24 September 2011

అపురూపమైన కథాకావ్యం – ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’గురజాడ అప్పారావు గారి కథాకావ్యం – ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’ 
నూటికో కోటికో...ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నాడో సినీకవి.  తెలుగుతేజం, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అలాంటి వ్యక్తులలో ఒకరు. దేశమంటే మట్టికాదోయ్!! దేశమంటే మనుషులోయ్!! ’ అంటూ చాటిచెప్పిన మహాకవి గురజాడ, సంఘ సంస్కరణకోసం కలంపట్టారు.  స్త్రీజనోద్ధారణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తితో సమకాలిన సమస్యలపై  పోరాటానికి  కలాన్ని కత్తిలా ఝుళిపించారు. 

గురజాడ గొప్ప సంఘ సంస్కర్త మాత్రమే కాదు అంతకు మించిన చదువరి. ఇంగ్లీషుచదువుల వలన సమకూర్చుకున్న తన జ్ఞానాన్ని తన జాతిజనులకు పంచి పెట్టడానికి పూనుకున్నారు. తన రచనలవలన సాధించవలసిన సాంఘిక ప్రయోజనం గురించి పూర్తి అవగాహన ఉన్న కవి కనుకనే,  తాను ఎవరికోసం కలం పట్టారో ఆ ప్రజలు అర్థం చేసుకోవలసిన భావాలను వారు మాట్లాడే భాషలోనే చెప్పదలచుకున్నారు.  కవి తన భావ ప్రకటనకోసం ఎంచుకోవలసిన బాహ్యరూపాన్ని నిర్ణయించుకున్నప్పుడు వర్తమాన కాల, సమాజపరిస్థితులు ప్రభావం చూపుతాయి. అందుకే గురజాడ
భావానికి తగిన భాష తో పాటు రచన స్వరూపం కూడా కొత్తగా ఉండాలని ఆశించారు. తెలుగు భాషలో అంతవరకు వాడుతున్న ఛందస్సులు యతిప్రాసల ప్రతిబంధకాలతో బిగించబడి ఉన్నాయి. 
తన భావ ప్రకటన  వ్యావహారిక శైలిలో, మృదుమధురమైన పదాలతో ఉండేలాముత్యాల సరాలు అనే కొత్త సరళమైన ఛందస్సును రూపొందించుకున్నారు. ఆ ఛందస్సులోనే తన గేయాలను రచించారు. గణబద్ధమైన ఛందస్సులమీద తిరుగుబాటుగా, ప్రౌఢమయిన పదాల స్థానంలో సరళమైన వ్యావహారిక పదాలను పేరుస్తూ అత్యంత సులభగ్రాహ్యమైన శైలిలో మాత్రాఛందస్సులో  గురజాడ   రచించిన గేయాలన్నీ నవ్యకవితకు ఒజ్జబంతి పెట్టాయి. 

గురజాడ అప్పారావుగారి రచనలలో నాటకంగా కన్యాశుల్కం రచనకి ఎంత ఆదరణ ఉందో, గేయరచనలలో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయానికి కూడా అంతే జనాదరణ ఉంది. కన్యాశుల్కం నాటకంలో లాగే ఈ గేయానికి కూడా వస్తువు కన్యా శుల్కమే.

ఇక్కడ మనం ప్రస్తుతం వరకట్నం అనే సాంఘిక వ్యవస్థలో ఉన్న తరంలోని వాళ్ళం అంతా - ఆ కాలంలోకి ఒకసారి తొంగి చూడాలి. 

గురజాడ ఈ నాటకం రాసిన కాలానికి కన్యాశుల్కం అనే ఒక సాంఘికమైన ఆచారం ఆనాటి సమాజంలో ఉండేది . ఇప్పుడు వివాహం జరిగే సందర్భంలో వరుడికి కొంత పైకాన్ని కట్నం అనే పేరుతో బహుమతిగా సమర్పించి తమ కూతురును అతనికిచ్చి వివాహం చేస్తున్నారు కదా. ఈ ఆచారాన్ని మనం వరకట్నం అంటున్నాం.

కానీ కన్యాశుల్కం అనే ఆచారం పూర్తిగా దీనికి వ్యతిరేకం. ఆనాటి సమాజంలో  వరుడు అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకు కొంత సొమ్మును చెల్లించి ఆమెని వివాహం చేసుకునే వాడు. దీనిని కన్యకి చెల్లించే రుసుముగా కన్యాశుల్కం అనే పేరుతో వ్యవహారంలో ఉండేది.

