28 June 2011

రమణగారండోయ్... చిన్నమాట!!

హలో హలో.....మిమ్మల్నేనండి...ఎక్కడికా పరుగు...

అరే...కాబూలీవాలాలు వెళ్ళిపోయి చాలాకాలమయింది...ఇక ఆగండి. మీరు లాటరీలు కొట్టడం మానేసి నిర్మాతలయిపోయారు ఆ విషయం మర్చిపోయారేమిటి...
అబ్బే... వాళ్ళు కాదా... ఓహో..

ఆ తెలుగుజనం...  వాళ్ళకి మీరు ఇంకా బాకీ ఉన్నారని అంటూ మిమ్మల్ని చూస్తే ఒదలరని భయమా...  మీరెన్ని పుస్తకాలు రాసిఇచ్చినా ఆ బాకీ ఫైసల్ చెయ్యడం లేదని మీక్కోపం వచ్చినట్టుంది..ఏం చేస్తాం చెప్పండి...కొన్ని బాకీలంతే...అవి కాలక్రమంలో కృతజ్ఞతలనే పేరు ఫిరాయించుకుని మీకే వాళ్లు బాకీ పడిపోతార్లెండి.

అయినా పొద్దున్నే ఎక్కడికా హడావిడి...ఓహో..ఇవాళ మీ పుట్టిన్రోజు కామోసు. అల్లో అల్లో అంటూ ఆ కాంట్రాక్టరు రావుగోపాల్రావు మీకోసం దండ పట్టుకుని సిద్ధంగా ఉన్నారా.  మిమ్మల్ని పొగడ్డానికి లేకుండా ఆ భజంత్రీలను ఏర్పాటుచేసారని కుంచెం కోపంగా ఉన్నా డనుకుంటా. మీ వెనకాలే వచ్చాడుగా ఆ నిత్యపెళ్ళికొడుకు నూతన ప్రసాదు మీకోసం మాంఛి పార్టీ ఏర్పాటు చేసాడా..సరి సరి...

ఏమిటీ మీరు కూడా కోపంగా ఉన్నారా...మీ కొత్తచొక్కా కనపళ్ళేదా...అయితే ఇందాకా ఆ అప్పారావు వేసుకున్నది అదే కామోసు.. ఆ కొత్త  చొక్కా  వేసుకుని జోబీల్లో డబ్బులన్నీ బాకీలు తీర్చేస్తు వెళ్ళాట్ట.... పరగడుపునే ఎంత పాపాష్టి పన్జేసాడూ అని మీ క్కుంచెం కోపంగా ఉందని నాకు తెలుసనుకోండి..కానీ అప్పారావు అలా చేసాడంటే ఊరికే చెయ్యడు లెండి. ఇచ్చుట పుచ్చుకొనుట కొరకే అని ఋణోపదేశం చేసాడు నాకు ఇందాకే...

ఇవాళ మీ పుట్టిన్రోజుకి మీకోసం సావాలమ్మగారు మాంఛి ఉల్లిపెసరట్లు వేసి పెట్టార్ట...మీరు వచ్చి తింటారా....అక్కడికే అంపించమంటారా.... అని ఇందాక వారు ఫోన్జేయించారు. డబ్బుల్లేవంటారా...అవును...వారు అట్టులు ఉట్టినే పెట్టరు లెండి....మన అప్పారావు కాతాలో రాయించేసాంగా.. గొడవైపోద్దని అంటున్నారా....వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు... మనం పరామర్శగా వెళ్ళి పలకరించి వద్దాం ఆనక.

నాకు తెలీకడుగుతా గానీ, ఏమిటండీ మీకు మరీ తొందర. ఈ పుట్టిన్రోజు కూడా మాతో జరుపుకోండీ అంటే వినకుండా అలా వెళ్ళిపోతున్నారిందాక...అక్కడెవరున్నారు చెప్పండి.... ఆ సొర్గంలో .....మాకన్నా మీకెక్కువ వాళ్ళు..ఆఁ..... ఆ ఎక్కువేమిటో...ఈ తక్కువేమిటో...తేల్చాల్సిందే. ఎవరో అలా రమ్మని పిలిస్తే ముందూ వెనకా చూసుకోకుండా వెళ్ళడమేనా అంటా..ఇప్పుడే రానూ...నాకవతల వల్లమాలిన  పనులున్నాయీ అని చెప్పలేరా అంట...

