02 February 2011

బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు !!


భగవంతుడా,
         మా దగ్గరున్నవన్నీ తీసేసుకో,
         ధనం, ధాన్యం,
        ఇల్లు, పొలం,
        రాజ్యం, అధికారం,
        అన్నీఅన్నీ
        తీసేసుకో,
        మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్........
ఈ మధ్య ఒక బ్లాగులో చూసాను ఈ కవిత. 
బాల్యం అనే అనుభవానికి ఉన్న పవర్ అది.  పెద్దవాళ్ళయిపోయిన తర్వాత వెనక్కి  తిరిగి గత జీవితాన్ని తలపోసుకుంటే మధురాతి మధురమయిన స్మృతులన్నీ బాల్యానికి చెందినవే ఉంటాయి ఎక్కువగా. ఆ బాల్యంలో అనుభవించినవి ఆ సమయానికి కష్టాలు గా అనిపించినా ఇప్పుడు  తలచుకుంటున్నప్పుడు అవన్నీ  ముచ్చటలుగా మురిపిస్తాయి. 
మారిన సామాజిక పరిస్థితులలో పిల్లల బాల్య జీవితం ఇదివరకటి కన్నా సంక్లిష్టంగా తయారయింది. చదువులు, పరీక్షలు, అన్నిటిలో పోటీ తత్వం  పెరిగిపోయింది. తగినంత ప్రోత్సాహం లేకపోతే, సహకారం ఇవ్వకపోతే  ఈ పోటీలో వాళ్ళు గెలుపు సాధించడం కష్టమని, ఈ  గెలుపే ఇకపై  పిల్లల జీవన విధానాన్ని నడిపించనున్నదని అ(పా)ర్థం చేసుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుల చట్రాల్లో ఇరికించి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. రేపటి గొప్పపౌరులుగా తయారవడం కోసం పిల్లలు   తమ బాల్యాన్ని బలిపెట్టవలసి వస్తోందని చాలా మంది  పెద్దలు అర్థం చేసుకోవడం లేదు. 
ఆనాడు మనం అనుభవించిన ఆ అందమైన బాల్యాన్ని మన పిల్లలు  కోల్పోతున్నారే  అని చాలామందికి బాధగా ఉంటోందిప్పుడు. ఇప్పటి వాతావరణంలో అప్పటి ఆహ్లాదకరమైన వినోదం లేకపోవడం ఒక ఎత్తైతే - మరొక ప్రమాదకరమయిన వాతావరణం మనచుట్టూ అలముకొని మన పసిబిడ్డల మనసులను కలుషితం చేస్తోంది.  

 దానిమీద మనకి దృష్టి ఉందా అసలు.....????
ఇరవయ్యవ శతాబ్ది అర్థ భాగంలో సామాజిక వ్యవస్థలో  ప్రారంభమయిన మార్పు సమిష్టికుటుంబాల నుండి వ్యష్టి కుటుంబాల దిశగా మరలడం. మరొకటి స్త్రీ పురుష భేదం చాలావరకు సమసిపోవడం. సమాజంలో తమ వ్యక్తిత్వాన్ని, తమ స్వాతంత్ర్యాన్ని,ప్రతిభా విశేషాలను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలను సమానమైన ప్రతిభతో నిర్వహిస్తున్నారు ఇప్పటి స్త్రీలు. అందువలన గృహమే కదా స్వర్గసీమ అనే పాట ఔట్ డేట్ అయిపోయింది. లేచింది నిద్రలేచింది మహిళాలోకం అన్న పాత పాటే  లేటెస్ట్ అయింది.

భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళకతప్పని పరిస్థితులలో వారికి  పుట్టిన పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చే వరకు ఎవరి సంరక్షణలో ఉండాలన్నది ఒక సమస్య, స్కూలునుంచి వచ్చినా తల్లి తండ్రులు ఇళ్ళు చేరే వరకు ఎవరిదగ్గర ఉండాలన్నది మరో సమస్య. ఇక్కడే అమ్మమ్మలు, బామ్మలు, తాతగార్ల పాత్ర కీలకం అయింది.  తప్పని పరిస్థితులలో కేర్ సెంటర్లలో పిల్లలను అప్పగించినా అవకాశం ఉన్నంత వరకు పిల్లల అమ్మమ్మలు, నాయనమ్మలు తాతగార్ల సంరక్షణలో వారిని  ఉంచుతున్నారు అమ్మానాన్నలు. 
పగలు పదకొండుకి ప్రారంభం అవుతాయేమో టీవీలో సీరియల్స్, అక్కడినుండి రాత్రి పదకొండు వరకు కూడా టీవీలో  సీరియల్స్ సాగుతూనే ఉంటాయి. తెలుగే కాదు అన్ని భాషలలోను ఈ సీరియల్స్ ప్రభంజనం కొనసాగుతోంది. మిగిలిన భాషలేమోకాని మన తెలుగులో మాత్రం చాలా ఛానెల్స్ లో ఇతర భాషల నుండి డబ్బింగ్ చేయబడిన సీరియల్స్ చాలా వస్తున్నాయి. 
ప్రతి ఇంట్లో  వయసైన  ఆడవాళ్ళు, రిటైర్ అయిన మగవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం లేక ఇల్లు చూసుకునే  గృహిణులు చాలామంది ఈ సీరియల్స్ కి అలవాటుపడి ప్రతిరోజూ ఆ సమయానికి వాటిని  వదలకుండా చూస్తున్నారు. ఇదివరకులా అమ్మలక్కల కబుర్లు, ఇరుగుపొరుగు ఆడవాళ్ళు చేరి ముచ్చట్లు పెట్టుకోవడం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది. ఇంటికి ఎవరైనా వస్తే ఆ సీరియల్ ని చూడడం అవదేమో అని బాధపడేంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. 
పాతకాలపు ఇండిపెండెంట్ ఇళ్ళు చాలావరకు అపార్ట్ మెంట్స్ గా మారిపోయాయి. ఇళ్ళు చిన్నవైపోవడంతో, ముందు వాకిలి, వెనక పెరడు లాంటివి లేవుగా, అన్నీ ముందు గదిలోనే.  బియ్యం ఏరుకున్నా, కూరలు తరిగినా,  పిల్లలకు అన్నం తినిపించినా, మనం తింటున్నా అన్నీ ఆ టీవీ ముందే, ఆ సీరియల్స్ నేపథ్యంలోనే.

