05 December 2011

రసార్ద్ర కారుణ్యసింధువు " కరుణశ్రీ "


జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పేరు తెలుగు సాహిత్యంలో ఏమాత్రం అభిరుచి ఉన్నవారికైనా తెలియనిది కాదు. మరీ ముఖ్యంగా ఆయన అసలు పేరుతోనే కాక కలంపేరు కరుణశ్రీ తో కూడా ప్రసిద్ధులే. 

తింటే గారెలే తినాలి – వింటే భారతం వినాలి అంటారు. ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు విన్నా మొహం మొత్తని గొప్పరుచి వీటిలో ఉందనే భావంతోనే. అలాగే ఎన్నిసార్లు  కరుణశ్రీ  సాహిత్యం గురించి చెప్పుకున్నా అందులోని గొప్పదనానికి తరుగులేదు. తొలిసారిగా 1944 లో ముద్రించబడిన నాటినుంచి 1972 లో రజతోత్సవం చేసుకున్ననాడే కాక ఇటీవలి 5 భాగాలుగా వెలువడిన ఉదయశ్రీ సమగ్ర సంపుటి వరకు ఆయన సాహిత్యం ఎప్పటికప్పుడు సరికొత్త పాఠకులను ఆకర్షిస్తూనే ఉంది.  అంతకుముందు ఏ పద్యాలు రాసారో  తెలీదు కానీ మొట్టమొదట 1942లో పుష్పవిలాపాన్ని ఆయన పనిచేసిన క్రిష్టియన్ కాలేజీ కళాశాల పత్రికలో అచ్చయితే చూసిన మిత్రుడి ప్రోత్సాహంతో ఉదయశ్రీగా ఆయన కవితలు సంపుటంగా  1944 లో వెలువడ్డాయి.

పాపయ్యశాస్త్రిగారి  పద్యాలు ప్రజా బాహుళ్యంలో పొందిన జనాదరణ అంతా ఇంతా కాదు. మొదటిసారిగా మహావాది వెంకటప్పయ్యశాస్త్రిగారు పుస్తకంగా రాకమునుపే మధురంగా గానం చేసారట. ఆ తరువాత ఆ పద్యాలను తన గాంధర్వగానంతో తెలుగుదేశం నలుమూలలకు వినిపించి ఆబాల గోపాలాన్ని పరవశింపజేసిన ఘనుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. అందమైన పూవుకు  తావితో పాటు ముచ్చటగొలిపే వర్ణసముదాయం కూడా  అబ్బినట్టుగా ఈ పద్యాలకు  వడ్డాది పాపయ్యగారు రచించిన చిత్రాలు కూడా జతపడ్డాయి. రస హృదయులను ఆనంద డోలికలలో మునకలు వేయించిన త్రివేణీ సంగమం ఈ ముగ్గురి సంగమం – ఉదయశ్రీ  కావ్య సంపుటి.

ఉదయశ్రీ లో జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు మూర్తీభవించిన కారుణ్య స్వరూపులుగా మనకి కనిపిస్తారు. ఒకటీ రెండూ కావు. ఈ సంపుటిలోని కావ్య ఖండికలన్నిటిలోనూ హృదయాలను ద్రవీభూతం చేసే కరుణరసం తొణికిసలాడుతూనే ఉంటుంది. కొన్ని ఖండికలలో ప్రణయం  ప్రధానమైన కావ్య వస్తువైనప్పుడు కూడా దాని నేపథ్యంలో కవి  భాషలో కరుణాంతరంగతరంగాలు చేసే ధ్వని వినిపిస్తూనే ఉంటుంది.

ఉదయశ్రీలో ఎన్నో కవితా ఖండికలు ఉన్నాయి. చాలా కవితలు ప్రత్యేకంగా కథనాత్మకమైన శైలిలో, గొప్ప పాత్రచిత్రణతో నాటకీయతను సంతరించుకుని సజీవంగా ఎదుటనిలిపే కవి వ్యాఖ్యానంతో ఒక గొప్ప కథాకావ్యాన్ని చూస్తూ వింటున్న అనుభూతిని కలిగిస్తాయి.  ఈ కవితలు ఉదయశ్రీలో దాదాపు 36 ఖండికలు. భావకవితా ఉద్యమం ఉధృతంగా ప్రభంజనంగా వీస్తున్న వేళ రాసిన కవిత్వం కాబట్టి ఆ ఉద్యమ ధోరణుల ప్రభావం ఈ కవితల మీద ఎక్కువగా కనిపిస్తుంది. దేశం మీద భక్తి, ప్రణయం, ప్రేయసిని దేవతగా ఆరాధించడం, భగవంతుడి ఆరాధన, పురాతన వైభవం ప్రశంసించడం, ఒక్కోసారి పలాయన వాదం, నిరాశాపూరితమైన ధోరణి, ప్రపంచంనుంచి ఏకాంతవాసాన్ని కోరుకోవడం ఇవన్నీ భావకవిత్వ ధోరణిలో మనకు ప్రధానంగా కనిపించే అంశాలు. ఈ కవిత్వం అంతా ప్రధానంగా ఆత్మాశ్రయ కవిత్వంగా ఉంటుంది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ రచన భావకవిత్వానికి ఎత్తిన జయ పతాకం. అందుకే ఆ ఛాయలన్నీ ఈ సంపుటిలో మనకు కనిపిస్తాయి.

సహజకవి, ఆంధ్ర మహాభాగవత కర్త,   పోతన పద్యాలు నోటికిరాని తెలుగువాళ్లు అరుదుగా ఉంటారు. మన జాతీయాలలోను, నుడికారంలోనూ, తెలుగు జీవన స్రవంతిలోను అంతగా రక్తంలో లీనమైన పోతన -  పాపయ్యశాస్త్రిగారిని అత్యంత బలంగా ఆకర్షించిన కవితా శక్తిగా కనిపిస్తాడు. ఎన్నో కవితలలో పోతన కవితా శైలిని అనుకరించడమే కాక పోతన మీద అతనిపై తన ఆరాధనను వెల్లడించే ఓ కవితాఖండికను కూడా రచించారు  పాపయ్య శాస్త్రిగారు.

భావకవిత్వ ధోరణిలోని కవితా లక్షణాలను దృష్టిలో పెట్టుకొని పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ  కవితలను చూస్తే –

ప్రణయం ప్రధాన వస్తువుగా తీసుకుని రచించిన కవితలు కరుణామయి, పారవశ్యము, విశ్వప్రేమ, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ,  వైశాఖి,  ప్రాభాతి,  మధురస్మృతి, కల్యాణగీతి, రాట్న సుందరి,  తపోభంగము  పేర్లతో ఉన్న వి కనిపిస్తాయి. ఈ ప్రణయం ఎక్కువగా  ప్రేమతత్వానికి మారురూపయిన రాధాకృష్ణులు నాయికా నాయకులుగా కనిపించే కవితలు కనిపిస్తాయి. వాటితో పాటు ప్రకృతి పురుషులుగా ప్రణయతత్వాన్ని నిరూపించిన శివపార్వతులు కూడా.

దేశభక్తిని కలిగి ఉండడం, దేశాన్ని కన్నతల్లిగా భావించడం, తల్లి ఋణం తీర్చుకోవడం వంటి భావనలు భావకవిత్వంలో ప్రముఖంగా కనిపించే విషయాలు. అలాగే పురాతనమైన మన సంస్కృతి పట్ల అభిమానాన్ని వ్యక్తపరచడం, కీర్తించడం కూడా. ఈ ధోరణిలో తెలుగు తల్లి, స్వేచ్ఛా పుష్పాలు, మాతృశ్రీ, నవవధువు వంటి కవితలు కనిపిస్తాయి. బ్రిటిష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న భారతావనిని చెరలో ఉన్న తల్లిగా భావించి ఆ చెరవిడిపించడం కర్తవ్యంగా భావించి ఉద్బోధ చేసారు ఆనాటి కవితాకుమారులు. ఆ విధమైన భావాలు ఈ కవితలలో కనిపిస్తాయి. వీటితో పాటు పురాతన వైభవాన్ని స్మరించే అంశాలతో కవితాకుమారి, జయోస్తు, కవితా వైజయంతి, పోతన కవితలు ఉన్నాయి. వీటిలో ఆంధ్ర విద్యార్థి కవిత ప్రబోధాత్మకంగా సాగుతుంది. కవిత్వం పట్ల తన ఆరాధనా భావాన్ని ఒక కవితారాధకుడిగా, ఆమెను తన ప్రేయసిగా ఊహిస్తూ రాసిన కవిత – జ్యోతిర్మయి. ఈ కవితలో ఆ కన్య - కవికి ఎన్నెన్ని రూపాలలో దర్శనమిస్తుందో.

భావకవిత మహోద్యమంగా సాగుతున్న కాలంలో యావదాంధ్ర దేశంమీదనే కాక తెలుగు  సమాజంమీదకూడా  బెంగాలీ సాహిత్య ప్రభావం  చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రవీంద్రుడి గీతాంజలి ప్రభావం తెలుగు సాహిత్యంమీద ఇంతింతనరానిది. మిస్టిక్ పొయెట్రీ అనే పేరుతో తాత్వికత, మార్మికతతో భగవంతుడి రూపాన్ని వెతుక్కుంటూ కవి చేసే ప్రయాణం, భగవంతుడిని ఆరాధించడం, అమూర్తంగా భావించే నిరీశ్వర వాదం వంటి లక్షణాలు కూడా పాపయ్యశాస్త్రిగారి కవిత్వంలో మనకు గోచరిస్తాయి.అంజలి, ఉషస్సు గీతాలలో  ఆ ప్రభావాన్ని చూడగలం. వీటిలో ఆ ప్రభావంతో పాటుపాపయ్య శాస్త్రిగారు తాను దర్శించిన విశ్వమయుడిని,  కరుణ పట్ల తనకు గల పారవశ్యంవలన, కరుణరసాధిదేవతగా భావించే బుద్ధుడిని  జగతిని జాగృతపరిచే భానుడిగాను,  బుద్ధభగవానుడిగా భావించి రచించిన కవితలు ఉదయశ్రీ, ఉత్తిష్ఠ, కరుణామూర్తి, కరుణాకుమారి  కావ్య ఖండికలు.

