మనిషికి పూర్ణాయుష్షు
నూరు సంవత్సరాలంటారు. సంపూర్ణమైన
జీవితానికి గుర్తుగా చెప్పే ఈ నూరు సంఖ్యకి మన తెలుగు సినిమా ప్రపంచంలో కూడా
బోల్డు ప్రాముఖ్యత ఉంది. వందరోజుల పండుగలు, అందులో సగభాగం రోజులు ఆడితే 50 రోజులు
లెక్కవేసుకుని(ఒక్కోసారి వారాలు కూడా) గోల్డెన్ జూబ్లీలు, సిల్వర్ జూబ్లీలు అంటూ పండుగ చేసుకుంటారు 'సినీమానిసి'లు.
ఆ లెక్కలో ఇప్పుడు
చెప్పుకోదగ్గ ఓమంచివిషయం ఏమిటీ అంటే "ఆరాధన" తెలుగు సినిమా కి యాభైఏళ్ళు అన్నది.
అశాశ్వతమైన వాటికి లక్ష్యంగా చూపే ఓ తెలుగు సామెత - మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయింది అనేమాట. తెలుగులో ప్రతి సంవత్సరం కొన్ని వందల సినిమాలు
నిర్మింపబడుతూ ఉన్నా వాటిలో గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పాలంటే కనిష్ఠా
కాళిదాస అన్నట్టుగానే ఉంది వాటి సంఖ్య.(గొప్పకవుల పేర్లు లెక్కిద్దామని కూర్చొని
ప్రారంభిస్తే చిటికెన వేలుమీద కాళిదాసు పేరు చెప్పాక మరో పేరు తట్టడం లేదు..అని
అర్థం ఆ మాటకి) అంటే నాణ్యమైన సినిమాలు అంత తక్కువగా వస్తున్నాయి ఇటీవల కాలంలో.
1962 ఫిబ్రవరి 16 న
ఆంధ్రదేశంలో విడుదలైన ఆరాధన సినిమా కి ఈరోజుకి యాభై ఏళ్ళని విన్నప్పుడు ఏదో
తెలియని సంతోషం కలిగింది. ఈ చిత్రం సాగరిక అనే ఒక బెంగాలీ సినిమా ఆధారంగా నిర్మించబడినది. నిర్మాతగా రాజేంద్రప్రసాద్ గారికి పెద్దగా నష్టాలు తేకపోయినా లాభం కలిగించలేదట. ఈ సినిమా దర్శకుడు విక్టరీ మధుసూదనరావుగారిగా పేరు పడిన వి.మధుసూదనరావు
ఎందుకోగాని తెలుగు
సీమలో బెంగాలీ ప్రభావం చాలా ఎక్కువే. బెంగాల్ దేశంలోని ఉద్యమాలైనా, సాహిత్యమైనా
అక్కడ ప్రజాజీవితంలో ముఖ్యమైన పాత్ర వహించిన అంశాలన్నీ తెలుగువారి జీవితాలను కూడా
ప్రభావితం చేసాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచీ ఈ బెంగాలీ ప్రభావం
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా ఎంతగానో కనిపిస్తుంది. తెలుగు కళా ప్రపంచం మీద
బెంగాలీ ప్రభావం విడదీయలేనిది. తెలుగు సాహిత్యం పైన కూడా బెంగాలీ సాహిత్యం ప్రభావం ఎంతో
ఉంది. ఠాగోర్ స్థాపించిన శాంతినికేతనం కొన్ని తరాల తెలుగువారికి గురుకులం. ఠాగోర్, బంకించంద్ర వంటి గొప్ప
రచయితలతో పాటు శరత్ చంద్ర రచనలు తెలుగువాళ్ళకి ఎంతో సుపరిచితం.