ఈ సీరియల్ ఏమిటి ఇలా ఉంది.... బాలేదు.. చూడకు అనడానికి ఇంట్లో ఎవరికీ వీలవదు. ఆ ఛానెల్ మార్చడానికి కూడా వీలవదు. బయటకి వెళ్ళి సాయంత్రం తిరిగివచ్చేసరికి  వాళ్ళకోసం అన్ని అమర్చి పెట్టి, వాళ్ళ పిల్లల అల్లరి భరించి టీవీముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న తల్లిదండ్రులను నొప్పించడం ఇష్టంలేక చాలామంది టీవీ సీరియల్స్ ను భరిస్తున్నారు. మర్యాదకో, చానెల్ మారిస్తే జరిగే గొడవకో భయపడే వాళ్ళు,  వీలయిన వాళ్ళు బెడ్ రూమ్ లో మరోటీవీ అమర్చుకొని వాళ్ళకు కావలసిన ఛానెల్స్ చూస్తున్నారు.
కానీ  స్కూల్లో చేరే వయసు ఇంకా రాని పిల్లలు, వెళ్ళినా మధ్యాహ్నం నాలుగుగంటలకల్లా ఇల్లు చేరుకొనే పిల్లలు అమ్మలు, అమ్మమ్మలేదా బామ్మ, తాత లతో పాటు చూసేవి టీవీ కార్యక్రమాలే. తల్లిదండ్రులు ఏ ఎనిమిది గంటలకో ఇల్లుచేరుకునేలోపల వాళ్ళు గడపవలసినది టీవీ ముందే. 
మరి టీవీల్లో చూపిస్తున్న సీరియల్స్ వాటిల్లో కథా కమామీషు, పాత్రలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా. గమనిస్తున్నారా. 
ఇంచుమించు ప్రతి సీరియల్ లోను ఒక గయ్యాళి  అత్తగారు, చేతకాని మామగారు, ఆరళ్ళు పెట్టే ఆడపడుచు, ఆవిడకి కూడా చేతకాని మొగుడు, అమాయకురాలై వీరందరి పాలబడి వారిచేత హింసింపబడే కోడలు వీటిలో ప్రధాన పాత్రలు . ఒకవేళ మరిది ఉంటే వాడు మంచివాడైతే వదినని సమర్థిస్తూ, ఆమెతో సంబంధం ఉన్నవాడిగా  కుటుంబంతో వెలివేయబడిన వాడౌతాడు. చెడ్డవాడైతే ఆ వదిన్ని ఇంటిలోంచి తరిమేయడానికి నడుం కట్టుకున్నవాడై  ఉంటాడు. 
ఇంక ఈ కథని ఎన్ని రకాల మసాలాలు వేసి వండి వడ్డిస్తారో రకరకాల ఛానెల్స్ లో చూడవచ్చు.

మరి కొన్ని సీరియళ్ళలో ఊరికే తమ కోడలిని బాధించడం తో సరిపెట్టరు. ఆమెకి విషం ఇచ్చి చంపేయాలని కుట్ర పన్నుతూ ఉంటారు. ఆ విషం వంటింట్లో ఉప్పు, పప్పుతో పాటు అత్యంత సహజంగా అలమారలో కొలువై ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్తను కోడలో, కోడలిని అత్తో, తోడికోడళ్ళో, మరుదులో ఒకరినొకరు  చంపడానికి వాడుకుంటూ ఉంటారు. కానీ వారి ప్రయత్నం సఫలమా, విఫలమా అన్నది తేలడానికి మాత్రం అథమం ఓ ఆరు ఎపిసోడ్లేనా పడుతుంది. 
 మరికొన్ని హారర్ సీరియల్స్. వీటిలో ఇవి మరీ ప్రమాదకరమైనవి.  పాత్రల హావభావాలు, కుళ్ళు , కుతంత్రాలు వీటితో ముఖ కవళికలతో చేసే విన్యాసాల వలన పుట్టిన హారర్ ఒకఎత్తు. కానీ కథలో మంచిపాత్రలను హింసించడం లో భాగంగా కడుపులో ఉన్న పిండాన్ని చంపడానికి, ఆస్తికి వారసులైన పిల్లలను చంపించడానికి చేతబడి వంటి క్షుద్రవిద్యలను, ఆ క్షుద్రవిద్యను ఉపాసించే మాంత్రికులను ప్రధానమైన పాత్రలుగా చూపించడం  మరొక ఎత్తు. ముఖ్యంగా పసిపిల్లల పై జరిగే హత్యాప్రయత్నాలు చాలా సీరియల్స్ కి ముడిపదార్థాలు. 
ఈ సీరియల్స్ కథలలో  భాషా భేదం లేదు. హిందీలో నైనా తమిళంలో అయినా తెలుగులో అయినా అదే కథ. అవే పాత్రలు. భాష మారుతుందంతే.