ముఖ్యంగా పాపయ్యశాస్త్రిగారి కవితా తత్వం అంతా కారుణ్యమే. మూర్తీభవించిన కరుణగా యావత్ప్రపంచం తలిచే, కొలిచే బుద్ధదేవుడి కారుణ్యత్వం శాస్త్రిగారిని ఎంతగా ఆకర్షించిందో. కేవలం కవిత్వంలో ప్రదర్శించడానికి కాక ఆ కరుణామూర్తి జీవితాన్ని తన జీవితాదర్శంగా భావించి  దాన్ని అనుభవించి ఆచరించిన దివ్య మూర్తిమత్వం పాపయ్యశాస్త్రిగారి కవిత్వంలో మనకు కనిపిస్తుంది. పుష్పవిలాపం, సార్థకత,బీదపూజ  వంటి ఖండికలు సుతిమెత్తని కవి హృదయస్పందనలు వినిపించే కారుణ్యగీతాలు. "బుద్ధదేవుని భూమిలోన పుట్టినాడవు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి!!" అంటూ పూలతో మానవుడిని  చీవాట్లు పెట్టించే ఘట్టంలో కూడా తన ఆరాధ్య దైవాన్ని స్మరించడం మానలేదు పాపయ్య శాస్త్రిగారు.

కరుణకూ, కవికీ అవినాభావమైన సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వమూ లేదు అని భావించారు పాపయ్యశాస్త్రిగారు. భగవంతుడి సృష్టిలో అడుగడునా కారుణ్యపు విశ్వరూపాన్ని దర్శించిన కవి కనుకే ఆ కరుణకుమారిని తన జీవత సహచరిగా, కావ్యాలలో ఆరాధ్య దేవతగా కొలిచి ఆమె రూపాన్ని తెలుగు పాఠకులకు అద్భుతంగా రూపు కట్టించారు. తన కరుణకుమారిని స్త్రీగా భావించి ఆమె అంగాంగంలోనూ అద్వితీయమైన కరుణని చూసారు.

 బుద్ధుని ఆర్ద్ర పూరితమైన నేత్రాల తెరల మధ్య నుంచి ఆమెని తొలిసారిగా చూసారట పాపయ్యశాస్త్రిగారు.
ఆమెవదనంలో  ఊర్మిళాదేవి  తనను విడిచి వెళ్ళిన సౌభాగ్యం కోసం వెతుకాడే ఉత్కంఠని చూసారు. ఆమె కంఠంలో పాషాణ హృదయులనైనా కరిగించివేసే పుష్పాల ఆవేదనను విన్నారు. ఆమె నిట్టూర్పులో కుంతీకుమారి గుండెలలోని వేడి ఊర్పుల ప్రతిధ్వనిని విన్నారు. ఆమె తడి నయనాలలో యముడు తీసుకుపోతున్న తన ప్రాణసఖుని ప్రాణాలకోసం ఆతని వెంటపడి పోతున్న సావిత్రి  రూపాన్ని చూసారు. ఆ కరుణామయి చల్లనిచేతులలో  పరవశించిపోయే కృష్ణసఖి  రాధని  దర్శించారు. కరుణామూర్తి అయిన ఆమె కంటినీటి జడివానలో  శాస్త్రిగారు సంతోషంగా పులకరించారు. ఆ కరుణా గంగా ప్రవాహంలో మునకలు వేసారు. ఆ కన్నీళ్ళను దోసిలితో తాగి తనను అమరుడిగా చేసుకున్నారు. 

ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై, ఎవ్వనియందుడిందు - అంటూ పోతన చెప్పిన భగవత్స్వరూపాన్ని కరుణ రూపంలో దర్శించారు శాస్త్రిగారు. జీవితం కరుణామయం. ప్రపంచం కరుణలోనే పుట్టి కరుణలోనే పెరిగి కరుణలోనే విలీనమవుతుంది  అని చెప్పిన గొప్ప కారుణ్యహృదయం శాస్త్రిగారిది.

ఉదయశ్రీ లోని  కవితలలో పాపయ్యశాస్త్రిగారు చిత్రించిన స్త్రీమూర్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు. స్త్రీల పట్ల, వారి బహిరంతర చిత్తవృత్తిపట్ల గొప్ప గ్రహింపుశక్తి, లోకానుభవం ఈ పాత్రలలో వ్యక్తమయ్యాయి. ప్రణయమయి రాధ, తాపసి అయిన తన ప్రియుని  చేరబోయిన హైమవతీ, రాముని ప్రణయమూర్తి సీతాదేవీ శాస్త్రిగారి కవితా కన్యకలు.   

పాపయ్యశాస్త్రిగారు కరుణని ప్రధానమైన వస్తువుగా గ్రహించడం వలన రూపుదాల్చిన పాత్రలు ఊర్మిళాదేవి, అనసూయాదేవి, సావిత్రి, కుంతీకుమారి పాత్రలు. ఈ పాత్రలు పురాణ పాత్రలే అయినా వాటి లో స్త్రీసహజమయిన భావాలన్నిటితోను రక్తమాంసాలను అద్ది ఒక్కొక్క ప్రత్యేకత తో ప్రాణ ప్రతిష్ట చేసారు. ప్రణయ గాథలా కనిపించే గౌరీపరిణయఘట్టంలో కూడా వారిరువురూ ఏకమయే ఘట్టంకన్నా, వారి ఐక్యతకోసం  తాను మసిగా మారిన మన్మథుడు, అతని ప్రియబాంధవి రతీదేవి దుఃఖాన్ని  చూపిన సన్నివేశం   పాపయ్యశాస్త్రిగారి కరుణాసాగరంలోని  రోమాంచకమైన కల్లోలతరంగం..

ఒక్కొక్క కవితాఖండికా ఒక్కొక్క అద్భుతమైన అవ్యక్తమైన మాధుర్యాన్ని నింపుకున్న రసభరితమైన ఫలం. ఆస్వాదించేవారిదే ఆలస్యం.





24 September 2011

అపురూపమైన కథాకావ్యం – ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’



గురజాడ అప్పారావు గారి కథాకావ్యం – ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’ 
నూటికో కోటికో...ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నాడో సినీకవి.  తెలుగుతేజం, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అలాంటి వ్యక్తులలో ఒకరు. దేశమంటే మట్టికాదోయ్!! దేశమంటే మనుషులోయ్!! ’ అంటూ చాటిచెప్పిన మహాకవి గురజాడ, సంఘ సంస్కరణకోసం కలంపట్టారు.  స్త్రీజనోద్ధారణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తితో సమకాలిన సమస్యలపై  పోరాటానికి  కలాన్ని కత్తిలా ఝుళిపించారు. 

గురజాడ గొప్ప సంఘ సంస్కర్త మాత్రమే కాదు అంతకు మించిన చదువరి. ఇంగ్లీషుచదువుల వలన సమకూర్చుకున్న తన జ్ఞానాన్ని తన జాతిజనులకు పంచి పెట్టడానికి పూనుకున్నారు. తన రచనలవలన సాధించవలసిన సాంఘిక ప్రయోజనం గురించి పూర్తి అవగాహన ఉన్న కవి కనుకనే,  తాను ఎవరికోసం కలం పట్టారో ఆ ప్రజలు అర్థం చేసుకోవలసిన భావాలను వారు మాట్లాడే భాషలోనే చెప్పదలచుకున్నారు.  కవి తన భావ ప్రకటనకోసం ఎంచుకోవలసిన బాహ్యరూపాన్ని నిర్ణయించుకున్నప్పుడు వర్తమాన కాల, సమాజపరిస్థితులు ప్రభావం చూపుతాయి. అందుకే గురజాడ
భావానికి తగిన భాష తో పాటు రచన స్వరూపం కూడా కొత్తగా ఉండాలని ఆశించారు. తెలుగు భాషలో అంతవరకు వాడుతున్న ఛందస్సులు యతిప్రాసల ప్రతిబంధకాలతో బిగించబడి ఉన్నాయి. 
తన భావ ప్రకటన  వ్యావహారిక శైలిలో, మృదుమధురమైన పదాలతో ఉండేలాముత్యాల సరాలు అనే కొత్త సరళమైన ఛందస్సును రూపొందించుకున్నారు. ఆ ఛందస్సులోనే తన గేయాలను రచించారు. గణబద్ధమైన ఛందస్సులమీద తిరుగుబాటుగా, ప్రౌఢమయిన పదాల స్థానంలో సరళమైన వ్యావహారిక పదాలను పేరుస్తూ అత్యంత సులభగ్రాహ్యమైన శైలిలో మాత్రాఛందస్సులో  గురజాడ   రచించిన గేయాలన్నీ నవ్యకవితకు ఒజ్జబంతి పెట్టాయి. 

గురజాడ అప్పారావుగారి రచనలలో నాటకంగా కన్యాశుల్కం రచనకి ఎంత ఆదరణ ఉందో, గేయరచనలలో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయానికి కూడా అంతే జనాదరణ ఉంది. కన్యాశుల్కం నాటకంలో లాగే ఈ గేయానికి కూడా వస్తువు కన్యా శుల్కమే.

