02 March 2010

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళూ....

కుర్రాళ్ళోయ్...కుర్రాళ్ళూ
వెర్రెక్కీ ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళూ
కవ్వించే సోగ్గాళ్ళూ....

వయసులో ఉన్నవాళ్ళ వాడిని,వేడిని వర్ణిస్తూ సాగే పాట.యువతరాన్ని గురించి చెప్పదలచుకున్నవారందరికీ వెంటనే గుర్తొచ్చే పాట.
 ఆ పాటలో అంత కిక్కుంది కనుకనే ముఫ్ఫై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆ పాట కుర్రాళ్ళ పెదవులమీద కదులుతూ - వినబడుతోంది.
కానీ....
వయసు లోని ఉడుకు తగ్గి ,వంట్లో దూకుడు తగ్గాక ఆలోచన మారిపోతుంది. వాళ్ళ సాహసం, ఉత్సాహం చూస్తే భయం వేస్తుంది.ఆ వయసు
వాళ్ళు మన పిల్లలే అయితే వాళ్ళకి ఏదో విధంగా కళ్ళెం వెయ్యాలనిపిస్తుంది. ఎప్పుడు ఏవిధంగా ప్రాణాంతకమయిన సాహసాలు చేస్తారో అని మనసులో రకరకాల ఊహలు మెలితిప్పి,గుండె లయ తప్పి వాళ్లని భయపెట్టో బెదిరించో సాహసాలకు దూరంగా ఉంచాలనిపిస్తుంది.

జాగర్త నాన్నా, జాగర్తమ్మా అంటూ బయటకు వెళ్ళినప్పుడల్లా చెప్పాలని పిస్తుంది. వాళ్లు మన మాటలని ఎంత నిర్లక్ష్యంగా కొట్టిపడేస్తారో తెల్సినా... పదే పదే చెప్పడానికి వెనుకాడం. 

పిల్లల మీద ప్రాణాలన్నీ పెట్టుకొని మన భవిష్యత్ ని వాళ్ల లో వెతుక్కుంటాం. కొండ మీద కోతి కావాలన్నా తెచ్చివ్వాలనిపిస్తుంది మన గారాల పట్టి కోసం. పిల్లలు జ్వరం పడి మంచం మీద పడున్నంత కాలం నిద్రాహారాలకి ఆమడదూరాన ఉంటాం.
పరీక్షలొస్తే అవి వాళ్ళకి కాదు మనకన్నట్టుగా రాత్రింబవళ్లు మేలుకొని ఉంటాం. పరీక్షలున్నంతకాలం ఆఫీసులకు రాంరాం తో రాము రామని చెప్పేస్తాం. వాళ్ళ సరికొత్త చదువుల కోసం అప్పిచ్చువాడు ఎక్కడున్నా వాడి చిరునామా సంపాదించి కాళ్ళమీద పడతాం.


కానీ అన్ని సార్లూ మనం తలచినది జరుగుతుందా.........
నిజంగా మన వాడిని మనం కోరుకున్న తీరాలకి చేర్చి  సంతోషంగా నిట్టూర్చగలమా....
నికరంగా వాడి భవిష్యత్తు ఇది అని నిర్ణయించి తేల్చి చెప్పగలమా.....


ఏ ఆటో కోసమో ఎదురుచూడకుండా హాయిగా సరదాగా స్కూలుకి వెళ్లి వస్తాడని తల్లితండ్రులు కొనిచ్చిన కొత్త సైకిల్, సందు మలుపు తిరగకుండానే మృత్యువాహనమవుతుంది.

సంక్రాంతి పండుగ వేడుకల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతున్నవేళ గాలిపటాన్నిఇనపరాడ్ తో కరెంటు తీగలనుంచి తప్పించబోతూ మనవాడు మసిబారిపోయాడన్న సమాచారం నవనాడులు కృంగదీస్తుంది.

