12 February 2011

ఘంటసాల ముచ్చట్లు



ఈ రోజు ఫిబ్రవరి 11. అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారి వర్థంతి. డిసెంబరు 4 ఘంటసాల గారి పుట్టినరోజు. 


ఘంటసాలగారి జయంతి నే కాక వర్థంతిని కూడా ఒక ఉత్సవంలాగ నిర్వహించి సంబరపడుతూ ఉంటారు ఘంటసాల అభిమానులు.ఆయన మనకు మిగిల్చి వెళ్ళిన పాటలను,  పద్యాలను పదే పదే పాడుకుంటారు. ఘంటసాలగారి గురించి ఎక్కడ కార్యక్రమం జరిగినా వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. ఘంటసాలగారి బొమ్మ చూపిస్తూ ఏ విశేషాలు చెప్పినా మరల మరల వింటారు. నిజానికి 1974 లో ఆయన ఇహలోకాన్ని విడిచి పెట్టి వెళ్ళి 37 సంవత్సరాలు గడిచినా,  ఆనాటికి ఇంకా కళ్ళు తెరవని పసి కూనలు కూడా ఆయన పాడిన పాటలని  తమ ముందుతరం ఎంత పరవశంతో విన్నదో అంతే పారవశ్యంతో వింటూ వాటిని ఆనందించగలగడమే  ఘంటసాల అమరత్వాన్ని ఋజువు చేస్తోందన్నమాట.


ఆనాడు ఘంటసాలగారి వాద్యబృందంలో ఒకరిగా ఉంటూ హార్మోనియంపై సహకారం అందిస్తూ, ఘంటసాలగారు విజయనగరంలో  సీతారామ శాస్త్రిగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నప్పటి  విద్యార్థి దశనుంచి కొంత కాలం విరామంతో ఘంటసాలగారు  స్వర్గస్థులయ్యే వరకు వారి సంగీత సాహచర్యంలో వెన్నంటి ఉన్నారు శ్రీ సంగీత రావుగారు.


సంగీతరావుగారు గురువుగారు సీతారామశాస్త్రిగారి  పెద్దకుమారులు. గురుపుత్రుడుగా సంగీతరావుగారిని ఎంతో ప్రేమాభిమానాలతో గౌరవంతో చూసేవారు ఘంటసాల. సంగీతరావుగారిని సంగీతం బాబూ అని పిలిచేవారట ఘంటసాల.


 గాయకుడిగా ఘంటసాల గారి  వృత్తిజీవితంతో పాటు చిరపరిచయం వలన వ్యక్తిజీవితం కూడా తెలిసిన వారు సంగీతరావుగారు. 


నిజానికి ఘంటసాల సంగీతం గురించి, రాగ ప్రయోగాలలోని విశిష్టతను, విలక్షణతను  గురించి  అధికారంతో  చెప్పగల   ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వారు  సంగీతరావుగారు. 


ఘంటసాల సంగీతం గురించే కాదు, ఆయన గురించి ఎన్ని విశేషాలు చెప్పినా సంతోషంగా చెవిఒగ్గి వినే అభిమానుల కోసం, ఘంటసాలగారి మిత్రుడు సంగీతరావుగారు విజయచిత్రలో ఒకప్పుడు రాసిన వ్యాసం ఇక్కడ మరోసారి ప్రచురిస్తున్నాను.




ఇవి ఘంటసాలగారి  గురించి సంగీతరావుగారు చెప్పిన  ముచ్చట్లు. చిత్తగించండి.....
.


సంగీతరావుగారు



ప్రజల గాయకుడు శ్రీ ఘంటసాల పుట్టిన రోజు డిసెంబరు 4. ఫిబ్రవరి 11 వ తేదీని ఆయన వర్థంతిగా శ్రీ ఘంటసాల జయంతి ఉత్సవాలు, వర్థంతి ఉత్సవాలు ఆంధ్ర దేశంలోను, ప్రవాసాంధ్రంలోనూ చాలా చోట్ల ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. ఒక గాయకునిగా ప్రజాభిమానాన్ని ఇంతగా పొందడం అపూర్వమైన విషయం. అయితే ఒకటి నిజం. తెలుగు ప్రజలు తమ సంగీత దాహం శ్రీ ఘంటసాల గానామృతంతోనే సంపూర్ణంగా తీర్చుకున్నారన్నది సహజోక్తి. నిజానికి గాయకునిగా శ్రీ ఘంటసాల గొప్పదనాన్ని ఎవరూ  పని కట్టుకొని విశదీకరించనవసరం లేదు. తెలుగు ప్రజలందరికీ అనుభవైకవేద్యమైనది ఆయన పాట.

