29 April 2011

అలా మొదలైంది....ఇలా ముగిసింది

అలా మొదలైంది....ఇలా ముగిసింది !!
(ముఖపుస్తకంలో ఓ పేజీ.....)

"క్లియర్ అడిక్షన్స్ " అనే బోర్డు రాసి ఉన్న క్లినిక్ ముందు ఓ కారు వచ్చిఆగింది . అందులోంచి సుమారు అరవైఏళ్ళ వయసు గల ఓ స్త్రీ, మెల్లగా కారు దిగి ఆ క్లినిక్ లోకి  ప్రవేశించింది. అక్కడ పెద్ద హాలు, పక్కనే అనేక గదులు ఆనుకొని ఉన్నాయి. 
ఆ క్లినిక్ -వ్యసనాలను ఒదుల్చుకుందామనుకునే వారి పాలిటి వరప్రదాయిని. అలాంటివారికోసం ఏర్పాటుచేసిన రకరకాల విభాగాలు,  వాటిపేర్లు ఆయా గుమ్మాల బయట రాసి ఉన్నాయి. హీరోయన్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(HAD), స్మోకింగ్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(SAD), బింగో అడిక్షన్ డిపార్ట్ మెంట్(BAD) ఇలా పేర్లు చదువుతూ ఆఖరికి ఒక గుమ్మం ముందు ఆవిడ ఆగింది.
 అక్కడ ఫేస్ బుక్ అడిక్షన్ డిపార్ట్ మెంట్(FAD)  అని రాసిఉన్న గుమ్మం లోంచి నడుస్తూ ఓ పెద్ద హాల్లోకి అడుగు పెట్టింది.  ఆ క్లినిక్ మొత్తానికి చాలా జనసందోహంతో నిండి పోయిన హాల్ అదే. ఎప్పుడూ కనీసం రెండు మూడు డజన్లమంది జనం డాక్టరు సలహా కోసం ఆ హాల్లో వేచి ఉంటారు. 

 ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న  జనంలో  రకరకాల వయసుల వాళ్ళున్నారు. ఎక్కువమంది యువతరాలనికి చెందినవాళ్ళే.  చాలామంది ముఖాల్లో ఒక ఉదాసీన భావం కనిపిస్తోంది. కొందరు తమ చేతుల్లోని ఐ పాడ్ లు, బ్లాక్ బెర్రీ ఫోన్ల వంక తదేకంగా చూస్తూ  ఉన్నారు. కొంతసేపు గమనిస్తే ఆ చూపులు అభావం అనే భావం  కాక వెర్రిగా ఉన్నాయి అనిపించే   అవకాశం ఉంది. 

ఆ హాల్లో ఒక వ్యక్తి అదే పనిగా పచార్లు చేస్తూ ఏదో గొణుక్కుంటూ  కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. నోట్లో ఏదో చిన్నగా సణుగుతూ ఉండడం కూడా వినిపిస్తుంది కొద్దిగా పరిశీలించి చూసే వాళ్ళకి. ఆ సణుగుడు లో వినిపించే గుడు గుడు శబ్దాన్ని మన మాటలతో తర్జూమా చేసుకుంటే ఇలా వినిపిస్తుంది.
' నా ఆవు...నా ఆవు ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి పాలు పితకాలి...వెళ్ళాలి. వెళ్ళాలి'  అని అంటున్నాడని కూడా తెలుస్తుంది.
అక్కడ ఒక యువకుడు రెండు  అర చేతుల్లో ముఖం దాచుకుని కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపు పరికించి చూస్తే అతను తన రోదనని ఇతరులు చూడకుండా ఉండడానికి అలా ముఖం దాచుకుని ఉన్నాడని అర్థం చేసుకోగలం.
అతని పక్కన ఉంగరాల జుట్టుతో ఉన్న ఒక స్త్రీ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తోంది.
కొంచెం ఓపిక పట్టు..అంతా సర్దుకుంటుంది అంటూ.
నాకు అర్థం కావడం లేదు. నేను నా వ్యాఖ్యని పెట్టి ఇంతసేపయింది. అమోఘం అంటూ జవాబు వస్తుందనుకున్నాను.  ఒక్కడయినా ఇంతవరకూ  నచ్చింది అంటూ రాయలేదు.
 కనీసం లైక్ అనే బటన్ కూడా నొక్కలేదే. ఎందుకు..ఎందుకు...?” అంటున్నాడా యువకుడు ఆవేశం, నిరాశా, నిస్పృహలతో మిళితమయిన గొంతుతో.

