11 February 2009

తెలుగు కథకి జేజేలు

తెలుగు కథకి నూరేళ్ళ పుట్టినరోజు,వచ్చేసంవత్సరం అంటే 2010,ఫిబ్రవరి లో.

ఏవిఁటీ,కథ పుట్టి వందేళ్ళేనా అని ఆశ్చర్యంగా ఉందా.

కథ కథ ఈనాటిది కాదు.ప్రతి మానవసమాజంలోను లిఖితరూపమైన సాహిత్యం ఆవిర్భవించక ముందే మౌఖిక సాహిత్యం ప్రచారంలో ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తాయి.మన ప్రాచీన సాహిత్యంలో కూడా వేదాలకు అనుబంధాలుగా కనిపించే ఐతరేయ బ్రాహ్మణం వంటివాటిలో అనేక నీతికథలు కనిపిస్తాయి.

ఇవన్నీ మౌఖికంగా ప్రచారంలో ఉన్న కథలు.వేదాలలో తేలిగ్గా స్పృశించి వదిలిన కథావస్తువులు అద్భుతమైన కథలుగా మారి పురాణాలుగా,ఇతిహాసాలుగా ప్రజలలో తరతరాలపాటు నిలిచిపోయాయి.పంచతంత్రకథలు,కాశీమజిలీ కథలు, పంచవింశతి కథలు ఇలా ఎన్ని కథలు ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్నాయి.

తెలుగు భాష లిఖితరూపం పొంది బాగా ప్రజాదరణ పొందే నాటికి ఈ పురాణేతిహాసాలన్నీ కావ్యరూపంలోకి మారి కథాకావ్యాలయ్యాయి. వస్తు కల్పనలో,అద్భుత చిత్రణలో, పాండిత్యంలో కవులు చూపిన కొత్తపోకడలు మరెన్నో శతాబ్దాలపాటు కవులకు ఆదర్శంగా,ప్రజారంజకం చేస్తూ నిలిచాయి.లిఖించబడని కథలెన్నో తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి.పేదరాశిపెద్దమ్మ కథలు,తెనాలిరామలింగడి కథలు,మర్యాద రామన్న కథలు సాహసానికి, చమత్కారానికి,తెలివికి ప్రతీకగా నిలిచాయి.

ఈ రకంగా చూస్తే కథలు మనకు,మన సమాజానికి కొత్తవి కాదు.

కానీ ఇరవయ్యవశతాబ్ది ఆరంభంనాటికి పాశ్చాత్య పాలనలో సంస్కృతి,నాగరికత,విద్యావిధానాలు మొదలైన వాటివలన వచ్చిన మార్పులెన్నో భారతీయ సాహిత్యంపైన ప్రతిఫలించాయి. ఇలా సాహిత్యంలో వచ్చిన మార్పులతో ఏర్పడిన కొత్త ప్రక్రియలు -కవిత్వంలో నవ్వకవిత్వం,భావకవిత్వం ,నవల,కథ లేక కథానిక ప్రక్రియలు ఏర్పడ్డాయి.

అగ్నిపురాణంలో ఏనాడో కథ గురించి ప్రస్తావించి,లక్షణాలు వివరించారు. పొందికగా ఉండి,పఠితకి సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలతో కూడి అద్భుతమైన మలుపుతో కథ ముగియాలని వివరించబడింది.ప్రాచీన కావ్యాలలో ఈ లక్షణాలతో కూడిన కథలు కనిపిస్తాయి కానీ శిల్పరీత్యా ఇంకా తీర్చిదిద్దినప్పుడే ఇవి మంచి కథలవుతాయని పండితుల అభిప్రాయం.

అందువల్ల కథ లేదా కథానిక అని మనం ఇప్పుడు అంటున్న ఈ కథ కొత్తప్రక్రియ.రూపంలోను, లక్షణంలోనూ మన ప్రాచీన సాహిత్యానికి భిన్నమైనది.ముఖ్యంగా నాటికి నేటికి కథ లో ఉన్న తేడా శిల్పం.

