కనబడుటలేదు...........
మాకెంతో ఆత్మీయుడు, ఒకప్పటి మా చిన్నారి నేస్తం .......
కనబడుటలేదు.
వీడికి తెలుగులో ఓపేరు, ఇంగ్లీషులో ఓపేరు ఉన్నా......
మేం పిలుచుకునే ముద్దుపేరు మాత్రం - గిజిగాడు
వయసు సరిగ్గా తెలియదు
రంగు గోధుమరంగు,నలుపు,తెలుపుల కలగలుపు.
మా గిజిగాడు అతని స్నేహితులతో కలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం
ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ, గోధుమరంగు పైన అక్కడక్కడా
చారలుచారలు ఉండే బట్టలు ధరిస్తాడు.
ఇట్లు
గిజిగాడి ప్రేమికులు.ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ, గోధుమరంగు పైన అక్కడక్కడా
చారలుచారలు ఉండే బట్టలు ధరిస్తాడు.
గుర్తింపు చిహ్నం మెడకింద భాగంలో ఉండే పెద్ద మచ్చ.
నగర జీవితంలో ఇమడలేక వెళ్ళి పోయాడు కనుక చిన్న చిన్న
పల్లెటూళ్లలో కనిపించే అవకాశం ఉంది.
చూసిన వాళ్లు దయచేసి ఈ చిరునామాలో సంప్రదించగలరునగర జీవితంలో ఇమడలేక వెళ్ళి పోయాడు కనుక చిన్న చిన్న
పల్లెటూళ్లలో కనిపించే అవకాశం ఉంది.
ఇట్లు
ప్రియమైన గిజీ......
నువ్వూ నీ స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయావు అని తెలుసు కానీ అలా కనిపించకుండా పోవడానికి కారణం ఈ మధ్యే మాకు తెలిసింది.
నువ్వు వెళ్ళాక కానీ మా జీవితాలలో నీ వెలితి ఎంత బాధిస్తుందో తెలియలేదు.
నీ జ్ఞాపకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు కానీ నీ ఉనికి మాకెంత సంతోషా న్నిచ్చిందో తెలియలేదు.
నీకోసం అమ్మ,నాన్న,అక్క,అన్నయ్య,చెల్లి , తమ్ముడు అందరూ నాతో పాటు ఎదురుచూస్తున్నారు.
నువ్వు మాకు చెప్పకుండా మాయమయిన దగ్గరనుంచి నీకోసం వెతక లేదని నీకు కోపం వచ్చిందా?!
తలచుకుంటే నా కు కన్నీళ్ళాగడం లేదు. నువ్వింక కనిపించవేమోనన్న ఆలోచనతో నాకు నిద్రపట్టడంలేదు.
ఏదో బెంగ మనసుని తొలిచేస్తోంది.
నీవు తిరిగి మాదగ్గరకు వచ్చేయవూ. మన ఇంట్లో పుట్టిన చిన్న పాపని నువ్వు చూడనే లేదు. దానికి నీ ఫొటో చూపిస్తే దాని జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త బంధువుని చూసినట్టు ఎంత సరదా పడింది తెలుసా?నువ్వూ నీ స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయావు అని తెలుసు కానీ అలా కనిపించకుండా పోవడానికి కారణం ఈ మధ్యే మాకు తెలిసింది.
నువ్వు వెళ్ళాక కానీ మా జీవితాలలో నీ వెలితి ఎంత బాధిస్తుందో తెలియలేదు.
నీ జ్ఞాపకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు కానీ నీ ఉనికి మాకెంత సంతోషా న్నిచ్చిందో తెలియలేదు.
నీకోసం అమ్మ,నాన్న,అక్క,అన్నయ్య,చెల్లి , తమ్ముడు అందరూ నాతో పాటు ఎదురుచూస్తున్నారు.
నువ్వు మాకు చెప్పకుండా మాయమయిన దగ్గరనుంచి నీకోసం వెతక లేదని నీకు కోపం వచ్చిందా?!
