04 February 2012

కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే !!

.హలో హలో బ్లాగు మిత్రులారా, ఇంకా చాలా  బోల్డు మంది మాజీబజ్జు మిత్రులారా, ప్లస్సు ప్లస్స్ మిత్రులారా!!


ఉపన్యాసమో, సాహిత్యంమీద చిరు వ్యాసమో అనుకొని పారిపోతున్నారా..హబ్బే లేదు. ఆట్టే బోరు కొట్టే విషయం కాదులెండి. లైట్ గానే ఉంటుంది. కాస్త హెల్దీ కూడాను. ఓ మాటిటు రండి చెప్తాను.

మరే - నిన్న నాకు ఓ ఆదివారం అదే  అల్లప్పుడు న్యూఇయర్ రోజున, ఆ జనవరి ఆదివారం ఆంధ్రజ్యోతి కాపీ ఓ మిత్రుడింట కంటపడింది. మన వాళ్ళందరి బ్లాగు పోస్టులూ ఎత్తిపోతల పథకంలో యాతమేసి తోడేసుకొని కనీసం  ముందస్తుగా ముందుమాటయినా అడక్కుండా,  ఆముక్క ముందుమాటలోనయినా రాయకుండా వాడు చేసిన పని మళ్ళీ మళ్ళీ అలా కళ్ళముందు కనిపిస్తూ ఉంటే ఒళ్ళు ఎలా మండిందనుకున్నారూ. పైగా  “నవ్వొస్తే ఆ బ్లాగ్ స్పాట్లు తెరిచి వాళ్ళకు షుక్రియా చెప్పండి. లేదండే గప్ చుప్ సాంబారు బుడ్డీ అని ఓ కొసరుమాటొకటీ. అగ్నిమీద ఆజ్యం పోసి మండించడమా మరీనా.

సరే దీనికంతటికి ఈ రైటుక్లిక్కూ,   ఆ కంట్రోలు సి, కంట్రోలు వి లే  కదా కీలకాలు అనుకున్నాను. అందుకే నా కంప్యూటర్ తెలివి లోంచి  కొంచెం తీసి (అమ్మమ్మ ఇచ్చిన ఆవకాయ,  జాడీలో ఎంతున్నా హార్లిక్సు సీసాడే తీసి వాడుకోడం అలవాటు కదా మనకి)  తెలిసినంతలో వెతికితే ఓ మార్గం దొరికింది. ఈ రెండు మార్గాలను నివారించి కనీసం మనలాగే  పేద్దగా కంప్యూటర్ నాలెడ్జీ లేని  విలేర్ల కయినా, లేదా ప్రొఫైల్లో కవితలు,  కథలూ రాయడం హాబీ అని ముందస్తుగా రాసేసుకుని తీరా ఏం రాయాలో తెలీక "వండుకున్నమ్మకి ఒకటే కూర, దండుకున్నమ్మకి అరవై నాలుగు వెరైటీలనే" సామెతని బాగా సాధన చేసేసి వచ్చి ఇరుగింట్లోంచి పొరుగింట్లోంచి కావలసినవన్నీ ఎత్తుకొచ్చేసి , "ఇదిగో ఇది నాదే" అని గాఠిగా అరిచ్చెప్పే అరువు బ్లాగర్లనుంచి   బ్లాగు పోస్టులని కొంచెం దాచుకుని  అందీ అందకుండా ఊరించి కుంచెం  కుంచెం ఏడిపిద్దాం అనుకున్నవాళ్ళ కోసం అన్నమాట ఇది. 

కోతికి కొబ్బరికాయ దొరికితే ఆకలేసినప్పుడు పనికొస్తుంది లెద్దూ అనూరుకుంటుందా . ఉండదు కదా. అందుకే మన బ్లాగర్లలో తోచిన వాళ్ళ బ్లాగులు తీసి కాపీ, పేస్టు చెయ్యడం మొదలు పెట్టాను.
చిత్రం...  చూద్దునుకదా..
కొత్తావకాయ, తోటరాముడు, నవ్వితేనవ్వండి, మధురవాణి, కృష్ణప్రియ డైరీ, నా స్పందన, జాజిపూలు,  వైయేరమణ, రానారె , గోలిసోడా,

