27 June 2010

సీతయ్య...(ఎవరిమాటా వినడు)


సంవత్సరం క్రితం సంగతి…...

అంతకు వారం ముందు....

పాప కి ఒంట్లో బాగుండక చాలా చికాకు పడింది. అప్పుడప్పుడే మందులు పనిచేసి తేరుకుంటూఉంది. కానీ నీరసం వల్లనో, టీనేజ్ లో ప్రవేశిస్తున్న వయసు తెచ్చిన మార్పో కాని ప్రతిదానికీ పేచీ.... అప్పుడు దాని మనసులోకి వచ్చిన కోరిక....

కుక్కపిల్ల కావాలి అని..బుల్లి బొచ్చుకుక్కని తెచ్చుకొని పెంచుకుందామని ఒకటే అల్లరి...అల్లరి అనేది అందమైన పదం. కానీ అది చేసిన అల్లరిని నస అనడమే కరెక్టు.

ఉండేది అద్దె ఇల్లు.ఎప్పుడు ఖాళీచేసి పోవాలో తెలీదు. ఇంటినిండా సామాను, ఆరుగురు మనుషులకి కావలసినంత ఇల్లు ఎక్కడ దొరుకుతుందీ, ఇంక వీటికి కూడా చోటెక్కడ ఉంటుందీ....వద్దు కాక వద్దు అని వాళ్ళ నాన్న శాసనం.

నేను మా పుట్టింట్లో 12 ఏళ్ళపాటు రెండు బొచ్చుకుక్కలు పెంచిన అనుభవంతో ఇష్టంతో ఉన్నా...మా వారు చెప్పిన కారణానికి నేనూ వద్దనుకున్నాను.

వారంరోజులు ఈ నస కొనసాగింది. ఆఖరికి అప్పుడే కోలుకుంటున్న పిల్లకి ఈ కోరిక ఎందుకిలా పుట్టింది...ఏంచెయ్యను...సాయిబాబా అని బాబాని పదే పదే తలుచుకున్నాను....

ఎంత విచిత్రం....కేవలం కాకతాళీయమా....సాయిమహిమా....

తెల్లటి బొచ్చుకుక్కపిల్ల మా యింటిముందు తారట్లాడుతూ ఉంది. భయం భయంగా రోడ్డుకి ఓ పక్కగా నడుస్తూ...మెడలో బెల్టుకానీ, గొలుసుకానీ ఏదీ లేదు. చాలా సేపు దాన్ని గమనించాం. ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. ఒక రెండు గంటలయింది. ఎవరూ దానికోసం రాలేదు. పోనీ దగ్గరికి పిలుద్దామా అంటే కరుస్తుందేమోనని భయం.
కరిచిందంటే కుక్కకాటుకి చెప్పుదెబ్బ కాదుగా...ఇంజెక్షన్లకి బోల్డు ఖర్చు. ఈ లోగా కుక్కలని పెంచిన ధైర్యంతో మా చెల్లి ఎప్పటిదో పాత కుక్కల గొలుసుతెచ్చి.... దా దా...అని పిలిస్తే గబ గబా వచ్చి మెడ ఎత్తి చైన్ వేయించుకుంది. ఒక గిన్నెలో పాలు పెడితే గబ గబా తాగింది. దగ్గరికి రానిచ్చింది...బొచ్చు నిమురుతూ ఉంటే దగ్గరగా కూర్చుంది. బొచ్చు మాసిందని మా చెల్లి స్నానం చేయిస్తే చక్కగా కిమ్మనకుండా చేయించుకుంది. సాయంత్రం దాటి రాత్రవుతోంది. ఎవరైనా వచ్చి కుక్క కోసం వెతికితే చెప్పమని చుట్టుపక్కల వారికి, వాచ్ మేన్లకి చెప్పాం.

ఇంట్లో మా వారున్నారు. ఆయనకి కుక్కలంటే భయం లేదు,కోపమూ లేదు. పెంచడం మాత్రం ఇష్టంలేదు. కుక్క దొరికిందని చూపించారు పిల్లలు. ఆహా అనేసి ఆడుకొని కొంచెం సేపయ్యాక వదిలేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్లంతా సీరియస్ గా టీవీసీరియల్స్ చూస్తుండగా కుక్కని బయట పెరట్లో కట్టేసాం.