ఇప్పుడు ఆధునిక కాలంలో మనం కథ అని వ్యవహిస్తున్న పదం ఇంగ్లీషులోని షార్టుస్టోరీ కి పర్యాయ పదంగా వాడుతున్నాం..

ఆధునికసాహిత్యంలో సుమారుగా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఒకే సారి ఉద్భవించిన ప్రక్రియ ఈ షార్టు స్టోరీ.వస్తువు, శిల్పంవిషయంలో ఎంతో వైవిధ్యంతో మలచబడ్డాయి ఆధునిక కథలు.

ఆధునిక కథని నిర్వచించినప్పుడు పండితులు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కథ లో ఎత్తుగడ,నడక,ముగింపు, వీటిలో రచయిత చూపించే కొత్తదనం,నేర్పు,పరిమితమైన పాత్రలతో,ఒకానొక జీవితసత్యాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలుస్తుంది. ఆధునిక కథకి ప్రాణం -శిల్పం.ప్రాచీన సాహిత్యంలా కాకుండా ఆధునిక కథకి సమకాలిన మానవ జీవితమే వస్తువు.కథలో క్లుప్తత ముఖ్య లక్షణం కావడంవలన అనవసరమైన వర్ణనలు,అనవసరమైన పాత్రలు ఉండవు.కథలో ప్రతి సన్నివేశం,ప్రతి వాక్యం కూడా కథలోనే ప్రధాన కేంద్రం వైపే సాగిపోతాయి.వస్తువులో ఒక విలక్షణత్వం,మంచి ప్రారంభం,ముగింపు,పాత్రోచితమైన భాషను ప్రయోగించడంలో రచయిత ప్రదర్శించే నేర్పు ఇవన్నీ ఒక వస్తువు మంచి కథగా రూపొందడానికి తోడ్పడే అంశాలు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదట ప్రచురించబడిన కథ -దిద్దుబాటు.1910,ఫిబ్రవరి నెలలో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడింది. కథా రచయిత గురజాడ అప్పారావు.

19 వశతాబ్ది అర్థభాగంనుంచి వీరేశలింగం పంతులుగారు వెలార్చిన సంస్కరణోద్యమాలు,గిడుగు రామమూర్తి పంతులుగారి లాంటి సమకాలికుల వ్యావహారిక భాషోద్యమాలు,శాస్త్రీయ దృష్టి గురజాడ లో నవ్యసాహిత్యం- కవిత్వంలోనూ,వచనంలోనూ కొత్త పోకడలకు నేపథ్యం గానిలిచాయి.

అడుగుజాడ గురజాడది అదిభావికి బాట-అని తెలుగు ప్రజలు గురజాడని ఆధునిక సాహిత్యానికి మూల పురుషుడుగా గౌరవిస్తారు.తన కాలంలో అసలెప్పటికీ సాధ్యం కావేమో అని పించిన సంస్కరణభావాలను తన కవితలలోను కథలలోను వస్తువు,పాత్రలద్వారా ప్రతిఫలించి ముందుకాలానికి చూపు సారించిన ద్రష్ట గురజాడ అప్పారావు.

గురజాడ రాసిన కథానిక దిద్దుబాటు ఇంగ్లీషు షార్టుస్టోరీ నిర్వచనానికి,లక్షణాలకి అనుగుణంగా కనిపిస్తుంది.గురజాడ దీనికి మొదట పెట్టిన పేరు దిద్దుబాటు అయినా తరువాత కమలిని అని దీని పేరు మార్చడంలో ఉద్దేశం కూడా కథలో కనిపించని ప్రధానపాత్ర నాయిక-కమలిని ప్రత్యేకత నిరూపించడం కోసమే.