ఆచార వ్యవహారాలలో, వస్త్రధారణలోనే కాక
సెంటిమెంట్ ల విషయంలో కూడా తెలుగువాళ్ళ జీవితాలలో బెంగాలీ అనుకరణ చాలా సహజంగా ఒదిగిపోయింది. అందుకేనేమో చాలా
కాలంపాటు తెలుగుసినిమా కథలు బెంగాలీ చిత్రకథల ఆధారంగా రూపొందించబడడం అవి సూపర్
డూపర్ హిట్లు కొట్టడం కూడా అంతే సహజమయింది. తోడికోడళ్ళు, ముద్దుబిడ్డ వంటి
చిత్రాలు బెంగాలీ కథల ఆధారంగా తీసినవే.
ఈ ఆరాధన చిత్రానికి
వస్తే –
ఆరాధన చిత్రం కథని
బెంగాలీ చిత్రం ఆధారంగా తీసుకున్నా తెలుగు వాతావరణానికి ఒదిగిపోయేలా పాత్రలను
తీర్చడంలో గాని, పాత్రల మధ్య సన్నివేశ పరంగా సంభాషణల్లో తెలుగుతనాన్ని పండించడంలో
కానీ రచయితల కృషి శ్లాఘనీయం అని చెప్పాలి.
సినిమా కథ లో
పెద్దగా మలుపులు చమక్కులు లేవు. అలాగే హీరో ఔన్నత్యాన్ని, ధీరోదాత్తతని వెల్లడించే
సంఘటనలూ, ఫైట్లూ లేవు. కథ డిమాండ్ చేసే శృంగార సన్నివేశాలు కానీ, హాస్యం పేరుతో కమేడియన్లు
ముఖాలు రుద్దుకుంటూ, కిందపడి దొర్లుతూ చేసే సర్కస్ ఫీట్లు కానీ లేవు. కనీసం హీరో హీరోయిన్ల పరంగా చిత్రించిన ఒక యుగళగీతం కూడా లేదు. అయినా ఈ సినిమా తెలుగు సినిమా ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ
మైలురాయిగా ఉందీ అంటే అందుకు కారణం సినిమాకి
సంగీత పరంగా, సాహిత్యపరంగా సంగీత దర్శకులు, రచయితలు అందించిన సహకారమే అంటే నిజమేననిపిస్తుంది.
సినిమా లో
కథానాయకుడు కృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు) ఒక వైద్యవిద్యార్థి. పల్లెటూరునుంచి
వచ్చి పట్నంలో చదువుకుంటాడు. పదేళ్ళపాటు పట్నంలోని షావుకారు చలపతిరావుగారి అండతో
చదువుకుని వారింట్లోనే ఉంటూ డాక్టరయి తన
ప్రతిభతో విదేశాలకు వెళ్ళే అర్హతను సంపాదించుకుంటాడు. షావుకారుగారి అమ్మాయి సరళ
(రాజశ్రీ) ని చిన్ననాటినుంచి కలిసి పెరగడం వలన చెల్లెలుగా భావిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతనిమీద
ఆశలు పెంచుకుంటుంది. విదేశీ ప్రయాణం దగ్గర
పడుతుండగా అనుకోకుండా జరిగిన ఓ సంఘటనలో మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్న అనురాధ(సావిత్రి)ని
చూడడం తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడడం జరుగుతుంది. కానీ అతను తన ప్రేమను ఆమెకు
వెల్లడిచేసే ప్రయత్నమేదీ చేయడు. ఆమె పేరు రాసుకుని చిన్న కవితలు రాసుకోవడం తప్ప.
కానీ షావుకారు కూతురు సరళ కృష్ణ తనను
ఇష్టపడలేదన్న కోపంతో అనురాథ పై అతను రాసుకున్న
కవితలను బయటపెట్టి అనురాధ అల్లరి పడడానికి కారణమవుతుంది. అంత పెద్ద డాక్టరు,
సభ్యతా సంస్కారాలున్నవాడు తన పేరును ఇలా రచ్చకీడ్చాడని భావించి అనురాధ అధికారులకి
ఫిర్యాదుచేయడంతో కృష్ణ విదేశీ ప్రయాణం పై వేటు పడడం తో పాటు, అతని ఉద్యోగం కూడా
పోతుంది. మరో దారిలేక స్వగ్రామానికి వెళ్ళిపోతాడు కృష్ణ.