తలచుకుంటే నా కు కన్నీళ్ళాగడం లేదు. నువ్వింక కనిపించవేమోనన్న ఆలోచనతో నాకు నిద్రపట్టడంలేదు.
ఏదో బెంగ మనసుని తొలిచేస్తోంది.
ఎలా అయినా నిన్ను తీసుకురమ్మని రోజూ ఏడుస్తుంది.
ఒకప్పుడు నువ్వు మా బాల్య స్నేహితుడవని పొద్దు పొడిచిన దగ్గరనుండి,ఊరు మాటు మణిగే వరకు మాతోనే ఉండేవాడివని తెలిసి అంత ఆత్మ బంధువుని, ఎలా వదిలిపెట్టావని, నిన్ను తీసుకురమ్మని రోజూ పోట్లాడుతోంది. నువ్వు, నీ భార్య మా తోనే మా ఇంట్లోనే ఉండేవారని , మీ పిల్లలు మా కళ్ళముందే పెరిగి పెద్దయ్యారని రోజూ గుర్తుచేసుకుంటూనే ఉన్నాం. రెక్కలొచ్చిన నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో... మరి మా కంట ఎప్పుడూ పడనే లేదు.నువ్వైనా కలుసుకున్నావో లేదో.
ఆధునిక నగర జీవితంలో వచ్చిన మార్పులే మన ఇంట్లోనూ చోటుచేసుకున్నాయి. ఇల్లు మారిపోయింది - స్థలం అదే అయినా. మన పాత ఇల్లు ఎలా ఉండేదే నీకూ తెలుసుగా.
విశాలంగా ఉండే పెద్ద ఇల్లు, ఎత్తయిన కప్పుతో, ఇంట్లోకి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించేవి.
ఇంటిచుట్టూ తాతగారు పెంచిన జామచెట్టు, మామిడి,సపోటా చెట్లు ఉండేవి. శలవ రోజుల్లో వాటికి నేనోపక్క ఉయ్యాల వేసుకొని ఊగుతుంటే మరో పక్క నువ్వు, నన్ను చూస్తే భయపడి పారిపోయే నీ స్నేహితులు కొందరు ఉయ్యాలలూగేవారు.
నీకేమో పొద్దున్నేలేవడం అలవాటు. నాకేమో ఒకంతట తెలివివచ్చేది కాదు. నీ కిల కిల నవ్వుల తోనే నాకు పొద్దు పొడిచేది. అమ్మ, బామ్మ అంటే నీకు ఇష్టం. వాళ్ళకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకు ఏవి తినడానికి ఇష్టమో నాకు చెప్పింది వాళ్ళేగా. అవును గానీ నీకు పచ్చిబియ్యం, పప్పులు తినడం ఇష్టమేమిటి చెప్పు, నీ తిండి నా తిండి అలవాట్లు ఎప్పుడూ కలవవు. నీది ఒట్టి పిట్టతిండి.
నువ్వు ఓ ఇంటివాడివవడం కోసం కావలసిన ఏర్పాట్లు చెయ్యడం ఇంట్లో వాళ్ళందరికీ ఎంత సరదా.. తాతగారు ఇంటి కప్పు తిరగవేయించినప్పుడల్లా మీ ఇంటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పడం నాకెంతో గుర్తు.
నువ్వు మీ ఆవిడని తీసుకురావడం, మీకు ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడం ఆ ముచ్చట్లన్నీ అందరం తలచుకుంటూ ఉంటాం.
ముఖ్యంగా ఓ రోజున ఇల్లుదాటి కదలొద్దని, జాగ్రత్తగా ఉండమని నువ్వు, మీ ఆవిడ పిల్లలని హెచ్చరించి బయటకు వెళ్ళారు. ఆ రోజు పాపం పిల్లలు స్వేచ్ఛ దొరికింది కదా అని బయటకు వచ్చినట్టున్నారు. వెంటనే కింద పడ్డారు. అదృష్ట వశాత్తూ పెద్దగా దెబ్బలు తగలలేదనుకో. కానీ వాళ్ళని మేము చేరదీసినందుకు మీకెంత కోపం వచ్చింది? రెండు రోజులు వాళ్ళని ఇంట్లోకే రానీయలేదు! ఎలాగో నీ కోపం చల్లారి మళ్లీ రానిచ్చావు కానీ.
