో ఒక ప్రభంజనం సృష్టించాయి.
ఆంధ్ర పత్రికలో బుడుగు చిచ్చర పిడుగు పేరుతో రాసిన సీరియల్ లో బుడుగు పాత్ర  పేరు ఆంధ్రదేశంలో అల్లరి గడుగ్గాయలకి మారుపేరైంది.కథలలో ఎక్కడా కనిపించకుండా పాత్రల సంభాషణలలోనే వినిపించే పాత్ర రెండుజెళ్ళసీత పేరు  ఆంధ్ర దేశంలో అందమైన అమ్మాయికి ప్రతిరూపంగా స్థిరపడింది.
ముళ్ళపూడివారి జీవితంలో  మొదటి మజిలీ పత్రికారంగమయితే రెండవ మజిలీ సినిమారంగం. దాగుడుమూతలు, రక్తసంబంధం, మూగమనసులు, ప్రేమించిచూడు వంటి ఎన్నో విజయవంతమయిన చిత్రాలకు మాటలు రాశారు. ప్రేమించిచూడు చిత్రంలో మేడమీద మేడకట్టి  పాటను కూడా రమణే రాసారు- తమిళ ట్యూన్ ని అనుసరిస్తూ.
తాను రాసిన సాక్షి కథను బాపు దర్శకత్వంలో చలన చిత్రంగా రూపొందించి నిర్మాత కూడా అయ్యారు. బాపు రమణల సంయుక్త నిర్వహణలో అందాలరాముడు, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, సీతాకల్యాణం, భక్త కన్నప్ప, గోరంత దీపంస్నేహం, కలియుగ పాండవులు ఇలా ఇంకా ఎన్నో చలన చిత్రాలు అద్భుతమైన దృశ్యకావ్యాలుగా మలచబడి చలనచిత్ర చరిత్రలో మైలు రాళ్ళుగా నిలిచిపోయాయి.
ముళ్ళపూడి వెంకట రమణ రచనలలో బుడుగుని మినహాయిస్తే అన్ని రచనలలోను మధ్యతరగతి జీవిత చిత్రణ నేపథ్యంలో  ప్రేమ, రాజకీయరంగం, సినిమారంగం ప్రధానంగా కనిపిస్తాయి
ఇద్దరమ్మాయిలుముగ్గురబ్బాయిలు(నవల) రాధా గోపాలం, సీతాకల్యాణం,భగ్నవీణలు-బాష్పకణాలు కథా సంపుటాలలో కథలు ప్రేమకు సంబంధించినవి.
రాజకీయబేతాళ పంచవింశతి నవల రాజకీయరంగంపై విసుర్లతో కూడిన కథల సమాహారం.
విక్రమార్కుడిమార్కు సింహాసనం నవల సినిమా రంగాన్ని అథిక్షేపిస్తూ సాగిన నవల.

రమణ స్వీకరించిన సరికొత్త కథా  వస్తువు అప్పు. సామాన్య ప్రజాజీవితంలో ఒక ప్రధాన భాగం అయిన అప్పును కథా వస్తువుగా తీసుకొని దానిచుట్టూ అందమైన కథలను అద్భుతమైన నేర్పుతో  అల్లారు  రమణ. అప్పారావు అనే సార్థక నామథేయుడైన పాత్రను సృష్టించారు. పృథ్వ్యాప్తేజో వాయురాకాశః అని పంచ భూతాలలో ఒకటిగా  చెప్పిన దానికి అప్పు అంటే నీరు అని కాక మనకి తెలిసిన అప్పుగా చెప్పి అప్పును సర్వవ్యాపిగా నిరూపిస్తారు రమణ.
ఆంధ్ర పత్రిక లో సహసంపాదకుడిగా  రచయితగా జీవితం ప్రారంభించిన రమణ కథలు, నవలలతో పాటు అనేక వ్యాసాలు, అనువాదరచనలు చేసారు. అనేక మారుపేర్లతో రచనలు ప్రచురించారు. రమణ సాగించిన రచనా ప్రక్రియలలో  వెండితెర నవలలు, జీవిత చరిత్రలు, సినిమా రివ్యూలు ఉన్నాయి. ఆంధ్రుల అభిమాన నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారి జీవితాన్ని కథగా మలిచి జీవితచరిత్ర అనే ప్రక్రియలో కూడా తన నేర్పును ప్రదర్శించారు రమణ. ఎత్తుగడ, ముగింపు,కథనం అన్నిటిలో కొత్తదనం చూపించారు.
ముళ్ళపూడి వెంకట రమణ బాపు దర్శకుడిగా ఎన్నో చిత్రాలు నిర్మించారు. రమణ  ఆచిత్రాలన్నిటికీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే వంటి అంగాలన్నీ సమకూర్చేవారు. తమ చిత్రాలతో పాటు  ఎన్నో చలన చిత్రాలను వెండితెర నవలలుగా పుస్తకరూపాన్నిచ్చారు. వెండితెర నవల అనే ప్రక్రియకు ఒక మూస రూపాన్ని ఇచ్చారు.  వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు,భార్యాభర్తలు మొదలైనవి ఆయన వెండితెర నవలలుమూగమనసులు, దాగుడుమూతలు వంటి చిత్రాలతో సహా ఎన్నో చిత్రాలకు మాటలు రాసారు.