మొదటి దిద్దుబాటు కథలో సరళగ్రాంథిక భాష,సవరించిన దానిలో సరళ వ్యావహారికం కనిపిస్తాయి.కథలో ప్రధాన పాత్రలు రెండే.కనిపించని మరో పాత్రే కథానాయిక.చదువుసంధ్యలు నేర్చిన పడతి భర్తని తనకి అనుకూలంగా మార్చుకొని అతని లోని వేశ్యాలోలత్వాన్ని దూరం చేయడం ప్రధాన కధాంశం.స్త్రీలు చదువుకోవడం వలన కుటుంబానికే కాక సమాజానికి కూడా చాలా మేలు చేకూరుస్తుందని నిరూపించదలిచి ఈ వస్తువును తీసుకున్నారు.

వేశ్యలను ఉంచుకోవడం,వారి ఆటపాటలమధ్య ఆనందం పొందడాన్ని మగవారి అత్యంత సహజగుణంగా భావించే రోజులు కథకి నేపథ్యం.వేశ్య ఇంటినుంచి వచ్చిన భర్త, భార్య తన గదిలో కనిపించక వెతుక్కుంటాడు.పనివాడు తనకు తెలియదంటాడు.ఆమె రాసి పెట్టిన ఉత్తరం చూసి తనపై కోపించి ఆమె పుట్టింటికి వెళ్లి పోయిందని అర్థం చేసుకుంటాడు. తనకి బుద్ధి వచ్చిందని చెప్పమని,ఇంక వేశ్యలో జోలికి వెళ్ళనని పనివాడి ముందు ప్రమాణం చేసి భార్య పైన తన ప్రేమను వెల్లడిస్తాడు.ఎలాగయినా ఆమెని తిరిగి తీసుకురమ్మని పనివాడిని పంపిస్తాడు.మధురమయిన గాజుల చప్పుడు, మంచం కింద నుండి వినిపించిందని కథ ముగియటంలో భార్య ఎక్కడికీ వెళ్ళలేదని,భర్తని తన తప్పు తెలుసుకొనేలా చేసిన ప్రయత్నం అని పాఠకులకు తెలుస్తుంది.

గురజాడ చేతిలో అద్భుతంగా ప్రాణం పోసుకున్నతెలుగు కథానిక క్రమక్రమంగా వికసించి,విస్తృతంగా వ్యాపించింది.ఎందరో రచయితలు తెలుగు కథ కి వస్తు వరణంలో,పాత్రచిత్రణలో,శిల్పనైపుణ్యంలో కొత్తతోవలు తొక్కి కథకి అంతర్జాతీయ స్ధాయిని ఆపాదించారు. గౌరవాలు దక్కించారు.ఎన్నో కథలు ప్రపంచంలో ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి.

క్రమంగా తెలుగులో పత్రికల ప్రచురణ బాగా ఊపందుకున్నాక కథలు రాసే రచయితలతో పాటు రచయిత్రులు కూడా పెరిగారు.పత్రికలు, రేడియోలు,టెలివిజన్ లు ఇలా ప్రసార మాధ్యమాలన్నిటిలోను కథ ఒక తప్పని సరిగా కావలసిన వినోద సాధనమైంది. సాంకేతిక పరిజ్ఞానం ఇనుమడించి కాలం 21వ శతాబ్దికి అడుగుపెట్టేనాటికి ప్రపంచం ఒక కుగ్రామంగా భావించే స్థాయికి మానవ సమాజం చేరుకుంది. ఇంటర్నెట్ పేరున అంతర్జాలం లో ఎన్నో సాహిత్య పత్రికలు ఆవిర్భవించాయి.తెలుగు కు సంబంధించి ఎన్నో పత్రికలు అంతర్జాలంలో ఉన్నాయి. పత్రికలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం వలన రచయితలు భారత దేశం బయట కూడా ఉండి రచనలు చేసే సౌకర్యం వచ్చింది.కథా వస్తువు భారతదేశం దాటి ప్రపంచంలో ఏ మూల నివసించిన వారి జీవితమైనా కావచ్చు.ఈ రకంగా వస్తువైవిధ్యం పెరిగింది.మానవజీవితంలో ఆవిష్కరింపబడని కొత్త కోణాలను కథారచయితలు స్పృశించి,సృజించగలుగుతున్నారు.

