అమ్మ నాన్న టివి చూస్తున్నారు.
అమ్మ లేచింది, ’అబ్బా ..చాలా అలసటగా ఉంది. బాగా లేటయింది. ఇంక పడుక్కోవాలి’ అంటూ వంటింట్లోకి నడిచింది.
మర్నాడు పొద్దున్న వంటకి కావలసిన వస్తువులన్నీ చూసుకుంది.మర్నాడు సాయంత్రానికి వండుకోవలసిన కూరలు ఉన్నాయో లేదో చూసింది.
ఉప్పు,పంచదార,గోధుమపిండి,పోపు డబ్బాలు తెరిచి చూసింది ఎంత ఉన్నాయో అని. పొద్దున్నే అప్పటికప్పుడు అవి అయిపోతే నింపుకోవడం హడావిడి లో కుదరదు మరి.
పిల్లలు తినడానికి కార్న్ ఫ్లేక్స్ డబ్బా,బౌల్స్, స్పూన్స్ డైనింగ్ టేబిల్ మీద పెట్టింది.కాఫీ ఫిల్టర్ లో కాఫీ పొడి వేసి, స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టింది. లేవగానే కాఫీ కలపడంకోసం.
బాత్రూం లోకి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి విప్పి పడేసిన బట్టలు,తడి తువ్వాళ్లు వాషింగ్ మెషిన్ లో పడేసింది. ఉతికిన బట్టల లోంచి మర్నాడు పిల్లలకు కావలసిన యూనిఫామ్ బట్టలు ఇస్త్రీ చేసింది.లూజ్ గా ఉన్న నిక్కర్ బటన్ ని కుట్టి, సరిగా లేని జిప్ ని బాగుచేసింది.
హాల్లో టేబిల్ మీద పడి ఉన్న గేమ్,దానికి సంబంధించిన ముక్కలన్నీ ఎత్తి అట్టడబ్బాలో పెట్టి షెల్ఫ్ లో పెట్టింది.కార్డ్ లెస్ ఫోన్ ని ఛార్జింగ్ కోసం బేస్ లో పెట్టింది. సెల్ ఫోన్ లోకి చూసి ఛార్జర్ తీసి ప్లగ్ లో పెట్టింది.కింద పడి ఉన్న టెలిఫోన్ డైరెక్టరీని మళ్లీ ఫోన్ పక్కన పెట్టేసింది.
ముందురూమ్ లో ఇందాక వాడిపోతూ దిగాలు పడినట్టుగా కనిపించిన ఇండోర్ ప్లాంట్ గుర్తొచ్చి జగ్ లో నీళ్లు తీసుకెళ్లి మొక్కకి పోసింది. పొద్దున్న కి అది మళ్ళీ నిటారుగా నిల్చుంటుంది కళకళలాడుతూ.
పిల్లల టేబిల్ చూడగానే గుర్తొచ్చింది, బాబు టీచర్ కి రాయవలసిన ఉత్తరం, పిక్నిక్కి వెళ్ళడానికి కట్టవలసిన డబ్బు. లెటర్ రాసి,పర్సుతీసి డబ్బు లెక్క పెట్టి దాని పక్కనే పెట్టింది.టేబిల్ కింద మూల దాక్కొని ఉన్న టెక్ట్స్ బుక్ తీసి స్కూల్ బేగ్ పక్కన పెట్టింది. చిన్నవాడి పెన్సిల్ బాక్స్ తీసి చూసి పెన్సిల్ చెక్కి ఉందోలేదో చూసింది.రబ్బర్ అరిగిపోయి చిన్నదయిపోయింది. కొత్త రబ్బరు పెట్టి బాక్స్ లోపల పెట్టింది.
ముందురోజు స్నేహితురాలి పుట్టినరోజు కోసం కొన్న గ్రీటింగ్ కార్డు బయటకి తీసి సంతకం చేసి కవర్ పైన స్టాంప్ అంటించి అడ్రెస్ రాసి బేగ్ లో పెట్టుకుంది, వెళ్తూ దారిలో పోస్టు చెయ్యొచ్చని.ఆచేత్తోనే రాసి పెట్టుకున్న,అయిపోయిన సరుకుల లిస్ట్ ని కూడా బేగ్ లో పడేసింది.వెళ్తూ ఆ షాప్ లో ఇచ్చేయొచ్చు.
వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి అద్దంలో మొహం చూసుకొని, పళ్లు తోముకొని, పొడి చర్మానికి నిగారింపు తెచ్చే క్లీనర్ తో మొహం కడుక్కొని బెడ్ రూంలోకి వెళ్ళింది. ముడుతలు పోగొట్టే నైట్ క్రీం రాసుకుంటూ గోళ్ల వైపు చూసుకుంది. సగం పోయిన నెయిల్ పాలిష్ చూసి రిమూవర్ తో తుడుచుకొని చేతులు కడుక్కుంది.
’ఏమిటి...పడుక్కుంటున్నానన్నావ్...’భర్త ప్రశ్న వినిపించింది.
’ఆ..ఆ...పడుక్కుంటున్నా’నని జవాబు చెప్పి తలుపులు అన్నీ వేసి ఉన్నాయోలేదో చూసింది. పెంపుడు కుక్క తినే ప్లేట్ శుభ్రంగా ఉందో లేదో చూసి అందులో కొంచెం నీళ్లు పోసి పెట్టింది. వరండాలో లైట్ ఆర్పి, అన్ని గదులు చూసింది. పిల్లలగదిలో లైట్ వెలుగుతోంది. పాప ఇంకా పడుక్కోలేదు. పడుక్కోమంటే ఇంకా కొద్దిగా మిగిలిన హోంవర్క్ చేసి పడుక్కుంటానంటూ ఏవో కబుర్లు చెప్పింది. కబుర్లు వింటూనే అక్కడ పడి ఉన్న వస్తువులన్నీ సర్ది,బాబు దుప్పటిసరిగ్గా కప్పింది.
మర్నాడు తెల్లబట్టలు వేసుకోవలసిన రోజని గుర్తుచేసిన పాపని ఓసారి అభినందించి మళ్లీ తెలుపు బట్టలు తీసి ఇస్త్రీ చేసింది. తెల్లసాక్స్ల్,బూట్లు బయట పెట్టి,నల్లబూట్లు,కంపుకొడుతున్న సాక్స్ ఓ పక్కగా పెట్టింది. వేరుగా ఉతకాలి అవి.
మంచం మీదకు చేరుకుంటూ అలారం పీస్ తీసి టైం సరిగ్గా సెట్ చేసి ఉందో లేదో చూసుకుంది.మర్నాడు ఆఫీసుకు వేసుకోవలసిన బట్టలు సిద్ధం చేసి పెట్టుకుంది.
మంచం మీద వాలి కళ్లు మూసుకొని ఆ రోజు చేసిన పనులు,మర్నాడు చేయవలసిన పనులు అన్ని పునశ్చరణ చేసుకుంది. ఇందాక కాఫీ కోసం నీళ్లు పెట్టి దించాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని అనుమానం వచ్చి కంగారుగా కిచెన్ లోకి వెళ్లి చూసుకొని హమ్మయ్య అనుకొని వచ్చి పడుకుంది. పడుక్కునేముందు నిత్యం చేసుకునే ప్రార్థనని ఒక్కసారి మనసులోనే చేసుకొని కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకుంది.
టివి చూస్తూ కునికిపాట్లు పడుతున్న భర్త సోఫాలోంచి లేచాడు.నేను పడుక్కుంటున్నా అని జనాంతికంగా ప్రకటించి టివి ఆఫ్ చేసి రిమోట్ సోఫాలో పడేసి లైట్ ఆర్పి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద పడుక్కుని క్షణంలో నిద్రపోయాడు. మరో ఐదు నిముషాల్లో ఆగదిలో గుర్రు గుర్రుమని శబ్దం వినిపించింది. భార్య అసహనంగా కదిలి తలగడతో చెవిని మూసుకుంటూ నిద్రపోడానికి ప్రయత్నం చేసింది.
