21 February 2012

గిరిజా కల్యాణం - సంగీత సాహిత్య సమ్మేళనం


రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి రంగులలో చిత్రించబడిన తొలిచిత్రం. దర్శకుడు వేదాంతం రాఘవయ్య.లలితా శివజ్యోతి బేనర్ పై ఎ.శంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం.

సినిమాలో రహస్యం ముందుగానే  బహిరంగ రహస్యంగా  తెలిసిపోవడం వలన ప్రముఖనటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో  వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం  మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంది. సందర్భానుగుణంగా, కధోచితంగా బోలెడు పాటలు, పద్యాలు ఈ సినిమాలో వీనులవిందు కలిగిస్తాయి. వీటిలో మణిపూస గిరిజాకల్యాణం - నృత్యనాటకం.

రహస్యం సినిమా డీవీడీలు సీడీలు రూపంగా వచ్చినప్పుడు కేవలం ఈ గిరిజా కల్యాణం ఎలా చిత్రించబడిందో చూద్దామనే కోరికతో ఎందరో కొనుక్కున్నారు. కానీ ఆ చిత్రంలో అన్ని పాటలు ఉన్నా గిరిజాకల్యాణం మాత్రం మనకు కనిపించదు. తీవ్రమైన నిరుత్సాహం మనసును ముప్పిరిగొని  ఆశాభంగం కలిగిన వారెంతమందో.

ఈ గిరిజా కల్యాణం మనకి  సినిమాలో కూచిపూడి భాగవతుల నృత్య ప్రదర్శనగా మనకి కనిపిస్తుంది. ఆ సినిమా టైటిల్స్ లో  నృత్య దర్శకులుగా  వెంపటి సత్యం, హీరాలాల్ వేదాంతం రాఘవయ్యగార్ల పేర్లు కనిపిస్తున్నాయి. మరి ఈ నృత్యనాటకానికి దర్శకత్వం వహించిన వారు ఎవరో. బహుశః సూత్రధారిగా కూడా ఈ నృత్యరూపకంలో కనిపించే వేదాంతం రాఘవయ్యగారే   ఈ రూపకానికి నృత్య దర్శకత్వం చేసి ఉంటారేమో. ఘంటసాల, మాధవపెద్ది, మల్లిక్, రాఘవులు, సుశీల, పి.లీల,  వైదేహి, సరోజిని,పద్మ, కోమల గానం చేసారు.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత.
ఘంటసాలగారు సంగీత రచయిత.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు గొప్పకవి. అంతే కాక గొప్ప కథారచయిత. ఉషాకల్యాణం అనే సినిమా కోసం ఈ గిరిజా కల్యాణ ఘట్టాన్ని గేయంగా రాసారు మల్లాది. కానీ ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన  ఆయన రచన కేళీగోపాలమ్ నవలలో  ఈ గేయం ప్రచురించబడి తెలుగువారిని ఆకర్షించింది.  ఈ  ఉషా కల్యాణం నాట్యరూపకంలో  కొద్దిమార్పులు చేసి రహస్యం సినిమాకి వినియోగించారు దర్శక నిర్మాతలు.

ఈ పాట సినిమాలో రికార్డు కావడానికి ముందే ఘంటసాలగారు ఈ గిరిజా కల్యాణాన్ని స్వరపరిచి ఆలపించడం ఓ గొప్ప విశేషం.  కంచి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. ఆయన ప్రీతికోసం ఉత్సవనిర్వాహకుల ఆహ్వానం మేరకు ఘంటసాలగారు తన బృందంతో ఈ గిరిజా కల్యాణాన్ని ఆలపించారు. ఇందులో ఫిమేల్ వాయిస్ మనకు వినిపించదు. అది కూడా ఘంటసాలగారే ఆలపించారు. ఈ ప్రైవేటుగీతంలో పాటలో ఘంటసాలతో మనకు వినిపించే ఒక స్వరం  తిరుపతి రాఘవులుగారిది  కాగా, మరొక స్వరం   పట్రాయని సంగీతరావుగారిది. సంగీతరావుగారు  రాగాలాపనతోను, హార్మోనియం పైన, రావూరి వీరభద్రం వయొలిన్ పైన, ఉలిమిరి లలితప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో సహకరించారు. ఈ పాటలో సినిమాలో మనం వినని చరణాలు కూడా వినవచ్చు. అంతేకాక సంభాషణల మధ్య అనుసంధానంగా ఉండే వాక్యాలు కూడా ఈ పాటలో వినిపిస్తాయి. 

ఆలిండియా రేడియో, హైదరాబాద్ వారు రికార్డ్ చేసి ప్రసారం చేసిన ఆనాటి కార్యక్రమంలోని కొన్ని భాగాలను ఈ అపురూపమైన వీడియో  లింక్ ద్వారా వినవచ్చు. (updated on 07/09/2020)గిరిజా కల్యాణం
తారకాసుర సంహారంకోసం తపోనిష్ఠలో ఉంటాడు శివుడు.  పరమశివుని భర్తగా పొందడానికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన గిరిజ (పార్వతీదేవి) తపోనిష్ఠలో ఉన్న ఈశ్వరుని కనుగొని అతనిని తన సేవలతో ఆరాధిస్తుంది. శివుడి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు మన్మధుడిని పంపుతాడు. మన్మధుడు పంచ బాణుడు. ప్రణయానికి అధిదేవత. పార్వతీదేవికి సహాయం చేస్తానంటూ ఆమె వారించినా వినకుండా ఈశ్వరుడిపై పూలబాణాలు వేసి అతని మూడో కంటి చూపుతో భస్మం అవుతాడు. శివుడి అనుగ్రహంతో తిరిగి ప్రాణం పోసుకున్నా రూపంలేకుండా భార్య రతీదేవికి మాత్రం కనిపించే విధంగా వరం పొందుతాడు. శివపార్వతులు కల్యాణంతో ఐక్యమవుతారు.  
ఇది ఈ కథాత్మక గేయానికి వస్తువు. ఈ వస్తువును సినిమాలో భాగంగా కూచిపూడి నృత్యనాటికగా రూపొందించబడింది. 

