07 October 2013

తేవారం - తిరుమురై - తమిళ సాహిత్యం

 తమిళదేశంలో శైవమత సాహిత్యంలో అతి పవిత్రమైనదిగా, వేదాలతో సమంగా భావింపబడేది - తిరుమురై. 
ఇది మొత్తం పన్నెండు భాగాల సంకలనం.  నాలుగు పాదాలతో కూడిన వృత్తాలుగా ఇందులో ఛందస్సు కూర్చబడింది. పదవశతాబ్దంలో రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ సంకలనం కూర్చడం జరిగింది. వీటిలో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు. ఈ ఏడు భాగాలు ముగ్గురు ప్రముఖ కవులరచన. 

ఏడవ శతాబ్దికి చెందిన కవులైన  సంబందర్, అప్పార్ ( తిరునావుక్కరసార్), సుందరార్ (సుందరమూర్తి) అనే ముగ్గురు నయనార్లకి   అంకితం చేయబడినది ఈ తేవారం. శివశక్తి గురించి, శివ పంచాక్షరి గొప్పదనం గురించి  వర్ణిస్తుంది ఈ సాహిత్యం.   బౌద్ధ జైన మతాలు ఉచ్ఛదశలో ఉన్నదశలో ఆ మత ప్రభావం నుంచి  ప్రజలను మళ్ళించి, వైదిక మతాన్ని  పునరుద్ధరించడం కోసం ఈ  శివకవులు చేసిన ప్రయత్నమే  ఈ సాహిత్యం. 

తేవారం అన్న పేరు తొలిసారిగా ఏడవ శతాబ్లిలో,  మరోసారి పదవ శతాబ్దిలో రాజరాజ చోళుడి కాలంలో చిదంబరం శివాలయంలో  శిథిల దశలో తాళపత్రాలరూపంలో  ఆ సాహిత్యం దొరకడం, ఆగమ శాస్త్రవిధి విధానాలలో భాగంగా శివుడితో సమానంగా శివభక్తుల విగ్రహాలను ప్రతిష్ఠించడం అనే మార్పులు జరిగినప్పుడు, తిరిగి పదమూడవ శతాబ్లిలో  శక్తి పీఠాలు, మఠాల ద్వారా శైవమత ప్రచారానికి ఈ  తేవారంలోని సాహిత్యం ఉపయోగించడం  ఇలా చరిత్రలో మూడు దశలలో శైవమతానికి సంబంధించి ఈ తేవారం ప్రసక్తి కనిపిస్తుంది. 

తేవారం లోని మొదటి మూడు భాగాలు సంబంధార్, తరువాత మూడు భాగాలను అప్పార్(తిరునావుక్కరుసార్), ఏడవదాన్ని సుందరార్(సుందరమూర్తి) రచించారు. "అప్పార్ నాకోసం రాసాడు. సంబందార్ తనకోసం పాడాడు. సుందరార్ ఆడవాళ్ళకోసం పాడాడు " - అని తమిళం లో ఓ సామెత.  అప్పార్, సంబందార్ ఏడవ శతాబ్దికి చెందినవారు కాగా, సుందరార్ ఎనిమిదవ శతాబ్దికి చెందినవాడు. జైన, బౌద్ధ మతాల ప్రాచుర్యాన్ని తగ్గించడానికి శైవమతాన్ని ప్రచారం చేయడానికి ఈ కవులు చాలా కృషి చేసారు. పల్లవరాజుల కాలంలో వీరంతా వైష్ణవ, బౌద్ధ, జైన మత సిద్ధాంతాలను ఖండిస్తూ దేశమంతా విస్తృతమైన పర్యటన చేసారు.  అనేక మత చర్చలు చేసి ఇతరమతస్థుల సిద్ధాంతాలను ఖండన మండనాలు చేసి ఓడించారు. వీరి సాహిత్యంలోనే తమిళ భాష ప్రాచీనతను నిరూపించే సంగం సాహిత్య ప్రస్తావన కనిపిస్తోంది. తమిళదేశంలోని ప్రాంతాలతో ఇతర ఆసియా దేశ వాసులకు జరిగిన వ్యాపార లావాదేవీల గురించి కూడా  ఈ తేవారంలో వర్ణించబడింది. ఆవిధంగా ఇది చరిత్రని రికార్డు చేసిన సాహిత్యంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్లిలో రచించబడిన ఈ తమిళ సాహిత్యం అక్కడక్కడా ప్రాసంగికంగా మాత్రం ఉంటూ పదకొండవ  శతాబ్లిలో పూర్తి స్థాయిలో  వెలికి వచ్చి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నయనార్ల కథలలో చాలావరకు అన్నిటా కనిపించే అంశాలు ఇతరమతావలంబికులను, శైవమతాన్ని అవలంబించేలా చేయడం, చనిపోయిన వారిని కూడా తమ శివభక్తి శక్తితో బ్రతికించడం, చివరగా శివసాయుజ్యాన్ని పొందడం.