పెళ్ళి అనే ఆచారం సంఘంలో కుటుంబవ్యవస్థను పరిపోషించే చక్కని సాధకంగా కాక  రక్తమాంసాలను  విక్రయం చేసే  వ్యాపార వ్యవస్థగా ఎప్పుడైతే మారిందో  అది సమాజాన్ని పీడించే దురాచారంగా మారింది. కన్యాశుల్కం ఆచారం కొనసాగుతున్న ఆ సమాజంలో  ఆడపిల్లలకు పెళ్ళిచేయడం అంటే ఆమెకు సాంఘికమైన కట్టుబాటు గల కుటుంబజీవనం ఏర్పాటుచేయడానికి అందులో భాగంగా  తమ బాధ్యత నెరవేర్చుకోవడంగా కాక వారిని పెళ్ళి పేరుతో జరిగే క్రయవిక్రయాలలో ఒక వస్తువుగా బావించారు తల్లితండ్రులు.స్త్రీ పురుషుల మధ్య జరిగే  వివాహం సమాన వయస్కుల మధ్య జరిగే సాంఘిక వ్యవహారంగా ఉంటే సమస్య లేదు.  కానీ పూర్తిగా ఐదేళ్ళు కూడా నిండని పసిపిల్లలను, (అంతెందుకు తల్లి కడుపులో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే  వివాహమాడడానికి సిద్ధపడిన వారూ ఉన్నారుట) కన్యాశుల్కానికి ఆశపడిన పిల్లల  తల్లితండ్రులు భార్య చనిపోయిన ముసలివారు, రోగిష్టివారు అని కూడా చూడకుండా తమ ఆడపిల్లలను వారికి ఇచ్చి పెళ్ళి చేసేవారు.  అటువంటి  కన్నెపిల్లలను పెళ్ళి చేసుకోవడానికి జరిగే పోటీలో వీలున్నంత ఎక్కువ ధనం చెల్లించి బేరం కుదుర్చుకొని పెళ్ళి చేసుకునే వారు ఆ పెళ్ళి కొడుకులు. అటువంటి పెళ్ళి కొడుకులంతా కనీసం యాభై సంవత్సరాలు దాటినవారి దగ్గరనుంచి, కాటికి కాళ్ళుచాచుకున్న ముసలి తనంతో ఉండేవారు.
"ఇంతటి ఘోరమైన పరిస్థితి సమాజానికి సిగ్గుచేటని, ఇటువంటి దురాచారాన్ని ఎండగట్టి, ఉన్నతమైన నైతిక ప్రమాణాలను వ్యాపింపచేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు"(కన్యాశుల్కం నాటకానికి గురజాడ రాసిన ముందుమాటలో) - అని గట్టిగా విశ్వసించిన గురజాడ తన సాహిత్యం ద్వారా అందుకు నడుం కట్టారు.

 సమాజంలోని ఈ దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి  కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా  పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ.  పుత్తడిబొమ్మా పూర్ణమ్మాఅంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను ?

పాట ప్రారంభంలో ముగ్థమనోహరంగా విరిసీ విరియని పూలలాగా ఉండే చిన్నారి బాలికలను ఉద్దేశించి కవి  - కథనాత్మకమైన తన పాటను ఇలా ప్రారంభిస్తారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన తీగలలాంటి శరీర లావణ్యం, కలువలలాంటి తీర్చిదిదిన కనుదోయితో బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెడుతున్న బాలికలను వర్ణిస్తూ, వారిని సంబోధిస్తూ,  వారికోసమే ఈ కధను చెప్పడానికి ఉపక్రమిస్తారు కవి. విన్నారమ్మా ఈ కథను అంటూ తాను చెప్పబోతున్న కథలోకి వారిని తీసుకువెళ్తున్నారు.

ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?

ఆటపాటలతో సంతోషంగా ఉంటూ, కమ్మగా మాటలు చెప్పే అమ్మాయిలను కొమ్మల్లారా అని సంబోధిస్తూ తన కథలోకి ఆహ్వానిస్తారు.
ఇక తాను ఎవరికైతే ఆ కథను చెప్పాలనుకున్నారో ఆ శ్రోతలు వచ్చారుగా..కథని ప్రారంభిస్తారు.


కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.

