08 May 2011

కళారవీ !! పవీ !! కవీ!!



అంధురాలైన ఓ యువతి.
లోకంలో అందమైన దృశ్యాలెన్నో ఆమె చూడలేదు.
ఆమెని పెళ్ళాడిన ఓ యువకుడు ఆమెకి తన కళ్ళతో లోకాన్ని చూపించాలనుకున్నాడు.
మహా గొప్పసామ్రాజ్యమై వెలసి, కళలకు కాణాచి అయిన విజయనగరం నేడు శిథిలమయినా ఒకనాటి తన కళా వైభవాన్ని చాటుతూ నాటి శిల్పులు వెలయించిన రమణీయశిల్పకళా దీప్తులను ప్రదర్శిస్తూనే ఉంది. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న యువకుడు తన కళ్ళతో తన భార్యకి ఆ లోకాన్ని చూపాలనుకున్నాడు. అప్పుడు పుట్టిన పాట....

శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..
అక్కడ తాను దర్శించిన అనుభవాన్ని భార్యకు వర్ణించి చెప్పి చివరకు-

కనులు లేవని నీవు కలత పడ వలదు
నాకనులు నీవిగా చేసుకొని చూడు........
అంటూ తన తోడుండగా కనులు లేకపోయినా బాధపడనక్కరలేదని, తామిద్దరూ ఒకటే అనే భావాన్ని ఆమెలో కలిగిస్తాడు.

ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ. మంచి మనసులు చిత్రం కోసం 1962లో రచించిన పాట ఇది.
మళ్ళీ 1981 లో ఇలాంటి మరొక సందర్భానికి ఆత్రేయగారు ఒక పాట రాసారు.

తొలికోడి కూసింది సినిమా కోసం.
ఒక అంధురాలైన అమ్మాయి - లోకం చాలా అందమైనదని విన్నానని, ఆ అందాలను తను చూడలేకపోతున్నందుకు బాధ పడుతు ఉంటుంది. అప్పుడు లోకం రంగురంగులతో అందంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు గానీ ఆ అందమైన లోకం వెనక దాగి ఉన్న చీకటి కోణాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తూ లోకం నిజానికి ఆ అమ్మాయి అనుకున్నంత అందమైనది కాదు అని పాట రూపంలో మరొక అమ్మాయి ఇలా వర్ణిస్తుంది.

అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా...
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా

సాహిత్య పరంగా ఎన్నో జీవితసత్యాలను అలవోకగా చెబుతూ సాగే పాటకు ఇది పల్లవి.

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామ రామా...
ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా...

ప్రారంభంలోనే ఆకలి, ఆశ వీటికి లోకంలో ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పారు. ఆకలికి అందముందా రామ రామ, ఆశలకు అంతముందా చెప్పమ్మా అనడంలో ఆ రెండిటినీ సఫలం చేసుకోవడమే జీవితాశయం అయినప్పుడు ఇక లోకంలో అందం ఉండడానికి, కనిపించడానికి అవకాశం ఎక్కడుంది ?

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషి విషమౌతాడు |
అది గడ్డి గొప్పతనమా..
ఇది పాల దోష గుణమా..
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా
చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా

గడ్డిలో ఏగొప్పదనమూ లేకపోయినా దానిని తిన్న ఆవు మంచి పోషకమైన పాలు ఇస్తుంది.కానీ ఆ పాలుతాగిన మనిషి హానిచేసే విషంలా ప్రవర్తిస్తున్నాడు. లోపం మనిషిలోనే ఉందని స్పష్టం అవుతోందన్నమాట. పుట్టుకతో మనిషి మంచివాడే అయినా తెలివి ఎక్కువయిపోయి ఇలా మారిపోతున్నాడేమోనని కవి విచారం.

ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగూ...
ఒక మంచిలోన చెడుగూ...
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా... లోతుకెళ్తే కథే వేరు చిట్టెమ్మా

ముద్దుగా స్నిగ్థంగా కనిపించే గులాబీ, తాకితే ముళ్ళు గుచ్చుకుంటాయి. కమ్మని వాసనతో మైమరపించే మొగలి పొద దగ్గరకు చేరుకోలేం...నాగుపాములందులో ఉంటాయి. తటాలున మెరిసే మెరుపుతీగ గొప్పదనాన్ని గుర్తించే లోపలే వెంటనే వినిపించే పిడుగు శబ్దం గుండెని ఝల్లనిపిస్తుంది. ఎంతో మంచివి, అందమైనవి అనుకున్న వాటి వెనుక ఇలాంటి చెడు లక్షణాలు కనిపించడమే లోకం స్వభావం. అందమైనదంతా మంచిదని అనుకోవడం ఓ అమాయకత్వం. లోతుగా ఆలోచిస్తే స్ఫురించే తత్వం ఇదే.

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ...
ఈ పేదను తిననివ్వడూ...
కళ్లులేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్లు నీవు చూడలేవు చెల్లెమ్మా

'డబ్బుకు లోకం దాసోహం' అని మన సామెత. లోకంలో డబ్బు పుట్టిన తర్వాత మనిషిలో మానవత్వం నశించింది. ఆ విధంగా మనిషి చచ్చాడు. తాను సృష్టించుకున్న డబ్బు చేతిలో తానే కీలుబొమ్మ అయ్యాడు. అలా డబ్బు సంపాదించుకున్న వాడే మనిషిలా గుర్తించబడుతున్నాడు. అక్కడే మనిషిగా పుట్టినా, మనిషిగా గుర్తింపబడని పేదవాడు పుట్టాడు. ఆ గొప్పవాడు తన దగ్గర ఉన్న అంత డబ్బును తాను తినలేడు, అయినాగానీ కనీసం ఇతరులకు పెట్టడు, తిననివ్వడు. గోతికాడ గుంటనక్క తీరు డబ్బున్నవాడి వ్యవహారం.

ఇదీ ఈ లోకం తీరు. ఇంత కుళ్ళు, ఇన్ని కుతంత్రాలతో నిండి ఉన్న లోకాన్ని చూడకపోతే బాధపడవలసినదేం లేదు. నిజానికి అలా చూపులేకపోవడమే ఒక భాగ్యం అనుకొని సంతోషించవచ్చు. లోకం చాలా అందమైనది అనే భ్రమ అయినా మిగులుతుంది.

పాటలో ఇలా లోకం తీరు చెప్పడానికి కవి వాడుకున్న పాత్ర ఒక అక్క. అందువల్ల ఆమె తను చూసిన లోకం తీరును చిన్నదైన తన చెల్లెలికి చెప్పడంలో ఔచిత్యం కనిపిస్తుంది.

చెల్లెమ్మా, చిన్నమ్మా, చిట్టెమ్మా, చెప్పమ్మా, పిచ్చమ్మా- అంటూ మార్చి మార్చి వాడిన పదాలు, కేవలం అంత్యప్రాస కోసం కాక, ఆ నీతి చెబుతున్న అక్కకి చెల్లెలిమీద గల ఆప్యాయతని, అనురాగాన్ని ధ్వనిస్తూ ఉంటాయి.

లయాత్మకమైన వాక్య విన్యాసం ఈ గీతంలో కనిపిస్తుంది.

ఆకలికి అందముందా - ఆశలకు అంతముందా
మనిషి చాలా దొడ్డాడు (దొడ్డవాడు-మంచివాడు అని అర్థంలో) - తెలివిమీరి చెడ్డాడు
మెరుపు వెంట పిడుగు - మంచి వెనక చెడుగు
లోకమంతా ఇదే తీరు - లోతుకెళితే కథే వేరు
ఈ వాక్యాలలో ఒక లయ, తూగు కనిపిస్తాయి.

'డబ్బుపుట్టి మనిషి చచ్చాడు, పేదవాడు నాడు పుట్టాడు' అనే వాక్యంలో చావు, పుట్టుక అనే రెండు వ్యతిరేకార్థ పదాలు వాడుతూ మనుషుల మధ్య 'డబ్బు' అనే వస్తువు మానవత్వం నశించిపోవడానికి, మనుషులందరూ పుట్టుకతో ఒకేలాంటి లక్షణాలున్నా ఉన్నవాడు, లేనివాడు అనే పేరుతో విభజించడానికి ఎలా కారణమైందో ధ్వనింపచేసారు.

