02 February 2011

బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు !!


భగవంతుడా,
         మా దగ్గరున్నవన్నీ తీసేసుకో,
         ధనం, ధాన్యం,
        ఇల్లు, పొలం,
        రాజ్యం, అధికారం,
        అన్నీఅన్నీ
        తీసేసుకో,
        మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్........
ఈ మధ్య ఒక బ్లాగులో చూసాను ఈ కవిత. 
బాల్యం అనే అనుభవానికి ఉన్న పవర్ అది.  పెద్దవాళ్ళయిపోయిన తర్వాత వెనక్కి  తిరిగి గత జీవితాన్ని తలపోసుకుంటే మధురాతి మధురమయిన స్మృతులన్నీ బాల్యానికి చెందినవే ఉంటాయి ఎక్కువగా. ఆ బాల్యంలో అనుభవించినవి ఆ సమయానికి కష్టాలు గా అనిపించినా ఇప్పుడు  తలచుకుంటున్నప్పుడు అవన్నీ  ముచ్చటలుగా మురిపిస్తాయి. 
మారిన సామాజిక పరిస్థితులలో పిల్లల బాల్య జీవితం ఇదివరకటి కన్నా సంక్లిష్టంగా తయారయింది. చదువులు, పరీక్షలు, అన్నిటిలో పోటీ తత్వం  పెరిగిపోయింది. తగినంత ప్రోత్సాహం లేకపోతే, సహకారం ఇవ్వకపోతే  ఈ పోటీలో వాళ్ళు గెలుపు సాధించడం కష్టమని, ఈ  గెలుపే ఇకపై  పిల్లల జీవన విధానాన్ని నడిపించనున్నదని అ(పా)ర్థం చేసుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుల చట్రాల్లో ఇరికించి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. రేపటి గొప్పపౌరులుగా తయారవడం కోసం పిల్లలు   తమ బాల్యాన్ని బలిపెట్టవలసి వస్తోందని చాలా మంది  పెద్దలు అర్థం చేసుకోవడం లేదు. 
ఆనాడు మనం అనుభవించిన ఆ అందమైన బాల్యాన్ని మన పిల్లలు  కోల్పోతున్నారే  అని చాలామందికి బాధగా ఉంటోందిప్పుడు. ఇప్పటి వాతావరణంలో అప్పటి ఆహ్లాదకరమైన వినోదం లేకపోవడం ఒక ఎత్తైతే - మరొక ప్రమాదకరమయిన వాతావరణం మనచుట్టూ అలముకొని మన పసిబిడ్డల మనసులను కలుషితం చేస్తోంది.  

 దానిమీద మనకి దృష్టి ఉందా అసలు.....????
ఇరవయ్యవ శతాబ్ది అర్థ భాగంలో సామాజిక వ్యవస్థలో  ప్రారంభమయిన మార్పు సమిష్టికుటుంబాల నుండి వ్యష్టి కుటుంబాల దిశగా మరలడం. మరొకటి స్త్రీ పురుష భేదం చాలావరకు సమసిపోవడం. సమాజంలో తమ వ్యక్తిత్వాన్ని, తమ స్వాతంత్ర్యాన్ని,ప్రతిభా విశేషాలను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలను సమానమైన ప్రతిభతో నిర్వహిస్తున్నారు ఇప్పటి స్త్రీలు. అందువలన గృహమే కదా స్వర్గసీమ అనే పాట ఔట్ డేట్ అయిపోయింది. లేచింది నిద్రలేచింది మహిళాలోకం అన్న పాత పాటే  లేటెస్ట్ అయింది.

భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళకతప్పని పరిస్థితులలో వారికి  పుట్టిన పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చే వరకు ఎవరి సంరక్షణలో ఉండాలన్నది ఒక సమస్య, స్కూలునుంచి వచ్చినా తల్లి తండ్రులు ఇళ్ళు చేరే వరకు ఎవరిదగ్గర ఉండాలన్నది మరో సమస్య. ఇక్కడే అమ్మమ్మలు, బామ్మలు, తాతగార్ల పాత్ర కీలకం అయింది.  తప్పని పరిస్థితులలో కేర్ సెంటర్లలో పిల్లలను అప్పగించినా అవకాశం ఉన్నంత వరకు పిల్లల అమ్మమ్మలు, నాయనమ్మలు తాతగార్ల సంరక్షణలో వారిని  ఉంచుతున్నారు అమ్మానాన్నలు. 
పగలు పదకొండుకి ప్రారంభం అవుతాయేమో టీవీలో సీరియల్స్, అక్కడినుండి రాత్రి పదకొండు వరకు కూడా టీవీలో  సీరియల్స్ సాగుతూనే ఉంటాయి. తెలుగే కాదు అన్ని భాషలలోను ఈ సీరియల్స్ ప్రభంజనం కొనసాగుతోంది. మిగిలిన భాషలేమోకాని మన తెలుగులో మాత్రం చాలా ఛానెల్స్ లో ఇతర భాషల నుండి డబ్బింగ్ చేయబడిన సీరియల్స్ చాలా వస్తున్నాయి. 
ప్రతి ఇంట్లో  వయసైన  ఆడవాళ్ళు, రిటైర్ అయిన మగవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం లేక ఇల్లు చూసుకునే  గృహిణులు చాలామంది ఈ సీరియల్స్ కి అలవాటుపడి ప్రతిరోజూ ఆ సమయానికి వాటిని  వదలకుండా చూస్తున్నారు. ఇదివరకులా అమ్మలక్కల కబుర్లు, ఇరుగుపొరుగు ఆడవాళ్ళు చేరి ముచ్చట్లు పెట్టుకోవడం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది. ఇంటికి ఎవరైనా వస్తే ఆ సీరియల్ ని చూడడం అవదేమో అని బాధపడేంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. 
పాతకాలపు ఇండిపెండెంట్ ఇళ్ళు చాలావరకు అపార్ట్ మెంట్స్ గా మారిపోయాయి. ఇళ్ళు చిన్నవైపోవడంతో, ముందు వాకిలి, వెనక పెరడు లాంటివి లేవుగా, అన్నీ ముందు గదిలోనే.  బియ్యం ఏరుకున్నా, కూరలు తరిగినా,  పిల్లలకు అన్నం తినిపించినా, మనం తింటున్నా అన్నీ ఆ టీవీ ముందే, ఆ సీరియల్స్ నేపథ్యంలోనే.

