28 June 2011

రమణగారండోయ్... చిన్నమాట!!

హలో హలో.....మిమ్మల్నేనండి...ఎక్కడికా పరుగు...

అరే...కాబూలీవాలాలు వెళ్ళిపోయి చాలాకాలమయింది...ఇక ఆగండి. మీరు లాటరీలు కొట్టడం మానేసి నిర్మాతలయిపోయారు ఆ విషయం మర్చిపోయారేమిటి...
అబ్బే... వాళ్ళు కాదా... ఓహో..

ఆ తెలుగుజనం...  వాళ్ళకి మీరు ఇంకా బాకీ ఉన్నారని అంటూ మిమ్మల్ని చూస్తే ఒదలరని భయమా...  మీరెన్ని పుస్తకాలు రాసిఇచ్చినా ఆ బాకీ ఫైసల్ చెయ్యడం లేదని మీక్కోపం వచ్చినట్టుంది..ఏం చేస్తాం చెప్పండి...కొన్ని బాకీలంతే...అవి కాలక్రమంలో కృతజ్ఞతలనే పేరు ఫిరాయించుకుని మీకే వాళ్లు బాకీ పడిపోతార్లెండి.

అయినా పొద్దున్నే ఎక్కడికా హడావిడి...ఓహో..ఇవాళ మీ పుట్టిన్రోజు కామోసు. అల్లో అల్లో అంటూ ఆ కాంట్రాక్టరు రావుగోపాల్రావు మీకోసం దండ పట్టుకుని సిద్ధంగా ఉన్నారా.  మిమ్మల్ని పొగడ్డానికి లేకుండా ఆ భజంత్రీలను ఏర్పాటుచేసారని కుంచెం కోపంగా ఉన్నా డనుకుంటా. మీ వెనకాలే వచ్చాడుగా ఆ నిత్యపెళ్ళికొడుకు నూతన ప్రసాదు మీకోసం మాంఛి పార్టీ ఏర్పాటు చేసాడా..సరి సరి...

ఏమిటీ మీరు కూడా కోపంగా ఉన్నారా...మీ కొత్తచొక్కా కనపళ్ళేదా...అయితే ఇందాకా ఆ అప్పారావు వేసుకున్నది అదే కామోసు.. ఆ కొత్త  చొక్కా  వేసుకుని జోబీల్లో డబ్బులన్నీ బాకీలు తీర్చేస్తు వెళ్ళాట్ట.... పరగడుపునే ఎంత పాపాష్టి పన్జేసాడూ అని మీ క్కుంచెం కోపంగా ఉందని నాకు తెలుసనుకోండి..కానీ అప్పారావు అలా చేసాడంటే ఊరికే చెయ్యడు లెండి. ఇచ్చుట పుచ్చుకొనుట కొరకే అని ఋణోపదేశం చేసాడు నాకు ఇందాకే...

ఇవాళ మీ పుట్టిన్రోజుకి మీకోసం సావాలమ్మగారు మాంఛి ఉల్లిపెసరట్లు వేసి పెట్టార్ట...మీరు వచ్చి తింటారా....అక్కడికే అంపించమంటారా.... అని ఇందాక వారు ఫోన్జేయించారు. డబ్బుల్లేవంటారా...అవును...వారు అట్టులు ఉట్టినే పెట్టరు లెండి....మన అప్పారావు కాతాలో రాయించేసాంగా.. గొడవైపోద్దని అంటున్నారా....వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు... మనం పరామర్శగా వెళ్ళి పలకరించి వద్దాం ఆనక.