అసలు మీకు మొహమాటం మహా లావు... మీ మాటల్లోనే చెప్పాలంటే .. మీకు మోడెస్టీ మహలావు. అభిమానులకి మీరంటే ఉన్న ఇష్టం కన్నా, మీరు తీసే సినిమాలంటే జనానికి ఉండే ఇష్టం కన్నా, ఒకప్పటి తెలుగు హీరోయిన్ కన్నా, తెలుగువాళ్ళకి డబ్బింగ్ సినిమాల మీద మోజు కన్నా, తెలుగువారికి బాపుగారి బొమ్మంటే ఉన్న మోజు కన్నా, బాపురమణలకి రామాయణం కన్నా, సీగానపెసూనాంబకి బుడుగు మీద ఇష్టం కన్నా, గిరీశం  బుచ్చమ్మ దగ్గర కొట్టే పోజుకన్నా, గోపాలానికి రాధమీద ప్రేమకన్నా, ఇంకానేమో పక్కింటి పిన్నిగారికన్నా...

ఒక్కనాడయినా పన్నెత్తి పలకరిస్తారా అని మీ మాటకోసం ఎంత ఎదురుచూసేవాళ్ళం..ఏ సభ జరిగినా...రెక్కలు కట్టుకొని వాలిపోయేవాళ్ళం. హుఁ.... ......పలుకే బంగారమాయెరా అన్న తీరుగా నోట్లోంచి ఒక్కముక్క రాలిపడదే..ఒక్కమాట....కనీసం... ఊహు...లేదే. అన్నిటికీ  సమ్మోహనంగా ఓ చిరునవ్వే సమాధానం.  అప్పటికీ "రెండు ముక్కలు మాట్లాడతారు" అని ఇరికిద్దామని చూస్తే...."రెండు ముక్కలు"  అనేసి కూర్చుంటారా...ఆరి మీ తెలివి... బంగారం గానూ!! అవునులే..ఈ మాట నేర్పరితనం చూసేగా అందరం మీ బుట్టలో పడిపోయాం.

మీ ఎంటర్టైన్మెంటాలిటీ తెలిసిన వాడు కదూ ఆ ఇంద్రుడు - మీకోసం ఏవో ఏర్పాట్లు చేసే ఉంటాడులే...పుట్టిన్రోజు వేడుకలు జరపడానికి.. అందుకే కాబోలు ఆ తొందర. ఒకవేళ రంభ డాన్స్ ప్రోగ్రాం గానీ పెడతాడేమో  మీకు నచ్చకపోయినా సరే హలం డాన్సే బావుంటుందని నిజం చెప్పకండిస్మీ.... ఆ బృహన్నలకి రంభ   శాపం కథ తెలుసుగా.

మీరు అలా వెళ్ళారా మీ అభిమానులంతా ఒకటే గొడవ..ఆ సొరగలోకంలో మీరు ఎవరితోనో కోతి కొమ్మచ్చి ఆడడానికి వెళ్ళిపోయారంటూ. ఆయనేమన్నా చిన్నవాడా చితకవాడా వాడంతటి వాడు వాడు అని చెప్తే నమ్మడంలేదు. పైగా జాటర్ డమాల్ అంటున్నారు.అంటే అర్థంలేదుట. అర్థం ఎందుకు ఉండదూ.ఉంటుంది. తెలియాలి అంతే. కోతి కొమ్మచ్చి కాదూ, ఇంకోతికొమ్మచ్చి కూడా మనకోసమే రాసిచ్చారూ. అప్పు తీరుస్తున్నారూ అని చెప్తున్నాను. కాదని వాళ్ళ అనుమానం. అనుమానం అంటే అవమానం కదా.  అసలు మీరు రామాయణంలో రాముడికి సీత ఏమవుతుందా అనిఆలోచిస్తున్న ఆరుద్రని రామాయణం స్టోరీలో కొత్త ట్విస్టుకోసం అడగడానికి  వెళ్ళి వుంటారని నా అవమానం.

మనలో మాట ఆ సొరగలోకంలో ఏం సినిమా తీస్తున్నారేమిటి... అలా వెళ్ళారు...చెప్పాపెట్టకుండా.. రామాయణమా?!.....మళ్ళీనా....హతోస్మి. మీరు ఎన్ని సార్లు ఆ రామాయణాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కథని వండి సినిమా తీసినా చూడ్డానికి మేము లేమనా...అక్కడికెందుకు వెళ్ళారసలు?

