08 January 2011

వెలుగునీడలు- హాఫ్ సెంచరీ

తెలుగు సినీ చరిత్రలో  ఈ రోజు మరో ముఖ్యమైన రోజు.
పాత తెలుగు సినిమాలు, పాత పాటలను ఆరాధిస్తూ, తన్మయులై పోయే (పాత)సినిమా ప్రేమికులకి  ఈ రోజు సంతోషకరమైన రోజు.

వెలుగునీడలు సినిమా తెలుగునాట విడుదలై నేటికి యాభై సంవత్సరాలు గడిచిందట. జనవరి 7,1961 నాడు తెలుగులోను, 14,జనవరి 1961 లో తమిళంలోను విడుదలై అఖండ విజయం సాధించిందట.
వెలుగునీడలు సినిమా తలచుకోగానే ఆణిముత్యాల్లాంటి పాటలు, అత్యంత గంభీరమైన, ఆదర్శవంతమైన యువకుడిగా నాగేశ్వరరావు పాత్ర ,  మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న చురుకు, చలాకీదనం కలిసిన అందమైన అమ్మాయిగా, తర్వాత భర్తను పోగొట్టుకొని  వితంతువై కరుణరసాన్ని అత్యంత రసభరితంగా ఆవిష్కరించిన సావిత్రి  మనసులో మెదులుతారు.

గొప్ప సాంఘికచిత్రంగా ఈ చిత్రం విమర్శకుల మన్ననలందుకుంది.  ప్రబోధాత్మకమైన, సందేశాత్మకమైన కథకి ఎక్కడా విసుగు పుట్టించని సన్నివేశ చిత్రణ, పాత్రలకు సరిగ్గా అమరిన నటీనటవర్గం, ఆపైన వినసొంపుగానే కాక కమ్మని సందేశంతో కూడిన సంగీతంతో   ప్రేక్షకుల మనసులు కూడా  దోచుకుంది.
వెలుగునీడలు చిత్రం పేరు చిత్రానికి చక్కగా అతికింది.

పగటికి రేయి, రేయికి పగలు  ఒకదానివెంట ఒకటి రావటం ప్రకృతి ధర్మం. మానవజీవిత గమనంలో కూడా  కొంతకొంతకాలం ఎదురుపడుతూ మనిషిని ఆకాశానికి ఎత్తేసే ఆశలు, అథఃపాతాళానికి క్రుంగదీసే నిరాశలు అత్యంత సహజం. జీవిత చక్రంసాగిపోతున్నప్పుడు ఓచక్రంఆకు  పైన ఓచక్రం ఆకు  కింద కనిపించినా ఆ భ్రమణంలో అంతలోనే అవి తారుమారు అవుతుంటాయి. అందుకే సుఖంలో పొంగి పోకూడదు.  కష్టంలో క్రుంగిపోకూడదు. గెలుపోటములను సమానమైన అనుభవంతో స్వీకరించాలి. అదే స్థిత ప్రజ్ఞత్వం. అలాంటి స్థిత ప్రజ్ఞులే నేటి సమాజానికి ఆదర్శప్రాయులు.  నాగేశ్వరరావు, సావిత్రి పాత్రల ద్వారా ఈ చిత్రం నిరూపించే  సత్యం ఇది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, ఎస్వీరంగారావు, గిరిజ, రేలంగి, సూర్యకాంతం, సంధ్య ఇతర ముఖ్యపాత్రలలో కనిపిస్తారు.

