21 February 2012

గిరిజా కల్యాణం - సంగీత సాహిత్య సమ్మేళనం


రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి రంగులలో చిత్రించబడిన తొలిచిత్రం. దర్శకుడు వేదాంతం రాఘవయ్య.లలితా శివజ్యోతి బేనర్ పై ఎ.శంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం.

సినిమాలో రహస్యం ముందుగానే  బహిరంగ రహస్యంగా  తెలిసిపోవడం వలన ప్రముఖనటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో  వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం  మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంది. సందర్భానుగుణంగా, కధోచితంగా బోలెడు పాటలు, పద్యాలు ఈ సినిమాలో వీనులవిందు కలిగిస్తాయి. వీటిలో మణిపూస గిరిజాకల్యాణం - నృత్యనాటకం.

రహస్యం సినిమా డీవీడీలు సీడీలు రూపంగా వచ్చినప్పుడు కేవలం ఈ గిరిజా కల్యాణం ఎలా చిత్రించబడిందో చూద్దామనే కోరికతో ఎందరో కొనుక్కున్నారు. కానీ ఆ చిత్రంలో అన్ని పాటలు ఉన్నా గిరిజాకల్యాణం మాత్రం మనకు కనిపించదు. తీవ్రమైన నిరుత్సాహం మనసును ముప్పిరిగొని  ఆశాభంగం కలిగిన వారెంతమందో.

ఈ గిరిజా కల్యాణం మనకి  సినిమాలో కూచిపూడి భాగవతుల నృత్య ప్రదర్శనగా మనకి కనిపిస్తుంది. ఆ సినిమా టైటిల్స్ లో  నృత్య దర్శకులుగా  వెంపటి సత్యం, హీరాలాల్ వేదాంతం రాఘవయ్యగార్ల పేర్లు కనిపిస్తున్నాయి. మరి ఈ నృత్యనాటకానికి దర్శకత్వం వహించిన వారు ఎవరో. బహుశః సూత్రధారిగా కూడా ఈ నృత్యరూపకంలో కనిపించే వేదాంతం రాఘవయ్యగారే   ఈ రూపకానికి నృత్య దర్శకత్వం చేసి ఉంటారేమో. ఘంటసాల, మాధవపెద్ది, మల్లిక్, రాఘవులు, సుశీల, పి.లీల,  వైదేహి, సరోజిని,పద్మ, కోమల గానం చేసారు.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత.
ఘంటసాలగారు సంగీత రచయిత.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు గొప్పకవి. అంతే కాక గొప్ప కథారచయిత. ఉషాకల్యాణం అనే సినిమా కోసం ఈ గిరిజా కల్యాణ ఘట్టాన్ని గేయంగా రాసారు మల్లాది. కానీ ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన  ఆయన రచన కేళీగోపాలమ్ నవలలో  ఈ గేయం ప్రచురించబడి తెలుగువారిని ఆకర్షించింది.  ఈ  ఉషా కల్యాణం నాట్యరూపకంలో  కొద్దిమార్పులు చేసి రహస్యం సినిమాకి వినియోగించారు దర్శక నిర్మాతలు.

ఈ పాట సినిమాలో రికార్డు కావడానికి ముందే ఘంటసాలగారు ఈ గిరిజా కల్యాణాన్ని స్వరపరిచి ఆలపించడం ఓ గొప్ప విశేషం.  కంచి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. ఆయన ప్రీతికోసం ఉత్సవనిర్వాహకుల ఆహ్వానం మేరకు ఘంటసాలగారు తన బృందంతో ఈ గిరిజా కల్యాణాన్ని ఆలపించారు. ఇందులో ఫిమేల్ వాయిస్ మనకు వినిపించదు. అది కూడా ఘంటసాలగారే ఆలపించారు. ఈ ప్రైవేటుగీతంలో పాటలో ఘంటసాలతో మనకు వినిపించే ఒక స్వరం  తిరుపతి రాఘవులుగారిది  కాగా, మరొక స్వరం   పట్రాయని సంగీతరావుగారిది. సంగీతరావుగారు  రాగాలాపనతోను, హార్మోనియం పైన, రావూరి వీరభద్రం వయొలిన్ పైన, ఉలిమిరి లలితప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో సహకరించారు. ఈ పాటలో సినిమాలో మనం వినని చరణాలు కూడా వినవచ్చు. అంతేకాక సంభాషణల మధ్య అనుసంధానంగా ఉండే వాక్యాలు కూడా ఈ పాటలో వినిపిస్తాయి. 

ఆలిండియా రేడియో, హైదరాబాద్ వారు రికార్డ్ చేసి ప్రసారం చేసిన ఆనాటి కార్యక్రమంలోని కొన్ని భాగాలను ఈ అపురూపమైన వీడియో  లింక్ ద్వారా వినవచ్చు. (updated on 07/09/2020)



గిరిజా కల్యాణం
తారకాసుర సంహారంకోసం తపోనిష్ఠలో ఉంటాడు శివుడు.  పరమశివుని భర్తగా పొందడానికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన గిరిజ (పార్వతీదేవి) తపోనిష్ఠలో ఉన్న ఈశ్వరుని కనుగొని అతనిని తన సేవలతో ఆరాధిస్తుంది. శివుడి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు మన్మధుడిని పంపుతాడు. మన్మధుడు పంచ బాణుడు. ప్రణయానికి అధిదేవత. పార్వతీదేవికి సహాయం చేస్తానంటూ ఆమె వారించినా వినకుండా ఈశ్వరుడిపై పూలబాణాలు వేసి అతని మూడో కంటి చూపుతో భస్మం అవుతాడు. శివుడి అనుగ్రహంతో తిరిగి ప్రాణం పోసుకున్నా రూపంలేకుండా భార్య రతీదేవికి మాత్రం కనిపించే విధంగా వరం పొందుతాడు. శివపార్వతులు కల్యాణంతో ఐక్యమవుతారు.  
ఇది ఈ కథాత్మక గేయానికి వస్తువు. ఈ వస్తువును సినిమాలో భాగంగా కూచిపూడి నృత్యనాటికగా రూపొందించబడింది. 

కూచిపూడి నృత్యం అంటే సంగీత, సాహిత్య, నాట్య సమాహార కళ. అన్నిటికీ సమ ప్రాధాన్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గిరిజాకల్యాణం నృత్యరూపకంగా అందుబాటులో లేకున్నా తెలుగు హృదయాలలో సందడి చేయడానికి ముఖ్యమైన విశేషం మల్లాదివారి సాహిత్యపు బంగారానికి ఘంటసాలగారు అద్దిన స్వరపరిమళం.


తెలుగు భాషలోను, భావంలోను ఎన్నో కొత్తపోకడలు రుచిచూపించిన మల్లాది వారి కలంలో ఈ గిరిజా కల్యాణ ఘట్టం మనను ఎంతగానో అలరిస్తుంది. 

అచ్చ తెలుగుమాటలతో తెలుగువాళ్ళ జీవితాలలోని ఎన్నెన్నో ఘట్టాలను రమణీయమైన భావాలతో రసభరితమైన పద ప్రయోగంతో ఆవిష్కరించారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. వారి సమయోచిత పదప్రయోగం గురించి, ఎన్ని వందలసార్లు చెప్పుకున్నా తనివితీరేది కాదు. అది కథ అయినా, సినిమా పాట అయినా మాటలకుండే ధ్వని,  ప్రయోగంలో మనసులో కలిగించే సద్యస్ఫూర్తిని గ్రహించిన మహా మాటల మాంత్రికుడు మల్లాది. 

ఆ పాటలలో కనిపించే ప్రయోగ శీలత్వాన్ని  వాక్కు, మనసు, జీవన సంస్కారాల త్రివేణీ సంగమంగా అభివర్ణించారు విమర్శకులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.
పాట నిర్మించేతీరులో దక్షిణాంధ్రవాగ్గేయకారుల సంస్కారం , ఆ యుగానికి చెందిన తెలుగు మాటల గమ్మత్తులు, జానపద, శృంగార పదాలలో ఉండే చమత్కారం కనిపిస్తాయని,  సమకాలిన తెలుగు సినిమా కవులలో మల్లాది హృదయసంస్కారం దక్షిణాంధ్రయుగానిదైతే భాష, భావ సంస్కారాలు అత్యాధునికమైనవి అన్నారు ఆయన.

కూచిపూడి నృత్య ప్రబంధంగా, యక్షగాన ప్రక్రియలో తీర్చిదిద్దిన ఈ గేయంలో మల్లాది గారు ప్రయోగించిన తెలుగు మాటలు ఎంత గొప్పగా సమయోచితంగా హంగు చేస్తాయో ఓసారి చూద్దాం. 

