03 January 2009

నాగావళి నవ్వింది

నాగావళి నవ్వింది. ఇది నేను చిన్నప్పుడు విన్నమాట. ఒక కధో,నవలో మరి.కాని సాహిత్యానికి సంబంధించినదే. కథలో పాత్రపేరు నాగావళి ఏమోమరి, నాకు తెలీదు.


ఆవయసులో చాలా ఆశ్చర్యంగా అనిపించిన పదం. ఎందువల్లనంటే...నేను పుట్టినదగ్గర్నుంచి దాదాపుగా పదకొండు సంవత్సరాల వయసు వరకు పెరిగినది నాగావళి నది ఒడ్డున. నాగావళి అంటే (ఏరు అనేవాళ్ళం) నదిగా మాత్రమే తెలిసిన రోజులవి.శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో నాగావళి ఒడ్డున కోటీశ్వరాలయం ఉన్న గుడివీధిలో కోవెల పక్కనే ఇల్లు,ఎదురుగా నది.ఆఇల్లు మాతాతగారికి స్వంతంకాదు. అద్దెఇల్లే.కాని మా అమ్మ చాలా చిన్నగా ఉన్నప్పుడు 1950 ప్రాంతాలలో ఆ ఇంట్లో కి అద్దెకి వచ్చి సుమారు 1987 వరకు అక్కడే ఉన్నారు.అమ్మ,నేను,నా తర్వాత 1984 వరకు అందరం ఆ ఇంట్లోనే పుట్టాం. అందువల్ల మా తాతగారి సంతానం ఎనిమిది మంది వాళ్ళ పిల్లలం పదహారుమందికీ ఆఊరు,ఆ ఇల్లు,ఆ నది వీటితో మానసికమైన బంధం పెనవేసుకుపోయింది.


అమ్మమ్మ తాతగారు ఇప్పుడు లేకపోయినా ఏ పెళ్ళిళ్ళో పేరంటాలో జరిగి విశాఖపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరం మూడుగంటలు ప్రయాణం చేసి శ్రీకాకుళానికి వెళ్ళవలసిందే. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు....అని పాడుకోవలసిందే. శ్రీకాకుళంలో మేము ఉండివచ్చిన ఇల్లు చూసి రావలసిందే.అక్కడ ఇంటి ఓనరుగారు-పేరు ఏదో ఉంది. మా పెద్దవాళ్ళకు తెలుసనుకోండి. ఆయనకి మా అమ్మవాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరే మాకు తెలుసు. ఆయన పేరు సరేగారు. ఆహా..అలాగా...సర్రే అయితేను...అంటూ ఉండేవారు. ఆయన ఊతపదమే ఆయన పేరయిపోయింది పిల్లలందరికీ. మీ అమ్మమ్మని పిలువు అని ఆయన లోపలికి పంపిస్తే అమ్మమ్మా సరేగాడు పిలుస్తున్నారు అని చెప్పి తుర్రుమనేవాళ్ళం, మా అమ్మమ్మ కంగారును గమనించకుండా. మేము ఎప్పుడో ఆయనకి ఆ పేరు చెప్పేస్తామేమోనని మా మామయ్యలు భయపడి మమ్మల్ని బెదిరిస్తూ ఉండేవారు కూడా.


ఆ సరేగారు అక్కడే ఉన్నారు(ఇంకా). వాళ్లు ఉన్న భాగాన్ని బాగా బాగుచేసి మార్పులు చేసుకున్నారుట చిన్న గుమ్మం తీసి పెద్ద గేటు పెట్టుకున్నారుట. మా వైపు ఉన్న భాగం మాత్రం ఏ మార్పూ లేదని అలాగే ఉందని చూసివచ్చిన అందరూ చెప్తూ ఉండేవారు.