కూచిపూడి నృత్యం అంటే సంగీత, సాహిత్య, నాట్య సమాహార కళ. అన్నిటికీ సమ ప్రాధాన్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గిరిజాకల్యాణం నృత్యరూపకంగా అందుబాటులో లేకున్నా తెలుగు హృదయాలలో సందడి చేయడానికి ముఖ్యమైన విశేషం మల్లాదివారి సాహిత్యపు బంగారానికి ఘంటసాలగారు అద్దిన స్వరపరిమళం.


తెలుగు భాషలోను, భావంలోను ఎన్నో కొత్తపోకడలు రుచిచూపించిన మల్లాది వారి కలంలో ఈ గిరిజా కల్యాణ ఘట్టం మనను ఎంతగానో అలరిస్తుంది. 

అచ్చ తెలుగుమాటలతో తెలుగువాళ్ళ జీవితాలలోని ఎన్నెన్నో ఘట్టాలను రమణీయమైన భావాలతో రసభరితమైన పద ప్రయోగంతో ఆవిష్కరించారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. వారి సమయోచిత పదప్రయోగం గురించి, ఎన్ని వందలసార్లు చెప్పుకున్నా తనివితీరేది కాదు. అది కథ అయినా, సినిమా పాట అయినా మాటలకుండే ధ్వని,  ప్రయోగంలో మనసులో కలిగించే సద్యస్ఫూర్తిని గ్రహించిన మహా మాటల మాంత్రికుడు మల్లాది. 

ఆ పాటలలో కనిపించే ప్రయోగ శీలత్వాన్ని  వాక్కు, మనసు, జీవన సంస్కారాల త్రివేణీ సంగమంగా అభివర్ణించారు విమర్శకులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.
పాట నిర్మించేతీరులో దక్షిణాంధ్రవాగ్గేయకారుల సంస్కారం , ఆ యుగానికి చెందిన తెలుగు మాటల గమ్మత్తులు, జానపద, శృంగార పదాలలో ఉండే చమత్కారం కనిపిస్తాయని,  సమకాలిన తెలుగు సినిమా కవులలో మల్లాది హృదయసంస్కారం దక్షిణాంధ్రయుగానిదైతే భాష, భావ సంస్కారాలు అత్యాధునికమైనవి అన్నారు ఆయన.

కూచిపూడి నృత్య ప్రబంధంగా, యక్షగాన ప్రక్రియలో తీర్చిదిద్దిన ఈ గేయంలో మల్లాది గారు ప్రయోగించిన తెలుగు మాటలు ఎంత గొప్పగా సమయోచితంగా హంగు చేస్తాయో ఓసారి చూద్దాం. 

కూచిపూడి నాట్యం అత్యంత ప్రాచీనమైన నృత్యగాన సమాహార కళ. కాలక్రమంలో యక్షగాన ప్రక్రియ లక్షణాలను కూడా సంతరించుకుంది. దశరూపకాలలో చెప్పబడిన వీధి నాటక ప్రక్రియ లక్షణాలు కూచిపూడి నాట్య ప్రయోగంలో కనిపిస్తాయి. సంవాదాత్మకమైన సంగీత ప్రధానమైన నృత్య ఫణితిని సంతరించుకున్న పరిపూర్ణ రూపమైన నృత్యనాటకంగా ఈ గిరిజా కల్యాణం రూపొందించబడింది. 

సంప్రదాయ కూచిపూడి నృత్యాలలో కనిపించే అంశాలన్నీ మల్లాది వారు రచించిన ఈ గిరిజా కల్యాణం నాటకంలో కనిపిస్తాయి.
కూచిపూడి నృత్యనాటకాలలో మొదట పరాకు చెప్పడం అంటే ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ (సాధారణంగా సరస్వతీదేవి స్తుతిగా ఉంటుంది) నాటకాన్ని ప్రారంభించడం ఉంటుంది. సూత్రధారి నాటకాన్ని ప్రారంభంలో ఇష్టదేవతా స్తుతి చేయడం ఆ తరువాత నాటకం చూడడానికి వచ్చిన రసికులను ప్రశంసించడం తరువాత కథాంశాన్ని ప్రస్తావించడం, ఆ వెంటనే కథలో పాత్ర ప్రవేశం ఉంటుంది. 

 నృత్యరూపకాలలో ప్రారంభం లో పరాకు చెప్తూ సూత్రధారుడు ప్రవేశిస్తాడు. దేవతా స్తుతితో ప్రార్థనతో ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది.

అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

 అంటూ కళలకి అథి దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతిస్తారు.

తరువాత ప్రతి కార్యక్రమానికి ముందుగా అవిఘ్నమస్తు అనిపించుకోవడం కోసం గణపతి ప్రార్థన.
ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా
బహుపరాక్ బహుపరాక్

ఆ తరువాత గజాననుడి తమ్ముడు షడాననుడు(ఆరు ముఖాలున్నవాడు) – కుమారస్వామిని ప్రార్థిస్తారు.

చండభుజాయమండల దోధూయమాన వైరిగణా –షడాననా.
ఈ దైవ ప్రార్థనతో పాటు  కూచిపూడివారి గ్రామం చుట్టుపక్కల ఉండే దైవస్తుతి –

విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కూచిపూడి గ్రామం. కూచిపూడి గ్రామం పేరు ఒకప్పుడు కుశీలపురం అని, కుశీలపురం కుచేలపురం అయి కూచెన్నపూడి కూచిపూడి గా మారిందని చరిత్రకారులు చెప్తారు. ఈ స్తుతిలో మనకు కూచిపూడి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధదేవాలయాలలోని మూర్తుల స్తుతి కనిపిస్తుంది.

మంగళాద్రి నారసింహ (మంగళగిరిలోని నరసింహస్వామి), బంగరుతల్లి కనకదుర్గ (విజయవాడ కనకదుర్గ),
 కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ( కృష్ణానదీతీరంలోని కూచిపూడి గ్రామంలోని గోపాలస్వామి) అంటూ దైవస్తుతి చేస్తారు.

