07 October 2013

తేవారం - తిరుమురై - తమిళ సాహిత్యం

 తమిళదేశంలో శైవమత సాహిత్యంలో అతి పవిత్రమైనదిగా, వేదాలతో సమంగా భావింపబడేది - తిరుమురై. 
ఇది మొత్తం పన్నెండు భాగాల సంకలనం.  నాలుగు పాదాలతో కూడిన వృత్తాలుగా ఇందులో ఛందస్సు కూర్చబడింది. పదవశతాబ్దంలో రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ సంకలనం కూర్చడం జరిగింది. వీటిలో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు. ఈ ఏడు భాగాలు ముగ్గురు ప్రముఖ కవులరచన. 

ఏడవ శతాబ్దికి చెందిన కవులైన  సంబందర్, అప్పార్ ( తిరునావుక్కరసార్), సుందరార్ (సుందరమూర్తి) అనే ముగ్గురు నయనార్లకి   అంకితం చేయబడినది ఈ తేవారం. శివశక్తి గురించి, శివ పంచాక్షరి గొప్పదనం గురించి  వర్ణిస్తుంది ఈ సాహిత్యం.   బౌద్ధ జైన మతాలు ఉచ్ఛదశలో ఉన్నదశలో ఆ మత ప్రభావం నుంచి  ప్రజలను మళ్ళించి, వైదిక మతాన్ని  పునరుద్ధరించడం కోసం ఈ  శివకవులు చేసిన ప్రయత్నమే  ఈ సాహిత్యం. 

తేవారం అన్న పేరు తొలిసారిగా ఏడవ శతాబ్లిలో,  మరోసారి పదవ శతాబ్దిలో రాజరాజ చోళుడి కాలంలో చిదంబరం శివాలయంలో  శిథిల దశలో తాళపత్రాలరూపంలో  ఆ సాహిత్యం దొరకడం, ఆగమ శాస్త్రవిధి విధానాలలో భాగంగా శివుడితో సమానంగా శివభక్తుల విగ్రహాలను ప్రతిష్ఠించడం అనే మార్పులు జరిగినప్పుడు, తిరిగి పదమూడవ శతాబ్లిలో  శక్తి పీఠాలు, మఠాల ద్వారా శైవమత ప్రచారానికి ఈ  తేవారంలోని సాహిత్యం ఉపయోగించడం  ఇలా చరిత్రలో మూడు దశలలో శైవమతానికి సంబంధించి ఈ తేవారం ప్రసక్తి కనిపిస్తుంది. 

తేవారం లోని మొదటి మూడు భాగాలు సంబంధార్, తరువాత మూడు భాగాలను అప్పార్(తిరునావుక్కరుసార్), ఏడవదాన్ని సుందరార్(సుందరమూర్తి) రచించారు. "అప్పార్ నాకోసం రాసాడు. సంబందార్ తనకోసం పాడాడు. సుందరార్ ఆడవాళ్ళకోసం పాడాడు " - అని తమిళం లో ఓ సామెత.  అప్పార్, సంబందార్ ఏడవ శతాబ్దికి చెందినవారు కాగా, సుందరార్ ఎనిమిదవ శతాబ్దికి చెందినవాడు. జైన, బౌద్ధ మతాల ప్రాచుర్యాన్ని తగ్గించడానికి శైవమతాన్ని ప్రచారం చేయడానికి ఈ కవులు చాలా కృషి చేసారు. పల్లవరాజుల కాలంలో వీరంతా వైష్ణవ, బౌద్ధ, జైన మత సిద్ధాంతాలను ఖండిస్తూ దేశమంతా విస్తృతమైన పర్యటన చేసారు.  అనేక మత చర్చలు చేసి ఇతరమతస్థుల సిద్ధాంతాలను ఖండన మండనాలు చేసి ఓడించారు. వీరి సాహిత్యంలోనే తమిళ భాష ప్రాచీనతను నిరూపించే సంగం సాహిత్య ప్రస్తావన కనిపిస్తోంది. తమిళదేశంలోని ప్రాంతాలతో ఇతర ఆసియా దేశ వాసులకు జరిగిన వ్యాపార లావాదేవీల గురించి కూడా  ఈ తేవారంలో వర్ణించబడింది. ఆవిధంగా ఇది చరిత్రని రికార్డు చేసిన సాహిత్యంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్లిలో రచించబడిన ఈ తమిళ సాహిత్యం అక్కడక్కడా ప్రాసంగికంగా మాత్రం ఉంటూ పదకొండవ  శతాబ్లిలో పూర్తి స్థాయిలో  వెలికి వచ్చి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నయనార్ల కథలలో చాలావరకు అన్నిటా కనిపించే అంశాలు ఇతరమతావలంబికులను, శైవమతాన్ని అవలంబించేలా చేయడం, చనిపోయిన వారిని కూడా తమ శివభక్తి శక్తితో బ్రతికించడం, చివరగా శివసాయుజ్యాన్ని పొందడం.