ముళ్ళపూడి వెంకట రమణ అంటే తెలుగువాళ్ళందరికీ అంతులేని అభిమానం. అందుకు కారణం అందరు రచయితలలాగ కేవలం వ్యాసాలు, కథలు, నవలలు రాయడంలో ప్రతిభ చూపడం మాత్రమే కాదు. భాషను  ప్రయోగించడంలో  రమణ చూపిన ప్రత్యేకత, కొత్తదనం.

భాష శబ్దార్థాల సమాహారం. సందర్భాన్ని బట్టి భాష లో శబ్దార్థాల ప్రయోగం ఉంటుంది.వక్త ఉద్దేశాన్ని బట్టి భాషలో ప్రత్యామ్నాయంగా ఉన్న పదాలలో కొన్నిటినే ఎంపిక చేసుకొని ప్రయోగించడం జరుగుతుంది
ఉదాహరణకి విషయాన్ని గంభీరంగా చెప్పదలచుకుంటే ఆయన పరమపదించారు, మరణించారు అంటాం. హాస్యంగా చెప్పాలనుకుంటే టపా కట్టేసాడు, బకెట్ తన్నేసాడు అంటాం.
ముళ్ళపూడి వెంకటరమణ  తన రచనలను హాస్యధోరణితో రచించారుఅందుకు అనుకూలంగా తెలుగు భాషలో ఎన్నో ప్రయోగాలు చేసారు
అలాంటి భాషాప్రయోగాలు ఇక్కడ చూద్దాం.

లేఖన సంప్రదాయంలో వర్ణనలో ఉచ్చారణ విధేయంగా రాయడం తెలుగు రచనలలో సాధారణంగా కనిపించదు. గురజాడ అప్పారావు, భమిడిపాటి కామేశ్వరరావు వంటి రచయితలు హాస్యరచనలలో  ఉచ్చారణ విధేయంగా రాసి లేఖన సంప్రదాయంలో కొత్త ఒరవడి పెట్టారు. ముళ్ళపూడి రమణ దానిని అనుసరించారు. అందులో ఎన్నో కొత్త పోకడలు ప్రదర్శించారు. సందర్భాన్ని బట్టి, పాత్రను బట్టి  చేసిన మార్పులు పాఠకులను ఉల్లాసంగా చదివిస్తాయి.
ముళ్ళపూడి ఉచ్చారణ విధేయంగా ఫది,ఘెటౌట్, వఠ్ఠి, ఖాఫీ,గాఠిగా, పరిగేఠుకొని, రోఝూ,నిజెంగా, ఇలా రాస్తారు. హాశ్యర్యపడిపోవడం, సంఝూ వందనం, నేపఝప్పాటలు , మజ్ఝిన, చదువుసంఝ ఇలాంటివి మరికొన్ని.
సందర్భాన్ని బట్టి పాత్ర ఉద్దేశాన్ని బట్టి వర్ణాలలో మార్పులు చేసారు. మర్రేమ్హీరు, ఇడ్డియట్, పిచ్ఛర్ త్హియ్యకుండా ఇలా వర్ణాలలో మార్పు కనిపిస్తుంది.
కొన్నిసార్లు వర్ణలోపం కనిపిస్తుంది. మూడ్రోలు, రెండ్రోలు, షుడియో ఇలాగ. అలాగే టోన్ కి బదులు స్టోను, లష్మీ ష్టాకీసు లాటి పదాలు వర్ణాధిక్యంతో కనిపిస్తాయి.
ఘంటసాలోడి స్టోనేరు. ఇదేరు. ఇది ఇందీ స్టోను....లాటివి.
ఇంకొన్ని పదాలలో వర్ణక్రమం మారి నవ్వు తెప్పిస్తాయి. డైరెట్కర్, డికెష్టివు, ఎలష్కను,రెవెనూ బోడ్రు  లాంటివి.
ఉచ్చారణ విథేయంగా రాయడం లో మరే రచయితా ఇదివరకు చెయ్యని ప్రయోగాన్ని బుడుగులో ముళ్ళపూడి వెంకట రమణగారు చేసారు. స్....ఫీడు, గా..  .....ఠిగా లాంటివి.

