31 August 2011

“కూనలమ్మపదాలు” - ఆరుద్ర



భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అంటే చాలామంది తెలుగువారికి పెద్దగా తెలియక పోయినా ఆరుద్ర అనే పేరు వినగానే చిరపరిచయం ఉన్న వ్యక్తి గురించి అడిగినట్టు ఆయన గురించి చెప్పగలరు. సంతకం అక్కర్లేని కవిగా  అంత్య ప్రాసల ఆరుద్రగా ఆయన చాలామందికి పరిచయం.

కేవలం కవిగానే కాక, కథారచయితగా, నాటక రచయితగా, సాహితీ విమర్శకుడిగా  ఆరుద్ర తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అసామాన్యం. ముఖ్యంగా పామర జనానికి సైతం నిత్యం జీవితంలో పాడుకునే తేలిక మాటలతో  పాటలురాసిన సినీకవిగా ఆయన సుప్రసిద్ధులు. ఆయన రాసిన సినీ గీతాలు కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది మొదలైన భావగీతాలు, రాయినైనా కాకపోతిని వంటి భక్తిగీతాలు వందల సంఖ్యలో ప్రజల నాలుకల మీద తేలియాడే చిరస్మరణీయమైన గీతాలకి ఆయన కర్త. సమగ్రాంధ్ర సాహిత్యం వంటి పద్నాలుగు సంపుటాల ఆంధ్ర సాహిత్యాన్ని రచించి తెలుగు వారి అరచేతిలో పెట్టిన దిట్ట.  రాముడికి సీత ఏమౌతుందని ప్రశ్నించి ఆ ప్రశ్నకి జవాబుగా తానే  ప్రపంచదేశాలలో మూలమూలన దాగిన రామాయణాల కథల సారాంశాలను గ్రహించి ఒకచోట ఏర్చి కూర్చి అమర్చిన  విమర్శకర్త . సర్వమానవాళికి శుభం, సుఖం, శాంతి కలగాలని ఆశించి దానికోసమే తన కలాన్ని, కత్తిలా ఝళిపించి మతములన్నిటిలో మానవత్వమే మేలైన మతమంటూ ప్రచారం చేసిన ప్రవక్త ఆరుద్ర.

ఆరుద్ర అంత్యప్రాసల ముద్ర స్పష్టంగా కనబడే రచనలలో కూనలమ్మ పదాలు ముఖ్యమైనది. కూనలమ్మ పదాలు వేనవేలు రకాలు, ఆరుద్రదే వ్రాలు అంటూ శ్రీశ్రీ  ఈ రచనకి ముందు మాటలో రాసారు. ఈ రచనని ఆరుద్ర 1963 ప్రాంతాలలో రచించారు.

 ప్రచారంలో ఉన్న పాత కూనలమ్మ పదాలు అనే ప్రక్రియను తీసుకుని కొత్తకాలపు జీవిత సత్యాలను అంత్యప్రాసలతో అలంకరింపచేస్తూ ఆరుద్ర రచించిన కూనలమ్మ పదాలు ప్రజలను ఉర్రూతలూగించాయి.

ఈ కూనలమ్మ పదాలను అనుకరిస్తూ మరెందరో సాహిత్యరచనలు చేయడం ద్వారా ప్రజలలో ఈ ప్రక్రియకు ఆరుద్ర కలిగించిన ప్రచారం తెలుస్తుంది. ఓ నాయనమ్మా, ఓ నాయుడమ్మా వంటి మకుటాలతో రచనలు వచ్చాయి.
తరతరాలుగా తెలుగువారి సాహిత్యంలో సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ కూనలమ్మ పదాలు ఆరుద్రగారి రచనల వలన మరింతగా ప్రజలలోకి వెళ్ళాయి.  


1930 సం. కాలంలో పరిశోధకులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు కూనలమ్మ పదాలను సేకరించారు. 1930 సం. భారతి పత్రికలో బాలభాష అనే శీర్షిక కింద వీటిని చేర్చి ప్రచురించారు. ముందుమాట రాస్తూ శ్రీ  ప్రభాకర శాస్త్రిగా రు ఇలా అన్నారు. కూనిరాగాలు తీయడం, కూనలమ్మ సంగీతాలు తీయడం అనే మాటలు ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్న పదాలు ఈ కూనలమ్మ పదాల నుండే వచ్చాయి. తమిళంలో అవ్వయ్యార్ పదాలకు ఎంత విలువ ఉందో తెలుగులో వీటి కూడా అంతే విలువ ఉంది.



