08 March 2011

ఆడాళ్ళూ..!!మీకు జోహార్లు!!!


అమ్మ నాన్న టివి చూస్తున్నారు.
అమ్మ లేచింది. ’అబ్బా ..చాలా అలసటగా ఉంది. బాగా లేటయింది. ఇంక పడుక్కోవాలి’ అంటూ వంటింట్లోకి నడిచింది.

మర్నాడు పొద్దున్న వంటకి కావలసిన వస్తువులన్నీ చూసుకుంది. ఫ్రిజ్ తెరిచి మర్నాడు సాయంత్రానికి వండుకోవలసిన కూరలు ఉన్నాయో లేదో చూసింది.

ఉప్పు,పంచదార,గోధుమపిండి,పోపు డబ్బాలు తెరిచి చూసింది ఎంత ఉన్నాయో అని. పొద్దున్నే అప్పటికప్పుడు అవి అయిపోతే నింపుకోవడం హడావిడి లో కుదరదు మరి.

పిల్లలు తినడానికి కార్న్ ఫ్లేక్స్ డబ్బా,బౌల్స్, స్పూన్స్ డైనింగ్ టేబిల్ మీద పెట్టింది.కాఫీ ఫిల్టర్ లో కాఫీ పొడి వేసి, స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టింది. లేవగానే కాఫీ కలపడంకోసం.

బాత్రూం లోకి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి విప్పి పడేసిన బట్టలు,తడి తువ్వాళ్లు వాషింగ్ మెషిన్ లో పడేసింది. ఉతికిన బట్టల లోంచి మర్నాడు పిల్లలకు కావలసిన యూనిఫామ్ బట్టలు ఇస్త్రీ చేసింది.లూజ్ గా ఉన్న నిక్కర్ బటన్ ని కుట్టి, సరిగా లేని జిప్ ని బాగుచేసింది.

హాల్లో టేబిల్ మీద పడి ఉన్న గేమ్,దానికి సంబంధించిన ముక్కలన్నీ ఎత్తి అట్టడబ్బాలో పెట్టి షెల్ఫ్ లో పెట్టింది.కార్డ్ లెస్ ఫోన్ ని ఛార్జింగ్ కోసం బేస్ లో పెట్టింది. సెల్ ఫోన్ లోకి చూసి ఛార్జర్ తీసి ప్లగ్ లో పెట్టింది.కింద పడి ఉన్న టెలిఫోన్ డైరెక్టరీని మళ్లీ ఫోన్ పక్కన పెట్టేసింది.

ముందురూమ్ లో ఇందాక వాడిపోతూ దిగాలు పడినట్టుగా కనిపించిన ఇండోర్ ప్లాంట్ గుర్తొచ్చి జగ్ లో నీళ్లు తీసుకెళ్లి మొక్కకి పోసింది. పొద్దున్న కి అది మళ్ళీ నిటారుగా నిల్చుంటుంది కళకళలాడుతూ.

పిల్లల టేబిల్ చూడగానే గుర్తొచ్చింది, బాబు టీచర్ కి రాయవలసిన ఉత్తరం, పిక్నిక్కి వెళ్ళడానికి కట్టవలసిన డబ్బు. లెటర్ రాసి,పర్సుతీసి డబ్బు లెక్క పెట్టి దాని పక్కనే పెట్టింది.టేబిల్ కింద మూల దాక్కొని ఉన్న టెక్ట్స్ బుక్ తీసి స్కూల్ బేగ్ పక్కన పెట్టింది. చిన్నవాడి పెన్సిల్ బాక్స్ తీసి చూసి పెన్సిల్ చెక్కి ఉందోలేదో చూసింది.రబ్బర్ అరిగిపోయి చిన్నదయిపోయింది. కొత్త రబ్బరు పెట్టి బాక్స్ లోపల పెట్టింది.

