జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పేరు తెలుగు సాహిత్యంలో ఏమాత్రం అభిరుచి
ఉన్నవారికైనా తెలియనిది కాదు. మరీ ముఖ్యంగా ఆయన అసలు పేరుతోనే కాక కలంపేరు
కరుణశ్రీ తో కూడా ప్రసిద్ధులే.
తింటే గారెలే తినాలి – వింటే భారతం వినాలి
అంటారు. ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు విన్నా మొహం మొత్తని గొప్పరుచి వీటిలో
ఉందనే భావంతోనే. అలాగే ఎన్నిసార్లు కరుణశ్రీ సాహిత్యం గురించి చెప్పుకున్నా అందులోని
గొప్పదనానికి తరుగులేదు. తొలిసారిగా 1944 లో ముద్రించబడిన నాటినుంచి 1972 లో
రజతోత్సవం చేసుకున్ననాడే కాక ఇటీవలి 5 భాగాలుగా వెలువడిన ఉదయశ్రీ సమగ్ర సంపుటి
వరకు ఆయన సాహిత్యం ఎప్పటికప్పుడు సరికొత్త పాఠకులను ఆకర్షిస్తూనే ఉంది. అంతకుముందు ఏ పద్యాలు రాసారో తెలీదు కానీ
మొట్టమొదట 1942లో పుష్పవిలాపాన్ని ఆయన పనిచేసిన క్రిష్టియన్ కాలేజీ కళాశాల
పత్రికలో అచ్చయితే చూసిన మిత్రుడి ప్రోత్సాహంతో ఉదయశ్రీగా ఆయన కవితలు
సంపుటంగా 1944 లో వెలువడ్డాయి.
పాపయ్యశాస్త్రిగారి పద్యాలు ప్రజా
బాహుళ్యంలో పొందిన జనాదరణ అంతా ఇంతా కాదు. మొదటిసారిగా మహావాది
వెంకటప్పయ్యశాస్త్రిగారు పుస్తకంగా రాకమునుపే మధురంగా గానం చేసారట. ఆ తరువాత ఆ
పద్యాలను తన గాంధర్వగానంతో తెలుగుదేశం నలుమూలలకు వినిపించి ఆబాల గోపాలాన్ని
పరవశింపజేసిన ఘనుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. అందమైన పూవుకు తావితో పాటు ముచ్చటగొలిపే వర్ణసముదాయం కూడా అబ్బినట్టుగా ఈ పద్యాలకు వడ్డాది పాపయ్యగారు
రచించిన చిత్రాలు కూడా జతపడ్డాయి. రస హృదయులను ఆనంద డోలికలలో మునకలు వేయించిన
త్రివేణీ సంగమం ఈ ముగ్గురి సంగమం – ఉదయశ్రీ కావ్య సంపుటి.
ఈ ఉదయశ్రీ లో జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు మూర్తీభవించిన కారుణ్య స్వరూపులుగా
మనకి కనిపిస్తారు. ఒకటీ రెండూ కావు. ఈ సంపుటిలోని కావ్య ఖండికలన్నిటిలోనూ హృదయాలను
ద్రవీభూతం చేసే కరుణరసం తొణికిసలాడుతూనే ఉంటుంది. కొన్ని ఖండికలలో ప్రణయం ప్రధానమైన కావ్య
వస్తువైనప్పుడు కూడా దాని నేపథ్యంలో కవి
భాషలో కరుణాంతరంగతరంగాలు చేసే ధ్వని వినిపిస్తూనే ఉంటుంది.
ఉదయశ్రీలో ఎన్నో కవితా ఖండికలు ఉన్నాయి. చాలా కవితలు ప్రత్యేకంగా కథనాత్మకమైన
శైలిలో, గొప్ప పాత్రచిత్రణతో నాటకీయతను సంతరించుకుని సజీవంగా ఎదుటనిలిపే కవి
వ్యాఖ్యానంతో ఒక గొప్ప కథాకావ్యాన్ని చూస్తూ వింటున్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ కవితలు ఉదయశ్రీలో దాదాపు 36 ఖండికలు. భావకవితా
ఉద్యమం ఉధృతంగా ప్రభంజనంగా వీస్తున్న వేళ రాసిన కవిత్వం కాబట్టి ఆ ఉద్యమ ధోరణుల
ప్రభావం ఈ కవితల మీద ఎక్కువగా కనిపిస్తుంది. దేశం మీద భక్తి, ప్రణయం, ప్రేయసిని
దేవతగా ఆరాధించడం, భగవంతుడి ఆరాధన, పురాతన వైభవం ప్రశంసించడం, ఒక్కోసారి పలాయన
వాదం, నిరాశాపూరితమైన ధోరణి, ప్రపంచంనుంచి ఏకాంతవాసాన్ని కోరుకోవడం ఇవన్నీ
భావకవిత్వ ధోరణిలో మనకు ప్రధానంగా కనిపించే అంశాలు. ఈ కవిత్వం అంతా ప్రధానంగా
ఆత్మాశ్రయ కవిత్వంగా ఉంటుంది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ రచన భావకవిత్వానికి
ఎత్తిన జయ పతాకం. అందుకే ఆ ఛాయలన్నీ ఈ సంపుటిలో మనకు కనిపిస్తాయి.