నాకు తెలీకడుగుతా గానీ, ఏమిటండీ మీకు మరీ తొందర. ఈ పుట్టిన్రోజు కూడా మాతో జరుపుకోండీ అంటే వినకుండా అలా వెళ్ళిపోతున్నారిందాక...అక్కడెవరున్నారు చెప్పండి.... ఆ సొర్గంలో .....మాకన్నా మీకెక్కువ వాళ్ళు..ఆఁ..... ఆ ఎక్కువేమిటో...ఈ తక్కువేమిటో...తేల్చాల్సిందే. ఎవరో అలా రమ్మని పిలిస్తే ముందూ వెనకా చూసుకోకుండా వెళ్ళడమేనా అంటా..ఇప్పుడే రానూ...నాకవతల వల్లమాలిన  పనులున్నాయీ అని చెప్పలేరా అంట...

అసలు మీకు మొహమాటం మహా లావు... మీ మాటల్లోనే చెప్పాలంటే .. మీకు మోడెస్టీ మహలావు. అభిమానులకి మీరంటే ఉన్న ఇష్టం కన్నా, మీరు తీసే సినిమాలంటే జనానికి ఉండే ఇష్టం కన్నా, ఒకప్పటి తెలుగు హీరోయిన్ కన్నా, తెలుగువాళ్ళకి డబ్బింగ్ సినిమాల మీద మోజు కన్నా, తెలుగువారికి బాపుగారి బొమ్మంటే ఉన్న మోజు కన్నా, బాపురమణలకి రామాయణం కన్నా, సీగానపెసూనాంబకి బుడుగు మీద ఇష్టం కన్నా, గిరీశం  బుచ్చమ్మ దగ్గర కొట్టే పోజుకన్నా, గోపాలానికి రాధమీద ప్రేమకన్నా, ఇంకానేమో పక్కింటి పిన్నిగారికన్నా...

ఒక్కనాడయినా పన్నెత్తి పలకరిస్తారా అని మీ మాటకోసం ఎంత ఎదురుచూసేవాళ్ళం..ఏ సభ జరిగినా...రెక్కలు కట్టుకొని వాలిపోయేవాళ్ళం. హుఁ.... ......పలుకే బంగారమాయెరా అన్న తీరుగా నోట్లోంచి ఒక్కముక్క రాలిపడదే..ఒక్కమాట....కనీసం... ఊహు...లేదే. అన్నిటికీ  సమ్మోహనంగా ఓ చిరునవ్వే సమాధానం.  అప్పటికీ "రెండు ముక్కలు మాట్లాడతారు" అని ఇరికిద్దామని చూస్తే...."రెండు ముక్కలు"  అనేసి కూర్చుంటారా...ఆరి మీ తెలివి... బంగారం గానూ!! అవునులే..ఈ మాట నేర్పరితనం చూసేగా అందరం మీ బుట్టలో పడిపోయాం.

మీ ఎంటర్టైన్మెంటాలిటీ తెలిసిన వాడు కదూ ఆ ఇంద్రుడు - మీకోసం ఏవో ఏర్పాట్లు చేసే ఉంటాడులే...పుట్టిన్రోజు వేడుకలు జరపడానికి.. అందుకే కాబోలు ఆ తొందర. ఒకవేళ రంభ డాన్స్ ప్రోగ్రాం గానీ పెడతాడేమో  మీకు నచ్చకపోయినా సరే హలం డాన్సే బావుంటుందని నిజం చెప్పకండిస్మీ.... ఆ బృహన్నలకి రంభ   శాపం కథ తెలుసుగా.

మీరు అలా వెళ్ళారా మీ అభిమానులంతా ఒకటే గొడవ..ఆ సొరగలోకంలో మీరు ఎవరితోనో కోతి కొమ్మచ్చి ఆడడానికి వెళ్ళిపోయారంటూ. ఆయనేమన్నా చిన్నవాడా చితకవాడా వాడంతటి వాడు వాడు అని చెప్తే నమ్మడంలేదు. పైగా జాటర్ డమాల్ అంటున్నారు.అంటే అర్థంలేదుట. అర్థం ఎందుకు ఉండదూ.ఉంటుంది. తెలియాలి అంతే. కోతి కొమ్మచ్చి కాదూ, ఇంకోతికొమ్మచ్చి కూడా మనకోసమే రాసిచ్చారూ. అప్పు తీరుస్తున్నారూ అని చెప్తున్నాను. కాదని వాళ్ళ అనుమానం. అనుమానం అంటే అవమానం కదా.  అసలు మీరు రామాయణంలో రాముడికి సీత ఏమవుతుందా అనిఆలోచిస్తున్న ఆరుద్రని రామాయణం స్టోరీలో కొత్త ట్విస్టుకోసం అడగడానికి  వెళ్ళి వుంటారని నా అవమానం.

