07 September 2010

హద్గదీ.....అలా అడుగు !!

సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా
బంగారు కలలే కంటున్నారా....


పూలబాటగా భ్రమిసేరు ముళ్ళబాట నడిచేరు
వలపు పొంగు వయసులోన కన్నుమిన్ను కానలేరు
హద్దుమీరి తిరిగారంటే అల్లరిపాలై పోతారు....
..................................................................................
లోకం పోకడ తెలియక పోతే మోజుల్లో పడి ముందుకు పోతే
బ్రతుకు భారమై పోతుంది చివరకు  కన్నీరే మిగులుతుంది
 సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా...
బంగారు కలలు సినిమాలోని ఈ పాట విన్నప్పుడల్లా అబ్బ...ఆడపిల్లలకి 

హెచ్చరికగా ఎంత బాగా రాసారు కవి ఈ పాటని అనిపిస్తుంది. కథలో ఓ 

కుర్రాడిపై మోజుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మాయి జీవితంలో ఎన్నో 

ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది.

కుటుంబం నుంచి దూరమై, తన దుఃఖాన్ని పంచుకోవడానికి  నా 

అన్నవాళ్ళు లేక అల్లాడిపోతుంది. తనకు పట్టిన గతి మరే ఆడపిల్లకు 

పట్టకూడదని కోరుతూ, పై మోజులకు ఆకర్షించబడి దానినే ప్రేమ 

అనుకుంటూ తప్పటడుగులు వేయొద్దని ఈ పాట ద్వారా  హెచ్చరిస్తుంది.

ఎప్పుడో 35 ఏళ్ళక్రితం రాసిన ఈ పాట ఇప్పటికీ మన జీవితాలకి వర్తించే 

నిత్యసత్యం.

ఈ ఆకర్షణ వలన కలిగే భావానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు 

యువతరం. పదహారేళ్ళు కూడా రాకుండానే పిల్లలు ప్రేమ ప్రేమ అని 

కలవరిస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తుకోసం కళ్ళలో వత్తులు వేసుకుని 

కాపాడుకోవాలనుకునే పెద్ద తరానికి ఒంటికి కారం రాసుకున్నట్టు 

మండిపోవడం కూడా ఎప్పుడూ ఉన్నదే. అయితే చేతులు కాలాక ఆకులు 

 పట్టుకోవడంలో ప్రయోజనం ఉండదని ఆ మజిలీని దాటి వచ్చిన పెద్ద 

తరానికి తెలుస్తుంది. తమ పిల్లల చేతులు కాలకుండా చూసుకొని 

కాలతాయిరా అని హెచ్చరించాలని వాళ్ళకుంటుంది. కానీ  తమదాకా వస్తే 

కాని ఆ సమస్య ఎంత తీవ్రమైనదో ఈ చిన్న తరం గ్రహించలేదు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే....

మొన్నీమధ్య సెవెన్ సీటర్ ఆటోలో  ఇంటికి వస్తున్నా. ఆటోలో ఆరుగురం 

ఉన్నాం. ఒక సీటులో ఒక పద్ధెనిమిదేళ్ళ అబ్బాయి, పదహారేళ్ళ అమ్మాయి 

పక్క పక్కనే కూర్చున్నారు. వాళ్ళ పక్కన ఒక నడివయసావిడ 

కూర్చున్నారు. దానికి ఎదురు సీటులో ఒక మూల అరవైకి దగ్గర 

పడుతున్న ఒకాయన, పక్కన ఒక ముసలావిడ ఆవిడ పక్కన నేను 

కూర్చున్నాం. నేను మధ్యలో ఎక్కాను. అప్పటికి ఎంత సేపై నడుస్తోందో ఆ 

సీను మరి. ఆ పదహారేళ్ళ అమ్మాయి, అబ్బాయి పై ఒరిగి పోయి 

కూర్చుంది. 

అబ్బాయి ఆ అమ్మాయి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆ అమ్మాయి స్లీవ్ 

లెస్ భుజాలు నిమురుతున్నాడు. ఆ అమ్మాయి పరవశంగా ఈ లోకంతో 

సంబంధం లేనట్టు అబ్బాయి ఒళ్ళో చేతులు పెట్టుకొని కబుర్లు చెప్తోంది.