మొదటి భాగంలో కథ సావిత్రి ఐదారేళ్ళపాపగా ఉన్నప్పుడు ప్రారంభం అవుతుంది. పిల్లలులేని వెంకట్రామయ్య   దంపతులు (ఎస్వీఆర్, సూర్యకాంతం) ఒక పాపను పెంచుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ పెంపుడు తల్లి సూర్యకాంతానికి మరో ఆడపిల్ల పుడుతుంది. క్రమంగా ఆమెకి పెంపుడు కూతురు పట్ల తిరస్కార భావం పెరుగుతూ ఆ పాప మనసు గాయపరుస్తూ ఉంటుంది. పాపని అలా బాధ పెట్టడం చూడలేక తన గుమస్తా కుటుంబానికి అప్పగిస్తాడు తండ్రి యస్వీఆర్. కాల క్రమంలో  చదువుల సరస్వతిగా, చక్కని అందాలబొమ్మగా రూపుదిద్దుకొని మెడికల్ కాలేజీలో చేరుతుంది. పెంపుడు కూతురు చదువులో రాణించి డాక్టరు కాబోవడం, కన్నకూతురుకు చదువు అబ్బకపోవడం సూర్యకాంతానికి కంటగింపుగా ఉంటుంది. కానీ అక్కాచెల్లెళ్ళు (గిరిజ, సావిత్రి)మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
కాలేజీలో పరిచయమైన రవి(అక్కినేని నాగేశ్వర్రావు) కవికూడా అని తెలుసుకుని ఎంతో అభిమానిస్తుంది సుగుణ(సావిత్రి). ఇద్దరికీ  మధ్య జరిగిన సన్నివేశాలలో వారి మధ్య పరస్పరం గౌరవంతో కూడిన స్నేహభావం, ఒకరిపట్ల ఒకరికి గల ఆరాధనా భావం మాత్రమే కనిపిస్తాయి ఎక్కడా ప్రేయసీ ప్రియురాళ్ళలా మనకి తోచదు.
(వాళ్ళిద్దరూ అదివరకే హీరో, హీరోయిన్ అని ప్రేక్షకుల మనసులో స్థిరపడి ఉండడం వల్ల వాళ్ళు ప్రేమించుకుంటున్నారని అనిపిస్తుందేమో కానీ)
సుగుణ తన మెడిసిన్ చదువుకు ఆర్థికంగా  ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రైవేట్లు చెబుతూ ఉంటుంది. ఆ స్టూడెంటు మామయ్య లండన్లో పెద్ద చదువులు ముగించి వచ్చిన డాక్టరు రఘు(జగ్గయ్య). సుగుణ అందానికి, సౌశీల్యానికి ఆకర్షించబడి ఆమెను వివాహం చేసుకోమని కోరతాడు.  సుగుణ తన మనసులో రవిపట్ల గల ఆరాధనా భావం,  ప్రేమ అని తెలుసుకొని దానిని రవికి తెలిపే లోపల రవి తీవ్రమైన  అనారోగ్యంతో బాధపడుతున్నాడని, టీబీ చివరిదశలో  ఉందని తెలుస్తుంది. రవి తనకి సుగుణ పట్ల ఎంత ప్రేమ ఉన్నా దానిని వెల్లడించకుండా డాక్టర్ రఘు మాత్రమే సుగుణకి తగిన వాడని అతనిని వివాహమాడితేనే తాను జబ్బు నయం చేసుకోవడానికి టీబీ శానిటోరియంలో చేరతానని చెప్పి సుగుణని రఘుతో వివాహానికి ఒప్పిస్తాడు. అన్నమాట ప్రకారం సుగుణకి దూరంగా చికిత్స కోసం వెళ్ళిపోతాడు. ఈ సన్నివేశంలో కావలసినంత నాటకీయతకి చోటు ఉంది. కానీ నటనలో ఎంతో పరిణతి చెందిన నాగేశ్వరరావు, సావిత్రి అత్యంత సహజంగా నటించి ఆ సన్నివేశాన్ని రసభరితం చేసారు.
కొంతకాలం సుగుణ, రఘులు అన్యోన్యంగా కాలం గడుపుతారు.
సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని తిరిగివస్తున్నానని, రవి రాసిన ఉత్తరం చూసి అతనికోసం స్టేషన్ కి బయలుదేరిన రఘు విధివంచితుడై ఘోర ప్రమాదంలో మరణిస్తాడు.