ఆధునిక సాహిత్యంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో కనిపించే సాహిత్య ప్రక్రియ హాస్యానుకృతి - పేరడీ. ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో పేరడీ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది.   కథలో అంతర్భాగంగా ఉండి  అద్భుతం అనిపిస్తుంది. ఉదాత్తభావంతో ఒక మూల రచన ఉండగా, స్వల్పమైన  భావానికి ఉదాత్తతను ఆపాదించడం వల్ల హాస్యం పెల్లుబుకుతుంది పేరడీ ప్రక్రియలో.
ఋణానందలహరి ముళ్ళపూడి వెంకటరమణ లోని హాస్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ప్రతి అక్షరంలో, పదంలో, భావంలో అడుగడునా పేరడీ చేసారు ముళ్ళపూడి. ఋణానందలహరి కి మరో పేరు అప్పుకవీయం. అప్పకవీయం అనే ప్రసిద్ధ గ్రంధానికి పేరడీ ఇది. కావ్యాలకు అవతారిక పద్యాలు రాయడం అనే పద్ధతిని పేరడీచేసారు రమణ.
అలాగే దాశరథీ, కరుణా పయోనిధీ పేరుతో ఉన్న శతక పద్యాలను పేరడీ చేస్తూ ఋణదాశరధీ, కఋణా పయోనిధీ అని అప్పును ధ్వనించేలా పద్యాలను రచించారు.  
ఋణకిరణాలతో లోకాన్ని జోకొడుతున్న చంద్రుడు అఋణకిరణుడు కనుచూపు మేరలో కానరాగానే తెల్లబోయి పాలిపోయాడుఅంటారు కథని ఎత్తుకుంటూనే.
ప్రకృతిలో అత్యంత సహజంగా జరిగే మార్పును తన కథా వస్తువుకి తగినట్టుగా రమణ ఎంత నేర్పుగా వర్ణించారో చూడండి.
 చంద్రుడు సూర్యుడి కిరణాలను గ్రహించి ప్రకాశిస్తాడు కనుక ఋణకిరణుడని, స్వయం ప్రకాశి కనుక సూర్యుడు అఋణ కిరణుడని లేఖనంలో కూడా మార్పు చేసి పఠితని ఆనందింపజేస్తారు రమణ. ఇలాంటి చమత్కారాలు పుస్తకం నిండా ఉన్నాయి.
కాకులు కావులిస్తాయి. (ఆవలించడం).
చీమలు చిమ చిమ నవ్వుతాయి.
ఆడచీమ చీమంతి అయితే మగచీమ చీమంతుడు.
రెక్కాడితే కాని డొక్కాడదని తల్లికాకి పిల్లకాకికి చెప్పడం వంటివి.
అసలు ఋణానందలహరి అనే అప్పుకవీయం అనే శీర్షిక లోనే అప్పకవీయం అనే ప్రసిద్ధ రచనకి పేరడీ ధోరణి కనిపిస్తుంది.
కథావస్తువుకి అనుకూలంగా ఎప్పటికప్పుడు కొత్త పదాలను, పదబంధాలను కల్పించి భాషకి పుష్టినిచ్చారు రమణ. గండభేరుండి, తారడు, తారిణేశ్వరి,చిమాభా, ఋణగుణధ్వని(అప్పులు చేసేటప్పుడు వాతావరణ వర్ణన), కావుకేకలు, టోకరేజి( టోకరా ఇవ్వడం అనే వృత్తి), ధనర్థారి(ఎలక్షను కోసం ధనం ధరించి వచ్చిన వాడువంటివి  కొత్త పదాలు
కులదీపకుడు ఋణాలతో వంశం నిలిపేవాడు ఋణదీపకుడు.ఋణహృదయం, ఋణోపదేశం,ఋణప్రసంగం వంటి ఎన్నో పదాలు కథానుగుణంగా ఇమిడిపోయి పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తాయి.

