29 April 2011

అలా మొదలైంది....ఇలా ముగిసింది

అలా మొదలైంది....ఇలా ముగిసింది !!
(ముఖపుస్తకంలో ఓ పేజీ.....)

"క్లియర్ అడిక్షన్స్ " అనే బోర్డు రాసి ఉన్న క్లినిక్ ముందు ఓ కారు వచ్చిఆగింది . అందులోంచి సుమారు అరవైఏళ్ళ వయసు గల ఓ స్త్రీ, మెల్లగా కారు దిగి ఆ క్లినిక్ లోకి  ప్రవేశించింది. అక్కడ పెద్ద హాలు, పక్కనే అనేక గదులు ఆనుకొని ఉన్నాయి. 
ఆ క్లినిక్ -వ్యసనాలను ఒదుల్చుకుందామనుకునే వారి పాలిటి వరప్రదాయిని. అలాంటివారికోసం ఏర్పాటుచేసిన రకరకాల విభాగాలు,  వాటిపేర్లు ఆయా గుమ్మాల బయట రాసి ఉన్నాయి. హీరోయన్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(HAD), స్మోకింగ్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(SAD), బింగో అడిక్షన్ డిపార్ట్ మెంట్(BAD) ఇలా పేర్లు చదువుతూ ఆఖరికి ఒక గుమ్మం ముందు ఆవిడ ఆగింది.
 అక్కడ ఫేస్ బుక్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(FAD)  అని రాసిఉన్న గుమ్మం లోంచి నడుస్తూ ఓ పెద్ద హాల్లోకి అడుగు పెట్టింది.  ఆ క్లినిక్ మొత్తానికి చాలా జనసందోహంతో నిండి పోయిన హాల్ అదే. ఎప్పుడూ కనీసం రెండు మూడు డజన్లమంది జనం డాక్టరు సలహా కోసం ఆ హాల్లో వేచి ఉంటారు. 

 ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న  జనంలో  రకరకాల వయసుల వాళ్ళున్నారు. ఎక్కువమంది యువతరాలనికి చెందినవాళ్ళే.  చాలామంది ముఖాల్లో ఒక ఉదాసీన భావం కనిపిస్తోంది. కొందరు తమ చేతుల్లోని ఐ పాడ్ లు, బ్లాక్ బెర్రీ ఫోన్ల వంక తదేకంగా చూస్తూ  ఉన్నారు. కొంతసేపు గమనిస్తే ఆ చూపులు అభావం అనే భావం  కాక వెర్రిగా ఉన్నాయి అనిపించే   అవకాశం ఉంది. 

ఆ హాల్లో ఒక వ్యక్తి అదే పనిగా పచార్లు చేస్తూ ఏదో గొణుక్కుంటూ  కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. నోట్లో ఏదో చిన్నగా సణుగుతూ ఉండడం కూడా వినిపిస్తుంది కొద్దిగా పరిశీలించి చూసే వాళ్ళకి. ఆ సణుగుడు లో వినిపించే గుడు గుడు శబ్దాన్ని మన మాటలతో తర్జూమా చేసుకుంటే ఇలా వినిపిస్తుంది.
' నా ఆవు...నా ఆవు ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి పాలు పితకాలి...వెళ్ళాలి. వెళ్ళాలి'  అని అంటున్నాడని కూడా తెలుస్తుంది.
అక్కడ ఒక యువకుడు రెండు  అర చేతుల్లో ముఖం దాచుకుని కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపు పరికించి చూస్తే అతను తన రోదనని ఇతరులు చూడకుండా ఉండడానికి అలా ముఖం దాచుకుని ఉన్నాడని అర్థం చేసుకోగలం.
అతని పక్కన ఉంగరాల జుట్టుతో ఉన్న ఒక స్త్రీ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తోంది.
కొంచెం ఓపిక పట్టు..అంతా సర్దుకుంటుంది అంటూ.
నాకు అర్థం కావడం లేదు. నేను నా వ్యాఖ్యని పెట్టి ఇంతసేపయింది. అమోఘం అంటూ జవాబు వస్తుందనుకున్నాను.  ఒక్కడయినా ఇంతవరకూ  నచ్చింది అంటూ రాయలేదు.
 కనీసం లైక్ అనే బటన్ కూడా నొక్కలేదే. ఎందుకు..ఎందుకు...?” అంటున్నాడా యువకుడు ఆవేశం, నిరాశా, నిస్పృహలతో మిళితమయిన గొంతుతో.