చిన్ననాటినుంచి
గుండెజబ్బుతో చనిపోయిన తన తల్లి ఆశయాల మేరకు పెద్దడాక్టరు కావాలనే కోరికతో ఎంతో
కష్టపడి చదివిన కొడుకు జీవితం ఇలా కావడంతో నిరాశ పడతాడు తండ్రి(నాగయ్య). అందుకే కొడుకుని విదేశీ ప్రయాణానికి సహాయం
చేస్తానని, కానీ అతనిని తనకి అల్లుడిని
చేయాలనీ కామందు పెట్టిన షరతుకు తలఒగ్గుతాడు. కృష్ణ లండన్
వెళ్ళిపోతాడు. కృష్ణ మంచితనం తెలుసుకున్న అనురాధ తనవల్ల అతనికి జరిగిన అన్యాయం
దిద్దుకోవడానికి తన నగలు అమ్మి సహాయం చేద్దామని అనుకునే లోపు కృష్ణ లండన్
వెళ్ళిపోతాడు. లండన్ వెళ్ళిన కృష్ణ అనురాధకు తన ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆమె
పట్ల తనకు గల ఆరాధనను వివరిస్తూ రాసిన లేఖ అందుకుంటుంది అనురాధ.
తనగురించి కవితలు
రాసి అల్లరిచేసాడన్న కోపం స్థానంలో కృష్ణమీద అభిమానం గా , తరువాత అనురాగంగా మారడం
జరుగుతుంది. అతని లేఖకు జవాబు రాసి తనకు కూడా అతనిపట్ల గల అనురాగాన్ని చెప్పడం
కోసం ప్రేమలేఖ రాయడం ప్రారంభిస్తుంది.
సరిగ్గా ఇక్కడే
కథలో ఓ కొత్త మలుపు. కృష్ణకి విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేయడానికి ఒప్పుకున్న
కామందు (రమణారెడ్డి) అనురాధకి చిన్నాన్న, పల్లెటూరివాటంతో పెరిగిన తన కూతురు
లక్ష్మి (గిరిజ)ని విదేశాలనుంచి రాబోయే
డాక్టరుకి కాబోయే భార్యగా కొంచెం నాగరికత నేర్పమని అనురాధని అర్థిస్తాడు ఆ
చిన్నాన్న. అనురాధలో మారాకు వేయబోతున్న అనురాగలత వాడిపోతుంది. . నీ చెలిమీ నేడెకోరితిని ఈక్షణమే ఆశవీడితినీ
అంటూ ఖిన్నురాలవుతుంది. ఇచ్చినప్పుడు పుచ్చుకోలేని వాళ్ళకి అడగడానికి అవకాశం ఉండదని
బాధ పడుతుంది. కృష్ణకి తండ్రి ఉత్తరం
రాస్తాడు. తాను కామందుకి మాటఇచ్చానని, ఆ
అమ్మాయిపేరున ఉత్తరం రాయమనీ చెప్తాడు. కొడుకు కోరికతీర్చడం తండ్రి బాధ్యత ఎలాగో,
తండ్రిమాట నెరవేర్చడం కూడా కొడుకు కర్తవ్యమనీ చెప్పిన తండ్రి కోరిక ప్రకారం ఆ అమ్మాయికి
ఉత్తరం రాస్తాడు కృష్ణ. ఆ ఉత్తరం అందుకున్న పల్లెటూరి పిల్ల అనురాధ చెల్లెలు తనకి
అలాంటి ఉత్తరాలకి జవాబు రాయడం రాదు కనుక అక్కనే జవాబురాయమని అడుగుతుంది. రాసి ఇచ్చిన ఉత్తరానికి ఫెయిర్ చెయ్యకుండా లక్ష్మి పోస్టు చేయడం వలన, తరువాత ఉత్తరాలు కూడా అనురాధ చేతిమీదుగా లక్ష్మి పేరుతో రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తను
ప్రేమించిన కృష్ణను తన చెల్లెలు లక్ష్మికి అప్పగించడం అనేది తను కృష్ణ
భవిష్యత్తును నాశనం చేసిన పాపానికి పరిహారంగా
భావిస్తుంది అనురాధ. అందుకే కృష్ణ లక్ష్మిని ఇష్టపడే విధంగా లక్ష్మిపేరుతో
అతనికి ఉత్తరాలు రాస్తుంది.