తాను చెప్పబోతున్న కథకు నేపథ్యం వర్ణన తో కథను ప్రారంభించారు. కొండలనడుమ, ఓ చిన్న తోట, ఆ తోట మధ్యలో ఓ చిన్న కొలను, ఆ కొలను ఒడ్డున ఓ దేవాలయం . ఆ దేవాలయంలో వెలసిన దేవత దుర్గమ్మ. ఆమె బంగారు దుర్గమ్మగా పూజలందుకునే దేవత.

కథకి నేపధ్యం అమరింది. ఇక కథలో ప్రధాన పాత్ర కథానాయిక పూర్ణమ్మ. ఆమె ఒక పూజారి కుటుంబంలో జన్మించింది. ' పూర్ణమ్మ-(పుత్తడి అంటే బంగారం) బంగారు బొమ్మలా ఎంతో అందంగా ఉండేది'  అంటూ ఆ పాత్రను పరిచయం చేస్తారు  కవి.

పూజారింటను  పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు  పువ్వులు  కోసేది.

అన్నదమ్ముల మధ్య అపురూపంగా , వారి కన్నుల వెలుగుగా తిరుగుతూ ఉండేది. పూజారి కుటుంబంలో పెరుగుతోంది కనుక భక్తి చాలా సహజంగా ఆమెలో కుదురుకుంది. అందుకే  తమ ఇంటి దగ్గర కోవెలలో వెలసిన దుర్గాదేవిని ఎంతో భయ భక్తులతో సేవించేది. 

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

 ప్రతిరోజూ ఆ దుర్గను పూజించడానికి పూర్ణమ్మ  పూవులు కోసేది.  కోవెలలో దేవుడికి రెండు పూటలా పూజలు జరుగుతాయి. ఉదయం పూజ చేసిన పూలను తొలగించి సాయంత్రం పూజా సమయానికి వేరే పూలతో పూజ చేస్తారు దేవాలయాలలో.  కొన్ని పూలు ఉదయాన్నే వికసిస్తాయి. మరి కొన్ని పూలు సాయంత్రం వేళలలోనే విరుస్తాయి. ఆ విధంగా ఏ సమయాలలో ఏ పూలు విరుస్తాయో తెలుసుకొని పూర్ణమ్మ  ఆయా పూలను ఏరి తెచ్చి భక్తిగా దేవతను కొలిచేదట పూర్ణమ్మ.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

భగవంతుడికి, పూలతో పాటు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాం. ఒక్కో ఋతువుకీ ఒక్కో రకమయిన పండ్లు లభిస్తాయి. ఆవిధంగా  పూర్ణమ్మ ఋతువులకు తగినట్టుగా లభించే పళ్ళను సేకరించి
దుర్గమ్మ దేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించి పూజించేది పూర్ణమ్మ. 

బాల్య దశను దాటి యౌవనారంభ చిహ్నాలు పొడసూపుతున్న చిన్నారి పూర్ణమ్మను ఇలా వర్ణిస్తారు కవి.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.

తాను దుర్గకు సమర్పించిన పండ్లలోని తీపి నింపినట్టుగా, పూల లోని సోయగాన్నిమించిన సొగసుతనం పూర్ణమ్మ  శరీరంలోని ప్రతి  అంగంలోను సౌందర్యం నిండుతూ ఉందట. దినదినాభివృద్ధితో పూర్ణమ్మ యవ్వనవతి యై ఎన్నో సొగసులు దిద్దుకుందట పూర్ణమ్మ.

ఇక బాల్యదశనుండి కౌమార దశకు చేరుకున్న కూతురు తల్లితండ్రులకు బాధ్యతగా మారుతుంది.

 పూర్ణమ్మ కథలో ప్రధాన మైన  వస్తువు ఈ కన్యాశుల్కమే. ఆ కథా వస్తువు బీజరూపంనుండి వికాసనం పొందే దశ ఇక్కడ ప్రారంభమవుతోంది.
 

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
 
పూర్ణమ్మ మంచి సొగసుకత్తెగా రూపుదిద్దుకొని, పెళ్ళీడుకు రాగానే తల్లితండ్రులు ఆమెకు వివాహం నిశ్చయించారు. కాసు అంటే ఇక్కడ డబ్బు. డబ్బుకు లొంగిపోయిన పూర్ణమ్మ తల్లి తండ్రులు ఆమె పట్ల తమ ప్రేమాభిమానాలనే కాక మానవత్వం అనే కనీస ధర్మాన్ని వదిలేసి ఒక ముసలివాడికి ఇచ్చి ఆమెకు మూడు ముళ్ళు వేయించారు.