భాషలో కూడా ఎంతో మార్పు వచ్చింది. సరళ గ్రాంధిక భాషలో ప్రారంభమయిన కథ ప్రస్తుతం పూర్తిగా సరళమై, వ్యావహారికశైలిని సంతరించుకుంది.కొందరు రచయితల చేతిలోమాండలికభాషలోని మాధుర్యాన్నిఅద్దుకుంది.

ఆధునిక కథ కేవలం కాలక్షేపానికో,వినోదానికో మాత్రమే పరిమితంకాలేదు.వర్తమాన మానవుడి జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ, మానవసమాజాన్ని సహజాతిసహజంగా చిత్రించడమే కాక అందులోని వికృతిని,మానవస్వభావంలోని సున్నితకోణాలను చూపుతూనే మృగప్రవృత్తిని ఎండగట్టింది.ప్రజలలో ఒక మానసిక విప్లవం ఆవిర్భవించడానికి కథల ద్వారా రచయితలు ప్రయత్నం చేసారు. చక్కని శైలిలో సమకాలిన వస్తువుతో ప్రతిభావంతుడైన రచయిత చేతిలో మలచబడిన కథలు ప్రజల మానసిక ప్రవృత్తిలో మార్పుతెచ్చి మనిషిని దానవత్వం నుంచి మానవత వేపుకి దృష్టిసారించేలా చేయగలవని నిరూపించబడిన సత్యం.

ఈ వందేళ్ళుగా తెలుగు కథ జీవవాహినిగా ప్రవహిస్తూనే ఉంది.గురజాడ మొదలుగా నేటి వరకు ఎందరో రచయితలు తెలుగు కథానిక ప్రక్రియను జవజీవాలతో పరిపుష్టం చేస్తూనే ఉన్నారు.తెలుగు కథ సజీవస్రవంతిగా సాగిపోతూనే ఉంది,ఉంటుంది. వందేళ్ళ పుట్టిన రోజు చేసుకుంటున్న తెలుగు కథకి అందరం చప్పట్లు కొట్టి జేజేలు చెబ్దాం.

02 February 2009

ఆడాళ్ళూ..మీకు జోహార్లు

అమ్మ నాన్న టివి చూస్తున్నారు.
అమ్మ లేచింది, ’అబ్బా ..చాలా అలసటగా ఉంది. బాగా లేటయింది. ఇంక పడుక్కోవాలి’ అంటూ వంటింట్లోకి నడిచింది.

మర్నాడు పొద్దున్న వంటకి కావలసిన వస్తువులన్నీ చూసుకుంది.మర్నాడు సాయంత్రానికి వండుకోవలసిన కూరలు ఉన్నాయో లేదో చూసింది.

ఉప్పు,పంచదార,గోధుమపిండి,పోపు డబ్బాలు తెరిచి చూసింది ఎంత ఉన్నాయో అని. పొద్దున్నే అప్పటికప్పుడు అవి అయిపోతే నింపుకోవడం హడావిడి లో కుదరదు మరి.

పిల్లలు తినడానికి కార్న్ ఫ్లేక్స్ డబ్బా,బౌల్స్, స్పూన్స్ డైనింగ్ టేబిల్ మీద పెట్టింది.కాఫీ ఫిల్టర్ లో కాఫీ పొడి వేసి, స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టింది. లేవగానే కాఫీ కలపడంకోసం.