కూనలమ్మ పదాలు  జంపె వరుసలో నడుస్తాయి. కూనలమ్మ పాటలు నీతికి సంబంధించిన పాటలు. పార్వతీదేవి కూతుళ్ళు, కామేశ్వరీ దేవికి తోబుట్టువులూ అయిన అక్కలకి పోతరాజు అనేవాడు కాపుగా ఉంటాడు. అతని భార్య ఈ కూనలమ్మ. ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో ఈ కూనలమ్మ పదాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పాటలలో వేదం, పురాణం, ఉపనిషత్తుల సారాంశం కూడా కనినిపిస్తూ ఉంటుంది.అయితే ఈ కూనలమ్మ పదాల కాల నిర్ణయం చాలా కష్టమయిన పని. విజయరాఘవ కల్యాణం అనే యక్షగానంలో ఈ కూనలమ్మ పదాలకు పేరడీలు కనిపించడాన్ని బట్టి, పదిహేడవ శతాబ్దినాటికే ఇవి ప్రచారంలో ఉన్నాయని భావించవచ్చు అన్నారు ఆరుద్ర.

కూనలమ్మ పదాలలో నిర్ణీత సంఖ్యలోనే మాత్రలు ఉండాలి. అప్పుడే అది అందంగా వినబడుతుంది. ఈ పదాలు నాలుగు పాదాలుగా ఉంటాయి. నాలుగోపాదం మకుటం. అంటే ప్రతి పదంలోనూ నాలుగవ పాదం ఓ కూనలమ్మా అనే వాక్యంతో ముగుస్తుంది అన్నమాట. ప్రతి  పాదం  3,4,3 గా గాని లేదా 5,5 గా గాని మాత్రలు ఉండాలంటారు ఆరుద్ర.  "ఓ కూనలమ్మా"  అంటూ  ప్రతి మూడు పాదాల చివర వచ్చే పాదం మకుటం గా వస్తుంది కదా. ఆ మకుటం కాకుండా ఉన్న మిగిలిన పాదాలు 10 మాత్రలతో ఉండాలి. ఇక్కడ అందమంతా తొలి మూడు పాదాల లోనూ ఉన్న అంత్యప్రాసలే. సంప్రదాయ సిద్ధమైన దేశీ ఛందస్సులో కూనలమ్మ పేరు పై తొలి రచన చేయడం తన అదృష్టమన్నారు ఆరుద్ర.

 చిన్ని పాదములందు, చివరి ప్రాసల చిందు,చేయు వీనులవిందు అంటూ అంత్యప్రాసలతో, చిన్ని చిన్ని పాదాలతో, వీనుల విందుగా చెబుతానంటూ కూనలమ్మ పదాలు  ప్రారంభించారు ఆరుద్ర.
కూనలమ్మ పదాలలో నీతి ఉంటుందని, అది హృదయపు వీణను మీటుతుందని చెప్పారు ఆరుద్ర. పెద్దపెద్ద సమాసాల కన్నా పెద్ద వృత్తాలు చెప్పలేని విషయాన్ని ఒక చిన్న పదం చెప్పగలుగుతుందని ఆయన అభిప్రాయం. ‘పరుల మేలును కోరి, పదములల్లెడు వారి పథము చక్కని దారి అంటూ తన పదముల వలన తాను ఆశించే ప్రయోజనం చూపారు. 
కూనలమ్మ పదాలు ఆరుద్రలోని బహుముఖ వ్యక్తీకరణ శక్తికి, అభివ్యక్తికి దర్పణాలు. మానవ సంఘంలోను, వ్యవహారంలోను ఉన్న అనంతమైన వైవిధ్యాన్ని మూడు పాదాలలో, అందులోనూ పరిమితమైన ఛందస్సుకు లోబడి, అంత్యప్రాసలతో అలరించేలా, పఠితులను ఒప్పించేలా గడుసుగా, హుందాగా, నేర్పుగా చెప్పగలగడం సామాన్యమైన విషయంకాదు. 
ఆరుద్రగారి గురించి మళ్ళీ మళ్ళీ ఈ విషయం చెప్పుకోవడం అంటే ముంజేతి కంకణానికి అద్దం చూపడమే. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం వేయడమే.
కూనలమ్మ పదాలలో ఆరుద్రగారు స్పర్శించిన అనేక అంశాలను ఇక్కడ ఓ సారి పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.