ఇద్దరి ముఖాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. కొంతసేపు గడిచింది. వాళ్ళ 

పక్కన ఉన్న ఆవిడ ఇక ఈ సీన్ ని భరించలేకపోయింది.
అమ్మాయి....ఏమిటలా కూర్చున్నావు...సరిగ్గా కూర్చో...అనేసింది. ఇంక ఆ

పిల్ల ఇహలోకం లోకి వచ్చింది. వస్తూనే కోపాన్ని వెంట  తెచ్చుకుంది. 

చూపులతోనే పక్కన కూర్చున్న ఆవిడ మీద   దాన్ని కురిపించింది.
 అతను నా లవ్వర్. మా యిష్టమొచ్చినట్టు కూచుంటాం. నీకెందుకాంటీ.... 

 ఆ అమ్మాయి అడిగిన తీరుకు ఆవిడ నివ్వెరపోయింది. మరేం మాట్లాడలేక

ఆవిడకే అవమానంగా అనిపించిందేమో మొహం పక్కకు పెట్టి బయటకు

చూస్తూ  కూర్చుంది. మళ్ళీ ఆట మొదలయింది. మీద మీద పడిపోతూ 

కబుర్లు, నవ్వులు. 
ఇంతలో డ్రైవర్...ఓసారి ఆపవయ్యా అని అన్నాడు మా సీట్లో కూర్చున్న 

ఆయన. దిగుతాడేమో అనుకున్నాను. ఏమండీ... మీరు ఈ సీట్లోకి వచ్చి 

కూర్చోండి. ఆవిడ పక్కన కూర్చోండి అంటూ నన్ను చూపించి,  నా వేపు 

చూసి, “ మేడం మీరు కొంచెం సర్దుకోండి అన్నాడు. 
మాకేం అర్థం కాలేదు. ఎదురుసీటు ఖాళీచేసి మా పక్కన 

కూర్చోమంటున్నాడేమిటీయన అని. ప్రశ్నార్థకంగా చూస్తున్న మాతో 

చెప్పాడాయన. ఆవిడ ఇటువైపు వచ్చి కూర్చుంటే ఆ సీటులో ఆ 

పిల్లలిద్దరూ పడుకుంటారు. మనం చూస్తూ కూర్చోవచ్చు అన్నాడు.
ఒక్క క్షణం గుండె ఆగినట్టనిపించింది నాకు. ఆయన అన్న మాట అర్థం 

అవడానికి ఆ అమ్మాయికి ఒక నిముషం పట్టింది. అందరం ఊపిరి బిగపట్టి 

చూస్తున్నాం. ఆ మాటకి ఎంత గొడవ అవుతుందో అని. ఆ అమ్మాయి, 

అబ్బాయి మొహాలలో కత్తి  వేటుకి నెత్తురుచుక్క లేదు. మౌనంగా 

ఆటోవాడికి డబ్బులిచ్చేసి అక్కడ దిగిపోయి వెళ్ళిపోయారు. ఆటో 

ముందుకు సాగిపోయింది. ఎవరి గమ్యాలలో వాళ్ళు దిగిపోయాం. ఎవరూ 

మాట్లాడుకోలేదు.

ఈ సంఘటన జరిగాక మనసులో చాలా అలజడిగా అనిపించింది. ఆ పిల్లకి 

లవ్ కిక్కు దిగి ఉంటుందా. తమ ప్రవర్తనకి సిగ్గుపడుతుందా. కనీసం 

ఇకముందైనా జాగ్రత్తగా ఉంటుందా....ఇవే ఆలోచనలు. 

ఇటువంటి సన్నివేశాలు ఎన్నో చూసాను నేను. కాలనీలో చీకటి సందులలో,

ఆగిన కార్లలో, సినిమా థియేటర్ వెనక సీట్లలో, పబ్లిక్ పార్కుల్లో.....ఎన్ని 

మార్లో....ఎన్ని సార్లో. చూడడం, విసుక్కోవడం.  ఆడపిల్లలు ఇలా ఉంటున్నారే,

ఇంత బరితెగించి పోతున్నారే  అని బాధ పడడమే తప్ప ఏనాడు వాళ్ళని 

ఇదేమిటర్రా....తప్పు అని మాత్రం చెప్పడానికి ప్రయత్నించలేదు.
(ఇందులో అమ్మాయిలది మాత్రమే తప్పా అని సమానత్వం కోసం ప్రశ్నించే

