రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 జులై 22 న శ్రీకాకుళం లో పుట్టారు. కథా రచయితగా, నవల, నాటక రచయితగా పాఠక లోకంలో రావిశాస్త్రిగా పాఠకలోకానికి సుపరిచితులు. ఈ రోజు రావిశాస్త్రి పుట్టిన రోజు.
ఇతివృత్త స్వీకరణలో, రచనా విధానంలో, శైలీ విన్యాసంలో రావిశాస్త్రి ఎన్నో కొత్త పోకడలు ప్రదర్శించారు. అవి సమకాలిన రచయితలెందరికో మార్గదర్శకమయ్యాయి. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వారి జీవన విధానాలు, సమాజంలో దిగజారిపోతున్నవిలువలు అందుకు అంతర్గతంగా సమాజంలోనే దాగిఉన్న కారణాలు వీటన్నిటినీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు రావిశాస్త్రి.
కథలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే ప్రశ్నలకు రచయిత భావించే సమాధానమే కథాశిల్పంగా రూపొందుతుంది. దానిని బట్టే కథా వస్తువు క్రమంగా పాత్రచిత్రణ, సన్నివేశాలు, సంఘటనలు, నేపథ్యం వంటి ప్రధానాంగాలతో ఏర్పడి వికసిస్తుంది. అలాగే రచయిత భాషా ప్రయోగం కూడా అతను ఉద్దేశించే ప్రయోజనాన్ని బట్టి ప్రకటితమవుతుంది.
రావిశాస్త్రి రచనలు ప్రధానంగా వచన రచనలు. ఆధునిక సాహిత్య రూపాలయిన కథ, నవల, నాటకాలు, పొట్టికథలు వంటి అనేక ప్రక్రియలలో రావిశాస్త్రి రచనలు చేసారు. రావిశాస్త్రి రచనలలో అంతర్లీనంగానే అయినా అత్యంత రసభరితంగా వ్యక్తమయే కవితా ధోరణి రావిశాస్త్రి వచన రచనా శిల్పానికి ప్రత్యేకతను ఆపాదించింది.
"సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొక చోట ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతుంది. ఇంకొక చోట జలపాతంలా ఊపిరి సలపకుండా వుక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొక్కచోట అచ్చమైన కవిత్వంగా మారి కావ్య స్థాయికి తీసుకువెళ్తుంది " అని గొప్ప కథా రచయిత శ్రీ మధురాంతకం రాజారాం రావిశాస్త్రి కవితామయమైన శైలిని ప్రశంసించారు.
సరళమైన వ్యావహారిక భాషలో రచనలు చేసారు రావిశాస్త్రి. ఒకదానివెనుక ఒకటిగా ధారగా వ్యక్తమయ్యే భావాలకూర్పు, వాక్యాలలోని లయ, తేలికగా అర్థమవుతూ సాగే భాష పఠిత మనసులో రచయిత ఊహిస్తున్న భావాన్ని రూపుకట్టిస్తాయి. వెనువెంటనే పాఠకుల అనుభూతిలోకి వచ్చే పదచిత్రాలతో రావిశాస్త్రి వాక్యప్రవాహం అద్భుతమైన వచన కవితా ఖండికలా తోపింపచేస్తుంది. పాఠకుడిలో వివశత్వం కలిగించి రచయిత వెంట లాక్కుపోతుంది.
రావిశాస్త్రి రాసిన కథలలో ప్రధానంగా పాత్ర చిత్రణలో, పాత్రల బహిరంతర పరిస్థితులమధ్య సంఘర్షణ వర్ణనలో ఆయన కవితావేశం కనిపిస్తుంది.
రావిశాస్త్రి కవితాశైలి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పవలసిన కథ
వెన్నెల.
