03 July 2010

అందాల అరకులోయ

అరకులోయని తలచుకుంటే మనసు పులకరిస్తుంది. కొండలు, లోయలు, నీలిమబ్బులు, ఆకుపచ్చని బయళ్ళు , కొండల మధ్య అగాథాలలోకి దూకుతున్న జలపాతాలు అన్నీ అందమైన ప్రకృతికి సాకారాలు.

ఏమాత్రం భావుకత ఉన్నవారికైనా-

ఆకులో ఆకునై , పూవులో పూవునై ,

కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా.....

అంటూ కృష్ణశాస్త్రి ఆవహించి తన్మయత్వంతో పరవశంగా పాడాలనిపిస్తుంది.


పదమూడేళ్ళవయసులో మొదటిసారి అరకులోయను చూసాను.

మా నాన్నగారు అరకులోయలో ఆఫీసుపని మీద ఆడిటింగ్ చేస్తున్నారు అప్పుడు. అనారోగ్యంతో ఉన్న మాతాతగారిని చూడడంకోసం విశాఖపట్నం వెళ్ళాం మేము. అరకులోయ చాలా బాగుంటుందని, తప్పకుండా చూడవలసిన ప్రదేశమని నాన్నగారు చెప్పడంతో ఆదివారం నాడు బయలుదేరాం. పొద్దున్నే 7గం.కి ఎక్కామనుకుంటా విశాఖపట్నం స్టేషన్ నుంచి కిరండల్ పాసెంజరు రైలులో.

అది 19, నవంబరునెల, 1978. ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తుందే అని నవ్వుతుంది మా అమ్మ.

అవును. ఆ రోజు రైల్లో ఓ ప్రయాణీకుడు పేపర్ చదువుతున్నాడు. రైలు మానవ నిర్మితమైన బ్రిడ్జీల మీద కొండలు,గుట్టలు దాటుతూ వెళ్తోంది. పచ్చని ప్రకృతి మనసుని ఆహ్లాద పరుస్తూ ఉన్నా ఏ క్షణమైనా రైలు లోయలో పడిపోతుందేమోనని భయంగా అనిపిస్తూ ఉంది నాకు. అప్పుడే ఆ పేపర్ లో పెద్ద శీర్షికతో జలప్రళయం వచ్చి ఏడాది అయిందంటూ వ్రాసి ఉండడం చూసి ఈ ఏడాది ఈ ట్రైన్ పడి పోయే న్యూస్ ఉంటుందేమోనని భయపడిపోయాను. ఏంకాదులే అని నాన్న ధైర్యం చెప్పారు. అందుకే గుర్తుందన్నమాట.

ఆ రైలు సొరంగాలలోంచి దూసుకుపోతుంటే చీకటిగా అయిపోయింది. బోగీలో ఉన్న కుర్రాళ్ళందరూ ఈలలు, కేకలుతో మహా సందడి చేసారు.

ఈ కిరం డోల్ రైలునే దొంగల బండి అని కూడా అనేవారు  మావాళ్లు అప్పుడు. దీనిని కెకె పాసెంజరు అంటారు. కొత్తవలస  - కిరండల్ మధ్య నడిచే పాసెంజరు రైలు ఇది.
సరే...అలా రైలు అన్ని చోట్లా ఆగుతూ సాయంత్రం 4 గం.కి అరకు స్టేషన్ చేరింది. అప్పుడు ఇప్పటిలాగా సౌకర్యాలు లేవు. ఆటోలులేవు. అలా నడుచుకుంటూ ఓ కిలోమీటరు వెళ్ళాక టూరిజం వాళ్ళ కాటేజీలకి చేరాం.

అప్పుడు డ్రైవర్ రాముడు సినిమా నిర్మిస్తున్న రోజులు. సినిమాలో చాలా భాగం అరకులోనే తీసారు. ఎన్టీఆర్ లారీ డ్రైవర్, జయసుధ చిన్న కొట్టు నడుపుతూ ఉంటుంది.