సరే..సరే. ఊరుకోమన్నాగా.  ఇంతకీ నువ్వు ఆ వ్యాఖ్య పెట్టి ఎంతసేపయింది?” అని అడిగింది ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి.
ఐదు నిముషాలయిపోయింది పూర్తిగా.  నిజజీవితంలో అయితే అది ఐదు నెలలకి సమానం. తెలుస్తోందా నీకు?” కోపంగా అంటూ మళ్ళీ విషాదంగా తన అరచేతుల్లో ముఖం దాచేసుకున్నాడు ఆ యువకుడు.

అరవై ఏళ్ళ ఆ స్త్రీ  అక్కడ కూర్చుని  తన పేరు పిలిచే వరకు ఎదురు చూసింది. తన పేరు వినబడగానే రిసెప్షనిస్టు వెనక నడిచి  ఫేస్ బుక్ కౌన్సిలర్ స్నేహమయి”- టేబిల్ కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.
చెప్పండి...ఇది మొదలై ఎంతకాలమయింది చిరునవ్వుతో అడిగింది కౌన్సిలర్.
అసలు దీనికంతా కారణం మా మనవడే ...మొదలు పెట్టింది ఆవిడ.
నాకు ఇంతకు ముందు ఈ ఫేస్ బుక్ అంటే ఏమిటో తెలీదు. కానీ నా మనవడు దీనిని పరిచయం చేసాక అనుకున్నాను ఇది నా కోసమే అని. ఎందుకంటే నేనెప్పుడూ పుస్తకాలు ఎక్కువగా చదువుతానుగా, నా ముఖాన్ని ఎప్పుడూ  పుస్తకంలోనే ఉంచుతాను. ఫేసు బుక్ అంటే అదే అనుకున్నాను.
 
సరే. మీరు దీనికి అలవాటు పడడానికి ఎంతకాలం పట్టింది”? అడిగింది కౌన్సిలర్.
అబ్బే...ఎంతో కాలమా...ఒక ప్రొఫైల్ రూపొందించడానికి ఎంతసమయం పడుతుందీ...అంతే. ఫేస్ బుక్లో రోజుకి కనీసం ఏడెనిమిది సార్లయినా నా ముఖం చూసుకుంటూ ఉంటాను నేను. ఎక్కువగా రాత్రిళ్ళు.
ఒక్కోసారి అర్థరాత్రి కూడా లేచి చూస్తుంటాను...ఏమో విదేశాలలో ఉండే నా స్నేహితులు ఏమయినా కొత్తవిషయాలను పెట్టి ఉంటారేమోనని. కానీ మా ఆయనకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. స్నేహం చాలా విలువయినది..ఎక్కడంటే అక్కడ దాన్ని వెతుక్కోకూడదని ఆయన ఉద్దేశం.
ఫేస్ బుక్ లో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి?” అడిగింది కౌన్సిలర్.
"అబ్బో... ఒకటా, రెండా. చాలా ఉన్నాయి. ఫేస్ బుక్ నా జీవితానికే ఓ వరంలా అనిపిస్తుంది.ఎందుకంటే నిజజీవితంలో నాకు ఐదుగురు మాత్రమే ఉన్నారు స్నేహితులు. మరి ఫేస్ బుక్ ద్వారా నాకు ఎంతమంది స్నేహితులో తెలుసా ?  కనీసం 675 మంది స్నేహితులున్నారు. అందులో ఇంకా ఒక గొప్ప స్నేహితుడు కూడా ఉన్నాడు తెలుసా
ఎవరేమిటి అతను..ఎందులో గొప్పవాడు అడిగింది కౌన్సిలర్.
ఎందులో ఏమిటి? అతనికి 4000మంది స్నేహితులున్నారు తెలుసా. అంతమంది స్నేహితులున్నారంటే అతను గొప్పవాడేనన్నమాట.
ఊ...అయితే ఫేస్ బుక్ వల్ల మీ స్నేహాలు వృద్ధి అయ్యాయన్నమాట.
అవును. ఫేస్ బుక్ వల్ల నా పాత స్నేహితులెందరినో నేను కలుసుకున్నాను. వాళ్ళు జీవితంలో ఏమేం చేసారో, ఎలా బ్రతికారో అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. అంతే కాదు, ప్రస్తుతం వాళ్ళ జీవితంలో అనుక్షణం చేస్తున్న పనులన్నీ నేను తెలుసుకుంటున్నాను. వాళ్ళు ఏసినిమా చూసారు, శలవలెలా గడిపారు, ఏం వండుకుని తిన్నారు.ఇలా అన్నీ వెంట వెంటనే తెలుస్తాయి నాకు. అంతే కాదు నేను వాళ్ళతో కలిసి ఎన్నో ఆటలు కూడా ఆడుతూ ఉంటాను.
 
