04 February 2012

కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే !!

.హలో హలో బ్లాగు మిత్రులారా, ఇంకా చాలా  బోల్డు మంది మాజీబజ్జు మిత్రులారా, ప్లస్సు ప్లస్స్ మిత్రులారా!!


ఉపన్యాసమో, సాహిత్యంమీద చిరు వ్యాసమో అనుకొని పారిపోతున్నారా..హబ్బే లేదు. ఆట్టే బోరు కొట్టే విషయం కాదులెండి. లైట్ గానే ఉంటుంది. కాస్త హెల్దీ కూడాను. ఓ మాటిటు రండి చెప్తాను.

మరే - నిన్న నాకు ఓ ఆదివారం అదే  అల్లప్పుడు న్యూఇయర్ రోజున, ఆ జనవరి ఆదివారం ఆంధ్రజ్యోతి కాపీ ఓ మిత్రుడింట కంటపడింది. మన వాళ్ళందరి బ్లాగు పోస్టులూ ఎత్తిపోతల పథకంలో యాతమేసి తోడేసుకొని కనీసం  ముందస్తుగా ముందుమాటయినా అడక్కుండా,  ఆముక్క ముందుమాటలోనయినా రాయకుండా వాడు చేసిన పని మళ్ళీ మళ్ళీ అలా కళ్ళముందు కనిపిస్తూ ఉంటే ఒళ్ళు ఎలా మండిందనుకున్నారూ. పైగా  “నవ్వొస్తే ఆ బ్లాగ్ స్పాట్లు తెరిచి వాళ్ళకు షుక్రియా చెప్పండి. లేదండే గప్ చుప్ సాంబారు బుడ్డీ అని ఓ కొసరుమాటొకటీ. అగ్నిమీద ఆజ్యం పోసి మండించడమా మరీనా.

సరే దీనికంతటికి ఈ రైటుక్లిక్కూ,   ఆ కంట్రోలు సి, కంట్రోలు వి లే  కదా కీలకాలు అనుకున్నాను. అందుకే నా కంప్యూటర్ తెలివి లోంచి  కొంచెం తీసి (అమ్మమ్మ ఇచ్చిన ఆవకాయ,  జాడీలో ఎంతున్నా హార్లిక్సు సీసాడే తీసి వాడుకోడం అలవాటు కదా మనకి)  తెలిసినంతలో వెతికితే ఓ మార్గం దొరికింది. ఈ రెండు మార్గాలను నివారించి కనీసం మనలాగే  పేద్దగా కంప్యూటర్ నాలెడ్జీ లేని  విలేర్ల కయినా, లేదా ప్రొఫైల్లో కవితలు,  కథలూ రాయడం హాబీ అని ముందస్తుగా రాసేసుకుని తీరా ఏం రాయాలో తెలీక "వండుకున్నమ్మకి ఒకటే కూర, దండుకున్నమ్మకి అరవై నాలుగు వెరైటీలనే" సామెతని బాగా సాధన చేసేసి వచ్చి ఇరుగింట్లోంచి పొరుగింట్లోంచి కావలసినవన్నీ ఎత్తుకొచ్చేసి , "ఇదిగో ఇది నాదే" అని గాఠిగా అరిచ్చెప్పే అరువు బ్లాగర్లనుంచి   బ్లాగు పోస్టులని కొంచెం దాచుకుని  అందీ అందకుండా ఊరించి కుంచెం  కుంచెం ఏడిపిద్దాం అనుకున్నవాళ్ళ కోసం అన్నమాట ఇది. 

కోతికి కొబ్బరికాయ దొరికితే ఆకలేసినప్పుడు పనికొస్తుంది లెద్దూ అనూరుకుంటుందా . ఉండదు కదా. అందుకే మన బ్లాగర్లలో తోచిన వాళ్ళ బ్లాగులు తీసి కాపీ, పేస్టు చెయ్యడం మొదలు పెట్టాను.
చిత్రం...  చూద్దునుకదా..
కొత్తావకాయ, తోటరాముడు, నవ్వితేనవ్వండి, మధురవాణి, కృష్ణప్రియ డైరీ, నా స్పందన, జాజిపూలు,  వైయేరమణ, రానారె , గోలిసోడా,

