11 February 2009

తెలుగు కథకి జేజేలు

తెలుగు కథకి నూరేళ్ళ పుట్టినరోజు,వచ్చేసంవత్సరం అంటే 2010,ఫిబ్రవరి లో.

ఏవిఁటీ,కథ పుట్టి వందేళ్ళేనా అని ఆశ్చర్యంగా ఉందా.

కథ కథ ఈనాటిది కాదు.ప్రతి మానవసమాజంలోను లిఖితరూపమైన సాహిత్యం ఆవిర్భవించక ముందే మౌఖిక సాహిత్యం ప్రచారంలో ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తాయి.మన ప్రాచీన సాహిత్యంలో కూడా వేదాలకు అనుబంధాలుగా కనిపించే ఐతరేయ బ్రాహ్మణం వంటివాటిలో అనేక నీతికథలు కనిపిస్తాయి.

ఇవన్నీ మౌఖికంగా ప్రచారంలో ఉన్న కథలు.వేదాలలో తేలిగ్గా స్పృశించి వదిలిన కథావస్తువులు అద్భుతమైన కథలుగా మారి పురాణాలుగా,ఇతిహాసాలుగా ప్రజలలో తరతరాలపాటు నిలిచిపోయాయి.పంచతంత్రకథలు,కాశీమజిలీ కథలు, పంచవింశతి కథలు ఇలా ఎన్ని కథలు ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్నాయి.

తెలుగు భాష లిఖితరూపం పొంది బాగా ప్రజాదరణ పొందే నాటికి ఈ పురాణేతిహాసాలన్నీ కావ్యరూపంలోకి మారి కథాకావ్యాలయ్యాయి. వస్తు కల్పనలో,అద్భుత చిత్రణలో, పాండిత్యంలో కవులు చూపిన కొత్తపోకడలు మరెన్నో శతాబ్దాలపాటు కవులకు ఆదర్శంగా,ప్రజారంజకం చేస్తూ నిలిచాయి.లిఖించబడని కథలెన్నో తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి.పేదరాశిపెద్దమ్మ కథలు,తెనాలిరామలింగడి కథలు,మర్యాద రామన్న కథలు సాహసానికి, చమత్కారానికి,తెలివికి ప్రతీకగా నిలిచాయి.

ఈ రకంగా చూస్తే కథలు మనకు,మన సమాజానికి కొత్తవి కాదు.

కానీ ఇరవయ్యవశతాబ్ది ఆరంభంనాటికి పాశ్చాత్య పాలనలో సంస్కృతి,నాగరికత,విద్యావిధానాలు మొదలైన వాటివలన వచ్చిన మార్పులెన్నో భారతీయ సాహిత్యంపైన ప్రతిఫలించాయి. ఇలా సాహిత్యంలో వచ్చిన మార్పులతో ఏర్పడిన కొత్త ప్రక్రియలు -కవిత్వంలో నవ్వకవిత్వం,భావకవిత్వం ,నవల,కథ లేక కథానిక ప్రక్రియలు ఏర్పడ్డాయి.

అగ్నిపురాణంలో ఏనాడో కథ గురించి ప్రస్తావించి,లక్షణాలు వివరించారు. పొందికగా ఉండి,పఠితకి సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలతో కూడి అద్భుతమైన మలుపుతో కథ ముగియాలని వివరించబడింది.ప్రాచీన కావ్యాలలో ఈ లక్షణాలతో కూడిన కథలు కనిపిస్తాయి కానీ శిల్పరీత్యా ఇంకా తీర్చిదిద్దినప్పుడే ఇవి మంచి కథలవుతాయని పండితుల అభిప్రాయం.

అందువల్ల కథ లేదా కథానిక అని మనం ఇప్పుడు అంటున్న ఈ కథ కొత్తప్రక్రియ.రూపంలోను, లక్షణంలోనూ మన ప్రాచీన సాహిత్యానికి భిన్నమైనది.ముఖ్యంగా నాటికి నేటికి కథ లో ఉన్న తేడా శిల్పం.

ఇప్పుడు ఆధునిక కాలంలో మనం కథ అని వ్యవహిస్తున్న పదం ఇంగ్లీషులోని షార్టుస్టోరీ కి పర్యాయ పదంగా వాడుతున్నాం..

ఆధునికసాహిత్యంలో సుమారుగా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఒకే సారి ఉద్భవించిన ప్రక్రియ ఈ షార్టు స్టోరీ.వస్తువు, శిల్పంవిషయంలో ఎంతో వైవిధ్యంతో మలచబడ్డాయి ఆధునిక కథలు.