గాయకునిగా ఇంతటి విజయం పొందడానికి కారణాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన కంఠస్వరం. శ్రీ చిత్తూరు నాగయ్యగారు చెప్పినట్టు శ్రీ ఘంటసాల కంఠంలో తంబూరా నాదంలో ఉన్న జీవస్వరం ఉంది. ఏస్థాయిలో పాడినా ఒకే విధమైన నిండుతనం. గాత్రంలో కాని, ఉచ్చారణలో కాని ఏ విధమైన కృత్రిమత్వం లేదు. వాటికి తోడు రసస్ఫూర్తిగా గానం చేసే  ప్రతిభ. మరోసంగతి, ఒక నాయకుడు గాని, ఒక గాయకుడు గాని, కవిగాని ప్రజా జీవితంలో ఒక భాగంగా గుర్తించచబడితే నాటి పరిస్థితుల ప్రభావం కూడా ఉందన్నమాట.
శ్రీ ఘంటసాల దేశానికి పరిచయమయే నాటికి సంగీత రసికుల పరిస్థితి ఏమిటి. ఒక వంక ఒక మహోద్యమంలా శాస్త్రీయ సంగీత సాధన జరుగుతూ ఉంది. మనవారు పొరుగు రాష్ట్రానికి వెళ్ళి వాళ్ల బాణీలో శ్రీ త్యాగరాజస్వామి కృతులు గానం చేసే విద్వాంసుల గానాన్ని ఆనందించగలిగే రసజ్ఞత అలవర్చుకుంటున్న సమయం. ఆ సంగీతం పట్ల ఎంతో  భక్తి ప్రపత్తులు కలిగినా ఉచ్చారణలో ఉన్న అసహజత్వం వల్ల ఆయా రచనలు తెలుగు భాషలో ఉన్నా అవి మనవి అన్న మమకారం కలిగించలేదు.

అదే విధంగా ఆనాడు స్టేజి సంగీతం విపరీతమైన జనాదరణ పొందుతున్న రోజులు. మైలవరం నాటక సంగీతం వెనకపడి, బాల గంధర్వ, మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు వ్యాస్ మొదలైన మహారాష్ట్ర గాయకులు పాడిన పాటల ఒరవడి తెలుగు స్టేజి సంగీతాన్ని ఆక్రమించుకొంది. శ్రీ సి.ఎస్.ఆర్., శ్రీ రఘురామయ్య, శ్రీ తుంగల చలపతిరావు, శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి ఇత్యాదులు అందరూ మహారాష్ట్ర సంగీత ప్రభావంతో గానం చేసినవారే. తెలుగు సంగీత రసికులు ఆ గానంతో కూడా తన్మయత్వం చెందేరు. నిజమే. కాని ఆ పాట కూడా తెలుగు పాట అనిపించలేదు. తెలుగు సినిమా, పౌరాణిక చిత్రాల యుగం వరకూ తెలుగు చలన చిత్ర సంగీత పరిస్థితి కూడా ఇదే.

ఈ పరిస్థితిలో సినిమా తెర వెనుక కంఠం నుంచి వినిపించింది -తరాలుగా ఎదురు చూసిన  తెలుగు పాట. నవరసభరితమైన పాట, గుండెలు కదిలించిన పాట. అదే ఘంటసాల పాట. తెలుగువాడు నాదీ అని గర్వంగా చెప్పుకోగలిగిన పాట అది. కష్టంలోను, సుఖం లోను, ప్రతి అవస్థలోనూ సానుభూతితో పలకరించే ఆ పాట అవిచ్ఛిన్నంగా మూడు దశాబ్దాలు వినిపించింది. అంతే కాదు తెలుగు సినిమా సంగీతంలో ఒక నవ్య శకమే స్థాపించింది. దక్షిణదేశం అంతా నేపథ్యగానానికి ఘంటసాల పాటే ఒరవడి అయింది.