కూచిపూడి నాట్యం అత్యంత ప్రాచీనమైన నృత్యగాన సమాహార కళ. కాలక్రమంలో యక్షగాన ప్రక్రియ లక్షణాలను కూడా సంతరించుకుంది. దశరూపకాలలో చెప్పబడిన వీధి నాటక ప్రక్రియ లక్షణాలు కూచిపూడి నాట్య ప్రయోగంలో కనిపిస్తాయి. సంవాదాత్మకమైన సంగీత ప్రధానమైన నృత్య ఫణితిని సంతరించుకున్న పరిపూర్ణ రూపమైన నృత్యనాటకంగా ఈ గిరిజా కల్యాణం రూపొందించబడింది. 

సంప్రదాయ కూచిపూడి నృత్యాలలో కనిపించే అంశాలన్నీ మల్లాది వారు రచించిన ఈ గిరిజా కల్యాణం నాటకంలో కనిపిస్తాయి.
కూచిపూడి నృత్యనాటకాలలో మొదట పరాకు చెప్పడం అంటే ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ (సాధారణంగా సరస్వతీదేవి స్తుతిగా ఉంటుంది) నాటకాన్ని ప్రారంభించడం ఉంటుంది. సూత్రధారి నాటకాన్ని ప్రారంభంలో ఇష్టదేవతా స్తుతి చేయడం ఆ తరువాత నాటకం చూడడానికి వచ్చిన రసికులను ప్రశంసించడం తరువాత కథాంశాన్ని ప్రస్తావించడం, ఆ వెంటనే కథలో పాత్ర ప్రవేశం ఉంటుంది. 

 నృత్యరూపకాలలో ప్రారంభం లో పరాకు చెప్తూ సూత్రధారుడు ప్రవేశిస్తాడు. దేవతా స్తుతితో ప్రార్థనతో ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది.

అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

 అంటూ కళలకి అథి దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతిస్తారు.

తరువాత ప్రతి కార్యక్రమానికి ముందుగా అవిఘ్నమస్తు అనిపించుకోవడం కోసం గణపతి ప్రార్థన.
ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా
బహుపరాక్ బహుపరాక్

ఆ తరువాత గజాననుడి తమ్ముడు షడాననుడు(ఆరు ముఖాలున్నవాడు) – కుమారస్వామిని ప్రార్థిస్తారు.

చండభుజాయమండల దోధూయమాన వైరిగణా –షడాననా.
ఈ దైవ ప్రార్థనతో పాటు  కూచిపూడివారి గ్రామం చుట్టుపక్కల ఉండే దైవస్తుతి –

విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కూచిపూడి గ్రామం. కూచిపూడి గ్రామం పేరు ఒకప్పుడు కుశీలపురం అని, కుశీలపురం కుచేలపురం అయి కూచెన్నపూడి కూచిపూడి గా మారిందని చరిత్రకారులు చెప్తారు. ఈ స్తుతిలో మనకు కూచిపూడి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధదేవాలయాలలోని మూర్తుల స్తుతి కనిపిస్తుంది.

మంగళాద్రి నారసింహ (మంగళగిరిలోని నరసింహస్వామి), బంగరుతల్లి కనకదుర్గ (విజయవాడ కనకదుర్గ),
 కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ( కృష్ణానదీతీరంలోని కూచిపూడి గ్రామంలోని గోపాలస్వామి) అంటూ దైవస్తుతి చేస్తారు.

దైవస్తుతి అనంతరం కథ ప్రస్తావన – అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా  అంటూ కథలోకి ప్రేక్షకులను ఆహ్వానిస్తారు. 

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే అంటూ నాటకాన్ని వీక్షించడానికి వచ్చిన  ప్రేక్షకుల కళా ప్రియత్వాన్ని మెచ్చుకుంటూ తమ కళలోని సారస్యాన్ని అనుభవించి పరవశించమంటారు. పదింబదిగ (పదియున్ + పది+ కాన్)అంటే చక్కగా, పూర్తిగా అనే చక్కని అర్థాన్నిచ్చే అచ్చ తెలుగు పదం ఇక్కడ వేసారు శాస్త్రిగారు.

 ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ  ఈ కథా వస్తువు గా పరిచయం చేస్తారు. కన్నెగా ఈశ్వరుని చేరిన హిమవంతుడి కూతురు ఏ విధంగా ధన్యచరిత అయిందో తాము చెప్పబోతున్నామని, అవధరించ(విన)మంటారు.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ,
ఆ కోపీ-
కాకలు తీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమైన ప్రబంధము –

నిప్పుల ఎర్రదనాన్ని చూపే పదం కణ కణ. అటువంటి ఎర్రని కోపంతో ఉన్న ఆ కోపి అయిన శివుడు  ఆ కాముని రూపాన్ని అంటే మన్మధుడి శరీరాన్ని మసిచేసాడు. కానీ   ఆగ్రహం చల్లారి కాక (వేడి /తాపం) తీరగానే కనులు తెరిచాడు. తనను తెలుసుకున్నాడు. తన లలనను పరిణయమైన  అనే పదం ఎంతో చమత్కారంగా అనిపిస్తుంది. తన లలన అనడంలో- ఈశ్వరుడు పార్వతి ఆదిదంపతులు కదా. వారు ఎప్పుడో ఒకరికి ఒకరు చెందినవారు. ఇప్పుడు  ఈ సందర్భంలో మళ్ళీ పెళ్ళిచేసుకొని జంటగా మారారు. అందుకే తనలలనను పరిణయమాడిన కథను వినండి అంటాడు సూత్రధారుడు.

ఇక్కడితో తెరమీద సూత్రధారుడి కధా వస్తువు పరిచయం అయింది. ఇక పాత్రప్రవేశం.

తెర పక్కకు తొలగుతుంది. పార్వతీదేవి  చెలికత్తెలతో ప్రవేశిస్తుంది. 
రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

ఇక్కడ పార్వతీదేవి పాత్రను పరిచయం చేసే వాక్యాలు ఇవి.
రావో రావో  అంటూ పార్వతీదేవిని పిలుస్తారు చెలులు.

లోల లోల లోలం బాలక  రావో...రావో అంటే  లోల లో ల అంటే అలా అలా కదులుతూ ఉన్న లోలంబమైన అలకలు కల అంటే 
కదులుతూ ఉన్న అలకలు అంటే ముంగురులు  కలిగిన దానా, అంటూ పార్వతీదేవి ముఖ సౌందర్యాన్ని ప్రశంసిస్తారు. 

లోల అనే పదం ఇక్కడ మూడుసార్లు ప్రయోగించారు.అందమైన ముంగురులతో ఉన్న స్త్రీని వర్ణించడానికి  ఇంత అందంగా ఒకే పదాన్ని అన్నిసార్లు వాడుతూ  ఆ అందాన్ని ద్విగుణీకృతం చేసారు మల్లాదిగారు.

లోకోన్నతుడైన అంటే  లోకాలన్నిటిలోనూ ఉన్నతమైన వాడు -పర్వతరాజు  హిమవంతుడు, అతని భార్య మేనకాదేవి, వారి తనయ (పుత్రిక)  పార్వతీదేవి.  రాజసులోచన, రాజానన అంటే ఇక్కడ రాజు అంటే చంద్రుడు అని తీసుకుంటే చంద్రుడివంటి ముఖం కలిగినది అయిన పార్వతిని వర్ణించే సార్థక పదప్రయోగాలు ఇవి.

పార్వతీదేవి ఈశ్వరుడి వద్దకే  వెళుతోందని తెలిసినా వారు ఆమెని ఎక్కడకు అని  ప్రశ్నిస్తారు. తద్వారా మనకు కథా గమనం తెలుస్తుంది.

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే

అందమైన మోములో లేలేత నవ్వులు చిందిస్తూ హంసవలె వయ్యారంగా నడుస్తూ ఓ కలికీ ( అందమైన అమ్మాయి) ఎక్కడికే నీ ప్రయాణం అని ప్రశ్నిస్తారు.

మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

మానస సరోవరం దగ్గర మణులల ప్రకాశించే పద్మదళాలమధ్య కూర్చుని రాజహంస( యోగి కి మరో పదం)లాగ ఉంటే అతని వద్దకు వెళ్తున్నానని సమాధానం చెప్తుంది పార్వతి.