ఈ సీరియల్ ఏమిటి ఇలా ఉంది.... బాలేదు.. చూడకు అనడానికి ఇంట్లో ఎవరికీ వీలవదు. ఆ ఛానెల్ మార్చడానికి కూడా వీలవదు. బయటకి వెళ్ళి సాయంత్రం తిరిగివచ్చేసరికి  వాళ్ళకోసం అన్ని అమర్చి పెట్టి, వాళ్ళ పిల్లల అల్లరి భరించి టీవీముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న తల్లిదండ్రులను నొప్పించడం ఇష్టంలేక చాలామంది టీవీ సీరియల్స్ ను భరిస్తున్నారు. మర్యాదకో, చానెల్ మారిస్తే జరిగే గొడవకో భయపడే వాళ్ళు,  వీలయిన వాళ్ళు బెడ్ రూమ్ లో మరోటీవీ అమర్చుకొని వాళ్ళకు కావలసిన ఛానెల్స్ చూస్తున్నారు.
కానీ  స్కూల్లో చేరే వయసు ఇంకా రాని పిల్లలు, వెళ్ళినా మధ్యాహ్నం నాలుగుగంటలకల్లా ఇల్లు చేరుకొనే పిల్లలు అమ్మలు, అమ్మమ్మలేదా బామ్మ, తాత లతో పాటు చూసేవి టీవీ కార్యక్రమాలే. తల్లిదండ్రులు ఏ ఎనిమిది గంటలకో ఇల్లుచేరుకునేలోపల వాళ్ళు గడపవలసినది టీవీ ముందే. 
మరి టీవీల్లో చూపిస్తున్న సీరియల్స్ వాటిల్లో కథా కమామీషు, పాత్రలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా. గమనిస్తున్నారా. 
ఇంచుమించు ప్రతి సీరియల్ లోను ఒక గయ్యాళి  అత్తగారు, చేతకాని మామగారు, ఆరళ్ళు పెట్టే ఆడపడుచు, ఆవిడకి కూడా చేతకాని మొగుడు, అమాయకురాలై వీరందరి పాలబడి వారిచేత హింసింపబడే కోడలు వీటిలో ప్రధాన పాత్రలు . ఒకవేళ మరిది ఉంటే వాడు మంచివాడైతే వదినని సమర్థిస్తూ, ఆమెతో సంబంధం ఉన్నవాడిగా  కుటుంబంతో వెలివేయబడిన వాడౌతాడు. చెడ్డవాడైతే ఆ వదిన్ని ఇంటిలోంచి తరిమేయడానికి నడుం కట్టుకున్నవాడై  ఉంటాడు. 
ఇంక ఈ కథని ఎన్ని రకాల మసాలాలు వేసి వండి వడ్డిస్తారో రకరకాల ఛానెల్స్ లో చూడవచ్చు.

మరి కొన్ని సీరియళ్ళలో ఊరికే తమ కోడలిని బాధించడం తో సరిపెట్టరు. ఆమెకి విషం ఇచ్చి చంపేయాలని కుట్ర పన్నుతూ ఉంటారు. ఆ విషం వంటింట్లో ఉప్పు, పప్పుతో పాటు అత్యంత సహజంగా అలమారలో కొలువై ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్తను కోడలో, కోడలిని అత్తో, తోడికోడళ్ళో, మరుదులో ఒకరినొకరు  చంపడానికి వాడుకుంటూ ఉంటారు. కానీ వారి ప్రయత్నం సఫలమా, విఫలమా అన్నది తేలడానికి మాత్రం అథమం ఓ ఆరు ఎపిసోడ్లేనా పడుతుంది. 
 మరికొన్ని హారర్ సీరియల్స్. వీటిలో ఇవి మరీ ప్రమాదకరమైనవి.  పాత్రల హావభావాలు, కుళ్ళు , కుతంత్రాలు వీటితో ముఖ కవళికలతో చేసే విన్యాసాల వలన పుట్టిన హారర్ ఒకఎత్తు. కానీ కథలో మంచిపాత్రలను హింసించడం లో భాగంగా కడుపులో ఉన్న పిండాన్ని చంపడానికి, ఆస్తికి వారసులైన పిల్లలను చంపించడానికి చేతబడి వంటి క్షుద్రవిద్యలను, ఆ క్షుద్రవిద్యను ఉపాసించే మాంత్రికులను ప్రధానమైన పాత్రలుగా చూపించడం  మరొక ఎత్తు. ముఖ్యంగా పసిపిల్లల పై జరిగే హత్యాప్రయత్నాలు చాలా సీరియల్స్ కి ముడిపదార్థాలు. 
ఈ సీరియల్స్ కథలలో  భాషా భేదం లేదు. హిందీలో నైనా తమిళంలో అయినా తెలుగులో అయినా అదే కథ. అవే పాత్రలు. భాష మారుతుందంతే.