ఆ కాటేజీ సినిమా యూనిట్ వాళ్ళు తీసుకోవడం వల్ల కొత్తగా కడుతున్న కాటేజీలని మాకు కేటాయించారు. నవంబరు నెల. అరకులో విపరీతమయిన చలి. పగలే ఒణికిపోయాం. కాటేజి దొరుకుతుందన్న ఉద్దేశంతో పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదు. దుప్పట్లు లేవు. కొత్తగా కడుతు ఉండడంతో కాటేజీ నేల చల్లగా గడ్డ కట్టేస్తామేమోనన్నంత చలి. సినిమావాళ్ళు పక్కనే ఉన్నారన్న ఆనందంలో మాకు పెద్ద బాధనిపించలేదు కానీ మా నాన్నగారు ఈ సినిమావాళ్ళు ఇప్పుడే రావాలా అని చికాకు పడ్డారు.
ఇంతలో మేమున్న గదిలోకి తొంగిచూసారు ఒకాయన- ఏంట్రా ఇక్కడున్నారు అంటూ .
ఎవరో అని చూస్తే ఆయన- మాడా. మాడా వెంకటేశ్వరరావు. మేము 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తూ గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఫస్టుక్లాసులో కలిసి ప్రయాణం చేసాం. ఆ ట్రయిన్ ఆరోజు పొద్దున్న 6 గంటలకి చేరవలసినది, సాయంత్రం 6 గంటలకి చేరుకుంది. ఈ ప్రయాణంలో మాడా గారు మా కూపేలో మాతో పాటే కూర్చొని చాలా సేపు కబుర్లు చెప్పారు. తాను సివిల్ ఇంజనీరని, అనంతగిరి హిల్స్ లో ఉద్యోగానికి శలవుపెట్టి సినీ ఫీల్డు కి వచ్చానని చెప్పారు. అప్పటికి చిల్లరకొట్టు చిట్టెమ్మ ఆయనకి బాగా పేరు తెచ్చిన సినిమా. ఇక సినీ ఫీల్డులో స్థిరపడినట్టుగా భావించి ఈసారి ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పారు. అరకులో షూటింగ్ ఉందని కూడా చెప్పారు. మాకు అప్పటికి అరకు ప్లాన్ లేదుగా..ఆయనకి చెప్పలేదు. అక్కడ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారందుకే. మాకు మాడా ఫ్రెండయినందుకు చాలా సంతోషంగా ఉన్నాం నేను, మా చెల్లి.
మర్నాడు పొద్దున్న మా నాన్నతో అక్కడ పద్మా గార్డెన్స్ కి వెళ్ళాం. లవంగ మొక్కలు, దాల్చినచెక్క రకరకాల ఔషధ మొక్కలు పెంచడాన్ని అక్కడి వాళ్లు చూపించారు. అన్నిటివీ శాంపిల్ ఆకులు తీసుకున్నా. ఫ్రెండ్స్ కి చూపిద్దామని.( ఇక్కడికి వచ్చేసరికి అన్నీ వాడిపోయి ఏ ఆకు దేనిదో మరిచిపోయి అన్నీ పారేశా)

అక్కడ పట్టు పరిశ్రమ ఏమిటో పట్టు  పురుగుల పెంపకం ఎలా జరుగుతుందో చూశాం. పట్టు పురుగులు మల్బరీ ఆకులు తింటూ లుక లుక పాకుతూ ఉన్నాయి.వాటిచుట్టూ అల్లుకున్న గూళ్ళనుంచి పట్టు దారాన్ని ఎలా తీస్తారో వివరించారు.
మధ్యాహ్నం ఆలా షికారు వెళ్ళాం. అక్కడ ఒక మైదాన ప్రదేశంలో కొందరు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇద్దరు కుర్రాళ్ళు తెలిసినట్టుగా అనిపిస్తే ఆగి చూసాం. వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాల కృష్ణ. మాకు మహదానందమయిపోయింది. దారంతా పసుపురంగు పూలతో నేలంతా పసుపు ఎండబోసినట్టుంది. అది అవిస(వలిసె అని అనాలా) పూలని, అందులోంచి నూనె తీస్తారని చెప్పారు.
మా కాటేజీ పక్కన చాలా మంది మూగి ఉన్నారు ఏమిటా అని చూసేసరికి కాటేజి మెట్టుమీద ఎన్టీ రామారావుగారు నిలబడి నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నారు.తర్వాత జయసుధ కూడా బయటకి వచ్చారు. ఇలా తారాదర్శనం మాకు అరకు జ్ఞాపకాలతో పాటు మిగిలింది.