సరే..సరే. ఊరుకోమన్నాగా.  ఇంతకీ నువ్వు ఆ వ్యాఖ్య పెట్టి ఎంతసేపయింది?” అని అడిగింది ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి.
ఐదు నిముషాలయిపోయింది పూర్తిగా.  నిజజీవితంలో అయితే అది ఐదు నెలలకి సమానం. తెలుస్తోందా నీకు?” కోపంగా అంటూ మళ్ళీ విషాదంగా తన అరచేతుల్లో ముఖం దాచేసుకున్నాడు ఆ యువకుడు.

అరవై ఏళ్ళ ఆ స్త్రీ  అక్కడ కూర్చుని  తన పేరు పిలిచే వరకు ఎదురు చూసింది. తన పేరు వినబడగానే రిసెప్షనిస్టు వెనక నడిచి  ఫేస్ బుక్ కౌన్సిలర్ స్నేహమయి”- టేబిల్ కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.
చెప్పండి...ఇది మొదలై ఎంతకాలమయింది చిరునవ్వుతో అడిగింది కౌన్సిలర్.
అసలు దీనికంతా కారణం మా మనవడే ...మొదలు పెట్టింది ఆవిడ.
నాకు ఇంతకు ముందు ఈ ఫేస్ బుక్ అంటే ఏమిటో తెలీదు. కానీ నా మనవడు దీనిని పరిచయం చేసాక అనుకున్నాను ఇది నా కోసమే అని. ఎందుకంటే నేనెప్పుడూ పుస్తకాలు ఎక్కువగా చదువుతానుగా, నా ముఖాన్ని ఎప్పుడూ  పుస్తకంలోనే ఉంచుతాను. ఫేసు బుక్ అంటే అదే అనుకున్నాను.
 
సరే. మీరు దీనికి అలవాటు పడడానికి ఎంతకాలం పట్టింది”? అడిగింది కౌన్సిలర్.
అబ్బే...ఎంతో కాలమా...ఒక ప్రొఫైల్ రూపొందించడానికి ఎంతసమయం పడుతుందీ...అంతే. ఫేస్ బుక్లో రోజుకి కనీసం ఏడెనిమిది సార్లయినా నా ముఖం చూసుకుంటూ ఉంటాను నేను. ఎక్కువగా రాత్రిళ్ళు.
ఒక్కోసారి అర్థరాత్రి కూడా లేచి చూస్తుంటాను...ఏమో విదేశాలలో ఉండే నా స్నేహితులు ఏమయినా కొత్తవిషయాలను పెట్టి ఉంటారేమోనని. కానీ మా ఆయనకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. స్నేహం చాలా విలువయినది..ఎక్కడంటే అక్కడ దాన్ని వెతుక్కోకూడదని ఆయన ఉద్దేశం.
ఫేస్ బుక్ లో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి?” అడిగింది కౌన్సిలర్.
"అబ్బో... ఒకటా, రెండా. చాలా ఉన్నాయి. ఫేస్ బుక్ నా జీవితానికే ఓ వరంలా అనిపిస్తుంది.ఎందుకంటే నిజజీవితంలో నాకు ఐదుగురు మాత్రమే ఉన్నారు స్నేహితులు. మరి ఫేస్ బుక్ ద్వారా నాకు ఎంతమంది స్నేహితులో తెలుసా ?  కనీసం 675 మంది స్నేహితులున్నారు. అందులో ఇంకా ఒక గొప్ప స్నేహితుడు కూడా ఉన్నాడు తెలుసా
ఎవరేమిటి అతను..ఎందులో గొప్పవాడు అడిగింది కౌన్సిలర్.
ఎందులో ఏమిటి? అతనికి 4000మంది స్నేహితులున్నారు తెలుసా. అంతమంది స్నేహితులున్నారంటే అతను గొప్పవాడేనన్నమాట.
ఊ...అయితే ఫేస్ బుక్ వల్ల మీ స్నేహాలు వృద్ధి అయ్యాయన్నమాట.
అవును. ఫేస్ బుక్ వల్ల నా పాత స్నేహితులెందరినో నేను కలుసుకున్నాను. వాళ్ళు జీవితంలో ఏమేం చేసారో, ఎలా బ్రతికారో అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. అంతే కాదు, ప్రస్తుతం వాళ్ళ జీవితంలో అనుక్షణం చేస్తున్న పనులన్నీ నేను తెలుసుకుంటున్నాను. వాళ్ళు ఏసినిమా చూసారు, శలవలెలా గడిపారు, ఏం వండుకుని తిన్నారు.ఇలా అన్నీ వెంట వెంటనే తెలుస్తాయి నాకు. అంతే కాదు నేను వాళ్ళతో కలిసి ఎన్నో ఆటలు కూడా ఆడుతూ ఉంటాను.
 