సంబంధార్ సిరికళిలో బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు. మూడేళ్ళపాపడుగా ఉన్నప్పుడు  పార్వతీదేవి స్తన్యపానం చేసాడని తొలి వేదాన్ని అప్పుడే ఆలపించాడని చెప్తారు. పాండ్యదేశపు రాణి కోరికమేరకు దక్షిణాదికి వెళ్ళి జైనులను మతచర్చలో ఓడించాడుట. కానీ 16 ఏళ్ళచిన్న వయసులో ఇతను మరణించాడు. మరణిస్తాడని ముందుగానే తెలిసి వివాహం వద్దని అన్నాడుట. కానీ బలవంతంగా వివాహం చేయడంతో వెంటనే మరణించాడని కథనం.  అప్పార్ కవికి సమకాలికుడు ఇతను.

సంబంధార్ కి సంబంధించిన సమాచారం ఎక్కువగా పెరియపురాణంలో లభిస్తుంది. పెరియపురాణం అనేది పదకొండవ శతాబ్దినాటి తమిళ గ్రంధం. తిరుమురైలోని ఆఖరు భాగం ఇది.

అప్పార్ – ఇతనినే తిరునావుక్కరసార్ (పవిత్రమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు) అంటారు. అసలు పేరు మరుల్ నీకియార్.  ఇతను తిరువామ్యూర్ కి చెందిన ఏడవశతాబ్దినాటి కవి. కడలూరు జిల్లాకి చెందినవాడు. అతను బాలుడిగా ఉండగా జైనమతంపై ఆసక్తితో వారి స్మృతులన్నీ చదివాడు. ఇంటికి దూరంగా పాటలీపుత్రం వెళ్ళి జైన స్థావరాలలో ఉండి  జైన స్మృతులలో నిష్ణాతుడయి ధర్మసేనుడిగా  పిలవబడ్డాడు. అతని సోదరి  తమ్ముడు జైనమతాన్ని అవలంబించడం భరించలేక శివాలయంలో తపస్సు చేసింది. తినునావుక్కరసుకు బాగా జబ్బు చేసింది. అక్క కోరికమేరకు శివుడిని శరణు కోరి శైవమతాన్ని అవలంబించాడు. కడలూరుకు ప్రభువైన జైనరాజు కడవుడు అతన్ని  ఎన్నో హింసలు పెట్టాడు. అయినా అతనికి శివభక్తినుండి  మనస్సు   చెదరలేదు. ఆఖరుకి మెడకి బండరాయి కట్టి సముద్రంలో పడేసారు రాజభటులు. కానీ దైవ సహాయంతో ఒడ్డుకు చేరాడు. శివభక్తి గొప్పదనాన్ని నిరూపించే తిరునావుక్కరసు కధ ఇది. పెరియపురాణంలోని కొన్ని పద్యాలలో అప్పార్ చరిత్ర ఉంది.  అప్పార్  సత్యాన్వేషణ చేస్తూ శైవమతం వైపు ఆకర్షితుడై పల్లవరాజు మహేంద్రవర్మును శైవమతం అవలంబించేలాగ చేసాడు. ఈ మహేంద్రవర్మ శైవమతం నుండి జైనమతానికి మారాడు. అతన్ని తిరిగి శైవంలోకి మార్చడానికి అప్పార్ కారణమయ్యాడు. ఆవిధంగా శైవమతంలోకి చేరాక వేలకొలది జైనులని చంపించాడు  మహేంద్రవర్మ అని చరిత్ర చెబుతోంది.  సంబందార్  అతనిని అప్పా అనిపిలవడం తో అప్పార్ అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయినాడుట. మదురైలో 49వేల పద్యాలతో శివుణ్ణి అర్చించాడు. కొన్ని పద్యాలలో వర్ణించబడిన ప్రకారం అప్పార్  కైలాసానికి వెళ్ళి శివపార్వతుల నాట్యం చూసి తరించాడని తెలుస్తోంది. సంబందార్ చాలా చిన్నవయసులోనే మరణించాడని, అప్పార్ 80 సంవత్సరాలు జీవించాడని తెలుస్తోంది. లౌకిక జీవనంలోనే శివుడిని  చేరడానికి ఎన్నో మార్గాలు చెప్పాడు అప్పార్. "దేహాన్ని శివాలయంగా భావించి, ఆత్మనే శివలింగంగా ఊహించి సత్యం, ప్రేమ అనే జలాలతో ఆ శివుణ్ణి అర్చించమన్నాడు. ఏకాగ్రతతో శివపంచాక్షరిని సాధన చేస్తే శివసాయుజ్యం దొరుకుతుందన్నాడు."

