02 April 2011

సమయానికి తగు పాట పాడెనే...
తెలుగు నవలలు, కథలు ఉధృతంగా వస్తున్న రోజుల్లో(అంటే 1960 ప్రాంతాలలో అనుకోవచ్చు)  ఆ సాహిత్యంలో సాధారణంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే...సందర్భోచితంగా రేడియోలో ఓ పాట వస్తూ ఉండడం. అంటే హీరోయిన్ కడుపుతో ఉందనుకోండి..(అంటే ప్రెగ్నేంట్ అనాలి ఇప్పటి వాళ్ళకోసం) హీరోయిన్ అద్దంలో చూసుకుంటూ అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు అని పాడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ పాటద్వారా ఆమె చెప్పదలచుకున్నది మిగిలిన వాళ్ళకు తెలుస్తుందన్నమాట. అలాగే పాత్రల మానసిక పరిస్థితిని బట్టి రేడియోలో భగవద్గీతలోని  కర్మణ్యే నో, యదా యదాహి ధర్మస్య అనో  ఏదో ఒక శ్లోకం వస్తూ ఉండాలి. దాంతో ఆ పాత్ర ప్రేరణ పొంది ఏదో మార్పు తెచ్చుకుంటుంది. ఇంట్లో బామ్మగారు పూజ చేస్తూ ఉంటే  కౌసల్యా సుప్రజా రామా అన్న బేక్ గ్రవుండు లోనే అందరూ నిద్ర లేవాలన్నమాట. చాల చిన్నతనంలోనే నవలలు,కథలు చదివే అలవాటు వల్ల రేడియోవారు సమయానికి తగు పాట పాడిస్తారని నమ్మేదాన్నికూడా అప్పట్లో. 

ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి అనుభవం ఎదురైంది నాకు. అదేనండి. సమయానికి తగు పాట ప్లే అవడం అన్నమాట. ఇప్పటి రేడియో వాళ్ళకి నా మనసు తెలిసే అవకాశంలేదు కనుక  మనసు ఎఫ్. ఎం.  రేడియోలో సమయానికి తగు పాటలు  వేసుకుంటు ఉండడం ఓ అలవాటయి కూర్చుంది.
మా సీతయ్య  తెలుసుగా మీకు...తెలీదంటే ఓసారటు వెళ్ళి మళ్లా ఇలా రండి.


సీతయ్య....కనపడుటలేదు.
అవునండి...మా సీతయ్య  తప్పిపోయాడు. 
నెలరోజులపైనే అయింది వాడిని చూసి.  
ఒక్క క్షణం....ఒకే ఒక్క క్షణం....అంతలోనే అంతా జరిగిపోతుందని ఎంత మాత్రం ఊహకందని క్షణం. 
నా వెను వెంటనే ఉన్నాడని అనుకున్నా. ఓ క్షణం ఏమారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేలోపల మాయమయిపోయాడు. ఇంటికే కదా వెళ్తాడు అనుకున్నా. పని పూర్తిచేసుకొని వెళ్ళి చూద్దునా...ఇంటికి రాలేదు.
ఇప్పుడు ఎంత అనుకొని ఏం లాభం.
కనుమరుగైపోయాడు. నిజంగా మన చేతిలో ఏమీ లేదా. అంతా విధి లిఖితమేనా...విధి ఒక విషవలయం...విషాద కథలకు అది నిలయం...
ఉండడానికి లేకపోవడానికి మధ్య మరీ ఇంత తక్కువ దూరమా. చెలియలేదు...చెలిమిలేదు ..వెలుతురే లేదు...అని మనసు బాధతో మూల్గుతోంది. తనతో నాకున్న బంధం సామాన్యమయినదా. ఈనాటి ఈ బంధ మే నాటిదో కదా... అవును..తను మొదటిసారిగా మా యింటికి వచ్చినది మే లోనే.

ఎక్కడ వెతకాలి. ఎలా వెతకాలి. నా కనుమరుగైన చోటునుండి వాడు ఎక్కడెక్కడికి తిరిగి ఉంటాడో ఎలా ఊహించను. ఎన్ని యోజనాలు ప్రయాణం చేసినా ప్రయోజనం కనిపించలేదు.
ఒంటరినైపోయానూ...ఇక ఇంటికి ఏమని పోనూ...అని బాధతో ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారి ఇంటికి చేరుకుంటే.....ఇంట్లోనే కనిపించి నన్ను ఆశ్చర్యపరుస్తాడేమోనని ఏదో పేరాశ.
 
ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో...చెప్పుకో..ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో అంటున్నట్టనిపించి ఇంట్లో అన్ని మూలలు కలయదిరుగుతాను....ప్చ్...ఏమీ లాభం ఉండదు.
తను లేడన్న  నిజాన్ని మనసుకు నచ్చచెప్పేలోపలే లేదు లేదు వచ్చేస్తాడొచ్చేస్తాడని  ఆ తలుపు  తానే తట్టి  ఉండవచ్చనే ఓ నమ్మకం చీకట్లో చిరుదీపంలా మినుకుమినుకుమంటోంది. సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా...


అక్కడ  మీ వాడు కనిపించాడు...అచ్చు అలాగే ఉన్నాడు. ఓసారి చూడండి -ఆ మాట వినగానే ఎక్కడి దక్కడ వదిలేసి, ఎలా ఉన్న దాన్ని అలాగే  సిరికిం జెప్పడు లాగ  ఆ చోటుకి వెళ్ళి చూస్తాను. కానీ  వాడు మా వాడు కాదు. 

ఏ పనిచేస్తున్నా వాడే గుర్తొస్తాడు.  కలనైనా నీ తలపే...కలవరమందైనా నీ తలపే అనిపిస్తూ పదే పదే కళ్ళలో మెదులుతున్నాడు.
నా కాళ్ళకో చేతులకో తగులుతూ మెత్తటి కుచ్చులాంటి ఆ శరీరస్పర్శ  ఉండుండి కలవరపెడుతుంది. ఎక్కడ కూర్చున్నా  నా చీర కుచ్చెళ్ళమీద తల వాల్చి ప్రశాంతంగా నిద్రపోయే మెత్తని వెచ్చని జ్ఞాపకం వెంటతరుముతోంది. తనని  గుర్తుచేస్తూనే ఉంది. ఏ చిన్నపాటి శబ్దమయినా   ఏమూలనో దాక్కొని ఆడుకుంటున్న భ్రమకలుగుతోంది.
వరమిచ్చిన దేవుడే శాపమూ ఇచ్చాడు.
వరం పొందడానికి నేను చేసిన పూజలేమున్నాయి.శాపగ్రస్తను కావడానికి  నేను చేసిన పాపమేమిటి.
ఏమీ అర్థంకావడంలేదు.
ఏకొర నోములు నోచితినో  మరి దేవుడికి  నాపై  దయరావడం లేదు.  కళ్ళల్లో నీరెందులకూ...కలకాలం విలపించుటకూ...అన్నది నిజమా..

తను నా దగ్గరకి రావడం ఎంత ఆశ్చర్యమో, నా కళ్లముందునుండి క్షణాల్లో మాయం కావడం అంతే విషాదం. లేకపోతే .... ఎన్నిసార్లు అదే దారిలో వెళ్ళాడు. మరెన్నిసార్లో తిరిగి వచ్చేసాడు.
ఇప్పుడేమయింది...... ఎందుకు రాలేదు. ఏంజరిగి ఉంటుంది. ఊహించలేకపోతున్నాను.

రోడ్డుమీదపడి ఎంతెంత దూరాలు తిరిగిన చోటనే తిరుగుతూ, ప్రతివారినీ తన కోసం  అడుగుతూ... ఆనాడు సీత జాడకోసం రాముడు ఎలా వగచాడో.... ఇప్పుడు ఊహించగలుగుతున్నాను.

చక్కనయ్యా చందమామ .... ఎక్కడున్నావూ...
నీవులేక దిక్కులేని చుక్కలయినామూ ..అనుకుంటూ తను తప్పిపోయిన ఆ దారిలో ఎన్నిసార్లు తిరిగానో. ఎన్ని ఇళ్ళు వెతికానో. ఎందరిని అడిగానో. ఆ అందచందాలు చూసి ఎవరు భ్రమసారో. బయటకి రానివ్వని పరిస్థితి కల్పించారో. నా అడుగుల చప్పుడు తనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు కదా.అయినా రాలేక ఉండడానికి కారణం ఏమయి ఉంటుందో.

దారి తప్పి పోతివో . నీ వారి సంగతి మరచినావో...
ఏ రాణివాసము లోన చేరి రాజువైనావో
రాలేక ఉన్నావో....
భోజనానికి కూర్చుంటే నీకు పెట్టకుండా తింటున్నట్టుంది. తిన్నావో లేదో అని దిగులుగా ఉంటుంది. ఈ వేళలో నువ్వు ఏంచేస్తు ఉంటావో...అనుకుంటూ ఉంటాను ప్రతినిముషం నేను.

ఇన్ని రోజులు- ఎదురుచూపులు, వెతికి వేసారటాలు అవే మిగిలేయి. 
ఇక నువ్వు రావేమో. ఇదివరకు గుర్తుందా పదిరోజులు ఎక్కడికో ఏ స్నేహాన్ని వెతుక్కుంటూనో వెళ్ళావు.. కానీ నువ్వే వచ్చేసావు మరి...రానని రాలేనని ఊరకె అంటావు. రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు... అని అనుకున్నాను. 
కానీ -
ఇక నువ్వు రాలేవు. వస్తావనే ఆశ,నమ్మకం సన్నగిల్లాయి సుమా.
ఎక్కడ ఉన్నా ఏమైనా ....మనమెవరికి వారై వేరైనా... నీ సుఖమే నే కోరుతున్నా......
అనుకుంటూ మనసులో నీ జ్ఞాపకాలను మాపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా నేస్తం.