కూనలమ్మ పదాలలో స్త్రీల  మనస్తత్వాల గురించి, వారి అలవాట్లగురించి, సంఘంలో వారి ప్రాముఖ్యాన్ని గురించి చెప్పిన పదాలు ఆరుద్రగారికి మానవ నైజం గురించి ఉన్న అవగాహనని చూపిస్తాయి. ఆడవారి అలవాట్లను చిత్రిస్తూనే చాలా గడుసుగా వారి పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆరుద్ర.

ఆలికొన్నదికోక, అంతరిక్షపు నౌక, అంతకన్నను చౌక అంటారు. ఆడవారితో వాదన వస్తే గెలిచేది ఎప్పుడూ ఆడదే అంటూ అతడు ఆమెల ఫైటు, అతివ ఛాన్సులు బ్రైటు, ఆడదెపుడూ రైటు అంటారు. అతివ పలుకే చాలు, అందువేనకువేలు,మొలచు నానార్థాలు - ఆడవారి మాటలకు ఎన్నయినా అర్థాలు గ్రహించవచ్చునట. ఇలా అధిక్షేపిస్తూ అంతలోనే ఆడవారు రాకెట్లో విశ్వవిను వీధిలో విహరించడాన్ని గురించి అతివ పురుషుని దీటు, అనుచు నభమున చాటు, ఆడ కాస్మోనాటు అని స్త్రీలను మెచ్చుకుంటారు.

పెళ్ళి, భార్యాభర్తల సంబంధం గురించి కూడా కొన్ని పదాలలో వ్యాఖ్యానం చేసారు.
ఇష్టంలేని పెళ్ళి చేసుకుంటే సుఖం లేదని   ‘మనసు కుదరని పెళ్ళి, మరుదినమ్మున కుళ్ళి, సుఖము హళ్ళికి హళ్ళి అంటూ చెప్పారు.సుదతి పాలిట భర్త, మొదట వలపుల హర్త, పిదప కర్మకు కర్త అంటూ మొదట ప్రేమతో వలపు గెలుచుకుని క్రమంగా ఆమె కర్మకు అతను కర్తగా మారే  భర్త గురించి వ్యాఖ్యానిస్తారు. భార్యాభర్తల మధ్య తగువు ఏర్పడినా, రాజీ కుదిరిన తరువాత ఆ కలయిక గురించి ఆలుమగల లడాయి, అంతమొందిన రేయి, అనుపమానపు హాయి అంటూ తగవు తీరాక కలయిక ఎంత మధురంగా ఉంటుందో చెప్తారు. కొత్తభార్య ఏం చేసినా భర్త వంకలు పెట్టడు. పైగా కొత్త పెండ్లము వండు, గొడ్డుకారము మెండు, తీపియంటాడుట  ఆ హస్బెండు.

మనసుకు నచ్చిన లలన దొరకతనంతవరకే సన్యాసం అంటూ – సన్యసించిన స్వామి, చాలినంత రికామి,చాన దొరికిన కామి’  సన్యాసం గుట్టు విప్పారు.
అప్పటి రాజకీయాలపై ఆరుద్ర విసిరిన  చెణుకులు కూడా కొన్ని వీటిలో చూడవచ్చు.

ప్రజాస్వామ్యం గురించి రాక్షసత్వం పోయి,రాచరికములు పోయి,ప్రజలదే పై చేయిఅంటూ ప్రజలే ప్రభువులుగా ఉండే ప్రజాస్వామ్యాన్ని మెచ్చుకుంటారు. మన దేశంలోని గొప్ప సిద్ధాంతాలను తోసిరాజని, పొరుగు దేశాల సిద్ధాంతాలను నెత్తిన పెట్టుకోవడాన్ని పొరుగు దేశములిచ్చు, పుల్ల ఇజముల మెచ్చు, మూర్ఖమెప్పుడు చచ్చు’  పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత చందంగా నిరసించారు.  పసిడి వన్నియ తరిగె,పన్నులెన్నియో పెరిగె, ప్రజల వెన్నలు విరిగె అంటూ  పన్నులభారం ప్రజల నడ్డి విరవడాన్ని చెప్పారు. అలాగే ఇంకా మనకి  నిజమైన స్వాతంత్ర్యం రాలేదంటూ- వచ్చె స్వాతంత్ర్యమ్ము, హెచ్చె నిర్బంధమ్ము, స్వేచ్ఛ మంత్రుల సొమ్ము అంటారు.  