పచ్చగా సంసారం చేసుకుంటున్న తన నెచ్చలిని చూద్దామని వచ్చిన రవికి తీవ్రమైన మనోవ్యథ కలుగుతుంది. భార్య సుగుణ తోడ్పాటుతో సమాజంలోని అభాగ్యులకు, నిరుపేదలకు సేవలందించాలని కలలుకని నర్సింగ్ హోమ్ నిర్మించుకున్న రఘు ఆశయాలు, అతని అర్థాంతర మరణంతో  గాలిలో కలిసిపోయాయి. తనను  ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లాడిన భర్త దూరమై  సుగుణ కర్తవ్య విమూఢయై  తను డాక్టరన్న విషయం మరిచిపోతుంది. 
ఆమెలో తిరిగి జీవితాశయాన్ని  పునర్జీవింపచేసి, ధైర్యం నూరిపోసి కర్తవ్యోన్ముఖురాలిని చెయ్యడంలో ఓ స్నేహితుడిగా రవి ఎంతగానో సహాయపడతాడు. నిజమైన స్నేహానికి అర్థం చెప్తాడు. ఆమె కోరిక మీద ఆమె చెల్లెలు (గిరిజ)ని వివాహం చేసుకొని భర్తగా ఎంతో నిజాయితీగా ఆమెను ప్రేమాభిమానాలతో గౌరవిస్తాడు. ఒక బిడ్డకు తండ్రి కూడా అవుతాడు.  సుగుణలో ఆడవారిలో సహజంగా ఉండే మాతృత్వభావనతో చెల్లెలి కొడుకును చేరదీసి తల్లిలాగే ప్రేమిస్తుంది.  కానీ పెంపుడు తల్లి (సూర్యకాంతం) సహజంగా తన కన్న కూతురు సంసారంలో ఈ సుగుణ వల్ల కల్లోలం ఏర్పడుతుందని భయం తో కూతురును హెచ్చరిస్తూ ఉంటుంది. భర్తని పోగొట్టుకున్న తన
అక్క ఇప్పుడు తన భర్తని ఆకర్షిస్తుందేమోనని భయపడి తన సంసారాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో కొడుకుని అక్కకి దూరం చేస్తుంది ఆ చెల్లెలు. డబ్బులేక ఇబ్బంది పడుతున్న సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చి తన కష్టార్జితాన్ని కుటుంబానికి ధారపోసినా సుగుణ ఔదార్యాన్ని గుర్తించలేని భార్య మనస్తత్వాన్ని భరించలేక, తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచిన కుటుంబంలో ఉండలేక రవి ఇంటికి  దూరంగా ఉండిపోతాడు.
సుగుణ పాత్ర మొదటినుండి జీవితంలో ప్రతిసందర్భంలోను పరీక్షకి గురి అవుతున్నదే. అటు తల్లిదండ్రులు,చెల్లెలు,  ఇటు స్నేహితుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తోంది. తన కారణంగా ఆ భార్యాభర్తల మధ్య స్పర్థలు రాకూడదని దూరంగా ఉండిపోతుంది. కానీ అన్యంపున్యం ఎరుగని అమాయకుడు  ఎంతోకాలం పెద్దమ్మ అనురాగాన్ని రుచిచూసినవాడు  ఏ కారణం వల్ల తాను పెద్దమ్మనుంచి దూరంగా ఉండాలని తల్లి ఆశిస్తోందో అర్థం చేసుకోలేనివాడు.... పసివాడు మాత్రం సుగుణ కోసం తల్లడిల్లిపోతాడు. పెద్దమ్మని చూడాలని బయలుదేరి ప్రమాదం బారిన పడతాడు. డాక్టరైన సుగుణ చేతిలో పసివాడు బతికి బయటపడడంతో మనస్పర్థలతో విడిపోబోయిన అక్కచెల్లెళ్ళు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు అంతా ఒక్కటై శుభం కార్డు పడుతుంది.
స్థూలంగా వెలుగునీడలు కథ ఇది.
మాటలన్నీ సందర్భోచితంగా, పాటలన్నీ సన్నివేశోచితంగా ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత.
మాటల రచన ఆత్రేయ, పాటల రచన కొసరాజు, శ్రీశ్రీ.
శివగోవింద గోవింద అంటూ రేలంగి అభినయంతో భక్తి తాత్వికత కలిపిన సాహిత్యంతో మొదటి పాట ప్రారంభం.
ఆ పాటని ఇక్కడ చూడవచ్చు.