కృష్ణ ఓరోజు ఉత్తరం
చదివే పారవశ్యంలో లాబ్ లో పొరపాటు చేసి కంటిచూపు
పోగొట్టుకుంటాడు. అంధుడై, ఇండియాకి తిరిగి వచ్చిన కృష్ణను అల్లుడిగా ఆ కామందు కానీ, భర్తగా
లక్ష్మిగానీ అంగీకరించరు. అసలు అతని ఎదురుపడడానికి కూడా ఇష్టపడరు. అతనిని
ప్రాణసమానంగా ఆరాధిస్తున్న అనురాధ తను లక్ష్మిగానే కృష్ణకి ఎదురుపడి అతనిని
ఆప్యాయంగా సేవలందిస్తుంది. ఇద్దరిగురించి బాగా తెలిసిన స్నేహితుడు డా. సారథి (జగ్గయ్య) సహాయంతో కృష్ణకి ఆపరేషన్ చేయించి చూపు
తెప్పించే ప్రయత్నం చేస్తుంది అనురాధ. కానీ ఇంతలో కృష్ణకి చూపు వస్తుందని
తెలియగానే తన కూతురును అతని ఎదురుగా నిలబెట్టాలని అతన్ని అల్లుడిగా చేసుకోవాలని
అనుకుంటాడు ఆ అనురాధ చిన్నాన్న. అంతవరకు లక్ష్మిగానే అతనికి సేవలు చేస్తూ
ఆరాధిస్తున్న అనురాధ కృష్ణ కి చూపు
వచ్చేసమయానికి పక్కకు తప్పుకుంటుంది. లక్ష్మి
చూపువచ్చిన కృష్ణకి ఎదురుగా నిలబడుతుంది.
ఇక్కడ కథలో
క్లైమాక్స్ అన్నమాట. చూపుతో కాక మనసుతో ఆరాధిస్తున్న కష్ణ, అనురాధకి బదులుగా నిలబడిన లక్ష్మిని తనను
ప్రేమించిన, తనకి సేవచేసిన అమ్మాయి కాదని నిరాకరిస్తాడు. ఉద్వేగభరితమైన సన్నివేశం కొంత
నడిచాక అనురాధ తిరిగి కృష్ణను చేరుకోవడంతో కథ ముగుస్తుంది.
పల్లెటూరువాళ్ళకు
పట్నవాసం మీద మోజు ఎలా ఉంటుందో, ఆధునికతను అలవర్చుకోవడం కోసం ఎలాటి తిప్పలు పడతారో, ఆ క్రమంలో వారి బలహీనతను
పట్నవాసులు ఎలా డబ్బుచేసుకుంటారో మనం ఈ
సినిమాలో కూడా చూస్తాం - రేలంగి, డా. శివరామకృష్ణయ్య వంటి పాత్రల ద్వారా. చేష్టాగతమైన హాస్యం కన్నా, భాషాగతమైన హాస్యం
మీద ఆధారపడిన సన్నివేశాల వలన సినిమాలో హాస్యం ఆరోగ్యకరంగా ఉంటుంది. సంభాషణలు కూర్చిన రచయితల నేర్పు, భాషమీద పట్టు ప్రతి సంభాషణా శకలంలోనూ వెల్లడవుతుంది.. రేలంగి పాత్రకు
డింగుటకా అనే ఊతపదం, రమణారెడ్డి పాత్రకు అంతేనంటావా అయితే సర్లే అనే ఊతపదం
ప్రేక్షకుల నోటిలో చాలాకాలం నలిగి ప్రచారంలోకి వచ్చిన పదాలు.
ఈ సినిమాలో
సంగీతపరంగా సాహిత్యపరంగా మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా సంభాషణలు, హృద్యమయిన సంగీతం, సాహిత్యపరంగా విలువైన పాటల వల్లనే చాలా
సాదాసీదాగా క్లుప్తంగా చెప్పగలిగే కథని కూడా రెండున్నర గంటలు కూర్చొని సినిమాని
ఆస్వాదించే విధంగా రూపొందించగలిగారు. ఈ సినిమాకి మాటల రచయితలు నార్లచిరంజీవి, ఆచార్య ఆత్రేయ.