మరచె చేసిన మేలు, చరచె పోరికి కాలు, వాడు చైనా ఫూలు అంటూ భారత్ మీద కయ్యానికి కాలు దువ్విన చైనాను విమర్శించారు. చైనా, పాకిస్తాన్ దేశాలు పొరుగున ఉండి మిత్రులుగా ఉండక సైతాన్ లాగా వేధించుకు తినడాన్ని గురించి  కడకు పాకిస్తాను, కలిసె చైనాతోను మిత్రుడా సైతాను అంటూ రెండు పొరుగు దేశాల పద్ధతిని ఎండగట్టారు.
కోర్టుకెక్కిన వాడు, కొండ నెక్కిన వాడు, వడివడిగ దిగిరాడు అంటూ- కోర్టువ్యవహారాలు ఒకంతట తెమిలేవి కాదంటారు.

 అధికారం ఇచ్చే మత్తు  చాలా  గాఢంగా ఉంటుందిట. మధువు మైకమునిచ్చు, వధువు లాహిరి తెచ్చు, పదవి కైపే హెచ్చు అంటూ మత్తిచ్చే మధువు కన్నా, కొత్త భార్య కన్నా కూడా పదవి ఇచ్చే మత్తు గొప్పదని చెప్తారు.

ఆంధ్రుల ఆరంభ శూరత్వం గురించి విమర్శిస్తూ అంతు చూసేవరకు, అకట ఆంధ్రుల చురుకు, నిలువ ఉండని సరుకు అంటారు.
ఇక కాలక్షేపం సరదా అంటూ వ్యసనాల బారిన పడడం గురించి కూడా విమర్శించారు. తాగుచుండే బుడ్డి, తరుగుచుండే కొద్ది మెదడు మేయును గడ్డి అంటూ తాగుడు వ్యసనం మనిషి బుద్ధిని ఎలా హరిస్తుందో హెచ్చరిస్తారు. క్రికెట్ ఆట చూడడం అంటే  సమయాన్ని వృథా చేసుకోడమేనంటూఅయిదురోజులు వేస్టు, అగుట కెయ్యది బెస్టు, చూడుము క్రికెట్ టెస్ట్ అంటారు.

అల్లుడు అంటే దశమగ్రహం అని తెలుగువాళ్ళు అల్లుళ్ళ గురించి చెప్పుకుంటారు. అల్లుడిగా వచ్చి ఆ ఇంటికి పీడగా తయారైన వారి గురించి చిన్న చమక్కులు ఈ పదాలలో కనిపిస్తాయి. అత్తవారి సొమ్ముకోసం పీడించుకుతినే అల్లుళ్ళ గురించి పిల్లనిచ్చినవారి పీకమీద సవారి చేయు అల్లుడె మారి( యముడు) అని అంటారు. అలాగే అత్తవారిని మెక్క, అలక పానుపు యెక్క,  మృగము క్రిందే లెక్క అని పీడించే  అల్లుడుని ఓ క్రూర జంతువుకింద లెక్కవేస్తారు.

నీతి శతకాల్లో మూర్ఖుల గురించి ఎన్నో పద్యాలు చూస్తాం. కూనలమ్మ పదాలలో ఆరుద్రగారు కూడా మూర్ఖుల గురించి రాసారు. కూరుచుండిన కొమ్మ, కొట్టుకొను వాజమ్మ, హితము వినడు కదమ్మ అంటారు. అలాగే గంగ గట్టున నూయి, కందకములో గోయి,  త్రవ్వేను లొల్లాయి అంటూ మూర్ఖుల తెలివిని హేళన చేస్తారు.

మానవమనస్తత్వం లోని లోతులన్నీ గ్రహించిన గొప్ప కవి ఆరుద్ర. అందుకే మనిషి మనీషిగా మారాలని అందుకోసం తనలోని లోటుపాట్లను ఎప్పుడూ విమర్శించుకుంటూ సమీక్షించుకుంటూ ఉండాలని  కొన్ని పదాలలో సూచిస్తారు. ఆశ పెరిగిన వాడు, అహము పెరిగిన వాడు, తనకు తానే కీడు అంటూ వ్యక్తిలో దుర్లక్షణాలు పెరిగితే తనకు తానే కీడు చేసుకుంటాడని చూపుతారు. అలాగే పరుల తెగడుట వల్ల, బలిమి పొగడుట వల్ల, కీర్తి వచ్చుట కల్ల అంటారు. జాలి కరుణలు మాని,ఆలినేలని వాని , జోలికెళితే హాని  అంటూ హృదయంలో కరుణలేని మనిషి సమాజానికి హాని కలిగిస్తాడని హెచ్చరిస్తారు.