కొత్త  సంవత్సరం పొద్దున్నే మనవాళ్ళందరికీ మూడు, మూడుముక్కలు చేసి పడేసి,  ఆంధ్రజ్యోతివాళ్ళు ఎత్తి పెట్టేసి అచ్చేసిన టపాలున్న  బ్లాగులివన్నీ....  అన్ని   బ్లాగిళ్ళకీ వెళ్ళొచ్చా.... అక్కడ ఎత్తి పోతల పధకం సవ్యంగా పారేందుకు సకల సదుపాయాలు అలరారుతూ కనిపించాయి. వేటికీ కనీస రక్షణలేదన్న సంగతి గమనించి "హడ్డెడ్డే....ఇక్కడుందన్నమాట విషయం" అనుకున్నాను.  మామూలు కంప్యూటర్ జ్ఞానం ఎబిసిడితో ఆగిపోయినవాళ్ళకి కూడా తెలిసిపోయే చిట్కాలతో ఇంతింత వజ్రపుతునకలు  అమాంతంగా, అయాచితంగా  అందుతుంటే వద్దనుకునే తలకు మాసినవాడెవడుంటాడు మరీ. ఆంధ్రజ్యోతి ఒక్క విషయంలో అయితే ఒకేసారి పేర్లతో సహా వెయ్యడం వల్ల పోల్చుకున్నాం కానీ ఇంకా ఎన్ని బ్లాగుల్లో ఎన్నిటపాలు పట పటమంటూ పత్రికల్లో ఈపాటికే రాలిపోయాయో.
రాలిపోయే పువ్వా.. నీకు రాగాలెందుకే అంటూ వాటిమీద ఆశలూ, నీళ్ళూ, నువ్వులూ వదిలేసుకోకుండా ఏదేనా చెయ్యొచ్చుకదా ..కనీసం టెంపరవరీగానయినా.

అందుకే బ్లాగు మిత్రులారా, మాజీ బజ్జు మిత్రులారా, ప్లస్స్ ప్లస్సు మిత్రులారా !!
ఒక్కమాటు ఇటురండి. ఒక్కమాట వినిపొండి.
మన  జాతీయబ్లాగు సంపదని విజాతీయులు జాతీయం చేస్తుంటే ఊరికే గుడ్లప్పగించి చూడాలా...ఇంకానా ఇకపై చెల్లదు...... అంటూ నినదించద్దూ..సరదాకైనా.
అబ్బబ్బబ్బ... అరిచీ, పిలిచీ అలిసిపోయాను కానీ. ఇలా చూడండి. ఇక్కడ వరసాగ్గా నేను చెప్పినట్టు స్టెప్పులేసి చెప్పిన మాట వినండి మరి.

ఇది మీ బ్లాగులోని కంటెంట్ ని సెలెక్టు చేసి కాపీ చేసి ఎక్కడంటే అక్కడ పేస్టు చేయడానికి వీల్లేకుండా చేసే కోడ్.

మీబ్లాగింటి బెల్ కొట్టి లోపలికి ( సైనిన్ చేసి)  అలా ఎంటరయిపోవడం.
కుడిపక్క కనిపించే మీటల్లోంచి-
డిసైన్  అన్నది ఎంచుకొని, అందులోనుంచి  ఇప్పుడు పేజి లే అవుట్ అనే దాన్ని ఎంచుకోవడం.
పేజి లే అవుట్ లో న్యూ గాడ్జెట్ ని  ఎంచుకోవడం.
మీ బ్లాగులో చేర్చదగినవంటూ వచ్చిన  (వీటిని విడ్జెట్టులంటారు లెండి) లిస్టు లోంచి హెచ్ టి ఎం. ఎల్ కోడ్ మీద నొక్కడం.
అప్పుడు వచ్చిన బాక్స్ లో (పైన పేరు పెట్టడానికి ఉన్నట్టు హెడ్డింగ్ కి జాగా ఉంటుంది వదిలేయండి) కింద భాగంలో ఇక్కడ నేనిచ్చిన కోడ్ ని కాపీ చేసి (రైటుక్లిక్కుతో మౌస్ని నొక్కి కాపీ అన్నదాన్ని ఎంచుకుని లేదా       కంట్రోలు ప్లస్ సి తో కాపీ చేసిగాని),  మళ్లీ  ఆ  మీ బ్లాగులో పేస్టు( రై ట్ క్లిక్కు నొక్కి పేస్టుఅన్నదాన్ని ఎంచుకుని లేదా కంట్రోల్ ప్లస్ వి నొక్కి) చేయడం 
చేసిన తర్వాత సేవ్ అనడం అంతే.