స్నేహితులొచ్చారు డాబామీద కబుర్లు చెప్పుకొని వస్తానన్న వాడు పిట్టగోడ మీద ఏ సాహసం చేస్తూనో అక్కడినుంచి అటే అనంతలోకాలకు పయనమవుతాడు.

ఇవాళంతా ఇంట్లోనే ఉంటా మంచి టిఫిన్ చెయ్యమన్నవాడు, ఫోన్ కాల్ విని, అర్జెంట్ గా వెళ్తున్నా, అరగంటలో ఇక్కడుంటా -అని చెప్పి వెళ్లిన వాడు తాను వెళ్లిన మోటర్ బైక్ మీద కాక వన్ నాట్ ఎయిట్ వాహనంలో దిగితే గుండె ఎంత తల్లడిల్లిపోతుంది.

కాలేజి ఫ్రెండ్స్ తో నాగార్జునసాగర్ కి పిక్నిక్కి వెళ్ళినవాడు ఈతరాకపోయినా స్నేహితులకోసం సరదాగా నీళ్ళలోకి దిగి విగతజీవిగా తిరిగివస్తే
అభివృద్ధిలోకి వచ్చి ఆదుకుంటాడని ఎదురుచూసిన కళ్ళకు చీకటి కోణాలు కాక ఏం కనిపిస్తాయి!!


అందమయిన ఈ జీవితంలో అడుగడుగునా అంతులేని సస్పెన్సే.

జీవితం మనకోసం ఏం దాచి పెట్టిందో , ముందు క్షణం ఏంజరగబోతోందో మనకి తెలియదు. తెలిసినదల్లా ప్రతి క్షణాన్ని అనుభవించడమే. మరణాన్ని మనం శాసించలేం. దానికి సమయాన్ని నిర్దేశించలేం.

నిజమే. కాని కొంచెం ముందుచూపు, మరికొంచెం జాగ్రత్త వహిస్తే ఆ ప్రమాదాలను నివారించగలమేమో అన్న ఆలోచన చేయడంలో తప్పులేదుగా.


మనం బాగా చదువుకున్నాం. మనకి బాగా ఆలోచించే శక్తి ఉంది.మనకి బాగా డ్రైవింగ్ వచ్చు. పాటలు వింటూ, సెల్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చెయ్యగలం. ఫుల్ వాల్యూమ్ లో పాటలు వింటూ ,చెవికి భుజానికి మధ్య సెల్ ఫోన్ ని నిలబెట్టి అవలీలగా అతి వేగంగా మోటార్ కార్లూ,బైక్ లూ నడపగలం. కానీ రోడ్డుకి అడ్డంగా ఏ పిల్లినో చూసి పరిగెట్టకూడదని కుక్కపిల్ల కి తెలియదుగా. అనుకోకుండా అడ్డం వచ్చిన కుక్కని చూసి కుడికి బదులు ఎడమకి కట్ చేస్తే........ఆ క్షణం చాలదా మన బ్రతుకు మనది కాకుండా పోవడానికి.


నాగార్జున సాగరో, ఎత్తిపోతల జలపాతమో, చెన్నై మెరీనా బీచో.....విహారయాత్రకి వెళ్ళినప్పుడు నీళ్ళు చూడగానే ఉత్సాహం వస్తుంది. సమ్మర్ క్రాష్ కోర్సు లో నేర్చుకున్న ఈత గుర్తొస్తుంది. వెంటనే బట్టలు ఒడ్డున పెట్టి నీళ్ళలో జలకాలాడాలనిపిస్తుంది. 
కానీ మనం నేర్చుకున్న చిన్న స్విమ్మింగ్ పూల్ లో అయిదడుగుల లోతు నీళ్లు, మహోద్రేకంగా ఉరకలు వేస్తూ సాగే నదీ జలాలు ఒకటికాదని తెలియడానికి మరెంతో సమయం పట్టదు. ఆహ్లాదపరిచే సముద్ర కెరటాల పై మునకలు వేస్తూ ఆడుకుంటు ఉండగానే లోపలికి వెళ్లిన పెద్ద కెరటంతో పాటు సాగర గర్భంలో కలిసిపోతాం.