వారికి నా జవాబు....అరిటాకు మీద ముల్లు పడ్డా...అరిటాకు వెళ్ళి ముల్లు 

మీద పడ్డా....సామెతనే. ఎందుకంటే ఈ బరితెగింపు తత్వ్తం వెంటనే ప్రభావం

చూపేది ఎక్కువగా అమ్మాయిల పైనే -శారీరకంగానే కాదు మానసికంగా 

కూడా)
అమ్మానాన్నల వెనక తిరుగుతూ,  అమాయకంగా కనిపించే ఆడపిల్లలు 

కాలేజీల్లో చేరి అవకాశం దొరకగానే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోవడానికి

చేసే ప్రయత్నాలు,   బస్సుల్లో, ఆటోల్లో బురఖాలు వేసుకొని దిగే ఆడ 

పిల్లలు, అవి తీసేసి తమకోసం సిద్ధంగా ఉన్న మోటర్ బైక్ లపై కుర్రాళ్ళతో

వెళిపోతుంటే కళ్ళప్పగించి నేనూ చూసాను.  
ఖాళీగా ఉన్నాను కదా అని కంప్యూటర్ కోర్సులో చేరితే అక్కడకు జంటలు

జంటలుగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చొని ఆ పాఠాలు వినకుండా 


ఒకళ్ళమీద ఒకళ్ళు ఒరిగిపోయి చెవులు, ముక్కులు కొరుక్కుంటూ ఉంటే 

విసుగు ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం మాత్రం చేసాను. క్లాసు కాన్సిలయితే ఇళ్ళకు 


వెళ్ళకుండా బాయ్ ఫ్రెండ్ ని సినిమాకి పోదాం రమ్మంటూ ఎస్సెమ్మెస్సులు 

పంపుతున్న అమ్మాయిలను కూడా చూసాను. ఇంకా చాలా చూసాను. 

కానీ ఏనాడు ఇది తప్పు అంటూ ఎవరికీ చెప్పలేదు. అలా చెప్పక పోవడం 

కూడా తప్పేనేమో అనిపించేలా చేసింది.....ఆ ఆటోలోని పెద్దాయన చేసిన 

పని.
"
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని...." అంటూ సిరివెన్నెల 

సీతారామశాస్త్రి ' గాయం' సినిమాలో తను రచించిన పాటని  ఆవేశంగా  

అభినయిస్తారు.


అవును. అలాగే రైటేమో.
మనకెందుకొచ్చిన గొడవ...రెండునిముషాలు కళ్ళుమూసుకుంటే సరి.....అదే 

ఇంతవరకు నేను చూసిన మనస్తత్వం.


తప్పును చూసినప్పుడు తప్పుకోవడం కాదు. ఒప్పేదో చెప్పాలి. తప్పును 

దిద్దాలి. 

ఆ తప్పును చేయకుండా తప్పించాలి. 
తప్పును ఎత్తిచూపి ఆ తప్పును ఒప్పుకునేలా చెయ్యాలి.


అందుకోసం ప్రయత్నం చెయ్యాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం 

గుండెల్లోంచి రావాలి. ఆ పెద్దాయన నాకు ఒక హీరోలా 

కనిపిస్తున్నాడిప్పుడు. 
"చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు. ఒక దీపం వెలిగించడానికి ప్రయత్నం 

చెయ్యి " అన్న సూక్తిని ఆయన అనుసరిస్తున్న విధానం ఒక కొత్త కోణంలో 

కనిపిస్తోంది.


15 comments:

  1. నిజమండి..ఈ రోజుల్లో ఆడపిల్లలని చూస్తుంటే చాలా భయం వేస్తుంది..ఏంటి ఈ పిల్లలు అని చిరాకు వేస్తుంది....ఇంత విచ్చలవిడిగా ఉంటున్నారే అని రోత పుడుతుంది...పాపం వాళ్ల తల్లిదండ్రులు అని జాలి వేస్తుంది..కాని ఏం చెయ్యలేం..ఏం చెప్పలేం...మీరన్నట్టు దానికి చాలా ధైర్యం కావాలి. నేను అబ్బాయిల్ని వెనకేసుకురావటం కాదు కాని..కాస్తో కూస్తో వాళ్లే నయం అనిపిస్తున్నారు

    ReplyDelete
  2. నిజమే..ఆ పెద్దాయన ధైర్యానికి మెచ్చుకోవలసిందే..