కర్నూలు ఎక్కడా...కాకినాడ ఎక్కడా అని ప్రారంభమై చదువుకోసం ఎక్కడెక్కడినుంచో వచ్చి ఒకచోట చేరిన విద్యార్థులంతా కలిసి మెలిసి మసులుతూ  భలే భలే మంచి రోజులులే...మళ్ళీ మళ్ళీ ఇక రావులే అంటూ విద్యార్థి జీవితంలోని సుఖాలను,స్నేహం మాధుర్యాన్ని హుషారుగా చూపుతుంది. నాగేశ్వరరావు స్నేహితులు పద్మనాభం మొదలైన వారితో కలిసి అభినయించిన పాట.  ఆ పాట వీడియో ఇక్కడ.


సావిత్రి, నాగేశ్వరరావు బోటు షికారు వెళుతుండగా  ఒడ్డున కూలిపనులు ముగించుకొని వెళ్తున్న  జానపదులు పాడుకుంటున్న పాటగా ఓరంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో అని ప్రారంభమవుతుంది. పగలనకా రేయనకా పడుతున్నా శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు,
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు  అంటూ సావిత్రి వారిపట్ల సానుభూతి ప్రకటిస్తుంది. అంతలోనే
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
అని  బాధగా ప్రశ్నిస్తుంది.
సమసమాజ నిర్మాణం లోనే  సకల జనశ్రేయస్సు ఉందని నమ్మే ఆదర్శ వాదియైన  రవి- కవి కూడా కదా. అందుకే
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే  .... అని సమాధానం చెప్తాడు. చక్కగా స్వరపరచిన ఈ గీతం హాయిగా పాడుకోవడానికి వీలుగా ఉండే సంగీత సాహిత్యాల కలయిక.
ఆ పాట వీడియో ఇక్కడ.

సావిత్రి, జగ్గయ్యల వివాహ సందర్భంలో నృత్య కార్యక్రమంలో కొసరాజుగారి బాణీలో జానపదులపై  తయారైన సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి సరదాగ సినిమా చూద్దాం వయ్యారి ముద్దుల గుమ్మ పాట చిత్రించబడింది.
ఆ పాట వీడియో ఇక్కడ.



విధివంచితురాలై, ప్రాణప్రదంగా తనను ఆరాధించి ప్రేమించిన భర్తను కోల్పోయి దుఃఖితురాలైన స్నేహితురాలిలో కర్తవ్యస్ఫురణను కలిగించడానికి రవి పాత్రలో నాగేశ్వరరావు పై చిత్రించిన
కలకానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే కరిగించకు - అనే పాట అత్యంత అద్భుతమైన గేయం. కష్టాలకు క్రుంగిపోయేవారికి కొండంత ధైర్యం నూరిపోస్తూ, అణగారిపోయి నిస్తేజంతో జీవితం గడిపే అభాగ్యులకు చేయూతనిచ్చి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపొమ్మని మహాకవి శ్రీశ్రీ అందించే ఆపన్న హస్తం.
గాలి వీచి  పూవుల తీవ  నేల వాలిపోగా జాలివీడి అటులే దాన్ని వదలివైతువా....
చేరదీసి నీరు పోసి చిగురింపనీయవా అని ప్రశ్నించి  జీవితం పట్ల ఆశని  కలిగిస్తారు.
అగాథమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే.
ఏదీ తనంత తానై నీ దరికి రాదు.
శోధించి సాధించాలి!! అదియే ధీరగుణం. అంటూ మానవప్రయత్నం ఉంటే విధి ఎంత బలీయమైనదైనా దాన్ని  ఎదుర్కోవచ్చని  ధైర్యం చెప్తారు మహాకవి.
ఆ పాట వీడియో ఇక్కడ.


గిరిజ, నాగేశ్వరరావు ల పెళ్ళినాటి రాత్రి, హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి మంచు దారాలల్లి మత్తు జల్లి నవ్వసాగె ఎందుకో అంటూ సరసమైన శృంగార గీతంగా భార్యాభర్తలుగా ఒకరిమీద ఒకరు అనురాగం ప్రదర్శించుకుంటూ పాడుకొనే పాటగా చిత్రించబడింది. ఈ పాట ద్వారా నాగేశ్వరరావు తన మనసులో సావిత్రి రూపాన్ని పూర్తిగా చెరిపేసి గిరిజని తన భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించినట్టు ప్రేక్షకులు గ్రహిస్తారు.
ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.