ఇక్కడ మనం ప్రస్తుతం వరకట్నం అనే సాంఘిక వ్యవస్థలో ఉన్న తరంలోని వాళ్ళం అంతా - ఆ కాలంలోకి ఒకసారి తొంగి చూడాలి. 

గురజాడ ఈ నాటకం రాసిన కాలానికి కన్యాశుల్కం అనే ఒక సాంఘికమైన ఆచారం ఆనాటి సమాజంలో ఉండేది . ఇప్పుడు వివాహం జరిగే సందర్భంలో వరుడికి కొంత పైకాన్ని కట్నం అనే పేరుతో బహుమతిగా సమర్పించి తమ కూతురును అతనికిచ్చి వివాహం చేస్తున్నారు కదా. ఈ ఆచారాన్ని మనం వరకట్నం అంటున్నాం.

కానీ కన్యాశుల్కం అనే ఆచారం పూర్తిగా దీనికి వ్యతిరేకం. ఆనాటి సమాజంలో  వరుడు అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకు కొంత సొమ్మును చెల్లించి ఆమెని వివాహం చేసుకునే వాడు. దీనిని కన్యకి చెల్లించే రుసుముగా కన్యాశుల్కం అనే పేరుతో వ్యవహారంలో ఉండేది.

పెళ్ళి అనే ఆచారం సంఘంలో కుటుంబవ్యవస్థను పరిపోషించే చక్కని సాధకంగా కాక  రక్తమాంసాలను  విక్రయం చేసే  వ్యాపార వ్యవస్థగా ఎప్పుడైతే మారిందో  అది సమాజాన్ని పీడించే దురాచారంగా మారింది. కన్యాశుల్కం ఆచారం కొనసాగుతున్న ఆ సమాజంలో  ఆడపిల్లలకు పెళ్ళిచేయడం అంటే ఆమెకు సాంఘికమైన కట్టుబాటు గల కుటుంబజీవనం ఏర్పాటుచేయడానికి అందులో భాగంగా  తమ బాధ్యత నెరవేర్చుకోవడంగా కాక వారిని పెళ్ళి పేరుతో జరిగే క్రయవిక్రయాలలో ఒక వస్తువుగా బావించారు తల్లితండ్రులు.స్త్రీ పురుషుల మధ్య జరిగే  వివాహం సమాన వయస్కుల మధ్య జరిగే సాంఘిక వ్యవహారంగా ఉంటే సమస్య లేదు.  కానీ పూర్తిగా ఐదేళ్ళు కూడా నిండని పసిపిల్లలను, (అంతెందుకు తల్లి కడుపులో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే  వివాహమాడడానికి సిద్ధపడిన వారూ ఉన్నారుట) కన్యాశుల్కానికి ఆశపడిన పిల్లల  తల్లితండ్రులు భార్య చనిపోయిన ముసలివారు, రోగిష్టివారు అని కూడా చూడకుండా తమ ఆడపిల్లలను వారికి ఇచ్చి పెళ్ళి చేసేవారు.  అటువంటి  కన్నెపిల్లలను పెళ్ళి చేసుకోవడానికి జరిగే పోటీలో వీలున్నంత ఎక్కువ ధనం చెల్లించి బేరం కుదుర్చుకొని పెళ్ళి చేసుకునే వారు ఆ పెళ్ళి కొడుకులు. అటువంటి పెళ్ళి కొడుకులంతా కనీసం యాభై సంవత్సరాలు దాటినవారి దగ్గరనుంచి, కాటికి కాళ్ళుచాచుకున్న ముసలి తనంతో ఉండేవారు.
"ఇంతటి ఘోరమైన పరిస్థితి సమాజానికి సిగ్గుచేటని, ఇటువంటి దురాచారాన్ని ఎండగట్టి, ఉన్నతమైన నైతిక ప్రమాణాలను వ్యాపింపచేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు"(కన్యాశుల్కం నాటకానికి గురజాడ రాసిన ముందుమాటలో) - అని గట్టిగా విశ్వసించిన గురజాడ తన సాహిత్యం ద్వారా అందుకు నడుం కట్టారు.

 సమాజంలోని ఈ దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి  కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా  పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ.  పుత్తడిబొమ్మా పూర్ణమ్మాఅంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను ?

పాట ప్రారంభంలో ముగ్థమనోహరంగా విరిసీ విరియని పూలలాగా ఉండే చిన్నారి బాలికలను ఉద్దేశించి కవి  - కథనాత్మకమైన తన పాటను ఇలా ప్రారంభిస్తారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన తీగలలాంటి శరీర లావణ్యం, కలువలలాంటి తీర్చిదిదిన కనుదోయితో బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెడుతున్న బాలికలను వర్ణిస్తూ, వారిని సంబోధిస్తూ,  వారికోసమే ఈ కధను చెప్పడానికి ఉపక్రమిస్తారు కవి. విన్నారమ్మా ఈ కథను అంటూ తాను చెప్పబోతున్న కథలోకి వారిని తీసుకువెళ్తున్నారు.

ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?

ఆటపాటలతో సంతోషంగా ఉంటూ, కమ్మగా మాటలు చెప్పే అమ్మాయిలను కొమ్మల్లారా అని సంబోధిస్తూ తన కథలోకి ఆహ్వానిస్తారు.
ఇక తాను ఎవరికైతే ఆ కథను చెప్పాలనుకున్నారో ఆ శ్రోతలు వచ్చారుగా..కథని ప్రారంభిస్తారు.


కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.

తాను చెప్పబోతున్న కథకు నేపథ్యం వర్ణన తో కథను ప్రారంభించారు. కొండలనడుమ, ఓ చిన్న తోట, ఆ తోట మధ్యలో ఓ చిన్న కొలను, ఆ కొలను ఒడ్డున ఓ దేవాలయం . ఆ దేవాలయంలో వెలసిన దేవత దుర్గమ్మ. ఆమె బంగారు దుర్గమ్మగా పూజలందుకునే దేవత.

కథకి నేపధ్యం అమరింది. ఇక కథలో ప్రధాన పాత్ర కథానాయిక పూర్ణమ్మ. ఆమె ఒక పూజారి కుటుంబంలో జన్మించింది. ' పూర్ణమ్మ-(పుత్తడి అంటే బంగారం) బంగారు బొమ్మలా ఎంతో అందంగా ఉండేది'  అంటూ ఆ పాత్రను పరిచయం చేస్తారు  కవి.

పూజారింటను  పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు  పువ్వులు  కోసేది.

అన్నదమ్ముల మధ్య అపురూపంగా , వారి కన్నుల వెలుగుగా తిరుగుతూ ఉండేది. పూజారి కుటుంబంలో పెరుగుతోంది కనుక భక్తి చాలా సహజంగా ఆమెలో కుదురుకుంది. అందుకే  తమ ఇంటి దగ్గర కోవెలలో వెలసిన దుర్గాదేవిని ఎంతో భయ భక్తులతో సేవించేది. 

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

 ప్రతిరోజూ ఆ దుర్గను పూజించడానికి పూర్ణమ్మ  పూవులు కోసేది.  కోవెలలో దేవుడికి రెండు పూటలా పూజలు జరుగుతాయి. ఉదయం పూజ చేసిన పూలను తొలగించి సాయంత్రం పూజా సమయానికి వేరే పూలతో పూజ చేస్తారు దేవాలయాలలో.  కొన్ని పూలు ఉదయాన్నే వికసిస్తాయి. మరి కొన్ని పూలు సాయంత్రం వేళలలోనే విరుస్తాయి. ఆ విధంగా ఏ సమయాలలో ఏ పూలు విరుస్తాయో తెలుసుకొని పూర్ణమ్మ  ఆయా పూలను ఏరి తెచ్చి భక్తిగా దేవతను కొలిచేదట పూర్ణమ్మ.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

భగవంతుడికి, పూలతో పాటు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాం. ఒక్కో ఋతువుకీ ఒక్కో రకమయిన పండ్లు లభిస్తాయి. ఆవిధంగా  పూర్ణమ్మ ఋతువులకు తగినట్టుగా లభించే పళ్ళను సేకరించి
దుర్గమ్మ దేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించి పూజించేది పూర్ణమ్మ. 

బాల్య దశను దాటి యౌవనారంభ చిహ్నాలు పొడసూపుతున్న చిన్నారి పూర్ణమ్మను ఇలా వర్ణిస్తారు కవి.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.

తాను దుర్గకు సమర్పించిన పండ్లలోని తీపి నింపినట్టుగా, పూల లోని సోయగాన్నిమించిన సొగసుతనం పూర్ణమ్మ  శరీరంలోని ప్రతి  అంగంలోను సౌందర్యం నిండుతూ ఉందట. దినదినాభివృద్ధితో పూర్ణమ్మ యవ్వనవతి యై ఎన్నో సొగసులు దిద్దుకుందట పూర్ణమ్మ.

ఇక బాల్యదశనుండి కౌమార దశకు చేరుకున్న కూతురు తల్లితండ్రులకు బాధ్యతగా మారుతుంది.

 పూర్ణమ్మ కథలో ప్రధాన మైన  వస్తువు ఈ కన్యాశుల్కమే. ఆ కథా వస్తువు బీజరూపంనుండి వికాసనం పొందే దశ ఇక్కడ ప్రారంభమవుతోంది.
 

