19 August 2010

నాన్న.....ది గ్రేట్ !!


నాన్న.....ది గ్రేట్ !!

ఒక్కొక్క వయసులో కొడుకు తండ్రి గురించి ఎలా అనుకుంటాడో చెప్తూ ఒక మెయిల్ వచ్చిందీమధ్య.
చదివేక నిజమేస్మీ అనిపించింది.

 నాలుగేళ్ళ వయసులో-
మా నాన్న చాలా గొప్పవాడు.

ఆరేళ్ళ వయసులో-
మానాన్నకి అందరూ తెలుసు.

పదేళ్ళ వయసులో -
నాన్న మంచివాడే కానీ కొంచెం కోపం ఎక్కువ.

 పన్నెండేళ్ళ వయసులో-
 నేను చిన్నప్పుడు నాన్న ఎంత ముద్దుగా చూసుకొనేవాడో.

పధ్నాలుగేళ్ళ వయసులో-
నాన్నకి చాదస్తం బాగా  ఎక్కువయిపోతోంది.
  
పదహారేళ్ళ వయసులో-
నాన్న ఈకాలంలో ఉండాల్సిన వాడు కాదు.

 పద్ధెనిమిదేళ్ళ వయసులో-
 మా నాన్న భలే తిక్క మనిషి.

ఇరవై ఏళ్ళ వయసులో -
అబ్బ....నాన్నని  భరించడం  రోజు రోజుకి కష్టమయిపోతోంది. అసలు అమ్మ ఎలా వేగుతోందో ఈయనతో.

ఇరవై ఐదేళ్ళ వయసులో-
ఏం చేద్దామనుకున్నా ఈ నాన్న వద్దంటాడు...

ముప్ఫై ఏళ్ళ వయసులో-
రాను రాను వీణ్ణి (నా కొడుకుని) పెంచడం కష్టమయిపోతోంది. మానాన్నంటే నాకెంత భయం ఉండేది.

నలభై ఏళ్ళ వయసులో-
నాన్న నన్నెంత క్రమశిక్షణతో పెంచారు. నేను కూడా అలాగే పెంచాలి వీడిని(కొడుకుని)

నలభై ఐదేళ్ళ వయసులో-

నాన్న మమ్మల్ని ఇంతబాగా  ఎలా పెంచారో ఆశ్చర్యంగా ఉంది.

యాభై ఏళ్ళ వయసులో-
మమ్మల్ని పెంచి పెద్దచెయ్యడానికి  నాన్న చాలా కష్టాలు పడ్డారు. నేను ఒక్క కొడుకుని పెంచడానికి ఇంత అవస్థ పడుతున్నాను.

యాభై ఐదేళ్ళ వయసులో-
మానాన్న చాలా ముందుచూపుతో, చక్కగా  మా భవిష్య్తత్తుని తీర్చిదిద్దారు.  నాన్నకి నాన్నే సాటి.

అరవై ఏళ్ళ వయసులో-
మా నాన్న చాలా గ్రేట్.

నాలుగేళ్ళ వయసులో ఊహ తెలిసిన దగ్గరనుండి చూస్తున్న నాన్నని, నాన్నలోని గొప్పదనాన్ని తెలుసుకోవడానికి యాభై ఆరేళ్ళు పట్టిందన్నమాట.

తల్లి, తండ్రి లోని విలువని తెలుసుకోవడానికి, వారికి మనపై గల ప్రేమలోని ఔన్నత్యాన్ని గ్రహించడానికి ఓ జీవిత కాలం అవసరమైందన్నమాట.

అమ్మ,నాన్న క్రమశిక్షణ పేరుతో  చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు  పిల్లలకి విసుగు కలిగిస్తాయి.ఆ నిర్ణయాల వెనుక తమ సంతానం భవిష్యత్ ని తీర్చిదిద్దుకోవాలనే తపనని  వయసులో చిన్న వాళ్ళైన పిల్లలు అర్థం చేసుకోలేరు. తమని కట్టడి చేస్తున్న తండ్రి లేదా తల్లి లోని కాఠిన్యాన్నే తప్ప దాని వెనక ఉన్న నవనీతంలాంటి ప్రేమాస్పద హృదయాన్ని గుర్తించలేరు.