ఆరుద్రగారు  నాస్తికులే  అయినా మన పురాణాల గురించి, సంప్రదాయాల గురించి ఎన్నో విషయాలను లోతుగా ఆలోచించి, తేలికైన మాటలతో వాటి సారాంశాన్ని వివరించడం ఆయన ప్రత్యేకత.  భాగవతమున భక్తి, భారతము లో యుక్తి, రామ కథయే రక్తి అన్న పదంలో మన పురాణాల్లోని విషయాలను క్లుప్తంగా మూడు పాదాలలో చెప్పారు.

 కానీ పుణ్యగాథలంటూ చెప్పుకునే మన పురాణ కథల్లోని అవినీతిని కూడా ఇలా చూపించారు- పుణ్యగాథల బూతు, బూజు పట్టిన ట్రూతు, అంతుచిక్కదు లోతు.

శ్రీ కృష్ణుడికి రాధ మేనత్త అవుతుందని ఓకథ . దాన్ని ఆధారం చేసుకుని కంసుడిపాలిట యముడిగా, రాధ పాలిట ప్రేమమూర్తిగా కృష్ణుడు ఉండడం గురించి చెప్తూ కృష్ణుడు ఘనుడు కదా అంటారు, మేనమామకు యముడు, మేనయత్తకు మరుడు, ఘనుడు కద మాధవుడు అనే పదంలో.


పరుల ఇంటను పెరిగె, పరుల పడతుల మరిగె, పరతత్వ్తమె సురిగె అంటూ మూడు ముక్కల్లో కృష్ణుడిని చూపిస్తారు. అలాగే శ్రీ కృష్ణుడు, బాల్యంలో బండి రూపంలో వచ్చిన రాక్షసుడిని చంపడం, అర్జునుడికి రథ సారథ్యం చేయడం రెండిటినీ బండితో కలుపుతూ  శ్రీకృష్ణుడి ని ఊసరవెల్లితో పోలుస్తూ  ఇలా అంటారు- బండి గూల్చెను తొల్లి, బండి తోలెను మళ్ళి, దండి ఊసరవెల్లి.

చెలుల చీరలు దోచి, చెల్లి చీరను గాచి, చేసెనే లాలోచి అంటూ గోపికల వస్త్రాపహరణం చేసిన కృష్ణుడే, ద్రౌపదికి చీర ఇచ్చి మానసంరక్షణం చేయడం గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

ఇక తిన్నింటివాసాలు లెక్కపెట్టేవాడిని ద్రోహిగా మనం భావిస్తాం. కానీ శ్రీ కృష్ణుడు తాను పూతన స్తన్యాన్ని గ్రోలి, ఆమెను చంపడాన్ని గురించి గ్రోలెనే స్త్తన్యమ్ము, గ్రుద్దెనే ఆ రొమ్ము, వాడెపో దైవమ్ము అంటూ అలా చేసిన వాడిని మనం దైవంగా భావిస్తున్నామని  ఓ చురక వేస్తారు.
నిజంగా భక్తి ఉంటే అది మనసులో ఉండాలి కానీ పైపై వేషాల వలన ప్రయోజనం ఉండదంటూ –‘పంగనామములేల, భస్మ పుండ్రములేల, భక్తినిజమగు వేళ అని ఉపదేశిస్తారు.

సమకాలికులైన  ప్రముఖుల  గురించి  రాసిన పదాలు కూడా ఉన్నాయి.
తన మేనమామ శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ గురించి ఆరుద్ర ఇలా అన్నారు -రెండు శ్రీలు ధరించి,రెండు పెగ్సు బిగించి, వెలుగు శబ్ద విరించి. కొంతమందిది నవత, కొంత మందిది యువత, కృష్ణ శాస్త్రిది  కవిత అంటూ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి కవిత్వమే కవిత్వం అని చెప్పారు.బాపు గురించి కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె వుయ్యెలనూపు అని బాపు బొమ్మలు కొన్ని తరాల పాటు జనులను ఆకట్టుకుంటాయన్నారు. హాస్యమందున అఋణ, అందెవేసిన కరుణ, బుడుగు వెంకట రమణ అంటూ ముళ్ళపూడి ని చూపించారు.విశ్వనాథ సత్యనారాయణ గారికి కొత్తదనం రుచించదంటూ కొత్తమీద జుగుప్స, కొలది పాత్రకు వీప్స, విశ్వనాధకు లిప్స అంటూ విమర్శిస్తారు.కసరు తేనెల వంటి, కథలు కుత్తుక బంటి, నింపు కొడవటి గంటి అంటూ కథకుడు శ్రీ కొడవటి గంటి కుటుంబరావుగారి సాహిత్యంలోని మాధుర్యాన్ని వివరిస్తారు. దండి( ప్రాచీన సాహిత్యంలోని కావ్యకర్త) గురించి గద్యసుమముల నుండి, కావ్య మధువులు పిండి, పంచి పెట్టెను దండి అంటారు. ఛందస్సుల నడ్డివిరుస్తానంటూ కవిత్వం రాసిన పఠాభి గురించి చివరి ప్రాసల నాభి, చిత్రమైన పఠాభి, కావ్యసుధల షఱాభి అంటారు. ఎంకిపాటలు రాసి గుండెలో గుర్రపు స్వారీ చేసారంటూ ఎంకిపాటలదారి, ఎడద గుర్రపు స్వారి చేయులే నండూరి అంటూ ఆయనను మెచ్చుకున్నారు.

