13 May 2010

నేను.....



నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి రాకెట్లో నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో మీరు.....

నిప్పులకొలిమిని పడి అత్తారింట్లో
నేనంతా పిడికెడు నివురై పోతే
నిమ్మకు నీరెత్తినట్టు మీరే......

(మహాకవి శ్రీశ్రీ ఆః కవిత ఆధారంగా)

10 May 2010

ఆడపిల్లకి ఈడొస్తే....

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినంతనె పుట్టదు.జనులాపుత్రుని కనుగొని పొగడగ - పద్యం చాలా మందికి తెలుసుగా. కొడుకు పుట్టినప్పుడు కాదని,ఆ కొడుకు అందరితో గుర్తించబడి మంచి పేరు తెచ్చుకున్నప్పుడే  తండ్రికి తనకు కొడుకు పుట్టినందుకు సంతోషం కలుగుతుందని కదూ దాని అర్థం.
నాకు పుత్రికోత్సాహం కలిగింది. ఆడపిల్లని కన్నందుకు నన్ను మురిసి ముక్కలయ్యేలా చేసిన రోజు - ఆ రోజు ఇంత త్వరగా చూస్తానని అనుకోలేదుస్మీ.....ఆహా ....మా అమ్మాయి ఏ ఎంబీయేవో పాసయి అమెరికా వెళ్ళి పోతోందో, లేక మంచి ఉద్యోగం సంపాదించిందో అనుకుంటున్నారా...అబ్బే...ఇంకా పదోక్లాసులోకి పూర్తిగా ప్రవేశించందే... మరెలా కలిగిందంటారా ఈ పుత్రికోత్సాహం....చెప్తా.
ఇవాళ మదర్స్ డే ట.
అంటే తల్లుల దినోత్సవం అన్నమాట. కొత్తగా మన సంస్కృతిలోకి వచ్చిపడిన పండుగల్లో ఇదొకటి. మా చిన్నప్పుడు మేం వినలేదు. ఇప్పటి వాళ్ళకి సంక్రాంతి, దసరా, ఉగాది లాంటి పండుగలెప్పుడొస్తాయో తెలీదు కానీ, వాలెంటైన్స్ డే, విమెన్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే ఇంకా చెప్పాలంటే హాలోవిన్ డే (ఇంకోలా పలుకుతారేమో కూడా నాకుతెలీదు....ఖర్మ) ఇలామనం చేసుకోని  బోల్డు పండుగల పేర్లు అవెప్పుడెప్పుడో మాత్రం  బాగా తెలుసు.ఇంకా కిస్ డే, హగ్ డే, చాక్లేట్ డే, ప్రామిస్ డే అని చాంతాడంత లిస్టు చదువుతున్నారు - ముఖ్యమయిన రోజుల గురించి అడిగితే. మూడేళ్ళ గుంటడు కూడా హాపీ ఫలానే డే అంటున్నాడు.  ఇండియాలో చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటున్నామో అడిగితే చెప్పగలిగే పిల్లలను వేళ్ళమీద లెక్కెట్టొచ్చేమో. 
సరే...పొద్దున్నుంచి టీవీలో అన్ని ఛానెళ్ళ లోను హోరెత్తించేస్తున్నారు...ఇవాళ మదర్స్ డే అహో...అని. అమ్మ గొప్పదనాన్ని వర్ణిస్తూ...అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట లాంటి
.మూలన పడేసిన రికార్డుల దుమ్ము దులిపి పెదవే పలికిన మాటల్లోన...లాంటి కొత్తపాటలతో కలిపి వినిపిస్తున్నారు.
అమ్మకి ఒత్తిడి ఎక్కువగా ఉందని తగ్గించాలంటే ఏం చెయ్యాలో చర్చలు చేస్తున్నారు. అమ్మకి పాదాభివందనమంటూ పాటలు,మాటలతో  ఏ ఛానెల్ పెట్టినా అమ్మే...ఓహో.... నేను కూడా అమ్మనే కదా...అన్నీనాకోసం కూడా అని పులకరించిపోయాను.
పొద్దున్నుంచి సెల్ ఫోన్ తియ్యలేదు ఈ రోజు. అంటే ఎవరూ ఫోన్ చెయ్యలేదన్నమాట - అందువల్ల. కానీ పావుగంటకోసారి సెల్ ఫోన్లో మెసేజ్ అలర్ట్ టోన్ మాత్రం వినిపిస్తూనే ఉంది. పిల్లలు చూసుకుంటారని ఎస్సెమ్మెస్ లు పట్టించుకోను మామూలుగా.. వాళ్ళు మా పిన్నిగారింటికి వెళ్ళారు శలవలని. ఇవాళ మదర్స్ డే కదూ.  మా చెల్లి ఏదో కవిత రాసే ఉంటుంది. దాన్ని మెసేజ్ గా సెల్ ఫోన్ ద్వారా పంపించడం దానికి అలవాటు. చూడక పోతే నొచ్చుకుంటుంది. చూద్దామని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నానా....అబ్బో.....ఎన్ని పేర్లో....ఆ పేర్లు నేను అంతగా విన్నవి కాదు. అంటే  ఈ కాలం పేర్లన్న మాట. ప్రద్యోష్, అశుతోష్, అక్షిత్, లక్షిత్, మోనిష్, అబ్రకదబ్ర, లాటివి. ఖచ్చితంగా అవన్నీ మా గుంటపాప స్కూలువాళ్ళ మగ పేర్లే అయుంటాయి. దానికి ఏం మెసేజ్ లు పంపుతున్నారా...అని చూద్దును కదా...
నాకు షాక్ తగిలింది.....దాదాపు నలభై మెసేజ్ లు. అన్నీ నన్ను  సంబోధిస్తున్నవే.. నాకోసం వచ్చినవే.
.ఆంటీ....హాపీ మదర్స్ డే....ఇంత మంచి(?) అమ్మాయిని కన్నందుకు మీకు అభినందనలు, ఆంటీ ఇంత మంచి(?) ఫ్రెండుని కనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు...మీరు నూరేళ్ళు చల్లగా హాయిగా ఉండాలి.......ఇలా.కొన్ని దాని పేరున ఉన్నాయి. వాటిలోనూ -  మీ అమ్మకి హాపీ మదర్స్ డే. నీలాంటి అమ్మాయిని ఫ్రెండుగా కనిచ్చినందుకు అని నన్ను ఉద్దేశించి రాసినవే.
ఆహా.....అమ్మాయిని కన్నందుకు అమ్మగా నా జన్మ తరించిపోయిందన్నమాట. పుత్రికోత్సాహం కలిగించిన మైమరపుతో అవాక్కయ్యాను....
ఆధునిక జీవితం వరప్రసాదంగా  ఇచ్చిన సెల్ ఫోన్,  ఇంటర్నెట్ పిల్లలకు శాపంగా మారకూడదని జాగ్రత్త పడుతూ ఉంటాను. ఓకంట కనిపెడుతూ ఉన్నాను అనుకున్నాను ఇన్నాళ్ళూ.
చిన్ని తల్లీ నిను కాచగా....వేయి కళ్ళైనా సరిపోవులే...అనుకుంటూ ఇంద్రుడిని వెతుక్కుంటూ బయలుదేరాను.....కళ్లు అరువిస్తాడేమోనని.