ఆ కాలంలో పెళ్ళి ఏ వయసులో జరిగినా ఆ అమ్మాయి వ్యక్తురాలై సంసార జీవితానికి అర్హత పొందే వరకు తల్లి తండ్రుల ఇంటిలోనే ఉండేది. ఆ తరువాత ఆమెను అత్తవారింటికి లాంఛనంగా పంపించేవారు. అప్పటినుండి ఆమె అత్తవారింటి కోడలిగా వారి కుటుంబంలో ఉండేది. పూర్ణమ్మకు ముసలివాడితో వివాహం జరిగినా తల్లి తండ్రుల వద్దే ఆట పాటలతో గడుపుతోంది.

ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో;
కిలకిల పలికెను కీరములు.

ఆమని రాగా అంటే వసంత మాసం సమీపించింది అనే అర్థంతో పాటు పూర్ణమ్మ బాల్యదశను పూర్తిగా వీడి యౌవనం లోకి ప్రవేశించింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. వసంత మాసం సమీపించగానే వాతావరణం దానితో పాటు ప్రకృతి మారిపోతాయి. దుర్గ గుడి ఉన్న కోవెల పక్కన కొలను లోని తామర పూలు బాగా వికసించాయి. వాటితో పాటు పక్షులు కూడా తమ ఇంపయిన ధ్వనులతో కిలకిలలాడుతూ ఉండగా వాతావరణం అంతా ఎంతో సంతోషంగా ఉంది.  నిండుగా వికసించిన పుష్పంలా తన ముద్దులు మూటగట్టే ముఖంతో చక్కని చిరునవ్వుతో  తన సౌందర్యంతో ప్రకృతిలాగే అందరకీ కనువిందు చేస్తోంది పూర్ణమ్మ. 

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఈ నేపథ్యంలో పూర్ణమ్మ కూడా ఆ వాతావరణానికి తగినట్టే సంతోషంతో పరవశమై ఉండగా ఆమెను కాపురానికి తీసుకుని వెళ్ళడానికి భర్త వచ్చాడు. ఆ భర్తను చూడగానే  వెలుగుతున్న హారతి కర్పూరం లాంటి పూర్ణమ్మ సంతోషం అంతా గుప్పుమని ఆరిపోయింది. పెనిమిటి అంటే భర్తను చూసిన నిముషంలోనే ఆమె ముఖంలో ఆ ముద్దు గొలిపే నవ్వు మాయమైంది. మురిపించే చిరునవ్వులు మాసిపోయాయి. కన్నులలో నీరు నిండిపోయింది.

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుఃఖించె

 పూర్ణమ్మ  తన ముసలి భర్తను చూసి ఎంతో దుఃఖపడింది. తన కన్నీటిని తనలోనే అదిమిపెట్టుకుని సంబాళించుకుంది. కానీ ఆమె స్నేహితులు ఆమె వయసో, మరికొంచెం చిన్నవారో అయిఉంటారు. సమాజంలోని  ఈ దురాచారానికి తాము కుడా సమిధలం కాబోతున్నామనే అనుమానం లేని చిన్నపిల్లలు పూర్ణమ్మను తమ మాటలతో బాధించడం మొదలుపెట్టారు. పూర్ణమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆమె భర్త వయసులో ఆమె కన్నాచాలా పెద్దవాడు. ఆమెకి తాతగారి వరసవ్యక్తి కి ఉండేంత వయసువాడు. అందువలన పూర్ణమ్మ భర్తను చూసి వారు నీ మొగడు తాత అని ఆమెని వేళాకోళం చేసారు.

పూర్ణమ్మ మనసులో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఇక ఆ స్నేహితులతో పంచుకోలేక, వారి మాటలను భరించే మానసికమైన శక్తిలేక ఆటలపాటలలో వారితో కలియలేక ఒంటరిగా వెళ్ళి దుర్గ కోవెలలో ఆ దేవత సన్నిధిలో కూర్చని తన బాధను దిగమింగుకునేది.

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.