స్నిగ్థ మోహనమయిన రూపం, కోమలమైన నాజూకు శరీరం,అమాయకమైన చిరునవ్వు,దేవుడికి మారుపేరులా ఉంటారు పసిపాపలు... స్వచ్ఛమైన వారి పాల మనసులను విషపూరితం చెయ్యడం కాదూ ఈ కథలు చూపించడం అంటే.
ఇదిగో ఇలాంటి సీరియల్స్ మన వాళ్ళలో చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు మా అమ్మగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు. మన పిన్నో, అత్తో కావచ్చు. (గమనించినంతవరకు ఈ సీరియల్స్ ని ఉత్సాహంగా చూసే మగవారి శాతం అతి తక్కువ. అందుకనే ఆడవాళ్ళ పేరు చెప్పవలసి వస్తోంది).  కానీ వాళ్ళ దగ్గర పెరుగుతున్న పసిపిల్లలపై  ఈ టీవీ కార్యక్రమాల ప్రభావం ఎంతగా ఉంటుందో మనం గమనిస్తున్నామా?

మొన్న ఒక పదినిముషాలు టీవీ ముందు నిల్చున్నందుకు  ఒక సీరియల్లో ఒక ఎపిసోడ్  చూసాను. ఇద్దరు భార్యల సీరియల్ అది. ఒక భార్యకి పుట్టిన అమ్మాయికి పెళ్ళవుతూ ఉంటే ఎలాగైనా ఆ పెళ్ళికూతురిని చంపేద్దామని ఓ పాత్ర పాలల్లో  విషం కలిపి తీసుకొస్తుంది. ఆ విషం కలిసిన గాజు గ్లాసును మరో పాత్ర అందుకొని తాగేయబోతుంది. మనకి మూడుసార్లు మూతిదగ్గరకి గ్లాసును చేర్చడం చూపిస్తారు. కానీ ఆమె ఆ గ్లాసుని తాగకుండా పట్టుకొని ఇరవై నిముషాలు  గొడవ పెడుతూ మాట్లాడుతుంది. తర్వాత ఆ ....నా కడుపు నిండిపోయింది. ఇంక ఈ పాలెందుకు అని ఆ గాజుగ్లాసుని నేలమీద విసిరి, బద్దలు కొట్టి మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 
నాకు ఒళ్ళు మండిపోయింది. బహుశ కిందపడిన ఆ పాలను పిల్లో, కుక్కో తాగి చనిపోయినట్టుగా తర్వాత ఆరువందల యాభయ్యవ ఎపిసోడ్ లో చూపిస్తారేమో అనుకుంటా. కానీ పాలు తాగక పోతే ఓ టేబుల్ మీద అంచులో పెట్టినట్టో, చూడకుండా ఏ చిన్నపిల్లడో వచ్చి కింద పడేసి  పెద్దవాళ్ళు తిడతారని పారిపోయినట్టో చూపించవచ్చుగా. అడ్డగాడిదలా పెరిగి, ఆడదై ఉండి ఓ గాజుగ్లాసును నలుగురూ నడిచే దారిలో విసిరి పారేయడమా... పెద్దవాళ్ళే అలా ప్రవర్తించినట్టు చూపిస్తే ఇక పిల్లలకేం నీతి చెప్తాం !!
అలాగే  హింసించి ఆనందించడంలో భాగంగా నేలమీద నూనె పొయ్యడం, నడుస్తుంటే కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చెయ్యడం, కూర్చోబోతుంటే కుర్చీలు లాగేసి పడేయడం  అదే పెద్ద కామెడీలాగా అందరూ పడి పడి నవ్వడం చాలా సాధారణంగా చూపిస్తూ ఉంటారు.  