సుందరార్ లేక సుందరమూర్తి  8వ శతాబ్దివాడు. నంబి అరురార్ అసలుపేరు. సుందరమూర్తి అని కూడా అతనిని సంబోధిస్తారు.  తిరునవలూర్ లో గొప్ప సదాచారపరాయణుల ఇంట జన్మించాడు. శివనామస్మరణ మధ్యే పెరిగాడు.. నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తి అంటే  భగవంతుడిని స్నేహితుడిగా ఆరాధించడం కూడా ఒకమార్గం. సుందరార్ శివుడిని చెలికాడుగా భావించాడు. తనకు  ఏంకావాలన్నా, ఏ కష్టం సుఖం వచ్చినా ఆ ఈశ్వరుడిని స్నేహితుడిగా భావించి  అన్నీ అతన్నే అడిగేవాడు. ఇతను కూడా పద్ధెనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించాడు.

నయనార్ లు అందరూ శివభక్తులో తరించినవారే. వారందరికీ వారి లౌకికజీవనంలో ఎన్నో మహిమలు జరిగాయి. వారు ఎన్నో పారలౌకికమైన అనుభవాలు పొందారని ఈశ్వర కటాక్షం పూర్తిగా పొందినవారని ఇలా వారిగురించి ఎన్నో కధలు ఈ తిరుమురైలో పారాయణ చేస్తారు. వాటి ప్రకారం ఈ సుందరార్ కథలో  సుందరార్  పూర్వజన్మలో  కూడా గొప్ప శివభక్తుడు. పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు అందులోంచి హాలాహలం అనే విషం ప్రభవించి లోకాలను కల్లోల పరిచింది. దాన్ని శివుడు తీసుకుని కంఠంలో దాచుకుని లోకాలను రక్షించాడు కదా. ఈ సుందరార్ పూర్వ జన్మలో ఆ శివుడికి హాలాహలాన్ని అలా అందుకుని శివుడికి సమర్పించాడుట. అందుకని అతనిని ఆలాల సుందరార్ అని పేరు. ఈ మానవజన్మలోని నంబి అరురారే  ఆ ఆలాల(హాలాహల)సుందరార్ అన్నమాట.కైలాసంలో శివుడికి సేవకుడిగా ఉన్న సుందరార్ ఓసారి పార్వతీదేవి చెలికత్తెల సౌందర్యం చూసి చలించడం వలన ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందని కథ. శివభక్తిని చాటించి ప్రజలకి  ముక్తి కలిగించడమే ఈ మానవ జన్మ లక్ష్యం అనీ దాన్ని సుందరార్ సాధించాడని భక్తులు చెప్పుకుంటారు. సుందరార్ కథ ద్వారా మనిషికి మోహం అనేది అదుపులో లేకుంటే కలిగే ఫలితాలు,నశించిపోయే నైతిక విలువలు గురించి తెలుస్తుంది. అయితే సద్గురువులను ఆశ్రయించి వారి వెంటనే ఉంటూ పవిత్రమైన క్షేత్రాలను దర్శించి ,శివమూర్తిని  ఆరాధించినవారికి అన్నీ లభిస్తాయని చేసిన పాపం పోతుందని  చెపుతుంది ఈ తేవారం లోని మూడవనయనార్  సుందరమూర్తి కథ.
అప్పార్, సంబందార్, సుందరమూర్తి, మాణిక్యవాసర్
రాజరాజ చోళుడు తేవారం గురించి విని వీటిని సేకరించమని నంబియండర్ నంబి అనే పూజారిని కోరాడుట. దైవ నిర్ణయం వల్ల వెంటనే చిదంబరంలోని శివాలయంలో జీర్ణావస్థలో ఉన్న తాళ ప్రతులు దొరికాయట. ఆ ఆలయ బ్రాహ్మణులు వ్యతిరేకించినా రాజరాజు ఈ కవుల విగ్రహాలను తయారు చేయించి శివాలయాలలో ప్రతిష్టించాడుట.

 
ప్రసిద్ధ శివాలయాలలో కనిపించే  63 మంది  నయనార్ల విగ్రహాలు

 అందుకే రాజరాజ చోళుడిని తిరుమరై ని రక్షించిన వాడుగా- తిరుమురై కంద చోళన్ గా పేరు పొందాడు. నంబి మొదటి ఏడుభాగాలలో ఈ ముగ్గురు కవులు రచించిన శ్లోకాలనుకూర్చాడు. మాణిక్య వాచగర్ రచించిన  తిరుకోవయార్, తిరువాక్కం ను ఎనిమిదవభాగంలో కూర్చాడు.. తొమ్మిదిమంది నయనార్లు కూర్చిన శ్లోకాలను తొమ్మిదవభాగంగాను, తిరుమందిరం, తిరుమూలార్ లను పదవభాగంగాను, తిరుతోట్టనార్ తిరువందతి తోపాటు తాను కూర్చిన శ్లోకాలను పదకొండవ భాగంగా కూర్చాడు. మొదటి ఏడు భాగాలు తేవారం గా ప్రసిద్ధి పొందాయి. పెరియపురాణం పన్నెండవ భాగం.