పూర్ణమ్మను తనతో కాపురం చేయడానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన  ఆ ముసలి భర్త ఆమెకు సారెగా చాలా వస్తువులను తీసుకువచ్చాడు. ఆడపిల్లలకు నగలు, చీరలు అనేవి చాలా సంతోషం కలిగిస్తాయని వాటితో వారు సంతృప్తిగా జీవిస్తారని ఆనాడేకాదు ఈనాడు కూడా సమాజంలో ఒక భ్రమ ఉంది. ఇక్కడ పూర్ణమ్మ వంటి చిన్న వయసు గల కన్యను వివాహం చేసుకున్న ముసలి వాడయిన భర్త,  తన తప్పును ఆమెకు చీరలు, నగలు సమృద్ధిగా ఇచ్చి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసాడు.

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.

ఇక - కాపురానికి  భర్తతో కలిసి పూర్ణమ్మ పయనం కావలసిన సమయం దగ్గరపడింది. ఆమెను ప్రయాణానికి సిద్ధం చేసారు వదినెలు. బంగారు ఛాయతో మెరిసిపోయే వంటికి పసుపురాసి స్నానం చేయించారు. భర్తతో గడపవలసిన జీవితం గురించి, వైవాహిక జీవితంలోని విషయాల గురించి తమ అనుభవాలను చెప్తూ  పూర్ణమ్మను మానసికంగా సిద్ధం చేసారు వదినెలు.

ఇక ప్రయాణ సన్నాహాలు మొదలయ్యాయి. తనకంటే వయసులో పెద్దవారయిన వారి దీవనలుతీసుకొని ప్రయాణానికి బయలు దేరడం మన జాతి ఆచారం. అందుకే పూర్ణమ్మ తన తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కింది. కూతురు తమ కాళ్ళమీద పడి మొక్కగానే యథాలాపంగా తల్లి తండ్రులు ఆమెను దీవించారు.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !

ఇక్కడ  కవిగారి గొప్పవాక్యం పఠితను ఒకింత ఆశ్చర్యానికి, ఉత్సుకతకు గురిచేస్తుంది. కథను వింటూ ఉన్న వారంతా ఒక్క తల విదిలింపుతో ఆలోచనలో పడతారు. పెద్దలకు మొక్కడం, వారు దీవించడం ఎంతో సహజమైన విషయాలు కదా. వీటిలో ఈ అసహజమైన పూర్ణమ్మ నవ్వు ఎలా చొరబడిందా అని ఆలోచనలో పడతారు.

ఇందులో కవి అన్యాపదేశంగా చెప్పే విషయం ఏమిటి అంటే పిల్లలు పెద్దవారికి మొక్కినప్పుడు వారి దీవనలు ఎలా ఉంటాయి? చిన్న పిల్లలు దీవెనలు కోరి మొక్కినప్పుడు - 'దీర్ఘాయుష్మాన్ భవ' అంటూ దీవిస్తారు. అదే ఆడపిల్లలు, పెళ్ళి అయిన వారు పెద్దలకు మొక్కినప్పుడు -'దీర్ఘ సుమంగళీ భవ ' అంటూ దీవిస్తారు. వివాహం కానివారు మొక్కితే 'శ్రీఘ్రమేవ  వివాహ ప్రాప్తి రస్తు' అంటూనూ, దంపతులుగా వచ్చి మొక్కితే -' సుపుత్ర ప్రాప్తి రస్తు'  అంటూనూ దీవిస్తారు.

ఇక్కడ పెద్దలకు పూర్ణమ్మలాంటి వధువు,  అత్తవారింటికి కాపురానికి వెళ్తూ తమ తల్లిదండ్రులకు మొక్కితే వారు ఏమని దీవించి ఉంటారు...
' దీర్ఘ సుమంగళీ భవ ' అని. అంతే కదా. 'కలకాలం సుమంగళిగా ఉండవమ్మా 'అంటూ తల్లిదండ్రులు తనను దీవించడం చూసి పక్కున నవ్వింది పూర్ణమ్మ. సుమంగళి అంటే పెళ్లయిన తర్వాత వివాహ చిహ్నాలు అయిన తాళి, మట్టెలు, పసుపు, కుంకం వంటివి ధరించి ఉండడం. భర్త మరణించిన తర్వాత ఆ స్త్రీ ఈ సుమంగళి చిహ్నాలను ధరించడానికి అర్హత పోగొట్టుకుంటుంది.  తల్లిదండ్రులు కాటికి  కాళ్ళు చాచుకున్న  ముసలివాడికి    ఇచ్చి తనకు  పెళ్ళిచేసారు. అతను కలకాలం జీవించే అవకాశం లేదు కదా. ఇక తను సుమంగళిగా దీర్ఘ కాలం గడిపే అవకాశం లేదు కదా అనే ఆలోచన రాగానే ఫక్కుమని నవ్విందట పూర్ణమ్మ. చిన్నపిల్లలలోని కల్మషంలేని నవ్వు, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకనే తమ భావాన్ని ప్రకటించే అమాయకత్వం పూర్ణమ్మలో ఇక్కడ కనిపిస్తాయి. కానీ అంతలోనే తన చేష్టలోని అసహజత్వాన్ని గ్రహించింది.  కనుకనే ఆ నవ్వును ఇక కొనసాగించలేదు పూర్ణమ్మ.