ఓహ్..నాకు తెలుసు.. ఆ ఆట ఫార్మ్ విల్లీ !! కదూ?!”.
కాదు. మాఫియా వార్స్. ఆ ఆటలో నన్ను కొట్టగలిగేవాడే లేడు తెలుసా?!”
ఆ స్నేహితులలో ఎవర్నయినా కలిసారా మీరు అడిగింది కౌన్సిలర్.
ఊహు. లేదు..ఎందుకూ ? ఫేస్ బుక్లో రోజూ చూస్తూనే ఉంటాగా. నిజానికి వాళ్ళను ప్రత్యక్షంగా కలవడం కంటే ఫేస్ బుక్ లో కలుసుకోవాలంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళకోసం ప్రత్యేకంగా ఏరకంగా తయారవక్కరలేదు... పెర్ ఫ్యూమ్ వాడక్కరలేదు. మంచి బట్టలు వేసుకోనక్కరలేదు. స్నానం కూడా చెయ్యక్కర్లేదు. నిజానికి నాకు ఫేస్ బుక్లో నచ్చింది అదే. ఎవరి ముఖం చూసినా ఎంతో స్వచ్ఛంగా అందంగా ముద్దుగా ఉంటారు. అందరూ వాళ్ళ ప్రొఫైల్ లో మంచి ఫోటోలు పెడతారుగా."
"మరి మీరు మీ ప్రొఫైల్ కి ఏం పెట్టుకున్నారు?” అడిగింది కౌన్సిలర్.
నేను కనీసం ఐదారు గంటలు వెతికాను, ఏ ఫోటో పెడదామా అని..ఇంటర్నెట్ కూడా వెతికాను. ఆఖరికి బ్యూటి క్లినిక్ కి కూడా వెళ్ళాను.
అవునా..ఓహో..మీ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి కదూ.
కాదు. అక్కడున్న ఒక అందమైన అమ్మాయి ఫోటో కోసం. నేను ఇప్పుడు అదే వాడుతున్నాను, నా ప్రొఫైల్ ఫోటోకి.
మరి మీ స్నేహితులు మీ ఫోటో చూసి ఆశ్చర్యపోలేదూ..మీలో ఈ మార్పేమిటి అని....”!అడిగింది ఆశ్చర్యంగా కౌన్సిలర్.
ఆ...ఆ...కొంతమంది పోల్చుకుని అడిగారు. నా యవ్వన రహస్యం ఏమిటి? అని. రోజూ యోగాసనాలు వేస్తానని చెప్పి నమ్మించానులే.
సరే. ఈ ఫేస్ బుక్ అలవాటు మీకు ఓ సమస్యగా మారబోతోందన్న అనుమానం ఎందుకొచ్చింది మీకు?”
అడిగింది కౌన్సిలర్.
క్రిందటి ఆదివారం నేను ఫేస్ బుక్ చూస్తూ ఉండగా ఒక సందేశాన్ని గమనించాను. అది నా భర్త దగ్గరనుంచి నాకు వచ్చినది.  నా వాల్ మీద ఉన్న ఆ సందేశం అప్పుడే నేను చూసాను.

అవునా...ఏమని ఉందా సందేశంలో?” అడిగింది కౌన్సిలర్ కుతూహలంగా.