ఒకటా రెండా ఎన్ని సీరియల్స్!! ఎన్ని అరగంటలు!! వీటిలో అన్నో కొన్నో చూస్తూనే ఉన్నారు పిల్లలు.  బామ్మఒళ్లో ఆడుకుంటూ, తాతపక్కన సోఫాలో దొర్లుతూ... కొన్ని వాళ్ళంతట వాళ్ళు  చూడకపోయినా చెవిలో పడేలా దడదడలాడే మ్యూజిక్ తో వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి.
 పైగా పాత్రలు మాట్లాడుకునే భాష ఎంత సంస్కారంగా ఉంటుంది అంటే....
ఒసే, నువ్వయిపోయావే..., నిన్ను మసిచేస్తానే,  నిన్ను లేపేయడం నాకు చిటికెలో పనే. ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్... నువ్వసలు ఒక అమ్మకీ అబ్బకీ పుట్టి ఉంటే రారా...రేయ్.. నువ్వు మగాడివే అయితే....ఇదీ ధోరణి.
మనం చందమామను  చూపిస్తూ  అన్నం పెట్టే అమ్మని చూసాం. అదే అమ్మ అమ్మమ్మగా  మనవలను ఆడించే దశకి వచ్చేసరికి ఎంత మారిపోయింది.... ఇప్పుడు చందమామని కాదు టీవీ చూపిస్తున్నారు. అన్నం పెడుతూ. చూడమ్మా... చూడు... ఆ దొంగ ఆ అమ్మాయిని చంపేస్తాడు చూడు....అమ్మో...గబ గబ తినేయమ్మా... వాడిచేతిలో కత్తి చూసావా...అమ్మో... ఇలా ఉంటుంది ఆ సన్నివేశం.
టీవీ సీరియల్స్ లో  చంపడం, చంపించడంతో పాటు  రేప్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటున్నాయట. ఈమధ్యో ఏదో సీరియల్ లో ఈ రేప్ సన్నివేశం చూసానని, ఒకంతట ఆ సీన్ ముగియలేదని, కంపరం పుట్టిందని  తెలిసిన  అమ్మాయి చెప్పింది.
చిన్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలు గానీ, హత్యలు, ఫైటింగ్స్ కానీ ఉన్న సినిమాలు చిన్న పిల్లలు  చూడకూడదని, చెడిపోతారని అనేవారు తాతగారిలాంటి పెద్దవాళ్ళు. ఇప్పుడవన్నీ టీవీ రూపంలో నట్టింట్లోకి నడుచుకొని వచ్చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం. మన కళ్ళెదుటే మన పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉంటే మనకి పట్టనట్టుగా ఉండిపోతున్నాం. 
క్రైం, హింస, శాడిజం ఇవన్నీ మూసపోసిన పాత్రలతో, వండిన సీరియల్స్ ని మనమంతా ఎందుకు ఎలా భరిస్తున్నాం? పూర్వం  ప్రతినాయకుడు అంటే విలన్ పాత్రలో ఇలాంటి లక్షణాలన్నీ మూర్తీభవించి ఉండేవి. నాటకాలలో ఇలాంటి పాత్రలు చూడడం వలన మనలో రసోత్పత్తి కలిగి మన మనసులో ఉన్న కుళ్ళు, కల్మషం కరిగిపోయి స్వచ్ఛంగా  మారుతామని మన రసవాదులు చెప్తారు. 

బహుశ మనవాళ్ళు,  మన బాహ్య ప్రపంచంలో బహు మంచివాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఈ సీరియల్స్ లోని దుర్మార్గపు పాత్రలను  పదే పదే చూసి వాళ్ళ భావాలను తాము కూడా  అనుభవిస్తూ  తమలో ఏ కాస్తైనా ఉన్న చెడుని, చెడు తలంపులని కడిగేసుకొని స్వచ్ఛంగా మేలిముత్యాలలా మారిపోతారా...
లేదా.....
నీతి నిజాయితీలతో బాధ్యతగల ఆదర్శవంతమైన రేపటిపౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత గల  పెద్దలు - ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు తమ తెలివితక్కువ తనంతో  నేటి బాలలే రేపటి క్రిమినల్స్ అన్న కొత్త నినాదానికి తెరతీస్తారా. సమాధానం ఎవరు చెప్తారు?!!


(కలభాషిణి  రాసిన సరదా పోస్టుకి ఇది సీరియస్ కొనసాగింపు)

31 comments:

  1. మంచి టపా! ఈ సీరియల్సుతో అభం శుభం తెలియని పిల్లల మనసుల్ని విషపూరితం చేస్తున్నాం. తీసేవాళ్లు తీస్తుంటే చూసేవాళ్లు కూడా వీటిని ఎంత ఉత్సుకతో చూస్తారో! వీళ్ల ఉత్సాహం ప్రోత్సహం చూసి ఇంకా మంచి మంచి హింసాత్మక సీరియల్సు వస్తున్నాయి. ఎవరిది తప్పంటే చెప్పలేం ....ఈ పరిస్థితికి కారణం అందరమూ..తలా పాపం తిలా పిడికెడు!