ఓహ్..నాకు తెలుసు.. ఆ ఆట ఫార్మ్ విల్లీ !! కదూ?!”.
కాదు. మాఫియా వార్స్. ఆ ఆటలో నన్ను కొట్టగలిగేవాడే లేడు తెలుసా?!”
ఆ స్నేహితులలో ఎవర్నయినా కలిసారా మీరు అడిగింది కౌన్సిలర్.
ఊహు. లేదు..ఎందుకూ ? ఫేస్ బుక్లో రోజూ చూస్తూనే ఉంటాగా. నిజానికి వాళ్ళను ప్రత్యక్షంగా కలవడం కంటే ఫేస్ బుక్ లో కలుసుకోవాలంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళకోసం ప్రత్యేకంగా ఏరకంగా తయారవక్కరలేదు... పెర్ ఫ్యూమ్ వాడక్కరలేదు. మంచి బట్టలు వేసుకోనక్కరలేదు. స్నానం కూడా చెయ్యక్కర్లేదు. నిజానికి నాకు ఫేస్ బుక్లో నచ్చింది అదే. ఎవరి ముఖం చూసినా ఎంతో స్వచ్ఛంగా అందంగా ముద్దుగా ఉంటారు. అందరూ వాళ్ళ ప్రొఫైల్ లో మంచి ఫోటోలు పెడతారుగా."
"మరి మీరు మీ ప్రొఫైల్ కి ఏం పెట్టుకున్నారు?” అడిగింది కౌన్సిలర్.
నేను కనీసం ఐదారు గంటలు వెతికాను, ఏ ఫోటో పెడదామా అని..ఇంటర్నెట్ కూడా వెతికాను. ఆఖరికి బ్యూటి క్లినిక్ కి కూడా వెళ్ళాను.
అవునా..ఓహో..మీ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి కదూ.
కాదు. అక్కడున్న ఒక అందమైన అమ్మాయి ఫోటో కోసం. నేను ఇప్పుడు అదే వాడుతున్నాను, నా ప్రొఫైల్ ఫోటోకి.
మరి మీ స్నేహితులు మీ ఫోటో చూసి ఆశ్చర్యపోలేదూ..మీలో ఈ మార్పేమిటి అని....”!అడిగింది ఆశ్చర్యంగా కౌన్సిలర్.
ఆ...ఆ...కొంతమంది పోల్చుకుని అడిగారు. నా యవ్వన రహస్యం ఏమిటి? అని. రోజూ యోగాసనాలు వేస్తానని చెప్పి నమ్మించానులే.
సరే. ఈ ఫేస్ బుక్ అలవాటు మీకు ఓ సమస్యగా మారబోతోందన్న అనుమానం ఎందుకొచ్చింది మీకు?”
అడిగింది కౌన్సిలర్.
క్రిందటి ఆదివారం నేను ఫేస్ బుక్ చూస్తూ ఉండగా ఒక సందేశాన్ని గమనించాను. అది నా భర్త దగ్గరనుంచి నాకు వచ్చినది.  నా వాల్ మీద ఉన్న ఆ సందేశం అప్పుడే నేను చూసాను.

అవునా...ఏమని ఉందా సందేశంలో?” అడిగింది కౌన్సిలర్ కుతూహలంగా.

"నేను ఇల్లువిడిచి పెట్టి వెళ్ళి అయిదు రోజులయింది. ఈ విషయం నీ అంతట నువ్వు తెలుసుకుంటావేమోనని చూస్తున్నాను"- అని రాసారాయన"
" నిజమా. మరి మీరేం చేసారు అప్పుడు ? ఏం జవాబు రాసారు? " ఉత్సాహంగా అడిగింది కౌన్సిలర్.

"ఏముందీ..వెంటనే ఆయనను 'అన్ ఫ్రెండ్'  చేసేసి తెగతెంపులు చేసేసుకున్నా....ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా."