ఇక్కడ మానససరోవరం దగ్గర ఈశ్వరుడు ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాని తపోనిష్టలో ఉన్న ఈశ్వరుడి గురించి,  మనసనేది సరోవరమైతే అందులో రాజహంసలా ప్రకాశించే ఒక యోగి  అనే ఒక లోతైన వేదాంతవిషయాన్ని గూఢంగా పలికించారు మల్లాది. పైగా ముందు చెలుల మాటలో కలహంస అనే పదం స్త్రీ అయిన పార్వతీదేవికి వేస్తే ఈశ్వరుడి వర్ణనలో రాజహంస అనే పదం సరిగ్గా తూగుతో నిలిచింది కూడా. అదే సార్థక పద ప్రయోగం అంటే.

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే

అంటూ వావిలిపూలదండలు పట్టుకుని వయ్యారపు నడకలతో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తారు.

కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే 

అంటూ పార్వతి కైలాసంలో కొలువై ఉన్న దేవదేవుడి సన్నిధికి వెళ్తున్నానని, త్వరలోనే అతను తన ప్రేమనిండిన కనులతో చూసి ఏలుకోబోతున్నాడని చెప్తుంది.

ఈ సంభాషణ పూర్తవుతూనే మన్మధుడి పాత్ర ప్రవేశిస్తుంది.

తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ   - అంటూ మన్మధుడు పార్వతీ దేవి ఈశ్వరుని కటాక్షపు వీక్షణాలకోసం పడిగాపులు పడనక్కరలేదని, తను సహాయం చేస్తానంటాడు.

అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా 
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది

ఇక్కడ మన్మధుడి ఔద్ధత్యానికి, అహంకారానికి తగిన మాటలు ఎన్ని వేసారో మల్లాది చూడండి. బిందు డకారం ( 0డ) ప్రయోగంతో అర్థ భేదం కలిగిన పదాలను చమత్కారంగా వాడారు.

పార్వతీదేవి వంటి రాజకుమారి, ఉత్తమవంశంలో జన్మించిన (పర్వతరాజు కూతురు కనుక) స్త్రీ, తనకు తానుగా తన భర్తను వెతుకుతూ వెళ్ళడం తగని పని అంటాడు మన్మధుడు. పైగా, తనంతటివాడు, గొప్ప ఆయుధాలు కలిగిన వీరుడు ఆమెకు అండగా ఉండగా అంటూ తన ఆయుధాల పదనును చెప్తాడు. విరిశరములు అంటే మన్మధుని పూల బాణాలు. అవి ఎంత పదునైనవో  అతనికి తెలుసు. పూలబాణాలు కదా అని తేలిగ్గా తీసేయవద్దనే హెచ్చరిక ఇక్కడ కనిపిస్తుంది.

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా

అంటూ తన శక్తిని చాటుకుంటాడు. పార్వతి ఎవరిని కోరుకుంటోందో అతను ఎంతటి ఘనుడైనా సరే తన కోలనేయనా అంటే తన బాణాన్ని వేసి, సరసను కూలనేయనా అంటే పార్వతి చెంతకు తీసుకువచ్చి పడేస్తాను అంటాడు. కనుగొనల నన మొనల అన్న పదంలో మన్మధుని ఆయుధాలైన పూల మొగ్గలతో గాసిచేసి అంటే నాశనం చేసి నీ దాసుడిని చేస్తాను - అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.

మన్మధుడి వాచాలత్వాన్ని చూసి పార్వతీదేవి సహించలేకపోతుంది. తన దైవాన్ని పాదాలచెంతకు తెచ్చి పడేయగలనంటూ అహంకారంతో అతను అంటున్న మాటలను ఖండిస్తుంది.
 అందుకే-

ఈశుని దాసుని చేతువా -అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!

తాను ఆరాధిస్తున్న ఈశ్వరుడిని దాసుడిని చేస్తాననడం చాలా తప్పు అని మందలిస్తుంది. అపసద అంటే నీచుడా అని అర్థం.  అలసుడు అంటే మందమైన బుద్ధిగలవాడు అని అర్థం. కోలలు అంటే మామూలు బాణాలు వేస్తే ఓడిపోయి కూలిపోయే సామాన్యుడుకాడని తను కోరుకున్నవాడు,   ఆ ఈశ్వరుడు  ఆది దేవుడని వివరిస్తుంది పార్వతీదేవి, మన్మధుడికి.


సేవలు చేసి ప్రసన్నుని చేయ 
నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...

తను చేసే సేవలతో ఏనాటికైనా ప్రసన్నుడై తనను అనుగ్రహిస్తాడని, మన్మధుడు చేస్తానని చెప్పిన సాయం తనకు అవసరం లేదంటుంది.


ఈలోపున చెలికత్తెలు కూడా మన్మధుడు చెప్పిన మాటలలోని అసంబద్ధతను చెప్తారు.

కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!  
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.

ఇక్కడ కాని పనీ అంటే అది చేయకూడని పని అని, నీ చేతకానిపనీ అంటే నీవు చేయగలిగిన పని కాదు అని కొద్దిగా వర్ణ భేదంతో పద ప్రయోగం చేసి  గొప్పఅర్థభేదాన్ని చూపించారు మల్లాదిగారు.

అహంకారంతో హరుడిని జయించడం అనేది తగని పని అని, పైగా ఆ పనికి పూనుకోవడం నీ వల్లకాదనీ చెలికత్తెలు, మన్మధుడిని హెచ్చరిస్తారు.

ఆ హెచ్చరిక విన్న మన్మధుడు ఇక్కడ హుఁ అంటూ హూంకరిస్తాడు వారు  తన శక్తిని సందేహిస్తున్నందుకు.

చిలుక తత్తడి రౌత అంటూ మన్మధుడిని సంబోధిస్తూ చెలికత్తెలు మళ్లీ ఇలా అంటారు.

చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....
మన్మధుడు ప్రణయదేవత. అతను చిలుక వాహనం పైన సవారీ చేసే రౌతు. తాము అతని మంచికోరి చెప్పిన మాటలు వినకపోతే ఏమవుతుందో హెచ్చరిస్తున్నారు చెలులు. తమ మాటలు వినకపోతే పదునైన విరిశరములు అంటూ బీరాలు పలుకుతున్న నీ బాణాల పని ఇక ఆఖరు అని హెచ్చరించారు. చిగురుటాకుల విల్లు సింగిణి కూడా ఇంక నాశనం అవుతుంది. తేజీ పని సరి అనే వాక్యంలో తేజీ అంటే గుఱ్ఱానికి పర్యాయపదం గా చూపిస్తోంది నిఘంటువు. చిలుకను తన వాహనానికి పూన్చాడు కాబట్టి చిలుకపని సరి అని చెప్పారు. చిగురుకు అంటే కడపటికి, చివరకు అని అర్థం. చివరకు అంటే మొత్తానికి నీ పని సరి అని ఈశ్వరుడితో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పి నయానా భయానా చెప్పజూస్తారు చెలికత్తెలు.
కానీ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి తన పరాక్రమం పైన  అచంచలమైన నమ్మకం పెట్టుకున్నవాళ్ళు మంచి మాటలు చెప్తే వింటారా.

 సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా 
అంటూ పార్వతీ దేవి ఈశ్వరుని సన్నిధికి చేరింది.


( ఈ మాటలకు అర్థం నాకు తెలియలేదు. శ్రీ పట్రాయని సంగీత రావుగారిని అడిగి తెలుసుకున్నాను. వారి వివరణ ఇలా ఉంది.


సామగ అంటే సామగానమునకు, సాగమ అంటే ఆగమములు అంటే వేదాలకు ఆధారమైన వాడవు, శారదనీరద అంటే శరత్కాలంలో చంద్రుడి పక్కన ప్రకాశించే తెల్లని మేఘం వంటి రూపం కలిగిన వాడవు, దీనులకు ఆధీనమైనవాడవు,
ధీసారుడు అంటే బుద్ధిబలం కలిగినవాడవు 


అంటూ పార్వతీ దేవి ఈశ్వరుడిని ప్రశంసిస్తూ ప్రార్ధించింది)

ఇవె కైమోడ్పులు            - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి          -ఈశా మహేశా

 అంటూ ఈశ్వరుడిని పరిపరివిధాల ప్రశంసిస్తూ  పూలతో పూజలు చేసి వాటితో పాటు తన హృదయాన్ని కూడా అంజలిచేసి సమర్పించుకుంది. అదే సమయానికి ఈశ్వరుని హృదయంలో ప్రణయాస్త్రం వేసి పార్వతికి సహాయం చేసి తన శక్తిని నిరూపించుకోవాలనుకున్న మన్మధుడు పూలబాణాలను సంధించాడు. అవి వెళ్ళి ఈశుని మదిలో గుచ్చుకున్నాయి. తపో భంగమయింది. తన తపస్సుకి భంగం కలిగించిన కారణం ఏదో తెలుసుకున్నఈశ్వరుడు కోపించాడు. వెంటనే తన మూడో కన్ను తెరిచాడు. మన్మధుడు ఆ కోపాగ్నికీలలలో కాలి, మాడి మసైపోయాడు.