ఆధునిక కథని నిర్వచించినప్పుడు పండితులు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కథ లో ఎత్తుగడ,నడక,ముగింపు, వీటిలో రచయిత చూపించే కొత్తదనం,నేర్పు,పరిమితమైన పాత్రలతో,ఒకానొక జీవితసత్యాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలుస్తుంది. ఆధునిక కథకి ప్రాణం -శిల్పం.ప్రాచీన సాహిత్యంలా కాకుండా ఆధునిక కథకి సమకాలిన మానవ జీవితమే వస్తువు.కథలో క్లుప్తత ముఖ్య లక్షణం కావడంవలన అనవసరమైన వర్ణనలు,అనవసరమైన పాత్రలు ఉండవు.కథలో ప్రతి సన్నివేశం,ప్రతి వాక్యం కూడా కథలోనే ప్రధాన కేంద్రం వైపే సాగిపోతాయి.వస్తువులో ఒక విలక్షణత్వం,మంచి ప్రారంభం,ముగింపు,పాత్రోచితమైన భాషను ప్రయోగించడంలో రచయిత ప్రదర్శించే నేర్పు ఇవన్నీ ఒక వస్తువు మంచి కథగా రూపొందడానికి తోడ్పడే అంశాలు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదట ప్రచురించబడిన కథ -దిద్దుబాటు.1910,ఫిబ్రవరి నెలలో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడింది. కథా రచయిత గురజాడ అప్పారావు.

19 వశతాబ్ది అర్థభాగంనుంచి వీరేశలింగం పంతులుగారు వెలార్చిన సంస్కరణోద్యమాలు,గిడుగు రామమూర్తి పంతులుగారి లాంటి సమకాలికుల వ్యావహారిక భాషోద్యమాలు,శాస్త్రీయ దృష్టి గురజాడ లో నవ్యసాహిత్యం- కవిత్వంలోనూ,వచనంలోనూ కొత్త పోకడలకు నేపథ్యం గానిలిచాయి.

అడుగుజాడ గురజాడది అదిభావికి బాట-అని తెలుగు ప్రజలు గురజాడని ఆధునిక సాహిత్యానికి మూల పురుషుడుగా గౌరవిస్తారు.తన కాలంలో అసలెప్పటికీ సాధ్యం కావేమో అని పించిన సంస్కరణభావాలను తన కవితలలోను కథలలోను వస్తువు,పాత్రలద్వారా ప్రతిఫలించి ముందుకాలానికి చూపు సారించిన ద్రష్ట గురజాడ అప్పారావు.

గురజాడ రాసిన కథానిక దిద్దుబాటు ఇంగ్లీషు షార్టుస్టోరీ నిర్వచనానికి,లక్షణాలకి అనుగుణంగా కనిపిస్తుంది.గురజాడ దీనికి మొదట పెట్టిన పేరు దిద్దుబాటు అయినా తరువాత కమలిని అని దీని పేరు మార్చడంలో ఉద్దేశం కూడా కథలో కనిపించని ప్రధానపాత్ర నాయిక-కమలిని ప్రత్యేకత నిరూపించడం కోసమే.

మొదటి దిద్దుబాటు కథలో సరళగ్రాంథిక భాష,సవరించిన దానిలో సరళ వ్యావహారికం కనిపిస్తాయి.కథలో ప్రధాన పాత్రలు రెండే.కనిపించని మరో పాత్రే కథానాయిక.చదువుసంధ్యలు నేర్చిన పడతి భర్తని తనకి అనుకూలంగా మార్చుకొని అతని లోని వేశ్యాలోలత్వాన్ని దూరం చేయడం ప్రధాన కధాంశం.స్త్రీలు చదువుకోవడం వలన కుటుంబానికే కాక సమాజానికి కూడా చాలా మేలు చేకూరుస్తుందని నిరూపించదలిచి ఈ వస్తువును తీసుకున్నారు.

వేశ్యలను ఉంచుకోవడం,వారి ఆటపాటలమధ్య ఆనందం పొందడాన్ని మగవారి అత్యంత సహజగుణంగా భావించే రోజులు కథకి నేపథ్యం.వేశ్య ఇంటినుంచి వచ్చిన భర్త, భార్య తన గదిలో కనిపించక వెతుక్కుంటాడు.పనివాడు తనకు తెలియదంటాడు.ఆమె రాసి పెట్టిన ఉత్తరం చూసి తనపై కోపించి ఆమె పుట్టింటికి వెళ్లి పోయిందని అర్థం చేసుకుంటాడు. తనకి బుద్ధి వచ్చిందని చెప్పమని,ఇంక వేశ్యలో జోలికి వెళ్ళనని పనివాడి ముందు ప్రమాణం చేసి భార్య పైన తన ప్రేమను వెల్లడిస్తాడు.ఎలాగయినా ఆమెని తిరిగి తీసుకురమ్మని పనివాడిని పంపిస్తాడు.మధురమయిన గాజుల చప్పుడు, మంచం కింద నుండి వినిపించిందని కథ ముగియటంలో భార్య ఎక్కడికీ వెళ్ళలేదని,భర్తని తన తప్పు తెలుసుకొనేలా చేసిన ప్రయత్నం అని పాఠకులకు తెలుస్తుంది.