ఈ నాడు ఘంటసాల ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ.

గాయకునిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా శ్రీ ఘంటసాల స్మరణీయుడు. తాను మనసారా నవ్వి, ఇతరుల చేత కూడా నవ్వింపజేసే మధుర హృదయం ఆయనది. వృత్తి ధర్మంగాను, స్నేహ ధర్మంగానూ  ఆయనతో కలిసిమెలిసి జీవితం పంచుకున్నవారు చెప్పుకొనే మధుర స్మృతులు ఎన్నో. ఏదైనా పాట కంపోజింగ్ లో కాని, పాట రిహార్సల్స్ లో గాని, దర్శకులు, కవులూ, వాద్య బృందం అందరితో శ్రీ ఘంటసాల కూడా ఉన్నారంటే అదో మధురమైన అనుభవంగా ఉండేది. జరగవలసిన పని మందకొడిగా ఉంటే హుషారు కోసం ఎన్ని ముచ్చటలో చెప్పేవారు. ఎన్ని పాటలో పాడేవారు.

ఘంటసాలగారు స్వర రచన చేసేటప్పుడు ఎందరో సినీ కవులతో కలిసి పనిచేసారు.  రచనలో మన కవులందరిదీ 
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి.

శ్రీ సముద్రాల సీనియర్ - ఏదైనా పాట రాయవలసి వస్తే ఇటు దర్శకుడు, సహాయ దర్శకుడు, నిర్మాత ఆఖరికి ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ తో కూడా సంప్రదించి పాట ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకొని రికార్డింగ్ ఎప్పుడు పెట్టుకుంటున్నారో తెలుసుకొని చివరికి సంగీత దర్శకుడితో - ఏది బాబూ ట్యూన్ ఒకమారు అనండి అని అడిగి తనన తనన తన అది కదూ. తా తనన తన అనుకోవచ్చును కదా అని
అక్కరలేని సందేహం తీర్చుకొని ఒక లైన్ పల్లవి రాసి ఇచ్చి అంతా రాసేసి ఉంది తలకాయలో. కాగితం మీద పెట్టడమే తరువాయి అని మరో సంస్థకు వెళ్ళేవారు.

ఇక కొసరాజు గారు - పాట అంతా పూర్తిగా రాసి వచ్చేవారు. వారు రాసి, పాట ఆయనే వినిపించేవారు. సంగీత దర్శకులు కూడా ఆయన పాడిన ట్యూనే తీసుకునే వారు. కారణం, ఆ తరహా పాటలకి అదే సరి అయిన ట్యూను.

శ్రీ కృష్ణశాస్త్రిగారు పాట రాయడానికి కూర్చుంటే సంగీత దర్శకులు అలా పాడుతూ కూర్చోవలసిందే. ఆయన కళ్ళు పెద్దవి చేసుకొని చిరునవ్వుతో అలా వింటూ ఉండేవారు. ఒక్క అక్షరం కూడా రాసేవారు కాదు. ఒకసారి, ఒక పాట రాస్తున్న సందర్భంలో ఘంటసాల ట్యూన్  వినిపిస్తూనే ఉన్నారు. తానా తననా తనన తాన తాన అంటూ పాడుతున్నారు. ఎప్పటికీ  శాస్త్రిగారు ఒక మాట కూడా ఇవ్వలేదు. అందరికీ విసుగు వచ్చిందని తెలుసుకొని శాస్త్రిగారు కాగితం మీద రాసేరు ఒక లైను. ఓసీ పిశాచీ కదలిరావే బూచీ .....ఇదే కదా మీ పాట కొలతలు అని.


శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారయితే ఇలాంటి అబద్ధపు సాహిత్యం మంచి రక్తి అయిన భాషలో రాస్తుండేవారు నవ్వుకొనేందుకు.

శ్రీ ఘంటసాలకు స్వయంగా పాటలు రాసుకొనే ధోరణి కూడా ఉండేది.