క్రమశిక్షణతో పిల్లలను పెంచిన తల్లి తండ్రులకు, తమ కాళ్ళమీద తాము నిలబడి వ్యక్తిత్వం సంతరించుకోగలిగే పిల్లలనుండి ఎదురయ్యేవి  తీవ్ర నిరసనలూ, పరుషమైన పదజాలంతో కూడిన మాటలు.
ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు కలిగి వారికి అమ్మా నాన్నగా ఉన్నప్పుడు, తమ అమ్మ , నాన్న తమను పెంచినట్టే  తమ పిల్లలను పెంచాలనుకుంటారు. నా పిల్లలు అమాయకులు, వారికి ఏమీ తెలియదు, అన్ని జాగ్రత్తలతో వాళ్ళని కాచుకోవాలి అనుకుంటారు. ఈ జాగ్రత్తలు తరువాతి తరానికి అతి చాదస్తంగా కనిపిస్తాయి. తమ స్వేచ్ఛా జీవనానికి సంకెళ్ళుగా తోస్తాయి.  ఆ పిల్లలు తమను లక్ష్య పెట్టకుండా ప్రవర్తించినప్పుడు కానీ తాము కూడా అలాగే చేసామన్న విషయం గుర్తురాదు.
 జీవితాన్ని సగ భాగం గడిపితే కాని ఈ  జీవిత తత్వం బోధపడదు. ఎంతో సహజమైన విషయం, ప్రతి తరానికి అనుభవం ఇది.

అప్పుడు అమ్మ నాన్న మీద ప్రేమ పొంగుకొస్తుంది. ఆ ప్రేమ వరదలో వారిని ముంచెత్తేయాలనిపిస్తుంది. కానీ....
ఆ ప్రేమని అందుకోవడానికి వాళ్ళు ఉండాలిగా...ఉంటే అదృష్టమే.
కానీ.....

 వయసు మనని రోజురోజుకి పెంచినట్టుగానే మన అమ్మ నాన్నని కూడా పెంచుతుంది. వయసుతో పాటే మృత్యువు కూడా వెంట తరుముతుంది.
పెరుగుతోంది వయసని అనుకుంటాము ,
 కాని తరుగుతోంది ఆయువని తెలుసుకోము.....
 ఎంత అక్షరసత్యాలు కవి మాటలు.....

అందుకే అమ్మ నాన్న ఏం చేసినా మన కోసం, మన సుఖ సంతోషాల కోసం, ఉజ్వల భవిష్యత్ కోసమే చేసారని పిల్లలు అర్థం చేసుకోవాలి.  అమ్మా నాన్నలని అపార్థం చేసుకొనేముందు ఆ కోణంలో ఆలోచించి చూడాలి.  వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా పెద్ద మనసుతో క్షమించగలగాలి.
వాళ్ళు వయసు పెరిగి మళ్ళీ  పసిపాపలై పోతే  మనం వాళ్ళకి అమ్మగా, నాన్నగా మారాలి. వాళ్ళు మనకి చేసిన సేవలన్నీ వాళ్ళకి మనస్ఫూర్తిగా చెయ్యాలి.  మనం అమ్మ/ నాన్న అయినప్పుడు కానీ మన అమ్మ నాన్నల విలువను తెలుసుకోలేకుండా ఉంటే అది మరీ ఆలస్యం కావచ్చు.
అప్పుడే ప్రేమను పొందడంలోను, ప్రేమను పంచడంలోను ఉన్న దైవత్వాన్ని అనుభవించగలం.

9 comments:

  1. రాధిక,
    కృష్ణప్రియ,
    వేణు శ్రీకాంత్,
    ధన్యవాదాలండీ

    ReplyDelete
  2. సుధారాణి,
    చాలా బాగుంది. మా లాంటి సీనియర్లు కాలరు యెత్తుకుని తిరగచ్చు అనిపించింధి.
    నిజంగా తల్లితండ్రుల విలువలు-వెలుతులు వాళ్ళు లేనప్పుడే తెలుస్తాయి.
    మంచి ప్రయత్నం. అభినందనలు.
    కోటీశ్వరరావు

    ReplyDelete
  3. @kkr,
    పోస్టు చూసినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  4. మీ బ్లాగ్ చాలా బాగుందండి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో ఈ ప్రేమలు అభిమానాలు ,ఈ గజిబిజి జీవితాలలో పెద్దలంటేనే నచ్చతల్లేదు , కాని మా నాన్న గారిని గుర్తుచేశారు, ఆయన ఇప్పటికి ఎప్పుడు నన్ను తిట్టలేదు.

    ReplyDelete