07 May 2010

మనమీదేనర్రోయ్......

ఆడవాళ్ళని మగవాళ్ళు ఎప్పటికీ పూర్తిగా  అర్థం చేసుకోలేరు. అర్ధ(సగం)మే చేసుకుంటారు. కొండొకచో అపార్థం కూడా చేసుకోగలరు. అర్థం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంలోంచే గా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే మాటలు, పాటలు పుట్టాయి మరి.....
ఆడవాళ్ళనర్ధం చేసుకొనే ప్రయత్నంలో ఈ మధ్య కొందరు ఇంజనీర్లు ఇలా కనిపెట్టేరుట. ఏదో ప్రయత్నం చేస్తున్నార్లెండి పాపం....
 ఆ పరిశోధనలో ఏం తేల్చారో మీరూ చూడండి. నవ్వొస్తే నవ్వుకోండి

. ఇందులో కొన్ని నిజాలున్నాయని మీకనిపించినా ఎవరికీ (ముఖ్యంగా మీ శ్రీవారికి) చెప్పకండేం...... అదిగో చూసావా...నేనప్పుడే చెప్పలా...మీ ఆడవాళ్ళింతే, ఆ ఇంజనీర్లు చెప్పారుగా  అంటూ బడాయిలు పోతారు. ఈ పరిశోధనలో ఆవగింజంతైనా నిజంలేదని తీవ్రంగా ఖండించేయండేం.....