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

ప్రయాణానికి సిద్ధమవుతున్న పూర్ణమ్మ తనకంటే చిన్నవారయిన తన అన్నదమ్ములను, దగ్గరకు తీసుకుని వారికి దూరమవుతున్నందుకు కంటతడిపెట్టింది.
తన అన్నలను, తమ్ముళ్ళను ఉద్దేశిస్తూ ఈ విధంగా అంటుంది పూర్ణమ్మ.

"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
ఎంతో కరుణ రసాత్మకమైన వాక్యాలు ఇక్కడ పోతపోసారు గురజాడ. ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింటికి మొదటిసారిగా ప్రయాణమవుతున్నప్పుడు ఆమె మానసిక స్థితిని ఎంతో చక్కగా వర్ణించారు. పూర్ణమ్మ తన అన్నదమ్ములతో  తమ తల్లి తండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అంతే కాక తాను ఎంతో ఇష్టంగా కొలుచుకునే దుర్గమ్మను,  వారు కూడా తనంత భక్తితోను, శ్రద్ధతోను పూజించాలని కోరింది. ఆ దేవి అమ్మలగన్న అమ్మ అని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పింది. ఆయా సమయాలలో ప్రకృతిలో లభించే పూలతోను, పళ్లతోనూ దేవికి నైవేద్యాలు సమర్పించి ఆమె కరుణ పొందే విధంగా పూజించమని చెప్పింది.

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."

ఈ విషయాలన్నీ చెప్తూనే మరో మాట కూడా చెప్పింది. అందరూ సంతోషంగా నవ్వుతూ గడిపే సమయాలలో  ఇకపై తాను వారితో ఉండదు కనుక అటువంటి సంతోషసమయంలో తనను కూడా తలుచుకోమంటూ అన్నదమ్ములను అడుగుతుంది. అంతే కాదు. ఆ అన్నదమ్ములు తమకు ఆడపిల్ల పుడితే తన గుర్తుగా తనను రోజూ తలచుకోవడం కోసం ఆ పాపకి తన పేరు పెట్టుకోమని అడిగింది.

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆమె కంఠం రుద్ధమయింది. కంటిలో నీరు చివ్వున ఎగజిమ్మింది. జల జల రాలుతున్న కన్నీటికి అంతలోనే ఆనకట్ట వేసిన పూర్ణమ్మ తన బేలతనానికి తానే నవ్వుకుని తన కన్నీటిని గబ గబా తుడిచేసుకుంది. తన మనసులో దుఃఖంలేదని, తాను సంతోషంగానే కాపురానికి వెళ్తున్నానని చెప్పడం కోసం కలకలమని నవ్వుతూ తన నవ్వులమాటున దుఃఖాన్ని దాచేసింది పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్

కానీ ఆమె చేస్తున్న ఆ ప్రయత్నం వట్టిదే అని అర్థం చేసుకున్నారు సాటి ఆడవాళ్ళయిన వదినెలు.
పెద్దవారు ఏడిస్తే బెదిరిపోయే చిన్న పిల్లలు - ఆమె తమ్ముళ్ళు కూడా చాలా బాధ పడ్డారు. కర్కశురాలిగా కనిపించే తల్లికూడా కూతురు అత్తవారింటికి బయలుదేరే సమయం వచ్చేసరికి తానూ కంట తండి పెట్టింది.

కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.