సహజకవి, ఆంధ్ర మహాభాగవత కర్త, పోతన పద్యాలు నోటికిరాని తెలుగువాళ్లు అరుదుగా ఉంటారు. మన
జాతీయాలలోను, నుడికారంలోనూ, తెలుగు జీవన స్రవంతిలోను అంతగా రక్తంలో లీనమైన పోతన - పాపయ్యశాస్త్రిగారిని అత్యంత బలంగా ఆకర్షించిన
కవితా శక్తిగా కనిపిస్తాడు. ఎన్నో కవితలలో పోతన కవితా శైలిని అనుకరించడమే కాక పోతన
మీద అతనిపై తన ఆరాధనను వెల్లడించే ఓ కవితాఖండికను కూడా రచించారు పాపయ్య శాస్త్రిగారు.
భావకవిత్వ ధోరణిలోని కవితా లక్షణాలను దృష్టిలో పెట్టుకొని పాపయ్యశాస్త్రిగారి
ఉదయశ్రీ కవితలను చూస్తే –
ప్రణయం ప్రధాన వస్తువుగా తీసుకుని రచించిన కవితలు కరుణామయి, పారవశ్యము,
విశ్వప్రేమ, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, వైశాఖి, ప్రాభాతి,
మధురస్మృతి, కల్యాణగీతి, రాట్న సుందరి, తపోభంగము పేర్లతో
ఉన్న వి కనిపిస్తాయి. ఈ ప్రణయం ఎక్కువగా
ప్రేమతత్వానికి మారురూపయిన రాధాకృష్ణులు నాయికా నాయకులుగా కనిపించే కవితలు
కనిపిస్తాయి. వాటితో పాటు ప్రకృతి పురుషులుగా ప్రణయతత్వాన్ని నిరూపించిన
శివపార్వతులు కూడా.
దేశభక్తిని కలిగి ఉండడం, దేశాన్ని కన్నతల్లిగా భావించడం, తల్లి ఋణం తీర్చుకోవడం
వంటి భావనలు భావకవిత్వంలో ప్రముఖంగా కనిపించే విషయాలు. అలాగే పురాతనమైన మన
సంస్కృతి పట్ల అభిమానాన్ని వ్యక్తపరచడం, కీర్తించడం కూడా. ఈ ధోరణిలో తెలుగు తల్లి,
స్వేచ్ఛా పుష్పాలు, మాతృశ్రీ, నవవధువు వంటి కవితలు కనిపిస్తాయి. బ్రిటిష్ సామ్రాజ్యపు
ఏలుబడిలో ఉన్న భారతావనిని చెరలో ఉన్న తల్లిగా భావించి ఆ చెరవిడిపించడం కర్తవ్యంగా
భావించి ఉద్బోధ చేసారు ఆనాటి కవితాకుమారులు. ఆ విధమైన భావాలు ఈ కవితలలో
కనిపిస్తాయి. వీటితో పాటు పురాతన వైభవాన్ని స్మరించే అంశాలతో కవితాకుమారి,
జయోస్తు, కవితా వైజయంతి, పోతన కవితలు ఉన్నాయి. వీటిలో ఆంధ్ర విద్యార్థి కవిత
ప్రబోధాత్మకంగా సాగుతుంది. కవిత్వం పట్ల తన ఆరాధనా భావాన్ని ఒక కవితారాధకుడిగా,
ఆమెను తన ప్రేయసిగా ఊహిస్తూ రాసిన కవిత – జ్యోతిర్మయి. ఈ కవితలో ఆ కన్య - కవికి ఎన్నెన్ని రూపాలలో
దర్శనమిస్తుందో.