ఇప్పుడు తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది పిల్లలు,వాళ్ళ పిల్లలు(మనవలు),బంధువులు, పెళ్ళిళ్లు అన్నీ ఆ ఇంట్లో ఎలా జరిగాయా అని. ముందు గుమ్మం దాటాక ఒక పొడూగు వరండా ఏ షేడ్ లేకుండా ....అది దాటితే కప్పువేసిన వరండా దానిని ఆనుకుని చిన్న బెడ్ రూమ్,వరండా దాటాక మళ్లీ వరండా ఒక వంటిల్లు.అంతే ఇల్లు. సగం ఇల్లు ఎండా వానలకి ఎండుతూ తడుస్తూ ఉండేది.వానాకాలంలో చూరు కారేది.బకెట్లు,గిన్నెలు,డేగిసాలు పెట్టేవాళ్ళం కారుతున్న చోట. వంటిల్లు కొంచెం పెద్దదే. అదే అందరికీ లివింగ్ రూమ్. అక్కడ పెద్ద గొలుసుల ఉయ్యాల. అందరూ కిందనో ఉయ్యాల మీదో సర్దుకునేవారు. అక్కడే కాఫీలు,టిఫిన్లు,భోజనాలు. వంటిల్లు దాటాక దూరంగా పెరట్లో ఎక్కడో లెట్రిన్. స్నానాలన్నీ ఔట్ డోరే. ఆడవాళ్లు స్నానం చెయ్యాలంటే ముందు గుమ్మంతలుపు, వరండా తలుపు వేసి వీలయినంతవరకు అంతా ఒక్కసారే కానిచ్చేసేవారు. మేం చిన్నవాళ్ళం కనుక మాకు ఏ బాధ లేదు. ఏట్లో(నాగావళి నదిలో) నీళ్ళెక్కువ లేవంటే చిన్న సబ్బుముక్క,చెంబు పట్టుకెళ్ళి అక్కడే స్నానం కానిచ్చేయడం. చల్దన్నం తినేసి స్కూల్ కెళ్ళిపోడం.


ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తుంది -ఇంతమంది ఆడవాళ్లు పురుళ్లు జరిగనప్పుడు,మిగతా సందర్భాలలో ఎంత ఇబ్బంది పడి ఉంటారోనని.స్నానం చెయ్యడానికి బాత్ రూమ్,సెప్టిక్ లెట్రిన్స్ లాంటి కనీస సదుపాయాలు లగ్జరీ గా తోచేవి కాబోలు. అవి అవసరం అన్న స్పృహ కూడా ఉందో లేదో అన్నట్టు గడిపేసేవారు. 1980 లతర్వాత ఊరిలో కొత్త కాలనీలు ఏర్పడ్డాక పాత ఇళ్ళలో కూడా చాలామంది మార్పులు చేసుకున్నారు. మా తాతగారి (సరేగారి) ఇంట్లో తప్ప. మా ఆఖరి మామయ్య పెళ్లి 1986 లో ఆ ఇంట్లో ఉండగానే జరిగింది.నాకు తెలిసి అదే అక్కడ జరిగిన ఆఖరి పెళ్ళి. ఆ తర్వాత మా పెద్దమామయ్య ఆ ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసాడు. మా ఉయ్యాల గొలుసులు మాత్రం తనతో తీసుకు వచ్చాడు. బల్ల అప్పటికే పగుల్తూ ఉందని వదిలేసాడు.మొత్తం మీద 1986 వరకు కూడా 50లలో మేం చూసిన రూపానికి అంగుళం మేర కూడా మార్పు లేని ఇల్లు అది.


నేను మా చెల్లి చిన్నప్పుడు ఆడుకున్న లక్క బొమ్మలు,సుమారు ఒకటిన్నర అడుగు ఎత్తులో ఉండేవి.నాది ఆడ బొమ్మ,చెల్లిది మగ బొమ్మ.ఒక్కోటీ రెండుకేజీల బరువుంటాయేమో. మా అమ్మ మగబొమ్మకి పాంటు,షర్టు,నా బొమ్మకి పరికిణీ,జాకెట్టు పర్మనెంటుగా కుట్టేసింది.వాటిని ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాళ్లం -కాళ్లమీద పడితే పచ్చడయిపోతాయర్రా అన్న పెద్దవాళ్ళదీవెనల మధ్య .తథాస్తు దేవతలు కూడా దీవించేవారు.ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా(బొమ్మలతో) వాటిని వదిలేవాళ్ళం కాదు. కానీ హైదరాబాదు వచ్చేసి ఎన్నిసార్లు మళ్లీ వెళ్ళాం..ఆ ఊరికి... మా బొమ్మలు అక్కడే ఉన్నాయి కదా. తెచ్చేసుకోవచ్చని తోచనేలేదు. ఆ ఇల్లు వదిలిపెడతానని మా మామయ్యే అనుకోలేదనుకుంటా.... మా ఉయ్యాల మంచం, మా పందిరిమంచం, వాటితోనే మా బొమ్మలు అనుకున్నాం. అన్నింటినీ వదిలేయాల్సి వస్తుందనుకోలేదు. ఆ బరువైన మా లక్కబొమ్మలు ఎవరికో ఇచ్చేసి వచ్చిందిట మా అత్త.


1986 లో ఆఖరిసారి ఆ ఇంట్లో ఉండడం,1992లో శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒకే ఒక సాయంకాలం చీకటిపడుతూ ఉండగా కోవెలకి మాత్రం వెళ్ళి మా శివుడిని,పార్వతిని నంది ని చూసి నాగావళి ఒడ్డుకి వెళ్ళాను. కొత్త కెమేరాతో నది ఒడ్డున నిల్చొని దూరంగా నది మలుపు తిరిగే వంపు కనిపించేలా ఓ ఫోటో తీసుకున్నాను.


మళ్ళీ ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు మా ఊరు వెళ్ళగలిగేను డిసెంబరు నెలాఖర్లో..ఊళ్ళో చాలా మార్పులు వచ్చేయి సహజంగానే.కానీ మరీ కొట్టొచ్చేంత కాదు. ఊరి చివర కొత్తగా కట్టిన కాలనీలు,షాపులు వాటిలో ఆధునికత కనిపించింది కానీ ఊరిమధ్య మా ఏడురోడ్ల జంక్షను, పాత బ్రిడ్జి అన్నీ పెద్ద మార్పు లేకుండానే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం మాత్రం బాగా కనిపిస్తున్నారు.పాత ఇళ్ళు,విరిగితే మళ్ళీ కట్టినట్టుగా ఉన్న గోడలు,ఇళ్ళముందు కంపు కాలువలు,ఇరుకు వీధులు అన్నీ అలాగే ఉన్నాయి.


ఎప్పటిలాగే గుడివీధిలోకి కారు వెళ్ళలేదు కనుక రావిచెట్టు కింద ఏటి గట్టు దగ్గర కారు పార్క్ చేసుకున్నాం. మాచిన్నప్పటి- కాదు... మా అమ్మమ్మ చిన్నప్పటి రావిచెట్టు అలాగే ఉంది పచ్చగా..చల్లటి గాలి విసిరి నన్ను పలుకరించింది. రావిచెట్టు బోదె మొదట్లో నాగదేవత పసుపు కుంకుమలు ఒంటినిండా పులుముకొని భక్తులు పోసిన పాలు,దీపాలు పెట్టి ఒలకపోసిన నూనెలతో జిడ్డుజిడ్డుగా అదో మాదిరి వాసన ల మధ్య కొలువుతీరి ఉంది.అక్కడనుంచి రెండు మెట్లు ఎక్కి పక్కకి తిరిగితే మా కోటీశ్వరుడి కోవెల. పదిమెట్లు కిందకి దిగి కోవెల లోపలికి వెళ్ళాలి.ఇదివరకు చుట్టు ఆవరణ చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని తగ్గించి కోవెలలోపల ఎక్కవమంది ఉండడానికి వీలుగా చేసి కోవెలభాగాన్ని విశాలంగా చేసారు. నంది చాలా పెద్ద నంది. లేపాక్షినంది బొమ్మలో ఉన్నట్టుగా మా నంది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ మేము నాలుగు స్తంభాలాట ఆడుకున్న మంటపం-అక్కడే పర్వదినాల్లో హరికథాకాలక్షేపాలు జరుగుతూ ఉండేవి, దాన్ని అక్కడనుంచి తీసి వేరేచోట కట్టారు. ఖాళీ ఆవరణకి ఎదురుగా ఉన్న మంటపాన్నికూల్చేసి మళ్ళీ ఏఉద్దేశంతో ఆ మూల కట్టారో నాకైతే అర్థం కాలేదు.


లోనికి ప్రవేశించగానే పెద్దగంట ఉందో లేదోనని వెతుక్కున్నాను. అది చాలా పెద్దసైజులో ఉండే పెద్ద గంట. అంతే కాక చాలా ఎత్తుకూడా. 6 అడుగులు ఉన్నవాళ్ళే దాన్ని నిలబడి కొట్టగలరు. లేదంటే పాదాలు పైకి లేపి ఎగిరి కొట్టవలసిందే. చిన్నప్పుడు పదేళ్ళొచ్చేదాకా పరిగెత్తివచ్చి పెద్దగంట కొట్టడాన్ని ప్రాక్టీసు చేసేదాన్ని. ఎప్పుడేనా అందక పోదా అని. ఇప్పుడు ఎంత మొహమాటం వదిలి ఎగిరినా అందలేదు. ఎలాగో ఒక్కసారి మాత్రం కొట్టగలిగాను.


కానీ మాశివుడు -మాశివుడు కాదు. మిగిలిన విషయాల్లో పెద్ద మార్పు లేదనుకున్నాను కానీ మా మూల విరాట్రూపం మాత్రం మారిపోయింది. నేలబారుగా ఉండే మా శివుడి పానవట్టం మూడడుగుల ఎత్తు పెంచుకొని, మరో పెద్ద లింగరూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ పాత లింగం అరిగిపోతోందని,కాశీనుంచి తెప్పించిన ఇంకోలింగాన్ని కవర్ లాగా పెట్టేమని ఏదో చెప్పారు. మా తరాలు మారినట్టే మా కోవెల అర్చకులలో మూడవతరం వచ్చింది-హరిబాబుగారి మనవడు ఆరోజు మాకు పూజ చేయించారు


చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు హైదరాబాద్ లో ఉంటే మేం అమ్మమ్మ దగ్గర ఉండేవాళ్ళం. సగంరోజు స్కూలు,సగంరోజు కోవెల లో స్నేహితులతో గడిపేసే వాతావరణం హైదరాబాదులో ఉండేది కాదు.ముఖ్యంగా ఒడ్డున ఎక్కువ లోతులేకుండా స్నానాలకి వీలుగా ఉండేది. ఎప్పుడంటే అప్పుడు నీళ్ళలో దిగినా ఆప్యాయంగా పిలిచి చల్లగా తడిపే మా నాగావళిని వదలడం ఇష్టంలేక అమ్మమ్మ దగ్గరే ఉండిపోయేవాళ్ళం. కోవెల్లో ఆడుకోవడం ఆకలేస్తే గర్భగుడిలోకి వెళ్లి ఓసారి లెంపలేసుకుని దండం పెట్టి మా హరిబాబుగారి ముందు చెయ్యిచాపితే ఆయన ఒకటో,రెండో అరటిపళ్లు,ఓ కొబ్బరి చిప్ప చేతిలో పెట్టేవారు.కొబ్బరిచిప్ప కొట్టుకుని(భాగం సరిగా ఇవ్వకపోతే కొట్టుకొని)తినేసి మళ్ళీ ఆటలు. మూలగా ,పక్కగా ఉన్న గదిలాంటి చిన్నగుడిలో శివలింగం,నిద్ర గన్నేరు చెట్టు ఉండేవి. ఆ గుళ్ళో మా అభిషేకాలు ఉత్తుత్తిమంత్రాలతో పూజలు అందుకునేవాడు మా శివుడు.


కోవెలలో దర్శనం అవగానే గబగబా బయటకి వెళ్లి మా కూర్మావతారం కోసం వెతుక్కున్నాను.కూర్మావతారం అంటే తాబేలు. మా కోవెల్లో ఏడెనిమిది దాక తాబేళ్ళుండేవి. అందులో చాలా పెద్ద తాబేలు ఉండేది.అది నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి 1992 లో నేను వెళ్ళినప్పుడు కూడా ఉంది. అరటిపళ్ళు చిన్న ముక్కలు చేసి వాటికీ వాటా ఇచ్చేవాళ్ళం.చిప్పలోంచి మెల్లగా తల బయటికి పెట్టి పండుని గబుక్కున లాక్కునేవి. ఒక్కోసారి వేళ్ళు కరిచేవి కూడా. ఆమధ్య తాబేళ్లను ఏటొడ్డు పార్కులో ఉంచితే సరిగా చూడక చనిపోయాయని, పెద్ద తాబేలు కూడా అప్పుడే పోయిఉంటుందని చెప్పింది ఓ పదేళ్ళ పిల్ల. మనసంతా ఓదిగులు ఆవరించుకుంది. ఇంకా పదిహేను వరకు తాబేళ్ళను ఇప్పుడు కోవెల ఆవరణలోనే ఉంచి పెంచుతున్నారు. వాటికి అరటిపళ్ళు పెట్టాం.మా చిన్నప్పటిలాగే డిప్ప లోంచి తల బయటికి పెట్టి పండుముక్కని ముందుకి లాక్కున్ని తిన్నాయవి.


కోవెల ఎదురుగా ఉన్న ఇంటి అరుగుమీద అచ్చమ్మ అరటిపళ్ళు కొబ్బరికాయలు,పూజాసామగ్రి, చిరుతిళ్ళు అమ్ముతూ ఉండేది.మా శ్రీకాకుళంజిల్లాకి ప్రత్యేకమైన పక్కకి వేసిన ముడి,పేద్ద ఎర్రటి బొట్టు,జాకెట్టులేని చీరకట్టు లతో అచ్చమ్మ, అచ్చంగా అందాలరాముడులో సూర్యకాంతంలాగా మమ్మల్ని కసురుతూ అరువులు పెట్టేది.ఆకలేస్తే అరటిపళ్లు,బిళ్లలు కొనుక్కునేవాళ్లం తనదగ్గర.ఇప్పుడాఇల్లు ఉంది కానీ గుమ్మం,అరుగు స్థానంలో పెద్ద గోడ ఉంది. గోడనానుకొని చిన్న దుకాణం వెలిసింది. అందులో ఉన్న కుర్రాడు కొబ్బరి కాయలు అమ్ముతున్నాడు. వాడు చిన్నప్పుడు మా ఇంట్లో చాలా కాలంపనిచేసి, మా అందరికి చంటిపిల్లలగా ఉన్నప్పుడు కాపు,నలుగులు పెట్టి నీళ్ళు పోసిన కనకమ్మ మనవడుట.ఇక్కడా మరో రెండు తరాలు మారాయి.


మా ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాను. ఇంటికి రిపేర్లు చేస్తున్నారు.తలుపులు తీసి ఉన్నాయి. ఆ పొడుగాటి వరండా ,ఆ చివార్న వంటింటి కిటికీవరకు ఓసారి కళ్ళనిండుగా చూసుకొని,కన్నీటి తెర అడ్డుపడుతూ ఉండగా మసకేసిపోయి అక్కడినుంచి కదిలి వచ్చేసాను. మా పిల్లలిద్దరూ గుమ్మానికి చెరో వేపు కూర్చొని ఓ ఫొటో తీసుకున్నారు.ఆ ఇంటి స్వరూపంలో మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.


మళ్ళీ రెండు మెట్లు దిగి రావిచెట్టు దగ్గర్నుంచి నది ఒడ్డుకు వచ్చాను. ఎదురుగా ఏనాడో పంతొమ్మిదో శతాబ్దంలో కట్టిన పాత బ్రిడ్జి కనిపిస్తూ ఉంది. బలహీనంగా ఉందని వాహనాల రాకపోకలు నిషేధించారుట. మంచి వరదల్లో ప్రవాహం బాగా ఉన్నప్పుడు కూడా మా ఇద్దరు మామయ్య లు తన స్నేహితులతో కలిసి బ్రిడ్జి మధ్యన నుంచొని నదిలోకి దూకేవాళ్ళు. ఈత కొట్టేవాళ్ళు....అదిగోనే మీ కోటి,బాబ్జీ అమ్మో అని మా ఫ్రెండ్సందరూ గట్టిగా అరిచేవాళ్ళు. మామయ్యలు చేస్తున్న సాహసాలకి నాకు మా చెల్లికి గర్వంగా ఉన్నా, ఇంట్లో చెప్తే చంపుతానన్న వార్నింగ్ వల్ల,ఏమేనా జరిగితే మా అమ్మమ్మ రియాక్షన్ ఎలాఉంటుందో తెలిసిన జ్ఞానంవల్ల ఏమీ చేయలేక బిక్కచచ్చి ఉండిపోయేవాళ్ళం. మామయ్య తిరిగి మా వైపు ఈదుతూ వచ్చేవరకు.వర్షాకాలంలో ఒక్కోరోజు పొద్దున్నే లేపేవారు, ఏరొచ్చిందర్రా అని.కళ్లు నులుముకుంటూ పరిగెత్తేవాళ్ళం. ఎర్రటి నీళ్లు సుడులు తిరుగుతూ వడివడిగా పోతుండేవి.పెద్ద పెద్ద ముళ్ల చెట్లు, గుడిసె కప్పులు కూడా కొట్టుకుపోతూ ఉండేవి. అందులో మనుషులుండే వారేమో కూడా.ఆ నీళ్ళన్నీ రెండ్రోజులకల్లా ఎక్కడికి పోయేవో అర్థమయ్యేవి కాదు అప్పుడు. వేసవిలో అయితే ఎక్కడో తప్ప పెద్దలోతు లేకుండా సన్న పాయలుగా పారేది.సాధారణంగా బ్రిడ్జి ఉపయోగించకుండా ప్రవాహం ఉన్న చోట బట్టలు కొంచెం పైకెత్తి ఇసుకలో నడిచిపోతూ ఉండేవాళ్ళం ఏటొడ్డున ఉన్న మా చిన్నమ్మమ్మ ఇంటికి.వేసవిలో నీటి ఎద్దడి బాగా ఉండేది. మా పనిమనిషి ఏటినుంచి నీళ్లు మోసేది. మడి నీళ్లు మాత్రం మా అమ్మమ్మ తెచ్చుకోనేది. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మకి ముఫ్పై ఏళ్ళు.మేం నదిమధ్యలో ఇసుకని తవ్వి చెలమలు తీసేవాళ్ళం. ఒక్కోసారి ఉన్నట్టుండి స్వచ్ఛమైన ఆ నీళ్ళలో చిన్న చేపలు లుక లుకమని తిరిగేవి. కెవ్వున కేకలేసి ఇసుకని కప్పేసే వాళ్ళం.మా మామయ్యలు తోటి కుర్రాళ్లు తువ్వాళ్లు, చొక్కాలు వేసి చేపలు పట్టేవాళ్లు.మళ్లీ వదిలేసే వాళ్ళు.


పన్నెండో పదిహేనో మెట్లు ఉంటాయి నదిలోకి దిగడానికి. ఏనాటివో ఆ మెట్లు....అలాగే ఉన్నాయి ఎగుడు దిగుడుగా,అరిగి పోతూ. మధ్యలో ఓ వెడల్పు మెట్టు. దాన్ని పెద్ద మెట్టు అనేవాళ్ళం. నదిలో ప్రవాహం ఎక్కువ ఉంటే ఆ మెట్టు,పైన మరో రెండు మెట్లు మునిగిపోయేవి.


ఇప్పుడు పైమెట్టుమీద నిలబడి చూస్తే అలా నది వంపుతిరిగి వెళ్ళిపోతున్న సుందర దృశ్యం కనిపించలేదు. అడ్డుగా పెద్ద గోడ,లోపలికి చిన్న గది,మరోపక్క కూడా గోడ కట్టేసి మూసేసారు. నదిలో ప్రవాహం అంతంత మాత్రంగా ఉండగా ఒడ్డున పూడిక నిండిపోయి ముక్కుపుటాలు బద్దలయ్యే దుర్గంధం....చిన్ననాటి మమకారం,నదిలోకి దిగమని ముందుకు తోస్తూ ఉంటే,శుచిశుభ్రత నేర్పిన నాగరికత వెనక్కిలాగింది. అంత మురికిగా నల్లగా ఉన్న నీళ్ళలో చేతులు కాదు కదా కాళ్ళు కూడా పెట్టడానికి మనసు తనువు అంగీకరించలేదు. ఈ నీళ్ళలోనేనా అమ్మా... మీరు స్నానం చేసేవారు అని అనుమానంగా పాప అడిగిన ప్రశ్నకి అప్పుడు ఇలా ఉండేది కాదు అని చెప్పినా నమ్మదనిపించి ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాను.


నా చిన్ననాటి జీవతపు స్వప్నం చేదు గురుతుగా మారింది.జ్ఞాపకాల బరువుతో భారంగా కదులుతున్న నన్ను చూసి ఉపవాసాలతో చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తూఉన్నా మమ్మల్ని చూసినప్పుడల్లా ఆత్మీయంగా తన చేతుల్తో చుట్టేస్తూ ఆనందంగా నవ్వుతూ మా వైపు చూసే మా అమ్మమ్మని తలపిస్తూ మా నాగావళి నవ్వింది.

21 comments:

 1. చాలా గొప్ప టపా. ఒకమంచి అనుభూతిని పంచారు. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి.

  ReplyDelete
 2. మురళిగారు,
  టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. hi sudharani garu,
  happy new year.
  2009 lo goppa tapa.
  nenu vijayanagaram chuda ledu,tappakka nagavali chusta.
  addirindi.

  ReplyDelete
 4. సుధారాణి గారు, అద్భుతమైన టపా అండీ... చాలా గొప్ప అనుభూతిని కలిగించారు. చదివినంత సేపూ మనసు బాల్యంలో చిందులు వేసింది.. చివరికి వచ్చే సరికి గుండె బరువై కళ్ళు చమరించాయి !!

  ReplyDelete
 5. చాలా పెద్ద టపా.. ఇంత పెద్ద పోస్ట్ ఇంతకుముందు ఏ బ్లాగులోనూ చూడలేదు . అయినా బాగుంది .

  ReplyDelete
 6. ఎంత బాగా రాశారండి సుధారాణి గారు!

  ReplyDelete
 7. GREAT.chala chakkaga rasavu sudha.chinnanati sangatulu baga gurtu vundatam sahajam.kani avi anthakanna goppaga rayadam nijamga chala great. aa roju nagavalilo dooki eetha kotti unnavallalo nenu kooda okadini.sareayitenoo antava. ayite O.K. inko vishayam.nannu baga kadilinchindi inka kallu chemerchela chesindi. nee tapa loni ee chivari matalu naku tappaka cheppalanipistondi."జ్ఞాపకాల బరువుతో భారంగా కదులుతున్న నన్ను చూసి ఉపవాసాలతో చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తూఉన్నా మమ్మల్ని చూసినప్పుడల్లా ఆత్మీయంగా తన చేతుల్తో చుట్టేస్తూ ఆనందంగా నవ్వుతూ మా వైపు చూసే మా అమ్మమ్మని తలపిస్తూ మా నాగావళి నవ్వింది."
  inka mana nagavali gurinchi vrasta
  vani asistoo.with all best wishes.sareayitenoo.vuntanu

  ReplyDelete
 8. Smt.Sudha ranai Garu,
  Nuvvu rasina chinna nati gurtulu chala bagunnayi. Avi chaduvutu vunte nannu nene marichipoyenu. Nannu antaga kadilinchindi. Nenu nijamga aa vayasuloki vellipoyanu ante nammu. Ippatiki kooda atuvypu vellite Srikakulam choodakunda ramu .Aa vooru konta edigina ,memu vunna illu ,veedhi, gudi konni illu alage vunnayi. Pata vallu inka mammalani marichipoledu kooda. Anduke aa voori meeda prema . Manchi anubhootulani gurtu chesinanduku neek chala thanks.
  Ramesh.

  ReplyDelete
 9. అద్భుతంగా రాశారు.
  పోయినేడు రెండు మూడు మంచి టపాలు రాసి మొహం చాటేశారు. ఈ సంవత్సరం అలా కాకుండా తరచూ రాస్తారని ఆశిస్తాము.

  ReplyDelete
 10. చాలా బాగా వ్రాసారండీ!!

  ReplyDelete
 11. ఇలాంటి అనుభూతులు, జ్నాపకాలు లేకపోతే బ్రతుకింకా దారుణంగా మారిపోతుంది. సున్నితమైన మనసునుండి వాటిని దూరం చేసుకోలేకపోతే బ్రతకడం మరింత దారుణంగా తయారౌతుంది. మంచి,అందమైన కధలా రాసారు. చిత్రాలు కూడా అందిస్తే బావుండేది.

  ReplyDelete
 12. డియర్ సుధా..

  నీ టపా చూసి.. నాకు కూడా ఆ నాగావళి సవ్వడి, గుడి, గుడివీధి,చల్లగాలి, కూర్మా లతో కొంచెం
  పరిచయం వుండటం వలన కామోసు ..కొద్దిసేపు " ఎటో వెళ్లి పోయింది మనసు " .

  ఈ బిజీ బిజీ బ్రతుకులోంచి కొంచెం వెనక్కి వెళ్లి ఆ పసందైన అప్పటి పరిసరాలలో సేద తీరాను.

  తనని కట్టడి చేయాలనీ తన చుట్టూ కట్టడాలను కట్టేస్తూ, తనని కాలుష్యం చేస్తూ.. తన అందాలను
  ఆస్వాదించలేని ఈ నవ నాగరిక మనుష్యుల వింత పోకడలను చూస్తూ ..

  నవ్వుతోంది నాగావళి... ప్రతియేడూ తన విశ్వరూపం తో.

  టపా చాలా బాగుంది..ఇలా నే కంటిన్యూ చెయ్యి..

  రమణ బాబు-మణి

  ReplyDelete
 13. చాలా గొప్పగా రాసారు. మమ్మమ్మగారి ఊళ్ళో నేను గడిపిన బాల్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చారు.

  ReplyDelete
 14. సుధ గారు. ఇప్పుడు వైజాగ్ నుంచి శ్రీకాకుళం రావడానికి పట్టే టైమ్ రెండు గంటలే. హైవే వెడల్పు చేశారు కదా. ఇరవై ఏళ్ళ క్రితం మూడు గంటలు పట్టేది.

  ReplyDelete
 15. ఈ పోస్టు ఎలా మిస్ అయ్యానో అని బాధగా వుంది. మన నాగావళి గురించి ఎంత ఆత్మీయంగా రాసారు. చాలా హృద్యంగా వుంది. నాగావళికి మరో పేరు లాంగుళ్య. మనలో ఇంకిపోతున్న మానవ సంబంధాలు లాగానే నాగావళి ఆ ఒడ్డున ఇంకిపోతున్న దృశ్యం కళ్ళముందుంచారు. ధన్యవాదాలు..

  ReplyDelete
 16. చి .సుధకి .నీ టపాబాగుంది.ఎవరికైనా చిన్ననాటి సంగతులు తీపిగా వుంటాయి,గుడివీధిలో పెద్ద మార్పులేదు కానిఏటిఒడ్డుమాత్రం పార్కు పెంచి బాగు చేసారు.గుడి అంతారెనొవేటెచెస్తున్నారు.ఎవరూకాదు,శశికల తమ్ముడు వాశు స్వంత ఖర్చు తో .ఈసారి చూస్తే ఆశ్చర్య పోతావు .కొత్తగాడెవలప్ మెంట్ చాలా వుంది అభినందనల తో .రమణారావు . ముద్దు @gmail.com

  ReplyDelete
 17. సుధగారికి నమస్కారం. చాల అద్భుతంగా వ్రాసారు. గుడిగీధి, శివకోవెల కళ్ళకు కట్టినట్లున్నాయి. నాకు ఇంచుమించు ప్రతి అడుగూ తెలుసు. నేను చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా నాగావళిలో ఈదటానికి స్నేహితులతో వెళ్ళేవాడ్ని. ఈత అంత బాగా రాదనుకోండి. ఒకసారి ఇంట్లో ఈ విషయం తెలిసి తిట్లు తిన్నాను. నాగావళిని దొంగ ఏరు అనేవారు. లోతులేదుకదా అని దిగితే ఒక్కోసారి ఉధృతంగా నీరు వచ్చి మునిగిపోతారని మా అమ్మ భయం. కోటేశ్వరస్వామి కోవెల నిజానికి "ఉమారుద్ర కోటేశ్వరస్వామి". ఈ కోవెలతో నవగ్రహాలను పెట్టిన చోట గోడకున్న పలకపై దాతల వివరాలుంటాయి. అందులో మా తాతగారు ఉలిమిరి సూర్యనారాయణ గారి పేరు వుంటుంది. ఆయన పేరే నాది. ఈ కోవెలతో కలిసి ఐదు చోట్ల బలరాముడు శివలింగాలను ప్రతిష్టించాడని స్థల పురాణం. నాగావళి పేరు కూడ బలరాముని నాగలిమొనతో భూమిమీద ఈడ్చుకుంటూ పోతే నది గా వచ్చిందట. మరొకటి పార్వతీపురం దగ్గర గల "గుంప" అనే చోట ఒక శివాలయం వుంది. విచిత్రమేమిటంటే గుంప సోమేశ్వర స్వమి ఆలయం రెండు నదుల మధ్యన వుంది. అవి నాగావళి, వంశధార. మా నాన్నగారికి మొక్కు వుంటే గత సంవత్సరం వెళ్ళాను ఇక్కడికి.
  ఇవికాక అరసవిల్లి, ఏటవతల వెంకటేశ్వరస్వామి కోవెల, రామ మందిరం నా దర్శన స్థలాలు. నా చిన్నప్పుడు ఏడు రోడ్ల జంక్షన్‌ లో "ఆరణాల పరక" షాపులుండేవి. ఏ వస్తువుకొన్నా దాని ధర ఆరణాల పరక అంటే 6 x 6 + 3 = 39 పైసలు. అణాకి ఆరు పైసలు, పరకకు మూడు పైసలు. ఇక్కడ అమెరికాలో డాలర్ స్టోర్ అని వున్నాయి. రెండిటికీ ఒకటే కాన్‌సెప్ట్.
  మీరు వాడిన పదాలలో బిళ్ళలు, డేగిసా శ్రీకాకుళం పదాలు. మీరు "లివింగ్ రూమ్‌" అని వ్రాసారు ఒకదగ్గర. దానికి "సావిట్లో" (చావడి నుండి వచ్చింది) అని గాని లేదా అదునాతనంగా "హాల్లో" (hall లో) అని వాడతాం. ఆడవాళ్ళ చీరకట్టు గురించి చక్కగా వ్రాసారు. "అడ్డపొగ" మరిచిపోయారా? మా తాతగారు,వారి పరివారం అంతా గుడివీధిలో అద్దెకుండేవారరట నే పుట్టక మునుపు. తరువాత న్యూకోలనీ లో ఇల్లు కట్టుకుని అక్కడకు మారిపోయారు. అదండి కథ. సారీ మీ పోస్టు కన్నా నా వ్యాఖ్యానం ఎక్కువయిందనుకుంటాను. ఇంక ఆపుతాను. టికెట్ లేకుండా శ్రీకాకుళం వెళ్ళి వచ్చాను మీ పోస్టుతో. ధన్యవాదాలు. మీ రచనా పటిమ అద్భుతం. మళ్ళీ కలుద్దాం ముఖపుస్తకంలో.

  ReplyDelete
 18. సూర్యనారాయణగారు,
  టపాకన్నా వ్యాఖ్యపెద్దదయిందేమో అన్నారు, కానీ ఇడ్లీకన్నా పచ్చడి బావుంది అంటే ఎలా ఉందో అలా ఉంది నాకు. అడ్డపొగ మర్చిపోయానంటారా..అవును. ఇంకా చాలా విషయాలు రాయలేదు. నాగావళిని మళ్ళీ అలా చూసేసరికి మనసు చలించిపోయి రాసుకున్నది కదూ అది. ఇంకా దిబ్బసెట్టి కొట్లో నువ్వుండలు, పాలయిసు,కలర్ ఐస్ ఫ్రూటులూ,కరకజ్జం, కారప్పూస, పేరమ్మ ఇంట్లో నిత్య పేకాటావధానాలూ, భోగినాడు దిగదుడిచి పోసిన రేగిపళ్ళతో పాటు ఏరుకున్న చిల్లరపైసల సంపాదనతో మహా రాణిలా గర్వపడిపోడాలు అబ్బో ఇంకా ఎన్నో రాయలేదండీ. అన్నీ తెరవెనుకనుంచి మేము మేమంటూ సందడిచేస్తున్నా కేవలం దొంగేరుకి మాత్రమే పరిమితం చేసుకున్నాను ఆ టపాలో. ఏనాడో రాసుకున్న టపాకి వ్యాఖ్యరాసి మరోసారి అమ్మమ్మని గుర్తుచేసినందుకు ధన్యావాదాలు.

  ReplyDelete