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
 
పూర్ణమ్మ మంచి సొగసుకత్తెగా రూపుదిద్దుకొని, పెళ్ళీడుకు రాగానే తల్లితండ్రులు ఆమెకు వివాహం నిశ్చయించారు. కాసు అంటే ఇక్కడ డబ్బు. డబ్బుకు లొంగిపోయిన పూర్ణమ్మ తల్లి తండ్రులు ఆమె పట్ల తమ ప్రేమాభిమానాలనే కాక మానవత్వం అనే కనీస ధర్మాన్ని వదిలేసి ఒక ముసలివాడికి ఇచ్చి ఆమెకు మూడు ముళ్ళు వేయించారు.

ఆ కాలంలో పెళ్ళి ఏ వయసులో జరిగినా ఆ అమ్మాయి వ్యక్తురాలై సంసార జీవితానికి అర్హత పొందే వరకు తల్లి తండ్రుల ఇంటిలోనే ఉండేది. ఆ తరువాత ఆమెను అత్తవారింటికి లాంఛనంగా పంపించేవారు. అప్పటినుండి ఆమె అత్తవారింటి కోడలిగా వారి కుటుంబంలో ఉండేది. పూర్ణమ్మకు ముసలివాడితో వివాహం జరిగినా తల్లి తండ్రుల వద్దే ఆట పాటలతో గడుపుతోంది.

ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో;
కిలకిల పలికెను కీరములు.

ఆమని రాగా అంటే వసంత మాసం సమీపించింది అనే అర్థంతో పాటు పూర్ణమ్మ బాల్యదశను పూర్తిగా వీడి యౌవనం లోకి ప్రవేశించింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. వసంత మాసం సమీపించగానే వాతావరణం దానితో పాటు ప్రకృతి మారిపోతాయి. దుర్గ గుడి ఉన్న కోవెల పక్కన కొలను లోని తామర పూలు బాగా వికసించాయి. వాటితో పాటు పక్షులు కూడా తమ ఇంపయిన ధ్వనులతో కిలకిలలాడుతూ ఉండగా వాతావరణం అంతా ఎంతో సంతోషంగా ఉంది.  నిండుగా వికసించిన పుష్పంలా తన ముద్దులు మూటగట్టే ముఖంతో చక్కని చిరునవ్వుతో  తన సౌందర్యంతో ప్రకృతిలాగే అందరకీ కనువిందు చేస్తోంది పూర్ణమ్మ. 

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఈ నేపథ్యంలో పూర్ణమ్మ కూడా ఆ వాతావరణానికి తగినట్టే సంతోషంతో పరవశమై ఉండగా ఆమెను కాపురానికి తీసుకుని వెళ్ళడానికి భర్త వచ్చాడు. ఆ భర్తను చూడగానే  వెలుగుతున్న హారతి కర్పూరం లాంటి పూర్ణమ్మ సంతోషం అంతా గుప్పుమని ఆరిపోయింది. పెనిమిటి అంటే భర్తను చూసిన నిముషంలోనే ఆమె ముఖంలో ఆ ముద్దు గొలిపే నవ్వు మాయమైంది. మురిపించే చిరునవ్వులు మాసిపోయాయి. కన్నులలో నీరు నిండిపోయింది.

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుఃఖించె

 పూర్ణమ్మ  తన ముసలి భర్తను చూసి ఎంతో దుఃఖపడింది. తన కన్నీటిని తనలోనే అదిమిపెట్టుకుని సంబాళించుకుంది. కానీ ఆమె స్నేహితులు ఆమె వయసో, మరికొంచెం చిన్నవారో అయిఉంటారు. సమాజంలోని  ఈ దురాచారానికి తాము కుడా సమిధలం కాబోతున్నామనే అనుమానం లేని చిన్నపిల్లలు పూర్ణమ్మను తమ మాటలతో బాధించడం మొదలుపెట్టారు. పూర్ణమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆమె భర్త వయసులో ఆమె కన్నాచాలా పెద్దవాడు. ఆమెకి తాతగారి వరసవ్యక్తి కి ఉండేంత వయసువాడు. అందువలన పూర్ణమ్మ భర్తను చూసి వారు నీ మొగడు తాత అని ఆమెని వేళాకోళం చేసారు.

పూర్ణమ్మ మనసులో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఇక ఆ స్నేహితులతో పంచుకోలేక, వారి మాటలను భరించే మానసికమైన శక్తిలేక ఆటలపాటలలో వారితో కలియలేక ఒంటరిగా వెళ్ళి దుర్గ కోవెలలో ఆ దేవత సన్నిధిలో కూర్చని తన బాధను దిగమింగుకునేది.

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.

పూర్ణమ్మను తనతో కాపురం చేయడానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన  ఆ ముసలి భర్త ఆమెకు సారెగా చాలా వస్తువులను తీసుకువచ్చాడు. ఆడపిల్లలకు నగలు, చీరలు అనేవి చాలా సంతోషం కలిగిస్తాయని వాటితో వారు సంతృప్తిగా జీవిస్తారని ఆనాడేకాదు ఈనాడు కూడా సమాజంలో ఒక భ్రమ ఉంది. ఇక్కడ పూర్ణమ్మ వంటి చిన్న వయసు గల కన్యను వివాహం చేసుకున్న ముసలి వాడయిన భర్త,  తన తప్పును ఆమెకు చీరలు, నగలు సమృద్ధిగా ఇచ్చి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసాడు.

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.

ఇక - కాపురానికి  భర్తతో కలిసి పూర్ణమ్మ పయనం కావలసిన సమయం దగ్గరపడింది. ఆమెను ప్రయాణానికి సిద్ధం చేసారు వదినెలు. బంగారు ఛాయతో మెరిసిపోయే వంటికి పసుపురాసి స్నానం చేయించారు. భర్తతో గడపవలసిన జీవితం గురించి, వైవాహిక జీవితంలోని విషయాల గురించి తమ అనుభవాలను చెప్తూ  పూర్ణమ్మను మానసికంగా సిద్ధం చేసారు వదినెలు.

ఇక ప్రయాణ సన్నాహాలు మొదలయ్యాయి. తనకంటే వయసులో పెద్దవారయిన వారి దీవనలుతీసుకొని ప్రయాణానికి బయలు దేరడం మన జాతి ఆచారం. అందుకే పూర్ణమ్మ తన తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కింది. కూతురు తమ కాళ్ళమీద పడి మొక్కగానే యథాలాపంగా తల్లి తండ్రులు ఆమెను దీవించారు.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !

ఇక్కడ  కవిగారి గొప్పవాక్యం పఠితను ఒకింత ఆశ్చర్యానికి, ఉత్సుకతకు గురిచేస్తుంది. కథను వింటూ ఉన్న వారంతా ఒక్క తల విదిలింపుతో ఆలోచనలో పడతారు. పెద్దలకు మొక్కడం, వారు దీవించడం ఎంతో సహజమైన విషయాలు కదా. వీటిలో ఈ అసహజమైన పూర్ణమ్మ నవ్వు ఎలా చొరబడిందా అని ఆలోచనలో పడతారు.

ఇందులో కవి అన్యాపదేశంగా చెప్పే విషయం ఏమిటి అంటే పిల్లలు పెద్దవారికి మొక్కినప్పుడు వారి దీవనలు ఎలా ఉంటాయి? చిన్న పిల్లలు దీవెనలు కోరి మొక్కినప్పుడు - 'దీర్ఘాయుష్మాన్ భవ' అంటూ దీవిస్తారు. అదే ఆడపిల్లలు, పెళ్ళి అయిన వారు పెద్దలకు మొక్కినప్పుడు -'దీర్ఘ సుమంగళీ భవ ' అంటూ దీవిస్తారు. వివాహం కానివారు మొక్కితే 'శ్రీఘ్రమేవ  వివాహ ప్రాప్తి రస్తు' అంటూనూ, దంపతులుగా వచ్చి మొక్కితే -' సుపుత్ర ప్రాప్తి రస్తు'  అంటూనూ దీవిస్తారు.

ఇక్కడ పెద్దలకు పూర్ణమ్మలాంటి వధువు,  అత్తవారింటికి కాపురానికి వెళ్తూ తమ తల్లిదండ్రులకు మొక్కితే వారు ఏమని దీవించి ఉంటారు...
' దీర్ఘ సుమంగళీ భవ ' అని. అంతే కదా. 'కలకాలం సుమంగళిగా ఉండవమ్మా 'అంటూ తల్లిదండ్రులు తనను దీవించడం చూసి పక్కున నవ్వింది పూర్ణమ్మ. సుమంగళి అంటే పెళ్లయిన తర్వాత వివాహ చిహ్నాలు అయిన తాళి, మట్టెలు, పసుపు, కుంకం వంటివి ధరించి ఉండడం. భర్త మరణించిన తర్వాత ఆ స్త్రీ ఈ సుమంగళి చిహ్నాలను ధరించడానికి అర్హత పోగొట్టుకుంటుంది.  తల్లిదండ్రులు కాటికి  కాళ్ళు చాచుకున్న  ముసలివాడికి    ఇచ్చి తనకు  పెళ్ళిచేసారు. అతను కలకాలం జీవించే అవకాశం లేదు కదా. ఇక తను సుమంగళిగా దీర్ఘ కాలం గడిపే అవకాశం లేదు కదా అనే ఆలోచన రాగానే ఫక్కుమని నవ్విందట పూర్ణమ్మ. చిన్నపిల్లలలోని కల్మషంలేని నవ్వు, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకనే తమ భావాన్ని ప్రకటించే అమాయకత్వం పూర్ణమ్మలో ఇక్కడ కనిపిస్తాయి. కానీ అంతలోనే తన చేష్టలోని అసహజత్వాన్ని గ్రహించింది.  కనుకనే ఆ నవ్వును ఇక కొనసాగించలేదు పూర్ణమ్మ.