ముందురోజు స్నేహితురాలి పుట్టినరోజు కోసం కొన్న గ్రీటింగ్ కార్డు బయటకి తీసి సంతకం చేసి కవర్ పైన స్టాంప్ అంటించి అడ్రెస్ రాసి బేగ్ లో పెట్టుకుంది, వెళ్తూ దారిలో పోస్టు చెయ్యొచ్చని.ఆచేత్తోనే రాసి పెట్టుకున్న,అయిపోయిన సరుకుల లిస్ట్ ని కూడా బేగ్ లో పడేసింది.వెళ్తూ ఆ షాప్ లో ఇచ్చేయొచ్చు.

వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి అద్దంలో మొహం చూసుకొని, పళ్లు తోముకొని, పొడి చర్మానికి నిగారింపు తెచ్చే క్లీనర్ తో మొహం కడుక్కొని బెడ్ రూంలోకి వెళ్ళింది. ముడుతలు పోగొట్టే నైట్ క్రీం రాసుకుంటూ గోళ్ల వైపు చూసుకుంది. సగం పోయిన నెయిల్ పాలిష్ చూసి రిమూవర్ తో తుడుచుకొని చేతులు కడుక్కుంది.

’ఏమిటి...పడుక్కుంటున్నానన్నావ్...’భర్త ప్రశ్న వినిపించింది.


’ఆ..ఆ...పడుక్కుంటున్నా’నని జవాబు చెప్పి తలుపులు అన్నీ వేసి ఉన్నాయోలేదో చూసింది. పెంపుడు కుక్క తినే ప్లేట్ శుభ్రంగా ఉందో లేదో చూసి అందులో కొంచెం నీళ్లు పోసి పెట్టింది. వరండాలో లైట్ ఆర్పి, అన్ని గదులు చూసింది. పిల్లలగదిలో లైట్ వెలుగుతోంది. పాప ఇంకా పడుక్కోలేదు. పడుక్కోమంటే ఇంకా కొద్దిగా మిగిలిన హోంవర్క్ చేసి పడుక్కుంటానంటూ ఏవో కబుర్లు చెప్పింది. కబుర్లు వింటూనే అక్కడ పడి ఉన్న వస్తువులన్నీ సర్ది,బాబు దుప్పటిసరిగ్గా కప్పింది.

మర్నాడు తెల్లబట్టలు వేసుకోవలసిన రోజని గుర్తుచేసిన పాపని ఓసారి అభినందించి మళ్లీ తెలుపు బట్టలు తీసి ఇస్త్రీ చేసింది. తెల్లసాక్స్ల్,బూట్లు బయట పెట్టి,నల్లబూట్లు,కంపుకొడుతున్న సాక్స్ ఓ పక్కగా పెట్టింది. వేరుగా ఉతకాలి అవి.

మంచం మీదకు చేరుకుంటూ అలారం పీస్ తీసి టైం సరిగ్గా సెట్ చేసి ఉందో లేదో చూసుకుంది.మర్నాడు ఆఫీసుకు వేసుకోవలసిన బట్టలు సిద్ధం చేసి పెట్టుకుంది.

మంచం మీద వాలి కళ్లు మూసుకొని ఆ రోజు చేసిన పనులు,మర్నాడు చేయవలసిన పనులు అన్ని పునశ్చరణ చేసుకుంది. ఇందాక కాఫీ కోసం నీళ్లు పెట్టి దించాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని అనుమానం వచ్చి కంగారుగా కిచెన్ లోకి వెళ్లి చూసుకొని హమ్మయ్య అనుకొని వచ్చి పడుకుంది. పడుక్కునేముందు నిత్యం చేసుకునే ప్రార్థనని ఒక్కసారి మనసులోనే చేసుకొని కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకుంది.