స్నిగ్థ మోహనమయిన రూపం, కోమలమైన నాజూకు శరీరం,అమాయకమైన చిరునవ్వు,దేవుడికి మారుపేరులా ఉంటారు పసిపాపలు... స్వచ్ఛమైన వారి పాల మనసులను విషపూరితం చెయ్యడం కాదూ ఈ కథలు చూపించడం అంటే.
ఇదిగో ఇలాంటి సీరియల్స్ మన వాళ్ళలో చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు మా అమ్మగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు. మన పిన్నో, అత్తో కావచ్చు. (గమనించినంతవరకు ఈ సీరియల్స్ ని ఉత్సాహంగా చూసే మగవారి శాతం అతి తక్కువ. అందుకనే ఆడవాళ్ళ పేరు చెప్పవలసి వస్తోంది).  కానీ వాళ్ళ దగ్గర పెరుగుతున్న పసిపిల్లలపై  ఈ టీవీ కార్యక్రమాల ప్రభావం ఎంతగా ఉంటుందో మనం గమనిస్తున్నామా?

మొన్న ఒక పదినిముషాలు టీవీ ముందు నిల్చున్నందుకు  ఒక సీరియల్లో ఒక ఎపిసోడ్  చూసాను. ఇద్దరు భార్యల సీరియల్ అది. ఒక భార్యకి పుట్టిన అమ్మాయికి పెళ్ళవుతూ ఉంటే ఎలాగైనా ఆ పెళ్ళికూతురిని చంపేద్దామని ఓ పాత్ర పాలల్లో  విషం కలిపి తీసుకొస్తుంది. ఆ విషం కలిసిన గాజు గ్లాసును మరో పాత్ర అందుకొని తాగేయబోతుంది. మనకి మూడుసార్లు మూతిదగ్గరకి గ్లాసును చేర్చడం చూపిస్తారు. కానీ ఆమె ఆ గ్లాసుని తాగకుండా పట్టుకొని ఇరవై నిముషాలు  గొడవ పెడుతూ మాట్లాడుతుంది. తర్వాత ఆ ....నా కడుపు నిండిపోయింది. ఇంక ఈ పాలెందుకు అని ఆ గాజుగ్లాసుని నేలమీద విసిరి, బద్దలు కొట్టి మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 
నాకు ఒళ్ళు మండిపోయింది. బహుశ కిందపడిన ఆ పాలను పిల్లో, కుక్కో తాగి చనిపోయినట్టుగా తర్వాత ఆరువందల యాభయ్యవ ఎపిసోడ్ లో చూపిస్తారేమో అనుకుంటా. కానీ పాలు తాగక పోతే ఓ టేబుల్ మీద అంచులో పెట్టినట్టో, చూడకుండా ఏ చిన్నపిల్లడో వచ్చి కింద పడేసి  పెద్దవాళ్ళు తిడతారని పారిపోయినట్టో చూపించవచ్చుగా. అడ్డగాడిదలా పెరిగి, ఆడదై ఉండి ఓ గాజుగ్లాసును నలుగురూ నడిచే దారిలో విసిరి పారేయడమా... పెద్దవాళ్ళే అలా ప్రవర్తించినట్టు చూపిస్తే ఇక పిల్లలకేం నీతి చెప్తాం !!
అలాగే  హింసించి ఆనందించడంలో భాగంగా నేలమీద నూనె పొయ్యడం, నడుస్తుంటే కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చెయ్యడం, కూర్చోబోతుంటే కుర్చీలు లాగేసి పడేయడం  అదే పెద్ద కామెడీలాగా అందరూ పడి పడి నవ్వడం చాలా సాధారణంగా చూపిస్తూ ఉంటారు.  