బాత్రూం లోకి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి విప్పి పడేసిన బట్టలు,తడి తువ్వాళ్లు వాషింగ్ మెషిన్ లో పడేసింది. ఉతికిన బట్టల లోంచి మర్నాడు పిల్లలకు కావలసిన యూనిఫామ్ బట్టలు ఇస్త్రీ చేసింది.లూజ్ గా ఉన్న నిక్కర్ బటన్ ని కుట్టి, సరిగా లేని జిప్ ని బాగుచేసింది.

హాల్లో టేబిల్ మీద పడి ఉన్న గేమ్,దానికి సంబంధించిన ముక్కలన్నీ ఎత్తి అట్టడబ్బాలో పెట్టి షెల్ఫ్ లో పెట్టింది.కార్డ్ లెస్ ఫోన్ ని ఛార్జింగ్ కోసం బేస్ లో పెట్టింది. సెల్ ఫోన్ లోకి చూసి ఛార్జర్ తీసి ప్లగ్ లో పెట్టింది.కింద పడి ఉన్న టెలిఫోన్ డైరెక్టరీని మళ్లీ ఫోన్ పక్కన పెట్టేసింది.

ముందురూమ్ లో ఇందాక వాడిపోతూ దిగాలు పడినట్టుగా కనిపించిన ఇండోర్ ప్లాంట్ గుర్తొచ్చి జగ్ లో నీళ్లు తీసుకెళ్లి మొక్కకి పోసింది. పొద్దున్న కి అది మళ్ళీ నిటారుగా నిల్చుంటుంది కళకళలాడుతూ.

పిల్లల టేబిల్ చూడగానే గుర్తొచ్చింది, బాబు టీచర్ కి రాయవలసిన ఉత్తరం, పిక్నిక్కి వెళ్ళడానికి కట్టవలసిన డబ్బు. లెటర్ రాసి,పర్సుతీసి డబ్బు లెక్క పెట్టి దాని పక్కనే పెట్టింది.టేబిల్ కింద మూల దాక్కొని ఉన్న టెక్ట్స్ బుక్ తీసి స్కూల్ బేగ్ పక్కన పెట్టింది. చిన్నవాడి పెన్సిల్ బాక్స్ తీసి చూసి పెన్సిల్ చెక్కి ఉందోలేదో చూసింది.రబ్బర్ అరిగిపోయి చిన్నదయిపోయింది. కొత్త రబ్బరు పెట్టి బాక్స్ లోపల పెట్టింది.

ముందురోజు స్నేహితురాలి పుట్టినరోజు కోసం కొన్న గ్రీటింగ్ కార్డు బయటకి తీసి సంతకం చేసి కవర్ పైన స్టాంప్ అంటించి అడ్రెస్ రాసి బేగ్ లో పెట్టుకుంది, వెళ్తూ దారిలో పోస్టు చెయ్యొచ్చని.ఆచేత్తోనే రాసి పెట్టుకున్న,అయిపోయిన సరుకుల లిస్ట్ ని కూడా బేగ్ లో పడేసింది.వెళ్తూ ఆ షాప్ లో ఇచ్చేయొచ్చు.

వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి అద్దంలో మొహం చూసుకొని, పళ్లు తోముకొని, పొడి చర్మానికి నిగారింపు తెచ్చే క్లీనర్ తో మొహం కడుక్కొని బెడ్ రూంలోకి వెళ్ళింది. ముడుతలు పోగొట్టే నైట్ క్రీం రాసుకుంటూ గోళ్ల వైపు చూసుకుంది. సగం పోయిన నెయిల్ పాలిష్ చూసి రిమూవర్ తో తుడుచుకొని చేతులు కడుక్కుంది.