భాషని వాడుకోవడంలో రమణ చూపిన లాఘవం పాఠకుణ్ణి పరవశుడిని చేస్తుంది. కాడిలాక్ కారున్నవాడు కాడిలాకియర్అప్పుచేసి బతికేపద్ధతి అప్పోమానియా, సినిమాలు తీసేవారు సినిమా కారులు.సినిమాల పిచ్చి ఉండడం సినీ మేనియా,
సినీ జీవులకు సంబంధించిన కొత్త జబ్బును కనిపెట్టారు రమణసెరిబ్రల్ సినేరియా.సినిమాలకు కథలు రాయలనే ఆశపడేవాళ్ళ గురించి.
పదప్రయోగంలో ఎన్నో కొత్త పోకడలు పోయారు. పదాలతో ఆడుకున్నారు. వాటిలో  రెండు వేరువేరు పదాలను ఏకకాలంలో ప్రయోగించి కొత్త అర్థాన్ని కల్పించిన ప్రతిభ ముళ్ళపూడి వెంకట రమది.
క్రీటికా తాత్పర్యాలు (క్రిటిక్ టీకా తాత్పర్యాలు), కంఠశోషలిజం, శాన్స్క్రిటీక, చక్రపాణినీయం, టాక్సిడెంట్, మ్యునిసిపాలిటిక్స్ఇంకో(కో)టి, ఎంటర్టయిన్మెంటాలిటీ . నటయిత, శాపనార్థంతరన్యాసాలు, పౌరాంఘిక చిత్రం లాంటి పదాలెన్నో రమణ ప్రయోగించారు.
అలాగే శబ్ద పల్లవాలు అనే మాట ఉంది తెలుగు భాషలోనామ వాచకం పైన క్రియ చేరి కొత్త పదం ఏర్పడుతుంది. ఇక్కడ క్రియకు దాని అసలు అర్థం ఉండదు.
ఆశ్చర్యపడింది, విచారపడింది లాంటి పదాలను శబ్దపల్లవాలంటారు. ఇక్కడ పడడం, పోవడం అనే పదాలకు విడిగా అర్థం ఉండదు. కానీ రమణ ఇటువంటి శబ్ద పల్లవాలను విభిన్నంగా ప్రయోగించారు.
హాశ్చర్యపడి...లేచి, ఆశ్చర్యపోయి వచ్చాక.
అద్దం దగ్గరికి ఆశ్చర్యపోయి వచ్చాక,
ఆశ్చర్య పడబోయాడు. రాజు పట్టుకున్నాడు పడకుండా.
విచారపడిపోతాడు బాబాయి. మన్నెత్తుకోని ఉంటే మననీ పడేస్తాడు.
ఇక కనిపెట్టిన కొత్తపదాలు, ఉన్నపదాలకు చెప్పిన కొత్త అర్ధాలు ఎన్నో.
హలో అంటే రెండు రూపాయలు, హలో హలో అంటే నాలుగు, హలో కులాసా అంటే ఆరు రూపాయలు.
ప్రైవేటు చెప్పడం అంటే కొట్టడం తిట్టడం.
దీపావళి అంటే గట్టిగా అరుచుకోవడం.
పిల్లలను పెంచడం అంటే నిద్దర్రానప్పుడు పడుకో అని కోప్పడడం.
ఏకలవ్యుడు అంటే ఒకే అమ్మాయిని ప్రేమించినవాడు.
వీటితో పాటు భాషలో భాగంగా మనం ప్రయోగించే నుడికారాలు, పలుకుబడులు కొత్త అర్థాలలో ప్రయోగించారు రమణ.
బామ్మ బుడుగును వెనకేసుకొస్తుంది. బామ్మ లావుగా ఉంటుంది కనుక తను కనబడకుండా వెనకనిల్చుంటాడు కాబట్టి వెనకేసుకొస్తుందంటాడు బుడుగు.
బాబాయి రెండుజెళ్ళసీత చనువుగా ఉండడం చూసి వాళ్ళ వరసేం బావులేదు అనుకుంది బామ్మ. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చోకుండా వరుసగా పక్కన కూర్చున్నారని అలా అంది బామ్మ అనుకుంటాడు బుడుగు.
వాక్యవిన్యాసం లో కూడా రమణ మంచి నేర్పు చూపిస్తారు.
మార్గాంతరం తోచక మార్గాంతరాన్ని బట్టి పరిగెత్తడం
అవినీతి కథలు కాదు. అవి  నీతి కథలు అనడం.
సిగరెత్తులు తెల్లగా ఉంటాయి. అగరొత్తులు నల్లగా ఉంటాయి. అగరెత్తులు గోడమీద గుచ్చి కాలుస్తారు. ఇవేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
బాబాయి సంజె వారుస్తాడు. బామ్మ గంజి వారుస్తుంది.