బహు జనాదరణ పొందిన బహుదూరపు బాటసారి ఆయన స్వీయ రచనే. ఆ పాట లోని మార్మిక కవిత్వం గురించి వివరణ అడిగితే ఇలా చెప్పేరు. ఆయన మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో శోభనాచల స్టూడియోలో కాలక్షేపం చేస్తున్న రోజుల్లో అర్ధరాత్రి పెట్రోమాక్స్ లైట్లతో ఒక శవాన్ని ఊరేగింపులా శ్మశానానికి తీసుకొని వెళ్తున్న దృశ్యమే ఆ పాట రచనకి ప్రేరణ అని చెప్పారు.

చివరి దశలో ఇది సంధ్యా సమయం అనే స్వీయ రచన రేడియోలో పాడిన జ్ఞాపకం.

సంగీతంలో సంప్రదాయం అంటే శాస్త్రీయ సంప్రదాయం మాత్రమే కాదు. శాస్త్రజ్ఞులు అంగీకరించిన దేశి సంప్రదాయం కూడా ఉంది. భజన కీర్తనలు, ఊడుపుల పాటలు, నూర్పుల పాటలు, దంపుళ్ళ పాటలు, స్త్రీల పాటలు, జోల పాటలు అనేక రకాలు. ఇవన్నీ దేశి సంప్రదాయమే.

శ్రీ ఘంటసాలకి శాస్త్రీయ సంగీతం మీద ఉన్నంత ప్రేమ, గౌరవం ఈ దేశి సంప్రదాయం మీద కూడా ఉండేది. ఒకసారి ఎవరో అడిగేరు. మీరు ఇంత ఆవేశంతో ఎలా పాడగలుగుతున్నారని. దానికి బుర్రకథా శ్రవణం వంటి వాటి ప్రభావం కారణం అని చెప్పేరు.

సంగీత దర్శకత్వంలో ఆయనకి దేశి సంప్రదాయం ఎంతో అవసరం అయేది.
ఒకసారి వినాయక చవితి చిత్రానికి సంగీతం నిర్వహిస్తున్న రోజులు. ఆ చిత్రంలో పార్వతీ దేవికి నలుగు పెట్టే సందర్భంలో పాట కావలసి వచ్చింది. ఆయన ఏదో చేయగలరు. కానీ సాధ్యమైనంత వరకు సంప్రదాయం పాటిస్తే ఉచితంగా ఉంటుంది. ఇంటికి రాగానే ఒరే రాజీ అని పిలిచేరు.(భార్య శ్రీమతి సావిత్రమ్మగారిని ఆయన పిలిచే పద్ధతి అది. ఏదైనా నలుగు పాట వస్తే పాడరా అని అడిగేరు. ఈ రకమైన పాటల పరిచయం ఉంది ఆవిడకు. ఆవిడ ఇచ్చిన పాట వరసే తర్వాత వచ్చింది సినిమాలో పార్వతీ దేవి పరంగా.

శంకరాభరణం స్వరాలు తిశ్రం.
ససగ గగమ మప పప పమ
నలుగిడరె, నలుగిడరె
గమ పదనిరి సనిదపా
నలుగిడరా......రే
సససససని గరి సనిదప
చెలువుగ శ్రీ గౌరి కిపుడు
సనిదప గమపగ మరిగస
నలుగిడరా.........రే
(పల్లవి మాత్రం)

హిందుస్తానీ, కర్ణాటక సంగీతం అన్నా విద్వాంసులన్నా ఎంతో గౌరవం, ప్రేమ ఉండేవి ఆయనకి. 1950-60 ల మధ్య శ్రీ ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ రెండు మూడు సార్లు మద్రాసులో మకాం పెట్టేరు. రెండు, మూడేసి మాసాలు ఘంటసాల గారింట్లోనే. 

ఆ రోజుల్లో ఘంటసాలగారి స్వగృహం 35, ఉస్మాన్ రోడ్ (ప్రస్తుతం 151) మద్రాసు లోని శాస్త్రీయ సంగీతాభిమానులకు యాత్రా స్థలం అయింది. శ్రీ ఘంటసాల గాత్రం విని శ్రీ బడే గులాం ఆలీ ఖాన్ ముగ్థులై రెండు మూడు భజన్ లు కూడా చెప్పేరు.