మళ్లీ 1987లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం విహారయాత్రలో భాగంగా బస్ లో అరకు చూసాం.కానీ గుహలలోంచి వెళ్ళే రైలు ప్రయాణం మిస్సయి పోయారు మా ఫ్రెండ్సు. అప్పడు బొర్రా గుహలకి వెళ్లాం. అప్పటికి బొర్రా గుహలని విద్యుదీకరించలేదు. మధ్యాహ్నం వెళ్ళినవాళ్ళం సాయంత్రం చీకటి పడేవరకు గుహలలోనే గడిపాం. అప్పుడు వెలుతురు కోసం కొందరు మనుషులు కాగడాలు పట్టుకొని వచ్చేవారు. కొన్ని చోట్ల ఆడపిల్లలం వెళ్ళలేదు కానీ కొందరు అబ్బాయిలు చాలా లోపలికి వంగి డేక్కుంటూ వెళ్ళారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం.


మళ్లీ 2009 డిసెబరులో పిల్లలతో విశాఖపట్నం లో పెళ్ళికి వెళ్తూ హైదరాబాద్ నుంచే ఎ.పి. టూరిజం వాళ్ళ అరకుపాకేజి టూర్ లో టికెట్లు రిజర్వ్ చేసుకున్నాం. కొత్తవలస- కిరండల్ పాసెంజరు అది. . పొద్దున్న ఆరుగంటలకల్లా బయల్దేరి పోతుందని భయపెట్టారు కానీ 6.30 దాటింది.  రైలు కంపార్టుమెంటు మాత్రం ఘోరంగా ఉంది.  ప్రయాణీకుల మీద రైల్వేవారికి బొత్తిగా లక్ష్యం లేదని  నిరూపిస్తుంది ఈ రైలు. చెక్కబల్లలతో సీట్లు, కంపు టాయిలెట్లు, రిజర్వ్ చేసుకున్నా చోటు చాలనట్టుగా ప్రతి స్టేషన్ లో ఎక్కిపోయి కిక్కిరిసిపోయే జనం.
అయినా  ఈ ప్రయాణంలో దట్టమైన అడవులను చీలుస్తూ లోయలతోతులను  అధిగమిస్తూ పోతున్న రైలు సరదాలో ఇవన్నీ ఎవరూ పట్టించుకోరని వారి ధీమా.
ఈ సారి నా దగ్గర డిజిటల్ కెమేరా ఉండడంతో నా ఉత్సాహం పట్టనలవి కాలేదు. బోల్డు ఫోటోలు తీసుకున్నాను.


కూ ఛుక్ ఛుక్ మంటూ ఎలా వెళ్ళిపోతోందో చూసారా మా రైలు.. ఈ సొరంగాలలోంచి రైల్లో  వెళ్లే అనుభూతిని పొందాలంటే ఇక్కడ చూడండి.అరకులోయలో గిరిజన స్త్రీలు ఎంతదూరంనుంచి వస్తున్నారో ఎక్కడిదాకా వెళ్తారో మరి