ముళ్ళపూడి వెంకట రమణ వాక్యనిర్మాణంలో హాస్యం వెల్లివిరియడానికి వాక్యంలో అంగాలకు  యోగ్యత లేకపోవడం అర్థ వైరుధ్యం అనే లక్షణాలు తోడ్పడ్డాయి. వాక్యంలో పదాల మధ్య వాక్యబంధ సంబంధం లేకపోవడం ఇక్కడ కనిపిస్తుంది.
అతని చేతిలో పెట్టి (బట్టల పెట్టి) బస్సెక్కు బ్రదర్ ఇంకెంతసేపు మోస్తావు అంది.
సైలెన్స్ అని గావుకేక పెట్టాడు డైరెక్టర్. సైలెన్స్ చక్కావచ్చి చేతులు కట్టుకు నిల్చుంది.
రాజుకి అర్థం కాలేదు. వెళ్ళొస్తా బ్రదర్ అంది అతని మతి.
కడుపులో కామేశ్వర్రావు హల్లో అన్నాడు. జేబులో ధనపతిరావు నిల్లో అన్నాడు.
రాజు గొల్లు మన్నాడు నిశ్శబ్దంగా.
కొన్ని చీమలు బతికుంటే ఎలాగేనా చావొచ్చని కొండలెక్కిపోయాయి.

ఇంక అర్థ సందిగ్థత ఎలావుంటుందో  బుడుగులో చూస్తాం.
వంటింట్లో వంద రూపాయలు, చిరిగిపోయిన పక్కింటివాళ్ల పుస్తకాలు,కాగితాలు, విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు . సుబ్బులూ అన్నాయి బామ్మలుసూరమ్మ బామ్మా అన్నాయి గుండున్న పిన్నిగార్ల ముగుళ్లు - ఇలాంటివి.

నుడికారాలు, సామెతలు  వాడుకలో ఉన్నవాటిని ప్రయోగించినపుడు వక్త ఒక అర్థంలో అంటే  శ్రోత ఒక అర్థలో గ్రహించినట్టు సృష్టించి సన్నివేశాన్ని హాస్యస్ఫూర్తితో తీర్చారు రమణ.
నా మొహంలా ఉంది..... అంటే
ఏదో నీ అభిమానం కొద్దీ మెచ్చుకుంటావు అన్న సందర్భం.
మందే వూరండీ.
మాది బొంబాయి. మీదేవూరో నాకు తెలీదు. అనడం.
వీళ్ళెక్కడ్నుంచొచ్చారండీ మన ప్రాణానికి అని వక్త అంటే
అడ్రెస్ తర్వాత కనుక్కుందాం కానీ.... అని శ్రోత అపార్థం చేసుకోవడం.
నువ్వెందుకు పనికొస్తావు  -అంటే
నేనాండి అని ఉత్సాహంగా తాను చేయగలిగే పనులు చెప్పడం.
ఇలాంటివి ఎన్నో.
రచనలలో రచయిత కు భాషపై గల సాధికారతను చూపేవి  పలుకుబడులు, సామెతలు వంటి ప్రయోగాలు. సందర్భానికి, కధా వస్తువుకి తగినట్టుగా ముళ్ళపూడి వెంకట రమణ మార్పులు చేసి ప్రయోగించిన సామెతలు  ఎన్నో.
నీ యిల్లు రాఫిల్ముగాను, వెయ్యి పిక్చర్లాయుష్షు, విష్ యూ లోన్,
ఏపల్లెలో ప్రొడ్యూసరున్నాడో ఎవరికెరుక.
మలుపులో కాబూలీ పీనుగున్నాడో.
అప్పు తప్పి రూపాయి లొట్టపోవడం.
వెతకబోయిన ఋణదాతలా.
చెప్పుకుంటూ పోతే ముళ్ళపూడి రచనలలో  పదాలు, వాక్యాలు , సామెతలు కొత్త కొత్తగా మనని నవ్విస్తాయి. కవ్విస్తాయి.
భాషలో సందర్భంనుంచి శబ్దార్థాలను విడదీయలేం. కానీ భాష ప్రయోగం విషయంలో ప్రముఖంగా కనిపించే కొన్ని అంశాలు ముళ్ళపూడి వెంకట రమణని తెలుగువారి హృదయాలకి ఎలా దగ్గర చేసాయో, హాస్యరచయితగా ఆయనను అత్యున్నత స్ధాయిలో నిలబెట్టేయో మరొకసారి తలుచుకోవడం వ్యాసం ఉద్దేశం.  