"నేను ఇల్లువిడిచి పెట్టి వెళ్ళి అయిదు రోజులయింది. ఈ విషయం నీ అంతట నువ్వు తెలుసుకుంటావేమోనని చూస్తున్నాను"- అని రాసారాయన"
" నిజమా. మరి మీరేం చేసారు అప్పుడు ? ఏం జవాబు రాసారు? " ఉత్సాహంగా అడిగింది కౌన్సిలర్.

"ఏముందీ..వెంటనే ఆయనను 'అన్ ఫ్రెండ్'  చేసేసి తెగతెంపులు చేసేసుకున్నా....ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా."

 ఇప్పుడు కౌన్సిలర్ ముఖం భావరహితంగా ఉంది.

(వ్యాసంగం నుంచి వ్యసనంలోకి మారిన అంతర్జాల మాయాజాలంలో మన పాత్రని పునరాలోచించుకోవాలని భావిస్తూ, ఒక జాలసందేశంలోని ముఖ్యాంశానికి నా పైత్యం జోడించి రాసినది ఇది. అసలు కాళిదాసు ఎవరో వారికి కృతజ్ఞతలు)

12 April 2011

ఆరుద్రామాయణం...

రామాయణం అంటే ఏమిటి.
రామాయణం...రామ అయనం...రాముడి ప్రయాణం.
సామాన్య మానవుడిగా అవతారం దాల్చి సకల జన సమ్మితంగా ఆదర్శాలు వెలయించి లోకాభిరాముడు అయిన రాముడి కథ.....రామాయణం.

రామాయణం కథని  క్లుప్తంగా చెప్పమంటే ఏముందీ...కట్టె ..కొట్టె...తెచ్చె అన్నాడట ఒకడు.
అదేమిటీ అంటే సీత మెడలో తాళి కట్టె,  ఆమెని  లంకకి ఎత్తుకొని పోయిన రావణాసురుని పదితలలను కొట్టె,
సీతని తిరిగి తెచ్చె అని వివరణ ఇచ్చాడుట.
రామాయణంలో రాముడి గొప్పతనాన్నంతా ఒక మూడు చరణాల పాటలో ఇమిడ్చి చెప్పిన అద్భుతమైన పాట గా
మీనా సినిమా కోసం ఆరుద్ర రాసిన   శ్రీరామ నామాలు శతకోటి  పాట అనిపిస్తుంది నాకు.


ఆరుద్ర నిజానికి వామపక్ష భావాలు కలిగి, అభ్యుదయ సాహిత్యయుగంలో అభ్యుదయ సాహిత్యధోరణులలో రచనలు చేసిన కవి.  కానీ సినిమాలలో  ఆయన అవసరార్థం (ఆర్థిక)  రాసినవే అయి ఉండవచ్చు కానీ ఆయన రాసిన భక్తి పాటలు  సినిమాకథలకు సంబంధించి అవి ఎంతగానో సందర్భోచితంగా ఇమిడిపోయి, తెలుగువారి అధరాలపై చిరకాలం పాడుకునే పాటలు గానే  కాక కలకాలం నిలిచిపోయేలా  తెలుగు హృదయాలలో చెరగని ముద్ర వేసాయి.

అంత్యప్రాసలు ఆరుద్ర ప్రత్యేకత. దానికోసం ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం చేయకుండానే కవిత్వంలో అత్యంత  సహజంగా వచ్చి ఆయన కవితలో ఇమిడిపోతాయి అనిపిస్తుంది. తేట గా ఉండే తెలుగు పదాలు, సామాన్యులకు సైతం అర్థమయే భాష , అర్ధవంతమైన పదాలతో తెలుగు సినిమా పాటకు పట్టం కట్టారు ఆరుద్ర.

మీనా  సినిమా కోసం ఆయన రాసిన పాట చూడండి.
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహు తీపి....బహుతీపి...

అని పల్లవితో మొదలవుతుంది. శ్రీరాముడికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా కొలవబడే వాడు. ఆరాముడికి ఆ పేర్లు ఎలా వచ్చాయో , ఎందుకు వచ్చాయో వాటి సార్థక్యం ఏమిటో చరణాలలో వివరిస్తారు ఆరుద్ర.