సినిమాలో పాటలన్నీ
ఇంచుమించుగా సూపర్ హిట్లే. పాటల రచయితలు నార్ల చిరంజీవి, శ్రీశ్రీ, ఆరుద్ర..
మొదటిపాట సావిత్రిని తన కలల నెచ్చెలిగా ఊహిస్తూ నాగేశ్వరరావుమీద చిత్రించిన –
నా హృదయంలో
నిదురించే చెలీ. అప్పటి తెలుగుసినీ సంప్రదాయం ప్రకారమే హీరో - పియానో వాయిస్తూ పాడే
పాట. విప్లవరచయితగా మంచి పేరు సంపాదించిన శ్రీశ్రీ కలలుకనే యువకుడి మనసును ఇంత అద్భుతంగా
ఆవిష్కరించి చాలామందిని ఆశ్చర్యపరిచారుట. ఈ పాట బెంగాలీ సినిమాలో వచ్చే సన్నివేశానికి తగినట్టుగానే తెలుగులో కూడా అదే ట్యూన్ లో స్వరపరిచారు సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావుగారు. ఘంటసాల సుమధురంగా ఆలపించిన గేయం ఇది.
తను ప్రేమించిన
వ్యక్తిని మరొకరికి అంకితం చేయవలసిన విషమ పరిస్థితికి లోనైనప్పుడు అనురాధ మనసు
ఎంతగా నలిగిపోయిందో చెప్పే సందర్భంలోని
పాట సావిత్రి మీద చిత్రించిన నీ చెలిమీ నేడె కోరితినీ. ఈ పాట రచయిత నార్ల చిరంజీవి. సావిత్రి
అభినయానికి వ్యాఖ్యానం అనవసరం అని అందరికీ తెలుసు. పైగా ఈ పాటలో ఏమిటి అసలు ఈ
సినిమాలోనే సావిత్రి అందం, సౌకుమార్యం, నటన అద్భతం, ఆమె పట్ల కలిగే ఆరాధనా భావం అనిర్వచనీయం
అప్పటి తెలుగు సినిమా
సంప్రదాయం ప్రకారమే విందుతర్వాత వినోదకార్యక్రమంగా ఓ జానపద గేయం. ఏమంటావేమంటావోయి
బావా అనే పాట.
ఈ సినిమా పాటల్లో
ఆరుద్ర రాసిన ఓ పాట కమెడియన్ రేలంగి మీద చిత్రించిన ఓహోహో మామయ్యా పాట చాలా మంచి
పాట. జూపార్క్ లో జంతువులను చూపిస్తున్నట్టే చెప్తూ మనిషిలోని భిన్న భిన్న
ప్రవృత్తులను ఎంతో అలవోకగా చూపిస్తారు ఆరుద్ర. అప్పటినుంచే తెలుగు దేశంలో బతికిన
కాలేజీ అంటే జూ పార్క్ అని ,చచ్చిన కాలేజీ అంటే మద్రాసులోని మెడికల్ కాలేజీని తర్వాత కొంతకాలం మద్రాసు మ్యూజియం అనీ పర్యాయపదాలుగా
చెప్పుకోవడం చూస్తాం.
అలాగే మరోపాట ఆడదాని ఓరచూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడూ అంటూ
సాగే క్లబ్ సాంగ్ లో కూడా చాలా జీవితసత్యాలు వెల్లడించారు ఆరుద్ర. తెలుగు
ఇంగ్లీషుపదాల కలగలుపుతో ఆరుద్ర మార్కు మంచి ఊపుగా సాగే పాట ఇది. రేలంగి, గిరిజ పాత్రల మధ్య సాగే ప్రణయ సన్నివేశంలో భాగంగా ఇంగ్లీషులోన మారేజీ పాట కూడా మరో ఆరుద్రమార్కు పాట.