మన్మధుడికోసం వచ్చిన అతని భార్య రతీ దేవి విషయం తెలుసుకుంది. తన ప్రాణవిభుడిని రక్షించమని ఈశుని వేడుకుంది.

ఇక్కడ కూడా మల్లాదివారిది బహు చమత్కారం అనిపిస్తుంది.
మన్మధుడు ఈశ్వరుడిని తన బాణాలతో కొట్టి అతనిలో శృంగారభావాలను రేపి విర్రవీగుదామనుకున్నాడు.అందుకే బాణాలు వేసాడు.

 కానీ రతీదేవి ఈశ్వరుడితో ఏమంటోందో చూడండి.
విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ

నిన్ను (ఈశ్వరుడిని) ఒక ఇంటివాడిగా (గేస్తు –గృహస్థు కి వికృతి) చేయడం కోసం పూనుకున్న(దొరకొన్న)  మన్మథుడిని (రసావతారు) చిచ్చరకంటను అంటే  మండుతూ ఉండే మూడవకంటితో చూసి నాశనం చేస్తావా ప్రభూ అంటూ రతీదేవి ఈశ్వరుడిని ప్రశ్నిస్తుంది. పూలతో నీకు పూజచేసి గృహస్థుగా మార్చుదామనుకున్నాడు. ఆయన ఇదంతా చేసింది నీకోసమే కదా. ఉపకారికి అపకారం చేస్తావా అంటూ తన భర్త పనిని సమర్థిస్తుంది.

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
 మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....

గిరిరాజ కన్య అంటే పార్వతీదేవి(పర్వతరాజు కూతురు) ని నీవు భార్యగా స్వీకరిస్తావు. మరి మరుడి(మన్మధుని)  సంగతి ఏమిటి? నా మాంగల్యం ఏం కావాలి?  అని ప్రశ్నించి తమని 
రక్షించమని, పతిభిక్ష పెట్టమనీ అర్థిస్తుంది.

పార్వతీదేవి చల్లని తల్లి. లోకాలనేలే మాత. అందుకే మన్మధుడు శివుని కంటిమంటలో కాలిబూడిదయ్యే వేళ “ అంబా! అంబా!(అమ్మా, అమ్మా)” అంటూ పిలిచిన  పిలుపును, అందులోని ఆర్తిని గుర్తించింది. ఇక  భరించలేకపోయింది.

ఈశ్వరుడికి తన తరపునుంచి ఓ మాట చెప్పి రతీదేవి కోరికను మన్నించమంటుంది.

 తనను మన్మధుడు అంబ అంటే అమ్మ అని పిలిచాడు విన్నావా అని ఈశ్వరుడిని అడుగుతుంది.

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...

తనను మన్మథుడు అమ్మ అని పిలిస్తే మరి తన భర్త అయిన ఈశ్వరుడు అతనికి తండ్రే అవుతాడు కదా.అందుకని జనకుడిగా (తండ్రిగా) భావించి అతనిని కుమారుడుగా చేసుకొని ప్రాణం పోయమని పార్వతీ దేవి బతిమాలుతుంది. ఇక్కడ అసమ శరుడు అంటే మన్మధుడు. (మన్మధుడి పుష్పబాణాలు ఐదు. సమసంఖ్య కాని సంఖ్య కదా ఐదు. కనుక అసమమైన సంఖ్యగల బాణాలు కలిగినవాడు మన్మధుడు అని వ్యుత్పత్తి)

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామిన్!!

అంటూ పార్వతీదేవి తన మనసును, తనువును ఈశ్వరుని భావనలో లీనం చేసి ఉన్నానని, అటువంటి గిరి పుత్రి అయిన తనను చేపట్టి ఏలుకోమని కోరుతుంది. తనను పరిపాలించమంటుంది. ఆమె కోరికను మన్నిస్తాడు పరమేశ్వరుడు. మన్మధుడు పునర్జీవం పొందుతాడు.

ఇంకేముంది. తపోభంగం ఎలాగూ అయింది కనుక ఈశ్వరుడు పెళ్ళి కి ఒప్పుకుంటాడన్నమాట.

ముందు బెట్టుచేసి సేవలు చేయించుకుని, మన్మధుని బాణాలు తాకాయన్న వంకతో తపోభంగం చేసుకుని అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు ఈశ్వరుడు. ఆ మాటలను ఎంత చక్కని తెలుగు మాటల్లో చెప్పారో మల్లాది.

బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం

అంటూ జగన్మాతా, జగత్పితల కల్యాణం లోకకల్యాణం గా భావిస్తూ ఈ నృత్యనాటకానికి మంగళం పాడతారు సంప్రదాయబద్ధంగా .

ఇక్కడ సూత్రధారుడు మళ్ళీ తెరపైకి వచ్చి-

కూచెన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం 

అంటూ కూచిపూడిలోని గోపాలదేవునికి జయమంగళ వచనాలు పలికి నాటకాన్ని పరిసమాప్తిచేస్తారు.

కూచిపూడి సంప్రదాయబద్ధమైన నృత్యరూపకానికి తగినట్టుగా  వివిధ ఘట్టాలకు తగిన రాగాలను సమకూరుస్తూ రాగమాలిక పద్థతిలో స్వరపరిచి , తనకు ఎంతో సహజసిద్ధమైన భావయుక్తమైన గానంతో మల్లాది వారి సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు ఘంటసాల.

అందుకే ఇన్నేళ్ళయినా ఇంత పెద్ద పాట అయినా తెలుగు హృదయాలను ప్రతితరంలోను గెలుచుకుంటూనే ఉందీ పాట.

తెలుగును మరో పదికాలాలు బతికించుకోవాలంటే ఈతరం వారు చేయవలసిన ముఖ్యమైన పని, సాహిత్యంలో మాణిక్యాల్లాంటి పద్యాలను, పాటలను ఆధునికపద్ధతిలో సంరక్షించుకోవాలి. పదిమంది కలిసినప్పుడు పాడుకోవాలి. అందులోని పదప్రయోగాల ప్రత్యేకతలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుతరాలవారికి పరిచయం చేయాలి.

"తాళ్ళపాకవారిని(అన్నమయ్య) చదవనిదే తెలుగు రాదు" అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రి.

మల్లాదివారి  పాట అర్థమయిందంటేనే మనకి తెలుగు వచ్చినట్టు.

17 February 2012

అనురాగమనే అమరభావనకి దృశ్యరూపం " ఆరాధన"



మనిషికి పూర్ణాయుష్షు నూరు సంవత్సరాలంటారు.  సంపూర్ణమైన జీవితానికి గుర్తుగా చెప్పే ఈ నూరు సంఖ్యకి మన తెలుగు సినిమా ప్రపంచంలో కూడా బోల్డు ప్రాముఖ్యత ఉంది. వందరోజుల పండుగలు, అందులో సగభాగం రోజులు  ఆడితే 50 రోజులు లెక్కవేసుకుని(ఒక్కోసారి వారాలు కూడా) గోల్డెన్ జూబ్లీలు, సిల్వర్ జూబ్లీలు అంటూ పండుగ చేసుకుంటారు 'సినీమానిసి'లు.

ఆ లెక్కలో ఇప్పుడు చెప్పుకోదగ్గ ఓమంచివిషయం ఏమిటీ అంటే "ఆరాధన"  తెలుగు సినిమా కి యాభైఏళ్ళు అన్నది.

అశాశ్వతమైన వాటికి  లక్ష్యంగా చూపే ఓ తెలుగు సామెత - మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయింది అనేమాట.  తెలుగులో ప్రతి సంవత్సరం కొన్ని వందల సినిమాలు నిర్మింపబడుతూ ఉన్నా వాటిలో గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పాలంటే కనిష్ఠా కాళిదాస అన్నట్టుగానే ఉంది వాటి సంఖ్య.(గొప్పకవుల పేర్లు లెక్కిద్దామని కూర్చొని ప్రారంభిస్తే చిటికెన వేలుమీద కాళిదాసు పేరు చెప్పాక మరో పేరు తట్టడం లేదు..అని అర్థం ఆ మాటకి) అంటే నాణ్యమైన సినిమాలు అంత తక్కువగా వస్తున్నాయి ఇటీవల కాలంలో.