ఒకటా రెండా ఎన్ని సీరియల్స్!! ఎన్ని అరగంటలు!! వీటిలో అన్నో కొన్నో చూస్తూనే ఉన్నారు పిల్లలు.  బామ్మఒళ్లో ఆడుకుంటూ, తాతపక్కన సోఫాలో దొర్లుతూ... కొన్ని వాళ్ళంతట వాళ్ళు  చూడకపోయినా చెవిలో పడేలా దడదడలాడే మ్యూజిక్ తో వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి.
 పైగా పాత్రలు మాట్లాడుకునే భాష ఎంత సంస్కారంగా ఉంటుంది అంటే....
ఒసే, నువ్వయిపోయావే..., నిన్ను మసిచేస్తానే,  నిన్ను లేపేయడం నాకు చిటికెలో పనే. ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్... నువ్వసలు ఒక అమ్మకీ అబ్బకీ పుట్టి ఉంటే రారా...రేయ్.. నువ్వు మగాడివే అయితే....ఇదీ ధోరణి.
మనం చందమామను  చూపిస్తూ  అన్నం పెట్టే అమ్మని చూసాం. అదే అమ్మ అమ్మమ్మగా  మనవలను ఆడించే దశకి వచ్చేసరికి ఎంత మారిపోయింది.... ఇప్పుడు చందమామని కాదు టీవీ చూపిస్తున్నారు. అన్నం పెడుతూ. చూడమ్మా... చూడు... ఆ దొంగ ఆ అమ్మాయిని చంపేస్తాడు చూడు....అమ్మో...గబ గబ తినేయమ్మా... వాడిచేతిలో కత్తి చూసావా...అమ్మో... ఇలా ఉంటుంది ఆ సన్నివేశం.
టీవీ సీరియల్స్ లో  చంపడం, చంపించడంతో పాటు  రేప్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటున్నాయట. ఈమధ్యో ఏదో సీరియల్ లో ఈ రేప్ సన్నివేశం చూసానని, ఒకంతట ఆ సీన్ ముగియలేదని, కంపరం పుట్టిందని  తెలిసిన  అమ్మాయి చెప్పింది.
చిన్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలు గానీ, హత్యలు, ఫైటింగ్స్ కానీ ఉన్న సినిమాలు చిన్న పిల్లలు  చూడకూడదని, చెడిపోతారని అనేవారు తాతగారిలాంటి పెద్దవాళ్ళు. ఇప్పుడవన్నీ టీవీ రూపంలో నట్టింట్లోకి నడుచుకొని వచ్చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం. మన కళ్ళెదుటే మన పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉంటే మనకి పట్టనట్టుగా ఉండిపోతున్నాం. 
క్రైం, హింస, శాడిజం ఇవన్నీ మూసపోసిన పాత్రలతో, వండిన సీరియల్స్ ని మనమంతా ఎందుకు ఎలా భరిస్తున్నాం? పూర్వం  ప్రతినాయకుడు అంటే విలన్ పాత్రలో ఇలాంటి లక్షణాలన్నీ మూర్తీభవించి ఉండేవి. నాటకాలలో ఇలాంటి పాత్రలు చూడడం వలన మనలో రసోత్పత్తి కలిగి మన మనసులో ఉన్న కుళ్ళు, కల్మషం కరిగిపోయి స్వచ్ఛంగా  మారుతామని మన రసవాదులు చెప్తారు. 

బహుశ మనవాళ్ళు,  మన బాహ్య ప్రపంచంలో బహు మంచివాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఈ సీరియల్స్ లోని దుర్మార్గపు పాత్రలను  పదే పదే చూసి వాళ్ళ భావాలను తాము కూడా  అనుభవిస్తూ  తమలో ఏ కాస్తైనా ఉన్న చెడుని, చెడు తలంపులని కడిగేసుకొని స్వచ్ఛంగా మేలిముత్యాలలా మారిపోతారా...
లేదా.....
నీతి నిజాయితీలతో బాధ్యతగల ఆదర్శవంతమైన రేపటిపౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత గల  పెద్దలు - ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు తమ తెలివితక్కువ తనంతో  నేటి బాలలే రేపటి క్రిమినల్స్ అన్న కొత్త నినాదానికి తెరతీస్తారా. సమాధానం ఎవరు చెప్తారు?!!


(కలభాషిణి  రాసిన సరదా పోస్టుకి ఇది సీరియస్ కొనసాగింపు)