అక్కాచెల్లెళ్ళిద్దరూ బాబును అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పాడుకున్న సందర్భాలలో చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు అంటూ చిట్టిపాపాయిల ముద్దు మురిపాలను వర్ణిస్తారు.

అలాగే బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆట పాటలతో చిన్నారి పొన్నారి పుట్టిన రోజు...చేరి మనం ఆడుకునే పండుగరోజు అంటూ అంతా కలిసి పాడుకునే పాటలో చక్కని సాహిత్యం ఉంది.

ఇక ప్రబోధాత్మకమైన గేయాలు తెలుగుచిత్రాలలో ఎన్నో వచ్చాయి. వాటిలో తలమానికమని చెప్పుకోదగిన
పాడవోయి భారతీయుడా పాట ఈ చిత్రంలోనే  ఉంది. ఈ పాట గొప్పతనం ఏమిటంటే  1960 ప్రాంతాలలో రాయబడిన ఈ పాట అప్పటి భారతదేశ వర్తమాన పరిస్థితులను అత్యద్భుతంగా చిత్రించిన పాటగా ఆనాడు ప్రశంశలందుకుంది. ఆనాటి భారతదేశ  సాంఘిక చిత్రాన్ని అలవోకగా ఆవిష్కరించారు శ్రీశ్రీ.
కవి, ఆదర్శవాది అయిన రవి పాత్రలో నాగేశ్వరరావు పై బృందగానంగా ఈ గేయం చిత్రించబడింది. నేడు మనం ఐటమ్ సాంగ్ తార గా చెప్పుకున్నట్టుగా ఈ పాటలో మాత్రమే ఆనాటి ప్రముఖ నటి రాజసులోచన నృత్యం చేసి కనువిందు చేసింది.
ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.

పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా... అంటూ ప్రారంభమయ్యే ఈ గీతం ప్రజలందరూ స్వాతంత్ర్యోత్సవాన్ని కేవలం పండుగగా జరుపుకుంటే చాలదని, సాధించినదానికి సంతృప్తి చెంది విజయం సాధించినట్టు పొంగిపోకూడదని హెచ్చరిస్తూ రవి పాత్ర ప్రవేశిస్తుంది.
అవినీతి, నల్లబజారు, బంధుప్రీతి దేశాన్ని దిగజారుస్తున్నాయని , పదవీ వ్యామోహాలు కులమత భేదాలు, భాషాద్వేషాలు దేశమంతటా  చీకటిలా అలముకున్నాయని  దేశపు ప్రస్తుత స్థితిని ఎత్తిచూపి హెచ్చరిస్తాడు.
ఆకాశం అంటుతున్న ధరలు ఒకవైపు, అలముకున్న నిరుద్యోగం ఇంకోవైపు ధనవంతుడిని మరింత ధనవంతుడిగా, పేదవారిని మరింత పేదవారిగా మార్చేస్తున్న దృశ్యాలు చూపుతాడు. కాంచవోయి నేటి దుస్థితీ, ఎదిరించ వోయి ఈ పరిస్థితీ అని కర్తవ్యోన్ముఖులను చేస్తూ
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం....సకల జనల సౌభాగ్యమె నీలక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారత దేశం అందించునులే శుభ సందేశం....
అని ప్రజల కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఆదిశగా వారిని నిర్దేశిస్తూ ముందుకు దారి చూపుతాడు.
పాటలో పేర్కొన్న అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని ఆవేశంగా మహాకవి 1960 నాడు ప్రశ్నించినా ఈ యాభై ఏళ్ళలో  భారతదేశంలో అవే పరిస్థితులు అంతో, మరికొంత తీవ్రంగానో
పెచ్చరిల్లడమే కాక హెచ్చుమీరి  కనిపించడం  ఆశ్చర్యకరం.
అందుకే మహాకవులను స్రష్టలు(సృష్టించేవారు) మాత్రమే కాదు ద్రష్టలు(దర్శించగలిగేవారు) అని కూడా అంటారు.
అయితే మహాకవి శ్రీశ్రీ ప్రబోధను మనం  అందుకో లేకపోయామన్నమాట. ఆయన కోరినట్టు-
సమసమాజ నిర్మాణ దిశగా,సకల జన సౌభాగ్య లక్ష్యంగా ఏకదీక్షతో గమ్యం చేరడానికి ప్రయత్నం చేసి నిఖిలలోకాలకు భారత దేశం ఆదర్శవంతమై శుభసందేశాన్నందజేయాలని
కనీసం వెలుగునీడలు వందసంవత్సరాల పండుగకైనా ఆ ఆదర్శాన్ని సాధించాలని కోరుకుందాం.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు:                                