కనీసం మీ ఫ్రెండుగారికయినా ఆ వయనం చెవినేసి వెళ్ళకూడదుటండీ.....
వెంకట్రావూ..నువ్వులేకుండా నా జీవితం గోడచేర్పు లేని ఫోటో ఫ్రేమయిపోయిందని ఆ పెద్దమనిషి ఆ పళాన దుఃఖిస్తూ ఉన్నారు కదా. శివుణ్ణేనా పార్వతి సగం లేకుండా భరిస్తాం  కానీ మీరు  పక్కన లేకుండా ఆయన్ని చూడగలంటండీ మేము...!!

ఈ మాత్రం ఆలోచన మీకెందుకు రాలేదు చెప్మా....

చాలా జరూరు పనిలో పోతూ  ఉండగా నేను ఆపేసినట్టుంది మీ వరస చూస్తే...ఏమిటో ఆ తొందర.

ఆరోజు మనం చివరాకరిగా కలిసినప్పుడు మీరేమన్నారో మీకు గుర్తుండదనుకోండి...శతకోటిలింగాల్లో ఓ బోడిలింగం మేము మీ అభిమానుల్లో కనుక. కానీ నాకు బాగా గ్నాపకం (నాకు ఎలా రాయాలో ఒచ్చినా సరే ఇలాగే రాస్తా)ఉంది. బాపూగారూ, మనవాళ్ళొచ్చారు ఫోటో తీయించుకుందాం అని పిల్చారా...అప్పుడు నా సంతోషం ఎంత తెలుసా....ఇరుగట్లూ తెంచుకుని పారే  వరద గోదారిలా.. ఆ ఫోటో తీయించుకున్న క్షణం మీ పక్కన నిలబడినకాలం అలా నిలిచిపోతే...నిధిచాలా సుఖమా...రమణ సన్నిధి చాలా సుఖమా అంటే రెండో దానికే కదా నా ఓటు.

మీరు నాకు ఒకసారి...ఒకేసారి...ఒక్కసారేననుకోండి. ఓ ఉత్తరం రాసారు తెలుసా. ఆఉత్తరం ఒకటా రెండా ...రెండు పేజీలు...రెండువేపులా నిండు పేజీలు...అందులో ఏం రాసారో పదమూడో ఎక్కం అంత కాదుకానీ నాకు కంఠతావే.
అభిమానంతో రాసే ఉత్తరాలకి జవాబు రాయడం కష్టం...ముందు ముందు మీకు ఈ విషయం తెలియగలదు అని రాసారు.. తీపి శాపాలు అంటారు ఇలాంటివే కాబోలు...మీ వాక్కు అమోఘం. రచైతలు స్రష్టలే కాదూ ద్రష్టలు కూడా అంటారు. అంటే ఇదేనేమో మరి.  మీరు పెట్టిన ఈ శాపం ముందుముందు ఫలించబోతోందని నాకప్పుడు తెలియకపోయినా అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మీరు గుర్తొచ్చారుస్మీ.

హేమిటీ...ఇందాకట్నుంచి ఆ సెల్ ఫోన్ వెలుగుతుంటే అలా కట్ చేసేస్తున్నారూ...కనీసం శబ్దమయినా లేదే.. వైబ్రేషన్ లో ఉన్నట్టుంది. ఓహో..పార్టీ టైమవుతోందని  ఎవరో ఫోన్ చేస్తున్నారా...మరిహనేం వెళ్ళిరండి...అవునుగానీ  మరీ ఇంత మొహమాటస్తులు మీరు.. ఆ స్వర్గంలో దొంగ దేవతల మధ్య ఎలా నెట్టుకొస్తున్నారండీ... వడ్డించే వాళ్ళు మనవాళ్ళయితే పంక్తిన ఏ కొసన కూర్చున్నా ఫరవాలేదు కానీ.

ఓ పన్చేయండి ....  ఆ కాంచనమాలనో, దివ్యభారతినో,  పక్కకి పిల్చి ఎక్స్ వారి నెక్స్ట్ పిచ్చర్ లో  మోహిని వేషం ఇస్తాననో ఇప్పిస్తాననో  చెప్పండి. ఆ కాఫీలవేళ అమృతం పంచినప్పుడు ఓ లోటాడు ఇటు ఫిరాయించమని పురమాయించండి. అది పుచ్చుకుని ఇంచక్కా తాగేసి  ఇటువేపు ఒచ్చేయండి....మేమంతా మీకోసం కాచుక్కూచున్నామని మర్చిపోకండి...

హలో...హలో.. రమణగారండోయ్......
చాలా దూరం వెళిపోయినట్టున్నారు... ఇహ ఆయన మరి రారు...మనమే ఎప్పుడో వెళ్ళాలి.