మనలో మాట ఆ సొరగలోకంలో ఏం సినిమా తీస్తున్నారేమిటి... అలా వెళ్ళారు...చెప్పాపెట్టకుండా.. రామాయణమా?!.....మళ్ళీనా....హతోస్మి. మీరు ఎన్ని సార్లు ఆ రామాయణాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కథని వండి సినిమా తీసినా చూడ్డానికి మేము లేమనా...అక్కడికెందుకు వెళ్ళారసలు?

కనీసం మీ ఫ్రెండుగారికయినా ఆ వయనం చెవినేసి వెళ్ళకూడదుటండీ.....
వెంకట్రావూ..నువ్వులేకుండా నా జీవితం గోడచేర్పు లేని ఫోటో ఫ్రేమయిపోయిందని ఆ పెద్దమనిషి ఆ పళాన దుఃఖిస్తూ ఉన్నారు కదా. శివుణ్ణేనా పార్వతి సగం లేకుండా భరిస్తాం  కానీ మీరు  పక్కన లేకుండా ఆయన్ని చూడగలంటండీ మేము...!!

ఈ మాత్రం ఆలోచన మీకెందుకు రాలేదు చెప్మా....

చాలా జరూరు పనిలో పోతూ  ఉండగా నేను ఆపేసినట్టుంది మీ వరస చూస్తే...ఏమిటో ఆ తొందర.

ఆరోజు మనం చివరాకరిగా కలిసినప్పుడు మీరేమన్నారో మీకు గుర్తుండదనుకోండి...శతకోటిలింగాల్లో ఓ బోడిలింగం మేము మీ అభిమానుల్లో కనుక. కానీ నాకు బాగా గ్నాపకం (నాకు ఎలా రాయాలో ఒచ్చినా సరే ఇలాగే రాస్తా)ఉంది. బాపూగారూ, మనవాళ్ళొచ్చారు ఫోటో తీయించుకుందాం అని పిల్చారా...అప్పుడు నా సంతోషం ఎంత తెలుసా....ఇరుగట్లూ తెంచుకుని పారే  వరద గోదారిలా.. ఆ ఫోటో తీయించుకున్న క్షణం మీ పక్కన నిలబడినకాలం అలా నిలిచిపోతే...నిధిచాలా సుఖమా...రమణ సన్నిధి చాలా సుఖమా అంటే రెండో దానికే కదా నా ఓటు.

మీరు నాకు ఒకసారి...ఒకేసారి...ఒక్కసారేననుకోండి. ఓ ఉత్తరం రాసారు తెలుసా. ఆఉత్తరం ఒకటా రెండా ...రెండు పేజీలు...రెండువేపులా నిండు పేజీలు...అందులో ఏం రాసారో పదమూడో ఎక్కం అంత కాదుకానీ నాకు కంఠతావే.
అభిమానంతో రాసే ఉత్తరాలకి జవాబు రాయడం కష్టం...ముందు ముందు మీకు ఈ విషయం తెలియగలదు అని రాసారు.. తీపి శాపాలు అంటారు ఇలాంటివే కాబోలు...మీ వాక్కు అమోఘం. రచైతలు స్రష్టలే కాదూ ద్రష్టలు కూడా అంటారు. అంటే ఇదేనేమో మరి.  మీరు పెట్టిన ఈ శాపం ముందుముందు ఫలించబోతోందని నాకప్పుడు తెలియకపోయినా అనుభవంలోకి వచ్చినప్పుడల్లా మీరు గుర్తొచ్చారుస్మీ.