    ReplyDelete
  3. nijame..niggadeesi adugu sigguleni jananni,,,ante

    ReplyDelete
  4. బాగా రాసారు

    ReplyDelete
  5. అదంతా గ్లోబలైజేషన్ మహత్యం వాటితో పాటు కాలం మారుతున్నది,కాలంతోపాటు మార్పులు సహజం, మీ టీనేజ్ వయసులో కూడ మీ పెద్దవాళ్ళు మీకాలపు టీనేజ్ పిల్లల ప్రవర్తన చూసి ఇప్పటి మీలాగే వాపోయి ఉంటారు దానికి కారణం అప్పటి పెద్ద వాళ్ళు వారి టీనేజ్ కాలంలో మానసికంగా ఆగిపోయి ఉంటారు, ఇప్పుడూ మీరు అదే పరిస్థితిలో ఉన్నారు అంతే, కాలంతో పాటు అన్ని మారుతూనే ఉంటాయి వాటిని యధాతదంగా అంగీకరించక తప్పదు, మీరు చూసిన సంఘటన మనకంటే ఓ 20 ఏళ్ళ ముందే నేను బెంగళూర్‌లోను, ముంబాయిలలోను చూసాను కాకపోతే మన తెలుగువారు అలాంటి విషయాలలో కాస్త 20 ఏళ్ళు వెనుకబడి ఉన్నారు అంతే. కంప్యూటర్ యుగం వచ్చాక ఆడమగ కలిసి తిరగడమన్నది సర్వసాదారణమయ్యింది.

    ReplyDelete
  6. బాగుంది....అది చూసి ఇది రాయలనిపించింది.
    ------------------
    భోగాలనుభవిస్తున్నప్పుడు
    అదే లోకంగా వుంటుంది ,
    రోగాన్ని అనుభవిస్తున్నా అంతేగా....మనసుకి
    ఏది చూసినా...ఇలాగే ఉండిపోవాలనో లేదా లోకమంతా
    ఇలాగే తగలడిందనో అనిపిస్తుంది మనసుకి.....
    తన పిచ్చిని పిచ్చోడు గుర్తించలేనట్టు,
    మాయలో మునిగినవాడు మాయేలోకం అనుకుంటాడు...
    తప్పుని ప్రశ్నిస్తే మాయలోకం అనుకుంటాడు.....
    బయటికి చూడటం అలవాటు పడిన మనసు,
    లోపల చేస్తున్న తప్పులు చూడదు.....
    ద్వంద్వం అంతా ద్వంద్వం....
    ముందు-వెనుక,పైన-క్రింద,కుడి-ఎడమ...
    ద్వంద్వం ద్వంద్వం.....
    చెప్తే వింటామా?
    చూస్తే మారతామా?
    చూడనీ,శోధించనీ
    అంతటా నిండినది ఆ శూన్యమే కదా
    ఎవడు తింటే ఎవడి కడుపు నిండుతుంది
    అనుభవమే మందు....
    ఇంకేం జరగనుందో మునుముందు.

    ReplyDelete
  7. ఒక సీటులో ఒక పద్ధెనిమిదేళ్ళ అబ్బాయి, పదహారేళ్ళ అమ్మాయి పక్క పక్కనే కూర్చున్నారు

    వాలిద్దరి వయసులు మీకు ఎలా తెలుసు
    ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు అవ్వొచ్చు కదా

    ReplyDelete
  8. దీనిపై ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదు. ఒక వైపు వయోజనులైన జంటల మద్య శృంగారానికి ఏ అడ్డు ఉండకూడదు అని వాదించే వాళ్ళు ఎక్కువ అయ్యారు.

    పైగా మన ధర్మాల మూలాలు కత్తిరించేస్తూ , నైతిక విలువలు లేని ఒక కొత్త రకపు పోకడలు రానున్న తరానికి నేర్పిస్తూ సమాజాన్ని ఎటు తీసుకుని వెళతారో అర్ధం కాని పరిస్థితి.