    ReplyDelete
  2. ఈ కవిత్వం రాసింది సదరు బ్లాగ్ యజమానే అయితే బానే ఉండేది.
    కానీ అదేంటో దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం కూడా జగ్జీత్ సింగ్ కూడా ఇదే పాట హిందీ లో పాడాడు
    సినిమా పేరు" ఆజ్ " ట
    1990 లో వచ్చిన ఆ సినిమా లో పాట
    " ఏ దౌలత్ భీ లేలో, ఏ షోహరత్ భీ లేలో
    మగర్ ముజ్ కో లౌతాడో బచ్పన్ కా సావన్...
    అంటూ దాదాపు ఇదే అర్ధం వచ్చేలా ...
    హిందీ లో ప్రాధేయ పడ్డాడు
    ఇక్కడ నొక్కండి
    పాపo అయన కంటే ముందు ఇంకో అయన కోయీ లౌటాదే ముజ్హే భీతే హుయే దిన్
    ఏంటో ఒక్కళ్ళు దీనికది స్ఫూర్తి అని చెప్పలేదు.
    ఇది విమర్శ కాదు కానీ ఏదన్నా కవిత రచన చదివి స్ఫూర్తి తో ఇంకేమన్నా రాస్తే. ఆ స్ఫూర్తి కారకం ఇది అని పేర్కొనటం బాగుంటుది కదా

    ReplyDelete
  3. ఆత్రేయగారూ
    మీరన్నది నిజమే. నాకు హిందీ సాహిత్యంతో పరిచయం లేదు కనుక నాకు ఈ కవితలో భావం నచ్చి లింక్ ఇచ్చాను. అయితే ఒకటుంది గ్రేట్ మెన్ థింక్ ఎలైక్ అని. బహుశః దీనికి కూడా అదే వర్తిస్తుందేమో.
    ఇంతకీ టపా గురించి ఏమీ చెప్పనేలేదు...

    ReplyDelete
  4. గొంగట్లో తింటూ వెంట్రుకలంటూ విచారిస్తే ఏం లాభం చెప్పండి.

    సమాజాన్ని అన్ని విధాలా భ్రష్ఠు పట్టించీసు కున్నాక, ఇహ చేయ గలిగేది ఏమీ లేదు కాబోలు. ఇడియట్ బాక్స్ ని ఇంటవతల విసిరెయ్యడం తప్పితే.

    లేదా ప్రతి ఇంట్లోనూ వారంలో ఒక రోజు టీ.వీ హాలిడే నిర్బంధంగా పెడితే, కొన్నాళ్ళకి ఆ హాయి లోని మజా అవగతమై దాని దుర్వినియోగం కొంతలో కొంత తగ్గిస్తామేమో.

    దిక్కుమాలిన కథలతో సీరియల్స్ చూపిస్తున్న ఛానెళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఒక నయా దోపిడీ వ్యవస్థ లో తమ వంతు నీచత్వం అనుక్షణం బయట పెట్టుకుంటున్న సిగ్గు లేని వ్యాపార ధోరణి అది.

    మీకు, కలభాషిణి గారికీ నా అభినందనలు.

    ఎక్కడికి పోతున్నాం, మనం ?
    ఎక్క వలసిన ఎవరెస్ట్ శిఖరాల పైకా ?
    దిక్కు మాలిన పాపాల పాతాళ కుహరాల లోకా ?

    సి.నా.రె. ఆవేదన దాదాపు నలభైయ్యేళ్ళ క్రిందటిది.

    కడదాకా కూరుకు పోయే ఉంటాం, ఇహ లేవం.

    ReplyDelete
  5. గుడి కెళ్ళి రద్దీలో తోపుళ్ళలో దేముడి సంగతి పక్కన పెట్టి పక్క వాళ్ళతో పోట్లాడినట్లు,
    మీ బ్లాగ్ లో ఇక్కడ నొక్కమనగానే నొక్కేసాను ఆ కవిత లో చాలా భాగం జగ్జీత్ సింగ్ పాటే, సదరు బ్లాగ్ యజమానికి ఆ విషయం పేర్కొనమని నా ప్రార్ధన.
    మీ టపా బాగుంది నాకు మా ఆవిడకీ ఈ సీరియల్స్ దగ్గరే రోజూ గోల అవుతుంది
    ఏదో రోజు తను మారుతుందని నేను
    నేను మారతానని తను ఎదురు చూస్తున్నాం
    ఇంకో భయం కూడా ఉంది మరీ ఎక్కువ అడ్డు పడితే వంటింట్లో విషం సీసా పెడుతుందేమో అని నా భయం కూడా

    ReplyDelete
  6. అయినా మీరన్న గ్రేట్ మెన్ థింక్ అలైక్ అన్నది ఇక్కడ చెల్లదు
    జగ్జీత్ సింగ్ మేన్
    సదరు బ్లాగ్ ఓనరు వుమన్