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

ప్రయాణానికి సిద్ధమవుతున్న పూర్ణమ్మ తనకంటే చిన్నవారయిన తన అన్నదమ్ములను, దగ్గరకు తీసుకుని వారికి దూరమవుతున్నందుకు కంటతడిపెట్టింది.
తన అన్నలను, తమ్ముళ్ళను ఉద్దేశిస్తూ ఈ విధంగా అంటుంది పూర్ణమ్మ.

"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
ఎంతో కరుణ రసాత్మకమైన వాక్యాలు ఇక్కడ పోతపోసారు గురజాడ. ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింటికి మొదటిసారిగా ప్రయాణమవుతున్నప్పుడు ఆమె మానసిక స్థితిని ఎంతో చక్కగా వర్ణించారు. పూర్ణమ్మ తన అన్నదమ్ములతో  తమ తల్లి తండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అంతే కాక తాను ఎంతో ఇష్టంగా కొలుచుకునే దుర్గమ్మను,  వారు కూడా తనంత భక్తితోను, శ్రద్ధతోను పూజించాలని కోరింది. ఆ దేవి అమ్మలగన్న అమ్మ అని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పింది. ఆయా సమయాలలో ప్రకృతిలో లభించే పూలతోను, పళ్లతోనూ దేవికి నైవేద్యాలు సమర్పించి ఆమె కరుణ పొందే విధంగా పూజించమని చెప్పింది.

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."

ఈ విషయాలన్నీ చెప్తూనే మరో మాట కూడా చెప్పింది. అందరూ సంతోషంగా నవ్వుతూ గడిపే సమయాలలో  ఇకపై తాను వారితో ఉండదు కనుక అటువంటి సంతోషసమయంలో తనను కూడా తలుచుకోమంటూ అన్నదమ్ములను అడుగుతుంది. అంతే కాదు. ఆ అన్నదమ్ములు తమకు ఆడపిల్ల పుడితే తన గుర్తుగా తనను రోజూ తలచుకోవడం కోసం ఆ పాపకి తన పేరు పెట్టుకోమని అడిగింది.

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆమె కంఠం రుద్ధమయింది. కంటిలో నీరు చివ్వున ఎగజిమ్మింది. జల జల రాలుతున్న కన్నీటికి అంతలోనే ఆనకట్ట వేసిన పూర్ణమ్మ తన బేలతనానికి తానే నవ్వుకుని తన కన్నీటిని గబ గబా తుడిచేసుకుంది. తన మనసులో దుఃఖంలేదని, తాను సంతోషంగానే కాపురానికి వెళ్తున్నానని చెప్పడం కోసం కలకలమని నవ్వుతూ తన నవ్వులమాటున దుఃఖాన్ని దాచేసింది పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్

కానీ ఆమె చేస్తున్న ఆ ప్రయత్నం వట్టిదే అని అర్థం చేసుకున్నారు సాటి ఆడవాళ్ళయిన వదినెలు.
పెద్దవారు ఏడిస్తే బెదిరిపోయే చిన్న పిల్లలు - ఆమె తమ్ముళ్ళు కూడా చాలా బాధ పడ్డారు. కర్కశురాలిగా కనిపించే తల్లికూడా కూతురు అత్తవారింటికి బయలుదేరే సమయం వచ్చేసరికి తానూ కంట తండి పెట్టింది.

కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.

కానీ ఈ విధంగా తమ కుటుంబాన్ని వదిలిపోతున్న తమ చిన్నారి ఇక తమకు ఎప్పుడంటే అప్పుడు కంటపడదు కదా.తమకు దూరమవు తోంది  కదా అని కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడుతున్నా పూర్ణమ్మ కన్న తండ్రి మాత్రం ఆ బాధ ఏమీ లేనట్టు ఆనందంగానే ఉన్నాడు. కారణం ఆ అల్లుడి ద్వారా తాను సంపాదించిన కన్యాశుల్కం రూపంలో అందుకున్న ధనం. తన కూతురు ఓ డబ్బున్నవాడికి భార్యఅయింది కనుక  ఇక సుఖపడుతుందనే నమ్మకం కూడా కావచ్చు. కానీ ఇంతమంది బాధ పడుతున్నా ఆనందంగా ఉన్నది ఆమాత్రం ఆ ఇంటిలో పూర్ణమ్మ తండ్రిమాత్రమే.
పూర్ణమ్మ ప్రయాణానికి సమయం ఆసన్నమయింది.

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ప్రతిరోజూ సాయంత్రం పూట పూలమాలలు కూర్చి దుర్గను అలంకరించి ఆమెను ప్రార్థించే అలవాటున్న పూర్ణమ్మ ప్రయాణానికి ముందు  ఎప్పటిలాగే దుర్గను ప్రార్థించి వస్తానని చెప్పి ఇంటినుండి బయలుదేరింది.

ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు వొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.

పాత్రలో వచ్చే పరిణామాలను సూచించడానికి ప్రకృతిలో మార్పును, నేపధ్యంలో మార్పులను సూచనగా వాడుకోవడం రచయితలకి ఉండే నేర్పరితనాన్ని సూచిస్తుంది.

 పూర్ణమ్మ కథాకావ్యంలో  గురజాడవారు పూర్ణమ్మలోని శారీరకమైన ఎదుగుదలను సూచించడానికి ప్రకృతిలోని మార్పులను సూచించారు. అలాగే ఇక్కడ పూర్ణమ్మ ఎంతో వేళ గడిచినా ఇంటికి చేరుకోలేదన్న విషయం సూచించడానికి  ప్రకృతి వర్ణననే సూచనగా వాడారు.
ఆవులు, పెయ్యలు తమ మందలో చేరాయని, ఆకాశంలో చుక్కలు మెరుస్తూ పొడిచాయని చెప్పడం ద్వారా చాలా రాత్రి అవుతున్నా పూర్ణమ్మ ఇంటికి చేరలేదని చెప్తారు.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.

 సాయంకాలం గడిచిపోయింది. రాత్రి ఇంకా ఇంకా చిక్కనవుతోంది. కొండలు, కోనలు అంతా గుప్పు గుప్పున చీకట్లు కమ్ముకుంటున్నాయి. అర్థరాత్రి పూట వేటకు వెళ్ళే క్రూర జంతువులు తిరిగే కాలం కూడా సమీపిస్తూంది. అయినా పూర్ణమ్మ ఇంకా ఇల్లుచేరుకోలేదు.

'దుర్గమెడలో హారములమరెను' అన్న వాక్యంలో పూర్ణమ్మ దుర్గ గుడిని చేరుకుంది అన్న విషయాన్ని గ్రహిస్తాం. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదన్న మాట అనే విషయం కూడా మనకి అర్థం అవుతుంది.
కానీ ఆమె ఏమయింది అన్న విషయం కవి మనకు స్పష్టంగా చెప్పరు. అదే మహాకవి లక్షణం. పాఠకుల ఊహలకు విషయాన్ని వదిలి ఆ విషయ స్ఫురణ వలన కలిగే ఆనందాన్ని కావ్యానందంగా శ్రోతలు ఆయా రసాలను గ్రహించాలి. అప్పుడే కావ్యం ద్వారా శ్రోత  మనసులో రసావిష్కరణ  జరుతుంది.

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

ఈ వాక్యాలను విన్న వెంటనే శ్రోతలు గ్రహించగలుగుతారు పూర్ణమ్మకు ఏం జరిగి ఉంటుందో అన్న విషయం. దుర్గను చేరెను పూర్ణమ్మ అన్న వాక్యం వలన ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం గ్రహించిన శ్రోత మనసు కరుణరస ప్లావితమవుతుంది.

ఎంతో సౌందర్యవతి అయిన ఆ పుత్తడి బొమ్మలాంటి పూర్ణమ్మ సౌందర్యం అంతా,   దురాచారాన్నే సదాచారంగా పాటిస్తున్న తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజపు దౌష్ట్యానికి బలి అయి పోయిన తీరును కన్నుల కాంతులు కలువల జేరెను, మేలిమి చేరెను మేని పసల్ ’’అంటూ చేసిన వర్ణనలో కనిపిస్తుంది. కలువలు అంత కాంతులీనుతూ సుందరంగా ఉండడానికి కారణం పూర్ణమ్మ కన్నులలోని కాంతి తమలో వచ్చి చేరడం వల్లనేనట. బంగారం అంత మెరుస్తూ ఉండడానికి కారణం పూర్ణమ్మ శరీరపు కాంతి తనలో చేరడమేనట. హంసలు అంత అందంగా కులుకుతూ నడవగలగడానికి కారణం పూర్ణమ్మ నడకలలోని వయ్యారం తమలో చేరినందుకట. ఈ విధంగా వర్ణిస్తూ పుత్తడి బొమ్మలాంటి పూర్ణమ్మ  ప్రకృతిలో లీనమైపోయిందని, పంచభూతాలలో ఐక్యమయిందని సూచించారు కవి.

నిజానికి ప్రస్తుత సమాజంలో గురజాడ ఆనాడు కథావస్తువుగా స్వీకరించిన కన్యాశుల్కం అనే దురాచారం లేకపోయినా, ఆ రచనలు చేయబడిన కాలం వందేళ్ళకు పైబడినా గురజాడ వెలిగించిన సాహితీ దీపం నిత్యనూతనంగా తెలుగు ప్రజల గుండెలలో వెలగడానికి కారణం, ఆయన వేసిన వత్తి - నాటికీ నేటికీ ఏనాటికైనా నిలబడే మానవతా వాదం. భావితరంలోని ప్రజలని అత్యున్నత శిఖరాలకు చేర్చే  బాటను వేసి ఆ బాటలో తొలి అడుగుజాడ  వేసిన ఖ్యాతి మన గురజాడదే. 