అబద్ధం నిజంగా చలామణీ అయే రోజులు ఎంతవరకు అంటే - ప్రజలు కళ్ళుతెరచి నిజం తెలుసుకునేవరకే నకిలీ సరుకు చలామణీ అవతుందంటూ జనులు నమ్మెడు వరకు, కనులు తెరవని వరకు, వెలుగు నకిలీ సరుకు అంటారు.

పర్యావరణం, సైన్సు మానవుడు ఉనికికి ప్రశ్నార్థకం కానున్నాయా అనే సందేహం వెలిబుచ్చారు ఇక్కడ.
అణువు గుండెను చీల్చి, అమిత శక్తిని పేల్చి, నరుడు తన్నును బాల్చి అంటారు. మానవుడు భస్మాసురుడిలా అణుబాంబును కనిపెట్టి తన చేతులారా తానే నాశనాన్నికొనితెచ్చుకున్నాడేమో.
దైవబలాన్ని నమ్ముకొని కూర్చోవడం కాకుండా మానవుడు కూడా తన శక్తిని తెలుసుకోవాలంటారు. హరుడు అధికుడు కాడు, నరుడు అల్పుడు కాడు, తమకు తామే ఈడు అంటూ ఇద్దరిలోనూ సమానమైన శక్తి ఉందంటారు.

జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి అంటారు ఆరుద్ర. ఇజము నెరిగిన వాడు, నిజము చెప్పని నాడు, ప్రజకు జరుగును కీడు అని హెచ్చరిస్తారు.

కవితకోసమె నేను పుట్టాను క్రాంతి కోసమే కలం పట్టాను అన్నారు ఆరుద్ర ఓచోట. దాన్నే ఇక్కడ కూడా మరోసారి చెప్పారు. సర్వజనులకు శాంతి, స్వస్తి, సంపద, శ్రాంతి నేకోరు విక్రాంతి అన్నారు ఇక్కడ. కూనలమ్మపదాలు రచించడం వలన తనకెంతో తృప్తి కలిగిందంటూ – ‘ఈ పదముల క్లుప్తి, ఇచ్చింది సంతృప్తి చేయునిమ్ము సమాప్తి అంటూ   ఈ పద రచనను ముగించారు ఆరుద్ర.

అల్పపదాలతో, అనల్పార్థం గల వాక్యాలతో ఎక్కడా ప్రాసతో రాజీ పడకుండా సరైన చోట సరైన పదాలను ప్రయోగించే నేర్పుతో ఎన్నో జీవిత సత్యాలను అలవోకగా ఆవిష్కరించింది ఈ కూనలమ్మ పదాలలో ఆరుద్ర కలం.
 సమకాలీన సంఘం మీద, మానవ ప్రవర్తనమీద, నీతినియమాలమీద, స్త్రీ పురుషుల ప్రవర్తనమీద, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలమీద లోతైన అధ్యయనం చేసి, వాటి సారాంశాన్ని చిన్న చిన్న పదాల రూపంలో ఆరుద్ర ప్రదర్శించిన తీరును తెలుసుకొని, ఆ చమత్కారాన్ని ఆస్వాదించాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ఈ కూనలమ్మ పదాలు.









26 comments:

  1. కూనలమ్మ పదాలగురీంచీ, ఆరుద్రగారి కృషి గురించీ బాగా వివరించారు. కూనలమ్మ పదాలగురించి వినడమే కానీ నేనెప్పుడూ చదవలేదు. ఈ సారి ఆంధ్రరాష్ట్రం వెళ్ళినప్పుడు తప్పకుండ ఈ పుస్తకం కొనుక్కుంటాను.