    ReplyDelete
  7. నేను టి.వి చూచి చాలా సం||లు అయ్యింది.
    ఈరోజు నా మిత్రుడు(రచయిత/పార్ట్‌టైం లెక్చరర్‌) ఓమాట చెప్పాడు.
    నేను పొద్దున్నే పాఠాలు చెప్తాను...నా పిల్లలు ఈ రోజు ఎలా ప్రారంభిచాలి?
    అని అలోచిస్తాను.......పాఠం పూర్తయ్యేసరికి వాళ్లకి కోపం రావాలా?అసహ్యం కలగాలా?
    శతకోటి క్లాస్‌ల్లో వీడిదొక బోడి క్లాస్‌ అనుకోవాలా?నీరసం రావాలా???
    ఓ మంచి అనుభూతి కలిగి...ఈ రోజుని ఉత్సాహంగా ప్రారంభిస్తున్నాం..ఎన్ని అవాంతారాలెదురైనా
    వాటిని ఎదుర్కొంటాం అని వారనుకోవాలా?? అని "అలోచిస్తాను"
    ప్రతిసారీ చివరి సమాధానమే నన్ను ఆకర్షిస్తుంది, ఉత్తేజపరుస్తుంది....దాన్నే ఆచరణలో పెడతాను.
    క్లాసే(పాఠం) కాదు....చదువు అయిపోయాక కూడా నా పిల్లలు నన్ను గుర్తుంచుకుంటారు...
    నీ సినిమాలు కూడా ఇలా ఉండాలని కోరుకుంటాను...అన్నారు.
    ఆయన పేరు ఆదిబాబు....
    ఆలోచన ఉంటే....తప్పుని కూడా ఒప్పు చెయ్యగలరు రచయితలు.
    రావణ బ్రహ్మ,దుర్యోధనుడు,కర్ణుడు వీరిలో దాగిన గొప్పలక్షణాలు చూపించి అందర్నీ ఒప్పించగలిగారు.
    అది నైపుణ్యం.....ఆలోచించి రాసే వారొస్తే పరిస్థితి మారుతుంది.
    మీరు రాసింది చదివితే కాస్తైనా ఆలోచన కలుగుతుందేమో...

    ReplyDelete
  8. పిల్లాడికి ఒక mini-XBOX కాని, ఇంకాసేపు పక్కింటి పిల్లలతో కింద సెల్లార్ లో ఆడుకునే permission ఇస్తే...వాడి పండగ వాడు చేసుకుంటాడు కదా....

    ReplyDelete
  9. @ఆత్రేయ,
    వంటింట్లో విషం సీసా....:))

    ReplyDelete
  10. @sanju-The king గారు
    పక్కింటిపిల్లలతో సెల్లార్ లో ఆడడానికి పంపించి వాడు టైమ్ దొరికిందని పండగ చేసుకోకుండా వేరే పిల్లలని కొట్టో, వాళ్ళతో దెబ్బలు తినో వస్తే టైమంతా దండగమవుతుందని ఆడుకోవడానికి పంపించడం మానేస్తున్నారు....ఎక్స్ బాక్స్ అంటే నాకు తెలీదు..అయినా పదేళ్ళు నిండితే కాని అలాంటివి ఆడుకోలేరు కదా.నా బాధ అంతా ఆలోపు వయసువాళ్ళగురించే.

    ReplyDelete
  11. http://www.youtube.com/watch?v=NqRCVdotF1U
    I searched the web n got it. This wonderful lyric…
    "Take all my wealth and give my childhood back"...…other than this sentence tells me how my poem is same as this great poet’s words.

    ReplyDelete
  12. క్షమించండి సుధ గారు, ఆత్రేయ గారికి మీ బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తున్నందుకు.
    ఆత్రేయ గారు,
    కృతజ్ఞతలు "ఆజ్" అనే హిందీ సినిమా ఒకటి ఉందని నాకు తెలియచెప్పినందుకు. నాకుహింది latest cinemaలే సరిగ్గా తెలియదు , ఇంక పాత సినిమాల గురించి తెలిసేదే లేదు.
    నా బ్లోగ్ నేను నా తృప్తి కోసం రాసుకుంటున్నాను. అది పదిమందీ చదివితే నేను ఆనందిస్తాను అంతే.
    మీరు ఇంత ఘాటు విమర్శ చేసేముందు ఒక్క క్షణం అన్నా ఆలోచించాల్సింది. ఎదుటి వారికి ఎంత వరకు వర్తిస్తుందో, ఒకవేళ అదే నిజమైతే ఎదుటి మనిషే ఎంత బాధ పడతారో. "బాల్యం" గురించే ఏ సగటు మనిషిని అడిగినా ఇలాగే స్పందేస్తారు . ఒక్కో రచయితా ఒకే బావాన్ని ఎన్నో రకాలుగా చెపుతారు .
    మీరు పెద్దవారు, మీకు చెప్పేటంత గొప్పదాన్ని నేను కాదు.
    I just started my blog last month. I was feeling very happy. మీరు అంతలోనే నా ఆనందాన్ని పడుచేసేసారు. ఒకళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదండీ.

    ReplyDelete
  13. "ఒక్కో రచయితా ఒకే బావాన్ని ఎన్నో రకాలుగా చెపుతారు" ..ప్రవీణ గారు మీతొ ఏకీభవిస్తాను. అలాగే ఒకే భావాన్ని చాలామంది ఒకేలా చెప్పవచ్చు. ఆత్రేయ గారు కొంచం పొరపడ్దారు అనుకుంటాను.

    "నా బాల్యం నాకిచ్చేయ్"."మా బాల్యం మాకిచ్చేయ్".ఈ పదాలు చాలామంది చాలా రకాలుగా వాడారు..వాడుతున్నారు.
    "ఉందో లేదో స్వర్గం, నా బాల్యం నాకిచ్చెయ్"..ఇది ఘజల్ శ్రీనివాస్ పాడింది.
    మన బ్లాగుల్లో కూడా చాలామంది ఇవే మాటలు కొంచం అటూ ఇటుగా వ్రాస్తుంటారు..ఎవరి భావనలు వాళ్లవి..వీటన్నిటిని కాపీ అనలేం కదా!