గురజాడ అప్పారావుగారి పూర్ణమ్మ కథను గురించి తలచుకునే ప్రతిసందర్భంలోను , ఆ గేయాన్ని ఆపాత మధురంగా గానం చేసిన అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారి గురించి కూడా తెలుగువారు  తలచుకుంటారు. ఆ పూర్ణమ్మకథను అతి మధురంగా, హృద్యంగా గానం చేసి తరతరాలపాటు ఆ గేయానికి అమరత్వం ఆపాదించి, గేయం యొక్క భావంలోని రసస్ఫూర్తిని  శ్రోతలకు వీనులవిందుగా అందించారు ఘంటసాల. 

గురజాడవారి సాహిత్య భావాన్ని సంగీతంతో పోషిస్తూ కథలోని నాటకీయతను తన గొంతులో పలికిస్తూ, కవి ఉద్దేశించిన భావాన్ని వినిపిస్తూ ఘంటసాల గానం చేసిన పూర్ణమ్మ కథ అత్యంత మధురగీతం. 
ఈ గీతాన్ని కన్యాశుల్కం నాటకాన్ని వెండితెరకు అనువదిస్తూ నిర్మింపబడిన 'కన్యాశుల్కం' చిత్రంలో సందర్భోచితంగా వాడుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. బుర్రకథ రూపంలో తాను విన్న  పూర్ణమ్మకథలో పూర్ణమ్మపాత్రకు పట్టిన దుర్గతి తన కూతురుకు పట్టకూడదని వెంకమ్మ బాధపడినట్టు, కథలోని ఓ కీలకమైన మలుపుకు ఆధారంగా  ఈ గేయాన్ని ఎంతో నేర్పుగా ఉపయోగించుకున్నారు ఈ చలన చిత్రంలో. ఈ విధంగా ఈ చిత్రం కోసం ఘంటసాల స్వరపరచిన ఈ పూర్ణమ్మ కథ గేయం ఇన్ని తరాలపాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తూనే ఉంది. 
ఆ గేయానికి అద్భుతమైన నేపథ్యగానం అందించిన ఘంటసాలతో పాటు, అత్యంత కరుణరసాత్మకంగా ఆ గేయానికి దృశ్యరూపం ఇచ్చిన ఈ చిత్ర నిర్మాత దర్శకులకు  కూడా తెలుగువారు ఋణపడి ఉండాలి.



31 August 2011

“కూనలమ్మపదాలు” - ఆరుద్ర



భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అంటే చాలామంది తెలుగువారికి పెద్దగా తెలియక పోయినా ఆరుద్ర అనే పేరు వినగానే చిరపరిచయం ఉన్న వ్యక్తి గురించి అడిగినట్టు ఆయన గురించి చెప్పగలరు. సంతకం అక్కర్లేని కవిగా  అంత్య ప్రాసల ఆరుద్రగా ఆయన చాలామందికి పరిచయం.

కేవలం కవిగానే కాక, కథారచయితగా, నాటక రచయితగా, సాహితీ విమర్శకుడిగా  ఆరుద్ర తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అసామాన్యం. ముఖ్యంగా పామర జనానికి సైతం నిత్యం జీవితంలో పాడుకునే తేలిక మాటలతో  పాటలురాసిన సినీకవిగా ఆయన సుప్రసిద్ధులు. ఆయన రాసిన సినీ గీతాలు కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది మొదలైన భావగీతాలు, రాయినైనా కాకపోతిని వంటి భక్తిగీతాలు వందల సంఖ్యలో ప్రజల నాలుకల మీద తేలియాడే చిరస్మరణీయమైన గీతాలకి ఆయన కర్త. సమగ్రాంధ్ర సాహిత్యం వంటి పద్నాలుగు సంపుటాల ఆంధ్ర సాహిత్యాన్ని రచించి తెలుగు వారి అరచేతిలో పెట్టిన దిట్ట.  రాముడికి సీత ఏమౌతుందని ప్రశ్నించి ఆ ప్రశ్నకి జవాబుగా తానే  ప్రపంచదేశాలలో మూలమూలన దాగిన రామాయణాల కథల సారాంశాలను గ్రహించి ఒకచోట ఏర్చి కూర్చి అమర్చిన  విమర్శకర్త . సర్వమానవాళికి శుభం, సుఖం, శాంతి కలగాలని ఆశించి దానికోసమే తన కలాన్ని, కత్తిలా ఝళిపించి మతములన్నిటిలో మానవత్వమే మేలైన మతమంటూ ప్రచారం చేసిన ప్రవక్త ఆరుద్ర.

ఆరుద్ర అంత్యప్రాసల ముద్ర స్పష్టంగా కనబడే రచనలలో కూనలమ్మ పదాలు ముఖ్యమైనది. కూనలమ్మ పదాలు వేనవేలు రకాలు, ఆరుద్రదే వ్రాలు అంటూ శ్రీశ్రీ  ఈ రచనకి ముందు మాటలో రాసారు. ఈ రచనని ఆరుద్ర 1963 ప్రాంతాలలో రచించారు.

 ప్రచారంలో ఉన్న పాత కూనలమ్మ పదాలు అనే ప్రక్రియను తీసుకుని కొత్తకాలపు జీవిత సత్యాలను అంత్యప్రాసలతో అలంకరింపచేస్తూ ఆరుద్ర రచించిన కూనలమ్మ పదాలు ప్రజలను ఉర్రూతలూగించాయి.

ఈ కూనలమ్మ పదాలను అనుకరిస్తూ మరెందరో సాహిత్యరచనలు చేయడం ద్వారా ప్రజలలో ఈ ప్రక్రియకు ఆరుద్ర కలిగించిన ప్రచారం తెలుస్తుంది. ఓ నాయనమ్మా, ఓ నాయుడమ్మా వంటి మకుటాలతో రచనలు వచ్చాయి.
తరతరాలుగా తెలుగువారి సాహిత్యంలో సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ కూనలమ్మ పదాలు ఆరుద్రగారి రచనల వలన మరింతగా ప్రజలలోకి వెళ్ళాయి.  


1930 సం. కాలంలో పరిశోధకులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు కూనలమ్మ పదాలను సేకరించారు. 1930 సం. భారతి పత్రికలో బాలభాష అనే శీర్షిక కింద వీటిని చేర్చి ప్రచురించారు. ముందుమాట రాస్తూ శ్రీ  ప్రభాకర శాస్త్రిగా రు ఇలా అన్నారు. కూనిరాగాలు తీయడం, కూనలమ్మ సంగీతాలు తీయడం అనే మాటలు ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్న పదాలు ఈ కూనలమ్మ పదాల నుండే వచ్చాయి. తమిళంలో అవ్వయ్యార్ పదాలకు ఎంత విలువ ఉందో తెలుగులో వీటి కూడా అంతే విలువ ఉంది.



కూనలమ్మ పదాలు  జంపె వరుసలో నడుస్తాయి. కూనలమ్మ పాటలు నీతికి సంబంధించిన పాటలు. పార్వతీదేవి కూతుళ్ళు, కామేశ్వరీ దేవికి తోబుట్టువులూ అయిన అక్కలకి పోతరాజు అనేవాడు కాపుగా ఉంటాడు. అతని భార్య ఈ కూనలమ్మ. ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో ఈ కూనలమ్మ పదాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పాటలలో వేదం, పురాణం, ఉపనిషత్తుల సారాంశం కూడా కనినిపిస్తూ ఉంటుంది.అయితే ఈ కూనలమ్మ పదాల కాల నిర్ణయం చాలా కష్టమయిన పని. విజయరాఘవ కల్యాణం అనే యక్షగానంలో ఈ కూనలమ్మ పదాలకు పేరడీలు కనిపించడాన్ని బట్టి, పదిహేడవ శతాబ్దినాటికే ఇవి ప్రచారంలో ఉన్నాయని భావించవచ్చు అన్నారు ఆరుద్ర.

కూనలమ్మ పదాలలో నిర్ణీత సంఖ్యలోనే మాత్రలు ఉండాలి. అప్పుడే అది అందంగా వినబడుతుంది. ఈ పదాలు నాలుగు పాదాలుగా ఉంటాయి. నాలుగోపాదం మకుటం. అంటే ప్రతి పదంలోనూ నాలుగవ పాదం ఓ కూనలమ్మా అనే వాక్యంతో ముగుస్తుంది అన్నమాట. ప్రతి  పాదం  3,4,3 గా గాని లేదా 5,5 గా గాని మాత్రలు ఉండాలంటారు ఆరుద్ర.  "ఓ కూనలమ్మా"  అంటూ  ప్రతి మూడు పాదాల చివర వచ్చే పాదం మకుటం గా వస్తుంది కదా. ఆ మకుటం కాకుండా ఉన్న మిగిలిన పాదాలు 10 మాత్రలతో ఉండాలి. ఇక్కడ అందమంతా తొలి మూడు పాదాల లోనూ ఉన్న అంత్యప్రాసలే. సంప్రదాయ సిద్ధమైన దేశీ ఛందస్సులో కూనలమ్మ పేరు పై తొలి రచన చేయడం తన అదృష్టమన్నారు ఆరుద్ర.