సేవ్ అయిన తర్వాత ఒక్కసారి మీ బ్లాగులోని విషయాన్ని కాపీ చేద్దామని చూడండి...హుర్రే..

ఓసారి కమిటయితే మీ బ్లాగే మీ మాట వినదు మరి.
ఇదీ అలా అతికించాల్సిన కోడ్.
( ఈకోడ్ ని కాపీ పేస్టు చేస్తే తప్పులేదా అని అడక్కండేం...అఘముఁ బొందడధిప.. అంతే )  





























ఇదిగో ఇక్కడ ఈ పేజీలో  http://www.itechcolumn.com/2011/11/how-to-disable-copy-text-on-blogger.html  ఇంగ్లీషులో ఎలా చెయ్యాలో వివరంగా ఉంది. ఈ కోడ్ ని నా బ్లాగులో కాపీ పేస్టు అవకుండా ఎవరో కానీ కుట్రపన్నేరు.  ఇలాక్కాదని చెప్పి ఇమేజ్ ఫైల్ పెట్టాను. కానీ మరి మనకి పని కాదు కదా..అందుకనీ ఈ వెబ్ సైట్ లో చెప్పినట్టు చేసేసి ఆ కోడ్ ని గాఠిగా అతికించేయండి.


మీరు  ఇలా ఈ కోడ్ ని చెప్పినట్టు చెప్పిన చోట అతికించారనుకోండి...కొంచెం సేపు కాలరెగరేయొచ్చు.
నా అంతవాడు నేనే అనుకుంటూ బుడుగ్గాడి బ్రదర్లా పోజివ్వచ్చు. దీనికి తగ్గ  చిట్కాలు అవీ వాళ్ళు (అదే ఆ  విజ్ఞత గల దొంగలు)  ఆనక కనిపెట్టుకుంటారనుకోండి. కానీ అందాకా  మనకదో తుత్తి కదా.

సరే........ఇది చేసాం. దొంగతనానికొచ్చినవాడు మన సొమ్ముని ఎత్తుకుపోలేడు...అనుకుందాం. కానీ కంప్యూటర్ జ్ఞానంలో ఏబీసీడీలు తో పాటు జీహెచ్ఐజే లు కూడా  నేర్చేసుకుని ముందుకెళ్ళిన బ్లాగర్లు కొంచెం సందేహపడొచ్చు. మరి ఆ దొంగసారు వాడు మన పోస్టుని స్క్రీన్ షాట్ తీసేసుకుని, ఎత్తి రాసేసుకుని మరీ ఎత్తుకుపోతేనో అని...

హహ..కానీ  ఈ దొంగదారికి మాత్రం మంచి అడ్డ దారి నాకు తెలీదు. ఫర్లేదు...స్క్రీన్ షాట్లనే ఫెసిలిటీలు ఉన్నా వాటిలో  వాడికంత తెలివో, కనీసం  ఓపికో ఉంటే  ఎత్తి రాసుకునే బదులు సొంతంగా రాసుకుంటాడు లెండి.

లేదంటారా......
ఆమాత్రం కష్టపడి కాపీ కొట్టినందుకు చప్పట్లు కొట్టి అభినందిద్దాం..(ఇంకేం చేయలేం గనుక...) రావిశాస్త్రిగారి కష్టార్జితం కథలో  దొంగ  ఇంట్లో దూరి తన కష్టార్జితం  సొమ్ముమొత్తం దోచుకెళ్ళాడని బాధపడుతున్న ఇంటి యజమానిని ఓదార్చడానికి పక్కింటివాడు వచ్చి 'రాత్రంతా కిటికీ ఇనపఊచలు కోసి  ఆ దొంగ ఎంత కష్టపడ్డాడో..వాడికి కష్టార్జితం గొప్పగా దొరికిందని ఎందుకు అభినందించకూడదూ'  అని అనుకుంటాడు. అలాగే మనం కూడ ఓ నిట్టూర్పు విడిచి సంతోషించొచ్చును లెండి.