హేమిటీ...ఇందాకట్నుంచి ఆ సెల్ ఫోన్ వెలుగుతుంటే అలా కట్ చేసేస్తున్నారూ...కనీసం శబ్దమయినా లేదే.. వైబ్రేషన్ లో ఉన్నట్టుంది. ఓహో..పార్టీ టైమవుతోందని  ఎవరో ఫోన్ చేస్తున్నారా...మరిహనేం వెళ్ళిరండి...అవునుగానీ  మరీ ఇంత మొహమాటస్తులు మీరు.. ఆ స్వర్గంలో దొంగ దేవతల మధ్య ఎలా నెట్టుకొస్తున్నారండీ... వడ్డించే వాళ్ళు మనవాళ్ళయితే పంక్తిన ఏ కొసన కూర్చున్నా ఫరవాలేదు కానీ.

ఓ పన్చేయండి ....  ఆ కాంచనమాలనో, దివ్యభారతినో,  పక్కకి పిల్చి ఎక్స్ వారి నెక్స్ట్ పిచ్చర్ లో  మోహిని వేషం ఇస్తాననో ఇప్పిస్తాననో  చెప్పండి. ఆ కాఫీలవేళ అమృతం పంచినప్పుడు ఓ లోటాడు ఇటు ఫిరాయించమని పురమాయించండి. అది పుచ్చుకుని ఇంచక్కా తాగేసి  ఇటువేపు ఒచ్చేయండి....మేమంతా మీకోసం కాచుక్కూచున్నామని మర్చిపోకండి...

హలో...హలో.. రమణగారండోయ్......
చాలా దూరం వెళిపోయినట్టున్నారు... ఇహ ఆయన మరి రారు...మనమే ఎప్పుడో వెళ్ళాలి.




































36 comments:

  1. శ్రీ ముళ్ళపూడి వారికి అద్భుతమైన నివాళి !!!

    ReplyDelete
  2. మన పిచ్చి గానీ అంతోటి బాపూ కన్నీళ్ళతో రమ్మని పిలిస్తేనే రాలేదు మనం పిలిస్తే మాత్రం వస్తారటండీ? అయినా ఆయన రాములోరి దగ్గర సీతమ్మోరి చేత బర్త్ డే స్పెషల్ వడపప్పు చేయించుకుని తినేస్తూ ఉండుంటాడు. మన మాటెందుకు వింటాడు? అయినా తప్పు ఆయనది కాదు లెండి. ఆ రాములోరిది. తన దగ్గరున్న కోతి చాలక ఎడా పెడా కోతి కొమ్మచ్చులాడేస్తున్న ఈయన్ని చూసి ముచ్చటపడిపోయి ఆ ఫళంగా కబురెట్టి రప్పించేసుకున్నాడు. ఆంజనేయుడి గుండెల్లో తానున్నట్టు అభిమానుల గుండెల్లో రమణ ఉంటాడని ఆయనకి తెలిసినట్టు లేదు. అయితే ఏం హనుమంతుడి లానే మన రమణా మన గుండెల్లో చిరంజీవే. తెలుగు అక్షరాలు బ్రతికి ఉన్నంత వరకు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు.

    ReplyDelete
  3. Nice post. మరోసారి రమణ మాటల్ని స్మరించుకునే అవకాశం కల్పించారు.

    రమణ ఆ లోకానికెళ్ళి అప్పు...డే నాలుగు నెలలు అయిపోయిందా?