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరథ రామయ్య స్తవనీయుడు

రాముడిని దశరథరాముడు  అని ఎందుకంటాం. దశరథుడి కొడుకు కనుక అని చెప్పుకునే అర్థం. కానీ తండ్రి మాటని మనస్ఫూర్తిగా పాటించి, పితృవాక్యపాలనను కర్తవ్యంగా స్వీకరించాడు కనుక కొడుకు అంటే రాముడిలా ఉండాలి అని తెలుగు  ప్రజలు కోరుకునేవాడు దశరథ రాముడు.

పితృవాక్య పరిపాలన చేయడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాముడు స్తవనీయుడు...పొగడదగిన వాడు. 

కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణ రామయ్య కమనీయుడు

రాముడు  జనకుడి ఇంట జరిగిన స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టి విలువిరిచి సీత ని గెలుచుకున్నాడు. సీత చేత వరమాల వేయించుకొని కళ్యాణ రాముడయ్యాడు. సీతారామ కల్యాణం లోకులందరికీ ఆనందదాయకం. ఆ జంట చూపరులకు  కమనీయం. రాముడు సీత  మెడలో మూడు ముళ్ళు వేసి తాళి కట్టి సీతారాముడయ్యాడు.

సుదతి జానకి తోడ శుభసరస మాడేటి
సుందర రామయ్య  సుకుమారుడు




సుందరి, సుకుమారి అయిన భార్య సీత తో సరసమాడే వేళ ఆ రాముడు బహు సుందరుడట.

కానీ అదే రాముడు -
కోతిమూకలతో లంకపై దండెత్తు 
కోదండ రామయ్య రణ ధీరుడు...రణధీరుడు.



తన సీతను పదితలల రావణాసురుడు తీసుకుపోయి బంధించిన వేళ అతని చెరనుండి విడిపించి  కోదండరాముడై (కోదండం అంటే విల్లును ధరించి)  రణ ధీరుడని పించాడు. 

ఇక్కడితో రావణాసురుని కొట్టడం అంటే రావణ సంహారం పూర్తయింది. 

సీతా లక్ష్మణ సమేతంగా కోతిమూకతో పాటు అయోధ్య చేరుకున్న రాముడు పట్టాభిషేకం జరుపుకున్నాడు.
రారాజుగా, చక్రవర్తిగా ప్రజలమన్ననలందుకున్నాడు.

ఇక్కడ మనకి చిరపరిచితమైన  శ్రీరామ పట్టాభిషేకం పటం గుర్తొచ్చేలా వర్ణన సాగుతుంది. 

పవమాన సుతుడు పాదాలు పట్టగా
పట్టాభి రామయ్య  పరంధాముడు

అక్కడ ఆంజనేయస్వామి శ్రీరాముడిని స్వామిగా నమ్మి ప్రభుభక్తితో వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న దృశ్యం మనసులో నిలుస్తుంది.

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు...   అఖిలాత్ముడు....
ఆవిధంగా  ఈ అవనిపై శ్రీరామస్వామిని భక్తిగా పూజించి సేవించే సకల జనులకు ముక్తి కలిగించే వాడు.

 సకల భువనాంతరాళలో వ్యాపించి ఉన్న అఖిలాత్ముడు రాముడు.  ఇక్కడ ఖిలం అంటే నాశనమే, అఖిలాత్ముడైన రాముడు అచ్యుతుడు .అక్కడ కూడా చ్యుతి అంటే నాశనం కనుక అది లేని రాముడు....అచ్యుతరాముడు.
ఆహా....కట్టె...కొట్టె...తెచ్చె అన్నంత సులువుగా రామాయణాన్ని ఒక పామరుడు ఎలా వ్యాఖ్యానం చేసాడో  అదే మార్గంలో తన పాండిత్యంతో 
శ్రీరాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలని అతని సార్థక నామధేయత్వాన్ని,
 పండిత పామర జనకంగా చేసి పాటగా మార్చి  ఆరుద్ర గారు మనకిచ్చిన ఓ బంగారు  కానుక - ఈ పాట.