1962 ఫిబ్రవరి 16 న ఆంధ్రదేశంలో విడుదలైన ఆరాధన సినిమా కి ఈరోజుకి యాభై ఏళ్ళని విన్నప్పుడు ఏదో తెలియని సంతోషం కలిగింది.  ఈ చిత్రం  సాగరిక అనే  ఒక బెంగాలీ సినిమా ఆధారంగా నిర్మించబడినది. నిర్మాతగా రాజేంద్రప్రసాద్ గారికి పెద్దగా నష్టాలు తేకపోయినా లాభం కలిగించలేదట.  ఈ సినిమా దర్శకుడు విక్టరీ మధుసూదనరావుగారిగా పేరు పడిన వి.మధుసూదనరావు 

ఎందుకోగాని తెలుగు సీమలో బెంగాలీ ప్రభావం చాలా ఎక్కువే. బెంగాల్ దేశంలోని ఉద్యమాలైనా, సాహిత్యమైనా అక్కడ ప్రజాజీవితంలో ముఖ్యమైన పాత్ర వహించిన అంశాలన్నీ తెలుగువారి జీవితాలను కూడా ప్రభావితం చేసాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచీ ఈ బెంగాలీ ప్రభావం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా ఎంతగానో కనిపిస్తుంది. తెలుగు కళా ప్రపంచం మీద బెంగాలీ ప్రభావం విడదీయలేనిది. తెలుగు సాహిత్యం పైన కూడా బెంగాలీ సాహిత్యం ప్రభావం ఎంతో ఉంది. ఠాగోర్ స్థాపించిన శాంతినికేతనం కొన్ని తరాల  తెలుగువారికి గురుకులం.  ఠాగోర్, బంకించంద్ర వంటి గొప్ప రచయితలతో పాటు శరత్ చంద్ర రచనలు తెలుగువాళ్ళకి ఎంతో సుపరిచితం.
 ఆచార వ్యవహారాలలో, వస్త్రధారణలోనే కాక సెంటిమెంట్ ల విషయంలో కూడా తెలుగువాళ్ళ జీవితాలలో  బెంగాలీ అనుకరణ  చాలా సహజంగా ఒదిగిపోయింది. అందుకేనేమో చాలా కాలంపాటు తెలుగుసినిమా కథలు బెంగాలీ చిత్రకథల ఆధారంగా రూపొందించబడడం అవి సూపర్ డూపర్ హిట్లు కొట్టడం కూడా అంతే సహజమయింది. తోడికోడళ్ళు, ముద్దుబిడ్డ వంటి చిత్రాలు బెంగాలీ కథల ఆధారంగా తీసినవే.

ఈ ఆరాధన చిత్రానికి వస్తే
ఆరాధన చిత్రం కథని బెంగాలీ చిత్రం ఆధారంగా తీసుకున్నా తెలుగు వాతావరణానికి ఒదిగిపోయేలా పాత్రలను తీర్చడంలో గాని, పాత్రల మధ్య సన్నివేశ పరంగా సంభాషణల్లో తెలుగుతనాన్ని పండించడంలో కానీ రచయితల కృషి శ్లాఘనీయం అని చెప్పాలి.

సినిమా కథ లో పెద్దగా మలుపులు చమక్కులు లేవు. అలాగే హీరో ఔన్నత్యాన్ని, ధీరోదాత్తతని వెల్లడించే సంఘటనలూ, ఫైట్లూ  లేవు. కథ డిమాండ్ చేసే శృంగార సన్నివేశాలు కానీ, హాస్యం పేరుతో కమేడియన్లు ముఖాలు రుద్దుకుంటూ, కిందపడి దొర్లుతూ  చేసే సర్కస్ ఫీట్లు కానీ లేవు. కనీసం హీరో హీరోయిన్ల పరంగా చిత్రించిన ఒక యుగళగీతం కూడా లేదు.  అయినా ఈ సినిమా  తెలుగు సినిమా ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ మైలురాయిగా ఉందీ అంటే  అందుకు కారణం సినిమాకి సంగీత పరంగా, సాహిత్యపరంగా  సంగీత దర్శకులు, రచయితలు  అందించిన సహకారమే అంటే  నిజమేననిపిస్తుంది.

సినిమా లో కథానాయకుడు కృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు) ఒక వైద్యవిద్యార్థి. పల్లెటూరునుంచి వచ్చి పట్నంలో చదువుకుంటాడు. పదేళ్ళపాటు పట్నంలోని షావుకారు చలపతిరావుగారి అండతో చదువుకుని వారింట్లోనే ఉంటూ  డాక్టరయి తన ప్రతిభతో విదేశాలకు వెళ్ళే అర్హతను సంపాదించుకుంటాడు. షావుకారుగారి అమ్మాయి సరళ (రాజశ్రీ) ని చిన్ననాటినుంచి కలిసి పెరగడం వలన  చెల్లెలుగా భావిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతనిమీద ఆశలు పెంచుకుంటుంది.  విదేశీ ప్రయాణం దగ్గర పడుతుండగా అనుకోకుండా జరిగిన ఓ సంఘటనలో మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్న అనురాధ(సావిత్రి)ని చూడడం తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడడం జరుగుతుంది. కానీ అతను తన ప్రేమను ఆమెకు వెల్లడిచేసే ప్రయత్నమేదీ చేయడు. ఆమె పేరు రాసుకుని చిన్న కవితలు రాసుకోవడం తప్ప. కానీ షావుకారు కూతురు సరళ  కృష్ణ తనను ఇష్టపడలేదన్న  కోపంతో అనురాథ పై అతను రాసుకున్న కవితలను బయటపెట్టి అనురాధ అల్లరి పడడానికి కారణమవుతుంది. అంత పెద్ద డాక్టరు, సభ్యతా సంస్కారాలున్నవాడు తన పేరును ఇలా రచ్చకీడ్చాడని భావించి అనురాధ అధికారులకి ఫిర్యాదుచేయడంతో కృష్ణ విదేశీ ప్రయాణం పై వేటు పడడం తో పాటు, అతని ఉద్యోగం కూడా పోతుంది. మరో దారిలేక స్వగ్రామానికి వెళ్ళిపోతాడు కృష్ణ.

చిన్ననాటినుంచి గుండెజబ్బుతో చనిపోయిన తన తల్లి ఆశయాల మేరకు పెద్దడాక్టరు కావాలనే కోరికతో ఎంతో కష్టపడి చదివిన కొడుకు జీవితం ఇలా కావడంతో నిరాశ పడతాడు తండ్రి(నాగయ్య).  అందుకే కొడుకుని విదేశీ ప్రయాణానికి సహాయం చేస్తానని,  కానీ అతనిని తనకి అల్లుడిని చేయాలనీ  కామందు  పెట్టిన షరతుకు తలఒగ్గుతాడు. కృష్ణ లండన్ వెళ్ళిపోతాడు. కృష్ణ మంచితనం తెలుసుకున్న అనురాధ తనవల్ల అతనికి జరిగిన అన్యాయం దిద్దుకోవడానికి తన నగలు అమ్మి సహాయం చేద్దామని అనుకునే లోపు కృష్ణ లండన్ వెళ్ళిపోతాడు. లండన్  వెళ్ళిన  కృష్ణ అనురాధకు తన ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆమె పట్ల తనకు గల ఆరాధనను వివరిస్తూ రాసిన లేఖ అందుకుంటుంది అనురాధ.
తనగురించి కవితలు రాసి అల్లరిచేసాడన్న కోపం స్థానంలో కృష్ణమీద అభిమానం గా , తరువాత అనురాగంగా మారడం జరుగుతుంది. అతని లేఖకు జవాబు రాసి తనకు కూడా అతనిపట్ల గల అనురాగాన్ని చెప్పడం కోసం ప్రేమలేఖ రాయడం ప్రారంభిస్తుంది.