పెరియపురాణం  - 63 మంది శివభక్తులైన  నయనార్ల చరిత్రను గురించి చెబుతుంది పెరియపురాణం (తిరుత్తొండార్ పురాణం అని కూడా పేరు). ఇది  పంచమ వేదంగా భావించబడుతోంది. భగవంతుడిని చేరడానికి నిష్కామకర్మతో కూడిన భక్తి మార్గమే ఏకైక సాధనమని నమ్మిన భక్తులు నయనార్లు. ఈ నయనార్లలో తమిళదేశానికి చెందిన భక్తులే కాక తెలుగు వారు కూడా ఉండడం విశేషం.  మనందరికీ తెలిసిన భక్త కన్నప్ప లేక తిన్నడు అనే శివభక్తుడు ఈ 63 మంది నయనార్లలో  ఒక భక్తుడు.  అన్ని శివాలయాలలోను ఈ కన్నప్ప శిల్పాలు గోపురాలమీద  గోడలమీద కనిపిస్తాయి. వేదాలు యోగాలు శాస్త్రాలు ఏమీ తెలియకపోయినా శివుడికి తమ ఆత్మని అర్పించి సంపూర్ణమైన శరణాగతిని ప్రదర్శించిన గొప్ప శివభక్తుడు కన్నప్ప. 
భక్త కన్నప్ప (తిన్నడు)
ఈ విధంగా  పెరియపురాణంలో ప్రస్తావించబడిన నయనార్లందరూ చారిత్రక వ్యక్తులే కావడం ఈ గ్రంధం ప్రాశస్త్యాన్ని అధికం చేసింది. వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలకు, వివిధ వృత్తులకు చెందిన ఈ నయనార్లు శివభక్తి అనే ఏకసూత్రంలో ఇమిడిపోయిన మణి పూసలు.

 రెండవ కులోత్తుంగ చోళుడి మనసును జైన మతం నుంచి మళ్ళించడానికి అతని ఆస్థానంలోని కవి, గొప్ప శివభక్తుడు సెక్కిజర్ పెరియపురాణం రచన ద్వారా శివతత్వాన్ని రాజుకి బోధించడానికి ఈ పురాణ రచనకు పూనుకున్నాడని, చిదంబరం దేవాలయంలోని వేయిస్తంభాల మందిరంలో అతను ఈ రచన ప్రారంభించాడని చెప్పబడుతోంది. కేవలం శివభక్తుల కథలను, ముక్తిని గురించి మాత్రమే కాక చోళ సామ్రాజ్యపు మహా వైభవాన్ని వర్ణించిన రచనగా, సాహిత్య రచనలో ఉన్నత శిఖరాలను అందుకున్న కృతిగా ఈ పెరియపురాణం ప్రఖ్యాతి పొందింది. 
చరిత్ర కాలంనాటి శివాలయాలు చిదంబరం, తంజావూరు, శ్రీ కాళహస్తి, మధురై, కపాలీశ్వర కోవెల మొదలైన పెద్ద శైవాలయాలన్నిటిలోనూ ఈ 63 మంది నయనార్ల శిల్పాలు కొలువుతీరి భక్తులకు ఆరాధనీయమయ్యాయి. వీటికోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (పంగుణి మాసం తమిళంలో) అంటే శివరాత్రి పర్వదినాన ఈ 63 మంది నయనార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయమాడవీధులలో ఊరేగిస్తారు చాలా శివాలయాలలో. చెన్నైలోని కపాలీశ్వర దేవాలయంలో ఈ ఊరేగింపు ఘనంగా చేస్తారు. 



600 సంవత్సరాలనాటి శైవమతానికి సంబంధించిన మతపరమైన, తాత్త్వికచింతనతో పాటుగా తమిళ సాహిత్య ప్రస్థానాన్ని తెలియజేస్తుంది తిరుమురై. తిరుమురై లోని మొదటి ఏడు భాగాలు తేవారం పేరుతో పిలవబడతాయి. తేవారంలోని  ఈ గీతాలు తమిళనాట శివాలయాల్లో మహా నైవేద్యం సమర్పించాక సామూహికంగా గానం చేసే సంప్రదాయం ఉంది. తేవారం ప్రధానంగా సంబంధార్, అప్పార్, సుందరార్ అనే ముగ్గురు  కవిత్రయం కూర్చిన సాహిత్యం.   శివభక్తిపరులకి జీవితంలో ఎన్ని అలౌకిక అనుభవాలు కలుగుతాయో వివరిస్తూ సాగే  ఈ         తేవారం, పెరియపురాణంలతో కూడిన తిరుమురై  కేవలం  శివతత్త్వాన్ని, మహాత్మ్యమునే  కాక ఆయా కాలాల చారిత్రక అంశాలను, మానవ సంస్కృతీ విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచనలు.


ఆనాటి చారిత్రక, తాత్విక చింతనలకి దర్పణం.వైష్ణవులకి నాలాయిర దివ్య ప్రబంధం దక్షిణ వేదంగా ఎలా ఆరాధనీయమో శైవులకి ఈ తిరుమురై  అంతే ఆరాధనీయం. 600 సంవత్సరాల దక్షిణ భారతదేశపు ప్రజల మత, తాత్త్విక, సాహిత్య ప్రస్థానాన్ని ముందు తరాలకు తెలియజేసే గొప్ప రచన  తిరుమురై. 