సంబంధార్ సిరికళిలో బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు. మూడేళ్ళపాపడుగా ఉన్నప్పుడు  పార్వతీదేవి స్తన్యపానం చేసాడని తొలి వేదాన్ని అప్పుడే ఆలపించాడని చెప్తారు. పాండ్యదేశపు రాణి కోరికమేరకు దక్షిణాదికి వెళ్ళి జైనులను మతచర్చలో ఓడించాడుట. కానీ 16 ఏళ్ళచిన్న వయసులో ఇతను మరణించాడు. మరణిస్తాడని ముందుగానే తెలిసి వివాహం వద్దని అన్నాడుట. కానీ బలవంతంగా వివాహం చేయడంతో వెంటనే మరణించాడని కథనం.  అప్పార్ కవికి సమకాలికుడు ఇతను.

సంబంధార్ కి సంబంధించిన సమాచారం ఎక్కువగా పెరియపురాణంలో లభిస్తుంది. పెరియపురాణం అనేది పదకొండవ శతాబ్దినాటి తమిళ గ్రంధం. తిరుమురైలోని ఆఖరు భాగం ఇది.

అప్పార్ – ఇతనినే తిరునావుక్కరసార్ (పవిత్రమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు) అంటారు. అసలు పేరు మరుల్ నీకియార్.  ఇతను తిరువామ్యూర్ కి చెందిన ఏడవశతాబ్దినాటి కవి. కడలూరు జిల్లాకి చెందినవాడు. అతను బాలుడిగా ఉండగా జైనమతంపై ఆసక్తితో వారి స్మృతులన్నీ చదివాడు. ఇంటికి దూరంగా పాటలీపుత్రం వెళ్ళి జైన స్థావరాలలో ఉండి  జైన స్మృతులలో నిష్ణాతుడయి ధర్మసేనుడిగా  పిలవబడ్డాడు. అతని సోదరి  తమ్ముడు జైనమతాన్ని అవలంబించడం భరించలేక శివాలయంలో తపస్సు చేసింది. తినునావుక్కరసుకు బాగా జబ్బు చేసింది. అక్క కోరికమేరకు శివుడిని శరణు కోరి శైవమతాన్ని అవలంబించాడు. కడలూరుకు ప్రభువైన జైనరాజు కడవుడు అతన్ని  ఎన్నో హింసలు పెట్టాడు. అయినా అతనికి శివభక్తినుండి  మనస్సు   చెదరలేదు. ఆఖరుకి మెడకి బండరాయి కట్టి సముద్రంలో పడేసారు రాజభటులు. కానీ దైవ సహాయంతో ఒడ్డుకు చేరాడు. శివభక్తి గొప్పదనాన్ని నిరూపించే తిరునావుక్కరసు కధ ఇది. పెరియపురాణంలోని కొన్ని పద్యాలలో అప్పార్ చరిత్ర ఉంది.  అప్పార్  సత్యాన్వేషణ చేస్తూ శైవమతం వైపు ఆకర్షితుడై పల్లవరాజు మహేంద్రవర్మును శైవమతం అవలంబించేలాగ చేసాడు. ఈ మహేంద్రవర్మ శైవమతం నుండి జైనమతానికి మారాడు. అతన్ని తిరిగి శైవంలోకి మార్చడానికి అప్పార్ కారణమయ్యాడు. ఆవిధంగా శైవమతంలోకి చేరాక వేలకొలది జైనులని చంపించాడు  మహేంద్రవర్మ అని చరిత్ర చెబుతోంది.  సంబందార్  అతనిని అప్పా అనిపిలవడం తో అప్పార్ అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయినాడుట. మదురైలో 49వేల పద్యాలతో శివుణ్ణి అర్చించాడు. కొన్ని పద్యాలలో వర్ణించబడిన ప్రకారం అప్పార్  కైలాసానికి వెళ్ళి శివపార్వతుల నాట్యం చూసి తరించాడని తెలుస్తోంది. సంబందార్ చాలా చిన్నవయసులోనే మరణించాడని, అప్పార్ 80 సంవత్సరాలు జీవించాడని తెలుస్తోంది. లౌకిక జీవనంలోనే శివుడిని  చేరడానికి ఎన్నో మార్గాలు చెప్పాడు అప్పార్. "దేహాన్ని శివాలయంగా భావించి, ఆత్మనే శివలింగంగా ఊహించి సత్యం, ప్రేమ అనే జలాలతో ఆ శివుణ్ణి అర్చించమన్నాడు. ఏకాగ్రతతో శివపంచాక్షరిని సాధన చేస్తే శివసాయుజ్యం దొరుకుతుందన్నాడు."