భావకవిత మహోద్యమంగా సాగుతున్న కాలంలో యావదాంధ్ర దేశంమీదనే కాక తెలుగు సమాజంమీదకూడా బెంగాలీ సాహిత్య ప్రభావం
చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రవీంద్రుడి గీతాంజలి ప్రభావం తెలుగు సాహిత్యంమీద ఇంతింతనరానిది.
మిస్టిక్ పొయెట్రీ అనే పేరుతో తాత్వికత, మార్మికతతో భగవంతుడి రూపాన్ని వెతుక్కుంటూ
కవి చేసే ప్రయాణం, భగవంతుడిని ఆరాధించడం, అమూర్తంగా భావించే నిరీశ్వర వాదం వంటి
లక్షణాలు కూడా పాపయ్యశాస్త్రిగారి కవిత్వంలో మనకు గోచరిస్తాయి.అంజలి,
ఉషస్సు గీతాలలో ఆ ప్రభావాన్ని చూడగలం. వీటిలో ఆ ప్రభావంతో
పాటుపాపయ్య
శాస్త్రిగారు తాను దర్శించిన విశ్వమయుడిని, కరుణ పట్ల తనకు గల పారవశ్యంవలన, కరుణరసాధిదేవతగా భావించే బుద్ధుడిని జగతిని జాగృతపరిచే భానుడిగాను, బుద్ధభగవానుడిగా భావించి రచించిన కవితలు ఉదయశ్రీ, ఉత్తిష్ఠ, కరుణామూర్తి, కరుణాకుమారి
కావ్య ఖండికలు.
ముఖ్యంగా పాపయ్యశాస్త్రిగారి కవితా తత్వం అంతా కారుణ్యమే. మూర్తీభవించిన
కరుణగా యావత్ప్రపంచం తలిచే, కొలిచే బుద్ధదేవుడి కారుణ్యత్వం శాస్త్రిగారిని ఎంతగా
ఆకర్షించిందో. కేవలం కవిత్వంలో ప్రదర్శించడానికి కాక ఆ కరుణామూర్తి జీవితాన్ని తన
జీవితాదర్శంగా భావించి దాన్ని అనుభవించి
ఆచరించిన దివ్య మూర్తిమత్వం పాపయ్యశాస్త్రిగారి కవిత్వంలో మనకు కనిపిస్తుంది. పుష్పవిలాపం, సార్థకత,బీదపూజ వంటి ఖండికలు సుతిమెత్తని కవి హృదయస్పందనలు వినిపించే కారుణ్యగీతాలు. "బుద్ధదేవుని భూమిలోన పుట్టినాడవు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి!!" అంటూ పూలతో మానవుడిని చీవాట్లు పెట్టించే ఘట్టంలో కూడా తన ఆరాధ్య దైవాన్ని స్మరించడం మానలేదు పాపయ్య శాస్త్రిగారు.
“కరుణకూ,
కవికీ అవినాభావమైన సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే
కరుణకు అస్తిత్వమూ లేదు” అని భావించారు పాపయ్యశాస్త్రిగారు.
భగవంతుడి సృష్టిలో అడుగడునా కారుణ్యపు విశ్వరూపాన్ని దర్శించిన కవి కనుకే ఆ
కరుణకుమారిని తన జీవత సహచరిగా, కావ్యాలలో ఆరాధ్య దేవతగా కొలిచి ఆమె రూపాన్ని
తెలుగు పాఠకులకు అద్భుతంగా రూపు కట్టించారు. తన కరుణకుమారిని స్త్రీగా భావించి ఆమె
అంగాంగంలోనూ అద్వితీయమైన కరుణని చూసారు.
బుద్ధుని ఆర్ద్ర పూరితమైన నేత్రాల
తెరల మధ్య నుంచి ఆమెని తొలిసారిగా చూసారట పాపయ్యశాస్త్రిగారు.