మంచి తెల్లటికుక్క, దాదాపు రెండు సంవత్సరాల వయసుంటుంది. పామరేనియన్ జాతికి చెందిన బొచ్చుకుక్కపిల్ల. కొనాలంటే రెండువేలేనా ఉంటుంది. ఎవరు పెంచారో....ఎందుకు వదిలేసారో, లేక ఇదే తప్పిపోయిందో ఇదంతా ఎలా జరిగిందో చెప్పడానికి దీనికి నోరులేదు.

ఎంతగారాబంగా పెరిగిందో, ఏం తిని పెరిగిందో ఏమో పాపం. ఇంట్లో కుక్క ఉందని మా వారికి, మా అత్తగారు,మామగారికి కూడా తెలియదు. మళ్ళీ పాలు అన్నం పెడితే తినేసి పడుకుంది. పొద్దున్న చూసారు మా వారు. ఇంట్లోకి తేవద్దని బయట వదిలేయమని గట్టిగా వార్నింగిచ్చారు. కానీ పాపం మా అత్తగారు, మామగారు అయ్యోపాపం....ఎలా తప్పిపోయివచ్చిందో అని జాలిపడ్డారు.

పొద్దున్న పేపర్ వాడొచ్చాడు. పాలవాడొచ్చాడు. పై మేడమీద అద్దెకి ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు. కుక్క ని కట్టేసి ఉంచాం. నిశ్శబ్దం........

సడెన్ గా డౌట్ వచ్చింది. కుక్క ఉన్నట్టే తెలియడంలేదేం...

ఇంతకీ ఎందుకు అరవడంలేదు..ఒంట్లో ఏమేనా సమస్యా..ఊహు....ఉత్సాహంగా తిరుగుతోంది...తింటోంది కానీ అంతా నిశ్శబ్దంగానే.... ఏమయిఉంటుంది. రెండురోజులు పాటు ఇలాగే గడిచింది. ఈ లోగా చాలామందిని అడిగాను. ఇంటర్నెట్ లో వెదికాను.

మనుషుల్లో మూగవాళ్లు ఉన్నట్టు మూగకుక్కలు ఉంటాయేమో మరి అనుకున్నాం. కుక్క అంటేనే అరవడమో, కరవడమో చెయ్యాలి కదా..ఇది రెండూ చెయ్యడంలేదే. అందుకే దీన్ని వదిలేసేరేమో అనుకున్నాం. అరవక పోవడం వల్ల మా వారుకూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు.

మూడవరోజు పొద్దున్న పేపర్ వేసే కుర్రాడు గేట్ కొట్టి పేపర్ వేసి గేట్ తోసాడు. అంతే...... అరవదు అనుకున్న మా కుక్క పిల్ల ఆ పేపరబ్బాయిని చూస్తూనే భౌ మని పోర్టికోలోంచి గేట్ దగ్గరికి గెంతడం, దాని అరుపు శబ్దానికి ఉలిక్కిపడి కాఫీగ్లాసులు తెస్తున్న నా చేతుల్లో కాఫీ తొణకడం, మరో లిప్తకాలంలో పేపర్ అబ్బాయి తేరుకొని గబుక్కున గేట్ వేసేసి బయటకి పరిగెత్తడం జరిగాయి.

ఆశ్చర్యంతో నిలబడిపోయాను.

హమ్మయ్య. మేం భయపడినట్టు ఇది మూగది కాదన్నమాట. అరుస్తోంది కాబట్టి కరవదు అని అనిపించలేదు..... పేపర్ అబ్బాయి వెళ్ళాక కూడా అది దాని అరుపు కొనసాగించిన విధానం చూస్తే.

అలా మాకు కుక్క పిల్ల దొరికింది. దైవమిచ్చిన కుక్క అది అని అనిపించింది.

సరే దాని కోసం ఎవరూ రాలేదు. ఇంక మనమే చూసుకుందాం...పాప ఎలాగో సరదా పడుతోంది. కుక్కకూడా మేలుజాతిది అనుకున్నాను. అక్కడనుంచి మొదలయ్యాయి నా పాట్లు.

అది మగ కుక్క. మేం ఇదివరకు పెంచినవి ఆడకుక్కలు. అందులో ఒకదాని పేరు స్నోవీ. దీనికీ దాని పేరే పెడదాం అన్నారు పిల్లలు. సరే అని ఈ కొత్త కుక్కకి స్నోవీ అని నామకరణం చేసాం.

మూడురోజులు మూగ మొద్దులా ఉన్న స్నోవీ ఇప్పుడు అరవడంలో దాని ప్రావీణ్యం చూపిస్తోంది. గుండెలు జారిపోతాయి అది కోపంగా చూస్తూ అరిస్తే. అల్సేషన్ మిక్స్ అయిన జాతి అయి ఉంటుందేమో ననిపిస్తుంది.