 చిన్ని పాదములందు, చివరి ప్రాసల చిందు,చేయు వీనులవిందు అంటూ అంత్యప్రాసలతో, చిన్ని చిన్ని పాదాలతో, వీనుల విందుగా చెబుతానంటూ కూనలమ్మ పదాలు  ప్రారంభించారు ఆరుద్ర.
కూనలమ్మ పదాలలో నీతి ఉంటుందని, అది హృదయపు వీణను మీటుతుందని చెప్పారు ఆరుద్ర. పెద్దపెద్ద సమాసాల కన్నా పెద్ద వృత్తాలు చెప్పలేని విషయాన్ని ఒక చిన్న పదం చెప్పగలుగుతుందని ఆయన అభిప్రాయం. ‘పరుల మేలును కోరి, పదములల్లెడు వారి పథము చక్కని దారి అంటూ తన పదముల వలన తాను ఆశించే ప్రయోజనం చూపారు. 
కూనలమ్మ పదాలు ఆరుద్రలోని బహుముఖ వ్యక్తీకరణ శక్తికి, అభివ్యక్తికి దర్పణాలు. మానవ సంఘంలోను, వ్యవహారంలోను ఉన్న అనంతమైన వైవిధ్యాన్ని మూడు పాదాలలో, అందులోనూ పరిమితమైన ఛందస్సుకు లోబడి, అంత్యప్రాసలతో అలరించేలా, పఠితులను ఒప్పించేలా గడుసుగా, హుందాగా, నేర్పుగా చెప్పగలగడం సామాన్యమైన విషయంకాదు. 
ఆరుద్రగారి గురించి మళ్ళీ మళ్ళీ ఈ విషయం చెప్పుకోవడం అంటే ముంజేతి కంకణానికి అద్దం చూపడమే. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం వేయడమే.
కూనలమ్మ పదాలలో ఆరుద్రగారు స్పర్శించిన అనేక అంశాలను ఇక్కడ ఓ సారి పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.

కూనలమ్మ పదాలలో స్త్రీల  మనస్తత్వాల గురించి, వారి అలవాట్లగురించి, సంఘంలో వారి ప్రాముఖ్యాన్ని గురించి చెప్పిన పదాలు ఆరుద్రగారికి మానవ నైజం గురించి ఉన్న అవగాహనని చూపిస్తాయి. ఆడవారి అలవాట్లను చిత్రిస్తూనే చాలా గడుసుగా వారి పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆరుద్ర.

ఆలికొన్నదికోక, అంతరిక్షపు నౌక, అంతకన్నను చౌక అంటారు. ఆడవారితో వాదన వస్తే గెలిచేది ఎప్పుడూ ఆడదే అంటూ అతడు ఆమెల ఫైటు, అతివ ఛాన్సులు బ్రైటు, ఆడదెపుడూ రైటు అంటారు. అతివ పలుకే చాలు, అందువేనకువేలు,మొలచు నానార్థాలు - ఆడవారి మాటలకు ఎన్నయినా అర్థాలు గ్రహించవచ్చునట. ఇలా అధిక్షేపిస్తూ అంతలోనే ఆడవారు రాకెట్లో విశ్వవిను వీధిలో విహరించడాన్ని గురించి అతివ పురుషుని దీటు, అనుచు నభమున చాటు, ఆడ కాస్మోనాటు అని స్త్రీలను మెచ్చుకుంటారు.

పెళ్ళి, భార్యాభర్తల సంబంధం గురించి కూడా కొన్ని పదాలలో వ్యాఖ్యానం చేసారు.
ఇష్టంలేని పెళ్ళి చేసుకుంటే సుఖం లేదని   ‘మనసు కుదరని పెళ్ళి, మరుదినమ్మున కుళ్ళి, సుఖము హళ్ళికి హళ్ళి అంటూ చెప్పారు.సుదతి పాలిట భర్త, మొదట వలపుల హర్త, పిదప కర్మకు కర్త అంటూ మొదట ప్రేమతో వలపు గెలుచుకుని క్రమంగా ఆమె కర్మకు అతను కర్తగా మారే  భర్త గురించి వ్యాఖ్యానిస్తారు. భార్యాభర్తల మధ్య తగువు ఏర్పడినా, రాజీ కుదిరిన తరువాత ఆ కలయిక గురించి ఆలుమగల లడాయి, అంతమొందిన రేయి, అనుపమానపు హాయి అంటూ తగవు తీరాక కలయిక ఎంత మధురంగా ఉంటుందో చెప్తారు. కొత్తభార్య ఏం చేసినా భర్త వంకలు పెట్టడు. పైగా కొత్త పెండ్లము వండు, గొడ్డుకారము మెండు, తీపియంటాడుట  ఆ హస్బెండు.

మనసుకు నచ్చిన లలన దొరకతనంతవరకే సన్యాసం అంటూ – సన్యసించిన స్వామి, చాలినంత రికామి,చాన దొరికిన కామి’  సన్యాసం గుట్టు విప్పారు.
అప్పటి రాజకీయాలపై ఆరుద్ర విసిరిన  చెణుకులు కూడా కొన్ని వీటిలో చూడవచ్చు.

ప్రజాస్వామ్యం గురించి రాక్షసత్వం పోయి,రాచరికములు పోయి,ప్రజలదే పై చేయిఅంటూ ప్రజలే ప్రభువులుగా ఉండే ప్రజాస్వామ్యాన్ని మెచ్చుకుంటారు. మన దేశంలోని గొప్ప సిద్ధాంతాలను తోసిరాజని, పొరుగు దేశాల సిద్ధాంతాలను నెత్తిన పెట్టుకోవడాన్ని పొరుగు దేశములిచ్చు, పుల్ల ఇజముల మెచ్చు, మూర్ఖమెప్పుడు చచ్చు’  పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత చందంగా నిరసించారు.  పసిడి వన్నియ తరిగె,పన్నులెన్నియో పెరిగె, ప్రజల వెన్నలు విరిగె అంటూ  పన్నులభారం ప్రజల నడ్డి విరవడాన్ని చెప్పారు. అలాగే ఇంకా మనకి  నిజమైన స్వాతంత్ర్యం రాలేదంటూ- వచ్చె స్వాతంత్ర్యమ్ము, హెచ్చె నిర్బంధమ్ము, స్వేచ్ఛ మంత్రుల సొమ్ము అంటారు.  

మరచె చేసిన మేలు, చరచె పోరికి కాలు, వాడు చైనా ఫూలు అంటూ భారత్ మీద కయ్యానికి కాలు దువ్విన చైనాను విమర్శించారు. చైనా, పాకిస్తాన్ దేశాలు పొరుగున ఉండి మిత్రులుగా ఉండక సైతాన్ లాగా వేధించుకు తినడాన్ని గురించి  కడకు పాకిస్తాను, కలిసె చైనాతోను మిత్రుడా సైతాను అంటూ రెండు పొరుగు దేశాల పద్ధతిని ఎండగట్టారు.
కోర్టుకెక్కిన వాడు, కొండ నెక్కిన వాడు, వడివడిగ దిగిరాడు అంటూ- కోర్టువ్యవహారాలు ఒకంతట తెమిలేవి కాదంటారు.

 అధికారం ఇచ్చే మత్తు  చాలా  గాఢంగా ఉంటుందిట. మధువు మైకమునిచ్చు, వధువు లాహిరి తెచ్చు, పదవి కైపే హెచ్చు అంటూ మత్తిచ్చే మధువు కన్నా, కొత్త భార్య కన్నా కూడా పదవి ఇచ్చే మత్తు గొప్పదని చెప్తారు.

ఆంధ్రుల ఆరంభ శూరత్వం గురించి విమర్శిస్తూ అంతు చూసేవరకు, అకట ఆంధ్రుల చురుకు, నిలువ ఉండని సరుకు అంటారు.
ఇక కాలక్షేపం సరదా అంటూ వ్యసనాల బారిన పడడం గురించి కూడా విమర్శించారు. తాగుచుండే బుడ్డి, తరుగుచుండే కొద్ది మెదడు మేయును గడ్డి అంటూ తాగుడు వ్యసనం మనిషి బుద్ధిని ఎలా హరిస్తుందో హెచ్చరిస్తారు. క్రికెట్ ఆట చూడడం అంటే  సమయాన్ని వృథా చేసుకోడమేనంటూఅయిదురోజులు వేస్టు, అగుట కెయ్యది బెస్టు, చూడుము క్రికెట్ టెస్ట్ అంటారు.

అల్లుడు అంటే దశమగ్రహం అని తెలుగువాళ్ళు అల్లుళ్ళ గురించి చెప్పుకుంటారు. అల్లుడిగా వచ్చి ఆ ఇంటికి పీడగా తయారైన వారి గురించి చిన్న చమక్కులు ఈ పదాలలో కనిపిస్తాయి. అత్తవారి సొమ్ముకోసం పీడించుకుతినే అల్లుళ్ళ గురించి పిల్లనిచ్చినవారి పీకమీద సవారి చేయు అల్లుడె మారి( యముడు) అని అంటారు. అలాగే అత్తవారిని మెక్క, అలక పానుపు యెక్క,  మృగము క్రిందే లెక్క అని పీడించే  అల్లుడుని ఓ క్రూర జంతువుకింద లెక్కవేస్తారు.

నీతి శతకాల్లో మూర్ఖుల గురించి ఎన్నో పద్యాలు చూస్తాం. కూనలమ్మ పదాలలో ఆరుద్రగారు కూడా మూర్ఖుల గురించి రాసారు. కూరుచుండిన కొమ్మ, కొట్టుకొను వాజమ్మ, హితము వినడు కదమ్మ అంటారు. అలాగే గంగ గట్టున నూయి, కందకములో గోయి,  త్రవ్వేను లొల్లాయి అంటూ మూర్ఖుల తెలివిని హేళన చేస్తారు.