ఆమెవదనంలో ఊర్మిళాదేవి తనను విడిచి వెళ్ళిన సౌభాగ్యం కోసం వెతుకాడే
ఉత్కంఠని చూసారు. ఆమె కంఠంలో పాషాణ హృదయులనైనా కరిగించివేసే పుష్పాల ఆవేదనను
విన్నారు. ఆమె నిట్టూర్పులో కుంతీకుమారి గుండెలలోని వేడి ఊర్పుల ప్రతిధ్వనిని
విన్నారు. ఆమె తడి నయనాలలో యముడు తీసుకుపోతున్న తన ప్రాణసఖుని ప్రాణాలకోసం ఆతని
వెంటపడి పోతున్న సావిత్రి రూపాన్ని
చూసారు. ఆ కరుణామయి చల్లనిచేతులలో పరవశించిపోయే కృష్ణసఖి రాధని
దర్శించారు. కరుణామూర్తి అయిన ఆమె కంటినీటి జడివానలో శాస్త్రిగారు సంతోషంగా పులకరించారు. ఆ కరుణా
గంగా ప్రవాహంలో మునకలు వేసారు. ఆ కన్నీళ్ళను దోసిలితో తాగి తనను అమరుడిగా
చేసుకున్నారు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై, ఎవ్వనియందుడిందు - అంటూ పోతన చెప్పిన
భగవత్స్వరూపాన్ని కరుణ రూపంలో దర్శించారు శాస్త్రిగారు. జీవితం కరుణామయం. ప్రపంచం
కరుణలోనే పుట్టి కరుణలోనే పెరిగి కరుణలోనే విలీనమవుతుంది అని చెప్పిన గొప్ప కారుణ్యహృదయం
శాస్త్రిగారిది.
ఉదయశ్రీ లోని కవితలలో
పాపయ్యశాస్త్రిగారు చిత్రించిన స్త్రీమూర్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు. స్త్రీల
పట్ల, వారి బహిరంతర చిత్తవృత్తిపట్ల గొప్ప గ్రహింపుశక్తి, లోకానుభవం ఈ పాత్రలలో
వ్యక్తమయ్యాయి. ప్రణయమయి రాధ, తాపసి అయిన తన ప్రియుని చేరబోయిన హైమవతీ, రాముని ప్రణయమూర్తి సీతాదేవీ శాస్త్రిగారి
కవితా కన్యకలు.
పాపయ్యశాస్త్రిగారు కరుణని ప్రధానమైన వస్తువుగా గ్రహించడం వలన రూపుదాల్చిన పాత్రలు ఊర్మిళాదేవి, అనసూయాదేవి, సావిత్రి, కుంతీకుమారి పాత్రలు. ఈ పాత్రలు పురాణ పాత్రలే అయినా వాటి లో స్త్రీసహజమయిన భావాలన్నిటితోను రక్తమాంసాలను అద్ది ఒక్కొక్క ప్రత్యేకత తో ప్రాణ ప్రతిష్ట చేసారు. ప్రణయ గాథలా కనిపించే గౌరీపరిణయఘట్టంలో కూడా వారిరువురూ ఏకమయే ఘట్టంకన్నా, వారి ఐక్యతకోసం తాను మసిగా మారిన మన్మథుడు, అతని ప్రియబాంధవి రతీదేవి దుఃఖాన్ని చూపిన సన్నివేశం పాపయ్యశాస్త్రిగారి కరుణాసాగరంలోని రోమాంచకమైన కల్లోలతరంగం..
పాపయ్యశాస్త్రిగారు కరుణని ప్రధానమైన వస్తువుగా గ్రహించడం వలన రూపుదాల్చిన పాత్రలు ఊర్మిళాదేవి, అనసూయాదేవి, సావిత్రి, కుంతీకుమారి పాత్రలు. ఈ పాత్రలు పురాణ పాత్రలే అయినా వాటి లో స్త్రీసహజమయిన భావాలన్నిటితోను రక్తమాంసాలను అద్ది ఒక్కొక్క ప్రత్యేకత తో ప్రాణ ప్రతిష్ట చేసారు. ప్రణయ గాథలా కనిపించే గౌరీపరిణయఘట్టంలో కూడా వారిరువురూ ఏకమయే ఘట్టంకన్నా, వారి ఐక్యతకోసం తాను మసిగా మారిన మన్మథుడు, అతని ప్రియబాంధవి రతీదేవి దుఃఖాన్ని చూపిన సన్నివేశం పాపయ్యశాస్త్రిగారి కరుణాసాగరంలోని రోమాంచకమైన కల్లోలతరంగం..
ఒక్కొక్క కవితాఖండికా ఒక్కొక్క అద్భుతమైన అవ్యక్తమైన మాధుర్యాన్ని నింపుకున్న
రసభరితమైన ఫలం. ఆస్వాదించేవారిదే ఆలస్యం.
ఏమనగలను? ఈవ్యాసాన్ని ఇంతకంటె బాగా ఎవరు రాయగలరు? ఆశీస్సులు.
ReplyDeleteచాలా బాగుంది. వ్యాసం వివరణాత్మకంగా ఉంది.