    ReplyDelete
  4. చాలా బాగారాశారు సుధగారు, రమణ గారికి అధ్బుతమైన నివాళి. ఏవిటో ఆయన లేరన్న విషయం పూర్తిగా మర్చిపోయాను... ఎక్కడో దూరంగా హైదరాబాద్ లో కూర్చుని రాసుకుంటుండిఉంటారు ఇహనో ఇప్పుడో కోతికొమ్మచ్చి తరువాయిభాగంతోనో, లేక ఒక అద్భుతమైన సినిమాతోనో, మనల్ని మనమే మరిచిపోయి చదువుకునే పుస్తక రూపంలోనో, లేదా ఒక మంచి పుస్తకానికి ముందుమాటతోనో ఏవోయ్ ఎలా ఉన్నావ్ అంటూ పలకరించకపోతారా అనే భ్రమతోనే బ్రతికేస్తున్నాను.
    >>హలో...హలో.. రమణగారండోయ్......
    చాలా దూరం వెళిపోయినట్టున్నారు... ఇహ ఆయన మరి రారు...మనమే ఎప్పుడో వెళ్ళాలి.<<
    లైన్ చూడగానే నాకు తెలియకుండానే నా కళ్ళు తడిశాయి.

    ReplyDelete
  5. నవ్వుకి పుట్టిన రోజు.

    శంకర్ గారు అన్నట్టు,

    >>>తెలుగు అక్షరాలు బ్రతికి ఉన్నంత వరకు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు.

    ఆయన తెలుగు వాడిగా పుట్టడం తెలుగు వాడి అదృష్టం.

    ReplyDelete
  6. ఏం సుధమ్మా, నీకిదేమన్నా బావుందా ? ఇంతలా కళ్ళంట నీళ్ళొచ్చేలా రాస్తే మేం చదవాలా వద్దా ? ఇంత గొప్ప నివాళి మన రవణకి నీలాంటి రవణ అభిమానులే ఇవ్వగలరు.

    ReplyDelete
  7. @ పైనున్న రమణగారి అభిమానులందరికీ కలిపి ఒకే మాట...

    ఒక్కసారి మన నిజం హీరో ఏమన్నారో గుర్తుతెచ్చుకోండి...నవ్వొచ్చినప్పుడు ఎవడేనా నవ్వగలడు. ఏడుపొచ్చినప్పుడు కూడా నవ్వే వాడే హీరో అన్నారా ...లేదా. అందుకే మనందరం నవ్వేద్దాం...కళ్ళలో నీళ్ళు ఎవరూ చూడకుండా... ఆనక ఒంటరిగా ఉన్నప్పుడు ఆసంగతి చూసుకోవచ్చు కావఁస్తే.

    ReplyDelete
  8. రమణ గారి నివాళిలలో నేను చదివిన వాటిల్లో మీది,శంకర్ గారిదీ బెస్ట్.

    ReplyDelete
  9. సుధ గారూ ఎంత బాగా రాసారండీ!...చదువుతున్నంతసేపు ఎంతో ఎంజాయ్ చేస్తూ చదువాను..కానీ చివరాఖరికి అప్రయత్నంగా కళ్లంట నీళ్ళు వచ్చేసాయి...వారు ఇక లేరు అన్నది మింగుడుపడట్లేదు :(

    ReplyDelete
  10. మీ పోస్టు నా బజ్జులో పెట్టుకున్నాను....అంత నచ్చింది.

    ReplyDelete
  11. సౌమ్యా...

    మీ బజ్ లో కూడా పెట్టుకుని దీన్ని( ఈ పోస్టుని) బావుందని బజాయిస్తున్నందుకు చాలా థాంక్స్...

    ReplyDelete
  12. ఎంత బాగా రాసారండీ!.

    ReplyDelete
  13. Sudha gaaru,
    danyavadalu miku ...
    chaduvuthu unte nijnaga swargam lo amrutham ramana gariki ichhesi ikkadiki pampithe entha bavunnu kada anipisthondi...
    --
    Sudha.