కొత్త  సంవత్సరం పొద్దున్నే మనవాళ్ళందరికీ మూడు, మూడుముక్కలు చేసి పడేసి,  ఆంధ్రజ్యోతివాళ్ళు ఎత్తి పెట్టేసి అచ్చేసిన టపాలున్న  బ్లాగులివన్నీ....  అన్ని   బ్లాగిళ్ళకీ వెళ్ళొచ్చా.... అక్కడ ఎత్తి పోతల పధకం సవ్యంగా పారేందుకు సకల సదుపాయాలు అలరారుతూ కనిపించాయి. వేటికీ కనీస రక్షణలేదన్న సంగతి గమనించి "హడ్డెడ్డే....ఇక్కడుందన్నమాట విషయం" అనుకున్నాను.  మామూలు కంప్యూటర్ జ్ఞానం ఎబిసిడితో ఆగిపోయినవాళ్ళకి కూడా తెలిసిపోయే చిట్కాలతో ఇంతింత వజ్రపుతునకలు  అమాంతంగా, అయాచితంగా  అందుతుంటే వద్దనుకునే తలకు మాసినవాడెవడుంటాడు మరీ. ఆంధ్రజ్యోతి ఒక్క విషయంలో అయితే ఒకేసారి పేర్లతో సహా వెయ్యడం వల్ల పోల్చుకున్నాం కానీ ఇంకా ఎన్ని బ్లాగుల్లో ఎన్నిటపాలు పట పటమంటూ పత్రికల్లో ఈపాటికే రాలిపోయాయో.
రాలిపోయే పువ్వా.. నీకు రాగాలెందుకే అంటూ వాటిమీద ఆశలూ, నీళ్ళూ, నువ్వులూ వదిలేసుకోకుండా ఏదేనా చెయ్యొచ్చుకదా ..కనీసం టెంపరవరీగానయినా.

అందుకే బ్లాగు మిత్రులారా, మాజీ బజ్జు మిత్రులారా, ప్లస్స్ ప్లస్సు మిత్రులారా !!
ఒక్కమాటు ఇటురండి. ఒక్కమాట వినిపొండి.
మన  జాతీయబ్లాగు సంపదని విజాతీయులు జాతీయం చేస్తుంటే ఊరికే గుడ్లప్పగించి చూడాలా...ఇంకానా ఇకపై చెల్లదు...... అంటూ నినదించద్దూ..సరదాకైనా.
అబ్బబ్బబ్బ... అరిచీ, పిలిచీ అలిసిపోయాను కానీ. ఇలా చూడండి. ఇక్కడ వరసాగ్గా నేను చెప్పినట్టు స్టెప్పులేసి చెప్పిన మాట వినండి మరి.

ఇది మీ బ్లాగులోని కంటెంట్ ని సెలెక్టు చేసి కాపీ చేసి ఎక్కడంటే అక్కడ పేస్టు చేయడానికి వీల్లేకుండా చేసే కోడ్.

మీబ్లాగింటి బెల్ కొట్టి లోపలికి ( సైనిన్ చేసి)  అలా ఎంటరయిపోవడం.
కుడిపక్క కనిపించే మీటల్లోంచి-
డిసైన్  అన్నది ఎంచుకొని, అందులోనుంచి  ఇప్పుడు పేజి లే అవుట్ అనే దాన్ని ఎంచుకోవడం.
పేజి లే అవుట్ లో న్యూ గాడ్జెట్ ని  ఎంచుకోవడం.
మీ బ్లాగులో చేర్చదగినవంటూ వచ్చిన  (వీటిని విడ్జెట్టులంటారు లెండి) లిస్టు లోంచి హెచ్ టి ఎం. ఎల్ కోడ్ మీద నొక్కడం.
అప్పుడు వచ్చిన బాక్స్ లో (పైన పేరు పెట్టడానికి ఉన్నట్టు హెడ్డింగ్ కి జాగా ఉంటుంది వదిలేయండి) కింద భాగంలో ఇక్కడ నేనిచ్చిన కోడ్ ని కాపీ చేసి (రైటుక్లిక్కుతో మౌస్ని నొక్కి కాపీ అన్నదాన్ని ఎంచుకుని లేదా       కంట్రోలు ప్లస్ సి తో కాపీ చేసిగాని),  మళ్లీ  ఆ  మీ బ్లాగులో పేస్టు( రై ట్ క్లిక్కు నొక్కి పేస్టుఅన్నదాన్ని ఎంచుకుని లేదా కంట్రోల్ ప్లస్ వి నొక్కి) చేయడం 
చేసిన తర్వాత సేవ్ అనడం అంతే.

సేవ్ అయిన తర్వాత ఒక్కసారి మీ బ్లాగులోని విషయాన్ని కాపీ చేద్దామని చూడండి...హుర్రే..

ఓసారి కమిటయితే మీ బ్లాగే మీ మాట వినదు మరి.
ఇదీ అలా అతికించాల్సిన కోడ్.
( ఈకోడ్ ని కాపీ పేస్టు చేస్తే తప్పులేదా అని అడక్కండేం...అఘముఁ బొందడధిప.. అంతే )  

ఇదిగో ఇక్కడ ఈ పేజీలో  http://www.itechcolumn.com/2011/11/how-to-disable-copy-text-on-blogger.html  ఇంగ్లీషులో ఎలా చెయ్యాలో వివరంగా ఉంది. ఈ కోడ్ ని నా బ్లాగులో కాపీ పేస్టు అవకుండా ఎవరో కానీ కుట్రపన్నేరు.  ఇలాక్కాదని చెప్పి ఇమేజ్ ఫైల్ పెట్టాను. కానీ మరి మనకి పని కాదు కదా..అందుకనీ ఈ వెబ్ సైట్ లో చెప్పినట్టు చేసేసి ఆ కోడ్ ని గాఠిగా అతికించేయండి.