ఆద్యంతం కవితాత్మకంగా సాగుతూ ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమయిన ఘట్టాలను వర్ణిస్తూ ప్రకృతిలోని వెన్నెల వెలుగులోనే అవి జరిగినట్టుగా చెప్తారు. తల్లి కడుపున అతను పుట్టినప్పుడు, రోగంతో అతని తల్లి మరణించినప్పుడు, మరొక మూడేళ్ళకి తండ్రి కళ్ళుమూసినప్పుడు పైన ఆకాశంలో పండు వెన్నెల కురుస్తోంది.వరకట్న సమస్యతో అక్క చనిపోయినప్పడు, తనకి పెళ్ళి జరిగినపుడు, అనారోగ్యంతో భార్య చనిపోయినప్పుడు కూడా వెన్నెల కురుస్తూనే ఉంది. కానీ అతని కొడుకుకి మాత్రం వెన్నెలలో సౌందర్యంకానీ, హాయి కానీ కనిపించలేదు. వెన్నెలలోని చల్లదనాన్ని కాక కార్చిచ్చులనే చూసాడు అతను. కథకుని కొడుకులో మానవ ప్రకృతి సహజంగా వెన్నెలలోని సౌందర్యాన్ని చూసి తన్మయత్వం పొంగకుండా అందులో కార్చిచ్చునే చూడడాన్ని అవ్యక్తంగా సూచిస్తూ, కథకుడి పాత్ర ద్వారా రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.
అంతటా వెన్నెలే, కాని ఎచటా చిచ్చులే.
వెన్నెలా వెన్నెలా నువు చూపే దృశ్యాలకి మనసు చెదురుతుంది వెన్నెలా
నువ్వు చూపే చిత్రాలకి గుండె కరుగుతుందో వెన్నెలా
అది సహజమే వెన్నెలా
కాని ఆయా దృశ్యాలకి, చిత్రాలకి, నీ తడితో పడుచు రక్తం ఉండుకుతుందే వెన్నెలా
అది కూడా అతి సహజం కాదటమ్మా వెన్నెలా
అవును -
యువరక్తం ఉడుకుతుందది వెన్నెలా
సుళ్ళుగా పరవళ్ళు తొక్కుతుందది వెన్నెలా...
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వెన్నెల వెలుగులోని హాయి, ఆహ్లాదం సామాన్యులకి కూడా అందాలని ఆశించి అందుకు ప్రయత్నించిన కొడుకు సమ్మెకట్టి కార్మకుడై వెన్నెల వెలుగులోనే పోలీసుల మరతుపాకులకు బలి అయ్యాడు. వెన్నెల వెలుగులోనే కథకుడి జీవన దీపం ఆరిపోయింది.
ఆకాశం నిండా ఏటి చల్లని వెన్నెల పరచుకొని ఉన్నా, వీధినిండా వెండి తెల్లని వెన్నెలే వెన్నెలే నిండి ఉన్నా అధర్మానికి బలి అయిన వారి ఎర్రని రక్తం కలిసి తడి తడిగా ఎర్రనెర్రని వెన్నెల ప్రవహించింది.
కన్న తల్లీ వెన్నెలా
లోకమంతా వెన్నెలే నీ పాలు పొంగిన వెన్నెలే
కాని
మాకు మాత్రం దానినిండా జీరలే.
పేద నెత్తుటి వేడి నెత్తుటి జీరలే
దానికింద మాకు మాత్రం విషపు నల్లని చీకటే కారు చీకటే
వెన్నెలా ఓ వెన్నెలా
ఓహో మా వెన్నెలా
అయ్యయ్యో ఓ వెన్నెలా....
వెన్నెల కథలో రావిశాస్త్రి కథనంలో వాడిన పదచిత్రాలు, వాక్యాల కూర్పుతోనే కథలోని వస్తువును ధ్వనిస్తూ పాత్రలను, సంభాషణలు, సంఘటనలను పరోక్షంగానే పఠితకు రూపుకట్టిస్తారు. భాషమీద, కథన ప్రక్రియ పైన పట్టు ఉన్న గొప్ప రచయితలు మాత్రమే చేయగల ప్రయోగం ఇది.