సరిగ్గా ఇక్కడే కథలో ఓ కొత్త మలుపు. కృష్ణకి విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేయడానికి ఒప్పుకున్న కామందు (రమణారెడ్డి) అనురాధకి చిన్నాన్న, పల్లెటూరివాటంతో పెరిగిన తన కూతురు లక్ష్మి (గిరిజ)ని  విదేశాలనుంచి రాబోయే డాక్టరుకి కాబోయే భార్యగా కొంచెం నాగరికత నేర్పమని అనురాధని అర్థిస్తాడు ఆ చిన్నాన్న. అనురాధలో మారాకు వేయబోతున్న అనురాగలత వాడిపోతుంది.  . నీ చెలిమీ నేడెకోరితిని ఈక్షణమే ఆశవీడితినీ అంటూ ఖిన్నురాలవుతుంది. ఇచ్చినప్పుడు పుచ్చుకోలేని వాళ్ళకి అడగడానికి అవకాశం ఉండదని బాధ పడుతుంది.  కృష్ణకి తండ్రి ఉత్తరం రాస్తాడు.  తాను కామందుకి మాటఇచ్చానని, ఆ అమ్మాయిపేరున ఉత్తరం రాయమనీ చెప్తాడు. కొడుకు కోరికతీర్చడం తండ్రి బాధ్యత ఎలాగో, తండ్రిమాట నెరవేర్చడం కూడా కొడుకు కర్తవ్యమనీ  చెప్పిన తండ్రి కోరిక ప్రకారం ఆ అమ్మాయికి ఉత్తరం రాస్తాడు కృష్ణ. ఆ ఉత్తరం అందుకున్న పల్లెటూరి పిల్ల అనురాధ చెల్లెలు తనకి అలాంటి ఉత్తరాలకి జవాబు రాయడం రాదు కనుక అక్కనే జవాబురాయమని అడుగుతుంది. రాసి ఇచ్చిన ఉత్తరానికి ఫెయిర్ చెయ్యకుండా లక్ష్మి పోస్టు చేయడం వలన, తరువాత ఉత్తరాలు కూడా అనురాధ చేతిమీదుగా లక్ష్మి పేరుతో రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  తను ప్రేమించిన కృష్ణను తన చెల్లెలు లక్ష్మికి అప్పగించడం అనేది తను కృష్ణ భవిష్యత్తును నాశనం చేసిన పాపానికి పరిహారంగా  భావిస్తుంది అనురాధ. అందుకే కృష్ణ లక్ష్మిని ఇష్టపడే విధంగా లక్ష్మిపేరుతో అతనికి ఉత్తరాలు రాస్తుంది. 

కృష్ణ ఓరోజు ఉత్తరం చదివే పారవశ్యంలో లాబ్ లో  పొరపాటు చేసి కంటిచూపు పోగొట్టుకుంటాడు. అంధుడై, ఇండియాకి తిరిగి వచ్చిన కృష్ణను అల్లుడిగా ఆ కామందు  కానీ, భర్తగా లక్ష్మిగానీ అంగీకరించరు. అసలు అతని ఎదురుపడడానికి కూడా ఇష్టపడరు. అతనిని ప్రాణసమానంగా ఆరాధిస్తున్న అనురాధ తను లక్ష్మిగానే కృష్ణకి ఎదురుపడి అతనిని ఆప్యాయంగా సేవలందిస్తుంది. ఇద్దరిగురించి బాగా తెలిసిన స్నేహితుడు డా. సారథి (జగ్గయ్య)  సహాయంతో కృష్ణకి ఆపరేషన్ చేయించి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తుంది అనురాధ. కానీ ఇంతలో కృష్ణకి చూపు వస్తుందని తెలియగానే తన కూతురును అతని ఎదురుగా నిలబెట్టాలని అతన్ని అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు ఆ అనురాధ చిన్నాన్న. అంతవరకు లక్ష్మిగానే అతనికి సేవలు చేస్తూ ఆరాధిస్తున్న అనురాధ కృష్ణ కి చూపు వచ్చేసమయానికి పక్కకు తప్పుకుంటుంది. లక్ష్మి  చూపువచ్చిన కృష్ణకి ఎదురుగా నిలబడుతుంది.

ఇక్కడ కథలో క్లైమాక్స్ అన్నమాట. చూపుతో కాక మనసుతో ఆరాధిస్తున్న కష్ణ,  అనురాధకి బదులుగా నిలబడిన లక్ష్మిని తనను ప్రేమించిన, తనకి సేవచేసిన  అమ్మాయి  కాదని నిరాకరిస్తాడు. ఉద్వేగభరితమైన సన్నివేశం కొంత నడిచాక అనురాధ తిరిగి కృష్ణను చేరుకోవడంతో కథ ముగుస్తుంది.

పల్లెటూరువాళ్ళకు పట్నవాసం మీద మోజు ఎలా ఉంటుందో, ఆధునికతను అలవర్చుకోవడం కోసం  ఎలాటి తిప్పలు పడతారో, ఆ క్రమంలో వారి బలహీనతను పట్నవాసులు ఎలా డబ్బుచేసుకుంటారో  మనం ఈ సినిమాలో కూడా చూస్తాం - రేలంగి, డా. శివరామకృష్ణయ్య  వంటి పాత్రల ద్వారా.   చేష్టాగతమైన హాస్యం కన్నా, భాషాగతమైన హాస్యం మీద ఆధారపడిన సన్నివేశాల వలన సినిమాలో హాస్యం ఆరోగ్యకరంగా ఉంటుంది.  సంభాషణలు కూర్చిన రచయితల నేర్పు,  భాషమీద పట్టు  ప్రతి సంభాషణా శకలంలోనూ వెల్లడవుతుంది.. రేలంగి పాత్రకు డింగుటకా అనే ఊతపదం, రమణారెడ్డి పాత్రకు అంతేనంటావా అయితే సర్లే అనే ఊతపదం ప్రేక్షకుల నోటిలో చాలాకాలం నలిగి ప్రచారంలోకి వచ్చిన పదాలు.

ఈ సినిమాలో సంగీతపరంగా సాహిత్యపరంగా మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా సంభాషణలు, హృద్యమయిన సంగీతం, సాహిత్యపరంగా విలువైన  పాటల వల్లనే చాలా సాదాసీదాగా క్లుప్తంగా చెప్పగలిగే కథని  కూడా రెండున్నర గంటలు కూర్చొని సినిమాని ఆస్వాదించే విధంగా రూపొందించగలిగారు. ఈ సినిమాకి మాటల రచయితలు నార్లచిరంజీవి, ఆచార్య ఆత్రేయ.

సినిమాలో పాటలన్నీ ఇంచుమించుగా సూపర్ హిట్లే. పాటల రచయితలు నార్ల చిరంజీవి, శ్రీశ్రీ, ఆరుద్ర.. 

మొదటిపాట సావిత్రిని తన కలల నెచ్చెలిగా ఊహిస్తూ నాగేశ్వరరావుమీద చిత్రించిన
నా హృదయంలో నిదురించే చెలీ. అప్పటి తెలుగుసినీ సంప్రదాయం ప్రకారమే హీరో -  పియానో వాయిస్తూ పాడే పాట. విప్లవరచయితగా మంచి పేరు సంపాదించిన శ్రీశ్రీ  కలలుకనే యువకుడి మనసును ఇంత అద్భుతంగా ఆవిష్కరించి  చాలామందిని ఆశ్చర్యపరిచారుట. ఈ పాట బెంగాలీ సినిమాలో వచ్చే సన్నివేశానికి తగినట్టుగానే తెలుగులో కూడా అదే  ట్యూన్ లో స్వరపరిచారు సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావుగారు. ఘంటసాల సుమధురంగా ఆలపించిన గేయం ఇది.





తను ప్రేమించిన వ్యక్తిని మరొకరికి అంకితం చేయవలసిన విషమ పరిస్థితికి లోనైనప్పుడు అనురాధ మనసు ఎంతగా నలిగిపోయిందో  చెప్పే సందర్భంలోని పాట సావిత్రి మీద చిత్రించిన నీ చెలిమీ నేడె కోరితినీ.  ఈ పాట రచయిత నార్ల చిరంజీవి. సావిత్రి అభినయానికి వ్యాఖ్యానం అనవసరం అని అందరికీ తెలుసు. పైగా ఈ పాటలో ఏమిటి అసలు ఈ సినిమాలోనే సావిత్రి అందం, సౌకుమార్యం, నటన అద్భతం, ఆమె పట్ల కలిగే  ఆరాధనా భావం అనిర్వచనీయం

అప్పటి తెలుగు సినిమా సంప్రదాయం ప్రకారమే విందుతర్వాత వినోదకార్యక్రమంగా ఓ జానపద గేయం. ఏమంటావేమంటావోయి బావా అనే పాట.