 ఇప్పుడు కౌన్సిలర్ ముఖం భావరహితంగా ఉంది.

(వ్యాసంగం నుంచి వ్యసనంలోకి మారిన అంతర్జాల మాయాజాలంలో మన పాత్రని పునరాలోచించుకోవాలని భావిస్తూ, ఒక జాలసందేశంలోని ముఖ్యాంశానికి నా పైత్యం జోడించి రాసినది ఇది. అసలు కాళిదాసు ఎవరో వారికి కృతజ్ఞతలు)

38 comments:

  1. :)) బాగుందండి. మీ రచనలు నాకిష్టం. ఏ విషయాన్నైనా చాలా బాగా చెప్తారు మీరు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు శిశిరా..మీ వ్యాఖ్యలంటే నాకెంతో ఇష్టం సుమా..పొగడ్తలు చేదా మరి.

    ReplyDelete
  3. మీ ఈ జవాబు(వ్యాఖ్య) కూడా నచ్చింది నాకు. :)

    ReplyDelete
  4. సుధ గారు మీరు చెప్పింది పచ్చి నిజం. అమెరికాలో ఫేస్ బుక్ మీద ఒక సర్వే జరిగింది. మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరిచే నిజం ఒకటి బయటపడింది ఆ సర్వేలో. అదేంటంటే... అమెరికాలో విడాకులు తీసుకుంటున్న ప్రతి ఐదు జంటల్లో ఒక జంట విడిపోవడానికి కారణం ఈ ఫేస్ బుక్ వల్లనే అట. ఈ సోషల్ నెట్‍వర్కింగ్ సైట్ల లో స్నేహాలు హద్దులు దాటడం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయనేది పచ్చినిజం. ఒక నిజానికి హాస్యాన్ని జోడించి చెప్పడం మీకే చెల్లింది.... హ్యాట్సాఫ్....అండి.

    ReplyDelete
  5. "స్నేహం చాలా విలువయినది..ఎక్కడంటే అక్కడ దాన్ని వెతుక్కోకూడదు"

    నిజం.అసలు కనబడ్డ ప్రతిఒక్కరినీ స్నేహితులుగా ఫీలవ్వడమే ఒక వ్యసనం నన్నడిగితే

    ReplyDelete
  6. మనిషన్నాక ఏదో ఒక వ్యసనం ఉంటుంది..ఒకరి వ్యసనం ఒకరికి వ్యర్థం గా అర్థం లేనిది గా కనపడవచ్చు. ఈ వ్యసనం లేకుండా..సజావుగా సాగే జీవితాల్లో ఏముంటుంది? రాయిలాగానో..చెట్టు లాగానో బ్రతకటం తప్ప.. నచ్చిన పని చేయకుండా..ఎలా ఉండాలి మనిషి ?
    ఏమి చేయకుండా చెడి పోవటం కన్నా ఏదోటి చేసి..ఫలానాది చేయబట్టి చేదిపోయాను అన్న తృప్తి మిగలదా మనిషికి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి...మరి నాశనానికి కాక పోతే జీవితం ఎందుకు దండగ...

    ReplyDelete
  7. చక్రి బాబూ...శాంతం..శాంతం..కూల్ కూల్.
    మరీ అంత ఆవేశ పడకండి. సరదా సరదావే. వ్యసనం వ్యసనమే..ఒప్పుకుందాం. హద్దులుతెలిసినంతవరకూ మనకి మనం హాని చేసుకోనంతవరకూ వ్యసనం సరదావే. ఆ హద్దు ని గమనించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయడమే మనిషి పని.
    జీవితం అన్నది నాశనం కాడానికే అని జీవతం ప్రయోజనాన్ని వ్యాఖ్యానించుకుంటే మరిక చెప్పగలిగేది ఏముంది.

    ReplyDelete
  8. అవునూ ఇంతకీ మీరు అక్కడ ఉన్నారా ఫేసు బుక్కు లో.
    అవధులు దాటనంతకాలం మంచి కాలక్షేపం బహుశా చాలా మందికి. అదే జీవితం అనుకుంటే, అన్నీ వ్యసనాలలాగే అదీను.

    మీరన్నట్టు డీ ఎడిక్షన్ సెంటర్స్ నిజం గానే కావాలేమో?

