01 December 2010

చూడు చూడు గోడలు......

పాత గోడలు....
సున్నం రాలిపోతూ, పెచ్చులు ఊడిపోతూ, కళావిహీనంగా,
రోడ్డు పక్కన దీనంగా, గడిచిపోయిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా
 మారిపోతున్న నాగరికజీవుల కంటికి తాగిపడేసిన కాఫీ కప్పు మరకలా

అలనాటి వైభవాలను నెమరేస్తూనో....
సగం తెగిన కళేబరాలను గుర్తుచేస్తూనో,
కొత్త ఒక వింత కాగా రోత కలిగిస్తూ ,
రూపుమాసిన మొండిగోడలు.....

మృత్యుకుహరంలా  నోరు తెరుచుకు వచ్చే బుల్డోజర్ బారిన పడి
నాశనం కాక తప్పని క్షణాల కోసం,
యముడి మహిషపు లోహ ఘంటలు గుమ్మంలో ఘల్లుమనక తప్పదని
 తప్పించుకోలేనని తెలిసిన నిస్సహాయతతో
అది ఏ ఘడియో క్షణమో తెలియకున్నా దాని కోసం ఎదురుచూడనట్టుగా చూస్తూ
అసహాయంగా  చూసే ముసలి వగ్గులా....
పాతగోడలు...

మీరూ నేనూ....
వాటిని గోకితే ఏమొస్తుంది ..
బోలెడు ఇటుక పొడి, చారెడు సున్నం పొడి తప్ప....
కానీ అలెగ్జాండ్రా ఫోర్టు  గీకితే........
అద్భుతమైన కళా ఖండాలు ఆవిష్కరించబడతాయి.

మహాకవి శ్రీశ్రీ అన్నట్టు కళా విహీనం అని దేనినీ తీసి పారేయడానికి లేదు. వెతికితే ' దొరకదటోయ్ శోభా లేశం 'అన్న వాక్యాలకు ఉదాహరణలూ దొరుకుతాయి.
ఇదిగో ఈ మొండి గోడలే అందుకు సాక్ష్యం.

లండన్ దేశంలో నివసిస్తూ పోర్చుగల్ దేశానికి చెందిన ఈ వీధి కళాకారుడి పేరు - అలెగ్జాండ్రా ఫోర్ట్.
మరోపేరు విల్స్.
మాస్కో, న్యూయార్క్, లండన్, పోర్చుగల్ మొదలైన దేశాలో  పాడుబడిపోయిన గోడలన్నీ అలెగ్జాండ్రా చేతుల్లో  సుందరమైన ముఖాకృతులను దిద్దుకున్నాయి.





ఒక గొప్ప వీధి కళాకారుడిచేతిలో ఈ పాత మొండిగోడలు ఎంత గొప్ప కళాకృతులుగా మారిపోయాయో చూడండి.
పెచ్చులురాలిపోతున్న పాతగోడలను కావలసిన చోట్ల మరికాస్త పెచ్చులూడదీస్తూ కళారూపాలుగా వాటిని తీర్చి దిద్దుతున్న తీరును చూపే వీడియో కూడా .....ఇదిగో  ఇక్కడ చూడండి