మీరు  ఇలా ఈ కోడ్ ని చెప్పినట్టు చెప్పిన చోట అతికించారనుకోండి...కొంచెం సేపు కాలరెగరేయొచ్చు.
నా అంతవాడు నేనే అనుకుంటూ బుడుగ్గాడి బ్రదర్లా పోజివ్వచ్చు. దీనికి తగ్గ  చిట్కాలు అవీ వాళ్ళు (అదే ఆ  విజ్ఞత గల దొంగలు)  ఆనక కనిపెట్టుకుంటారనుకోండి. కానీ అందాకా  మనకదో తుత్తి కదా.

సరే........ఇది చేసాం. దొంగతనానికొచ్చినవాడు మన సొమ్ముని ఎత్తుకుపోలేడు...అనుకుందాం. కానీ కంప్యూటర్ జ్ఞానంలో ఏబీసీడీలు తో పాటు జీహెచ్ఐజే లు కూడా  నేర్చేసుకుని ముందుకెళ్ళిన బ్లాగర్లు కొంచెం సందేహపడొచ్చు. మరి ఆ దొంగసారు వాడు మన పోస్టుని స్క్రీన్ షాట్ తీసేసుకుని, ఎత్తి రాసేసుకుని మరీ ఎత్తుకుపోతేనో అని...

హహ..కానీ  ఈ దొంగదారికి మాత్రం మంచి అడ్డ దారి నాకు తెలీదు. ఫర్లేదు...స్క్రీన్ షాట్లనే ఫెసిలిటీలు ఉన్నా వాటిలో  వాడికంత తెలివో, కనీసం  ఓపికో ఉంటే  ఎత్తి రాసుకునే బదులు సొంతంగా రాసుకుంటాడు లెండి.

లేదంటారా......
ఆమాత్రం కష్టపడి కాపీ కొట్టినందుకు చప్పట్లు కొట్టి అభినందిద్దాం..(ఇంకేం చేయలేం గనుక...) రావిశాస్త్రిగారి కష్టార్జితం కథలో  దొంగ  ఇంట్లో దూరి తన కష్టార్జితం  సొమ్ముమొత్తం దోచుకెళ్ళాడని బాధపడుతున్న ఇంటి యజమానిని ఓదార్చడానికి పక్కింటివాడు వచ్చి 'రాత్రంతా కిటికీ ఇనపఊచలు కోసి  ఆ దొంగ ఎంత కష్టపడ్డాడో..వాడికి కష్టార్జితం గొప్పగా దొరికిందని ఎందుకు అభినందించకూడదూ'  అని అనుకుంటాడు. అలాగే మనం కూడ ఓ నిట్టూర్పు విడిచి సంతోషించొచ్చును లెండి.

ఇదిగో సాఫ్ట్ వేరు కుర్రాళ్ళూ...ఇది నేనిక్కడ చెప్పానని, "ఓ గొప్ప, మాకు తెలీదా" అని అనుకుని ఊహూ తెగ ఫీలయిపోయి మరీ కోపం తెచ్చుకోకండేం. ఇది చాలా చిన్న విషయమని దీనికి కూడా మరో విరుగుడు( అదే మళ్ళీ కాపీ చేసేమార్గం) కూడా ఉందని అనొచ్చు మీరు. కానీ ప్రస్తుతానికి మాకీ మందు చాలు. మీకు తెలిసినవి మరోసారి,  మాకోసారి చెప్పండి మరి.
( ఏంటీ..ఇన్నీ చెప్పి- శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందిట లాగా నేను ఎందుకు ఈ కోడ్ పెట్టుకోలేదూ అనుకుంటున్నారు కాబోలమ్మా... కొందరు పరిశోధకులు. మరేంలేదు. మహాత్ములేం చేసినా  లోక కల్యాణం కోసమే...మరి నేనురాసిన కోడ్ కాపీ పేస్టు కాకపోతే నా పోస్టు గతేం కానూ...? )

ఇంకా కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే... అంటూ ఇలా కాస్త తెలిసినవాళ్ళంతా,  కాస్తే తెలుసున్న వాళ్ళకి కాస్త కాస్తన్నా జ్ఞానామృతం పంచిపెడితేనే గానీ,  లేకపోతే ఆ అమృతం కాస్తా విషమయిపోదూ.