టివి చూస్తూ కునికిపాట్లు పడుతున్న భర్త సోఫాలోంచి లేచాడు.నేను పడుక్కుంటున్నా అని జనాంతికంగా ప్రకటించి టివి ఆఫ్ చేసి రిమోట్ సోఫాలో పడేసి లైట్ ఆర్పి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద పడుక్కుని క్షణంలో నిద్రపోయాడు. మరో ఐదు నిముషాల్లో ఆగదిలో గుర్రు గుర్రుమని శబ్దం వినిపించింది. భార్య అసహనంగా కదిలి తలగడతో చెవిని మూసుకుంటూ నిద్రపోడానికి ప్రయత్నం చేసింది.

కథ కంచికి మనం వంటింట్లోకి.....

ఇందులో ఏదేనా అభూతకల్పనగా అనిపిస్తోందా...లేదుకదా...


ఎంత జీవితమూ సరిపోదు,ఆడవాళ్లకి...


ఎందుకంటే ఇతరుల కోసం కూడా జీవించాలి కాబట్టి...
యముడు ముందుగా పర్మిషన్ కోసం అంటూ  వస్తేకనుక  "వీటలేదని చెప్పించి-వీలుకాదని పంపిస్తాం".
అందుకే....

ఆడాళ్ళూ....మీకు జోహార్లు...

(నెట్ లో ఫార్వర్డు చేయగా వచ్చిన "why women are so special"అన్న సందేశం స్ఫూర్తితో(రచయిత(త్రి) ఎవరో కాని వారికి నా కృతజ్ఞతలు) 

టపా  పాతదే కాని సందర్భోచితంగా ఉంటుందనీ....

19 comments:

 1. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చూసీ చూసీ విసుగొచ్చింది పొద్దుటినుంచీ! ఎక్కడికెళ్ళినా ఇదే గోల! (బ్లాగుల్లోనే కాదు, బయట, ఆఫీసులో,కాలేజీలో కూడా!) ట్రాఫిక్ లో బండి ఆగిగే పోలిసు "హాపీ వుమెన్స్ డే మేడమ్" అని చెప్పాడు పొద్దున!

  మీ టపా అసలైన మహిళను చూపించింది. అయినా సరే, ఇక్కడ నాకు కొన్ని సవరణలు కనపడ్డాయి. మీరూ ఒప్పుకుంటారు చూడండి. ఇస్త్రీ చేయాల్సిన బట్టలూ, బాత్రూములో పడి ఉన్న విడిచిన బట్టలూ,సర్దాలసిన పుస్తకాలూ, తీయాల్సిన డికాక్షనూ,నింపుకోవాల్సిన సరుకులూ ఇవన్నీ బుర్ర నిండా నిండి ఉంటే ఏ అమ్మ తీరిగ్గా టీవీ చూస్తుంది?

  ఉద్యోగం చేసే మహిళలకు ఎక్కువగా టీవీ చూడ్డం కుదరకపోవడానికి,మనసుకు నచ్చిన ఇతర పన్లు హాయిగా చేయలేకపోవడానికీ "రేపు" గురించిన పన్లు,ఆలోచనలూ మిగతావారికంటే ఎక్కువగా ఉండటమే!

  మీరు రాసిన అమ్మ ప్రతి మహిళలోనూ ఉంటుందేమో కదా!

  చాలా empathic గా ఉంది టపా!

  ఆడాళ్ళూ మీకు జోహార్లు

  ReplyDelete
 2. మీకు నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. సుజాతగారూ. నిజమే. ఒప్పుకోవచ్చు కానీ.. చూసారూ..
  అనుభవం వల్ల ఏమవుతుందంటే కొత్తలో ఉన్నంత కంగారు ఉండదన్నమాట.రోజూ పడుకునే ముందు చేసే పనులు కదూ..ఈ లోపల ఓ అయిదు నిముషాలు ఆ మొగుడుగారి పక్కన కూర్చొని మాట్లాడుకుందామని ఆశపడతాం కదూ. పొద్దున్న ఆ న్యూస్ పేపర్ లోనూ, మిగతా టైంలో న్యూస్ ఛానెల్ లోను మొహం పెట్టుకొని కూర్చునే ఆయనగారు మన మాటలు పట్లీ పట్టనట్టుగా వింటుంటారు కదా. విసుగొచ్చి లేచి పని చూసుకుంటోందీ అమ్మ. ఇదొకరి అనుభవం అనుకోండి.