ఈ సినిమా పాటల్లో ఆరుద్ర రాసిన ఓ పాట కమెడియన్ రేలంగి మీద చిత్రించిన ఓహోహో మామయ్యా పాట చాలా మంచి పాట. జూపార్క్ లో జంతువులను చూపిస్తున్నట్టే చెప్తూ మనిషిలోని భిన్న భిన్న ప్రవృత్తులను ఎంతో అలవోకగా చూపిస్తారు ఆరుద్ర. అప్పటినుంచే తెలుగు దేశంలో బతికిన కాలేజీ అంటే జూ పార్క్ అని ,చచ్చిన కాలేజీ అంటే  మద్రాసులోని మెడికల్ కాలేజీని తర్వాత కొంతకాలం  మద్రాసు మ్యూజియం  అనీ పర్యాయపదాలుగా చెప్పుకోవడం చూస్తాం. 


అలాగే మరోపాట ఆడదాని ఓరచూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడూ అంటూ సాగే క్లబ్ సాంగ్ లో కూడా చాలా జీవితసత్యాలు వెల్లడించారు ఆరుద్ర. తెలుగు ఇంగ్లీషుపదాల కలగలుపుతో ఆరుద్ర మార్కు  మంచి ఊపుగా సాగే పాట ఇది. రేలంగి, గిరిజ పాత్రల మధ్య సాగే ప్రణయ సన్నివేశంలో భాగంగా ఇంగ్లీషులోన మారేజీ పాట కూడా మరో ఆరుద్రమార్కు పాట.

గుడ్డివాడయిన కృష్ణకు సేవ చేస్తూ అనురాధ పాడే జోలపాటగా వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా  సుశీల గొంతులో మాధుర్యాన్నంతా జతచేసుకుని మంచి సాహిత్యంతో మెలోడియస్ గా వీనుల విందు చేస్తుంది. ఈ అద్భుతమైన లాలి పాట శ్రీశ్రీ కలంనుంచి జాలువారింది.


సినిమాలో కథాబలం తక్కువే అయినా , సగం సినిమా అంతా హీరో గుడ్డివాడే అయినా, పాత్రల ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడంలోను చక్కని తెలుగుతనం ఉట్టిపడే విధంగా మంచి సామెతలు, తెలుగు నుడికారానికి తగినట్టు సందర్భోచితంగా సాగే సంభాషణల విషయంలో తీసుకున్న శ్రద్ధ, నాటకీయమైన సన్నివేశాలలో కూడా నటీనటుల శృతిమించని నటన సినిమాకు మంచి బలం తెచ్చిన అంశాలు.

ఒక వ్యక్తిని ప్రేమించడం, ఆరాధించడం అంటే కేవలం మాటలలో చెప్పడం  కాదని,  మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా  ఆత్మార్పణం చేసుకోవడం అనీ  వారి సౌఖ్యంకోసం, సంతోషం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేయడం అనీ  అనురాధ పాత్ర నిరూపిస్తుంది. ఆ విధంగా ఈ సినిమా పేరు కూడా సార్థకమయింది.

04 February 2012

కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే !!

.హలో హలో బ్లాగు మిత్రులారా, ఇంకా చాలా  బోల్డు మంది మాజీబజ్జు మిత్రులారా, ప్లస్సు ప్లస్స్ మిత్రులారా!!


ఉపన్యాసమో, సాహిత్యంమీద చిరు వ్యాసమో అనుకొని పారిపోతున్నారా..హబ్బే లేదు. ఆట్టే బోరు కొట్టే విషయం కాదులెండి. లైట్ గానే ఉంటుంది. కాస్త హెల్దీ కూడాను. ఓ మాటిటు రండి చెప్తాను.

మరే - నిన్న నాకు ఓ ఆదివారం అదే  అల్లప్పుడు న్యూఇయర్ రోజున, ఆ జనవరి ఆదివారం ఆంధ్రజ్యోతి కాపీ ఓ మిత్రుడింట కంటపడింది. మన వాళ్ళందరి బ్లాగు పోస్టులూ ఎత్తిపోతల పథకంలో యాతమేసి తోడేసుకొని కనీసం  ముందస్తుగా ముందుమాటయినా అడక్కుండా,  ఆముక్క ముందుమాటలోనయినా రాయకుండా వాడు చేసిన పని మళ్ళీ మళ్ళీ అలా కళ్ళముందు కనిపిస్తూ ఉంటే ఒళ్ళు ఎలా మండిందనుకున్నారూ. పైగా  “నవ్వొస్తే ఆ బ్లాగ్ స్పాట్లు తెరిచి వాళ్ళకు షుక్రియా చెప్పండి. లేదండే గప్ చుప్ సాంబారు బుడ్డీ అని ఓ కొసరుమాటొకటీ. అగ్నిమీద ఆజ్యం పోసి మండించడమా మరీనా.

సరే దీనికంతటికి ఈ రైటుక్లిక్కూ,   ఆ కంట్రోలు సి, కంట్రోలు వి లే  కదా కీలకాలు అనుకున్నాను. అందుకే నా కంప్యూటర్ తెలివి లోంచి  కొంచెం తీసి (అమ్మమ్మ ఇచ్చిన ఆవకాయ,  జాడీలో ఎంతున్నా హార్లిక్సు సీసాడే తీసి వాడుకోడం అలవాటు కదా మనకి)  తెలిసినంతలో వెతికితే ఓ మార్గం దొరికింది. ఈ రెండు మార్గాలను నివారించి కనీసం మనలాగే  పేద్దగా కంప్యూటర్ నాలెడ్జీ లేని  విలేర్ల కయినా, లేదా ప్రొఫైల్లో కవితలు,  కథలూ రాయడం హాబీ అని ముందస్తుగా రాసేసుకుని తీరా ఏం రాయాలో తెలీక "వండుకున్నమ్మకి ఒకటే కూర, దండుకున్నమ్మకి అరవై నాలుగు వెరైటీలనే" సామెతని బాగా సాధన చేసేసి వచ్చి ఇరుగింట్లోంచి పొరుగింట్లోంచి కావలసినవన్నీ ఎత్తుకొచ్చేసి , "ఇదిగో ఇది నాదే" అని గాఠిగా అరిచ్చెప్పే అరువు బ్లాగర్లనుంచి   బ్లాగు పోస్టులని కొంచెం దాచుకుని  అందీ అందకుండా ఊరించి కుంచెం  కుంచెం ఏడిపిద్దాం అనుకున్నవాళ్ళ కోసం అన్నమాట ఇది. 

కోతికి కొబ్బరికాయ దొరికితే ఆకలేసినప్పుడు పనికొస్తుంది లెద్దూ అనూరుకుంటుందా . ఉండదు కదా. అందుకే మన బ్లాగర్లలో తోచిన వాళ్ళ బ్లాగులు తీసి కాపీ, పేస్టు చెయ్యడం మొదలు పెట్టాను.
చిత్రం...  చూద్దునుకదా..
కొత్తావకాయ, తోటరాముడు, నవ్వితేనవ్వండి, మధురవాణి, కృష్ణప్రియ డైరీ, నా స్పందన, జాజిపూలు,  వైయేరమణ, రానారె , గోలిసోడా,

కొత్త  సంవత్సరం పొద్దున్నే మనవాళ్ళందరికీ మూడు, మూడుముక్కలు చేసి పడేసి,  ఆంధ్రజ్యోతివాళ్ళు ఎత్తి పెట్టేసి అచ్చేసిన టపాలున్న  బ్లాగులివన్నీ....  అన్ని   బ్లాగిళ్ళకీ వెళ్ళొచ్చా.... అక్కడ ఎత్తి పోతల పధకం సవ్యంగా పారేందుకు సకల సదుపాయాలు అలరారుతూ కనిపించాయి. వేటికీ కనీస రక్షణలేదన్న సంగతి గమనించి "హడ్డెడ్డే....ఇక్కడుందన్నమాట విషయం" అనుకున్నాను.  మామూలు కంప్యూటర్ జ్ఞానం ఎబిసిడితో ఆగిపోయినవాళ్ళకి కూడా తెలిసిపోయే చిట్కాలతో ఇంతింత వజ్రపుతునకలు  అమాంతంగా, అయాచితంగా  అందుతుంటే వద్దనుకునే తలకు మాసినవాడెవడుంటాడు మరీ. ఆంధ్రజ్యోతి ఒక్క విషయంలో అయితే ఒకేసారి పేర్లతో సహా వెయ్యడం వల్ల పోల్చుకున్నాం కానీ ఇంకా ఎన్ని బ్లాగుల్లో ఎన్నిటపాలు పట పటమంటూ పత్రికల్లో ఈపాటికే రాలిపోయాయో.
రాలిపోయే పువ్వా.. నీకు రాగాలెందుకే అంటూ వాటిమీద ఆశలూ, నీళ్ళూ, నువ్వులూ వదిలేసుకోకుండా ఏదేనా చెయ్యొచ్చుకదా ..కనీసం టెంపరవరీగానయినా.