    ReplyDelete
  9. సుబ్రహ్ణణ్యం గారూ, అవునండీ.
    నాక్కూడా ముఖపుస్తకంలో ఓ పేజీ ఉంది.
    దానికి తగిన అడిక్షనూ ఉంది. కనుకనే అందులోని లోతు తెలిసింది. ఎటొచ్చీ ఇల్లాలిని కనుక టైమ్ లేక ఆ ఆటలు ఆడడం లేదు కానీ. దానికి బదులు బ్లాగింగ్ చాలదూ...పోస్టులు రాయడం, వాటిని ఎవరు చదివేరా అని చూసుకోవడం...కామెంట్ల కోసం ఎదురు చూడడం...అబ్బో...అంతర్జాలమే వదులుకోలేని ఒక వ్యసనం మరి.
    ఈ టపా ముఖ్యంగా నాకోసమే...తర్వాతే ఎవరికి సంబంధిస్తే వారికి అని గమనించుకోగలరు.

    ReplyDelete
  10. అసలు ఫేసుబుక్ ఎందుకు అంత విస్తృత ప్రజాదరణ పొందింది అంటే మనసులో అనిపించిన భావాన్ని తక్షణం మన స్నేహితులతో పంచుకోగలగటంలో ఉన్న సౌలభ్యం చూసి. పాశ్చాత్య ప్రపంచములో అనేకానేక బంధాలు ప్రేమ మీద కాకుండా వ్యాపారం, అవసరాల నిమిత్తం నెరుపుతూ ఉంటారు. మనసుకు తగినతోడు, మనలాగే ఆలోచించగలిగిన వ్యక్తుల పరిచయం మనిషిని ఒక్కోసారి పరిధులు తెలియకుండానే అతిక్రమించేలా చేస్తుంది. కుటుంబం లేదా స్నేహితులమధ్య ప్రేమ ఆప్యాయతలు పుష్కలంగా ఉన్నంతకాలం ఎలాంటి సోషల్ సైట్లయినా కేవలం సమాచార మార్పిడికి ఉపయోగపడుతాయే తప్ప బంధాలను నిర్మించుకోవటానికి కాదు. నాబోటి వానికి మిత్రుల మధ్య సమాచార మార్పిడికి అత్యంత వేగవంతమైన సాధనం ఫేసుబుక్. మన పెద్దలు చెప్పనే చెప్పారు "అతి సర్వత్ర వర్జయేత్"

    ReplyDelete
  11. మా మనవరాలి మూలం గా ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసాను :)
    మా మనవడి కోసం ఫార్మ్ వెల్లీ మొదలుపెట్టాను . కాని ఇప్పటి వరకూ నేను దాని జోలికి పోలేదు . మా మనవడు కాల్ చేసి నప్పుడల్లా అరుస్తాడు , నీకు గిఫ్ట్ పంపాను ఆక్సెప్ట్ చేయలేదిమిటి అని :)
    ఈ మద్యనే మా ఫామిలీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షల కార్డ్స్ ఫేస్ బుక్ లో పెట్టటము మొదలుపెట్టాను .
    కాని బాబోయ్ దానివలన ఇంత ఘోర పరిణామాలున్నాయని నాకుతెలీదు సుమండి . ఇహ దాని జోలికి పోను . ఇదివరకు లాగానే ఫోన్ లు చేసి విష్ చేస్తా . నన్ను ప్రమాదము నుండి రక్షించినందుకు థాంక్స్ అండి .

    ReplyDelete
  12. మాలాగారు,
    మీరు మరీను. భయపెట్టడం నా ఉద్దేశం కానే కాదు సుమండీ. ఆధునికంగా వచ్చిన అన్ని సౌలభ్యాలను మనలాంటి వాళ్ళు అందిపుచ్చుకోవలసిందే. దాని ప్రయోజనాలను రుచిచూసి జీవితాన్ని సుగమం చేసుకోవలసిందే. వ్యాసంగం వ్యసనం కానంతవరకూ దానివల్ల ప్రమాదమేమీ లేదు. పాపం మీ మనవల మనసులను నొప్పించకండి.
    పైన అచంగ రాసారు చూడండి. కుటుంబం లేదా స్నేహితుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పుష్కలంగా ఉన్నంతకాలం ఏ ప్రమాదమూ రాదని. చాలా బాగా చెప్పారు తను.
    తొందరపడి అకౌంట్ డిలీట్ చెయ్యకండి. (మనలోమాట ...మనిద్దరం కావాలంటే అక్కడ కలుసుకుందాం..వీళ్ళకి తెలియకుండా)