గుడ్డివాడయిన
కృష్ణకు సేవ చేస్తూ అనురాధ పాడే జోలపాటగా వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ
కనులా సుశీల గొంతులో మాధుర్యాన్నంతా
జతచేసుకుని మంచి సాహిత్యంతో మెలోడియస్ గా వీనుల విందు చేస్తుంది. ఈ అద్భుతమైన లాలి
పాట శ్రీశ్రీ కలంనుంచి జాలువారింది.
సినిమాలో కథాబలం
తక్కువే అయినా , సగం సినిమా అంతా హీరో గుడ్డివాడే అయినా, పాత్రల ఔన్నత్యాన్ని
తీర్చిదిద్దడంలోను చక్కని తెలుగుతనం ఉట్టిపడే విధంగా మంచి సామెతలు, తెలుగు నుడికారానికి తగినట్టు సందర్భోచితంగా సాగే సంభాషణల విషయంలో తీసుకున్న శ్రద్ధ,
నాటకీయమైన సన్నివేశాలలో కూడా నటీనటుల శృతిమించని నటన సినిమాకు మంచి బలం తెచ్చిన
అంశాలు.
ఒక వ్యక్తిని ప్రేమించడం, ఆరాధించడం అంటే కేవలం మాటలలో చెప్పడం కాదని, మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా ఆత్మార్పణం చేసుకోవడం అనీ వారి సౌఖ్యంకోసం, సంతోషం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేయడం అనీ అనురాధ పాత్ర నిరూపిస్తుంది. ఆ విధంగా ఈ సినిమా పేరు కూడా సార్థకమయింది.
మంచి సినిమా....చాలా విపులంగా చక్కగా రాశారు. బాగుందిలా 50 యేళ్ళ తరువాత ఇంతటి ఆణిముత్యాన్నిలా గుర్తుచేసుకోవటం.
ReplyDeleteనచ్చినందుకు ధన్యవాదాలు.
DeleteA good recollection
ReplyDeleteధన్యవాదాలు.
Deleteవ్యాఖ్యానం బాగానే ఉంది గాని,'నాహృదయంలో నిదురించే చెలీ 'పాటకి విడియో సరిగానే ఉంది గాని ,ఆడియో మాత్రం మరేదో కొత్త పాట అసలు పాటకి బదులు వినిపిస్తోంది.సరిచేసుకోవాలి. ఇలా పాటలు పరిచయంచేయడం కన్నా ఏదైనా మంచి సినిమాకి నువ్వే చక్కటి పాటలు రాయడానికి ప్రయత్నం చేయకూడదూ ?కనీసం టీ.వీ.సీరియల్స్ కైనా .
ReplyDelete@ కమనీయం గారు,
ReplyDeleteయూట్యూబ్ వీడియో సరిచేసాను. థాంక్స్. పాటలు చూసి సంతోషించడమే తప్ప రాయడం రాదండీ. కనీసం టీవీ సీరియల్స్ కి కూడా..:))
అక్షరాలతో సిన్మా చూపించారు .... రాదు అనుకుంటే రాదు ... ఎందుకు రాదు అనుకోని చూడండి ( కమనీయం సలహా పై మీ సమాదానం చూసి ..
Deleteఆరాధన సినిమా రివ్యూ చాలా చక్కగా వ్రాశావు.
ReplyDeleteచాలా బాగుంది. మళ్లీ ఆ సినిమా చూసినట్టుంది.
నిన్న ఎక్ష్త్ర ఛానల్ లో ఈ సినిమా ౫౦ ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమం
వేసారు.
శ్రీశ్రీ నా హృదయం లో నిదురించే చెలి అన్న పాట తన శైలికి భిన్నంగా రాయడం గురించికూడా చెప్పారు.
ఇంకా ఇలాంటి ఆ పాత మధురాలు విశ్లేషణలు రాస్తావని ఆశిస్తూ.....