అడవులు, కొండలు వాగులు వంకలు ఏవీ తమకు అడ్డు రాలేవన్నట్టుగా  నడుస్తూనే ఉన్నారు. తలలమీద భారంతో, చంకల్లో బిడ్డలతో.
మా రైలు చిన్న సొరంగమార్గాల గుండా వెళ్తూ ఉంటే చీకటిగా అయిపోతూ వెంటనే వెలుతురు నిండుతూ గమ్మత్తైన అనుభవం.ఇలాంటి గుహలు సుమారు 42 దాకా ఉన్నట్టున్నాయి. కొన్ని 1 కి.మీ. పొడవున్నాయిట.
 ఈ మార్గంలోనే శిమిలిగుడ అనే రైల్వే స్టేషన్ వస్తుంది. భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో ఎత్తైన రైల్వే స్టేషన్ అట ఇది. కానీ నేను ఆ బోర్డు మిస్ అయాను.
మధ్యలో బొర్రా గుహలకి వెళ్ళేవాళ్లు దిగడానికి , అరకు వెళ్ళే వాళ్లు ఎక్కడానికి బొర్రాగుహలు అనే స్టేషన్ లో  రైలు ఆగింది.కొందరు ఎక్కారు. కొందరు దిగారు.
 ఒక కొండమీదనుంచి ఇంకో కొండమీదకు చకచకా దాటిపోతోంది మా రైలు. ఎన్ని అగాథాలో...ఎన్ని మలుపులు తిరిగే కొండదారులో...వింజన్ డ్రైవర్ కి భయం వెయ్యదో ఏమిటో.
డిసెంబరు నెలాఖరు కదూ..పంటలు కోసినట్టున్నారు. సందడిగా ఉంది.పిల్లా మేక అందరూ దూరంగా కనిపిస్తున్నారు. అవిసె పంట కోసేసారుట అప్పటికే. చిన్నప్పుడు చూసిన అవిసె(వలిసె) పూలు ఇప్పుడు కనిపించలేదు.అక్కడక్కడ వెలుగు రేఖలు తొంగి చూస్తున్నాయి మబ్బుల్లోంచి. చల్లటి గాలి  దూరంగా ఉన్న అమ్మ చల్లని చేతి స్పర్శలా ఆత్మీయంగా ఒంటికి తగుల్తూ ఉంది.
 అరకు స్టేషన్ కి చేరింది రైలు. 1978 కి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఊళ్ళోకి వెళ్ళడానికి అప్పుడు 2 కి.మీ నడిచాం కదూ. ఇప్పుడు ఎంచక్కా ఆటోలు, టూరిజం వాళ్ళ బస్సులు అన్నీ వచ్చాయి. ఎ.పి.టూరిజం వాళ్ళు విశాఖ-అరకు రైల్లో వచ్చినవాళ్ళకోసం బస్ లు ఏర్పాటు చేసారు. మేం ఎక్కవలసిన బస్ నం. సీట్ నం. వేసిన టికెట్ని రైల్లోనే  మాకు ఇచ్చారు.ఆ బస్ చాలా సౌకర్యంగా ఉంది.  ఇక విశాఖ చేరేవరకు బస్ లోనే ప్రయాణం.

మొదట అరకులో చూడవలసినది ట్రైబల్ మ్యూజియం. అరకు లోయ మండలంలో నివసించే వివిధ గిరిజన జాతుల పేర్లు, వారి సాంస్కృతిక సంబంధమయిన విశేషాల తోకూడిన బోర్డులు ప్రవేశ ద్వారం దగ్గర మనకి పరిచయం అవుతాయి. గిరిజనుల నిత్యజీవతంలో భాగంగా వారు చేసే చాలా పనులను, వారు ఉపయోగించే వస్తువులను ఇక్కడ ఎంతో అందంగా అంతకన్నా ఎక్కువగా సజీవమూర్తులుగా భాసించే శిల్పాలతో ప్రదర్శించారు.

.వేటకు ఉపయోగించే వివిధ ఆయుధాలు, వంటకు, పంటకు ఉపయోగించే వివిధ సాధన సామగ్రి అంతా ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా నిలువెత్తు ప్రతిమలు, అవి మనుషులుకాదు కేవలం బొమ్మలే అంటే నమ్మలేనంత సజీవంగా కనిపించడం వీక్షకులకు నయనానందకరమైన అంశం.
 పెళ్ళిళ్లూ, పండుగలు వంటి సాంస్కృతిక సందర్భాలలో వివిధ వాయిద్యాలు ధరించిన వారి నమూనాలు ఇవి.

ఇంటి పనులు చేసుకొనే స్త్రీలతో పాటు ఆటవిక వస్తువులతో వివిధ కళాకృతులను తయారుచేస్తూ జీవికను పొందుతున్న స్త్రీమూర్తుల రూపాలు మనని ఆశ్చర్యచకితులను చేస్తాయి. నిజమైన వస్త్రాలతోను, వస్తువులతోను వాటి కట్టూ బొట్టూ తీర్చిదిద్దినందువల్ల కాబోలు.

 
గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసా నృత్య నమూనా కూడా ఎంతో నేర్పుతో నిర్మించారు ఇక్కడ.  ఈ థింసా నృత్యరీతులు పన్నెండు రకాలుగా ఉంటాయట. చైత్రమాసంలో కోతల సమయంలోను, ఇతర సాంస్కృతికమైన పండుగలు, వివాహాలు మొదలైన వాటిలో  ఈ నృత్యం ప్రధానమైన అంశం. ఇందులో రాజు పేద, పడుచు,ముసలి, మగ ఆడ భేదం లేదు. అందరూ పాల్గొని చేసే సామూహిక నృత్యరీతి ఇది. మగవారు రకరకాల వాయిద్యాలను వాయిస్తుంటే, కొందరు పాడుతూ ఉంటే ఆడవాళ్లు ఈ నృత్యం చేస్తారు.