    ReplyDelete
  13. చాలా బాగా రాసారండీ...అదేమిటో నేనూ చూస్తూ ఉంటాను, అమ్మో నా మొక్కలకి నీళ్ళు పొయ్యాలి. అమ్మో నా పొలానికి ఎరువులెయ్యాలి అని ఏమిటేమిటో చెప్తుంటారు...నాకు ఏమీ అర్థం కాదు. నా ఫ్రెండు తో గేమ్ సగం లో ఉండిపోయింది ఆడి వస్తా అంటారు...అదేమి గేమో తెలీదు. ఇదేదో పిచ్చిలా తయారయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. అక్కడ మనకీ ఓ ముఖ చిత్రం ఏడిసిందిగానీ ఇప్పటికీ దాన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలీయట్లేదు. స్నేహుతులని కలుపుకోవడం, ఎప్పుడైనా మెసేజ్ లు ఇవ్వడం తప్పా ఇంకేమీ తెలీదు. నా అసమర్థతకి నవ్వుతుంటారు స్నేహితులు...ఇదో పల్లెటూరి వాటం అన్నట్టు చూస్తారు.

    ReplyDelete
  14. ఇదో పల్లెటూరి వాటం అన్నట్టు చూస్తారు.
    ----------
    ఆ.సౌమ్య గారూ మీకు తోడు ఉన్నాను. నాకు ఎకౌంటు కూడా లేదు. నాకు బాధలేదు నేను పల్లెటూరినుండే వచ్చాను.
    థాంక్స్ ఫర్ ది పోస్ట్ సంధ్య గారూ.

    ReplyDelete
  15. మా శ్రేయోభిలాషిగారూ, మీ హేట్సాఫులకి మా స్టమక్ ఫుల్లండీ. థాంక్స్ అన్నమాట.

    ReplyDelete
  16. సౌమ్యా,
    ఫేసుబుక్కులోకి మీరు తొంగిచూడరంటే హాశ్చర్యమే...బజ్జునొక ఊపు ఊపుతారుగా.
    నేను కూడా మీలాగే నచ్చిన కొటేషన్లు పెట్టడం, మెసేజ్లు పెట్టడమే కాని ఆడడం రాదు. నా అకౌంట్లో పిల్లలు ఆడుకుంటు ఉంటారు అప్పుడప్పుడు. బయట చూసే వాళ్ళకి నేనే ఆడినట్టు కనిపిస్తానేమో కూడా.

    ReplyDelete
  17. రావుగారూ,
    సంధ్యని కానండీ. సుధని. ఫేసుబుక్కులో అకౌంటులేదా.. అందులో ఉంటేనే ఈ టపాలోని లోతు తెలిసేది. పోనీండి. మీకింక బాధలేదు.

    ReplyDelete
  18. సారీ అండి సుధా అనుకుంటూ సంధ్య టైపు చేసాను.

    ReplyDelete
  19. ఆలోచనాత్మక మయిన మంచి టపాలు పెట్టడంలో మీకు మీరే సాటి సుధ గారూ. మీదు మిక్కిలి దానికి మీ హాస్యయేత శైలి అదనపు ఆకర్షణ.

    వెయ్యనా వీరతాడు ?

    ReplyDelete
  20. @జోగారావుగారు,
    వీరతాడు వేస్తానంటే సంతోషమే కానీ ఈసారి వద్దులెండి. ఈ టపా - జాలసందేశంలోని ముఖ్యాంశాన్ని తీసుకొని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో కొంచెం సరదా మేళవించి రాసినదే కానీ నా స్వయంకృతం కాదు కదూ.. అందుకు.
    మీరు మెచ్చి,వీరతాడు వేయించుకునే టపా రాయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  21. ఏదో బజ్జు, బ్లాగు తప్ప...ఇంకేమీ అంత ఊపనండీ...అవి కూడా...తెలుగు కి బాగ దగ్గరగా ఉంటాను కాబట్టి...తప్పితే, మనం పల్లెటూరి వాటాలే. :D

    ReplyDelete
  22. మంచి పోస్ట్. అందరికి తెలిసిన విషయాన్నీ చాల చక్కగా రాసారు. ఇంటి పక్కన ఎవరు ఉన్నారో తెలిది కానీ, పేస్ బుక్ లో వందల వందల మంది ఫ్రెండ్స్. వింతగా లేదూ? ఏదన్నా limits లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది.