  ReplyDelete
 4. నాకు తెలీకడుగుతాను.బయట హ్యాపీ వుమన్స్ డే అని చెప్పే మగవాళ్లు ఇంట్లో ఏం చేస్తారు అని?? ఈరోజంతా హ్యాపీ వుమన్స్ డే అని ఎక్కడ చూసినా వూదరగొట్టేస్తున్నారు. తెల్లారితే అంతా మామూలే. ఎందుకో ఇలా చేయడం.. ఈ పనికిమాలిన దినాల వల్ల మనకు ఒరిగేదేమి లేదు. దొరికేదీ లేదు. ఏదో తుత్తి తప్ప.. కాదంటారా??

  ReplyDelete
 5. ade kadaa aadavaari pratyekatha..
  sudha garu meeku womens day subhaakaankshalu..
  hats off to indian women...

  ReplyDelete
 6. chala bagundi sudha garu.. :)..thanks for sharing.. :)

  ReplyDelete
 7. ట్రాఫిక్ లో బండి ఆగిగే పోలిసు "హాపీ వుమెన్స్ డే మేడమ్" అని చెప్పాడు పొద్దున!
  sooooper

  ReplyDelete
 8. ఇంట్లో బయటా ఎప్పుడూ జెయింట్ వీలెక్కి అష్టావధానం చేస్తున్న ఫీలింగ్ వుంటుంది నాకు! ఈ పోస్టుతో ఎలా ఏకీభవించకుండా వుంటాను చెప్పండి?
  అయితే ఒక్కటుందండీ! మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి (అవి చాలా కష్టం అనుకోండి, అయినా సరే!) అందులో మొదటిది ఇంట్లో మిగతా వాళ్ళకి (భర్తా, పిల్లలు!) కొంచెం చిన్న చిన్న పనులు చేసే అలవాటు చేయటం. (అలా నవ్వకండీ!) నిజానికి వాళ్ళకి ఆ పని నేర్పించీ, వాళ్ళతో చేయించటం కంటే మనం చేసుకోవటం ఎన్నో రెట్లు తేలిక! కానీ కొంచెం మనం ఓపికగా నేర్పిస్తే కొంతైనా శ్రమ తగ్గుతుంది కదా?
  శారద

  ReplyDelete
 9. చాలా బాగా రాసారు.. కళ్ళకి కట్టినట్టు చూపించారు.. అమ్మలు చేసే శతావధానం.. :)

  ReplyDelete
 10. జ్యోతి, రాధిక,కిరణ్,మురళి,మధురవాణి అందరకీ శతావధానాలు చేసిన/చూసిన అనుభవం ఉన్నట్టుంది. అందుకే ఎంచక్కా స్పందించారు.
  కానీ చూడండి, హితుడు, మిరియప్పొడి తప్ప బ్లాగ్పురుషలోకంలో మరెవ్వరైనా స్పందించారూ..
  అయ్యో...ఈ రోజున వీళ్ళ భుజాలు వీళ్ళే చరుచుకుంటున్నారు..మనమూ చప్పట్లు కొడదామని...అనుకోవద్దూ.హు..హు..(కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయ్...)

  ReplyDelete
 11. చాలా బాగా రాసారు

  ReplyDelete
 12. ఇప్పుడే టపా చూస్తున్నానండి..చాలా బాగా చెప్పారు.