కానీ ఈ విధంగా తమ కుటుంబాన్ని వదిలిపోతున్న తమ చిన్నారి ఇక తమకు ఎప్పుడంటే అప్పుడు కంటపడదు కదా.తమకు దూరమవు తోంది  కదా అని కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడుతున్నా పూర్ణమ్మ కన్న తండ్రి మాత్రం ఆ బాధ ఏమీ లేనట్టు ఆనందంగానే ఉన్నాడు. కారణం ఆ అల్లుడి ద్వారా తాను సంపాదించిన కన్యాశుల్కం రూపంలో అందుకున్న ధనం. తన కూతురు ఓ డబ్బున్నవాడికి భార్యఅయింది కనుక  ఇక సుఖపడుతుందనే నమ్మకం కూడా కావచ్చు. కానీ ఇంతమంది బాధ పడుతున్నా ఆనందంగా ఉన్నది ఆమాత్రం ఆ ఇంటిలో పూర్ణమ్మ తండ్రిమాత్రమే.
పూర్ణమ్మ ప్రయాణానికి సమయం ఆసన్నమయింది.

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ప్రతిరోజూ సాయంత్రం పూట పూలమాలలు కూర్చి దుర్గను అలంకరించి ఆమెను ప్రార్థించే అలవాటున్న పూర్ణమ్మ ప్రయాణానికి ముందు  ఎప్పటిలాగే దుర్గను ప్రార్థించి వస్తానని చెప్పి ఇంటినుండి బయలుదేరింది.

ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు వొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.

పాత్రలో వచ్చే పరిణామాలను సూచించడానికి ప్రకృతిలో మార్పును, నేపధ్యంలో మార్పులను సూచనగా వాడుకోవడం రచయితలకి ఉండే నేర్పరితనాన్ని సూచిస్తుంది.

 పూర్ణమ్మ కథాకావ్యంలో  గురజాడవారు పూర్ణమ్మలోని శారీరకమైన ఎదుగుదలను సూచించడానికి ప్రకృతిలోని మార్పులను సూచించారు. అలాగే ఇక్కడ పూర్ణమ్మ ఎంతో వేళ గడిచినా ఇంటికి చేరుకోలేదన్న విషయం సూచించడానికి  ప్రకృతి వర్ణననే సూచనగా వాడారు.
ఆవులు, పెయ్యలు తమ మందలో చేరాయని, ఆకాశంలో చుక్కలు మెరుస్తూ పొడిచాయని చెప్పడం ద్వారా చాలా రాత్రి అవుతున్నా పూర్ణమ్మ ఇంటికి చేరలేదని చెప్తారు.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.

 సాయంకాలం గడిచిపోయింది. రాత్రి ఇంకా ఇంకా చిక్కనవుతోంది. కొండలు, కోనలు అంతా గుప్పు గుప్పున చీకట్లు కమ్ముకుంటున్నాయి. అర్థరాత్రి పూట వేటకు వెళ్ళే క్రూర జంతువులు తిరిగే కాలం కూడా సమీపిస్తూంది. అయినా పూర్ణమ్మ ఇంకా ఇల్లుచేరుకోలేదు.

'దుర్గమెడలో హారములమరెను' అన్న వాక్యంలో పూర్ణమ్మ దుర్గ గుడిని చేరుకుంది అన్న విషయాన్ని గ్రహిస్తాం. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదన్న మాట అనే విషయం కూడా మనకి అర్థం అవుతుంది.
కానీ ఆమె ఏమయింది అన్న విషయం కవి మనకు స్పష్టంగా చెప్పరు. అదే మహాకవి లక్షణం. పాఠకుల ఊహలకు విషయాన్ని వదిలి ఆ విషయ స్ఫురణ వలన కలిగే ఆనందాన్ని కావ్యానందంగా శ్రోతలు ఆయా రసాలను గ్రహించాలి. అప్పుడే కావ్యం ద్వారా శ్రోత  మనసులో రసావిష్కరణ  జరుతుంది.

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

ఈ వాక్యాలను విన్న వెంటనే శ్రోతలు గ్రహించగలుగుతారు పూర్ణమ్మకు ఏం జరిగి ఉంటుందో అన్న విషయం. దుర్గను చేరెను పూర్ణమ్మ అన్న వాక్యం వలన ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం గ్రహించిన శ్రోత మనసు కరుణరస ప్లావితమవుతుంది.

ఎంతో సౌందర్యవతి అయిన ఆ పుత్తడి బొమ్మలాంటి పూర్ణమ్మ సౌందర్యం అంతా,   దురాచారాన్నే సదాచారంగా పాటిస్తున్న తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజపు దౌష్ట్యానికి బలి అయి పోయిన తీరును కన్నుల కాంతులు కలువల జేరెను, మేలిమి చేరెను మేని పసల్ ’’అంటూ చేసిన వర్ణనలో కనిపిస్తుంది. కలువలు అంత కాంతులీనుతూ సుందరంగా ఉండడానికి కారణం పూర్ణమ్మ కన్నులలోని కాంతి తమలో వచ్చి చేరడం వల్లనేనట. బంగారం అంత మెరుస్తూ ఉండడానికి కారణం పూర్ణమ్మ శరీరపు కాంతి తనలో చేరడమేనట. హంసలు అంత అందంగా కులుకుతూ నడవగలగడానికి కారణం పూర్ణమ్మ నడకలలోని వయ్యారం తమలో చేరినందుకట. ఈ విధంగా వర్ణిస్తూ పుత్తడి బొమ్మలాంటి పూర్ణమ్మ  ప్రకృతిలో లీనమైపోయిందని, పంచభూతాలలో ఐక్యమయిందని సూచించారు కవి.

నిజానికి ప్రస్తుత సమాజంలో గురజాడ ఆనాడు కథావస్తువుగా స్వీకరించిన కన్యాశుల్కం అనే దురాచారం లేకపోయినా, ఆ రచనలు చేయబడిన కాలం వందేళ్ళకు పైబడినా గురజాడ వెలిగించిన సాహితీ దీపం నిత్యనూతనంగా తెలుగు ప్రజల గుండెలలో వెలగడానికి కారణం, ఆయన వేసిన వత్తి - నాటికీ నేటికీ ఏనాటికైనా నిలబడే మానవతా వాదం. భావితరంలోని ప్రజలని అత్యున్నత శిఖరాలకు చేర్చే  బాటను వేసి ఆ బాటలో తొలి అడుగుజాడ  వేసిన ఖ్యాతి మన గురజాడదే. 

గురజాడ అప్పారావుగారి పూర్ణమ్మ కథను గురించి తలచుకునే ప్రతిసందర్భంలోను , ఆ గేయాన్ని ఆపాత మధురంగా గానం చేసిన అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారి గురించి కూడా తెలుగువారు  తలచుకుంటారు. ఆ పూర్ణమ్మకథను అతి మధురంగా, హృద్యంగా గానం చేసి తరతరాలపాటు ఆ గేయానికి అమరత్వం ఆపాదించి, గేయం యొక్క భావంలోని రసస్ఫూర్తిని  శ్రోతలకు వీనులవిందుగా అందించారు ఘంటసాల. 

గురజాడవారి సాహిత్య భావాన్ని సంగీతంతో పోషిస్తూ కథలోని నాటకీయతను తన గొంతులో పలికిస్తూ, కవి ఉద్దేశించిన భావాన్ని వినిపిస్తూ ఘంటసాల గానం చేసిన పూర్ణమ్మ కథ అత్యంత మధురగీతం. 
ఈ గీతాన్ని కన్యాశుల్కం నాటకాన్ని వెండితెరకు అనువదిస్తూ నిర్మింపబడిన 'కన్యాశుల్కం' చిత్రంలో సందర్భోచితంగా వాడుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. బుర్రకథ రూపంలో తాను విన్న  పూర్ణమ్మకథలో పూర్ణమ్మపాత్రకు పట్టిన దుర్గతి తన కూతురుకు పట్టకూడదని వెంకమ్మ బాధపడినట్టు, కథలోని ఓ కీలకమైన మలుపుకు ఆధారంగా  ఈ గేయాన్ని ఎంతో నేర్పుగా ఉపయోగించుకున్నారు ఈ చలన చిత్రంలో. ఈ విధంగా ఈ చిత్రం కోసం ఘంటసాల స్వరపరచిన ఈ పూర్ణమ్మ కథ గేయం ఇన్ని తరాలపాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తూనే ఉంది. 
ఆ గేయానికి అద్భుతమైన నేపథ్యగానం అందించిన ఘంటసాలతో పాటు, అత్యంత కరుణరసాత్మకంగా ఆ గేయానికి దృశ్యరూపం ఇచ్చిన ఈ చిత్ర నిర్మాత దర్శకులకు  కూడా తెలుగువారు ఋణపడి ఉండాలి.