అందుకే బ్లాగు మిత్రులారా, మాజీ బజ్జు మిత్రులారా, ప్లస్స్ ప్లస్సు మిత్రులారా !!
ఒక్కమాటు ఇటురండి. ఒక్కమాట వినిపొండి.
మన  జాతీయబ్లాగు సంపదని విజాతీయులు జాతీయం చేస్తుంటే ఊరికే గుడ్లప్పగించి చూడాలా...ఇంకానా ఇకపై చెల్లదు...... అంటూ నినదించద్దూ..సరదాకైనా.
అబ్బబ్బబ్బ... అరిచీ, పిలిచీ అలిసిపోయాను కానీ. ఇలా చూడండి. ఇక్కడ వరసాగ్గా నేను చెప్పినట్టు స్టెప్పులేసి చెప్పిన మాట వినండి మరి.

ఇది మీ బ్లాగులోని కంటెంట్ ని సెలెక్టు చేసి కాపీ చేసి ఎక్కడంటే అక్కడ పేస్టు చేయడానికి వీల్లేకుండా చేసే కోడ్.

మీబ్లాగింటి బెల్ కొట్టి లోపలికి ( సైనిన్ చేసి)  అలా ఎంటరయిపోవడం.
కుడిపక్క కనిపించే మీటల్లోంచి-
డిసైన్  అన్నది ఎంచుకొని, అందులోనుంచి  ఇప్పుడు పేజి లే అవుట్ అనే దాన్ని ఎంచుకోవడం.
పేజి లే అవుట్ లో న్యూ గాడ్జెట్ ని  ఎంచుకోవడం.
మీ బ్లాగులో చేర్చదగినవంటూ వచ్చిన  (వీటిని విడ్జెట్టులంటారు లెండి) లిస్టు లోంచి హెచ్ టి ఎం. ఎల్ కోడ్ మీద నొక్కడం.
అప్పుడు వచ్చిన బాక్స్ లో (పైన పేరు పెట్టడానికి ఉన్నట్టు హెడ్డింగ్ కి జాగా ఉంటుంది వదిలేయండి) కింద భాగంలో ఇక్కడ నేనిచ్చిన కోడ్ ని కాపీ చేసి (రైటుక్లిక్కుతో మౌస్ని నొక్కి కాపీ అన్నదాన్ని ఎంచుకుని లేదా       కంట్రోలు ప్లస్ సి తో కాపీ చేసిగాని),  మళ్లీ  ఆ  మీ బ్లాగులో పేస్టు( రై ట్ క్లిక్కు నొక్కి పేస్టుఅన్నదాన్ని ఎంచుకుని లేదా కంట్రోల్ ప్లస్ వి నొక్కి) చేయడం 
చేసిన తర్వాత సేవ్ అనడం అంతే.

సేవ్ అయిన తర్వాత ఒక్కసారి మీ బ్లాగులోని విషయాన్ని కాపీ చేద్దామని చూడండి...హుర్రే..

ఓసారి కమిటయితే మీ బ్లాగే మీ మాట వినదు మరి.
ఇదీ అలా అతికించాల్సిన కోడ్.
( ఈకోడ్ ని కాపీ పేస్టు చేస్తే తప్పులేదా అని అడక్కండేం...అఘముఁ బొందడధిప.. అంతే )  





























ఇదిగో ఇక్కడ ఈ పేజీలో  http://www.itechcolumn.com/2011/11/how-to-disable-copy-text-on-blogger.html  ఇంగ్లీషులో ఎలా చెయ్యాలో వివరంగా ఉంది. ఈ కోడ్ ని నా బ్లాగులో కాపీ పేస్టు అవకుండా ఎవరో కానీ కుట్రపన్నేరు.  ఇలాక్కాదని చెప్పి ఇమేజ్ ఫైల్ పెట్టాను. కానీ మరి మనకి పని కాదు కదా..అందుకనీ ఈ వెబ్ సైట్ లో చెప్పినట్టు చేసేసి ఆ కోడ్ ని గాఠిగా అతికించేయండి.


మీరు  ఇలా ఈ కోడ్ ని చెప్పినట్టు చెప్పిన చోట అతికించారనుకోండి...కొంచెం సేపు కాలరెగరేయొచ్చు.
నా అంతవాడు నేనే అనుకుంటూ బుడుగ్గాడి బ్రదర్లా పోజివ్వచ్చు. దీనికి తగ్గ  చిట్కాలు అవీ వాళ్ళు (అదే ఆ  విజ్ఞత గల దొంగలు)  ఆనక కనిపెట్టుకుంటారనుకోండి. కానీ అందాకా  మనకదో తుత్తి కదా.

సరే........ఇది చేసాం. దొంగతనానికొచ్చినవాడు మన సొమ్ముని ఎత్తుకుపోలేడు...అనుకుందాం. కానీ కంప్యూటర్ జ్ఞానంలో ఏబీసీడీలు తో పాటు జీహెచ్ఐజే లు కూడా  నేర్చేసుకుని ముందుకెళ్ళిన బ్లాగర్లు కొంచెం సందేహపడొచ్చు. మరి ఆ దొంగసారు వాడు మన పోస్టుని స్క్రీన్ షాట్ తీసేసుకుని, ఎత్తి రాసేసుకుని మరీ ఎత్తుకుపోతేనో అని...

హహ..కానీ  ఈ దొంగదారికి మాత్రం మంచి అడ్డ దారి నాకు తెలీదు. ఫర్లేదు...స్క్రీన్ షాట్లనే ఫెసిలిటీలు ఉన్నా వాటిలో  వాడికంత తెలివో, కనీసం  ఓపికో ఉంటే  ఎత్తి రాసుకునే బదులు సొంతంగా రాసుకుంటాడు లెండి.

లేదంటారా......
ఆమాత్రం కష్టపడి కాపీ కొట్టినందుకు చప్పట్లు కొట్టి అభినందిద్దాం..(ఇంకేం చేయలేం గనుక...) రావిశాస్త్రిగారి కష్టార్జితం కథలో  దొంగ  ఇంట్లో దూరి తన కష్టార్జితం  సొమ్ముమొత్తం దోచుకెళ్ళాడని బాధపడుతున్న ఇంటి యజమానిని ఓదార్చడానికి పక్కింటివాడు వచ్చి 'రాత్రంతా కిటికీ ఇనపఊచలు కోసి  ఆ దొంగ ఎంత కష్టపడ్డాడో..వాడికి కష్టార్జితం గొప్పగా దొరికిందని ఎందుకు అభినందించకూడదూ'  అని అనుకుంటాడు. అలాగే మనం కూడ ఓ నిట్టూర్పు విడిచి సంతోషించొచ్చును లెండి.

ఇదిగో సాఫ్ట్ వేరు కుర్రాళ్ళూ...ఇది నేనిక్కడ చెప్పానని, "ఓ గొప్ప, మాకు తెలీదా" అని అనుకుని ఊహూ తెగ ఫీలయిపోయి మరీ కోపం తెచ్చుకోకండేం. ఇది చాలా చిన్న విషయమని దీనికి కూడా మరో విరుగుడు( అదే మళ్ళీ కాపీ చేసేమార్గం) కూడా ఉందని అనొచ్చు మీరు. కానీ ప్రస్తుతానికి మాకీ మందు చాలు. మీకు తెలిసినవి మరోసారి,  మాకోసారి చెప్పండి మరి.
( ఏంటీ..ఇన్నీ చెప్పి- శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందిట లాగా నేను ఎందుకు ఈ కోడ్ పెట్టుకోలేదూ అనుకుంటున్నారు కాబోలమ్మా... కొందరు పరిశోధకులు. మరేంలేదు. మహాత్ములేం చేసినా  లోక కల్యాణం కోసమే...మరి నేనురాసిన కోడ్ కాపీ పేస్టు కాకపోతే నా పోస్టు గతేం కానూ...? )

ఇంకా కావాలంటే ఇస్తాలే...నావన్నీ ఇక నీవేలే... అంటూ ఇలా కాస్త తెలిసినవాళ్ళంతా,  కాస్తే తెలుసున్న వాళ్ళకి కాస్త కాస్తన్నా జ్ఞానామృతం పంచిపెడితేనే గానీ,  లేకపోతే ఆ అమృతం కాస్తా విషమయిపోదూ.