ఇదిగో సాఫ్ట్ వేరు కుర్రాళ్ళూ...ఇది నేనిక్కడ చెప్పానని, "ఓ గొప్ప, మాకు తెలీదా" అని అనుకుని ఊహూ తెగ ఫీలయిపోయి మరీ కోపం తెచ్చుకోకండేం. ఇది చాలా చిన్న విషయమని దీనికి కూడా మరో విరుగుడు( అదే మళ్ళీ కాపీ చేసేమార్గం) కూడా ఉందని అనొచ్చు మీరు. కానీ ప్రస్తుతానికి మాకీ మందు చాలు. మీకు తెలిసినవి మరోసారి,  మాకోసారి చెప్పండి మరి.
( ఏంటీ..ఇన్నీ చెప్పి- శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందిట లాగా నేను ఎందుకు ఈ కోడ్ పెట్టుకోలేదూ అనుకుంటున్నారు కాబోలమ్మా... కొందరు పరిశోధకులు. మరేంలేదు. మహాత్ములేం చేసినా  లోక కల్యాణం కోసమే...మరి నేనురాసిన కోడ్ కాపీ పేస్టు కాకపోతే నా పోస్టు గతేం కానూ...? )

ఇంకా కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే... అంటూ ఇలా కాస్త తెలిసినవాళ్ళంతా,  కాస్తే తెలుసున్న వాళ్ళకి కాస్త కాస్తన్నా జ్ఞానామృతం పంచిపెడితేనే గానీ,  లేకపోతే ఆ అమృతం కాస్తా విషమయిపోదూ. 



29 comments:

  1. కాపీరైట్లు ఎవరివైనా కాపీకొట్టే రైట్లు మాత్రం మన భారతీయులవి (చైనీయులవి కూడా అని పక్కనో దోస్తు పోరుతున్నాడనుకోండి).

    ReplyDelete
  2. ముందుగా మీ రచనా శైలి బాగుంది సుధ గారూ ! అభినందనలు. మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. కానీ ఇమేజ్ ఇచ్చారు కాపీ, పేస్టు ఎలాగండి ?

    ReplyDelete
    Replies
    1. అదేనండీ రావుగారూ, నేనూ ఎక్కడినుంచో ఆ కోడ్ ని ఎత్తిరాసుకొచ్చానా, తీరామోసి నా పోస్టులో కాపీ పేస్టు చేసి చూద్దును కదా, అక్కడ పోస్టులో కనిపిస్తుంది కానీ పబ్లిషు చేసాక ఇక్కడ కనిపించదే..సరే నా పీత మెదడుకి తెలిసిన చిట్కాలన్నీ ప్రయోగించాను కానీ ఫలితం నిల్లు. చచ్చినట్టు ఎక్కడ ఎత్తుకొచ్చానో వాళ్ళ ఇంటిపేరుతో సహా చెప్పాల్సొచ్చింది. ఏం చేస్తాం చెప్పండి కాలం ఎప్పుడూ మనది కాదు కదా. అందుకే లింక్ ఇచ్చాను మరి. అక్కడ కాపీ చేసుకోండి.
      కామెంటిక్కడ పోస్టు చేసుకోండి...అన్నట్టు శైలిగురించి మెచ్చుకున్నారే..దానికి థాంక్స్..అది నాదేనండోయ్.

      Delete
  3. మంచోరే! బాగాచెప్పేరు!!

    ReplyDelete
    Replies
    1. మరే....ఎంత కష్టానికి అంత(తే) ఫలం...కష్టేఫలే.

      Delete
  4. మీ ఈ టపా కంట్రోలు సి, కొట్టి కాపీ పేస్టూ చేసేసా నండోయ్!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబీ, మరి అలా చెయ్యమనే కదూ....థాంక్స్.

      Delete
  5. ఎత్తుకెళ్లేవాళ్లకి కంటెంట్ కావాలి కాని కాపీ , పేస్ట్ కాదు. రైట్ క్లిక్ డిసేబుల్ చేసినా టైప్ చేసుకుంటారు. యూనికోడ్ వాళ్లకు పనికిరాదు కదా. కనపడినప్పుడల్లా గోల చేయడం. సదరు వ్యక్తులకు ఉత్తరాలు రాయడం చేయాలి.. వేరే దారి లేదు..

    ReplyDelete
    Replies
    1. మీరన్నదిబావుంది. అయితే మొత్తం తిరగరాసుకోవాలన్నమాట ప్రచురించుకోవాలంటే. కానీ మీరు చెప్పిన చిట్కాలు కూడా ఈ పెద్దరోగానికి సరిపోవులెండి. మరో మార్గం చూడాలి.