    :)) మన బిడ్డలని పద్దతిగా పెంచుకోవడం తప్ప మనమేం చేయలేం :))

    పై అజ్ఞాత గారి రామాయణం లో పిడకల వేట ఒకటి మద్యలో

    ReplyDelete
  9. కవితలో హాస్యం కన్నా జీవిత అర్థాన్ని ఎక్కువగా గమనించాలి
    అర్థాలు తెలియకపోతే ఏది హాస్యమో ఏది జీవితమో తెలియదు
    అర్థాలు జీవిత ఆశయాల భాధ్యతలను తెలుపుతూనే ఉంటాయి
    మనం దేనిని తిలకించినా గ్రహిస్తున్నా జీవిత అర్థాన్నే గమనించాలి
    Hi

    Welcome to gsystime.blogspot.com

    This blog for everyone to get the knowledge

    ReplyDelete
  10. Sudha గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

    హారం

    ReplyDelete
  11. చాలా బాగా రాశారండీ...నాక్కూడా ఆ పెద్దాయన ఒక హీరోలా అనిపిస్తున్నాడు...తప్పుని నిగ్గదీసి అడగటమే ప్రతి వ్యక్తి ధర్మం..

    శ్రీనివాస్ గారి మాటే నాది కూడా...

    ReplyDelete
  12. Chaala chakkaga raasaru!

    19 samvatsaraalu nindina maa ammayiki nenu aritaaku saametha, mana samskruhthi vivarichi cheppanu! 10 samvatsaralu ninduthunna maa abbayiki, para stree akka tho, amma tho samanamanamu ga gauravinchaalani chebuthu vasthunnanu

    Avesam maathrame saripodu, aacharinncha gala dhairyam, nijayathi undali

    ReplyDelete
  13. చాలా బాగా రాశారండి .. స్మశాన వాటికకు వెళ్ళే ప్రతి ఒక్కడు ఇది నాకు సంబందించింది కాదుఅని అను కుంటారట అలానే ఇలాంటి సంఘటనలు కనిపించి నప్పుడు అవి మనకు సంబందించినవి కావులే అనుకుంటారు . ఈ కాలం పిల్లలు క్షణం వృదా చేయకుంటా బాగా చదువుకుంటున్నారు. అదే సమయంలో కొంత మంది జీవితాన్ని తెలిసి తెలియని వయసులో అదోగతి పాలు చేసుకుంటున్నారు. ఇందులో తల్లి తండ్రుల తప్పు కూడా కొంత వరకు ఉంది. పిల్లల మీద ప్రేమ అంటే వారు అడిగిన వన్నీ ఇవ్వడమే కాదు. వారితో గడపాలి, లోకం పోకడలు చెప్పాలి . కనీసం రోజు ఒక సారైనా కలిసి భోజనం చేయాలి. అమ్మాయిలు మోస పోవడం పై వారికి అవగాహనా కలిగించాలి. మా ఇష్టం వచ్చినట్టు కుర్ చుంటామని వారు అన్నప్పుడు వారు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మోహ మాతం అవసరం లేదు . కనీసం ఆందరూ కూర్చున్న ఆటో లో మిగిలిన వారికి ఇబ్భంది కలిగించెట్టు వ్యవహరించా వద్దని చెప్పాలి. ఇలాంటి వారిని చూసు మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలతో స్నేహితుల్ల వ్యవహరించి ఇలా చెడిపోయిన వాళ్ళు ఇతరులను చెడ గొట్ట దానికి ప్రయత్నిచడం పై కూడా చెప్పాలి

    ReplyDelete
  14. *ఈ కాలం పిల్లలు క్షణం వృదా చేయకుంటా బాగా చదువుకుంటున్నారు. అదే సమయంలో కొంత మంది జీవితాన్ని తెలిసి తెలియని వయసులో అదోగతి పాలు చేసుకుంటున్నారు. ఇందులో తల్లి తండ్రుల తప్పు కూడా కొంత వరకు ఉంది.*