ఇంట్లో ఉంచుకుంటే గేట్ మీద చెయ్యి పడిన శబ్దం వింటే చాలు అరుస్తూ వస్తుంది. దాదాపుగా కాలు పట్టుకున్నంత పని చేస్తుంది. (కానీ ఎవరినీ కరవలేదు) దాని అవసరాలు తీర్చుకొని వస్తుందిలే అని గానీ గేటు బయట వదిలామా... మా ఇంటితో పాటు మా ఇరుగింటికి పొరుగింటికి కూడా కాపలా కాస్తుంది. ఎవరినీ రానీయదు. అసలు ఆ ఇంట్లో వాళ్ళనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళనీయదు. వీథిలో ఊరకుక్కలు ఇన్ని ఉన్నాయా..అవి పాపం అరవవు. ఇది మాత్రం నోరుపెట్టుకొని బతుకుతుంది.

ఇంట్లో నేనంటే చాలా ఇష్టం. అన్నం పెడతాననేమో. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నా కాళ్ళకింద కూర్చుంటుంది. పడుకుంటే మంచం కింద పడుకుంటుంది. వంటింట్లో ఉంటే గుమ్మందగ్గర కూర్చుంటుంది. టీ వీ చూస్తే టీపాయ్ కింద కూర్చుంటుంది. బాత్ రూంకి వెళ్తే ద్వారం దగ్గరే ఉంటుంది. ఇంత విశ్వాసం చూపిస్తుందని సంతోషిద్దామనుకుంటే....
ఎవరైనా వచ్చినపుడు అరుస్తూ మీద పడడానికి ప్రయత్నం చేస్తుందా...అప్పుడు మాత్రం నన్ను లెక్క చెయ్యదు.పట్టుకొని చైన్ వేద్దామంటే దొరక్కుండా పోవే అన్నట్టుగా  ఓ చూపు పారేసి  ఇంటిచుట్టూ నన్ను తిప్పిస్తుంది.

ఎక్కడైనా బావే కాని వంగతోటలో బావకాదు అన్నట్టు ఉంటుంది దాని ధోరణి.  వీధిలో కెళ్ళిందా... మరి నన్ను పట్టించుకోదు. ఎవరెవర్ని చూసి అరుస్తుందో దానికే తెలీదు. ఒక్కోసారి బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటుంది. సడెన్ గా ఏమవుతుందో భౌ మని వెంట తరుముతుంది. వాళ్ళు వెంటనే కాళ్ళు పైకి ముడుచుకొని స్ ఫీడుగా వెళ్ళిపోతారు.  ముఖ్యంగా మోటర్ బైక్స్ మీద వెళ్ళే కుర్రాళ్ళు, పాలుపోసే వాళ్ళు,చెత్త ఎత్తేవాళ్ళని మాత్రం ఓ చూపు చూస్తుంది. దాని  ధర్మమా అని చాలామందికి బరువుగా ఉండే మా ఇంటి   గేటును సెకెండులో తీసి మెట్ల తలుపు వరకు హైజంప్ చెయ్యడంలో మంచి నేర్పు వచ్చేసింది. అలా చేస్తున్నప్పుడు వాళ్ళను చూస్తే నవ్వు, అలా అందరికీ మా వల్ల (కుక్కని పెంచడం)ఇబ్బంది కలుగుతోందే అనే బాధ జమిలిగా కలుగుతాయి నాకు.

మన రెండురెళ్ళు ఆరు గౌతమ్ లాగా మా మేడమీద ఆయనకి కూడా కుక్కలంటే పడదు. ఆశ్చర్యం....ఆయన పేరు కూడా గౌతమే. ఆయన భార్య, రెండేళ్ల కొడుకూ మా స్నోవీ అరుస్తున్నా పెద్దగా లెక్క చెయ్యరు. కిందకి వస్తారు. ఏయ్ అని ఓసారి అనేసి బయటకి వెళ్తారు. వస్తారు. కానీ ఆ గౌతమ్ మాత్రం మేడమీద నుంచే ఏయ్ అనుకుంటూ వచ్చి కొడతానన్నట్టుగా చెయ్యి విసురుతూ కిందకి దిగుతాడు. ఇంక ఇది దూరంనుంచి ఆయన చప్పుడు వింటూనే వీర తాండవం చేస్తూ ఉంటుంది.ఆయన దిగాక ఇద్దరూ సమానంగా కొంతసేపు అరుచుకుంటారు. ఆతర్వాత ఎలాగో మేము దాన్ని పట్టుకున్నాం అని నమ్మకం కుదిరాక ( దాన్ని కట్టేసి ఉన్నాసరే ) అతను కదులుతాడు.