  ReplyDelete
 13. చాలా బాగుంది.. ..Very well said..

  but.. నేను శారద గారితో ఏకీభవిస్తున్నాను.
  మా ఇంట్లో... ఒకళ్లు పిల్లలకి సహాయం చేస్తుంటే..ఒకళ్ళం వంటా, బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సులూ, అలాగ.. పొద్దున్న ఒకళ్లు పక్క బట్టలు సద్దుతుంటే..ఒకళ్లు పాలు కాచి టీ తయారు చేయటం..
  అలాగే సాయంత్రం కూడా ఒకళ్లు చదివిస్తున్నప్పుడు ఒకళ్లు వాకింగ్ కెళ్ళి వచ్చేస్తాం..

  పిల్లలకి ముందు రోజు తమ స్కూల్ దుస్తులు,పుస్తకాలూ, వారి స్నాక్ బ్యాగ్.. రెడీ గా పెట్టుకోవాల్సిన బాధ్యత వారికే అప్పగించాం.

  అన్నీ నేనే చేయాలి...అనే సిండ్రోం నాకు చాలా ఏళ్లు ఉండేది. నెమ్మదిగా దాని నుండి బయట పడ్డాక.. అందరికీ బాధ్యత తెలుస్తోంది.. నాకూ సమయం మిగులుతోంది....

  ReplyDelete
 14. ఈ బ్లాగు ఇప్పుడేచూసాను.నీ సబ్జేక్ట్లు అన్నీ హోమ్లీగా వుంటం వాళ్ళ బాగా పాపులర్. అవుతున్నవి. అయినా ఈ డేసుఎక్కువగుతచే రొటీను ఐపోతున్నవి. అంతగా ఎవరూ పట్టించుకొనడం లేదు.అయినా మనం చెప్పవలసింది చెప్పాలికదా.కొందరైనా వింటారు.కొత్త పోస్టులు ఏవీ రాయడం లేదా.పురాణం వారి లాగ వారానికొకసారి రాస్తే బాగుంటుంది. అభినందనలతో,రమణీయం.

  ReplyDelete
 15. మూడో సంతానం కూడా ఆడపిల్లే అని స్కానింగ్ లో తెలుసుకొని గర్భంతో ఉన్న భార్యను కొట్టి చంపాడొక దుర్మార్గుడు.పరువు హత్యలు,కుల దురహంకార హత్యలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్థానం కోర్టులను ఆదేశించింది.ఇలాంటివారికి కూడా మరణ శిక్ష అమలు చెయ్యాలి.అసలు పిల్లల్ని కనే అర్హత ఇలాంటి వారికి లేదు.దేశ శ్రేయస్సు కోసం ఇద్దరు పిల్లలకంటే ఎవరినీ కననివ్వకూడదు.ఆడపిల్లలను మాత్రమే కన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

  ReplyDelete
 16. బాగుంది. మా ఆయనకి ఈ టపా చూపిస్తే ఏమంటారో ఆలోచించుకొని నవ్వుకుంటున్నాను. వీటిలో, ఇద్దరు పిల్లలు, మాసిన బట్టలు, కుక్కపిల్ల, కొండొకచో ఫిల్టర్ కాఫీ(మా ఇంట్లో కాదండోయ్!) అందరి ఇళ్ళలో ఉండకపోయినా, రిమోట్ తీసుకు నచ్చినది చూసే స్వాతంత్ర్యం, తీరిక, పడుకోవాలి అనుకోగానే పడుకోగలిగే అదృష్టం మాత్రం ఆడాళ్ళకు లేదు. సరదాకి ఒక్క రోజైనా అలా మగాడిలా గడపగలమా? ఏమో! ఎవరికి వారే సూపర్ వుమన్ సిండ్రోం ఉన్నవాళ్ళమే కదా! ఇక మాలా విదేశాల్లో ఉన్నవాళ్ళకయితే పుట్టెరికం ఆశ కూడా లేదు. :(

  ReplyDelete
 17. "మనమా మనమా మమతను విడుమా
  అనయము పతిగని హాయిగ మనుమా
  పతిచరణములే గతియనుకొనుమా
  భారములన్నియు పతివేయనుమా
  పరమావధి నీకదియే సుమ్మా"---ధర్మపత్ని(1941).

  ReplyDelete