    నెనర్లండి.

    ReplyDelete
  2. సుధా రాణి గారూ, మీ మంచి టపాకి మొదటి కామెంటు నాదే కావాలనే పేరాశతో ఎంతో పొగుడుతూ రాయాలనిపించినా కొంచెమే రాస్తున్నాను. ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు గురించి ఎంత చక్కగా రాశారండీ. దాదాపు అన్న కవర్ చేసినట్టుగా ఉన్నారు.
    కానీ,’’ నాన్న గారికి చాలు వంకాయ కూ ‘‘ అనే ఓ కూనలమ్మ పదం నాకు కొంత వరకూ గుర్తుంది.. దాని పూర్తి చరణాలు గుర్తు రావడం లేదు. దానిని ఎందు చేతనో మీరు వదిలేసారు.

    ఏమైనా ఇవాళ ఆరుద్ర వర్ధంతి సందర్భంగా వారి కూనలమ్మ పదాలు పరిచయం చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. అభినందనలు.

    ReplyDelete
  3. @జోగారావు గారు,
    మీ అభిమానంతో కూడిన వ్యాఖ్యకి ధన్యవాదాలు. నాన్నగారికి చాలు వంకాయకూ(ర?)పద్యం నేను చదివిని ఈ పుస్తకంలో లేదండి. అందువల్లే దాన్ని రాయలేదు.నా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే మెచ్చుకున్నందుకు మీకు అభివాదాలు.

    ReplyDelete
  4. చాలా బాగా రాసారు సుధాగారు. మీ ఈ టపా చూసాక ఆరుద్రగారి రచనలు చదివి తీరాలని మరింత గట్టిగా తీర్మానించుకుంటున్నా.

    ReplyDelete
  5. నాన్న గారికి చాలు వంకాయ కూర అనేది కూనలమ్మ పదాలు లోనిది కాదేమోనండీ. కానీ అది ఆరుద్ర గారి ఏదో ఒక గేయ చరణమేనని నా నమ్మకం.

    నా మతి మరుపు మీద , బుద్ధి మాంద్యం మీద నాకు చాలా నమ్మకం ఉంది.

    ReplyDelete
  6. @జోగారావుగారు, అందరికన్నా గొప్పవాడు ఎవరూ అంటే తనేమిటో తానే తెలుసుకున్నవాడు...ట. మీగురించి మీరు చెప్పిన మాటలు చదివితే నవ్వొచ్చిందండీ. కానీ నిజమే. నాన్నగారికి చాలు వంకాయకూర..వాక్యాలు కూనలమ్మ పదాలు లోనివి కావు. ఇంటింటి పజ్యాలు లోనివి.

    పండుక్కి అందరికీ అన్నీ కొనాలా? ఔను
    కడసారిదానికి ఖరీదైన వెల్వెట్ గౌను
    రెండోదానికి జరీ ఉన్న పట్టు పరికిణీ
    మొదటి పిల్లకు ముచ్చటైన నైలాన్వోణీ
    భార్యారత్నానికి కంచి పట్టు చీర
    నాన్నగారికి చాలు వంకాయ కూర..

    ఆరుద్రగారు ఇంటింటి పజ్యాలు లో బహుమానాభిమానాలు శీర్షిక క్రింద ఇవి రాసారు. గుర్తుచేసి మళ్ళీ రాయించినందుకు మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. బావుంది సుధ గారూ! చక్కగా రాశారు.అభినందనలు.

    ReplyDelete
  8. బావుంది సుధ గారూ! చక్కగా రాశారు.అభినందనలు.

    ReplyDelete
  9. ఇవాళ ఆరుద్రగారి జయంతి.అందుకే రాసేరేమో అనుకున్నాను.కానీ..
    శ్యాం

    ReplyDelete
  10. @కొత్తపాళీగారు,
    చాలా కాలం తర్వాత నా బ్లాగులో మీ వ్యాఖ్య.టపా రాసిన ప్రతిసారీ మీ అభిప్రాయం కోసం చూస్తాను...ఈసారి రాసారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  11. @సుధామగారు,
    నచ్చిందని వ్యాఖ్యరాసి మరీ చెప్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. @అనానిమస్/శ్యాం గారు,
    ఆరుద్రగారి జయంతి అందుకే రాసారేమో అనుకున్నాను..కానీ..అన్నారు. ఈ వ్యాఖ్య నాకు అర్థం కాలేదు. నిజమే. ఆరుద్రగారి జయంతి అనే రాసాను అనుకోండి.