చెప్పుకుంటూ పోతే ఇలాంటి ప్రమాదాల లిస్టు కొండవీటి చాంతాడంత. పొద్దున్న లేచిన దగ్గరనుంచి మనం చూసే వినే వార్తలలో ప్రమాదాలు మనకో మనకి బాగా కావలసిన వాళ్లకో జరగకుండా ఉండాలని అందరం ప్రార్థిస్తాం.
ప్రమాదాలను ఆపలేము. కానీ కొంత హెచ్చరికగా ఉండడం ప్రమాదాలను నివారిస్తుంది.


పదిహేనేళ్ల క్రితం కొడైకెనాల్ కి వెళ్ళాము. టూరిజం వారి బస్ లో. మాతో పాటు ఓ భార్యా, భర్త ఏడాది కొడుకు. కెమేరాతో ఫోటోలు తీస్తున్నాడు అతను భార్యకి, కొడుకుకి. ఆవిడకి రాదో ఏమో మరి ఫోటోతీస్తారా నాకు అని అడిగి కెమేరా ఇచ్చి దూరంగా వెళ్ళాడు. ఏంగిల్ సరిచూసుకొనే లోపున "ఇక్కడ నుంచుంటా తియ్యండి బాగా వస్తుంది" అన్నాడు. 
తలెత్తి చూసి అదిరి పడ్డాను. మేము నిల్చున్న ప్రదేశం సూయిసైడ్ పాయింట్ అని చెప్పుకునే స్థలం. అక్కడ ముందుకు పోడానికి వీల్లేకుండా ఇనపరాడ్ లతో కంచె ఏర్పాటు చేసి ఉంది. అతను ఆ కంచె దాటి అటు వైపుకి వెళ్లి చిన్న రాయి మీద పోజుగా నిల్చోని ఉన్నాడు. వెనక చుట్టూ అద్భుతంగా కొండలు, మబ్బులు ఎంతో అందంగా ఉంది. ఒక నొక్కు నొక్కి ఫోటో తీసేమనిపించి వెనక్కి రమ్మన్నాం. 'ఫోటో బాగా వచ్చిందాండీ' అని అడుగుతున్నాడు. ఆ రాయి మీద కాలు జారి అంత లోతు లోయలో పడితే....
ఆ ఊహే ఒళ్ళు జలదరింపచేసింది. ఫోటో కోసం అంత సాహసం అవసరమా..... ఇంతా చేస్తే మనదగ్గరున్న కెమేరా జూమ్ లెవల్ కి మనం సరిగ్గా రావడమే గగనం, ఆ వెనక మన కంటికి కనిపించినంత అందమయిన దృశ్యాలని మన కెమేరా పట్టుకోగలదనుకోవడం అత్యాశ కాదూ....


మన చదువు, తెలివి మనకి జాగ్రత్త నేర్పకపోతే అంతా వ్యర్థంకదూ....తమకోసమే కాక తమమీద ఆశలు పెట్టుకుని వారి సుఖాలను,సంతోషాలను అన్నీ తమ సంతానంలో చూసుకునే తల్లితండ్రుల కోసమైనా ఈ కుర్రాళ్ళు ప్రమాదాల పట్ల జాగర్తపడాలి. 

ప్రమాద నివారణకోసం పాటించవలసిన విషయాలన్నిటి పట్లా దృష్టిపెట్టాలి.
వాహనాన్ని నడుపుతూ మొబైల్ మాట్లాడకూడదన్న నియమాన్ని కచ్చితంగా పాటించి తీరాలి. మత్తులో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలోను వాహనం నడపకూడదు. 

సెల్ ఫోన్ చార్జింగ్ లో పెట్టినప్పుడు ప్లగ్ ఆన్ లో ఉన్నప్పుడు అది ఎంత గొప్ప కంపెనీకి చెందినదయినా సరే ఫోన్ లో మాట్లాడకూడదు. 