శ్రీ రాముడి  జీవిత వ్యాఖ్యానంగా ఆరుద్ర రచించిన ఈ పాట-
శ్రీ రామనవమి సందర్భంగా ఆ సకల సుగుణాభిరాముడైన సీతారాముడికి  పునరంకితం.
మీనా చలన చిత్రంలో ఓ సన్నివేశం కోసం ఆరుద్రగారు రాసిన ఈ పాటని ఈ లింక్ లో వినవచ్చు. ఆడియో అంత బాగులేదు. క్షమించాలి.
కేవలం ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ అందమైన పాటకి కమ్మని సంగీతం సమకూర్చిన వారు శ్రీ రమేష్ నాయుడుగారు.


02 April 2011

సమయానికి తగు పాట పాడెనే...




తెలుగు నవలలు, కథలు ఉధృతంగా వస్తున్న రోజుల్లో(అంటే 1960 ప్రాంతాలలో అనుకోవచ్చు)  ఆ సాహిత్యంలో సాధారణంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే...సందర్భోచితంగా రేడియోలో ఓ పాట వస్తూ ఉండడం. అంటే హీరోయిన్ కడుపుతో ఉందనుకోండి..(అంటే ప్రెగ్నేంట్ అనాలి ఇప్పటి వాళ్ళకోసం) హీరోయిన్ అద్దంలో చూసుకుంటూ అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు అని పాడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ పాటద్వారా ఆమె చెప్పదలచుకున్నది మిగిలిన వాళ్ళకు తెలుస్తుందన్నమాట. అలాగే పాత్రల మానసిక పరిస్థితిని బట్టి రేడియోలో భగవద్గీతలోని  కర్మణ్యే నో, యదా యదాహి ధర్మస్య అనో  ఏదో ఒక శ్లోకం వస్తూ ఉండాలి. దాంతో ఆ పాత్ర ప్రేరణ పొంది ఏదో మార్పు తెచ్చుకుంటుంది. ఇంట్లో బామ్మగారు పూజ చేస్తూ ఉంటే  కౌసల్యా సుప్రజా రామా అన్న బేక్ గ్రవుండు లోనే అందరూ నిద్ర లేవాలన్నమాట. చాల చిన్నతనంలోనే నవలలు,కథలు చదివే అలవాటు వల్ల రేడియోవారు సమయానికి తగు పాట పాడిస్తారని నమ్మేదాన్నికూడా అప్పట్లో. 

ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి అనుభవం ఎదురైంది నాకు. అదేనండి. సమయానికి తగు పాట ప్లే అవడం అన్నమాట. ఇప్పటి రేడియో వాళ్ళకి నా మనసు తెలిసే అవకాశంలేదు కనుక  మనసు ఎఫ్. ఎం.  రేడియోలో సమయానికి తగు పాటలు  వేసుకుంటు ఉండడం ఓ అలవాటయి కూర్చుంది.
మా సీతయ్య  తెలుసుగా మీకు...తెలీదంటే ఓసారటు వెళ్ళి మళ్లా ఇలా రండి.


సీతయ్య....కనపడుటలేదు.
అవునండి...మా సీతయ్య  తప్పిపోయాడు. 
నెలరోజులపైనే అయింది వాడిని చూసి.  
ఒక్క క్షణం....ఒకే ఒక్క క్షణం....అంతలోనే అంతా జరిగిపోతుందని ఎంత మాత్రం ఊహకందని క్షణం. 
నా వెను వెంటనే ఉన్నాడని అనుకున్నా. ఓ క్షణం ఏమారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేలోపల మాయమయిపోయాడు. ఇంటికే కదా వెళ్తాడు అనుకున్నా. పని పూర్తిచేసుకొని వెళ్ళి చూద్దునా...ఇంటికి రాలేదు.
ఇప్పుడు ఎంత అనుకొని ఏం లాభం.
కనుమరుగైపోయాడు. నిజంగా మన చేతిలో ఏమీ లేదా. అంతా విధి లిఖితమేనా...విధి ఒక విషవలయం...విషాద కథలకు అది నిలయం...
ఉండడానికి లేకపోవడానికి మధ్య మరీ ఇంత తక్కువ దూరమా. చెలియలేదు...చెలిమిలేదు ..వెలుతురే లేదు...అని మనసు బాధతో మూల్గుతోంది. తనతో నాకున్న బంధం సామాన్యమయినదా. ఈనాటి ఈ బంధ మే నాటిదో కదా... అవును..తను మొదటిసారిగా మా యింటికి వచ్చినది మే లోనే.