ఘంటసాల మద్రాస్ వచ్చిన మొదటి రోజుల్లో మ్యూజిక్ అకాడెమీ లో నిస్సార్ హుస్సేన్ ఖాన్ కచేరీకి శ్రీ ఘంటసాల సంతోషంగా, అదీ ఒక గౌరవంగా భావించి తంబూరా శ్రుతి వేసేరు.

శ్రీ ఘంటసాల ఒక విధమైన ఆదర్శ జీవి. దేశ సేవకి సంగీతజ్ఞుడిగా, గాయకునిగా వినియోగపడాలని ఆశించేవారు. కాలక్షేపం కబుర్లు చెప్పుకొనేటప్పుడు తప్పకుండా ఆయన 1942 ఆగష్టు ఉద్యమంలో పాల్గొన్నప్పటి జైలు జీవిత విశేషాలు చెబుతూ ఉండేవారు. ఈనాటి దేశ నాయకులు చాలామంది శ్రీ ఘంటసాల జైలు మిత్రులు.

రసజ్ఞత లేని శ్రోతల సమక్షంలో పాడవలసి వచ్చినప్పుడు    గురువుగారు పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఎంతో నిర్వేదంతో  చెప్పిన పద్యం ఒకటి ఉండేది.
............................................
లోక మోహన కర గాన విద్యనకటా
వికటంబుల పాలు చేసి జీవనమును బుత్తువా
దురిత భారము నెత్తిన మోసి మూర్ఖుడా –అని.

 సంగీత దర్శకత్వంలో ట్యూను విషయంలో దర్శకులు నిర్బంధం ఒక్కొక్కప్పుడు  తప్పనప్పుడు, ఘంటసాల గారు ఈ పద్యం పాడుకునేవారు.

  
ఎంతో గాఢమూ, ఆవేశ పూరితమూ, నిర్విరామమూ అయిన ఆయన జీవిత విధానానికి ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. మొదటినుంచీ ఆయనది అస్వస్థత కలిగిన శరీరమే. శరీరం ఏదో భాగానికి ఎప్పుడూ చికిత్స అవసరమే. ఒక్క కంఠం తప్పించి ఆయన శరీరం ఆయనకి సహకరించలేదు. వంశపరంపరగా వచ్చిన మధుమేహ వ్యాధికి చికిత్స సంపూర్ణమైన సత్ఫలితాన్ని ఇచ్చేది కాదు. వైద్యం విషయంలో ఆయన వట్టి అమాయకుడు. మధుమేహానికి నియమ నిబద్ధమైన ఆహార విహారాలు అవసరం అన్న మాట మీద ఆయనకు నమ్మకం ఉండేది కాదు. ఎవరు ఏ చిట్కా వైద్యం చెప్పితే అది వెంటనే అమలులో పెట్టేవారు.

నిజానికి శ్రీ ఘంటసాల జీవిత విశేషాలు రాయాలంటే ఒక ప్రత్యేక గ్రంధమే రాయాలి.

 శ్రీ ఘంటసాల మనలను విడిచి పదహారు సంవత్సరాలు అయిందని  అనుకుంటున్నాం. కాని ఆయన, మన ముందు తరాలలో కూడా ఆంధ్ర ప్రజలను విడిచి ఉండరు. నిరంతరం ఆయన గానం దేశం అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది.

ఈ పదహారేళ్ళలో సినిమా సంగీతంలో అనేక పరిణామాలు వచ్చేయి. రికార్డింగ్ లో అనేక సాంకేతిక సౌకర్యాలు ఏర్పడ్డాయి. వాద్య సంగీతంలో చెప్పుకోదగిన పరిణామం వచ్చింది. సంగీత నిర్వహణలో నేపథ్య సంగీతానికి ఎరేంజర్స్ ఏర్పడ్డారు. సినిమా సంగీతజ్ఞులు ఆర్థికంగా బాగుపడ్డారు పూర్వంకన్నా.