రోజంతా కట్టేసి ఉంచుతానా.. ఎవరూ లేరులే అని ఐదునిముషాలు వదులుదాం అనుకుంటానా ....అప్పుడే ఎవరో ఒకరు గేట్ తీస్తారు. ఇంక దాని పాల బడ్డారా...కదలనివ్వదు. పైన అద్దెకున్న ఇంట్లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళని పైకి వెళ్ళనివ్వదు.

బొచ్చుకుక్క కదా గొలుసు వేసి ష్టైల్ గా దాన్ని షికారుతీసుకువెళ్దాం అనుకున్నామనుకోండి. మనకి చాలా శక్తి కావాలి. అలా నడుస్తున్నప్పుడు ఏ పిల్లినో చూసిందనుకో....ఇంక దాని మీద ప్రతాపం చూపించడానికి అది చేసే తాండవానికి ఇనప గొలుసు పట్టుకున్న మన చేతులు విరిగిపోతాయేమో నని భయం వేస్తుంది. అరచేతులు కోసుకుపోయాయి ఎన్నిసార్లో. అందుకని ఆ గొలుసు చివర ఒక కాటన్ తాడు కడతాను. చేతికి దాన్ని చుట్టుకొని దాంతో కంట్రోల్ చెయ్యాలన్నమాట.

పెరట్లో కట్టేద్దామా అంటే చెట్టుమీద పావురాలు, కాకులు సందడిగా తిరిగితే దానికి కిట్టదు. ఆ కొంచెం స్థలంలోనే కోపంగా గెంతుతూ అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉంచలేను, బయటికి పంపలేను అన్నట్టుగా ఉంటుంది నా పరిస్థితి.
ఇంటికి ఎప్పుడెప్పుడు ఎవరొస్తారో ఊహించడం, వచ్చినవాళ్ళు జాగ్రత్తగా తిరిగి వెళ్ళేలాగా కాపాడడం ఇలా నా బతుకు మాత్రం కుక్క బతుకయిపోయింది.

పన్నెండేళ్ళు రెండు కుక్కలు పెంచాం. ఎప్పుడు అవి ఇల్లు వదిలి బయటికి వెళ్ళేవి కాదు. ఎవరైనా వస్తే వెనక్కి వెళ్తూ కొద్దిగా అరిచేవికానీ మీద పడేవికాదు. బలవంతంగా చైన్ వేసి వాకింగ్ కి తీసుకెళ్ళాలని సరదా పడినా అవి ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవి కాదు.

ఈ స్నోవీ  స్వభావం పూర్తిగా విరుద్ధం. ఎప్పుడెప్పుడు గేట్ తెరవబడుతుందా, పారిపోదాం, ఎవరిమీదయినా అరుద్దాం అని చూస్తుంది. అన్నం పెట్టినా వెంటనే తినదు. ఎవరయినా వచ్చారని చూసి, బాగా వాళ్లమీద అరిచి వచ్చి దాని గిన్నెలో ఉన్నది తినేస్తుంది.

రెండుసార్లు రాత్రులు ఎక్కడికో వెళిపోయింది. ఒకసారి తొమ్మిది రోజులు రాలేదు. ఎక్కడో పోయిందో, దేనికిందయినా పడిందో అని ఎంతో దిగులు పడ్డాం. పోన్లే ఓ బాధ తప్పింది అని కూడా అనుకున్నాను.కానీ మనసొప్పలేదు. ఒకరోజు మద్యాహ్నం బాబాని ప్రార్థించాను. దాన్ని చూడాలని ఎంతో అనిపించింది. రాత్రి 9 గంటలకి ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు.. గబగబా ఇంట్లోకి వచ్చి కాళ్ళదగ్గిర కూచుంది. గేట్ ఎవరు తెరిచారో మరి.దానికి కొన్న మంచి బెల్టు, చెయిన్ మాత్రం దాని మెడలో లేవు. ఎవరయినా తీసుకెళ్ళి దీని అల్లరి భరించలేక మళ్లీ వదిలేసారేమో మరి.