    ReplyDelete
  14. వహ్ వా సుధా గారూ.. అధ్బుతమయిన పోస్ట్ రాసారు. ముళ్ళపూడి గారు రాసిన అధ్బుతమయిన కధలూ, సినిమాలు, గొప్ప క్యారెక్టర్లూ అన్నిటినీ తట్టిలేపారు.
    నాకు చాలా చాలా నచ్చేసిందండీ

    >>>>అసలు మీకు మొహమాటం మహా లావు... మీ మాటల్లోనే చెప్పాలంటే .. మీకు మోడెస్టీ మహలావు. అభిమానులకి మీరంటే ఉన్న ఇష్టం కన్నా, మీరు తీసే సినిమాలంటే జనానికి ఉండే ఇష్టం కన్నా, ఒకప్పటి తెలుగు హీరోయిన్ కన్నా, తెలుగువాళ్ళకి డబ్బింగ్ సినిమాల మీద మోజు కన్నా, తెలుగువారికి బాపుగారి బొమ్మంటే ఉన్న మోజు కన్నా, బాపురమణలకి రామాయణం కన్నా, సీగానపెసూనాంబకి బుడుగు మీద ఇష్టం కన్నా, గిరీశం బుచ్చమ్మ దగ్గర కొట్టే పోజుకన్నా, గోపాలానికి రాధమీద ప్రేమకన్నా, ఇంకానేమో పక్కింటి పిన్నిగారికన్నా... >>>

    >>శివుణ్ణేనా పార్వతి సగం లేకుండా భరిస్తాం కానీ మీరు పక్కన లేకుండా ఆయన్ని చూడగలంటండీ మేము...!! >>

    ఈ రెండు లైన్స్ కీ చప్పట్లు..అండీ..
    ముళ్ళపూడి వారికి గొప్ప నివాళి..!

    ReplyDelete
  15. అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను. ...అంటే చెప్పలేను అని అర్థం అన్నమాట!!

    ReplyDelete
  16. సుధా గారు పెద్ద వాళ్ళను అనకూడదు కానీ మీ రమణ గారికి టైం మేనేజ్ మెంట్ అస్సలు తెలియదండి . మీరు ఆగమని చెప్పినా వినిపించుకోకుండా అలా వెళ్లి పోయారు. ఆయన్ని అభిమానించే భుడుగులందరూ రిటైర్ అయ్యేంత వరకు ఉంటే యెంత బాగుండేది . అందరం కలిసి ఆయనకు నచ్చినట్టు కోతి కొమ్మచ్చి ఆడుకొనే వారం కదా . అక్కడ అమృతం తాగుతున్నాడని అనుకుంటున్నారు కానీ హాస్యామృతం ముందు ఉట్టి అమృతం ఎందుకండి. హాస్యామృతం తాగిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఉన్నారా ? అదే అమృతం తాగిన ఇంద్రుడిని చూడండి . భయం భయంగా ఎప్పుడూ కుర్చీ కింద దాక్కుంటాడు. సుధా గారు మీ గురువు గారికో మాట చెప్పి ఆ ఇంద్రుడికి కాసింత హాస్యామృతం పంచమనండి. అప్పుడు కొత్త ఇంద్రుడిని చూడొచ్చు అక్కడినుంచి రమణ గారు మీ పోస్ట్ చదివి ముసిముసిగా నవ్వుకుంటున్నారు చూశారా ? ( ఆదివారం సాక్షి బుక్ లో రమణ గురించి చూడగానే ౨౮న రమణ పై మీ పోస్ట్ ఉండి తీరుతుందని అనుకున్నాను. రమణ ఉంటే చదివి తలమీద అభిమానంతో చిన్నగా ఒక్కటి వేసే వారు అలా ఉంది )

    ReplyDelete
  17. తెలుగంత చక్కగా రాసారు. రమణంత బాగా ఏడ్పించారు.
    రమణ అప్పుడప్పుడూ సినిమాల్లో నిదురించే తోటలో అనో, ఆయీ ఆయీ అనో ఏడ్పిస్తూ ఉంటే, ఏడ్చి నవ్వేస్కొనేదాన్ని. ఇప్పుడేమో, రమణని తల్చుకున్నప్పుడల్లా ఏడ్పిస్తున్నాడు.) ఆ..ఆ.. వినబడింది సుధ గారండీ! ఏడ్పొచ్చినా నవ్వేవాడే హీరో! :)