కథ కంచికి మనం వంటింట్లోకి.....
.ఇందులో ఏదేనా అభూతకల్పనగా అనిపిస్తోందా...లేదుకదా...
.ఆడవాళ్ళే ఎక్కువ కాలం జీవించడానికి కారణం బోధ పడిందా...అవునుకదా...
ఎంత జీవితమూ సరిపోదు,ఆడవాళ్లకి...ఎందుకంటే ఇతరుల కోసం కూడా జీవించాలి కాబట్టి...యముడు ముందుగా పర్మిషన్ కోసం వస్తే "వీటలేదని చెప్పించి-వీలుకాదని పంపిస్తాం".
అందుకే
ఆడాళ్ళూ....మీకు జోహార్లు...
(నెట్ లో ఫార్వర్డు చేయగా వచ్చిన "why women are so special"అన్న సందేశం స్ఫూర్తితో(రచయిత(త్రి) ఎవరో కాని వారికి నా కృతజ్ఞతలు)
మా అమ్మ అలాగే చేసేది, ఉద్యోగం లేక పోయినా ఇప్పుడు నేనూ చాలవరకూ అంతే ,నిద్రపోయేముందు కదా అనుకుంటాం కాని చాలా పనులు చెయాలి అప్పుడుకూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే భర్త ఆఫిస్ నుండి రాగానే అలసటగా ఉంది అంటే కాళ్ళు వత్తనా ,ఏం ఏందుకు నిద్ర మద్యలో లేచారు ఏమైంది అని అడ్గడం కూడా చేయాల్సివస్తుంది :) కాని ఇవన్నీ భర్త ప్రేమ గా చూసే ఒక్క చూపులో మర్చిపోతాం అనుకోండి కాని అలా అనరుగా ప్రొద్దున్న నుండి రాత్రివరకు కాళియేగా అంటారు :)..మంచి టపా
ReplyDeleteచక్కగా రాశారు. మా అమ్మ అలాగే చేశెది. నేను అలాగే చేస్తున్నాను. కాకపోతే, ఇప్పుడు మనకోసం కొన్ని వ్యాపకాలు కల్పించుకునే అవకాశం ఉంది. ఈ బ్లాగులోకమే కానివ్వండి, పుస్తకాలు, ఎవరూ తోడు లేకపోయినా బయటికి వెళ్ళివచ్చే ధైర్యం కానివ్వండి.
ReplyDeletechaala chakkagaa raasaru.baguMdi.
ReplyDeleteనా భార్య దినచర్యను ఇక్కడ చదువుతున్నానేమిటా అనిపించింది.
ReplyDeleteఒక అంశంపై ఏదైనా చెప్పాలనుకొన్నప్పుడు, ఆ అంశం కి సంబంధించిన విషయాలను మాత్రమే చెప్పటం ఒక ప్రక్రియ.
రెండో కోణాన్ని చెప్పయత్నించటంవల్ల, విషయం పలుచనై కలగాబులగమై, తన శక్తిని కోల్పోతుంది కదూ.
ఈ వ్యాసం రెండోకోణాన్ని(కుటుంబంలో నాన్నపాత్ర) పూర్తిగా పక్కనపెట్టేయటం వలననే నచ్చుతుంది.
నామట్టుకు నాకు మా అమ్మగుర్తున్నంతగా మానాన్నగారు గుర్తులేరు. (ఇద్దరూ గతించి చాలాకాలమే అయ్యింది). బహుసా రేపు నా పిల్లలకూ అంతే నేమో. అందుకనే మరొక్కసారి ఆడాళ్లూ మీకు జోహార్లు.
సుధా..
ReplyDeleteటపా చాలా బాగుంది. " అమ్మ " దిన చర్య గురించి బాగా రాసావ్.
ఇప్పుడిప్పుడే " నాన్న " లు కూడా వీటిల్లో షేర్ చేసుకుంటున్నారు మున్ముందు పూర్తి స్తాయి
మార్పుని చూస్తామేమో కూడా.
ANY WAY.....
ఆడవాళ్ళూ మీకు జోహార్లు .