    ReplyDelete
  14. నా బాల్యం నాకిచ్చేయమని అడుగుతున్న మరో బ్లాగర్ ఇక్కడ...http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html

    ReplyDelete
  15. ఒక భావనలో సారూప్యత ఉన్నందుకే ఆత్రేయగారు ఎత్తిచూపారు..
    ఇక
    సురేష్ నాయుడుగారి బ్లాగు(పై కామెంట్ లో ఇచ్చిన లింక్-http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html )

    లోని కవిత http://vissu-magicoflife.blogspot.com/2010/01/blog-post.html ఇక్కడ చూడవచ్చు.
    బ్లాగుపోస్టు డేట్ని బట్టి విస్సు గారిదే మొదట వచ్చిందేమో అనుకోవాలి. మొత్తం మీద ఈ రెండు బ్లాగులు మక్కీకి మక్కి...))

    ReplyDelete
  16. విస్సుగారి బ్లాగులో నా బాల్యం నాకిచ్చేయ్ అన్న పోస్టుకి సురేష్ పేరుతో తమ్ముడు అని విస్సుగారిని సంబోధిస్తూ నీ పోస్టు చూసాక నాక్కూడా నా బాల్యం కావాలని పిస్తోంది అని మార్చి1,2010 న ఒక కామెంట్ ఉంది. మార్చి 8,2010న సురేష్ పేరుతో http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html )అదే కవిత ప్రచురించబడింది.
    పాపం, అన్నలు తమ్ముళ్ళకి ఇలా ఎసరుపెట్టొచ్చా...

    ReplyDelete
  17. "మొత్తం మీద ఈ రెండు బ్లాగులు మక్కీకి మక్కి...))" !!! strange!!!!

    what ever..before passing a comment ఆత్రేయ గారు must have done a little research like you (Sudha garu) by presenting proofs(links)...
    "ఆజ్" అనే హిందీ సినిమా loo song nenu eppude vennanu. To be honest....I could not understand the language (hindi) very well. My hindi knowledge is that poor. Ya, but definitely I understood the concept.
    పక్కన వాళ్ళ మీద నిందలు వెయ్యటం మర్యాద కాదు కదండీ. If you are sure about it, u have every right to ask or blame. మనకు మనసులో ఏదో అనేపించిందని అనేయ్య కూడదు కదండీ. Encourage చెయ్యక పోయనా పర్లేదు కానీ Discourage చెయ్యకూడదు. Being a honest person I felt very hurting. That too I recently stared my blog.

    ReplyDelete
  18. పైన బ్లాగులలో బాల్యం పోస్టుల గురించి చెప్తూ పొరపాటున ఈ రెండు బ్లాగులలోను కవితలు మక్కీ కి మక్కి అనబోయి రెండు బ్లాగులు అనేసాను. క్షమించాలి. తేదీలు చూస్తే విస్సుగారిదే(జనవరిలో) ముందు ఉంది. సురేష్ గారిది(మార్చి)తర్వాత ఉంది.
    ఈ మధ్యే తృష్ణగారు కూడా తను ఇదివరకు రాసిన కవితను ఇలా ఇంకేవరో తన బ్లాగులో మొత్తం పెట్టేసుకున్నారని రాసారు.
    నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు.

    ReplyDelete
  19. "ఇది విమర్శ కాదు కానీ ఏదన్నా కవిత రచన చదివి స్ఫూర్తి తో ఇంకేమన్నా రాస్తే. ఆ స్ఫూర్తి కారకం ఇది అని పేర్కొనటం బాగుంటుది కదా" ఆత్రేయ గారు, మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం, కానీ మీరు నేను
    " ఏ దౌలత్ భీ లేలో, ఏ షోహరత్ భీ లేలో
    మగర్ ముజ్ కో లౌతాడో బచ్పన్ కా సావన్..." అనీ కవితనే చదివి స్ఫూర్తి తెచ్చుకున్నాను అని ఎలా అనుకున్నారు?
    "ఆ కవిత లో చాలా భాగం జగ్జీత్ సింగ్ పాటే, సదరు బ్లాగ్ యజమానికి ఆ విషయం పేర్కొనమని నా ప్రార్ధన" ..ఇది చాలా దారుణం......బ్లాగ్ లో ఏదో మనకు వచ్చింది రాసేసుకోవటమే అనుకున్నాను కానీ.....ఇలాంటి అభాండాలు పడాలే అని అనుకోలేదు.

    "మిలే సూర్ మేర తుమరా" అనే వీడియో నాకు ఈమెయిలు లో ఎవరో పంపెతే చూసే..మళ్లే ఆ రోజులు వస్తే బాగుండు అని అనుకుని, సెంటి గా ఫీల్ అయీపోయే ...ఇలా రాసుకున్నా. నాకు ఇదంతా ఇక్కడ చెప్పటం చాల insulting గా వుంది..కానీ ఎందుకు చెపుతున్నా అంటే..ఇలంటే అనుభవం ఎవరికీ రాకూడదు అనే.