దైవస్తుతి అనంతరం కథ ప్రస్తావన – అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా  అంటూ కథలోకి ప్రేక్షకులను ఆహ్వానిస్తారు. 

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే అంటూ నాటకాన్ని వీక్షించడానికి వచ్చిన  ప్రేక్షకుల కళా ప్రియత్వాన్ని మెచ్చుకుంటూ తమ కళలోని సారస్యాన్ని అనుభవించి పరవశించమంటారు. పదింబదిగ (పదియున్ + పది+ కాన్)అంటే చక్కగా, పూర్తిగా అనే చక్కని అర్థాన్నిచ్చే అచ్చ తెలుగు పదం ఇక్కడ వేసారు శాస్త్రిగారు.

 ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ  ఈ కథా వస్తువు గా పరిచయం చేస్తారు. కన్నెగా ఈశ్వరుని చేరిన హిమవంతుడి కూతురు ఏ విధంగా ధన్యచరిత అయిందో తాము చెప్పబోతున్నామని, అవధరించ(విన)మంటారు.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ,
ఆ కోపీ-
కాకలు తీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమైన ప్రబంధము –

నిప్పుల ఎర్రదనాన్ని చూపే పదం కణ కణ. అటువంటి ఎర్రని కోపంతో ఉన్న ఆ కోపి అయిన శివుడు  ఆ కాముని రూపాన్ని అంటే మన్మధుడి శరీరాన్ని మసిచేసాడు. కానీ   ఆగ్రహం చల్లారి కాక (వేడి /తాపం) తీరగానే కనులు తెరిచాడు. తనను తెలుసుకున్నాడు. తన లలనను పరిణయమైన  అనే పదం ఎంతో చమత్కారంగా అనిపిస్తుంది. తన లలన అనడంలో- ఈశ్వరుడు పార్వతి ఆదిదంపతులు కదా. వారు ఎప్పుడో ఒకరికి ఒకరు చెందినవారు. ఇప్పుడు  ఈ సందర్భంలో మళ్ళీ పెళ్ళిచేసుకొని జంటగా మారారు. అందుకే తనలలనను పరిణయమాడిన కథను వినండి అంటాడు సూత్రధారుడు.

ఇక్కడితో తెరమీద సూత్రధారుడి కధా వస్తువు పరిచయం అయింది. ఇక పాత్రప్రవేశం.

తెర పక్కకు తొలగుతుంది. పార్వతీదేవి  చెలికత్తెలతో ప్రవేశిస్తుంది. 
రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

ఇక్కడ పార్వతీదేవి పాత్రను పరిచయం చేసే వాక్యాలు ఇవి.
రావో రావో  అంటూ పార్వతీదేవిని పిలుస్తారు చెలులు.

లోల లోల లోలం బాలక  రావో...రావో అంటే  లోల లో ల అంటే అలా అలా కదులుతూ ఉన్న లోలంబమైన అలకలు కల అంటే 
కదులుతూ ఉన్న అలకలు అంటే ముంగురులు  కలిగిన దానా, అంటూ పార్వతీదేవి ముఖ సౌందర్యాన్ని ప్రశంసిస్తారు. 

లోల అనే పదం ఇక్కడ మూడుసార్లు ప్రయోగించారు.అందమైన ముంగురులతో ఉన్న స్త్రీని వర్ణించడానికి  ఇంత అందంగా ఒకే పదాన్ని అన్నిసార్లు వాడుతూ  ఆ అందాన్ని ద్విగుణీకృతం చేసారు మల్లాదిగారు.

లోకోన్నతుడైన అంటే  లోకాలన్నిటిలోనూ ఉన్నతమైన వాడు -పర్వతరాజు  హిమవంతుడు, అతని భార్య మేనకాదేవి, వారి తనయ (పుత్రిక)  పార్వతీదేవి.  రాజసులోచన, రాజానన అంటే ఇక్కడ రాజు అంటే చంద్రుడు అని తీసుకుంటే చంద్రుడివంటి ముఖం కలిగినది అయిన పార్వతిని వర్ణించే సార్థక పదప్రయోగాలు ఇవి.

పార్వతీదేవి ఈశ్వరుడి వద్దకే  వెళుతోందని తెలిసినా వారు ఆమెని ఎక్కడకు అని  ప్రశ్నిస్తారు. తద్వారా మనకు కథా గమనం తెలుస్తుంది.

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే

అందమైన మోములో లేలేత నవ్వులు చిందిస్తూ హంసవలె వయ్యారంగా నడుస్తూ ఓ కలికీ ( అందమైన అమ్మాయి) ఎక్కడికే నీ ప్రయాణం అని ప్రశ్నిస్తారు.

మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

మానస సరోవరం దగ్గర మణులల ప్రకాశించే పద్మదళాలమధ్య కూర్చుని రాజహంస( యోగి కి మరో పదం)లాగ ఉంటే అతని వద్దకు వెళ్తున్నానని సమాధానం చెప్తుంది పార్వతి.

ఇక్కడ మానససరోవరం దగ్గర ఈశ్వరుడు ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాని తపోనిష్టలో ఉన్న ఈశ్వరుడి గురించి,  మనసనేది సరోవరమైతే అందులో రాజహంసలా ప్రకాశించే ఒక యోగి  అనే ఒక లోతైన వేదాంతవిషయాన్ని గూఢంగా పలికించారు మల్లాది. పైగా ముందు చెలుల మాటలో కలహంస అనే పదం స్త్రీ అయిన పార్వతీదేవికి వేస్తే ఈశ్వరుడి వర్ణనలో రాజహంస అనే పదం సరిగ్గా తూగుతో నిలిచింది కూడా. అదే సార్థక పద ప్రయోగం అంటే.

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే

అంటూ వావిలిపూలదండలు పట్టుకుని వయ్యారపు నడకలతో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తారు.

కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే 

అంటూ పార్వతి కైలాసంలో కొలువై ఉన్న దేవదేవుడి సన్నిధికి వెళ్తున్నానని, త్వరలోనే అతను తన ప్రేమనిండిన కనులతో చూసి ఏలుకోబోతున్నాడని చెప్తుంది.

ఈ సంభాషణ పూర్తవుతూనే మన్మధుడి పాత్ర ప్రవేశిస్తుంది.

తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ   - అంటూ మన్మధుడు పార్వతీ దేవి ఈశ్వరుని కటాక్షపు వీక్షణాలకోసం పడిగాపులు పడనక్కరలేదని, తను సహాయం చేస్తానంటాడు.

అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా 
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది

ఇక్కడ మన్మధుడి ఔద్ధత్యానికి, అహంకారానికి తగిన మాటలు ఎన్ని వేసారో మల్లాది చూడండి. బిందు డకారం ( 0డ) ప్రయోగంతో అర్థ భేదం కలిగిన పదాలను చమత్కారంగా వాడారు.

పార్వతీదేవి వంటి రాజకుమారి, ఉత్తమవంశంలో జన్మించిన (పర్వతరాజు కూతురు కనుక) స్త్రీ, తనకు తానుగా తన భర్తను వెతుకుతూ వెళ్ళడం తగని పని అంటాడు మన్మధుడు. పైగా, తనంతటివాడు, గొప్ప ఆయుధాలు కలిగిన వీరుడు ఆమెకు అండగా ఉండగా అంటూ తన ఆయుధాల పదనును చెప్తాడు. విరిశరములు అంటే మన్మధుని పూల బాణాలు. అవి ఎంత పదునైనవో  అతనికి తెలుసు. పూలబాణాలు కదా అని తేలిగ్గా తీసేయవద్దనే హెచ్చరిక ఇక్కడ కనిపిస్తుంది.

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా

అంటూ తన శక్తిని చాటుకుంటాడు. పార్వతి ఎవరిని కోరుకుంటోందో అతను ఎంతటి ఘనుడైనా సరే తన కోలనేయనా అంటే తన బాణాన్ని వేసి, సరసను కూలనేయనా అంటే పార్వతి చెంతకు తీసుకువచ్చి పడేస్తాను అంటాడు. కనుగొనల నన మొనల అన్న పదంలో మన్మధుని ఆయుధాలైన పూల మొగ్గలతో గాసిచేసి అంటే నాశనం చేసి నీ దాసుడిని చేస్తాను - అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.

మన్మధుడి వాచాలత్వాన్ని చూసి పార్వతీదేవి సహించలేకపోతుంది. తన దైవాన్ని పాదాలచెంతకు తెచ్చి పడేయగలనంటూ అహంకారంతో అతను అంటున్న మాటలను ఖండిస్తుంది.
 అందుకే-

ఈశుని దాసుని చేతువా -అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!

తాను ఆరాధిస్తున్న ఈశ్వరుడిని దాసుడిని చేస్తాననడం చాలా తప్పు అని మందలిస్తుంది. అపసద అంటే నీచుడా అని అర్థం.  అలసుడు అంటే మందమైన బుద్ధిగలవాడు అని అర్థం. కోలలు అంటే మామూలు బాణాలు వేస్తే ఓడిపోయి కూలిపోయే సామాన్యుడుకాడని తను కోరుకున్నవాడు,   ఆ ఈశ్వరుడు  ఆది దేవుడని వివరిస్తుంది పార్వతీదేవి, మన్మధుడికి.


సేవలు చేసి ప్రసన్నుని చేయ 
నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...

తను చేసే సేవలతో ఏనాటికైనా ప్రసన్నుడై తనను అనుగ్రహిస్తాడని, మన్మధుడు చేస్తానని చెప్పిన సాయం తనకు అవసరం లేదంటుంది.


ఈలోపున చెలికత్తెలు కూడా మన్మధుడు చెప్పిన మాటలలోని అసంబద్ధతను చెప్తారు.

కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!  
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.

ఇక్కడ కాని పనీ అంటే అది చేయకూడని పని అని, నీ చేతకానిపనీ అంటే నీవు చేయగలిగిన పని కాదు అని కొద్దిగా వర్ణ భేదంతో పద ప్రయోగం చేసి  గొప్పఅర్థభేదాన్ని చూపించారు మల్లాదిగారు.

అహంకారంతో హరుడిని జయించడం అనేది తగని పని అని, పైగా ఆ పనికి పూనుకోవడం నీ వల్లకాదనీ చెలికత్తెలు, మన్మధుడిని హెచ్చరిస్తారు.

ఆ హెచ్చరిక విన్న మన్మధుడు ఇక్కడ హుఁ అంటూ హూంకరిస్తాడు వారు  తన శక్తిని సందేహిస్తున్నందుకు.

చిలుక తత్తడి రౌత అంటూ మన్మధుడిని సంబోధిస్తూ చెలికత్తెలు మళ్లీ ఇలా అంటారు.

చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....
మన్మధుడు ప్రణయదేవత. అతను చిలుక వాహనం పైన సవారీ చేసే రౌతు. తాము అతని మంచికోరి చెప్పిన మాటలు వినకపోతే ఏమవుతుందో హెచ్చరిస్తున్నారు చెలులు. తమ మాటలు వినకపోతే పదునైన విరిశరములు అంటూ బీరాలు పలుకుతున్న నీ బాణాల పని ఇక ఆఖరు అని హెచ్చరించారు. చిగురుటాకుల విల్లు సింగిణి కూడా ఇంక నాశనం అవుతుంది. తేజీ పని సరి అనే వాక్యంలో తేజీ అంటే గుఱ్ఱానికి పర్యాయపదం గా చూపిస్తోంది నిఘంటువు. చిలుకను తన వాహనానికి పూన్చాడు కాబట్టి చిలుకపని సరి అని చెప్పారు. చిగురుకు అంటే కడపటికి, చివరకు అని అర్థం. చివరకు అంటే మొత్తానికి నీ పని సరి అని ఈశ్వరుడితో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పి నయానా భయానా చెప్పజూస్తారు చెలికత్తెలు.
కానీ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి తన పరాక్రమం పైన  అచంచలమైన నమ్మకం పెట్టుకున్నవాళ్ళు మంచి మాటలు చెప్తే వింటారా.

 సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా 
అంటూ పార్వతీ దేవి ఈశ్వరుని సన్నిధికి చేరింది.


( ఈ మాటలకు అర్థం నాకు తెలియలేదు. శ్రీ పట్రాయని సంగీత రావుగారిని అడిగి తెలుసుకున్నాను. వారి వివరణ ఇలా ఉంది.


సామగ అంటే సామగానమునకు, సాగమ అంటే ఆగమములు అంటే వేదాలకు ఆధారమైన వాడవు, శారదనీరద అంటే శరత్కాలంలో చంద్రుడి పక్కన ప్రకాశించే తెల్లని మేఘం వంటి రూపం కలిగిన వాడవు, దీనులకు ఆధీనమైనవాడవు,
ధీసారుడు అంటే బుద్ధిబలం కలిగినవాడవు 


అంటూ పార్వతీ దేవి ఈశ్వరుడిని ప్రశంసిస్తూ ప్రార్ధించింది)

ఇవె కైమోడ్పులు            - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి          -ఈశా మహేశా

 అంటూ ఈశ్వరుడిని పరిపరివిధాల ప్రశంసిస్తూ  పూలతో పూజలు చేసి వాటితో పాటు తన హృదయాన్ని కూడా అంజలిచేసి సమర్పించుకుంది. అదే సమయానికి ఈశ్వరుని హృదయంలో ప్రణయాస్త్రం వేసి పార్వతికి సహాయం చేసి తన శక్తిని నిరూపించుకోవాలనుకున్న మన్మధుడు పూలబాణాలను సంధించాడు. అవి వెళ్ళి ఈశుని మదిలో గుచ్చుకున్నాయి. తపో భంగమయింది. తన తపస్సుకి భంగం కలిగించిన కారణం ఏదో తెలుసుకున్నఈశ్వరుడు కోపించాడు. వెంటనే తన మూడో కన్ను తెరిచాడు. మన్మధుడు ఆ కోపాగ్నికీలలలో కాలి, మాడి మసైపోయాడు.

మన్మధుడికోసం వచ్చిన అతని భార్య రతీ దేవి విషయం తెలుసుకుంది. తన ప్రాణవిభుడిని రక్షించమని ఈశుని వేడుకుంది.

ఇక్కడ కూడా మల్లాదివారిది బహు చమత్కారం అనిపిస్తుంది.
మన్మధుడు ఈశ్వరుడిని తన బాణాలతో కొట్టి అతనిలో శృంగారభావాలను రేపి విర్రవీగుదామనుకున్నాడు.అందుకే బాణాలు వేసాడు.

 కానీ రతీదేవి ఈశ్వరుడితో ఏమంటోందో చూడండి.
విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ

నిన్ను (ఈశ్వరుడిని) ఒక ఇంటివాడిగా (గేస్తు –గృహస్థు కి వికృతి) చేయడం కోసం పూనుకున్న(దొరకొన్న)  మన్మథుడిని (రసావతారు) చిచ్చరకంటను అంటే  మండుతూ ఉండే మూడవకంటితో చూసి నాశనం చేస్తావా ప్రభూ అంటూ రతీదేవి ఈశ్వరుడిని ప్రశ్నిస్తుంది. పూలతో నీకు పూజచేసి గృహస్థుగా మార్చుదామనుకున్నాడు. ఆయన ఇదంతా చేసింది నీకోసమే కదా. ఉపకారికి అపకారం చేస్తావా అంటూ తన భర్త పనిని సమర్థిస్తుంది.

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
 మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....

గిరిరాజ కన్య అంటే పార్వతీదేవి(పర్వతరాజు కూతురు) ని నీవు భార్యగా స్వీకరిస్తావు. మరి మరుడి(మన్మధుని)  సంగతి ఏమిటి? నా మాంగల్యం ఏం కావాలి?  అని ప్రశ్నించి తమని 
రక్షించమని, పతిభిక్ష పెట్టమనీ అర్థిస్తుంది.

పార్వతీదేవి చల్లని తల్లి. లోకాలనేలే మాత. అందుకే మన్మధుడు శివుని కంటిమంటలో కాలిబూడిదయ్యే వేళ “ అంబా! అంబా!(అమ్మా, అమ్మా)” అంటూ పిలిచిన  పిలుపును, అందులోని ఆర్తిని గుర్తించింది. ఇక  భరించలేకపోయింది.

ఈశ్వరుడికి తన తరపునుంచి ఓ మాట చెప్పి రతీదేవి కోరికను మన్నించమంటుంది.

 తనను మన్మధుడు అంబ అంటే అమ్మ అని పిలిచాడు విన్నావా అని ఈశ్వరుడిని అడుగుతుంది.

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...

తనను మన్మథుడు అమ్మ అని పిలిస్తే మరి తన భర్త అయిన ఈశ్వరుడు అతనికి తండ్రే అవుతాడు కదా.అందుకని జనకుడిగా (తండ్రిగా) భావించి అతనిని కుమారుడుగా చేసుకొని ప్రాణం పోయమని పార్వతీ దేవి బతిమాలుతుంది. ఇక్కడ అసమ శరుడు అంటే మన్మధుడు. (మన్మధుడి పుష్పబాణాలు ఐదు. సమసంఖ్య కాని సంఖ్య కదా ఐదు. కనుక అసమమైన సంఖ్యగల బాణాలు కలిగినవాడు మన్మధుడు అని వ్యుత్పత్తి)

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామిన్!!