భాష మీద, అది ధ్వనింపచేసే భావం మీద ఎంతో పట్టు ఉన్న కవికి కానీ పట్టుబడని పదార్థ ప్రయోగాలు ఇవి. సినిమా కోసం ఈ సాహిత్యాన్ని స్వరపరచినది శ్రీ ఎం.ఎస్.విశ్వనాథ్ గారు.
గీతాన్ని మధురంగా, కవిహృదయాన్ని అర్థం చేసుకొని భావగర్భితంగా ఆలపించినది శ్రీమతి ఎస్. జానకి గారు.


లోకంలో అందాలు ఇన్ని ఉన్నాయే చూడలేకపోతున్నామని బాధ పడేలా అలనాడు మంచి మనసులు చిత్రం కోసం ఆ పాట రాసి-
రంగు రంగుల లోకంలో ఎన్నో అందాలున్నాయి, చూడలేకపోతున్నామని బాధ పడేవారికి లోకంలో రంగుల నీడచాటున దాగి ఉన్న నిజాలను విప్పిచూపి, మేడిపండులా మెరిసే సంఘం గుట్టును విప్పి చూపిస్తూ, చూపు లేకపోవడాన్నే అదృష్టమేమో అనిపించేలా ఇంకో పాట రాసి-

కవి కలం కత్తికి రెండు వేపులా పదునుందని నిరూపించారు ఆచార్య ఆత్రేయ.

12 comments:

  1. చాలా బాగుంది..
    మీ భాష,భావ వ్యక్తీకరణ.

    ReplyDelete
  2. నేను అడగగానే ఈ పాట మీద టపా రాసినందుకు ధన్య్వాదములండి. ఏదో అడిగాడు కదా అని ఆ పాట సాహిత్యాన్నీ, ఆడియో లింకునీ పోస్ట్ చేసి వదిలేయకుండ ఇంత విస్తృతమైన వివరణ ఇచ్చినందుకు నా హృదయపూర్వక అభినందలండి!

    మంచి మనసులు పాటను కూడా ఈ పాటకు ముందుమాటగా జోడించిన తీరు బాగుంది. ఈ రెండు పాటలూ వచ్చే సన్నివేశాలూ ఒకేరకమైనేవే అయినా పాటల్లో ఉన్న కవి హృదయాన్నీ భావాల భిన్నత్వాన్నీ చక్కగా వివరించారు. ఆత్రేయ గారి కలానికి రెండువేపులా పదునే; ఇలానూ రాయగలరు, అలానూ రాయగలరు.

    ఈ పాట లైన్ లను అలా అలా చదివితే, వింటే “ఏముందిలే?” అనిపించేస్తాయేమో, దీని లోపల దాగి ఉన్న నిజమైన కవి హృదయం అందరికీ అర్థం అవుతుందో లేదో అనుకునేవాణ్ణి. ఆత్రేయ గొప్పతనం గురించి చెప్తూ ఈ పాట గురించి ఒకప్పుడు మిత్రులతో ప్రస్తావిస్తే, “నన్ను వదిలేయ్ రా! అంత ఫిలాసఫీ మాకు అర్థం కాదు” అన్నారు. అయ్యో ఆత్రేయనీ, ఆయన పాటల్నీ అర్థం చేసుకునే వారు ఈ తరంలో ఎవరూ లేరే అని బాధ పడ్డాను. ఈ పాటలో ఉన్న భావాలను మీరు వివరించిన తీరు చదివాక చెప్పుకోలేనంత ఆనందం కలుగుతోంది. ప్రతిభావాన్నీ మీరు వివరించిన ప్రతిభను చూసుంటే ఆత్రేయ గారు కూడా మిమ్ముల్ని అభినందించుండే వారు.

    What a great article and song to start the week with? Once again thanks for your post.