మరొక రోజు..... నువ్వు ఎప్పటిలాగే అటు ఇటు తిరుగుతూ హషారుగా ఉన్నావు. ఉక్కగా ఉందని ఫాన్ స్విచ్ వేసాను. నువ్వేమో ట్యూబ్లైట్ దగ్గర ఉండి ఏదో పని చేసుకుంటున్నావు. అనుకోకుండా ఫాన్ దగ్గరకొచ్చావు. వెంటనే నేను స్విచ్ ఆపాను కానీ ఫాన్ నీకు తగలనే తగిలింది. నీ చెయ్య విరిగిపోయిందనే అనుకున్నాం ఆరోజు. అందరూ నన్ను హంతకురాలిలా చూడడం, నేను సిగ్గుతో తలవాల్చుకోవడం నాకు బాగా గుర్తుంది.
రోజు రాత్రి చదువుకుంటున్నప్పడు నీకు లైట్ ఉంటే చికాకని తెలిసినా నేను ట్యూబ్లైట్ వేసుకొని చదివేదాన్ని. పాపం నువ్వెప్పుడూ వద్దనలేదు. పైగా నాకు నిద్రపట్టేయకుండా ఉండడానికి నన్ను పలకరిస్తూనే ఉండేవాళ్ళు - నువ్వు, మీ ఆవిడ. మీ ఇద్దరు మేల్కొని ఉంటే పిల్లలెక్కడ పడుకుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూ ఉండడం తోనే సరిపోయేది మీ ఇద్దరికీ.
పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పైకి రావడానికి, స్వతంత్రంగా జీవించడానికి నువ్వు మీ ఆవిడ ఎంత కష్టపడ్డారో మేము చూసేంగా.
సరే .... ఆ తర్వాత నువ్వు ఆవిడ దూరంగా ఉన్నారని, మళ్లీ కలుసుకోనే లేదని అనుకుంటున్నాం. లేక మళ్ళీ కలిసారా...మాకు తెలీదనుకో.
నాకుద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోవడం, బతుకు పోరాటంలో దూరా భారాలకు ప్రయాణాలు, అనారోగ్యాలు ఇలా ఎన్నో కారణాలతో నా చిన్ననాటి స్నేహితుడిని నేను మరిచే పోయాను సుమా.
ఒకనాడు హఠాత్తుగా నువ్వు గుర్తొచ్చావ్. ఇంటికి ఫోన్ చేసి అడిగాను,నువ్వింకా మా ఇంట్లోనే ఉన్నావనుకొని. కానీ వాళ్ళెవరూ చాలా కాలంగా నిన్ను చూడనేలేదన్నారు. నీ స్నేహితులుకూడా చాలా అరుదుగా కనిపిస్తున్నారని చెప్పారు. ఆఖరుసారిగా నిన్ను ఎప్పడు చూశానో నాతో పాటు ఎవరికీ గుర్తులేదుట.
ఇక ఇప్పుడు ఇదిగో ఇన్నాళ్ళకు
మళ్ళీ నిన్ను వెదికే ప్రయత్నాలు ప్రారంభించాను...
నువ్వు కనిపించకపోవడానికి కారణాలు ఏమయి ఉంటాయని ఆరా లు తియ్యడం ప్రారంభించాను.
కొందరి సలహా మేరకు ఇంటర్నెట్ లో వెతికాను. నీగురించి నేను వెతికినట్టే , నాలాంటి చాలామంది నీ స్నేహితుల కోసం వెతుకుతున్నారు. వాళ్ళు నాకన్నా ఎక్కువే కష్టపడ్డారు. నీ గురించి చాలా చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు తెలుసుకుని మేము పొందిన ఆశ్చర్యానికి అంతులేదు.
ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఫలంగా మాకు దొరికింది సెల్ ఫోన్. మేము ఒక్కక్షణం కూడా విడిచి ఉండలేని బంధంగా తయారై మా జీవితాలతో పెనవేసుకున్న మా సెల్ ఫోన్.... మేము దాన్ని వాడడం నీకు ప్రాణాంతకంగా ఉందిట. ఆ శబ్దాల బాధని భరించలేక దూరంగా వెళ్ళిపోయావుట.
అమ్మ,బామ్మ పచారీ సామాన్ల వాడుక మానేసి కొ త్త కొత్త సూపర్ బజార్లలో అమ్ముతున్న శ్రేష్టమైన సరుకులు కొని పప్పు బియ్యం బాగుచేసుకొనడం మానేయడం మరోకటి ట.
ముఖ్యంగా మా పాత ఇల్లు మార్చేసి పదిమంది కలిసి ఉండేలా అపార్టు మెంట్లు కట్టుకోవడం వల్ల నీకు నిలువనీడ లేకుండా పోయిందిట. మా ఇంటికీ నీ ఇంటికీ సంబంధం ఏమిటీ అంటే చాలా ఆసక్తికరమయిన విషయాలే చెప్పారు వాళ్ళు. మన పెరట్లో పూర్వం గడ్డీ,గాదం, చెట్టూ,చేమ అన్నీ ఉండేవి కదా. అపార్టుమెంటు కట్టాక చుట్టూ బండలు పరిపించి శుభ్రంగా చేయించుకున్నాం , మట్టి,మశానం అన్నీ అంటకుండా. అదీ నీకు నచ్చలేదుట.
మరీ అన్యాయంగా అనిపించిన మరో విషయం ఏమిటి తెలుసా.... మేము కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ, వాటికోసం మంచి మంచి ఎరువులువేసి గుత్తులుగా పూలు పూయించుకోవడం కూడా నీకు ఇష్టంలేదుట. మేము ఉపయోగిస్తున్న పద్ధతుల వల్ల మా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయనుకుంటున్నాం గానీ,నీ నోట్లో మన్ను కొట్టామట. నీవన్నీ సాంప్రదాయిక మైన పద్ధతులు కాబోలు. మాకేం తెలుసు చెప్పు.....
కర్ణుడి చావుకు పదివేల కారణాలన్నట్టు నువ్వు కనిపించక పోవడానికి కారణం ఏమిటా అని వెతికితే వెలుగు చూసిన కారణాలు ఇవి.
ఏది ఏమయినా కాని, నువ్వు మమ్మల్ని వదిలిపోతావనుకుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళమేమో...మాకేం తెలుసు నీకు మా పనులు అంత కష్టంగా తోస్తాయని..
నాకు గానీ,ఇంట్లో ఎవరికీ గాని తీరిక లేని పనులతో సతమతమయ్యి వెతకలేదు కానీ నాకో అనుమానం ఉంది -నీ గురించి.
కొండ కోనల మధ్య ప్రశాంతంగా ఉండే మన పల్లెటూరు లోనే నువ్వు ఉండి ఉంటావని...అక్కడైతే ఉండడానికి గూడు,తినడానికి తిండి,తాగడానికి శుభ్రంగా ఉండే నీళ్లు అన్నీ నీకు హాయిగా దొరుకుతాయి. ముఖ్యంగా కాలుష్య రాక్షసి నీ ఆరోగ్యాన్ని కొరుక్కు తినదు.... అవును... నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పల్లెలే సరిఅయిన ప్రదేశాలు. అక్కడే ఉండి ఉంటావు.....
నువ్వు ఉన్నచోటే నా కాపురం పెడతాను. ఈ శబ్ద కాలుష్యం నన్ను కాటువేయకముందే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను..... నా చిన్నారి నేస్తం.... నాకోసం అక్కడే ఉంటావు కదూ......
(మార్చి 20, వరల్డ్ స్పారో డే..... సందర్భంగా)