అంటూ పార్వతీదేవి తన మనసును, తనువును ఈశ్వరుని భావనలో లీనం చేసి ఉన్నానని, అటువంటి గిరి పుత్రి అయిన తనను చేపట్టి ఏలుకోమని కోరుతుంది. తనను పరిపాలించమంటుంది. ఆమె కోరికను మన్నిస్తాడు పరమేశ్వరుడు. మన్మధుడు పునర్జీవం పొందుతాడు.

ఇంకేముంది. తపోభంగం ఎలాగూ అయింది కనుక ఈశ్వరుడు పెళ్ళి కి ఒప్పుకుంటాడన్నమాట.

ముందు బెట్టుచేసి సేవలు చేయించుకుని, మన్మధుని బాణాలు తాకాయన్న వంకతో తపోభంగం చేసుకుని అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు ఈశ్వరుడు. ఆ మాటలను ఎంత చక్కని తెలుగు మాటల్లో చెప్పారో మల్లాది.

బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం

అంటూ జగన్మాతా, జగత్పితల కల్యాణం లోకకల్యాణం గా భావిస్తూ ఈ నృత్యనాటకానికి మంగళం పాడతారు సంప్రదాయబద్ధంగా .

ఇక్కడ సూత్రధారుడు మళ్ళీ తెరపైకి వచ్చి-

కూచెన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం 

అంటూ కూచిపూడిలోని గోపాలదేవునికి జయమంగళ వచనాలు పలికి నాటకాన్ని పరిసమాప్తిచేస్తారు.

కూచిపూడి సంప్రదాయబద్ధమైన నృత్యరూపకానికి తగినట్టుగా  వివిధ ఘట్టాలకు తగిన రాగాలను సమకూరుస్తూ రాగమాలిక పద్థతిలో స్వరపరిచి , తనకు ఎంతో సహజసిద్ధమైన భావయుక్తమైన గానంతో మల్లాది వారి సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు ఘంటసాల.

అందుకే ఇన్నేళ్ళయినా ఇంత పెద్ద పాట అయినా తెలుగు హృదయాలను ప్రతితరంలోను గెలుచుకుంటూనే ఉందీ పాట.

తెలుగును మరో పదికాలాలు బతికించుకోవాలంటే ఈతరం వారు చేయవలసిన ముఖ్యమైన పని, సాహిత్యంలో మాణిక్యాల్లాంటి పద్యాలను, పాటలను ఆధునికపద్ధతిలో సంరక్షించుకోవాలి. పదిమంది కలిసినప్పుడు పాడుకోవాలి. అందులోని పదప్రయోగాల ప్రత్యేకతలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుతరాలవారికి పరిచయం చేయాలి.

"తాళ్ళపాకవారిని(అన్నమయ్య) చదవనిదే తెలుగు రాదు" అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రి.

మల్లాదివారి  పాట అర్థమయిందంటేనే మనకి తెలుగు వచ్చినట్టు.

33 comments:

 1. సుధారాణి గారూ !
  అమృతతుల్యమైన యక్షగానానికి అద్భుతమైన వివరణ.ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. ఎస్సార్ రావుగారు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.

   Delete
 2. దీనికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు! అంత చక్కగా వ్రాసాక మాటలు రావటం లేదు!ఎన్నో తెలియని విషయాలను తెలియచేసారు! ధన్యవాదాలు!

  ReplyDelete
  Replies
  1. మీ రసజ్ఞమైన స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. శాబాసు..శాబాసు..అమృతతుల్యమైన ఈ యక్షగానాన్ని అవధరించి ఆనంద పరవశుడు కాని ఆంధ్రుని జన్మ వృధా. మల్లాది వారి పదాల పోహళింపు అనితర సాధ్యం అంటే అతిశయోక్తి కానేరదు.అహంకారంతో శివుణ్ణి గాసి చేసి పార్వతి సరసన కూలనేస్తానన్న రతిరాజునే శివుడు గాసిచేసిన విధం అద్భుతంగా వర్ణించారు మల్లాది.శివుడు స్వతహాగా భోళా శంకరుడు.తపోనిష్టలో ఉండగా అతని నిష్టను భంగ పరచిన మన్మధుణ్ణి భస్మం చేస్తాడు, కానీ కను తెరచి తనుతెలిసాక ( ఇక్కడ తను తెలియడమంటే ఒళ్లుతెలియడం స్పృహలోకి రావడమన్నమాట), అతడు మళ్లీ భోళాశంకరుడే.అందుకే మన్మధుణ్ణి క్షమిస్తాడు. మానస సరోవరతీరాన తపోనిష్టలోనున్న శంకరుణ్ణి రాజహంస గానూ పార్వతిని కలహంస అనీ పోల్చడం చాలా బాగుంది. మరి హంసలుండేది మానస సరోవరంలో మాత్రమే కదా?.దీని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. మీ కృషి బహుదా ప్రశంసనీయం.

  ReplyDelete
 4. చాలా బాగా రాశారు.

  'అసమశరుడు' ని ఆ+సుమ+శరుడు అనుకునేవాణ్ణి, చక్కటి సాహిత్యం.

  ReplyDelete
 5. ఇదేమిటండీ? నేనిన్నాళ్ళూ కూచిపూడి వారి "గిరిజా కళ్యాణము"
  యక్ష గానము/ నాట్య రూపకము- సిద్ధేంద్ర యోగి రచన అనే అనుకున్నాను.
  సత్యభామ జడ కోలాటానికి బీజం వేసి,
  ప్రదర్శన కళలలో అగ్ర పీఠం వచ్చేట్లు చేసిన ఘంటము కదా సిద్ధేంద్ర యోగిది.
  "రహస్యం" తెలుగు సినిమాలో-
  "లలితా దేవి" (నటి- అంజలీదేవి) మీద ఉన్న హారతి పాట కూడా చిరస్మరణీయమే!
  ఆదిశక్తి మీద రమణీయచిత్రీకరణ కలిగిన
  ఆంధ్ర చలనచిత్రాల కలిమి-
  ఆ గీతాలను కూడా మీ కలం పరిచయం చేస్తే మాకెంతో సంతోషం సుధారాణి గారూ!
  (http://konamanini.blogspot.in/)
  ;

  ;

  ReplyDelete
  Replies
  1. అనిల్ గారు, ధన్యావాదాలు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి బహుధా వ్యక్తిత్వం అది. ఆయన జానపదం లాంటి గీతం రాసినా, వేదసారాంశాన్ని రెండుముక్కలలో చెప్పినా అది ఉత్కృష్టరచన అయి తీరుతుంది.