సుందరార్ లేక సుందరమూర్తి  8వ శతాబ్దివాడు. నంబి అరురార్ అసలుపేరు. సుందరమూర్తి అని కూడా అతనిని సంబోధిస్తారు.  తిరునవలూర్ లో గొప్ప సదాచారపరాయణుల ఇంట జన్మించాడు. శివనామస్మరణ మధ్యే పెరిగాడు.. నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తి అంటే  భగవంతుడిని స్నేహితుడిగా ఆరాధించడం కూడా ఒకమార్గం. సుందరార్ శివుడిని చెలికాడుగా భావించాడు. తనకు  ఏంకావాలన్నా, ఏ కష్టం సుఖం వచ్చినా ఆ ఈశ్వరుడిని స్నేహితుడిగా భావించి  అన్నీ అతన్నే అడిగేవాడు. ఇతను కూడా పద్ధెనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించాడు.

నయనార్ లు అందరూ శివభక్తులో తరించినవారే. వారందరికీ వారి లౌకికజీవనంలో ఎన్నో మహిమలు జరిగాయి. వారు ఎన్నో పారలౌకికమైన అనుభవాలు పొందారని ఈశ్వర కటాక్షం పూర్తిగా పొందినవారని ఇలా వారిగురించి ఎన్నో కధలు ఈ తిరుమురైలో పారాయణ చేస్తారు. వాటి ప్రకారం ఈ సుందరార్ కథలో  సుందరార్  పూర్వజన్మలో  కూడా గొప్ప శివభక్తుడు. పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు అందులోంచి హాలాహలం అనే విషం ప్రభవించి లోకాలను కల్లోల పరిచింది. దాన్ని శివుడు తీసుకుని కంఠంలో దాచుకుని లోకాలను రక్షించాడు కదా. ఈ సుందరార్ పూర్వ జన్మలో ఆ శివుడికి హాలాహలాన్ని అలా అందుకుని శివుడికి సమర్పించాడుట. అందుకని అతనిని ఆలాల సుందరార్ అని పేరు. ఈ మానవజన్మలోని నంబి అరురారే  ఆ ఆలాల(హాలాహల)సుందరార్ అన్నమాట.కైలాసంలో శివుడికి సేవకుడిగా ఉన్న సుందరార్ ఓసారి పార్వతీదేవి చెలికత్తెల సౌందర్యం చూసి చలించడం వలన ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందని కథ. శివభక్తిని చాటించి ప్రజలకి  ముక్తి కలిగించడమే ఈ మానవ జన్మ లక్ష్యం అనీ దాన్ని సుందరార్ సాధించాడని భక్తులు చెప్పుకుంటారు. సుందరార్ కథ ద్వారా మనిషికి మోహం అనేది అదుపులో లేకుంటే కలిగే ఫలితాలు,నశించిపోయే నైతిక విలువలు గురించి తెలుస్తుంది. అయితే సద్గురువులను ఆశ్రయించి వారి వెంటనే ఉంటూ పవిత్రమైన క్షేత్రాలను దర్శించి ,శివమూర్తిని  ఆరాధించినవారికి అన్నీ లభిస్తాయని చేసిన పాపం పోతుందని  చెపుతుంది ఈ తేవారం లోని మూడవనయనార్  సుందరమూర్తి కథ.
అప్పార్, సంబందార్, సుందరమూర్తి, మాణిక్యవాసర్
రాజరాజ చోళుడు తేవారం గురించి విని వీటిని సేకరించమని నంబియండర్ నంబి అనే పూజారిని కోరాడుట. దైవ నిర్ణయం వల్ల వెంటనే చిదంబరంలోని శివాలయంలో జీర్ణావస్థలో ఉన్న తాళ ప్రతులు దొరికాయట. ఆ ఆలయ బ్రాహ్మణులు వ్యతిరేకించినా రాజరాజు ఈ కవుల విగ్రహాలను తయారు చేయించి శివాలయాలలో ప్రతిష్టించాడుట.