    ReplyDelete
  23. సుధ గారు,

    చాలా మంచి విషయం చెప్పారండీ. ఇది కేవలం తెలుగు బ్లాగ్ లో కాక వార్తాపత్రిక లో వస్తే ఇంకా ఎక్కువమందికి చేరుతుందేమో.
    నేను కూడా అకౌంట్ తెరిచాను కాని అది తెరవాలంటే బోర్. మీరన్నట్లుగా దీనికి జనాలు ఎలా ఎడిక్ట్ అయ్యారంటే ఆ మధ్య మా మేనల్లుడి పుట్టినరోజు కి శుభాకాంక్షలు
    చెప్పాలని ఫోన్ చేస్తే ఎంతకీ ఎత్తలేదు. ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే వెంటనే ప్రత్యక్షం.

    అతి సర్వత్ర వర్జయేత్ అనేది అన్నిట్లోను పాటించటం మంచిది కదా.

    శ్రీరాగ

    ReplyDelete
  24. @ సౌమ్య....
    బ్లాగు, బజ్జే కాదు..ఫేస్ బుక్ కూడా తెలుగులో సెట్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ తెలుగులోనే వస్తాయి...హాయిగా తెలుగులో రాసుకోవచ్చు...కొన్ని ఇంగ్లీషు పదాలకు
    తెలుగు అనువాదం నవ్వు తెప్పిస్తుంది కానీ చాలా వరకు తెలుగులోనే వస్తుంది ఫేస్ బుక్. కాబట్టి కావాలంటే ఆ పుస్తకంతో కూడా ఊపొచ్చు. ఉండండి...మిమ్మల్ని అక్కడ వెతుకుతా...

    ReplyDelete
  25. @ ప్రవీణ,
    ఇంటిపక్కన ఎవరున్నారో తెలీదు...నిజం.అంతగా పట్టించుకోం. ఇక అంతర్జాల వ్యసనంలో ఉంటే మరీను. ఫేసుబుక్ లో వందలాది ఫ్రెండ్స్ నిజం....రాత నచ్చినందుకు ధన్యవాదాలు.
    @siri గారు,
    నిజమేనండి. పరిమితి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. తెలుసుకున్న వాళ్ళకు ఏబాధ లేదు. తెలీని వాళ్ళకి చేతులు కాలితే కాని తెలియదు. అన్ని అలవాట్లు అంతే.

    ReplyDelete
  26. సుధా,
    మీ కలం నుండి వెలువడిన "అలా మొదలైంది" ఎలా ముగుస్తుందోనని విడవకుండా చదివేను.
    నా ముఖానికి బుక్కు కూడానా అనుకోకుండా ఈరోజుల్లో
    అభినవ స్పైడర్ మాన్లూ మరియు వుమన్లూ వెబ్ వెయ్యకుండానే శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగ కంప్యూటర్లకి అతుక్కుపోయి వుంటున్నారు. మనల్ని కన్సల్టెంట్లు తప్ప ఇంకెవరు కాపాడగలరు?
    వెబ్బుదాతా దుఃఖీభవ!

    ReplyDelete
  27. ఉన్నాయి. సుదా గారు చాల రోజుల క్రితం ఎక్కడో చదివాను. విచిత్రం అనిపించి అలా గుర్తుంది పోయింది .ఒక మ్మయికి పెళ్లిసంబంధం కుదిరింది . తరువాత ఆ అమాయి నేను అతన్ని చేసుకోను అని మొండి కేసింది సంబంధం రద్దు చేసు కున్నారు . కారణం ఏమిటో తెలుసా . అబ్బాయి ఫేస్ బుక్ లో అబిమాన నటుడు brahmanadam అనిఉందట. దాంతో నేను ఇలాంటి అబ్బాయిని చేసు కొను అండీ. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పేరు ఉంటె చేసుకునేదేమో. చిత్రంగా అనిపించిది. ఇలాంటి వారు ఉంటారా అనుకున్న . పేస్ బుక్ లు కొంపలు కుల్చేట్టుగా ఉన్నాయి. మనం దేనికి ఎడిక్ట్ కాకూడదు