   Delete
 6. సాగమ సాధారా శారద నీరద సాకారా దీనాధీనా ధీసారా పాటలోని

  ఈ మాటలకు అర్థం నాకు తెలియలేదు. మల్లాదివారి స్నేహితులు,ఘంటసాలగారి స్వరసహచరులు శ్రీ సంగీతరావుగారిని అడిగి తెలుసుకున్నాను. వారి వివరణ ఇలా ఉంది.

  సామగ అంటే సామగానమునకు, సాగమ అంటే ఆగమములు అంటే వేదాలకు ఆధారమైన వాడవు, శారదనీరద అంటే శరత్కాలంలో చంద్రుడి పక్కన ప్రకాశించే తెల్లని మేఘం వంటి రూపం కలిగిన వాడవు, దీనులకు ఆధీనమైనవాడవు, ధీసారుడు అంటే బుద్ధిబలం కలిగినవాడవు

  అంటూ పార్వతీ దేవి ఈశ్వరుడిని ప్రశంసిస్తూ ప్రార్ధించింది)

  ReplyDelete
 7. చాలా గొప్ప పాట గురించి చాలా గొప్పగా రాసారు.
  ఒక్క లైను మిస్సయినట్లున్నారండీ-

  "కాని పనీ మదనా- అది నీ చేత కానిపనీ మదనా-
  అహంకరింతువ హరుని జయింతువ,
  అది నీ చేత కాని పని మదనా.."

  శారద

  ReplyDelete
  Replies
  1. శారదగారు, నిజమే. ఏదో ఎడిట్ చేస్తూ పొరపాటు చేసినట్టున్నాను. చూసి చెప్పినందుకు, ధన్యవాదాలు అంటే ఈ పాట మీక్కూడా కంఠస్థమేనన్నమాట.....-:))

   Delete
 8. గిరిజాకల్యాణం ప్రైవేట్ రికార్డు ఘంటసాలగారు పాడిన పాటలో చిలుకతత్తడి రౌత ఎందుకీ హుంకరింత చరణం, పార్వతీదేవి ప్రార్థనలో అంబాయని అసమశరుడు ననుపిలిచెను వినవో చరణాలు లేవు. గమనించారో లేదో. ఏఐఆర్ వారు రికార్డు చేసినప్పుడు ఎడిటింగ్ లో వాటికి చోటులేకపోయిందా లేక మరేదయినా కారణమా..చెప్పగలరు.

  వనజ

  ReplyDelete
 9. రోజుకొకసారి చదువుకున్నా తనివితీరని వ్యాఖ్యానం రాసారు సుధగారూ! ఇంచుమించు ప్రతిరోజూ నేను వినే /తలచుకునే మల్లాది వారి అద్భుత సృష్టి ఇది.

  ఈ"శు"ని దాసుని చేతువా.. సరిచెయ్యరూ!

  ReplyDelete
 10. మీ బ్లాగ్సు చాల బాగున్నాయి.నాకు రచకొండ విశ్వనాథ గారి అల్ప జీవి నవల కావాలి. దొరికే అడ్రసు చెప్పగలరు. ధన్యవాదములు. PDF file ఫర్వాలేదు.

  ReplyDelete
 11. 'రహస్యం 'సినిమాలో యక్షగానం గురించి,దీర్ఘంగా,ఓపికతో, చాలా చక్కగా రాసావు.అందులో వేదాంతం సత్యనారాయణశర్మ మన్మథుని వేషం వేశారు.తర్వాత కొంతకాలానికి స్టేజి మీద స్వయంగా' విప్రనారాయణ ' నృత్యనాటికలో దేవదేవి వేషంలో చూసాను.రహస్యం సినిమా లోని యక్ష గానం ప్రత్యేకత ఏమంటే ,సాహిత్యం,సంగీతం ,నృత్యం modernize చెయ్యకుండా సంప్రదాయబద్ధం గా ఉండటం.

  ReplyDelete
 12. అద్భుతమైన వ్యాఖ్యానం సుధగారూ! బ్రహ్మానందం కలిగింది. సినిమా చూసి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ యక్షగానం నాకు కంఠోపాఠమే! మీ వ్యాసం చదువుతుంటే పాట అలా గొంతులో నుండి వచ్చేస్తున్నది. అభినందనలు మరియు ధన్యవాదములు.

  Piska Satyanarayana (hemadri.satyam@gmail.com)

  ReplyDelete
 13. అద్భుతమైన వ్యాఖ్యానం సుధగారూ! బ్రహ్మానందం కలిగింది. సినిమా చూసి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ యక్షగానం నాకు కంఠోపాఠమే! మీ వ్యాసం చదువుతుంటే పాట అలా గొంతులో నుండి వచ్చేస్తున్నది. అభినందనలు మరియు ధన్యవాదములు.

  ReplyDelete
 14. బావుంది సుధ గారూ,భరాగో తెలుగు పాటకు నూటపదహార్లు కూడా దీని గురించి ఉంది,ఆడియో లింకిచ్చి మమ్మానందింపచేసారు,ధన్యవాదాలు

  ReplyDelete
 15. సుధారాణిగారు,
  అద్భుతమైన పాటకి చక్కని వ్యాఖ్యానం అందించినందుకు ధన్యవాదాలు. ప్రైవేటు రికార్డు పంచుకున్నందుకు మరిన్ని ధన్యవాదాలు! లోలంబము/రోలంబము అంటే తుమ్మెద. లోలంబాలక - తుమ్మెదలవంటి ముంగురులు కలది.