మెరుపు మెరిసింది కథ లో నేపథ్యం వర్షం. పెళ్ళికాని యువతి నీరజ నిరాశామయమయిన జీవితానికి ప్రతీక వర్షం. వర్షంలో మెరిసే మెరుపులు ఆమె ఆశలు. ఆమె పొందాలనుకున్న జీవితానందానికి ప్రతీకలు. చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి వీల్లేకుండా వర్షం ఆటంకం కలిగిస్తే ఒక యువకుడు ఆమెని తన కారులో గమ్యానికి చేరుస్తాడు. అప్పుడు ఆమెలో చెలరేగిన ఆశలని రచయిత ఇలా వర్ణిస్తారు.
మబ్బుల్లోంచి
వర్షంలోంచి
తలుపుల్లేని కిటికీలోంచి
చీకట్ని తోసేస్తూ
మెరుపులు
ఒకమెరుపు, ఒకటి మరొక మెరుపు రెండు మరో మెరుపు మూడు
ఒకటీ రెండూ మూడు.
మరునాడు కూడా అదే యువకుడు తనను మళ్ళీ కారు ఎక్కించుకుంటాడని ఆశపడిన నీరజకి నిరాశ ఎదురయింది.
అదో మెరుపు ఇదో మెరుపు మరో మెరుపు
ఒకటీ రెండూ మూడూ
హాస్యాస్పదం నవ్విపోతారు
అదిగో మెరుపు
ఇదే మాయమయింది.
మళ్ళీ మెరిసింది మాయమయింది
ఇంతే ఇది
ఆఖరికిదే నిజం.
ఈ చీకటే ఇదే ఈ చీకటే నిజం.
ఆశనిరాశలకి ప్రతీకాత్మకంగా, మెరుపులు, చీకటి మొదలయిన పదబంధాలతో సూచిస్తూ నీరజ పాత్రని కవితాత్మకంగా ఆవిష్కరించారు రావిశాస్త్రి.
జరీ అంచు తెల్లచీర కథలో జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.
ఇది మెరుపు లేని మబ్బు
ఇది తెరిపి లేను ముసురు
ఇది ఎంతకీ తగ్గని ఎండ
ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి
ఇది గ్రీష్మం
ఇది శిశిరం
ఇది దగ్ధం చేసే దావానలం
ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం
ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క
జ రీ అం చు తె ల్ల చీ ర
విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.
న్యాయ వ్యవస్థలో వృత్తికి, ప్రవృత్తికీ సంఘర్షణ ఏర్పడి ఏది న్యాయమో తేల్చుకోలేక చిత్తచాంచల్యం పొందిన మెజిస్ట్రేటు పాత్రని చిత్రించారు
మోక్షం కథలో. కథా ప్రారంభంలో కోర్టును వర్ణిస్తూ -
పైన భగ్గున మండే సూర్యుడు
బైట ఫెళ్ళున కాసే ఎండ
ఎండ ఎలా ఉంది
పులికోరలా పాము పడగలా
నరకం ఎలా ఉంటుంది
పులితో పాముతో చీకటిగా.
కోర్టులో ఆవరించి ఉన్న చీకటి మెజిస్ట్రేటుగారి మనసునిండా అలముకుంది. న్యాయం పేరుతో కోర్టులో జరుగుతున్న దురన్యాయాన్ని గురించి మథన పడతారు.
ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి
పోలీసువారి ఎర్ర టోపీల నిండా
చారలు చారలుగా చీకటి
చుట్టూ పడున్న ఖాళీ సారా
కుండలనిండా చల్లారని చీకటి
ముద్దాయిల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి
కోర్టులో చట్టాన్ని కాపాడే పేరుతో ప్లీడర్లు, పోలీసులు చేస్తున్న అన్యాయాలకు ప్రతీక ఇక్కడి చీకటి పదం.పదే పదే చీకటి అనే పదం ఒక్కొక్క అర్థంలో ప్రయోగించబడింది. చివరకు నిరపరాధులైనా సాక్ష్యాలు బలంగా ఉండడంతో, కోర్టులోని న్యాయసూత్రాలు తెలియక నిరక్ష్యరాస్యులుగా ఉన్న అమాయకపు ముద్దాయిలను శిక్షించవలసి రావడం మెజిస్ట్రేటుగారిని భయపెడుతుంది.
నామీద కొన్ని వేల పగలు
లోకంలో కోటానుకోట్ల పగలు
అనుకుంటాడు. పగ అనగానే సంప్రదాయపు విశ్వాసం పాములు పగపడతాయని గుర్తువచ్చి చుట్టూ ఉన్న సారా ట్యూబులు పాముల్లా కనిపించాయి.
పాముల్లా వాటి పడగల్లా
ఏమిటి ఏమిటవి
రోజూ ఇలాగే పాముల్లా సారూ ట్యూబులు
మోటర్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి
అన్నిట్లోనూ సారా
కోర్టుకొస్తే సారా
కోర్టులో ఉన్నంతసేపూ సారా
రోజూ దాదాపు ప్రతి కేసూ సారా.....
ఇలా సారా కేసులు తీర్పుల మధ్య నలిగిన మెజిస్ట్రేటుగారికి నిరపరాధులకి జైలు శిక్ష వేసి పాపం మూటకట్టుకుంటున్నాననే అపరాథ భావం కలిగింది.
రావుగారి మెదడంతా
చీకటి గదిలా ఉంది
చీకటి గదిలో చీమల ఏడుపు
వాటి గురించి తేళ్ళు, జెర్రులు
నరకం ఎలా ఉంటుంది
తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా
అక్కడ ఏముంటాయి
పగపట్టిన చలిచీమలు
....
రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని,
చీమల ఏడుపు జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని భయం వేసింది.
నా చేతులు నల్లని తాచులు
నా చేతుల మూతుల్లో ఐదేసి నాలుకలు
అన్నేసి కోరలు
ఈ సిరాలో విషం నా కలంలో కాటు
మెజిస్ట్రేటు పాత్రలో క్రమక్రమంగా కలిగే సంఘర్షణను కవితాత్మకమైన, ప్రతీకాత్మకమైన పదచిత్రాలతో వర్ణించారు రావిశాస్త్రి.
అధికారి కథలో ఆశలన్నీ నిరాశలుకాగా కుప్పకూలిన నూకరాజు మానసిక స్థితిని వర్ణిస్తూ -
అతను వెలిగించుకున్న జ్యోతులన్నీ అకస్మాత్తుగా
అతని కట్టెదుటే ఏట్లోకి దిగిపోయి ఆరిపోయాయి
అతను వేసుకున్న రంగుల డేరా
అతని కళ్ళెదుటే మాడి మసైపోయి మాయమయిపోయింది
అతను వేసుకున్న పూలతోట
అరక్షణంలో పాముల పుట్టగా మారిపోయింది.
అతనికి తూర్పుదిక్కు ఎటో వెళ్ళిపోయి
పడమటి దిక్కు ఎదురొచ్చింది.
అంటూ ఆ పాత్ర మనసులో చెలరేగిన తుఫానులాంటి స్థితిని పదచిత్రాలతో చూపుతారు రావిశాస్త్రి.
పువ్వులు కథలో బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల అవి తలలు వేల్లాడదీయగానే దిగులు పడుతుంది. కానీ రాత్రి పడిన వర్షంతో తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు చూసి సంతోష పడుతుంది. ఆ అమ్మాయి సంతోషాన్ని ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రి-
ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల
అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల
ఇదే కమల ఈ మొక్కా అయింది
ఇదే కమల ఆ మొక్కా అయింది
నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే
నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే
ఆ కమలే ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది
అదే కమల ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది.
ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.
కిటీకీ కథలో వర్ణింపబడే దృశ్యాలు కవితాత్మకంగా సాగుతాయి. బిచ్చగాడి మనసులో అతను పొందలేని సౌఖ్యానికి ప్రతీకగా తాను రోజూ చీకటిలో చూసే కిటికీని స్వర్గంగా భావిస్తూ ఉంటాడు.
నిజానికి బిచ్చగాడి పాత్రకి తన మనసులో ఊహిస్తున్న దృశ్యాలను వర్ణించే శక్తి, భాష లేవు. రచయిత రావిశాస్త్రి రమ్యమయిన పదచిత్రాలతో అతను చూసే దృశ్యాన్ని వర్ణిస్తారు. కిటికీ లోంచి కనబడే స్త్రీ పురుషులను దేవతలుగా భావింపచేస్తూ సమతౌల్యం కలిగిన వాక్య నిర్మాణంతో సాగే ఈ వర్ణన ద్వారా సాధారణమైన దృశ్యాన్ని కూడా అద్భుతంగా భావించడానికి కారణమైన బిచ్చగాడి దైన్య స్థితి పాఠకులకు అవగతమౌతుంది.
పంచరంగుల పువ్వుల తోటల్లోకి
తెల్ల పావురాల మెడ వంపుల మెరపుల్లోకి
కొండ నీడల కులికే చల్లని తోటల నీడల్లోకి
తెలిమబ్బుల తేలిపోయే గాలి మేడల్లోకి
చుక్కల బాటల్లోంచి
ముత్యాల ముగ్గుల్లోంచి
స్వప్నాల స్వర్గాల్లోకి
స్వర్గాల స్వప్నాల్లోకి
అదీ -
ఆ కిటికీ.
తెరిచిన కిటికీలోని దృశ్యాన్ని చూస్తూ తన జీవితంలో అనుభవించలేకపోయిన తనకు దూరమైన జీవితానందాన్ని పొందుతూ ఉన్న ముసలితాత, జల్లుకొడుతోందని అక్కడ కిటికీ మూయబడడంతో తాను కూడా కళ్ళు మూస్తాడు.
చీకటివరదలో
మధుర స్వప్నాలు ములిగిపోయాయి
ఆవరించుకున్న మేఘాల పొగల్లో మాయమయేయి
నిత్యంగా ఉండాల్సిన వసంతం
ఏదీ ఎక్కడికి పోయింది
కదలాడిన ముత్యాలు స్వప్నాలు స్వర్గాలు
అన్నీ కూడా ఏమయిపోయాయి అంటూ ముష్టి ముసలితాత జీవన వైఫల్యానికి కారణాలను వ్యవస్థలో వెతుకుతూ పఠితను ఆలోచింపజేస్తారు. అతని మరణానికి సూచనగా స్వర్గం కరిగిపోవడంగా సూచించారు రావిశాస్త్రి.
రావిశాస్త్రి కి సైగల్ పాటలంటే ప్రాణం. సైగల్ పాట వినడంలో రావిశాస్త్రి పొందే అనుభూతి ప్రత్యేకమైనది. సైగల్ పాటకి పాపాలను కడిగేసే శక్తి ఉందని, ఆ పాట అతి పవిత్రమైనది అని నమ్మారు .
సైగల్ కథలో రామారావు పాత్ర క్రూరమైన మనస్తత్వం కలిగినదే అయినా పార్క్ లో సైగల్ పాట విని అతని మనస్తత్వంలోనే గొప్ప మార్పు కలగడం మంచికి మారడం పాఠకులు నమ్మలేనిదే అయినా రావిశాస్త్రి వర్ణనలో, రూపుకట్టించిన పద చిత్రాలలో, వాక్యాల కూర్పులో, వాడిన అలంకార ప్రయోగంలో రచయిత తో పాటుగా పాఠకుడిలో కూడా సైగల్ గొప్పదనాన్ని విశ్వసించే విధంగా చూపబడింది.