17 April 2013

"వరూధినీ ప్రవరాఖ్య "- భళారె !! మన సినారె !!



అభినవ ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులను అష్ట దిగ్గజాలు అంటారు. అందులో ముఖ్యమైన కవి దిగ్గజం అల్లసాని పెద్దన. ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకి పాదులు వేసినవాడు అల్లసాని పెద్దను. స్వారోచిష మనుసంభవము అనే కథను గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దాడు. పెద్దనతో ప్రారంభమైన ఈ ప్రక్రియ కనీసం రెండు వందల సంవత్సరాల వరకు సాహిత్యంలో ముఖ్యమైన పాత్ర వహించింది.

మారన  రచించిన "మార్కండేయపురాణం"  నుంచి పెద్దన మనుచరిత్రము  కథా వస్తువును తీసుకున్నాడు. దానికి స్వకపోల కల్పనలతో, వర్ణనలతో విస్తరింపచేసి ప్రబంధానికి ఉండవలసిన సర్వ లక్షణాలను సమన్వితం చేసి తరువాతి ప్రబంధ కవులకు మార్గ దర్శకుడయ్యాడు.


ప్రవరుడు అనే ఆఖ్య అంటే పేరు గలవాడు, ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడు అనే పదం  పరస్త్రీల వైపు కన్నెత్తి   కూడా  చూడనివాడు అని తెలుగు జాతీయంగా స్థిరపడిపోయింది. వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం అంతగా ఆంధ్రసీమకు పరిచయం కావడానికి కారణం పెద్దన గారి మనుచరిత్ర కావ్యం. ఈ కావ్యంలో మొత్తం ఆరు ఆశ్వాసాలు ఉండగా అందులో మూడు ఆశ్వాసాల వరకూ పూర్తిగా వరూధినీ ప్రవరాఖ్యుల  వృత్తాంతమే ఉంటుంది. సర్వలక్షణ శోభితుడైన ధర్మవీరుడు మనువు – అతని జన్మకి కారణంగా ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతం చెప్పబడుతుంది.

వరూధిని ప్రవరాఖ్యుడి అతిలోక సౌందర్యం చూసి మోహిస్తుంది.  కానీ ధర్మ నిష్ఠ కలిగిన అతను ఆమెను  తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఆమెపై ఎప్పటినుండో కన్నువేసిన కలి అనే ఓ గంధర్వుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మాయా రూపం ధరించి ప్రవరుడిగా ఆమె ముందు నిలు స్తాడు. అతను నిజంగా ప్రవరాఖ్యుడే అనుకుని అతని షరతులకు అంగీకరించి అతనిని వివాహం చేసుకుంటుంది వరూధిని.  గర్భవతి అయిన వరూధిని తన  చేసిన మోసాన్ని గ్రహించకముందే అక్కడినుంచి తప్పుకుంటాడు మాయా ప్రవరుడు. వరూధినికి ఎప్పటికీ తెలియని నిజం ఏమంటే తను వివాహమాడినదీ, పుత్రుడిని కనబోతున్నదీ ఓ మాయా ప్రవరుడికి అని. ఆమెకు పుట్టినవాడే స్వరోచి. అతని కుమారుడే స్వారోచిషుడు –మనువు.

ప్రవరుడిని ఊహిస్తూ వరూధిని గంధర్వుడితో  జీవించడం వల్ల స్వరోచికి శాంతగుణ ప్రధానుడై, భక్తి వైరాగ్యసంపన్నుడైన కుమారుడిగా స్వారోచిష మనువు కలిగాడు. ప్రవరుడిలోని ధర్మవీరోత్సాహం ప్రవరుడి తేజస్సు స్వారోచిషుడిలో కలగడానికి ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతమే కారణమైంది కనుక పెద్దన ఈ కథకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారని విమర్శకులు అంటారు.

ఇంత గొప్ప కావ్యంలోని ఇంత ప్రధానమైన కధని,. అందులోను మూడు ఆశ్వాసముల పైన రచించబడిన కథని ఓ సినిమాలో కేవలం ఓ పదిహేను  నిముషాల వ్యవథిలో చెప్పాలి అంటే అది ఎంత గొప్ప సాహసం. అటువంటి సాహసం చేయడానికి ఆ కవికి కవిత్వం పై ఎంత పట్టు ఉండాలి?! మూలకావ్యంలోని అంశాలను వాటి సౌందర్యాన్ని, పాత్రల సజీవ లక్షణాలను కాపాడుతూ సంభాషణలు గేయరూపంలోకి,  మాటలరూపంలోకి  మార్చాలంటే   ఎంత నిగ్రహం ఉండాలి?!

అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని పేరు. అటువంటి కవి  పద్యాలను  సందర్భోచితంగా ఉపయోగిస్తూ, సినిమా సంగీతానికి అనుగుణంగా పదాలను మార్చుతూ, అందరికీ అర్థమయ్యే రీతిలో పాడుకునే పాటగా రాసి  శభాష్ అనిపించుకున్న  ఆ గొప్పదనం ఎవరిది?!


ఇంకెవరిది.... సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోను అత్యంత ప్రతిభాపాటవాలను ప్రదర్శించి కవిగా, విమర్శకుడిగా, ఆచార్యుడిగా విభిన్నమైన పదవులను నిర్వహించి దక్షుడిగా ఇంటగెలిచి, 

విశ్వంభరతో జ్ఞాన పీఠ్ బహుమతిని అందుకుని రచ్చగెలిచి, తెలుగు గౌరవాన్ని ఇనుమడింపజేసిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గారిదే.... అవును!! అతనే సినారె.

మనుషుల్లో దేవుడు(1974) అనే చిత్రంలో నాయికా నాయక పాత్రలు(ఎన్. టి. ఆర్. వాణిశ్రీ)  ఓ అంతర్నాటకం  ప్రదర్శించే సందర్భంలో పాట రాయడానికి  ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతాన్ని నాటకానికి వస్తువుగా తీసుకున్నారు సినారె. అన్ని వందల పద్యాలలో పెద్దనగారు చెప్పిన కథనంతా కథలో ప్రముఖమైన ప్రచారం లో ఉన్న రెండు మూడు పద్యాలను మాత్రం ఉంచి తక్కినదంతా  గేయాత్మకశైలిలో తన సంభాషణలు జోడించారు.


వరణానదీ తీరంలో అరుణాస్పదం అనే పురంలో ప్రవరుడు అనే పేరు గల బ్రాహ్మణయువకుడు ఉండేవాడు. అతను నిత్యాగ్ని హోత్రుడు, నిరతాన్నదాత. వివాహితుడు. ధర్మాచరణపట్ల ఎంతో బద్ధుడైనవాడు. అతనికి ఒక వింత అలవాటు ఉండేది. అదేమిటంటే కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి. ఆ  ఆసక్తి తోనే ఒకనాడు తన ఇంటికి వచ్చిన ఓ సిద్ధుడికి తగిన మర్యాదలు చేసి, భోజనం పెట్టి అతని యాత్రా విశేషాలు అడుగుతాడు. అతను ప్రపంచంలోని నలుదిక్కులు చూసి వచ్చాడని తెలుసుకుని అంత స్వల్పకాలంలో  అంతంత దూరాలు ఎలా వెళ్ళగలిగాడు అని ఆశ్చర్యపోతాడు. సిద్ధుడు ప్రవరుడి ఆసక్తిని, ఆశ్చర్యానికి ముగ్ధుడై అతని పట్ల అవ్యాజమైన ఆత్మీయతతో తన వద్ద ఉన్న పసరును ప్రవరుడి కాళ్ళకి పూసి అతను కూడా ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తిని కలిగించి తన దారిని తాను వెళ్ళిపోతాడు.ప్రవరాఖ్యుడు హిమాలయపర్వతాలు చూడాలనుకుని అక్కడికి వెంటనే చేరుకుంటాడు. ఈ కథను ఇక్కడ నాటకం ప్రారంభంలో  క్లుప్తంగా ఇలా చెప్తారు సినారె తన స్వరంతో.

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహా కావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం. ఎవరా వరూధిని  దివినుండి భువికి దిగివచ్చిన అప్సరో శిరోమణి. మరి ఈ ప్రవరుడు. నిత్యాగ్ని హోత్రి నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుడిని సేవించి తన తీర్థయాత్రా  వివరించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూసాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాఖ్యుడు.  ఎన్నెన్నో తీర్ధాలను దర్శించి చివరకు చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

ప్రవరాఖ్యుడు హిమాలయాల సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు. అక్కడి పర్వతాలు, ఆకాశాన్ని అంటే శిఖరాలు, లోయలు, పచ్చని ప్రకృతి బయళ్ళు, పురివిప్పి ఆడే నెమళ్ళు, ఆ ప్రాంతంలో విహరించే జంతుజాలాలు ఇలాంటి విశేషాలెన్నో పెద్దన వర్ణించారు. వీటిలో

అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిశ్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్(పెద్దనగారి పద్యం)  

అన్న ఈ ప్రముఖ మైన పద్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా మార్పులు  చేసి ప్రవరుడితో ఇలా పలికించారు – సినారె.


అహో హిమవన్నగము
భరతావనికే తలమానికము
అహో హిమవన్నగము!!