తన కాలంలోనే కాక తరువాత కాలంలో కూడా వస్తువరణంలో, భాష విషయంలో  రమణ చేసిన ప్రయోగాలు   ఇతర రచయితలపైన ప్రభావం కలిగించడమే కాక  రెండుమూడు తరాల ప్రజల మనసులపై   రమణ చెరగని ముద్ర వేసుకున్నారు.  తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన రచయితగా నిలిచిపోయారు.
హాస్యరచనలలో ముళ్ళపూడి వెంకట రమణది  ఫోర్జరీ చెయ్యలేని సంతకం,
హాస్యరచనలో  అనన్యం అనితర సాధ్యం అతని మార్గం అని ఆంధ్ర పాఠక లోకం  మరోసారి గర్వంగా ప్రకటిస్తోంది.
ముళ్ళపూడి వెంకట రమణకి జేజేలు .




6 comments:

  1. nice one.ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  2. ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఈ సందర్బంగా మీరు రమణ గారి గురించి చాలా చక్కగా చెప్పారు. మీ టపా చూసాక, మళ్ళీ ముళ్ళపూడి వెంకట రమణ పుస్తకాల కోసం నా బుక్ షెల్ఫ్ వెదికాను. పుస్తకం వనితా విత్తం ... కదా ? ఎవరు ఎప్పుడు హస్తగతం చేసుకున్నారో? ఒక్క బుడుగు మాత్రం మిగిలింది. అదే పదివేలనుకుని ఓ సారి తిరగేసి సరదా పడ్డాను.

    ReplyDelete
  3. సుధారాణికి,
    మీ రమణకి జేజేలు చాలా బాగుంధి.
    ము.వె.ర కి 78 ఏళ్ళా? అని నివ్వెరపోయాము. అయినా, ఏళ్ళు మనుషులకి కానీ కధలకి కాదుగా.
    బాపు గీత- రమణ రాత కలిసి తెలుగు కధని నిత్య యవ్వనంగా ఉంచేయి, ఉంచుతాయి.
    ఈ కధలు విన్నవారికీ చధివినవారికీ స్వర్గప్రాప్తి లభిస్తుందో లేదో కానీ, ఆనందప్రాప్తి మాత్రం గ్యారంటీగా దొరుకుతుంది. ఫెళ్ళికాని కుర్రాళ్ళకి ఇంకో లాభం కూడా వుందండొయ్...బాపూబొమ్మ లాంటి పెళ్ళాం దొరుకుతుంది.
    భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టెదని ఎక్కడో ఎప్పుడో చదివేను.
    ఈ కధలు చదివినా కూడా ditto!
    మచ్చుకి:
    ఆహా, బాపు బొమ్మల గీతలు
    ఓహో, రమణ రమణీయ రాతలు
    కావా, కమ్మని కతలు?
    పెట్టవా, మనకి కితకితలు?

    ReplyDelete
  4. సుధా గారూ
    క్లుప్తంగా చెప్పాలంటే రమణ గారి మీద దీసిస్సు అంతటి పోస్టు ..
    వివరం గా చెప్పాలంటే ... ఆయన యశస్సు అంతటి పోస్టు ..

    శబ్ద పల్లవాల గురించి తెలుసుకున్నాను.
    ధన్యవాదములు

    రాం

    ReplyDelete
    Replies
    1. రామ్ గారు,
      మీకు ఈ పోస్టు నచ్చినందుకు మెచ్చినందుకు ధన్యవాదాలు. ముళ్ళపూడిగారి భాష గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అంత భిన్నమయిన ప్రయోగాలు చేసారు.
      తెలుగు బాగా వస్తే తప్ప రమణ గారి రచనలు అర్థం కావు.
      రమణగారు శబ్దవేది. అచ్చమైన తెలుగు రచయితకి అంతకంటే ఋజువేది.

      Delete