    ReplyDelete
  3. భాస్కర్ గారు,
    మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి. ఆత్రేయగొప్పదనం తెలిసిన అభిమానులు మీరు. మీకు నచ్చింది కదా. చాలు.ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి పాత తెలుగు పాటలలో. కొత్త పాటలలో గొప్పదనాన్ని, రచయితల సృజనాత్మకతను మెచ్చుకుంటూ చాలా టపాలు కనిపిస్తున్నాయి. పాత తరానికి చెందిన పాటలలో ఎంతో గొప్ప సాహిత్యంఉంది. వాటిలో కొన్నయినా పరిచయం చేసే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటివాళ్ళు కూడా వాటిని మెచ్చేలా.

    ReplyDelete
  4. కనులు లేవని నీవు కలత పడ వలదు
    నాకనులు నీవిగా చేసుకొని చూడు........
    భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగాన్ని అత్రేయ గారు మనస్సుకు హత్తుకునేలా రాసారు. నా కళ్ళతో ఈ లోకాన్ని చూడమంటున్న భర్త.... అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆయన మనసుకవి.... సుధ గారు చాలా బాగా రాశారు. ఏమండీ మీరేమైనా..... అమృతం తాగారా?.. మీ పేరు లాగానే మీ రచనలు కూడా సుధ ను కురిపిస్తాయి.

    ReplyDelete
  5. శ్రేయోభిలాషిగారు,

    నా రచన మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    నా పేరును నా రచనలకు ఆపాదించిన మీ అభిమానానికి మరిన్ని ధన్యవాదాలు.

    ReplyDelete
  6. శాశ్వతంగా బతకాలనే విపరీతమైన స్వార్ధం ఉన్న వాళ్ళు మాత్రమే అమృతం తాగుతారు. నేను కచితంగా చెప్పగలను సుదా గారు అమృతం తాగలేదు. మనిషి కి మాత్రమే సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. సుదా గారు సున్నిత మనస్తత్వం ఉన్న మనిషి. మనుషుల్లో మనుషులు కనిపించడం ఈ కాలం లో చాల తక్కువ.

    ReplyDelete
  7. చక్కని భాషతో,ఆకట్టుకొనే భావ వ్యక్తీకరణతో ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యాన్ని దానిలోని ఔన్నత్యాన్ని సుమనోహరంగా మనసుకు హత్తుకొనే రీతిలో వర్ణించారు. ఇలాంటివాటిని మరిన్ని మీనుండి ఆశిస్తున్నాను


    ఇట్లు
    మీ అభిమాని

    ReplyDelete
  8. అభిమాని(సురేష్)గారు,
    ఈ పాట పరిచయం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మరిన్ని రాయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా తప్పకుండా వ్యాఖ్యపెట్టి ప్రోత్సహించాలి. మరచిపోవద్దు సుమా.

    ReplyDelete
  9. మరచి పోవడం అంటూ ఉండదండి ఏదో పరీక్షల హడావిడిలో పడి ఈ మధ్య రావడం లేదు అంతే

    ReplyDelete
  10. సుధ గారూ !

    చక్కటి పాట... మరింత చక్కటి వివరణ... ఆ సాహిత్యానికి మరింత పరిమళాన్ని అద్దాయి. అభినందనలు.

    ReplyDelete
  11. సుధ గారూ !

    "శిలలపై శిల్పాలు చెక్కినారూ..." పాట తెలుసుగానీ మీరు చెప్పిన ఈ పాట ఇదే వినడం. సాహిత్యం అద్భుతం... పరిచయం చేసినందుకు ద్ధన్యవాదాలు... ఆత్రేయగారు పాటలు రాసి ప్రేక్షకులనీ రాయక నిర్మాతలనీ ఏడిపించేవారని తెలుసు గానీ "మనసు కవి" గారు ఇలా బాధలో ఉనవారిని అనినయించగలరు కూడా అని చెప్పిన పాట మీరు చూపిన పాట. మీరు మరీంతలా మనసుకు హత్తుకొనేలా వివరించారు. చాలా బాగుంది !

    ReplyDelete
  12. ఆనంద్,
    నచ్చినందుకు .....:)

    ReplyDelete