’ఏమిటి...పడుక్కుంటున్నానన్నావ్...’భర్త ప్రశ్న వినిపించింది.
’ఆ..ఆ...పడుక్కుంటున్నా’నని జవాబు చెప్పి తలుపులు అన్నీ వేసి ఉన్నాయోలేదో చూసింది. పెంపుడు కుక్క తినే ప్లేట్ శుభ్రంగా ఉందో లేదో చూసి అందులో కొంచెం నీళ్లు పోసి పెట్టింది. వరండాలో లైట్ ఆర్పి, అన్ని గదులు చూసింది. పిల్లలగదిలో లైట్ వెలుగుతోంది. పాప ఇంకా పడుక్కోలేదు. పడుక్కోమంటే ఇంకా కొద్దిగా మిగిలిన హోంవర్క్ చేసి పడుక్కుంటానంటూ ఏవో కబుర్లు చెప్పింది. కబుర్లు వింటూనే అక్కడ పడి ఉన్న వస్తువులన్నీ సర్ది,బాబు దుప్పటిసరిగ్గా కప్పింది.

మర్నాడు తెల్లబట్టలు వేసుకోవలసిన రోజని గుర్తుచేసిన పాపని ఓసారి అభినందించి మళ్లీ తెలుపు బట్టలు తీసి ఇస్త్రీ చేసింది. తెల్లసాక్స్ల్,బూట్లు బయట పెట్టి,నల్లబూట్లు,కంపుకొడుతున్న సాక్స్ ఓ పక్కగా పెట్టింది. వేరుగా ఉతకాలి అవి.

మంచం మీదకు చేరుకుంటూ అలారం పీస్ తీసి టైం సరిగ్గా సెట్ చేసి ఉందో లేదో చూసుకుంది.మర్నాడు ఆఫీసుకు వేసుకోవలసిన బట్టలు సిద్ధం చేసి పెట్టుకుంది.

మంచం మీద వాలి కళ్లు మూసుకొని ఆ రోజు చేసిన పనులు,మర్నాడు చేయవలసిన పనులు అన్ని పునశ్చరణ చేసుకుంది. ఇందాక కాఫీ కోసం నీళ్లు పెట్టి దించాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని అనుమానం వచ్చి కంగారుగా కిచెన్ లోకి వెళ్లి చూసుకొని హమ్మయ్య అనుకొని వచ్చి పడుకుంది. పడుక్కునేముందు నిత్యం చేసుకునే ప్రార్థనని ఒక్కసారి మనసులోనే చేసుకొని కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకుంది.

టివి చూస్తూ కునికిపాట్లు పడుతున్న భర్త సోఫాలోంచి లేచాడు.నేను పడుక్కుంటున్నా అని జనాంతికంగా ప్రకటించి టివి ఆఫ్ చేసి రిమోట్ సోఫాలో పడేసి లైట్ ఆర్పి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద పడుక్కుని క్షణంలో నిద్రపోయాడు. మరో ఐదు నిముషాల్లో ఆగదిలో గుర్రు గుర్రుమని శబ్దం వినిపించింది. భార్య అసహనంగా కదిలి తలగడతో చెవిని మూసుకుంటూ నిద్రపోడానికి ప్రయత్నం చేసింది.

కథ కంచికి మనం వంటింట్లోకి.....

.ఇందులో ఏదేనా అభూతకల్పనగా అనిపిస్తోందా...లేదుకదా...

.ఆడవాళ్ళే ఎక్కువ కాలం జీవించడానికి కారణం బోధ పడిందా...అవునుకదా...

ఎంత జీవితమూ సరిపోదు,ఆడవాళ్లకి...ఎందుకంటే ఇతరుల కోసం కూడా జీవించాలి కాబట్టి...యముడు ముందుగా పర్మిషన్ కోసం వస్తే "వీటలేదని చెప్పించి-వీలుకాదని పంపిస్తాం".
అందుకే

ఆడాళ్ళూ....మీకు జోహార్లు...

(నెట్ లో ఫార్వర్డు చేయగా వచ్చిన "why women are so special"అన్న సందేశం స్ఫూర్తితో(రచయిత(త్రి) ఎవరో కాని వారికి నా కృతజ్ఞతలు)