      Delete
  6. యావండోయ్, పోస్టుని యధాతథంగా కాపీ చేయడం పాత ఫాషను. ఇప్పుడు సెంట్రల్ అయిడియాను కాపీ కొట్టి, ఆ అయిడియాను బట్టి స్టోరీ అల్లేసుకోవడం మీడియా కొత్త ట్రెండు.(నావి రెండు, నాకు తెల్సిన బ్లాగుల్లోవి కనీసం ఆరేడు పోస్టులు ఇలాంటి కథలకు బలైపోయాయ్) అది మనదే అని తెలుసు. కానీ ఏమీ అనలేం! నాదనడానికి వీల్లేదు. దీనికేం చేయగలం? ఏమీ చేయలేం! చూస్తూ "హవ్వ" అని బుగ్గలు నొక్కుకోడమే!

    ఇంగ్లీష్ కథలో,వాటి అనువాదాలో చదివి స్పూర్తి పొంది కథలు రాసేసినట్టు అన్నమాట! నా పోస్టు కాపీ కొట్టద్దు అనగలం కానీ నా అయిడియా నీకు రాకూడదొరేయ్..అని ఎలా అనగలం? అక్కడ కొట్టాడు దెబ్బ!

    ReplyDelete
  7. హవ్వ అని బుగ్గలు నొక్కేసుకోవడంతో పాటు ఓ పాట అదే పైపాట కూడా పాడుకోవచ్చయితే. కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే అంటూ.
    ఎంత న్యాయం...ఎంతన్యాయం,ఎలాగబ్బా.మీరు జ్యోతిగారిలాంటి అనుభవజ్ఞులు చెప్తుంటే..తెలుసుకోవడమే ఈ కొత్త ట్రెండులు.

    ReplyDelete
  8. జ్యోతి గారు,

    కాపీ క్యాటులు 'సోంబేరులు' వారికి ఇక కాపీ పేస్టూ చేయ్యాలంటేనే ఒళ్ళు బద్ధకం! దాన్ని మించి టైపు గట్రా చేస్తారంటారా ? మీరు మరీ ను !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. సుజాత గారు,

    మీరు మరో లేటేష్టు జిలేబీ కాపీ స్టైలు వదిలి పెట్టేసారు.

    బ్లాగుల్లోని ఒక్క టపా వదలకుండా చదివేసి , ఓ ఫన్ ఆర్ట్ లాంటివి కాపీ రాయడం!!! హమ్మో హమ్మో ఎంత చోద్యం, ఎంత చౌర్యం !!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. మీరు ఇలా ఈ కోడ్ ని చెప్పినట్టు చెప్పిన చోట అతికించారనుకోండి...కొంచెం సేపు కాలరెగరేయొచ్చు.
    నా అంతవాడు నేనే అనుకుంటూ బుడుగ్గాడి బ్రదర్లా పోజివ్వచ్చు. దీనికి తగ్గ చిట్కాలు అవీ వాళ్ళు (అదే ఆ విజ్ఞత గల దొంగలు) ఆనక కనిపెట్టుకుంటారనుకోండి. కానీ అందాకా మనకదో తుత్తి కదా.

    ReplyDelete
  11. బాగుందండి.
    ఇంతకు ముందు మన బ్లాగర్స్ లో ఒకతను (మహేష్ గ్రాఫిక్స్ అనుకుంటా) రైట్ క్లిక్ డిసేబుల్ చేయటానికి ఒక కోడ్ తమ టపాలో ఇచ్చారండి. అది పెట్టాక పరీక్ష రైట్ క్లిక్ డిసేబుల్ అయింది కానీ సిస్టమ్ లో ఎడిట్ లోంచి కాపీ చక్కగా అయినట్టు గమనించాను.
    దీనిని చూడాలి మరి. ధన్యవాదాలు.

    ReplyDelete
  12. చాలా బాగా చెప్పారండీ! కాని మనం ఎంత దాచుకున్నా, దొంగతనం చేయడానికి వచ్చినవాడు ఎలా అయినా చేయక మానతాడంటారా? మంచి టపా దానికి తగ్గట్టు మంచి స్పందన. ఇక్కడ వ్యాఖ్యలలో చర్చ కూడా బాగుంది! సుజాత గారు కూడా బాగా చెప్పారు! ఫలానాది తీసుకున్నప్పుడు ఇక్కడనుండి తీసుకున్నాను అని చెప్పేస్తే వాళ్లకి, మనకి కూడా పేరు కదా! ఇంకా ఐడియా కాపీ ఏమి చేయలేము ఆవిదన్నట్టూ, మీరన్నట్టూ పాటలు పాడుకోవటం తప్ప!