గురజాడ చేతిలో అద్భుతంగా ప్రాణం పోసుకున్నతెలుగు కథానిక క్రమక్రమంగా వికసించి,విస్తృతంగా వ్యాపించింది.ఎందరో రచయితలు తెలుగు కథ కి వస్తు వరణంలో,పాత్రచిత్రణలో,శిల్పనైపుణ్యంలో కొత్తతోవలు తొక్కి కథకి అంతర్జాతీయ స్ధాయిని ఆపాదించారు. గౌరవాలు దక్కించారు.ఎన్నో కథలు ప్రపంచంలో ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి.

క్రమంగా తెలుగులో పత్రికల ప్రచురణ బాగా ఊపందుకున్నాక కథలు రాసే రచయితలతో పాటు రచయిత్రులు కూడా పెరిగారు.పత్రికలు, రేడియోలు,టెలివిజన్ లు ఇలా ప్రసార మాధ్యమాలన్నిటిలోను కథ ఒక తప్పని సరిగా కావలసిన వినోద సాధనమైంది. సాంకేతిక పరిజ్ఞానం ఇనుమడించి కాలం 21వ శతాబ్దికి అడుగుపెట్టేనాటికి ప్రపంచం ఒక కుగ్రామంగా భావించే స్థాయికి మానవ సమాజం చేరుకుంది. ఇంటర్నెట్ పేరున అంతర్జాలం లో ఎన్నో సాహిత్య పత్రికలు ఆవిర్భవించాయి.తెలుగు కు సంబంధించి ఎన్నో పత్రికలు అంతర్జాలంలో ఉన్నాయి. పత్రికలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం వలన రచయితలు భారత దేశం బయట కూడా ఉండి రచనలు చేసే సౌకర్యం వచ్చింది.కథా వస్తువు భారతదేశం దాటి ప్రపంచంలో ఏ మూల నివసించిన వారి జీవితమైనా కావచ్చు.ఈ రకంగా వస్తువైవిధ్యం పెరిగింది.మానవజీవితంలో ఆవిష్కరింపబడని కొత్త కోణాలను కథారచయితలు స్పృశించి,సృజించగలుగుతున్నారు.

భాషలో కూడా ఎంతో మార్పు వచ్చింది. సరళ గ్రాంధిక భాషలో ప్రారంభమయిన కథ ప్రస్తుతం పూర్తిగా సరళమై, వ్యావహారికశైలిని సంతరించుకుంది.కొందరు రచయితల చేతిలోమాండలికభాషలోని మాధుర్యాన్నిఅద్దుకుంది.

ఆధునిక కథ కేవలం కాలక్షేపానికో,వినోదానికో మాత్రమే పరిమితంకాలేదు.వర్తమాన మానవుడి జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ, మానవసమాజాన్ని సహజాతిసహజంగా చిత్రించడమే కాక అందులోని వికృతిని,మానవస్వభావంలోని సున్నితకోణాలను చూపుతూనే మృగప్రవృత్తిని ఎండగట్టింది.ప్రజలలో ఒక మానసిక విప్లవం ఆవిర్భవించడానికి కథల ద్వారా రచయితలు ప్రయత్నం చేసారు. చక్కని శైలిలో సమకాలిన వస్తువుతో ప్రతిభావంతుడైన రచయిత చేతిలో మలచబడిన కథలు ప్రజల మానసిక ప్రవృత్తిలో మార్పుతెచ్చి మనిషిని దానవత్వం నుంచి మానవత వేపుకి దృష్టిసారించేలా చేయగలవని నిరూపించబడిన సత్యం.

ఈ వందేళ్ళుగా తెలుగు కథ జీవవాహినిగా ప్రవహిస్తూనే ఉంది.గురజాడ మొదలుగా నేటి వరకు ఎందరో రచయితలు తెలుగు కథానిక ప్రక్రియను జవజీవాలతో పరిపుష్టం చేస్తూనే ఉన్నారు.తెలుగు కథ సజీవస్రవంతిగా సాగిపోతూనే ఉంది,ఉంటుంది. వందేళ్ళ పుట్టిన రోజు చేసుకుంటున్న తెలుగు కథకి అందరం చప్పట్లు కొట్టి జేజేలు చెబ్దాం.