 
ప్రసిద్ధ శివాలయాలలో కనిపించే  63 మంది  నయనార్ల విగ్రహాలు

 అందుకే రాజరాజ చోళుడిని తిరుమరై ని రక్షించిన వాడుగా- తిరుమురై కంద చోళన్ గా పేరు పొందాడు. నంబి మొదటి ఏడుభాగాలలో ఈ ముగ్గురు కవులు రచించిన శ్లోకాలనుకూర్చాడు. మాణిక్య వాచగర్ రచించిన  తిరుకోవయార్, తిరువాక్కం ను ఎనిమిదవభాగంలో కూర్చాడు.. తొమ్మిదిమంది నయనార్లు కూర్చిన శ్లోకాలను తొమ్మిదవభాగంగాను, తిరుమందిరం, తిరుమూలార్ లను పదవభాగంగాను, తిరుతోట్టనార్ తిరువందతి తోపాటు తాను కూర్చిన శ్లోకాలను పదకొండవ భాగంగా కూర్చాడు. మొదటి ఏడు భాగాలు తేవారం గా ప్రసిద్ధి పొందాయి. పెరియపురాణం పన్నెండవ భాగం.

పెరియపురాణం  - 63 మంది శివభక్తులైన  నయనార్ల చరిత్రను గురించి చెబుతుంది పెరియపురాణం (తిరుత్తొండార్ పురాణం అని కూడా పేరు). ఇది  పంచమ వేదంగా భావించబడుతోంది. భగవంతుడిని చేరడానికి నిష్కామకర్మతో కూడిన భక్తి మార్గమే ఏకైక సాధనమని నమ్మిన భక్తులు నయనార్లు. ఈ నయనార్లలో తమిళదేశానికి చెందిన భక్తులే కాక తెలుగు వారు కూడా ఉండడం విశేషం.  మనందరికీ తెలిసిన భక్త కన్నప్ప లేక తిన్నడు అనే శివభక్తుడు ఈ 63 మంది నయనార్లలో  ఒక భక్తుడు.  అన్ని శివాలయాలలోను ఈ కన్నప్ప శిల్పాలు గోపురాలమీద  గోడలమీద కనిపిస్తాయి. వేదాలు యోగాలు శాస్త్రాలు ఏమీ తెలియకపోయినా శివుడికి తమ ఆత్మని అర్పించి సంపూర్ణమైన శరణాగతిని ప్రదర్శించిన గొప్ప శివభక్తుడు కన్నప్ప. 
భక్త కన్నప్ప (తిన్నడు)
ఈ విధంగా  పెరియపురాణంలో ప్రస్తావించబడిన నయనార్లందరూ చారిత్రక వ్యక్తులే కావడం ఈ గ్రంధం ప్రాశస్త్యాన్ని అధికం చేసింది. వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలకు, వివిధ వృత్తులకు చెందిన ఈ నయనార్లు శివభక్తి అనే ఏకసూత్రంలో ఇమిడిపోయిన మణి పూసలు.