ReplyDeleteకుంతిమాత జాలి గుండె లోతులు జూసి
ReplyDeleteలలితా లలితా మైన రచన జేసె
కరుణ జాలువారు కవితయే జంధ్యాల
నిజాము తెలిసికొనుడు నేస్తులార
ఓలేటి శ్రీనివాస భాను
" రసార్ద కారుణ్య సింధువు " -కరుణశ్రీ
ReplyDeleteబాగా చెప్పావ్.
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితా సంపుటాలని
. బాగా అవగాహన చేసుకొని చాలా చక్కగా వ్రాసావ్.
నాకు బీ.యస్సీ .లొ " కుంతీ కుమారి ఒక కరుణ రస ఖండ కావ్యము''
- నిరూపించండి అని ప్రస్నాపత్రములో ప్రసన గుర్తు చేసావ్
'ముని మంత్రంబు నొసంగనేల? నొసగెను బో మునుముందు
మార్తాండు రమ్మని నే కోరగనేల?. కోరితినిబో యాతండు రానేల?
వచ్చేనుబో కన్నియ నంచు ఎంచక ననున్ చేపట్టగానేల?
పట్టేనుబో పట్టి నొసంగ నేల? - అంటూ ఆమె పడే మనో వ్యధ
నాకు ఇప్పటికీ బాధ అని పిస్తుంది .
అప్పుడే నేను , నీ వ్యాసం చదివి వుంటే ???
మరేం చేప్పాను బాగా రాసినందుకు నూటికి
నూరు ఇచ్చెను పో!
పంతులవారమ్మాయికి పంతులవారంతా బాగా మార్కులేసి పంపించారు. చాలా థాంక్స్...నూటికి నూరూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తాతగారు. అంతా మీ అభిమానం.
ReplyDeleteచాలా చక్కటి వ్యాఖ్యానం.ఘంటసాల వారి గాత్రంలో పుష్పవిలాపం,కుంతి ,పద్యాలు సాంధ్యశ్రీ పద్యాలు, వింటున్నప్పుడు ఇంకా బాగుంటాయి. 1.జాషువా పద్యాలు కూడా కొన్ని ఘంటసాల గానం చేసినట్లు విన్నాను.నిజమేనా?2.ఎప్పుడూ ఇతర రచనల మీద వ్యాఖ్యానాలే కాకుండా ,స్వంతంగా కూడా రచనలు చేసి ప్రచురిస్తే బాగుంటుంది కదా!
ReplyDeleteఘంటసాలగారు మీరు చెప్పిన పద్యాలతో పాటుగా జాషువాగారి శిశువు కవితా ఖండికను పాపాయి పద్యాలు పేరుతో గానం చేసారు. అవకాశం ఉంటే వినండి. నవజాత శిశువు గడిచే అన్ని దశలను వర్ణిస్తూ సాగే ఆ పద్యాలకి ఎప్పటిలాగే అమరత్వం కలిగించారు ఘంటసాల.
ReplyDeletebeautiful. మీరు దేవులపల్లి గారి కొన్ని రచనలని పరామర్శ చేస్తే బావుంటుంది.
ReplyDeleteనాటి పోతన్న మరల జన్మమ్మునెత్తె
ReplyDeleteనేటి పాపన్నగా - ఇది నిక్కువమ్ము
కాకయుండిన కలదె ఆ కవన శక్తి
తెలుగులను రసగంగలో తేల్చు రక్తి
ఉండేల మాలకొండారెడ్డి గారు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. చక్కని వ్యాసం సుధ గారూ! అభినందనలు!!
కొత్తావకాయ్!! వహ్వా....పై అన్నిటికీ...ఇంకా మీకూను.
ReplyDeleteపాపయ్యశాస్త్రిగారు, ఘంటసాల సమకాలికులై ఉదయశ్రీ, కుంతీకుమారి, పుష్పవిలాపాలని ఘంటసాల తన అమృత గళంతో పాడటం తెలుగువారంగా మనందరం చేసుకున్న సుకృతఫలం. భావకవిత్వం ఎంత ప్రచండంగా వీస్తున్న కాలమైనా, కరుణశ్రీ గారి పద్యాలు మాత్రం మనందరి చెవుల్లోనూ మనసుల్లోనూ శాశ్వతంగా మోగుతున్నాయి. అందరు భావకవులూ ఆ అదృష్టాన్ని పంచుకు పుట్టలేదు.
ReplyDelete- తాడేపల్లి హరికృష్ణ