    ReplyDelete
  18. శాపం ఇచ్చింది ఊర్వశి, అర్జునుడికి
    రంభ, బృహన్నలకి కాదు
    బాపు గారన్నది - గోడ లేని చిత్తర్వు ఐనానని
    గోడ చేర్పు లేని ఫోటో ఫ్రేం అంటే ఆ అందం రాలేదు
    తక్కినది బాగుంది

    ReplyDelete
  19. @Devika Sai Ganesh Puranam గారు మీరు సూచించిన విషయాలు ...నిజమే. ఊర్వశి అర్జునుడికి ఇచ్చిన శాపమే బృహన్నలగా రూపుదాల్చవలసిన అవసరం కలిగించింది. రంభ అని తప్పుగా రాసాను. బాపుగారన్న మాట అంటారా...నిజమే..దాని భావం మాత్రమే నాకు అర్థమవడం వలన ఆ వాక్యం అలా వచ్చింది. సవరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. యెంత బాగా రాశారో... ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా నచ్చిన టపాల్లో ఇదొకటి...

    ReplyDelete
  21. అబ్బో అబ్బో...మా నెమలికన్ను మురళిగారు మెచ్చారంటే...బావుందన్నమాటే...ధన్యవాదాలు మురళిగారూ..

    ReplyDelete
  22. ముళ్ళపూడి కి మీరిచ్చిన నివాళి ఆసక్తి కరంగా వుందండీ...బావుంది!

    ఓలేటి శ్రీనివాస భాను

    ReplyDelete
  23. సుధా గారు,
    కొందరిని తలుచుకుంటే మనోల్లాసం కలుగుతుంది.. గర్వమనిపిస్తుంది.. ముళ్లపూడి మన సొంతమనుకునే అలాంటి వ్యక్తుల్లో ఒకరు. ముళ్లపూడి అభిమానులందరూ మీ భావాలతో కనెక్ట్‌ అవుతారు. అతన్ని గుర్తుచేసుకునే ఆహ్లాదమైన అనుభవాన్ని మాకిచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  24. మరీ మీరు అట్లా రాసేస్తే ఎలా? మీర్రాసినదాంట్లోంచే రమణ అంతలా తొంగి చూస్తుంటేనూ..?

    ReplyDelete
  25. ippudippude swargam lo navvadam nerchukuntunnaru..
    appude venakki pilicheste bagundademo??

    Brilliant blog andi!!

    Subhadra

    ReplyDelete
  26. @భానుగారు,
    ధన్యవాదాలు
    @మురారిగారు, నిజమండి. రమణగారి రచనలను చదివినవారికే ఇందులోని ఆనందం అనుభవైకవేద్యం...నా బ్లాగ్ కి వచ్చి చూసి వ్యాఖ్య పెట్టినందుకు చాలా చాలా సంతోషం.

    ReplyDelete
  27. నారాయణగారు, కొత్తరకంగా అభినందించారు కదా..చాలా థాంక్స్.

    ReplyDelete
  28. @సంపత్/సుభద్ర,
    అలా అంటారా...స్వర్గంలో దేవతలకి కూడా ఆ ఛాన్సిద్దామంటారు అంతేనా..సరే..మరలాక్కానివ్వండి..

    ReplyDelete
  29. అబ్బబ్బా! సుధా.. ఎంత బాగా రాశావు తల్లీ.. నా కంటే కుంఛెం చిన్న కదా అందుకని నువ్వనేస్తున్నాను.. ఏమనుకోవు కదూ! అనేశాక ఇంక అనుకున్నా ఏం లాభంలే..
    ఈ నివాళి స్వాతికో ఇంకే పత్రిక్కో పంపిస్తే రమణగారి అప్పారావులంతా ఆనందిస్తారు కదా! అంటే నా ఉద్దేశ్యం.. అందరూ బ్లాగులు చదవరేమోనని..
    అసలు రమణగారి స్వర్గారోహణం అప్పుడు కన్నా ఇప్పుడు ఛాలా ఎక్కువ ఏడుపొచ్చేస్తోంది. అంటే ఆత్మీయుల పరామర్శలాగన్నమాట. మళ్ళీ ఒక్క సారి గాట్టిగా మన బుడుగు ఏట్సెట్రాలని గుర్తు చేసినందుకు..(అసలు మర్చిపోలేదనుకో..) వేవేల కృతజ్ఞతలు.
    Manthaa Bhanumathi.