మరొక మంచి  సాంస్కృతిక అంశం ఈ బొమ్మల్లో కనిపించింది. మనం ఒడుగులాగ చేసే తంతు ఏమో అనిపించింది. ఇక్కడి బొమ్మలు చూస్తే

ఇక్కడ గిరిజనులు ఉపయోగించే వంటింటి వస్తువులు, వ్యవసాయానికి, వేటకి ఉపయోగించే వస్తువులు అన్నీ ప్రదర్శించారు. వాటి పేర్లతో సహా.
గిరిజన తెగలు ఎన్ని రకాలుగా ఉన్నారో వివరించే పటాలు కూడా ఇక్కడ ఉంచారు. విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ గిరిజన తెగలు విస్తరించి ఉన్నారట. వారు ఏఏ ప్రాంతాలలో ఏవిధంగా పిలవబడుతున్నారో వివరించేవి, గిరిజనులు జరుపుకునే పండుగల పేర్లు, ఏఏ మాసాలలో జరుపుకుంటారో ఆ వివరాలు, గిరిజనుల నృత్యకళా రీతులు -ఏఏ తెగల వారు ఏపేరుతో నృత్యం చేస్తారో వివరిస్తూ ఉన్నాయి.
మ్యూజియం పూర్తిగా  చూడడానికి టైమ్ సరిపోలేదు. బస్ వాళ్ళు తొందర చేస్తారు. రాత్రిలోగా విశాఖ చేర్చాలంటే త్వరపడవలసిందే మరి. ఇంకా చూడవలసిన  కళాకృతులు ఎన్నున్నాయో..రెండు అంతస్థులుగా కట్టిన ఆ భవనంలో.

మ్యూజియం  తర్వాత చూసినది -పద్మాపురం గార్డెన్స్. 
వందల ఎకరాల స్థలంలో  ఎన్నో పూలతోటలు, పండ్ల తోటలు,ఔషధ మొక్కలు సాగుచేస్తున్నారు.వందల రకాల గులాబీలు గుత్తులుగా విరబోసి రంగురంగులతో ముద్దుగా కనిపించాయి. అరుదైన చెట్లు, పిల్లలను ఆకర్షించే డైనోసార్లు,చిన్న మట్టి గుడిసెలు ఓహ్...బోల్డు బొమ్మలు.  చుట్టూ నడిచి తిరిగే ఓపిక లేని వారికి రోడ్డుమీద నడిచే టాయ్ ట్రైన్ ఏర్పాటు చేసారు. లవంగ, ఏలకులు, దాల్చిన వంటి సుగంధ ద్రవ్యాలు మనకి ఎలా వస్తాయో వివరిస్తారు ఇక్కడ గైడ్. లీచ్ పండ్ల తోటలు ఉన్నాయట ఇక్కడ.

ఇవి కూడా బొమ్మలనుకుంటున్నారా ఏమిటి ...కాదు లెండి.  పిల్లలు ఆడుకుంటున్నారు. 
పద్మా గార్డెన్స్ చూసిన తర్వాత ఎపిటూరిజం వారి వసతి గృహంలో అందరికీ భోజనాలు ఏర్పాటుచేసారు. ఎక్కడైనా ఆంధ్రదేశం(బహుశ భారతదేశంలోనే) లో యాత్రికులకు ఇబ్బంది కలిగించే అంశం. శౌచ్యాలయాలు. ఎక్కడా శుచి,శుభ్రత అన్నవి కనిపించవు. ముక్కులు కళ్లు కూడా మూసుకొనే పనిచేసుకోవాలి. కానీ ఈ వసతి గృహంలో ఏర్పాట్లు బాగున్నాయి. యాత్రికులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని పరిచయం చేయడానికి టూరిజం శాఖ వారు గిరిజనులతో థింసా నృత్యాన్ని ఏర్పాటు చేస్తారు. వారు చాలా ఉత్సాహంగా  ఆ నృత్యం చేస్తుంటే కొందరు యాత్రికులు వారితో  పాదం కలుపుతూ ఉండడం నయనానందకరం.
 

ఇక్కడ మన విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి విల్లులు, అమ్ములు కూడా దొరుకుతాయి.