మొత్తానికి ఇప్పటికి సంవత్సరం గడిచింది. ఇంట్లో అందరికీ బాగా అలవాటయిపోయింది. దానికి బంధాలెప్పుడు వెయ్యాలో, ఎప్పుడు వదలాలో ఆ పట్టు విడుపులన్నీ అందరికీ బాగా పట్టుబడ్డాయి.

కుక్కపిల్లకావాలి అని ఏడ్చి రాద్ధాంతం చేసిన పాప మాత్రం దాని బాగోగులు పెద్దగా పట్టించుకోదు. తిన్నదా లేదా, ఏం పెడుతున్నాం దానికేది ఇష్టం ఊహూ దానిగురించి ఏమీ తెలీదు. పెంపకం భారం మాత్రం నామీద పడేసింది. బాగా గొడవ పెడితే ఓసారి అలా తిప్పి తీసుకువస్తుంది. దాన్ని బయటకి తీసుకెళ్ళాలంటే ఎంత శక్తి కావాలో తెలిసిన నేను కూడా పిల్లలని గట్టిగా అడగడం మానేసాను.

మేం పెట్టే పప్పు అన్నం, అప్పుడప్పుడు గుడ్లు, రోజు పాలు బ్రెడ్డు.....ఇవి తింటేనే ఇంత ప్రతాపం చూపిస్తోంది. ఇంక నాన్ వెజ్ తింటే ఏమవుతుందో మరి. పాపం స్నోవీని చూస్తే జాలేస్తుంది కూడా. ఇవాళ భోజనంలోకి ఇది కావాలి అని అడగదు కదా అని.

ఇంట్లో ఎవరు ఉన్నా లేక పోయినా పట్టించుకోదు. కానీ నేను ఎక్కడికీ వెళ్ళకూడదు. ఆ విషయంలో చాలా తెలివితేటలున్నాయి దానికి. నేను ఎప్పుడు బయటకి వెళ్తానో దానికి ఎలా తెలిసిపోతుందో అని ఆశ్చర్యం వేస్తుంది. నేను బయటికి వెళ్లడానికి మొహం కడుక్కుని పౌడర్ వేసుకోవడం తో దానికి తెలుస్తుందేమో.(రోజూ మొహం కడుక్కోవు కాబోలు అని సందేహ పడుతున్నారా కొంపతీసి) ఇంక నస మొదలు పెడుతుంది. మీదకి ఎక్కిపోతు ఉంటుంది. తీసుకెళ్ళమని. చీరల్లో కూడా ఇంట్లో కట్టుకునేవి, బయటకి కట్టుకునేవి దానికి తెలుసేమో. ఇంట్లో చీర కట్టుకుంటే పట్టించుకోదు. మంచి చీర కట్టగానే దానికి అర్థం అయిపోతుంది. దాని కళ్ళు గప్పి జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే బండి, ఆటో వెనకాలే ఫాలో అయిపోతుంది. అందుకని బయటికి వెళ్ళాలంటే తక్కుతూ తారుతూ దొంగతనంగా వెళ్ళాలి నేను.

ఇది జాతి కుక్క కదా...ఊరకుక్కలకి వీటిని చూస్తే ఏదో కోపం.బయట కనపడితే బతకనివ్వవు. మొన్నొకసారి అదీ అయింది. వీథిలో పొద్దున్నే గేట్ దగ్గర నుంచుంది. వీథికుక్కలు ఎక్కడినుంచి వచ్చాయో, దీని మీద ఎంత కోపం పెట్టుకున్నాయో గానీ ఐదారు కుక్కలు దీన్ని ఈడ్చుకుపోయాయి. మెడ, కాళ్ళు కడుపుమీద దాడి చేసాయి. మా అమ్మ రాళ్ళతో కొట్టి ఎలాగో దానిని విడిపించింది. హాస్పిటల్ కి తీసుకువెళ్లి మందులు ఇంజక్షన్లు ఇప్పించాం. ఆ షాక్ తో మళ్ళీ రెండురోజులు మౌనం దాల్చింది.తర్వాత మామూలే. బహుశ  అప్పుడు కూడా ఏదో షాక్ లో ఉండి అరవలేదేమో.

ఇంతకీ సాయిబాబా నాకు వరమిచ్చాడా....నేను చేసిన ఏ పాపానికో శిక్షగా దీన్ని పెంచమని పంపించాడా ....ఊహు. అర్థంకావడం లేదు. బాబా(యే) చెప్పాలి.
ఇదే మా స్నోవీ.....