    ReplyDelete
  28. మీరు చెప్పిన సంఘటన నిజంగా జరిగిందంటే ఆశ్చర్యమే.
    పెళ్ళి అయ్యాక చూసి ఉంటే ఏమయ్యేదో మరి. అందుకే ప్రొఫైల్ ఫోటో అందమైనదే పెట్టుకుంటారనుకుంటా.....(నేను నా ప్రొఫైల్ లో సావిత్రిని పెట్టేసుకున్నాలే)

    ReplyDelete
  29. ఫేస్ బుక్ వల్ల కలిగే వింత పరిణామాలను చక్కగా ఆకట్టుకొనే విధంగా అర్ధం అయ్యే రీతిలే వివరించారు.అంతర్జాలపు మాయాజాలం లో చిక్కుకు పోవడం వల్ల ఎంతో విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా వ్యక్తిగత జీవితంపై పడే ప్రభావం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని చక్కగా వర్ణించారు.నా బ్లాగు లో కూడా అంతర్జాలపు మాయాజాలం లో నేటి యువత శీర్షికతో ఒక తప రాసాను వీలైతే చూడండి.

    ReplyDelete
  30. ---"నేను ఇల్లువిడిచి పెట్టి వెళ్ళి అయిదు రోజులయింది. ఈ విషయం నీ అంతట నువ్వు తెలుసుకుంటావేమోనని చూస్తున్నాను"- అని రాసారాయన"

    ఇన్ని నష్టాలని వివరించిన మీరు, ఫేస్ బుక్ వల్ల భర్తలకి లాభం కూడా ఉంటుందని పరోక్షంగా చెప్పినందుకు ధన్యవాదాలు ;-) భర్తలూ, ఇంకేం, పూర్తి స్వేచ్చ కొసం ఏం చేయాలో తెలిసిందిగా, ఆ పని మీదుండండి మరి :-)

    ReplyDelete
  31. @KumarN
    :-)
    ఆ పై వాక్యాలు ఆడవాళ్ళకి ఫేస్ బుక్ వల్ల ఎలాంటి లాభమో చెప్పే సూచనేగా.... నష్టంగా ఎందుకు అర్థం చేసుకున్నారు మీరు...? :))

    ReplyDelete
  32. wow!, Excellent.
    I want to meet a person who says proudly that
    I haven't an account in facebook.

    ReplyDelete
  33. This comment has been removed by the author.

    ReplyDelete
  34. swathi garu,

    Ilanti korikalane gonthemma korika antaaranukunta.

    Meeku alanti vyaktini kanipisthe naku paricham cheyyandem :))

    ReplyDelete
  35. >>Meeku alanti vyaktini kanipisthe naku paricham cheyyandem :))

    Iam here Madam.

    ReplyDelete
  36. అవునా.....అయితే మీకు దండేసి దణ్ణం పెట్టాల్సిందే.....(ఫోటోకి కాదు సుమా)
    పైన స్వాతిగారు కూడా పూనుకుంటే మీకు సత్కారం ఎంతలో పని.
    అయితే ఒకటి మీరు ఆవకాయ, మాగాయ, ఊరగాయల పేర్లు కాకుండా అసలు పేరుతో ఆ ముఖపుస్తకంలో లేరని నిరూపించాలి సుమా....:))

    ReplyDelete
  37. పైనవన్నీ నిజమే గానీ ! ఫేస్ బుక్ లో చిత్రం ఏమిటంటే అది మనుషుల మధ్యన పరిధులు చరిపి విశ్వాన్నతటినీ కలిపేలా ఉంటుంది కానీ..మనిషిని మాత్రం సంకుచితం చేసి రోగలక్షణాలు తెప్పిస్తుంది .. సామీప్యం ఎలాగంటే మీరు గమనించారో లేదో ఫేస్బుక్ ఓ జైల్ లాంటిది.. ఫేస్బుక్ ఎకౌంట్ ఉన్నవారు ఓ ఖైదీ లాంటివారు. గంటలతరబడి ఏ పనీపాటాలేకుండా గడుపుతారు..విండో లోంచి (chat window) మధ్యన తలపెట్టి పక్కవారేం చేస్తున్నారో చూస్తారు. చేయడనికి పనుండదు..కాబట్టి గోడలమీద రాస్తారు (Walls పై posts) ఇంకా జనాలొచ్చి కెలుకుతూ "poke" చేస్తుంటారు ! :)

    ReplyDelete