 
 ఇక మళ్ళీ ప్రయాణం. బొర్రాగుహలు చూడడానికి. అరకు దాటుతూ ఉండగా మైదాన ప్రాంతాన్ని చూపించాడు గైడ్. మన తెలుగు సినిమాలు అత్యధిక భాగం షూటింగ్ లు జరిపే ప్రదేశాలు అని.
త్రాచులాగా మెలికలు తిరుగుతున్న రహదారిలో బస్సు ముందుకు పరిగెడుతోంది. కొండలు,అడవులు వెన్నంటే వస్తున్నాయి. కొద్ది సేపట్లో అనంతగిరి కొండల వరుసలో అత్యధికమైన ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాం. దాన్ని గాలికొండ అంటారుట. అక్కడ ఓ క్షణం బస్ దిగి కిందకి చూస్తే....అద్భుతంగా ఉండే దృశ్యాలు ఇవి. ఇక్కడ సముద్ర మట్టానికి 3,700 అడుగుల ఎత్తులో ఈ గాలికొండ ఉందిట.


వెనక చాలా బస్సులు వస్తూ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆగడం కుదరదు.
 పచ్చని తివాచీ పరిచినట్టుండే కొండలు అన్న వర్ణనకు సరిగ్గా సరిపోతున్నాయి కదూ ఈ కొండలు...

దారిపొడుగూతా పొడుగ్గా  సిల్వర్ ఓక్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సన్నగా నవ్వొచ్చింది. ఎందుకమ్మా నవ్వుతున్నావ్ అన్నాడు బాబు. వసంతకోకిల సినిమాలో నీలగిరి చెట్లు చూసి ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాయి అని అడుగుతుంది శ్రీదేవి. ఆకాశానికి బూజు పడితే దులపడం కోసం అని జవాబు చెప్తాడు కమలహాసన్.ఇవికూడా అలాగే చాలా ఎత్తుగా ఉన్నాయి. 
ఈ కొండలలో కాఫీతోటలు ఉన్నాయట. రకరకాల పళ్ళ తోటలు కూడా ఉన్నాయట.
 ఇక్కడ లోయలో పండించే కాఫీ గింజలతో చేసే కాఫీ పొడి, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క ఈ ప్రదేశంలో అమ్ముతున్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఎన్నో మలుపులు, కుదుపుల తర్వాత బస్సు బొర్రా గుహలు చేరుకుంది.
బొర్ర అంటే ఒరియాలో  కన్నం అని అర్థమని చెప్పాడు గైడ్. 1807 ప్రాంతాలలో ఈ గుహలను గురించి తెలిసిందట. ఒకసారి గిరిజనులు ఆవులు కాస్తూ ఉంటే ఒక ఆవు ఈ కన్నంలో పడిపోయిందిట. ఆ ఆవు  అప్పుడే గోస్తనీ నదీ తీరంలో కనిపించిందిట. అక్కడ నుంచి వెనక్కి వెళితే  ఈ గుహలు కనిపించాయిట. ఇక్కడ ప్రాంతం  మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా  ఉంది.ఛత్తీస్ గఢ్, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలను కలుపుతుంది. ఒరిస్సా రాష్ట్రం ఈ బొర్రాగుహలు తమకు చెందినవని వాదిస్తోందట.
 
ఇదే బొర్రా గుహల ప్రవేశ ద్వారం పైనుంచి లోపలికి వస్తామన్నమాట.


ఇలా క్రిందకి దిగడానికి ఇదివరకటి కన్నా మెరుగ్గా మెట్లు వేసారు. పట్టుకోవడానికి రైలింగ్ ఆధారం కల్పించారు. ముఖ్యంగా ఇదివరకు చూడని విధంగా విద్యుదీకరించడం వలన గుహల అందాలు వివరంగా కనిపిస్తూ ఉన్నాయి.
 