    బాబా బుద్దా మురళి గారు రాసినవి చదువుతుంటే చాలా నవ్వొచ్చింది నాకు. పిల్లలు క్షణం వృదా చేయకుంటా బాగా చదువుకుంటున్నారు అని ఎప్పుడో పాత 1970సం|| నాటి తల్లిదండ్రుల భావాలను గుర్తుకు చేశారు. చదువు వలన, దాని పిచ్చి వలన సమాజం చేడి పోతున్నా మురళిగారు ఇంకా బాగా చదువుకునే వారిని పొగటటం చూస్తూంటే ఆయన ఆశవహ దృక్పథానికి నా జోహార్లు. ఈ రోజుల్లో ఇలా చదివే చాలామంది పిల్లలు వారి తల్లిదండృలకు ఉన్న ఒకటో లేక ఇద్దరి సంతానం లో ఒకరు. వీరీ లో చాలా మందికి మంచి డబ్బులు, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. వీరి తల్లి లేక తండ్రి పాత సినేమాలో అంజలిదేవి లా టైలరింగ్ పని చేసుకొంట్టు వీరిని పోషించటం లేదు. కనుక ఈ నాటి పిల్లలు పగలబడి చదువుతున్నదుకు తెగ ఉప్పొంగి పోనవసరం లేదు. తల్లిదండృల లో చాలా మందికి వారి పిల్లలు పందేం కోళ్ళ లాంటి వారు, వారు బాగా చదివితే చాలు, ఊరి వారి ముందర పేరు సంపాదించుకొంటే చాలు, మిగతా ఎవరితో తిరిగినా వారికి ఎమీ బాధ ఉండదు. మీరు పాపం వారి తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా బాధ పడుతున్నారు. వారేమి జీవితాన్ని అధోగతి పాలు చేసుకోవటంలేదు. సరి అయిన సమయంలో ఆనందిస్తున్నారు. పొద్దుగుకులు పడిచదువుతూ ఎక్కడ వయసుకు తగ్గ సుఖాలను ఆనందించమో అని వారు చాలా ముందు చూపుతో చాలా త్వరగా ప్రేమలో పడి, పని ముగించేస్తున్నారు. ఇవన్ని వారి అమ్మాలకు తెలిసినా పిల్లల జోడికి వేళ్ళకుండా బెట్టుగా మా అమ్మాయిని ఒక్క మాట మేము అనమండి, మాకు అబ్బాయి ఎంతో అమ్మాయి అంతే అని ఇతరులతో చెప్పటం మొదలుపెడతారు. మీలాగా ఎవరైనా సలహాలు ఇవ్వటానికి వేళ్లిన వారికి ఈ మాటలు ముందు కాళ్ల బంధం లాగా అవుతాయి.
    అయ్యా మురళి గారు నేను సిటిలో ఒక గేటేడ్ కమ్యునిటీ లో నివసిస్థాను, రాత్రి 9గం లు దాటిన తరువాత వాకింగ్ కు పోతే ప్రస్తుత భారత దేశ ట్రెండ్ అర్థమౌతుంది. 8-12వ తరగతి చదివే అమ్మాయిలు వారి బాయ్ ఫ్రేండ్స్ తో గంటలు, గంటలు సేల్ లో మాట్లాడే మాటలు మీకు వినపడితే అమ్మాయిలు ఎమీ మొసపోవటం లేదు అని బాగా అర్థమౌతుంది. తల్లి కళ్ళ ముందర వారి ఇంటి ముందర అమ్మాయిలు అంత సేపు మాట్లాడుతూంటే, అమ్మాయిలు అన్ని తెలిసే చేస్తుంటే వారు ఎలా మోసపోతున్నారని అనగలం?
    అయినా ఆ జీవన శైలి లో తప్పు ఎమివుంది? బాగా చదువు కుట్టున్నరు ఎందుకని? సుఖించటానికే కదా! పెళ్ళి పేరుతో జరుపుకునే సంబరాలన్ని ఇప్పుడే జరుపుకొంట్టున్నారు. అందులో తప్పేమి లేదు. వారిలో చాలా మంది దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. అవి వారిని రక్షిస్తాయి. అర్థో రక్షితి రక్షితహ :
    అమ్మాయిలు హాయిగా, ఆనందంగా, అబ్బాయిల తో కలసి చిలకా గోరింకలలాగా గాలిలో తేలుతూండటం మీలాంటి వారికి ఇష్ట్టం ఉన్నట్లు లేదు :-)

    నేను రాసినవి అభూత కల్పనని అనుకొంటరేమో! కొన్నిసారులు వాస్తవం ఊహకకు అందదు. నా వాదనకు మద్దతుగా ఈ క్రింది లింక్ ను జత చేస్తున్నాను.
    Secret life of Indian teens
    http://indiatoday.intoday.in/site/story/secret-life-of-indian-teens/1/130880.html

    SriRam

    ReplyDelete