బైక్ పైన మూడవ వ్యక్తిని ఎక్కించుకోకూడదు. అతివేగం పనికిరాదు.

తడిచేతులతో గీజర్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ముట్టుకోకూడదు.
ఈతరాకుండా , వచ్చినాసరే లోతు తెలియనిచోట ఈతకు దిగకూడదు.

విహారయాత్రలలో ప్రమాద హెచ్చరికలను పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

అన్నిటికన్న చాలా ముఖ్యమయిన విషయం-

పెట్రోల్ బంక్ మొదలైన చోట్ల, ఆయిల్ నిలవచేసేచోట, కరెంట్ సరఫరా జరిగే చోట మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు.

ముఖ్యంగా ఫ్లాష్ వాడకం గురించి మనలో చాలా మందికి అవగాహన లేదు. నిన్ననే విన్న ఓ దుర్వార్త ఈ టపా రాయడానికి ముఖ్య కారణం.
మహారాష్ట్ర అమరావతి కి విహారయాత్రకోసం ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు వెళ్లారుట. యాత్ర ముగించుకొని తిరిగిరావడానికి స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్నారుట. ఈ యాత్ర జ్ఞాపకంగా విద్యార్థులు కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు, తమ వద్ద ఉన్న మొబైల్, డిజిటల్ కెమేరాలతో.

ఓ కుర్రాడి కెమేరాలో ఎంత ప్రయత్నించినా టూర్ కి వచ్చిన అందరూ ఫోటోలోకి రావడంలేదని బాధ పడ్డాడు. ఎదురుగా ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగి పైకి ఎక్కి తీస్తే ఫోటోలో అందరూ వస్తారని ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం ఆ కుర్రాడు రైలు బోగి మీదకి ఎక్కాడు. పైన 40 వేల వోల్టుల విద్యుత్ ప్రవహిస్తున్న కరెంటు తీగ ఉందట. ఆ కుర్రాడు ఏంగిల్ చూసుకొని ఫ్లాష్ తో కెమేరాని క్లిక్ చేసాడు. వెంటనే ఆ ఫ్లాష్ ద్వారా 40 వేల ఓల్టుల విద్యుత్ అతని కెమేరాని, తద్వారా ఒంటిని తాకింది. సగం పైగా కాలిపోయిన శరీరంతో మృత్యువుతో పోరాడలేక తలవంచాడు.

ఆ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే కాక పరోక్షంగా విన్న వాళ్ళని కూడా తీవ్రమైన షాక్ కి గురిచేసే వార్త ఇది.


వెలుగు లేని చోట వెలుగు ప్రసరింపచేసి ఫోటోలకి జీవం ప్రసాదించే కెమేరా ఫ్లాష్ వంటి పరికరాలు, కొన్ని చోట్ల ఉపయోగిస్తే కొంపలార్పే కొరివిగా మారగలవని మనకి తెలుసా..
ముఖ్యంగా వాహనాలను వేగంగా నడిపేవారికి గాలి,వాహన వేగం వంటి విషయాలమీద అవగాహన ఉంటుందా....విజ్ఞాన శాస్త్రం మనకి నేర్పిన పాఠాలు మనం దైనందిన జీవితంలో ఉపయోగించుకుంటున్నామా...

చల్తా హై యార్ అంటూ మనం కనపరిచే కొద్దిపాటి నిర్లక్ష్యం పండంటి జీవితాలను కబళించకుండా ఆపడానికి  ప్రయత్నం చేయలేమా....


ఆహా...... చాలా చెప్పేరే............
ఇలాటి జాగర్తలు వింటూనే ఉన్నాం.....మాకూ మాత్రం తెలీదా....ఇలాటి కబుర్లు చెప్పే శతకోటి బోడి లింగాల్లో నువ్వూ ఒకటి అని పట్టించుకోకుండా పోయే వాళ్ళకి మనం మాత్రం ఏం చెప్తాం....

అనుభవించు రాజా....