గోస్తనీ నదిలో కొండలమీదనుండి ప్రవహించే అనేక ప్రవాహాలు కొన్ని వేల ఏళ్ళ పాటు సున్నపురాయిని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఈ గుహలు ఏర్పడ్డాయిట. అక్కడక్కడా  గుహల పైకప్పునుండి నీటి చుక్కలు రాలి పడుతూ ఉంటాయి. ఇలా కొండలమీద ఉన్న కాల్షియం బై కార్బొనేట్, ఇతర ఖనిజాలు నీటితో జరిపే రసాయన చర్యవలన పై కప్పునుండి జారుతున్న నీటి బొట్లు కొన్ని వేల ఏళ్లకు ఘనీభవించి రక రకాల వింత ఆకృతులు సంతరించుకున్నాయి. వీటిని స్టాలక్టైట్స్ అంటారుట. అలాగే నేలమీదకు జారి ఘనీభవించి ఏర్పడిన ఆకృతులను స్టాలగ్మైట్స్ అంటారుట. అప్పుడు మా లెక్చరర్ గారు చెప్తే విన్నాను. ఇప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్న పాప నోటివెంట మళ్ళీ వింటే బావుంది.
 
కొన్ని ఆకృతులను శివలింగాలుగా భావించి పూజలు చేయడం కూడా చూశాం.
  ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. సముద్ర మట్టానికి 2182 అడుగుల ఎత్తులో ఉన్నదిట ఈ ప్రదేశం. సరిగ్గా ఇక్కడ గుహ పై కప్పుమీద 176 అడుగుల ఎత్తున కొత్తవలస -కిరండల్ రైలు మార్గం వెళ్తోందిట. ఇక్కడ కొండ మందం 100 అడుగులుట.

ఇక్కడ నీటిప్రవాహం పసుపుగా కనిపించింది ఓ మూల.

అది సీతాదేవి స్నానంచేసిన ప్రవాహమని. ఆవిడ వాడిన పసుపు వలన ఆ నీళ్లు పసుపుగా మారాయని చెప్పారు గైడ్. సీతారాములు కొంతకాలం ఇక్కడ వనవాసం చేసారని గిరిజనుల నమ్మకం. ఆ మాటకొస్తే ఆంధ్రదేశంలో సీతాదేవి జలకాలాడిన నీటిప్రవాహాలు, సీతారాములు విడిది చేసిన ప్రదేశాలు, హనుమంతులవారు ఆగి అలసట తీర్చుకున్న ప్రదేశాలు ఎన్నో.
దిగ గలిగినన్ని మెట్లు దిగి, చూడగలిగినంత దూరం చూసి తిరిగివచ్చేసాం.
బొర్రా గుహలున్న కొండల పైనుండి కిందకి ప్రవహిస్తుంది గోస్తని నది. సన్నటి పాయలాగా ప్రవహిస్తూ క్రమంగా విశాఖపట్నం చేరుకొని బంగాళఖాతంలో కలుస్తుందిట. అబ్బ. ఎంత లోతో ఇక్కడ.

 
ఇది విశాఖ అరకు ప్రయాణ మార్గంలో చివరి మజిలీ.
 
ఇంకా తైద అనే వెదురు గ్రామం ఉందని చాలా బావుందని, కొంతమంది చెప్పారు. మేం చూడలేకపోయాం. అలాగే జలపాతాలు కూడా. జలపాతం పేరు చిత్రంగా ఉంది. రణజిల్లెడ అని. అలాగే చాపరాయి జలపాతం. మేము మిస్సయ్యాం.
 తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. క్రమంగా భానుడు పడమటి కొండల వైపు నుంచి కిందకి జారిపోయాడు. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను చూసి పులకించి పోయాము. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఇక మా కెమేరాకి రెస్ట్.
బొర్రాగుహల నుండి విశాఖపట్టణానికి 90 కి.మీ.దూరం. కమ్ముకున్న చీకట్ల మధ్య బస్సులో ఏకబిగిని 3 గంటలు ప్రయాణం.
కొండ తాచు నడకలా మలుపులు తిరుగుతున్న ఘాట్ రోడ్ లో అత్యంత నైపుణ్యంతో బస్సును పరుగులు తీయిస్తున్నాడు డ్రైవరు.  పగలంతా ఎంతో ఆనంద పరిచిన ఆ పర్వత సానువులు చీకటిలో భయ పెట్టాయి. నరసంచారం కనిపించని ఆ అడవుల మధ్య ప్రయాణానికి  ఏ ఆటంకం కలగకుండా ఇల్లుచేరిపోవాలి దేవుడా అని ప్రార్థిస్తూ విశాఖ చేరేవరకు  ప్రయాణపు అలసటతో మాగన్నుగా నిద్రలోకి జారాను. మళ్ళీ అరకు పునర్దర్శనం ఎప్పుడో......