కామేశ్వరరావు
మంచి సినిమాని గుర్తుకు తెచ్చారు, ఈ మధ్యనే ఎక్కడో చదివాను. ఈ సినిమా సగం తీసేక విజయా రెడ్డి గారికి చూపించారుట. ఆయన అభిప్రాయంకోసం. సగం సినిమాలో నాగేశ్వర రావు గుడ్డివాడుగా తీస్తే ఎవరు చూస్తారు పెధ్ద ఫ్లాప్ అవుతుందన్నారుట.హీరో నాగేశ్వరరావుకూడా అది విన్నాక భయపడి సినిమాని ఆపెయ్యమని నిర్మాతను కోరేడుట. కానీ ఎలాగో సినిమా పూర్తవడం బయట పడడం జరిగింది.సక్సెస్ అయ్యింది. ఈ విషయం నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు. మన అదృష్టం బాగుండి మంచి సినిమా దక్కింది.మరో విషయం. ఈ సినిమా లో పియానో వాయిస్తూ నాగేశ్వర రావు పాట పాడి నప్పుడు పియానో మీద చూపించిన వేళ్లు అతనివి కావట. సాలూరి రాజేశ్వర రావు గారి అబ్బాయివట.
ReplyDeleteఒక చిన్న డౌటు..
ReplyDeleteఇదంతా ఈనాడు పేపర్ లో చదివిందే కదా మరి ఇప్పుడు మీరు కూడా ఈనాడు పేపర్ ని కాపీ కొట్టినట్లేనా...
మొన్నా మధ్య బ్లాగుల్లొవన్నీ పేపర్ లో వాళ్ళు ఎత్తుకెల్తున్నారని తాళాలు వేసుకునే ట్రైనింగ్ ఇచ్చారు కదా అందుకే అడుగుతున్నా...
చూడండీ అనానిమస్సూ....భాగవతం, భారతం, ఓ మేఘసందేశం, ఓ కన్యాశుల్కం ఇలా గొప్పరచనలెన్నో కొన్ని తరాలనుండీ మనం చదువుతున్నవే. వాటిని అందరూ చదువుతున్నా, అందులోని ప్రత్యేకతలు తెలుసుకుంటూనే ఉన్నా వాటికి వ్యాఖ్యానాలు రాకుండా ఆగలేదు. అంటే, అక్కడ రాసేరు కదా అని ఇక్కడ మానేయడం అంటూ లేదన్నమాటేగా.. ఎవరికి ఎలా నచ్చితే అలా దానిగురించి చెప్పడం సహజం. ఈ విషయం మీకు తెలీదని కాదు. నేనేం రాస్తానా ఏమన్నా అందామా అని పాపం కాచుకుని ఉన్నారు కదా. నామీద ప్రత్యేకంగా మీరు ప్రదర్శిస్తున్న శ్రద్ధాసక్తులకి ధన్యవాదాలు.
ReplyDeleteఎవరండీ మీ హృదయంలో నిలచిన ప్రియురాలు ? అని శ్రీ.శ్రీని ఎవరో అడిగారుట. దానికాయన
ReplyDeleteఇంకెవరు ? విప్లవమే ! అన్నారుట.
పాటల పూదోటలో విరిసిన పారిజాతమా ! అభినందనలు. అందుకోమ్మా !
శ్రీశ్రీ జవాబు చాలా బావుంది. మాటాడినా, పాటాడినా శ్రీశ్రీ...శ్రీశ్రీ యే. అభినందనలకి ధన్యవాదాలు.
Deleteసుధా గారు, మంచి సినిమా గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఈ సినిమా దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు. ఈయనను విక్టరీ మధుసూదనరావు అని కూడా పిలిచే వారు. మన హీరో వెంకటేష్ ను విక్టరీ వెంకటేష్ అన్నట్టు.
డి.మధుసూదనరావు (దుక్కిపాటి మధుసూదనరావు) ఈయన అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా చాలా విజయవంతమైన సినిమాలు తీసారు. తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మ గౌరవం, పూలరంగడు మొదలగునవి.
కావున విక్టరీ మధుసూదనరావు వేరు డి.మధుసూదనరావు వేరు. దీనిని ఈ వ్యాసములోని నాల్గవ పేరాలో సరిచేయగలరు.
ధన్యవాదాలు.
Best Wishes,
Suresh Peddaraju