    ReplyDelete
  30. @మంథా భానుమతిగారూ...అబ్బబ్బబ్బబ్బ..ఎంచక్కా మెచ్చుకున్నారండి్.
    నువ్వు అనేస్తే మరీ బాగుంది..ఈమధ్య ఆంటీ అనిపించుకుంటున్నాక అందరూ మీరు అనే అంటున్నారు కదా..మీరు నువ్వు అంటే మళ్ళీ చిన్నదాన్నయిపోయి హాయిగా ఉంది.
    మీకు నచ్చినందుకు సంతోషం అండి. నిజమే..బ్లాగులో రాస్తావెందుకు..ముందు పత్రిక్కే పంపి తర్వాత బ్లాగులో పోస్టుచేసుకో అని చాలా మంది చెప్తారు. కానీ నాకు నా బ్లాగుమిత్రులు చూసి వెంటనే ఏదో చెప్పేస్తే ఈ ఫీడ్ బాక్ చాలనిపిస్తుంది.వాళ్ళు బావుందంటే కొండంత తృప్తిగా ఉంటుంది.
    వ్యాఖ్యరాసి అభినందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  31. చాలా బాగా రాసారు ....రమణ కు జేజే కూడా చాలా బాగా రాసారు !

    ReplyDelete
  32. చాలా బాగారాశారు సుధగారు
    నిలబడి తలవంచి మీకు అభివాదం అంతకన్నా ఏమి చెప్పలేను ...శైలు

    ReplyDelete
  33. నిజమా శైలూ...అంటే ఏంటి నేనేదో అబద్ధం చెప్పేదానిలా అంటారేమోనని డౌటొస్తోంది...చాలా చాలా థాంక్స్ శైలూ.
    ఒక మంచి రచయిత్రినుంచి ఇలాంటి పొగడ్త అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను సుమా.

    ReplyDelete
  34. ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు...ప్రతిసారి కంట తడి .... అయినా "ఏ కన్నీరు యనక ఏముందో" అన్నట్టుగా నా కన్నీరు వెనక కాస్త బాద కాస్త సంతోషం....
    అంతోటి రమణ గారు లేరని బాధ ... లేదు లేదు ఇంతోటి అభిమానం ఉంటె అయన మనతోనే ఉంటాడని, మన లోనే ఉన్నాడని నమ్మకంతో చిన్న ఆనందం ....
    మీ పద నివాలికి ఏమి ఇస్తే సరిపోతుంది... "మా" రమణ గారిని "మీ" రమణ గారే అనేదామని ఉన్న .. (తెలుసుగా మీకు ఎంత కష్టమో) మన రమణ గారి ఆశీస్సులు
    మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...

    హిమ సాగర్

    ReplyDelete
  35. చాలా చక్కటి చిక్కటి నివాళి.చదువుతుంటే మీరు ముళ్ళపూడి రచనలు ఎన్నో సార్లు చదివారనిపిస్తుంది లేకపోతే రచనలో ఆ పరుగు ప్రవాహం రాదు.వారి భాషలోనే ఓకే మహారచయితకు నివాళు లర్పించి,మీరూ ఒక చేయితిరిగిన రచయిత్రి అనిపించుకున్నారు.ఆ సాహితీ చిరంజీవి తీపి శాపాలు నిజం అవుతాయని నమ్ముతూ,వారెక్కడ వున్నా వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుండాలని కోరుతూ...tvs rao

    ReplyDelete