అయితే ఒకటి ప్రజలకి ఇంకా పాత పాటలమీద మోజు తీరనే లేదు.
ఈనాడు సంగీతాభిమానులైన ఏ యువకుడు పాట పాడినా, పద్యం చదివినా అది ఘంటసాల ఏర్పర్చిన సంగీతపు నుడికారంతోనే ఉంటుంది. ఆయన సజీవులుగా ఉన్న రోజుల్లోనే ప్రతి ఊళ్ళోను ఒక జూనియర్ ఘంటసాల ఏర్పడ్డాడు. దేశం అంతటా శ్రీ ఘంటసాల ఏకలవ్య శిష్యులే. అందుకే శ్రీ ఘంటసాల అద్యతనాంధ్ర లలిత సంగీత సంప్రదాయ నిర్మాత. ఆయన సంగీతం శ్రీ త్యాగరాజ స్వామి నిర్వచించిన సారూప్య సాధనమైన నాదోపాసన కాదు. నవరస భరితమైన హృదయం సంవేదన.
సంగీత రసిక లోకం ఆ మహానుభావునికి జోహారుల్పిస్తోంది.


సంగీతరావుగారు ఈ వ్యాసం రాసి ఇప్పటికి ఇరవై సంవత్సారాలు గడిచింది. ఆనాడు ఘంటసాల గానం దేశమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది  అన్న మాట ఇంకా నిత్యనూతనమైన సత్యంగా నిలిచిపోయింది. ఎందరో జూనియర్ ఘంటసాలలు ఏర్పడ్డారు, ఏర్పడుతూనే ఉన్నారు. 
అందుకే తెలుగువాళ్ళకి  ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య, ఒకే ఒక ఘంటసాల. 


10 comments:

  1. ఘంటసాల గారి ముచ్చట్లు ఇంటరెస్టింగ్ గ చెప్పారు. థాంక్స్.

    ReplyDelete
  2. //నిజానికి గాయకునిగా శ్రీ ఘంటసాల గొప్పదనాన్ని ఎవరూ పని కట్టుకొని విశదీకరించనవసరం లేదు. తెలుగు ప్రజలందరికీ అనుభవైకవేద్యమైనది ఆయన పాట.// 100% నిజం కదా!
    చాలా బాగుందండీ మీ టపా+ సంగీత రావు గారు చెప్పిన ముచ్చట్లు కూడా ,,అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించింది

    ReplyDelete
  3. చలా మంచి విషయాలు చెప్పారు. ఘంటసాల తెలుగువారికి, భాషకు ఓ గర్వకారణం. ఆయనతో సాహచర్యంచేసిన వారు ధన్యులు.
    పాపయ్య గారి సాధ్యశ్రీ, అంజలి, పుష్పవిలాపం కవితలు బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం ఘంటసాల అద్భుతంగా చేసిన గాత్రం అంటే అతిశయోక్తి కాదు.

    ReplyDelete
  4. suryudini divitee petti chupinchala, kaani meeru cheppina sangathulu bagunnai.

    ReplyDelete
  5. చాలా informative గా ఉంది మీ పోస్టు! ఘంటసాల వంటి వ్యక్తులకు మరణం లేదు.

    ReplyDelete
  6. స్పందించిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  7. ఘంటసాల వారి మీద అభిమానం వున్న శతకోటి లింగాలలో నేను కూడా ఓ బోడి లింగాన్ని.(అంటే నాకు పాట పాడ్డం రాదు..అయినా ఘంటసాల గారి లా అప్పుడప్పుడు పాడేసుకుంటూ వుంటాను ...ఇంట్లోనే లెండి)

    ReplyDelete
  8. .ఘంటసాల గురించి ఇల్లాలి ముచట్లు లో బ్లాగు చాలాబాగుందిఆయన గళం లో మాధుర్యం .,గాంభీర్యంమేళవింపు అద్భుతం.ఒకసారి మా కాలేజికి వచ్చి వాయిద్యాలు లేకుండా గొప్పగాపాడేరు .సినిగాయకుల్లో అగ్ర తాంబూలం ఆయనదే. అభినందనలతో. ఇరమనరావు.ముద్దు.

    ReplyDelete
  9. చాలా చక్కగా రాసారు అలాంటి గొప్పగళం ఆయనకే దక్కింది .....
    ఘ౦టసాల గురించి చిన్నప్పుడు తాతయ్య చెప్తుంటే ఎంత సేపు విన్నవినాలనిపి౦చేది వారి మీద వున్న అభిమానం అలాంటిది

    ReplyDelete
  10. Thanks for a very good article on Ghantasala.

    ReplyDelete