అంబర చుంబి శిఖరాలు, శిరఝ్ఝరీ తరంగాలు,
ఆ అభంగ తరంగ మృదంగ రవముల
అభినయమాడు మయూరాలు   
అంటూ హిమాలయాలను ప్రశంసిస్తాడు. పెద్దనకాలం నాటికి ఉందో లేదో తెలీదు కానీ భరతావనికే తలమానికము అంటూ ఇప్పటి  మన భారతదేశానికి శిరఃభాగంలో ఉండడం వల్ల తలమానికంగా శోభిస్తోంది అనే ఔచిత్యంతో కూడిన మాటలు రాసారు సినారె. సినిమా పాటకి అనుగుణంగా పద్యంలోని " పరిఫుల్ల కలాప కలాపీ జాలమున్"  అనే పద్య పాదాన్ని  అభినయమాడె మయూరాలు అన్న ఒక్క పదంతో ఇమడ్చారు.

హిమాలయాలు భారతదేశానికి  కేవలం ఓ సరిహద్దు గిరులు మాత్రమే కాదు. పవిత్రమైన గంగానది విష్ణువు పాదలనుండి భగీరథుడి మనోరథం కోసం భువికి దిగివచ్చి తాకిన ప్రదేశం. అది మహాదేవుడు ఈశ్వరుడి   నిజ నివాసం. పార్వతీ దేవికి పుట్టిల్లు. శివపార్వతుల మధ్య   ప్రణయాగ్ని రగిల్చే ప్రయత్నం చేసి ఆ  ప్రయత్నంలో ఆ అగ్నికి మన్మథుడు తానే ఆహుతై శరీరాన్ని పోగొట్టుకున్న ప్రదేశం. ఇలా  ఎన్నో పురాణాలకు,  ఆటపట్టులు హిమాలయ సానువులు. ప్రవరుడు ఆ పర్వత సానువుల్లో చరిస్తూ ఆ విశేషాలన్నీ గుర్తుచేసుకుంటున్నాడు.

భగీరథుడు తపియించిన చోటు,
గగన గంగనే దించిన చోటు,
పరమేశుని ప్రాణేశుగ బడసి
గిరినందన తరియించిన  చోటు  అంటూ తన మాటలతో ప్రవరుడు దర్శించిన హిమాలయాలను వర్ణించారు సినారె.

ఆ గిరుల సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరలేదు. మళ్ళీ రేపువద్దాం ఆలస్యమవుతోంది అనుకుని తిరిగి వెళ్ళే ప్రయత్నం చేసాడు.

సిద్ధుడిచ్చిన కాలి పసరుతో సిద్ధించెను  వాంఛితమ్ము
పుణ్యతీర్థ సందర్శనమ్ముతో పునీతమాయెను జీవితమ్ము

అనుకున్నాడు.  అప్పుడు తెలుసుకున్నాడు  ఆ సూర్యకాంతికి కరిగిన మంచుతో పాటుగా తన పాద లేపనం కూడా కరిగి నీరైందని. ఇక ప్రవరుడికి తిరిగి వెళ్ళే దారి కనిపించక, ఏ మార్గమూ తోచక  అల్లాడుతూ అక్కడే తిరగసాగాడు. "కాలిపసరు కరిగి పోయెనే! ఇల్లు చేరు తెరువు ఎఱుగనైతినే" అని విచారిస్తూ.


ఎక్కడి మా అరుణాస్పద పురము
ఎక్కడి ఈ హిమవన్నగ నగము
కోరి వచ్చినాను దారి కోలుపోయినాను
ఎగిరిపోదమన్ననాకు రెక్కలైన లేవే
ఏదిక్కు  కానరాదే అంటూ ఇల్లుచేరే దారి వెతుకుతూ ముందుకు సాగాడు.

అలా ఆ పర్వత గుహలదారుల్లో తిరుగుతున్న ప్రవరుడికి మధుర మంజుల వీణానాదం వినిపించింది. మనుషుల ఆవాసాల జాడ కనిపించి ఇంటికి వెళ్ళే దారి దొరుకుతుందని సరదా పడ్డాడు. అక్కడ  అద్భుతమైన సౌందర్యరాశిని ఎదురుగా చూసాడు.  తన నివాసానికి చేరకున్న ప్రవరుడిని చూసింది గంధర్వ కన్య వరూధిని. ప్రవరుడి రూపురేఖావిలాసాలను, సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది అప్సరస- వరూధిని.

ఎక్కడివాడో యక్ష తనయేందు జయంత వసంత కంతులన్
జక్కదనంబునం గెలువఁజాలెడి వాడు మహీసురాన్వయం
బెక్కడ  యీ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరుం
డక్కఁగొనగ రాదె యకటా నను వీడు పరిగ్రహించినన్(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ "యక్షరాజైన కుబేరుడి కొడుకు నలకూబరుడు, చంద్రుడు, ఇంద్రుడి కొడుకైన జయంతుడు, వసంతుడు, మన్మధుడు ఇలా ఎంతో అందమైనవారుగా పేరుపొందిన వీరందరినీ మించిన సౌందర్యం ఈ బ్రాహ్మణుడు కలిగి ఉండడం ఏమిటి?!" అని ఆశ్చర్యపోయింది. ఇంత       గొప్ప అందగాడు నన్ను చేపట్టితే ఇక మన్మధుడు కూడా నాకు దాస్యం చేస్తాడు కదా అని అతని అందాన్ని మెచ్చుకుంది. అలా అతన్ని        చూస్తూనే ఉండిపోయింది వరూధిని.