    ReplyDelete
  20. sudha garu please accomadate my comment on your blog.
    ప్రవీణ అక్కా
    నన్ను క్షమించు నీ ఆనందం పాడుచేసినందుకు
    ఆ గజల్ ఉన్న సంగతి నీకు తెలియదని నాకు తెలీదు. తెలిస్తే అలా రాసేవాడిని కాదు.
    తెలిసే అలా రాసేవనుకున్నా.
    మనం మనం విజయవాడ వాళ్ళం !! అందుకే మాఫ్ కరో !!!

    ReplyDelete
  21. హమ్మయ్య...ఈ చర్చ ఇక్కడితో సమాప్తమై సుఖాంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
    ప్రవీణగారూ,చక్కని పోస్టులు రాస్తున్నారు. మరిన్ని పోస్టులు రాసి మమ్మల్ని సంతోషపరచండి.
    ఈవిధంగా ఆత్రేయగారి బ్లాగు చూడడం అయింది. మంచి టపాలున్నాయి.
    మీరూ మీరూ విజయవాడవాళ్ళని మమ్మల్ని మర్చిపోకండిమరి. మావి కూడా చదవండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  22. సుధా గారు
    మనం మనం కూడా ఒక్కటే
    మనుషులం

    ReplyDelete
  23. ఎంతమాట....ఎంత మంచిమాట!!!

    ReplyDelete
  24. సుధా గారు,
    నన్ను క్షమించండి..మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అమ్మో ఈ అమ్మాయే రాక్షసే అనుకోకండి. నాకు కాస్త ఆవేశం పాలు ఎక్కువనుకుంట...

    ఆత్రేయ గారు...Thanks for understanding me... మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను...నన్ను కూడా క్షమించండి.

    ReplyDelete
  25. థాంక్యూ స్వాతీ...

    ReplyDelete
  26. చాలా ప్రాక్టికల్ గా.. అచ్చంగా..అందరి ఇళ్ళల్లో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు రాసారమ్మా..
    నిజంగా నట్టింట్లో.. ఈ దరిద్రం తాండవిస్తోంది..
    మీరు చెప్పినవన్నీ నిజమే కానీ..ఈ ఆలోచన ఆ తల్లులకు & వాళ్ళ పెద్దాళ్ళకు కూడా రావాలి..
    ఈ చెత్త సీరియల్స్ చూస్తుందే కాక..మళ్ళా వాటి గురించి ఇంట్లో చర్చలు, వాదోపవాదాలు కూడానూ..
    అలసిపోయి ఇంటికొచ్చిన భర్త / భార్య (లేదా ఇద్దరు ) ఇంటికి రాగానే టీ.వీ రీమోట్ విషయం లో గొడవపడటం కూడా నేను ఎరుగుదును ...
    చూసే వాళ్ళున్నంత కాలం ఈ చెత్త మన పై రుద్దుతూనే ఉంటారు..
    ఈ సీరియల్స్ చాలా మందికి ఒక వ్యసనం లా తయారయ్యింది..
    కనీసం పిల్లలనైనా దీనికి దూరంగా ఉంచాలి...
    వాళ్ళని చూడొద్దని చెప్పి మనం అది పాటించకపొతే ఇంక ఏం లాభం...
    ముందు మనలోనే మార్పు రావాలి ...
    వస్తుందని ఆశిద్దాం .....
    - srikrishna chaitanya (telugu patala toranam)

    ReplyDelete
  27. Hello

    Nijamee ee serials valla manchi kanna chedu ekkuva jarugutondi.

    chekkagaa chandamama kathaloo leka cheta venna mudda vanti padhyaloo cheptu pillalaki tindi pettavalasindi poti TV lo ee chetta chupistu pettadam nijamgaa baadhakaram....

    Denivalla pillalu chaalaa Manasikamgaa kooda ibbadni padataaranadaniki udaaharana... na 1yr son......

    Vaadu roju tv lo adds chhostu annam tintaadu... oka roju nenu aa adds lo edo choosi edavatam start chesaadu.... gamanistee adi oka tv serial taaluka horror add... bhayapaddadu... appudu naaku ayyo anavasaram gaa tv pettanee anipimchindi... aa marusati roju nunchi nenu youtube lo telugu padyalu, panchtantra katalu pettadam modalu pettanu... raanu raanu vaadu avi chooi chekkagaa chinna chinna padaalu palakatam nerchukunnadu... choosaraa enta upayogam...


    Andukee Ammalu meeru mee chinnarulaku Manchi kathala putakaloo, padhyaloo vantivi alavatu chestu bhojanam pettandi... danivall mana bhasha bratukutundi... daniki mundu meeru serials maneyyandee.....

    idi oka amma anubhavam

    ReplyDelete
  28. ikkada oka sandarbhamlo enduko cheppalanipinchindi...manam kuda pillalaki pasivayasu nundi...apaddam cheppoddu..apaddam cheppoddu..antu apaddaani adi ela untundo ani vallani aalochimpachestaam....infact vallaku nijam cheppandi ani prothsahiste appdu vaallu nijam gurinchi aalochistaaremo kada

    ReplyDelete
  29. Nice article with social responsibility and with a warning about futureof children parents particularly and to society at large .Every one specially parents should think about the issue raised.....tvs rao

    ReplyDelete