ఈ పాటలో
వెన్నెల వెలుగులున్నాయా
చుక్కల తళుకులున్నాయా
చిక్కని చీకట్ల నునుపులున్నాయా
ఇంద్ర ధనుస్సుల రంగులున్నాయా
వేడికొండల నిట్టూర్పులున్నాయా
ఈ పాటలో
ప్రియురాలి విరహముందా
పడుచు రక్తపు ప్రవాహముందా
స్మృతులే మిగిలిన ముసలివాని బోసి నవ్వుందా
పసిపాపల హాసముందా
సీతాదేవి శోకముందా
రాథేయుని హృదయముందా
ఈ పాటలో
ఏవేవో ఉన్నాయి
ఎన్నెన్నో ఉన్నాయి
కానీ
ఈ పాటలో పాపాల్లేవు
ఈ పాట పాపాన్నెరుగదు....
అలాగే
కలకంఠి కథలో మానవ జీవితాలలోని అనంతమైన వైవిధ్యాన్ని వర్ణించడానికి మానవ కంఠాలకు ఆ వైవిధ్యాన్ని ఆపాదిస్తూ కవితాత్మకంగా వాక్యాలు పేర్చారు.
అసహాయంగా జాలిగా కుంగిపోతాయి
అదృష్టం బావుండక పోతే ఉత్తరించుకుపోతాయి
ఇంపుగా పలుకుతాయి
శ్రావ్యంగా పాడతాయి
సొంపుగా కలకల్లాడతాయి
పూలమాలల్తో కావలించుకుపోతాయి
ముత్యాల హారాల్తో ముడివేసుకుపోతాయి
పచ్చటి పుస్తేల తాళ్ళతో బంధించుకు పోతాయి
చిత్రమయిన పనులు చాలా చేస్తాయి మానవ కంఠాలు.
నిజానికి పై ఉదాహరణలలో పేర్కొన్న వాక్యాలన్నీ వచనంగా వరుసగా రాయబడినవే. కానీ పాదాలుగా విభజించే వీలుండే సౌలభ్యం వలన కవితా ఖండికలుగా చూపించడం కోసం ఇలా రాసి చూపడం జరిగింది.
రావిశాస్త్రి వచనంలోన వాక్య నిర్మాణంలోని తూగు, లయ కలిగిన కవితాత్మకత అనే లక్షణం వలన వీటిని కవితా ఖండికల గా చూడగలం. శ్రీశ్రీ తనను ఉర్రూతలూగించాడని, శ్రీశ్రీ గేయాలు రాసే భాషలో కథలు రాయాలని ఉండేది అన్నారు ఒకచోట రావిశాస్త్రి. జీవిత వాస్తవాన్ని చూసే కళ్ళుంటే, కాదేదీ కవితకనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన వస్తువులను కథలుగా మలచడంతోపాటు ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం అని శ్రీశ్రీ అన్నట్టుగానే తన కథలలో కవితావేశం ప్రదర్శించి పాఠకులలో రసనిర్దేశం చేసారు రావిశాస్త్రి.
చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కవితా ఖండికలు దొరుకుతాయి రావిశాస్త్రి వచనంలో.
వచనం రాసే వారిలో నికరమైన కవి......
రావిశాస్త్రి వచనంలో అలా అలా అంతర్లీనంగా ఆయనదే ఐన ఒకానొక అద్భుత కవిత్వం ఒదిగి పోయింది. ....అవకాశం దొరికిన ప్రతిచోటా ఉత్తమ శ్రేణి కవిత్వం స్వాభావికంగా వచ్చి చేరిపోయింది -
అన్న ప్రశంస అక్షర సత్యంగా కనిపిస్తుంది.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి
కథలలో కవిత్వమే రాస్త్రి !!