దర్శకత్వం        ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం         డి.మధుసూదనరావు
తారాగణం        అక్కినేని నాగేశ్వరరావు ,సావిత్రి,జగ్గయ్య ,ఎస్.వి.రంగారావు,రమణారెడ్డి ,రేలంగి, గుమ్మడి,                       సూర్యకాంతం,గిరిజ, రాజసులోచన,పద్మనాభం, పేకేటి శివరామ్,ఇ.వి.సరోజ,
సంగీతం          పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం     ఘంటసాల,పి.సుశీల,మాధవపెద్ది, జిక్కి,స్వర్ణలత

7 comments:

  1. మీ ఈ పోస్ట్ బాగుందండి .
    నేను వెలుగునీడలు పాటలు చాలా ఇష్టం గా వింటాను , కాని సినిమా మటుకు చూడలేదు . ఎందుకంటే ట్రాజిడీ అని .

    ReplyDelete
  2. నేను వెలుగు నీడలు సినిమానీ చూసాను, మీ టపానీ చూసాను, వెలుగు నీడలు సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్. కళాత్మక దృశ్య కావ్యం . ఇక, మీ టపా లో పాటల విశ్లేషణ బాగుంది. వీలు చూసుకుని అప్పట్లో వచ్చిన ఇతర క్లాసిక్స్ ని కూడా ఇదే విధంగా పరిచయం చేయండి.
    అవునూ, మీకింత ఓపిక ఎలా వచ్చిందండీ?

    ఉన్నతమయిన అభిరుచికి సంబంధించిన పని తలపెట్టి నప్పుడు ఎక్కడ లేని ఓపికా వస్తుంది కాబోలు. గో ఎహెడ్.

    ReplyDelete
  3. బహు చక్కగా ఆ చిత్రాన్ని కళ్ళకు కట్టారు. నేను ఆ చిత్రాన్ని చూడలేదు కానీ నాకు ఆ చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగింది.
    ఇక ఇక్కడ మెచ్చుకావాల్సింది మాత్రం మీ ఓపికను ఇటువంటివి మీనుండి ఇంకా ఆశిస్తున్నాను. సాహిత్య విలువలు ఉన్న చిత్ర విశేషాలను మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. @జోగారావుగారు,
    @సురేష్ గారు,
    మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. తప్పకుండా మరిన్ని చిత్రాలను పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను

    ReplyDelete
  5. రాయకుండా ఉండటానికి సాకులెందుకు వెదుకుతారు? మీరు...

    ReplyDelete
  6. చల్లని వెన్నెలసోనలు పాట ఎవరు వ్రాశారండీ

    ReplyDelete
  7. @vookadampudu గారు
    చల్లని వెన్నెల సోనలు పాట రచన శ్రీశ్రీ అండి. సమాధానం తెలిసినా మరోసారి ధ్రువపరుచుకొని చెప్దామని ఆగాను. http://bhumika.org/archives/1664 ఈ లింక్ లో ఈ పాట విని ఒక జీవితమే మారిపోయినట్టుగా రాసారు. పాట శ్రీశ్రీ రాసినట్టుగా ఉంది. కాబట్టి అదే సరైన సమాధానం. ఆలస్యంగా జవాబు చెప్పినందుకు క్షమించాలి.

    ReplyDelete