 రెండవ కులోత్తుంగ చోళుడి మనసును జైన మతం నుంచి మళ్ళించడానికి అతని ఆస్థానంలోని కవి, గొప్ప శివభక్తుడు సెక్కిజర్ పెరియపురాణం రచన ద్వారా శివతత్వాన్ని రాజుకి బోధించడానికి ఈ పురాణ రచనకు పూనుకున్నాడని, చిదంబరం దేవాలయంలోని వేయిస్తంభాల మందిరంలో అతను ఈ రచన ప్రారంభించాడని చెప్పబడుతోంది. కేవలం శివభక్తుల కథలను, ముక్తిని గురించి మాత్రమే కాక చోళ సామ్రాజ్యపు మహా వైభవాన్ని వర్ణించిన రచనగా, సాహిత్య రచనలో ఉన్నత శిఖరాలను అందుకున్న కృతిగా ఈ పెరియపురాణం ప్రఖ్యాతి పొందింది. 
చరిత్ర కాలంనాటి శివాలయాలు చిదంబరం, తంజావూరు, శ్రీ కాళహస్తి, మధురై, కపాలీశ్వర కోవెల మొదలైన పెద్ద శైవాలయాలన్నిటిలోనూ ఈ 63 మంది నయనార్ల శిల్పాలు కొలువుతీరి భక్తులకు ఆరాధనీయమయ్యాయి. వీటికోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (పంగుణి మాసం తమిళంలో) అంటే శివరాత్రి పర్వదినాన ఈ 63 మంది నయనార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయమాడవీధులలో ఊరేగిస్తారు చాలా శివాలయాలలో. చెన్నైలోని కపాలీశ్వర దేవాలయంలో ఈ ఊరేగింపు ఘనంగా చేస్తారు. 



600 సంవత్సరాలనాటి శైవమతానికి సంబంధించిన మతపరమైన, తాత్త్వికచింతనతో పాటుగా తమిళ సాహిత్య ప్రస్థానాన్ని తెలియజేస్తుంది తిరుమురై. తిరుమురై లోని మొదటి ఏడు భాగాలు తేవారం పేరుతో పిలవబడతాయి. తేవారంలోని  ఈ గీతాలు తమిళనాట శివాలయాల్లో మహా నైవేద్యం సమర్పించాక సామూహికంగా గానం చేసే సంప్రదాయం ఉంది. తేవారం ప్రధానంగా సంబంధార్, అప్పార్, సుందరార్ అనే ముగ్గురు  కవిత్రయం కూర్చిన సాహిత్యం.   శివభక్తిపరులకి జీవితంలో ఎన్ని అలౌకిక అనుభవాలు కలుగుతాయో వివరిస్తూ సాగే  ఈ         తేవారం, పెరియపురాణంలతో కూడిన తిరుమురై  కేవలం  శివతత్త్వాన్ని, మహాత్మ్యమునే  కాక ఆయా కాలాల చారిత్రక అంశాలను, మానవ సంస్కృతీ విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచనలు.


ఆనాటి చారిత్రక, తాత్విక చింతనలకి దర్పణం.వైష్ణవులకి నాలాయిర దివ్య ప్రబంధం దక్షిణ వేదంగా ఎలా ఆరాధనీయమో శైవులకి ఈ తిరుమురై  అంతే ఆరాధనీయం. 600 సంవత్సరాల దక్షిణ భారతదేశపు ప్రజల మత, తాత్త్విక, సాహిత్య ప్రస్థానాన్ని ముందు తరాలకు తెలియజేసే గొప్ప రచన  తిరుమురై. 

No comments:

Post a Comment