ఎక్కడ వెతకాలి. ఎలా వెతకాలి. నా కనుమరుగైన చోటునుండి వాడు ఎక్కడెక్కడికి తిరిగి ఉంటాడో ఎలా ఊహించను. ఎన్ని యోజనాలు ప్రయాణం చేసినా ప్రయోజనం కనిపించలేదు.
ఒంటరినైపోయానూ...ఇక ఇంటికి ఏమని పోనూ...అని బాధతో ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారి ఇంటికి చేరుకుంటే.....ఇంట్లోనే కనిపించి నన్ను ఆశ్చర్యపరుస్తాడేమోనని ఏదో పేరాశ.
 
ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో...చెప్పుకో..ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో అంటున్నట్టనిపించి ఇంట్లో అన్ని మూలలు కలయదిరుగుతాను....ప్చ్...ఏమీ లాభం ఉండదు.
తను లేడన్న  నిజాన్ని మనసుకు నచ్చచెప్పేలోపలే లేదు లేదు వచ్చేస్తాడొచ్చేస్తాడని  ఆ తలుపు  తానే తట్టి  ఉండవచ్చనే ఓ నమ్మకం చీకట్లో చిరుదీపంలా మినుకుమినుకుమంటోంది. సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా...


అక్కడ  మీ వాడు కనిపించాడు...అచ్చు అలాగే ఉన్నాడు. ఓసారి చూడండి -ఆ మాట వినగానే ఎక్కడి దక్కడ వదిలేసి, ఎలా ఉన్న దాన్ని అలాగే  సిరికిం జెప్పడు లాగ  ఆ చోటుకి వెళ్ళి చూస్తాను. కానీ  వాడు మా వాడు కాదు. 

ఏ పనిచేస్తున్నా వాడే గుర్తొస్తాడు.  కలనైనా నీ తలపే...కలవరమందైనా నీ తలపే అనిపిస్తూ పదే పదే కళ్ళలో మెదులుతున్నాడు.
నా కాళ్ళకో చేతులకో తగులుతూ మెత్తటి కుచ్చులాంటి ఆ శరీరస్పర్శ  ఉండుండి కలవరపెడుతుంది. ఎక్కడ కూర్చున్నా  నా చీర కుచ్చెళ్ళమీద తల వాల్చి ప్రశాంతంగా నిద్రపోయే మెత్తని వెచ్చని జ్ఞాపకం వెంటతరుముతోంది. తనని  గుర్తుచేస్తూనే ఉంది. ఏ చిన్నపాటి శబ్దమయినా   ఏమూలనో దాక్కొని ఆడుకుంటున్న భ్రమకలుగుతోంది.
వరమిచ్చిన దేవుడే శాపమూ ఇచ్చాడు.
వరం పొందడానికి నేను చేసిన పూజలేమున్నాయి.శాపగ్రస్తను కావడానికి  నేను చేసిన పాపమేమిటి.
ఏమీ అర్థంకావడంలేదు.
ఏకొర నోములు నోచితినో  మరి దేవుడికి  నాపై  దయరావడం లేదు.  కళ్ళల్లో నీరెందులకూ...కలకాలం విలపించుటకూ...అన్నది నిజమా..

తను నా దగ్గరకి రావడం ఎంత ఆశ్చర్యమో, నా కళ్లముందునుండి క్షణాల్లో మాయం కావడం అంతే విషాదం. లేకపోతే .... ఎన్నిసార్లు అదే దారిలో వెళ్ళాడు. మరెన్నిసార్లో తిరిగి వచ్చేసాడు.
ఇప్పుడేమయింది...... ఎందుకు రాలేదు. ఏంజరిగి ఉంటుంది. ఊహించలేకపోతున్నాను.

రోడ్డుమీదపడి ఎంతెంత దూరాలు తిరిగిన చోటనే తిరుగుతూ, ప్రతివారినీ తన కోసం  అడుగుతూ... ఆనాడు సీత జాడకోసం రాముడు ఎలా వగచాడో.... ఇప్పుడు ఊహించగలుగుతున్నాను.