  ReplyDelete
 16. సుధారాణి గారు, ఇంత విపులంగా, ఎవరికైనా సులభంగా అర్ధమయ్యే రీతిలో వ్రాయగలుగుతున్న మీ ఓర్పు, సహనానికి నమో నమః ...! దీని గురించి ఇదివరలో విన్నాను గాని అంతగా తెలియదు, ఇప్పుడు మీ ఈ వివరణ ద్వారా చక్కగా తెలుసుకోగలిగాను, అందుకుగాను కృతఙ్ఞతలు చెప్పకుండా ఉండలేను. ఆ వీడియో చూసినప్పుడు మేను పులకించింది...! :)

  ReplyDelete
 17. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 18. సుధారాణి గారు ఏంతో విపులంగా రాసారు. అంతేకాక తెలియని విషయాలను నేర్చుకుని మరీ రాయడం బాగుంది.

  ReplyDelete
 19. సుధారాణి గారు చాల ఓపికగా వేరేవాళ్ళ దగ్గర తెలుసుకుని మరీ బ్లాగ్లో పెట్టారంటే మీ ఓపికకి మేచుకోవలండి. అలాగే చాల స్పష్టంగా అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో రాసారు చాల బాగుంది.

  ReplyDelete
 20. ఎంత బాగుందో మీరు వివరించిన ఈ యక్షగానం ,గిరిజా కళ్యాణం ,ఘంటసాల గారి గళ్ళంలో అమృతధారై .............యక్షగానం అంటే ప్రీతీ కలిగించింది మీ ఈ పోస్ట్ ...........యక్షగానం ఇప్పుడు మన సంస్కృతిలో కనుమరుగవుతోంది ,చాలా బాధాకరం ......

  ReplyDelete
 21. ఎంత బాగుందో, మీరు వివరించిన ఈ యక్షగానం ,గిరిజా కళ్యాణం ,ఘంటసాల గారి గళ్ళంలో అమృతధారై .............యక్షగానం అంటే ప్రీతీ కలిగించింది ,ఎంతో పవిత్రమైన కళ,నాదోపాసన ,సదాశివమైనది,సర్వేశ్వస్వరూపమే .... ...........యక్షగానం ఇప్పుడు మన సంస్కృతిలో కనుమరుగవుతోంది ,చాలా బాధాకరం ......

  ReplyDelete
  Replies
  1. @machilipatnam గారు, అవునండీ కనుగమరుగవుతున్న మన జానపదకళలను, సంప్రదాయాలను మనం మరిచిపోకుండా మన తరువాతి తరాలకు పరిచయం చేయడం, వివరించడం మన విధి. అలా చేయడం మనకి కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

   Delete
 22. సుధారాణి గారూ!
  "రహస్యం" లోని ప్రతి పాటా రస గుళికయే!
  "గిరిజా కళ్యాణం" కూచిపూడి వారిదేనని,
  శ్రీ సిద్ధేద్ర యోగి గారిదేనని -
  ఇప్పటి దాకా అనుకుంటున్నాను.
  అత్యధిక విశేషాల ఇక్షు ఖండం ఈ వ్యాసం;
  ;
  : (కోణమానిని)

  ReplyDelete
 23. Turlapati Sambasivarao

  I have gone through your article girija kalyanam.Rahasyam is an excellent artistic piece and girja kalyanam is an jewel in that artistic monument.The concluding paras about telugu language havebeen firmly established by tour excellent analysis of the episode.I am sure the saints and gods around kuchipudi will bless you with more artistic excellence,writtings,name and fame.Incidentally it is a rich and sincere tribute to the greatest singer of telugus. Wish you success and more achievements

  ReplyDelete
 24. I have gone through your article girija kalyanam.Rahasyam is an excellent artistic piece and girja kalyanam is an jewel in that artistic monument.The concluding paras about telugu language havebeen firmly established by tour excellent analysis of the episode.I am sure the saints and gods around kuchipudi will bless you with more artistic excellence,writtings,name and fame.Incidentally it is a rich and sincere tribute to the greatest singer of telugus. Wish you success and more achievements

  ReplyDelete
 25. సాంబశివరావుగారు,

  మీరు ఇచ్చిన ఆశీస్సులకి నా మనసెంతో సంబరపడిపోయింది. చాలామంది ఈ పోస్టుకి సంతోషంగా అభినందనలు తెలియజేసారు. మీలాంటి పెద్దల ఆభినందనలు నాకు మరింత మంచి చేస్తాయని నా నమ్మకం. చదవడమే కాకుండా ఇంత చక్కని వ్యాఖ్యతో ప్రోత్సహించినందుకు మరీ సంతోషం.

  ReplyDelete
 26. విద్య,జ్ఞానం లలో పెద్దలు వయసులో పెద్దలకన్నా గొప్పవారు.మీ బ్లాగ్ లోని రచనలు మీరు మా అందరికన్నా జ్ఞాన వ్రుద్దులని చెపుతున్నాయి.మీ జ్ఞానము,వినయము మిమ్ములను ఇంకా ఎంతో ఉన్నతశిఖరాలు అధిరోహింప చేయాలని.మీ సాహితీ అర్చనకు మెచ్చి సరస్వతీ మాత మిమ్మల్ని ఇంకా ఎంతో అనుగ్రహించాలని కోరుకుంటూ శుభా కాంక్షలతో

  ReplyDelete
 27. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 28. మనసు ఊయలూగింది. ఈ అనుభూతికి అర్థం ఇప్పుడే తెలిసింది...మీవల్ల!

  ఏదో పాట కోసం గాలిస్తుంటే అనుకోకుండా ఈ లింక్ దొరికింది. రహస్యంలోని ఈ పాట నాకు చాలా ఇష్టం.
  ఈ పాటను రుంజ వాయిద్యకారులూ వాయిస్తూ పాడుతుంటే విన్న అదృష్టం ఓసారి కలిగింది. అప్పట్నుంచి ఇష్టం రెండింతలు మూడింతలై మర్రిలా ఊడలు వేసింది. Tq, Sudha garu

  ReplyDelete