మా చిట్టితల్లి నీ లాంటి ఆటబొమ్మకావాలని కంటికి మింటికి ఏడుస్తుంటే ఆ దుఃఖం మాపడానికి నువ్వొచ్చావు అనుకున్నా. మరే చిట్టితల్లి కి ఆటబొమ్మగా మారడానికి వెళ్లేవో మాకేం తెలుసు....
వాకిటిలో చిరుశబ్దాలు నీ అలికిడిగా భ్రమపడి చటుక్కున తెర ఒత్తిగించి చూస్తానా-
ఏగాలి కెరటానికో  కదులుతూ ఆకులు చేసే  చప్పుడు  అది. ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు అని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటాను.
నిశ్శబ్దంగా ఉన్న నిశిరాత్రి  వీధిలో ఏదో పరిచయమైన శబ్దం వినిపించినట్టయి గుమ్మంలో నిలబడి చూస్తుంటానా..  మసకనీటి పొర కమ్మిన నా కంటికి వాడి రూపు తోచదయ్యయ్యో.... 
అదిగో రామయతండ్రీ ఆ అడుగులు మా అయ్యవి..ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నది.... రాముడి కోసం శబరి ఎదురుచూసి నట్టుగా  వాకిటిలో నిలబడి వాడికోసం ఎదురుచూస్తుంటాను
వాకిటిలో నిలబడకు. ఇంక నాకై మరి మరి చూడకు. రానిక నీ కోసం సఖీ..... అంటూ  నా గుండెలో నువ్వు నిలబడి చెప్పినట్టవుతుంది. 
శాశ్వతంగా నను విడిచి వెళ్ళినట్టేనా మిత్రమా... 
నీలా నాకు వాసనలు పోల్చుకోవడం రాదు కదూ.
నీజాతి వారిని నీ ఆనవాలుకోసం అడిగే భాష కూడా నాకు తెలియదు కదూ.
నీ జాడలు నేనెలా వెతకను మరి.
నీ అంతట నీవే నాకోసం ఎప్పుడో రావాలి. తప్పక వస్తావు...
నీకోసమే నా అన్వేషణ....నీకోసమే నా నిరీక్షణ.


 

10 comments:

 1. అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళాడండి ? పాపం !

  ReplyDelete
 2. ఎంత వెతికినా దొరకలేదండి మాలగారూ... ఎవరు కట్టేసుకున్నారో ఏమో గాని.చాలా బాధగా ఉంది.

  ReplyDelete
 3. అయ్యో! మళ్లీ తిరిగి వస్తాడులేండి. ఎక్కడ ఉన్నా మీ సీతయ్య క్షేమంగా ఉండాలి.

  ReplyDelete
 4. సిరిసిరిమువ్వగారూ, మా సీతయ్యకి మీ దీవెన ఫలించాలి.థాంక్స్.

  ReplyDelete
 5. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ?

  ReplyDelete
 6. అత్తవడి పూవువలె మెత్తనమ్మా (అదే .. మీ కుక్క గారు)
  ఆదమరచి హాయిగా నిదురపోమ్మా
  :)

  ReplyDelete
 7. ఏడవకు ... ఏడవకు...వెర్రి చెల్లమ్మా...ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు....
  సీతయ్య ఎవరి మాటా వినడమ్మా.... వచ్చేస్తాడ్లేమ్మా...

  ReplyDelete
 8. @జోగారావుగారు,
  @శంకర్ గారు,
  @Naidu గారు
  బావుంది.అందరూ సమయానికి తగిన పాటలు పాడుతున్నారే...
  ఇంకా ఎవరెవరికి ఏ పాటలు గుర్తొస్తున్నాయో ... చూద్దాం..వచ్చి ఇక్కడ పాడండి.

  ReplyDelete
 9. అయ్యయ్యో ..దిగులు పడకండి సుధ గారు..వచ్చేస్తాడు..
  నాకు కుక్కలని పెంచడం అలవాటు లేదు కానీ..మా స్నేహితురాలి ఇంట్లో ఉండేది..
  అక్కడ చూసాను ..అవి మనతో ఎలా ఉంటాయో..:)...విశ్వాసం అన్నా పేరు కి అర్థం..:)
  కానీ ఇప్పుడు సో సాడ్...

  ReplyDelete
 10. yintaku dorikindaa leda cheppadi.

  ReplyDelete