మానవమనస్తత్వం లోని లోతులన్నీ గ్రహించిన గొప్ప కవి ఆరుద్ర. అందుకే మనిషి మనీషిగా మారాలని అందుకోసం తనలోని లోటుపాట్లను ఎప్పుడూ విమర్శించుకుంటూ సమీక్షించుకుంటూ ఉండాలని  కొన్ని పదాలలో సూచిస్తారు. ఆశ పెరిగిన వాడు, అహము పెరిగిన వాడు, తనకు తానే కీడు అంటూ వ్యక్తిలో దుర్లక్షణాలు పెరిగితే తనకు తానే కీడు చేసుకుంటాడని చూపుతారు. అలాగే పరుల తెగడుట వల్ల, బలిమి పొగడుట వల్ల, కీర్తి వచ్చుట కల్ల అంటారు. జాలి కరుణలు మాని,ఆలినేలని వాని , జోలికెళితే హాని  అంటూ హృదయంలో కరుణలేని మనిషి సమాజానికి హాని కలిగిస్తాడని హెచ్చరిస్తారు.

ఆరుద్రగారు  నాస్తికులే  అయినా మన పురాణాల గురించి, సంప్రదాయాల గురించి ఎన్నో విషయాలను లోతుగా ఆలోచించి, తేలికైన మాటలతో వాటి సారాంశాన్ని వివరించడం ఆయన ప్రత్యేకత.  భాగవతమున భక్తి, భారతము లో యుక్తి, రామ కథయే రక్తి అన్న పదంలో మన పురాణాల్లోని విషయాలను క్లుప్తంగా మూడు పాదాలలో చెప్పారు.

 కానీ పుణ్యగాథలంటూ చెప్పుకునే మన పురాణ కథల్లోని అవినీతిని కూడా ఇలా చూపించారు- పుణ్యగాథల బూతు, బూజు పట్టిన ట్రూతు, అంతుచిక్కదు లోతు.

శ్రీ కృష్ణుడికి రాధ మేనత్త అవుతుందని ఓకథ . దాన్ని ఆధారం చేసుకుని కంసుడిపాలిట యముడిగా, రాధ పాలిట ప్రేమమూర్తిగా కృష్ణుడు ఉండడం గురించి చెప్తూ కృష్ణుడు ఘనుడు కదా అంటారు, మేనమామకు యముడు, మేనయత్తకు మరుడు, ఘనుడు కద మాధవుడు అనే పదంలో.


పరుల ఇంటను పెరిగె, పరుల పడతుల మరిగె, పరతత్వ్తమె సురిగె అంటూ మూడు ముక్కల్లో కృష్ణుడిని చూపిస్తారు. అలాగే శ్రీ కృష్ణుడు, బాల్యంలో బండి రూపంలో వచ్చిన రాక్షసుడిని చంపడం, అర్జునుడికి రథ సారథ్యం చేయడం రెండిటినీ బండితో కలుపుతూ  శ్రీకృష్ణుడి ని ఊసరవెల్లితో పోలుస్తూ  ఇలా అంటారు- బండి గూల్చెను తొల్లి, బండి తోలెను మళ్ళి, దండి ఊసరవెల్లి.

చెలుల చీరలు దోచి, చెల్లి చీరను గాచి, చేసెనే లాలోచి అంటూ గోపికల వస్త్రాపహరణం చేసిన కృష్ణుడే, ద్రౌపదికి చీర ఇచ్చి మానసంరక్షణం చేయడం గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

ఇక తిన్నింటివాసాలు లెక్కపెట్టేవాడిని ద్రోహిగా మనం భావిస్తాం. కానీ శ్రీ కృష్ణుడు తాను పూతన స్తన్యాన్ని గ్రోలి, ఆమెను చంపడాన్ని గురించి గ్రోలెనే స్త్తన్యమ్ము, గ్రుద్దెనే ఆ రొమ్ము, వాడెపో దైవమ్ము అంటూ అలా చేసిన వాడిని మనం దైవంగా భావిస్తున్నామని  ఓ చురక వేస్తారు.
నిజంగా భక్తి ఉంటే అది మనసులో ఉండాలి కానీ పైపై వేషాల వలన ప్రయోజనం ఉండదంటూ –‘పంగనామములేల, భస్మ పుండ్రములేల, భక్తినిజమగు వేళ అని ఉపదేశిస్తారు.

సమకాలికులైన  ప్రముఖుల  గురించి  రాసిన పదాలు కూడా ఉన్నాయి.
తన మేనమామ శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ గురించి ఆరుద్ర ఇలా అన్నారు -రెండు శ్రీలు ధరించి,రెండు పెగ్సు బిగించి, వెలుగు శబ్ద విరించి. కొంతమందిది నవత, కొంత మందిది యువత, కృష్ణ శాస్త్రిది  కవిత అంటూ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి కవిత్వమే కవిత్వం అని చెప్పారు.బాపు గురించి కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె వుయ్యెలనూపు అని బాపు బొమ్మలు కొన్ని తరాల పాటు జనులను ఆకట్టుకుంటాయన్నారు. హాస్యమందున అఋణ, అందెవేసిన కరుణ, బుడుగు వెంకట రమణ అంటూ ముళ్ళపూడి ని చూపించారు.విశ్వనాథ సత్యనారాయణ గారికి కొత్తదనం రుచించదంటూ కొత్తమీద జుగుప్స, కొలది పాత్రకు వీప్స, విశ్వనాధకు లిప్స అంటూ విమర్శిస్తారు.కసరు తేనెల వంటి, కథలు కుత్తుక బంటి, నింపు కొడవటి గంటి అంటూ కథకుడు శ్రీ కొడవటి గంటి కుటుంబరావుగారి సాహిత్యంలోని మాధుర్యాన్ని వివరిస్తారు. దండి( ప్రాచీన సాహిత్యంలోని కావ్యకర్త) గురించి గద్యసుమముల నుండి, కావ్య మధువులు పిండి, పంచి పెట్టెను దండి అంటారు. ఛందస్సుల నడ్డివిరుస్తానంటూ కవిత్వం రాసిన పఠాభి గురించి చివరి ప్రాసల నాభి, చిత్రమైన పఠాభి, కావ్యసుధల షఱాభి అంటారు. ఎంకిపాటలు రాసి గుండెలో గుర్రపు స్వారీ చేసారంటూ ఎంకిపాటలదారి, ఎడద గుర్రపు స్వారి చేయులే నండూరి అంటూ ఆయనను మెచ్చుకున్నారు.

అబద్ధం నిజంగా చలామణీ అయే రోజులు ఎంతవరకు అంటే - ప్రజలు కళ్ళుతెరచి నిజం తెలుసుకునేవరకే నకిలీ సరుకు చలామణీ అవతుందంటూ జనులు నమ్మెడు వరకు, కనులు తెరవని వరకు, వెలుగు నకిలీ సరుకు అంటారు.

పర్యావరణం, సైన్సు మానవుడు ఉనికికి ప్రశ్నార్థకం కానున్నాయా అనే సందేహం వెలిబుచ్చారు ఇక్కడ.
అణువు గుండెను చీల్చి, అమిత శక్తిని పేల్చి, నరుడు తన్నును బాల్చి అంటారు. మానవుడు భస్మాసురుడిలా అణుబాంబును కనిపెట్టి తన చేతులారా తానే నాశనాన్నికొనితెచ్చుకున్నాడేమో.
దైవబలాన్ని నమ్ముకొని కూర్చోవడం కాకుండా మానవుడు కూడా తన శక్తిని తెలుసుకోవాలంటారు. హరుడు అధికుడు కాడు, నరుడు అల్పుడు కాడు, తమకు తామే ఈడు అంటూ ఇద్దరిలోనూ సమానమైన శక్తి ఉందంటారు.

జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి అంటారు ఆరుద్ర. ఇజము నెరిగిన వాడు, నిజము చెప్పని నాడు, ప్రజకు జరుగును కీడు అని హెచ్చరిస్తారు.

కవితకోసమె నేను పుట్టాను క్రాంతి కోసమే కలం పట్టాను అన్నారు ఆరుద్ర ఓచోట. దాన్నే ఇక్కడ కూడా మరోసారి చెప్పారు. సర్వజనులకు శాంతి, స్వస్తి, సంపద, శ్రాంతి నేకోరు విక్రాంతి అన్నారు ఇక్కడ. కూనలమ్మపదాలు రచించడం వలన తనకెంతో తృప్తి కలిగిందంటూ – ‘ఈ పదముల క్లుప్తి, ఇచ్చింది సంతృప్తి చేయునిమ్ము సమాప్తి అంటూ   ఈ పద రచనను ముగించారు ఆరుద్ర.

అల్పపదాలతో, అనల్పార్థం గల వాక్యాలతో ఎక్కడా ప్రాసతో రాజీ పడకుండా సరైన చోట సరైన పదాలను ప్రయోగించే నేర్పుతో ఎన్నో జీవిత సత్యాలను అలవోకగా ఆవిష్కరించింది ఈ కూనలమ్మ పదాలలో ఆరుద్ర కలం.
 సమకాలీన సంఘం మీద, మానవ ప్రవర్తనమీద, నీతినియమాలమీద, స్త్రీ పురుషుల ప్రవర్తనమీద, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలమీద లోతైన అధ్యయనం చేసి, వాటి సారాంశాన్ని చిన్న చిన్న పదాల రూపంలో ఆరుద్ర ప్రదర్శించిన తీరును తెలుసుకొని, ఆ చమత్కారాన్ని ఆస్వాదించాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ఈ కూనలమ్మ పదాలు.