    ReplyDelete
  13. ప్రియమైన సుధారాణికి,కూనలమ్మ పదాలపై విపులంగా ,శోదాహరణంగా రాసిన బ్లాగు బాగున్నది.అదీ ఆరుద్ర పుట్టిన రోజున కావడం ఒక విశేషం .ఈ రోజే వినాయక చవితి అవడం యాదృచ్చికం.ఆరుద్ర చాలా ప్రక్రియలు ,ప్రయోగాలు చేపట్టారు.హాస్యం,వ్యంగ్యం ఆయన రచనల్లో ఎక్కువ.పరిశోధకుడు కూడా.కాని మహాకవి కారు.ఈ మాట అన్నందుకు మన్నిస్తారని అనుకొంటాను.ఆయన రాసిన శుద్ధ మధ్యాక్కరలు పరిచయం చేద్దామనుకొంటున్నాను. రమణారావు .ముద్దు

    ReplyDelete
  14. పరిశ్రమించి పరిశోధించారులా ఉంది.
    పరాక్రమము....పరిగతమవుచున్నది.

    ReplyDelete
  15. sudha garu mee saahitya abhimaanamu ,seva chala bagunnai.

    pallavi.

    ReplyDelete
  16. చాలా సమగ్రంగా ఉందండీ టపా.. 'కూనలమ్మ పదాలు' మళ్ళీ చదివినట్టుగా అనిపించింది టపా పూర్తి చేయగానే..

    ReplyDelete
  17. కూఅనలమ్మ పదాలు వినడమే గాని ఎప్పుడూ చదవలేదు. మీ టపా చూశాక వెంటనే చదవాలనిపించిది.

    ఈ కూనలమ్మ పదాలు
    సుధగారి ప్రాజ్ఞకు చిహ్నాలు
    వారికివే మా జోహార్లు

    ReplyDelete
  18. "శర్కరి"గారూ ...మీరు అభిమానంతో అన్న మాటకు ధన్యవాదాలు. కానీ మనం జోహారు అర్పించవలసినది అసలు రచయిత మన అభిమాన ఆరుద్రగారికి. ఈకాలంలోని మన ఇప్పటి పిల్లలకు తెలియాలని రాసానీ పరిచయం. మా కొండంతదేవుడు ఆరుద్రకి గోరంత పత్రిలాంటిది అనుకోండి ఈ పరిచయం. ఇంకోటి కూడా సూర్యుడికి పట్టిన దివిటీ ఇది. మీ ప్రోత్సాహకరమయిన వ్యాఖ్యకి కృతజ్ఞతలు..

    ReplyDelete
  19. Ch J Satyananda KumarSeptember 10, 2011 at 2:00 PM

    సుధా రాణీ గారూ,

    ఆరుద్ర గారంటే నాకూ చాలా ఇష్టం. ఆయన రచనల గూర్చి, మరీ ముఖ్యం గా కూనలమ్మా పదాలగూర్చి మీరు రాసిన సమగ్రమైన బ్లాగు అద్భుతం గా ఉంది. మంచి రచయిత పంతుల జోగారావు గారి ప్రతిస్పందనలు కూడా చదివాను. చక్కని సాహితీ సేవ చేస్తున్నారు. మీ క్రుషి అభినందనీయం. నమస్తే.

    సత్యానంద కుమార్.

    ReplyDelete
  20. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  21. చాలా చక్కటి ప్రయత్నం. ముందుగా నా అభినందనలు అందుకోండి.
    కూనలమ్మ పదాలు ఎప్పుడో కాలేజీ చదువుల కాలంలో చదివేను. మళ్ళీ చదివించేటంత గొప్పగా వుంది మీ వ్యాఖ్య.
    ఇదే ఉత్సాహంతో ఆరుద్రగారికి అంకితం చేస్తున్న కూనలమ్మ టైపు పదం:

    రాజకీయాల్లొ ఎందరికో ఇచ్చాడు టికెట్టు
    నింపాడు తన స్వంత పోకెట్టు
    అయినా ఎందుకు చెప్మా తన్నడు ఇంకా బకెట్టు?
    ఓ కూనలమ్మా

    ReplyDelete
  22. ఆరుద్ర గారి కూనలమ్మ పదాల మీద పరిశోధన వ్యాసం బాగా వ్రాశారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  23. @సత్యానంద కుమార్ గారు,
    @KKR గారు,
    @Rao S Lakkaraju గారూ,
    మీ ప్రోత్సాహపూర్వకమైన అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete