14 June 2010

ఒక్క క్షణం.........

కారు కాని కారు అని అడిగితే గబుక్కున చెప్పేదేమిటి....షికారు అని. ఇంకా పుకారు అని కూడా చెప్తాం.
నిజంగా ఈ పుకారు కి ఎంత పవరు.. 
పెదవి దాటిన మాట పృథివి దాటుతుందంటారు పుకార్లు  భలే స్పీడుగా వ్యాపిస్తాయి. అందుకే  అత్యవసర సమయాలలో  ప్రభుత్వం టెలివిజన్లు,రేడియోలు ద్వారా  దయచేసి వదంతులు నమ్మకండి అన్న నినాదాన్ని పదే పదే ప్రసారం చేస్తుంది-  గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు.....మీడియాని నమ్ముతుంది ప్రభుత్వం.
అసలు  దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే మొదటి మాట మీడియాదే అని అనేక సందర్భాలలో రుజువైనా. మీడియాకున్న పవరు అది మరి.
మా చిన్నప్పుడు ఒకసారి హైదరాబాదులో ఒక పుకారు వచ్చింది. బహుశ పుకార్లలో చాలా సేపు ఒక నగరాన్ని హడలెత్తించిన రికార్డు దానికే సొంతం అనుకుంటా. పానీ ఆరా అనే పుకారు అది. నగరంలోని  చెరువు గట్లు తెగిపోయాయని.....నీళ్ళు ఊళ్ళోకి వచ్చేస్తున్నాయని ఆ పుకారు. 
ఆస్తులకు నీళ్ళొదులుకున్నా ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడి వాళ్ళక్కడ కొండలు గుట్టలు వెతుక్కుంటూ పారిపోయారుట. నేను మా చెల్లి బాగా చిన్న వాళ్ళం. మమ్మల్ని మా యింటి వాళ్ళ రెండంతస్తుల మేడ ఎక్కించారు.  అక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు సుమారు 50 మంది వరకు అక్కడ చేరారు. ఆడవాళ్ళు పిల్లల ఏడుపులతో అక్కడ దద్దరిల్లిపోయింది. 
కింద వాటాలో ఉంటున్న మా యింట్లో కింద గూట్లో పెట్టిన ఆవకాయ జాడీని అటకమీద పెట్టి కాపాడుకుందామని అనుకున్న మా అమ్మ కంగారులో ఆవకాయ జాడీని నేలపాలు చేసుకుంది. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని రుజువుచేద్దామనుకున్న మా నాన్నలాంటి యువకులు రోడ్లమీద పచార్లు చేస్తుంటే పైన బాల్కనీ నుంచి చూసి వాళ్ళ సంతానాలు  మేమంతా ఏడుపులు...వాళ్లు మునిగిపోతారు కదా అని. 
ఇంతలో  మా ఇంటావిడ సికిందరాబాద్ లో ఉంటున్న వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి....మా ఇంటి చుట్టూ నీళ్ళే....మేం మునిగి పోతున్నాం.... అంటూ కడసారి వీడ్కోలు చెప్పి ఫోన్ పెట్టేసింది. హా బిడ్డా అంటూ  ఫోన్ చేసిన ఆవిడ మూర్ఛ పోయింది. ఇదంతా ప్రత్యక్షంగా చూసి  కావలసింత అర్థం చేసుకున్న బాడుగ జనాభా అంతా మన పనయిపోయిందిరా అని గొల్లు మన్నారు. 
ఆ తర్వాత ఎంతసేపు ఇది కొనసాగిందో చివరకు అంతా వట్టిదే అని ఎప్పుడు తేలిందో నాకు గట్టిగా గుర్తులేదు. కానీ పుకారుకి ఉన్న బలం.....దాని వేగం తుఫాను కన్నా ఎక్కువ అని అర్థం అయింది. 
ఇప్పుడు  ఈ ఇంటర్నెట్ యుగంలో  పుకారు మరీ  తేలికగా ప్రయాణం చేసి తన తడాఖాని చూపిస్తోంది.     అసలే ఎగుడుదిగుడు బాటమీద అతికష్టం మీద ఈడుస్తూ నెట్టుకొస్తున్న బతుకు బండిని మరింతగా దిగలాగి బోల్తా కొట్టించగలిగే శక్తి కూడా ఈ పుకార్లకు ఉంది. ఒకసారి మెయిల్ లోకి ఓ విషయం  వచ్చిందంటే వందలాది కాదు వేలాదిమంది వాటిని చదువుతున్నారు. వీటిలో నిజానిజాలేమిటి అని ఆలోచించకుండా, వెంటనే వాటిని ఫార్వార్డు బటన్ నొక్కి మనకి తెలిసీ తెలియని వాళ్ళకి కూడా వాటిని పంపించి  దానిని ప్రచారం చేస్తున్నాం.
 కొన్ని పుకార్లు కాలక్షేపం కోసం పనికి రావచ్చేమో కాని  బతుకులను ఛిద్రం చేసి పుకార్లు వ్యాపించడానికి మన ప్రమేయం ఎంత ఉందో ఆలోచించుకోవలసిన అవసరం ఉందని అనిపిస్తోంది.
ఈమధ్య మనకోసం  మనవాళ్ళు పంపే ఈ మెయిల్స్ కన్నా మన ఈ మెయిల్ చిరునామాను ఏదో సందర్భంలో తెలుసుకున్నవారు తమకు ఫార్వార్డు చేయగా వచ్చిన సందేశాలను మనకు  కూడా పంపించే మెయిల్స్ ఎక్కువైపోయాయి. అందరికీ ఈ అనుభవం ఉందనుకుంటాను.
మొన్న ఒక ఈ మెయిల్ వచ్చింది. బహు పరాక్ అంటూ. రోడ్డుమీద వడప్పావ్, పానీపూరీ లాంటివి తింటున్నారా...చూస్కోండి......మీకు ఎయిడ్స్ భూతం పడుతుందని. 

అందులో చెప్పిన సోదాహరణపు కథ ఏంటంటే....
ఒక బాబుకి జ్వరం వచ్చిందిట...టెస్టులు చేస్తే ఎయిడ్స్ ఉందని తేలిందిట. ఇంట్లో ఎవరికీ లేదు....వీడికి ఎలా వచ్చింది అని ఇంట్లోవాళ్ళందరూ టెస్టు చేసుకున్నారు. ఎవరికీ లేదుట. మరి ఎలా వచ్చిందీ...అని ఆరా తీస్తే అంతకు వారం ముందు ఆ కుర్రవాడు రోడ్డుమీద అమ్మే పైనాపిల్ ముక్కలు తిన్నాట్ట. చేపా చేపా ఎందుకు ఎండలేదు....లాగా వాళ్లు ఆ పైనాపిల్ ముక్కలు అమ్మే వాణ్ణి పరిశీలిస్తే  పైనాపిల్ ముక్కలు కట్ చేస్తున్నప్పుడు ప్రమాద వశాత్తు వేలు తెగిందని తెలిసిందిట. ఆ రక్తం పైనాపిల్ ముక్కల మీద పడింది. ఆ ముక్కలను ఈ కుర్రాడు తిన్నాడన్నమాట. పైనాపిల్ అమ్మే బండివాడికి పరీక్షలు చేస్తే అతనికి ఎయిడ్స్ ఉందని తేలిందిట. తనకు ఎయిడ్సుందని అప్పటివరకు తెలియని పైనాపిల్ బండివాడు హతాశుడై ఉంటాడు.
సరే ఏతావాతా తేలినదేమిటి అంటే పైనాపిల్ బండివాడు వేలుకోసుకొన్నప్పుడు ముక్కలమీద  పడిన రక్తం ఆ ముక్కలు తిన్న బాబుకి ఎయిడ్స్ తెప్పించిందన్నమాట. అందువల్ల రోడ్డుమీద మీరు వడపావో, పానీ పూరీయో , మిరపకాయ బజ్జీయో తినాలని మోహ పడ్డారంటే ఎయిడ్స్ భూతం మిమ్మల్ని ఆవహించడానికి మీరు అవకాశం ఇస్తున్నట్టే అన్నమాట.
ఈ ఈ మెయిల్ సందేశంలో నిజా నిజాలు ఎంత. ఎయిడ్స్ ఇలా కూడా వ్యాపిస్తుంది అన్న హెడ్డింగ్ తో వచ్చిన ఈ మెయిల్ లోని కుర్రవాడికి నిజంగా ఎయిడ్స్ జబ్బు పైనాపిల్ బండివాడి వల్లే వచ్చి ఉంటుందా.
మెయిల్ లో ఉన్న విషయాల ప్రకారం ఆ బాబు పైనాపిల్ తిన్న రోజు నుంచి పదిహేను రోజులు జబ్బు పడ్డాడు. అంటే పైనాపిల్ తోపాటు ఎయిడ్స్అతనిలో ప్రవేశించింది. వెంటనే తన ప్రభావం చూపడం మొదలు పెట్టింది.ఇంట్లో ఎవరికీ ఎయిడ్స్ లేకపోయినా బాబుకి ఎలా వచ్చిందీ అని ఆరా తీసి  ఇదివరకు ఆ బాబు బయట బండిమీద పైనాపిల్ తిన్నాడని తెలిసి హాస్పిటల్ కి సంబంధించిన ఒక బృందం ఆ పైనాపిల్ బండి వాడి దగ్గరకు వెళ్ళి విచారించింది. (బండివాడికి ఎయిడ్స్ ఉందని తెలియకపోయినా కూడానా అని ఆశ్చర్యపోతున్నారా....విచారించడం అంటే కనుక్కోవడం అని అర్థంలో)

బండివాడికి వేలు తెగి అప్పటికి 15రోజుల పైనే అయి ఉన్నా ఆ బృందంవారు అతని వేలుతెగి రక్తం పండుమీద పడి ఎయిడ్స్ వ్యాధిని వ్యాపింపచేస్తోందని కనుక్కోగలిగారు(ట).
సరే.....ఎర్రటి అక్షరాలతో హెచ్చరికగా వచ్చిన ఈ మెయిల్ లో ఆఖరు మాటలు ఇవి.
Please take care while u eat on the road side (particularly tasty
Vadapav & Paani Puri)

PLEASE FORWARD THIS MAIL TO ALL THE PERSONS YOU KNOW AS YOUR MESSAGE MAY SAVE ONE'S LIFE !!!!!

         ఇప్పుడు బయట బండిమీద ఏదేనా తినాలంటే ఒణుకు పుడుతుందన్నమాట. ఎన్నో సందర్భాలలో ఇంటి భోజనం చేయలేని వారికి బండి మీద అమ్ముతున్న సరుకే ఆధారం. పొద్దున్నే పొగలు కక్కుతున్న ఇడ్లీ, దోశ. బ్రెడ్ ఆమ్లెట్ ఇలా టిఫిన్ల తో పాటు  సాయంకాలాలు పానీపురీ, పావ్ బాజీ, సమోసా ఛాట్ వంటి చిరుతిళ్ళు ఎన్నో బయట హోటల్స్ కన్నా తక్కువ ధరకే మనకి  అమ్ముతూ మనకి కమ్మని రుచులు చూపిస్తూ తమ కడుపులు నింపుకుంటున్నారు బండి వాళ్ళు. నగరాలలో ఉంటున్న వాళ్ళకే కాక భుక్తిని వెతుక్కుంటూ వచ్చిన వలస కూలీలైనా, సాఫ్టువేరు ఇంజనీర్లయినా ఈ బండి వాళ్ళు అమ్మే ఆహారం మీద ఒకేలా ఆధార పడుతున్నారు.
ఇంట్లో వండుకున్నప్పుడు ఉన్నంత శుచిగా శుభ్రంగా ఈ బండివాళ్ళ భోజనం ఉండక పోవచ్చు.ముఖ్యంగా వాడేనీరు కలుషితం అవడం వల్ల మనకి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలని    ఎవరైనా చెప్తే అవుననుకోవడానికి అభ్యంతరం లేదు.
కానీ ఎయిడ్స్ లాంటి మహమ్మారిజబ్బు  బండిమీద అమ్మే పదార్థాల  వల్ల, లేదా ఆ బండివాళ్ళ వల్ల కలుగుతుందని చెప్పడంలో  ఏమాత్రం సమంజసం కనపడలేదు నాకు. రక్తంలో రక్తం కలవడం వల్ల తప్ప రక్తపుచుక్క పడడం వల్ల ఎయిడ్స్ వస్తుందంటే నమ్మలేను. అదే నిజమైతే ఈ పాటికి దేశంలో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు 90 శాతాన్ని మించిపోరూ....
దయచేసి ఎవరైనా నిపుణులు ఈ విషయంలో సందేహం తీరుస్తారా....ఎయిడ్స్ ఇలా కూడా వ్యాపిస్తుంది అని వ్యాపిస్తున్న పుకారు లో నిజాన్ని నిగ్గు తేలుస్తారా...
ఈ మెయిల్ వాడకం దార్లకు మాత్రం ఒక విన్నపం.... అందుకున్న ప్రతి మెయిల్ ని సింపుల్ గా ఒక నొక్కుతో ఫార్వార్డు చేసేముందు   కొంచెం ఆలోచించండి. ఒక్కక్షణం అందులోని నిజానిజాలను తార్కికంగా ఆలోచించి అప్పుడు నొక్కండి.
 

2 comments:

  1. మీరు ఈ పోస్ట్ రాసి తెలియని వాళ్ళకి కూడా తెలియచెప్పారు కదా?????

    ReplyDelete
  2. హుసేన్ సాగర్ తెగి పోతుందని ప్రచారం జరిగింది నాకు బాగా గుర్తుంది. మేము ( అంటే నేనొక్కడినే కాదు కుటుంబం అంతా అప్పుడు కావడి గూడలో ఉండేది. హుసేన్ సాగర్ కిందే ఉంటుంది ) సాగర్ తెగి పోయిందని నిల్లు వచేస్త్న్నాయని తెగ ప్రచారం జరిగింది . తోపుడు బల్ల వాళు పరిగెత్తలేక నష్టపోయారు

    ReplyDelete