    ReplyDelete
  13. టైటిల్ చూసి.. ఆ పాట రివ్యూ రాశారని పరిగెత్తుకొచ్చానండీ..
    మొన్న రాత్రే మళ్ళీ చూశాను(ఎన్నోసారో గురుతు లేదు) మిస్సమ్మ. మీ పోస్ట్ చూడగానే భలే భలే అనుకుంటా వచ్చా... తీరా చూస్తే మేటరు సెపరేటు...

    కానీ ఎత్తిపోతల పధకం గురించీ భలే చెప్పారండీ.. కూసింత టైం చూసుకొనీ మీరు చెప్పినట్టే నా బ్లాగ్ కి తాళాలేస్తాను. థాంక్యూ సో మచ్ ;)

    ReplyDelete
  14. జిలేబిగారు నేను చెప్పింది బ్లాగుల్లో కాదు. పత్రికలవాళ్లకి.ఫోటోలు మాత్రమే కాపీ పేస్టు చేసుకోవచ్చు. కంటెంట్ మాత్రం టైపు చేసుకోవాలి కదా. ఆలోచించే శక్తి కాని, టాలెంట్ గాని ఉండదు. ఇలా బ్లాగుల మీద పడ్డారు. పత్రికలే కాదు. టీవీ చానెళ్లు కూడా బ్లాగ్ కంటెంట్ దర్జాగా కాపీ చేస్తున్నాయి.. ఐనా పిల్లి నన్నెవరూ చూట్టం లేదు అని పాలు తాగిందంటా. ఈ బ్లాగుల లింకులు, టపాలు ఎవరు ఎత్తుకెల్లారో మాకంతా తెలుసు.. నవ్వుకుని వదిలేసాం కాని ఎప్పటికి ఇలా ఉండదు..

    అవునూ మీరే మీ మనవడికి ఆంధ్రజ్యోతికోసం బ్లాగు టపాలు ఇచ్చాను. నా బ్లాగు టపా మాత్రం వేయలేదని కూకలేసినట్టున్నారు. తర్వాత అంతా తూఛ్ అన్నారు కదా.. ఇందులో ఏది నమ్మాలంటారు??? మొదటిదా? రెండోదా?? రెండోది నిజమైతే మొదటిది ఎందుకలా రాసారు?? బ్లాగర్లని ఫూల్స్ చేయడానికా??? మీ బ్లాగుకు హిట్స్ పెంచుకోవడానికా??( ఏదో ఒక issue పట్టుకుని టీవీ చానెళ్ల వాళ్లు జాతర చేసుకున్నట్టు))

    ReplyDelete
  15. భలే వారండీ జ్యోతి గారు,

    ఆ పాటి రాధే నాకు తెలిసుంటే నేనూ వీలు చేరు లో కూర్చుని ఓ వంద ఇంటర్వ్యూ లు జరిపి ఉండను ?

    అదో ఉత్తుత్తి తూచ్ టపా. గురువు గారు బులుసు వారి టపా చదివి ఆ టపా రాసాను ( మేటరు లేకుండా టపా ఎలా రాయాలన్న కోవలోని టపా అది !)

    ఆ 'సత్య' ప్రమాణకం గా నేనివ్వలేదు. నా కంత సత్తా లేదు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  16. సుధా గారూ ఎప్పట్నుంచో చెయ్యాలనుకుంటూ బద్దకిస్తున్నాను. ఇప్పుడే ఆ పని చేసి వస్తున్నాను. ఇతర దేశాలలో ఉండి పత్రికలు చదవలేని మా లాంటివాళ్ళకు, ఎవరైనా పత్రికలో వేసికున్నా ఆ విషయం కూడా తెలీదు కదా..మిత్రులెవరైనా చెపితే తప్ప. ఇక ఐడియాలే కాపీ కొడితే చేసేదేం ఉంది, మన పంచుకోవాలనుకున్న భావాలు ఎవరి కలం ద్వారానైతేనేమి నలుగురికీ తెలిశాయని ఆనందిద్దాం లెండి.
    మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయిగారండీ......మీ ఇంటికి తాళం వేసానని చెప్పారూ.....కానీ తాళం సరిగ్గా పడినట్టు లేదు చూసుకోండీ.