చక్కనయ్యా చందమామ .... ఎక్కడున్నావూ...
నీవులేక దిక్కులేని చుక్కలయినామూ ..



అనుకుంటూ తను తప్పిపోయిన ఆ దారిలో ఎన్నిసార్లు తిరిగానో. ఎన్ని ఇళ్ళు వెతికానో. ఎందరిని అడిగానో. ఆ అందచందాలు చూసి ఎవరు భ్రమసారో. బయటకి రానివ్వని పరిస్థితి కల్పించారో. నా అడుగుల చప్పుడు తనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు కదా.అయినా రాలేక ఉండడానికి కారణం ఏమయి ఉంటుందో.

దారి తప్పి పోతివో . నీ వారి సంగతి మరచినావో...
ఏ రాణివాసము లోన చేరి రాజువైనావో
రాలేక ఉన్నావో....
భోజనానికి కూర్చుంటే నీకు పెట్టకుండా తింటున్నట్టుంది. తిన్నావో లేదో అని దిగులుగా ఉంటుంది. ఈ వేళలో నువ్వు ఏంచేస్తు ఉంటావో...అనుకుంటూ ఉంటాను ప్రతినిముషం నేను.

ఇన్ని రోజులు- ఎదురుచూపులు, వెతికి వేసారటాలు అవే మిగిలేయి. 
ఇక నువ్వు రావేమో. ఇదివరకు గుర్తుందా పదిరోజులు ఎక్కడికో ఏ స్నేహాన్ని వెతుక్కుంటూనో వెళ్ళావు.. కానీ నువ్వే వచ్చేసావు మరి...రానని రాలేనని ఊరకె అంటావు. రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు... అని అనుకున్నాను. 
కానీ -
ఇక నువ్వు రాలేవు. వస్తావనే ఆశ,నమ్మకం సన్నగిల్లాయి సుమా.
ఎక్కడ ఉన్నా ఏమైనా ....మనమెవరికి వారై వేరైనా... నీ సుఖమే నే కోరుతున్నా......
అనుకుంటూ మనసులో నీ జ్ఞాపకాలను మాపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా నేస్తం.

మా చిట్టితల్లి నీ లాంటి ఆటబొమ్మకావాలని కంటికి మింటికి ఏడుస్తుంటే ఆ దుఃఖం మాపడానికి నువ్వొచ్చావు అనుకున్నా. మరే చిట్టితల్లి కి ఆటబొమ్మగా మారడానికి వెళ్లేవో మాకేం తెలుసు....
వాకిటిలో చిరుశబ్దాలు నీ అలికిడిగా భ్రమపడి చటుక్కున తెర ఒత్తిగించి చూస్తానా-
ఏగాలి కెరటానికో  కదులుతూ ఆకులు చేసే  చప్పుడు  అది. ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు అని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటాను.
నిశ్శబ్దంగా ఉన్న నిశిరాత్రి  వీధిలో ఏదో పరిచయమైన శబ్దం వినిపించినట్టయి గుమ్మంలో నిలబడి చూస్తుంటానా..  మసకనీటి పొర కమ్మిన నా కంటికి వాడి రూపు తోచదయ్యయ్యో.... 
అదిగో రామయతండ్రీ ఆ అడుగులు మా అయ్యవి..ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నది.... రాముడి కోసం శబరి ఎదురుచూసి నట్టుగా  వాకిటిలో నిలబడి వాడికోసం ఎదురుచూస్తుంటాను
వాకిటిలో నిలబడకు. ఇంక నాకై మరి మరి చూడకు. రానిక నీ కోసం సఖీ..... అంటూ  నా గుండెలో నువ్వు నిలబడి చెప్పినట్టవుతుంది. 
శాశ్వతంగా నను విడిచి వెళ్ళినట్టేనా మిత్రమా... 
నీలా నాకు వాసనలు పోల్చుకోవడం రాదు కదూ.
నీజాతి వారిని నీ ఆనవాలుకోసం అడిగే భాష కూడా నాకు తెలియదు కదూ.
నీ జాడలు నేనెలా వెతకను మరి.
నీ అంతట నీవే నాకోసం ఎప్పుడో రావాలి. తప్పక వస్తావు...
నీకోసమే నా అన్వేషణ....నీకోసమే నా నిరీక్షణ.