      Delete
  17. నేను కూడా ఒక తాళం వేశాను సుధా గారూ. మీకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

    కానీ కామెంటు బాక్స్ కెళ్ళి అక్కడ show post నొక్కి హాయిగా కాపీ చేసుకోవచ్చు. వా వా అనుకోవడం తప్ప మరేం చేయలేమా?

    ReplyDelete
  18. బులుసు వారు,

    మీరే దొంగలకి నేర్పించేసేటట్టు వున్నారు !!

    హమ్మ తాళం వేసి తాళాన్ని ఎలా బ్రేక్ చెయ్యొచ్చో కూడా చెప్పేసారు!! ధన్య వాదాలూ ఈ తెకినీకు తెలిపినందులకు ( అప్పుడప్పుడు కాపీ కొట్టు కోవాలి కదా మరి గురువు గారి టపా నించి !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  19. జిలేబి, బులుసు గారు, ఏదో సరదాకి ఓ ప్రయత్నం చేయడమే కానీ మన టెకినీకులు ఎంతపాటి..ఈ సాఫ్ట్ వేర్ ఘనాపాటీలకి.

    ReplyDelete
  20. టపా మాత్రం చాలా చతురంగా రాశారు. అభినందనలు.

    నాది 'తాళము వేసితిని. గొళ్ళెము మరచితిని.' వారి వంశం.

    మీరు చెప్పింది అర్ధమయ్యింది.

    కానీ.. కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక పోతుందేమోననే భయంగా ఉంది.

    అనగా.. 'ఈ జాగ్రత్తల్లో అసలు బ్లాగే లేచిపోయే ప్రమాదం ఉంది.' అని.

    ReplyDelete
    Replies
    1. హహ..వై.ఎ.రమణగారూ, నాలుక ఊడిపోయే ప్రమాదమేమీ రాదు లెండి. అయినా మనం ఏ జాగ్రత్తలు తీసుకొని గొళ్ళెం మరిచిపోకుండా తాళం వేసినా ఈ మాయదొంగలతో బ్లాగులు లేచిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంది...ఏదో చాదస్తం కొద్దీ ముందుజాగర్త అనే ప్రయత్నం చేయడమేగానీ.

      Delete
  21. నా లాంటి వాళ్ల మీ లాంటి వాళ్ళ వుపాయాల మీదే కన్ను. ఇదిగో మందు.

    ఏమి చేస్తాం అదో తుత్తి. నోచుకోకుండా మేచ్చుకోండి.హహహహహః ... (విలన్ నవ్వు)

    -RaM

    రామ్ గారూ, మీరు విలన్ నవ్వులు నవ్వి ఇచ్చిన లింక్ మాత్రం ఇక్కడ ప్రచురించను. కంటెంట్ కాపాడుకోవడం ఎలాగ మొర్రో అని మేం గోలపెట్టుకుంటూ ఉంటే మీరు దొంగతాళాల్ చేస్తాం...దొంగతాళాల్ చేసిస్తాం అంటే ఎలా ఊరుకుంటాం చెప్పండి.

    ReplyDelete
  22. వావ్... థాంక్స్ అండీ... నేనూ చేసేశానుగా....

    ReplyDelete
  23. ఇళ్ళ చీపురు కట్టలాగా, బ్లాగిళ్ళ చీపురు కట్టలు కొన్ని ఉంటాయండి. అందులో నేనొకణ్ణి. ఇలా ఎంతోమంది బ్లాగులు తీరిన యోధుల్ని/రాళ్ళని చూసిన నేను మిమ్మల్నెలా మిస్టరయ్యానో (..మగవాణ్ణవ్వటం వల్ల.. "మిస్సయ్యాను" అని చెప్పుకోటానికి సిగ్గేసింది.. అందుకే ఇలా చెప్పానులెండి) అర్ధం కావట్లేదు. అనుకోకుండా ఇప్పుడు తారసపడిన మీ బ్లాగ్ ని చదివాను.. చక్కగా రాస్తున్నారు. రాసిన విషయం కంటే కూడా నాకు మీ భాష మా చెడ్డ నచ్చేసిందిలే.
    సరే.. ఇంకేం... మీరు బ్లాగ్సుధలు కురిపించండి... మేము మహా హడావిడిగా జుర్రుకుంటాం ఒక్క చుక్క కూడా పోనివ్వకుండా..!!

    ReplyDelete