పాపం అమాయకుడు ప్రవరుడు. తనలాగే ఆమె కూడా దారి తప్పి ఉంటుందనుకున్నాడు. మగవాడు, ధీరుడు తనకే ఇలా ఉంటే స్త్రీ కదా ఆమె ఎంత భయపడుతోందో అనుకున్నాడు.  అందుకే  తన సౌందర్యాన్ని  కళ్ళార్పకుండా చూస్తున్న వరూధినిని " ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ" అంటూ  ప్రశ్నించాడు.  

ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ యొంటి చరించెదోటలే
కివ్వనభూమి భూసురుడ నే బ్రవరాఖ్యుఁడఁ ద్రోవతప్పితిం
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబుఁజేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
 (ఇది పెద్దనగారి పద్యం)

ఇలాంటి వనభూముల్లో ఒంటరిగా భయంలేకుండా తిరుగుతున్నావు ఎవరు నీవు అని అడిగాడు. తాను ప్రవరాఖ్యడనని, చెప్పాడు. అప్పటికే సిద్ధుడు ఇచ్చిన పసరు మహిమతో పుణ్యక్షేత్రాలయిన కాశీ ప్రయాగలాంటి జనసమ్మర్దం ఉన్న చోటికి వెళ్ళకుండా ఒంటరిగా ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చానో అనే అపరాధ భావం పీడిస్తూ ఉంది అతనికి. అందుకే " గ్రొవ్వున నిన్నగాగ్రమునకు జనుదెంచి" అని తనని తాను తిట్టుకున్నాడు. ఇక ఇంటికి వెళ్ళే దారి ఏమిటో ఆమె చెప్పగలిగితే ఆమెకు శుభం కలుగుతుందని  బ్రాహ్మణ సహజమైన లక్షణంతో ముందుగానే దీవిస్తాడు ప్రవరుడు.

కానీ అప్పటికే ప్రవరుడి సౌందర్యం చూసి మతి పోగొట్టుకుంది వరూధిని.  ఇల్లు చేరాలనే అతని ఆత్రుతని, కంగారుని పట్టించుకోకుండా వేళా కోళం చేయడం ప్రారంభించింది.

ఇంతలు కన్నులుండ దెరువేవరి వేఁడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులేకడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్ (పెద్దనగారి పద్యం)

"ఇంత పెద్ద  పెద్ద కళ్ళు పెట్టుకుని చూస్తూ  దారి తెలియలేదంటావేం,
 ముందు నీవు నడిచి వచ్చిన దారి  ఏంటో నీకు నిజంగా తెలియదా ఏమిటి. ఒంటరిగా ఉన్న స్త్రీ కనిపిస్తే పలకరించడానికి నెపం వెతుకుతున్నావు గానీ " అంటూ నర్మగర్భంగా మాట్లాడింది.

"ఎంతమాట! ఈ ప్రవరుడట్టి వాడు కాడే"  అని ఆమె ఆరోపణలకు ఆశ్చర్యపోయాడు ప్రవరుడు. "ఆహా! అడుగకనే నీపేరు చెప్పిన ఆ తీయని నోటితో- నా పేరడగనైతివే. వరూధిని. అప్సరో శిరోమణి.  దివినుండి ఈ భువికి దిగివచ్చినాను.నీ మదన రూపమ్ము నే మెచ్చినాను –మనసిచ్చినాను "

 అంటూ సూటిగా అపర మన్మధుడి లాంటి అతని రూపం తనని ఎలా సమ్మోహన పరిచిందో వివరించి తన ప్రేమను వెల్లడించింది వరూధిని. ప్రవరుడు ఉలిక్కిపడ్డాడు. "వరూధినీ"  అంటూ ఆమెను వారించడానికి ప్రయత్నించాడు. ప్రవరుడి వారింపు ఆమెకు తొలి ప్రేమపలుకుగా తోచి వలపు మరింత రగిలించింది.


"ఆహ...ఎంత కమ్మని పిలుపు!! ఎన్ని మరులను గొలుపు" అంటూ పరవశించింది. "ఈ పూల పొదరింట చూపించు నీ వలపు"
 అంటూ అతనిని తన ప్రేమసీమకు ఆహ్వానించింది.

ప్రవరుడు ఎంతో బాధపడ్డాడు."శ్రీహరీ!! శ్రీహరీ!!  అపచారము! అపచారము!"
అని భగవన్నామ స్మరణ చేసాడు. 
"కలనైనా పరకాంతను తలచియైనా ఎరుగని వాడను. నిత్యాగ్ని హోత్రిని, నిష్టా గరిష్టుడను" అన్నాడు.అంతటి ధర్మనిష్ఠ గల తనపై వలపు తగదన్నాడు. 

వరూధిని పకపకా నవ్వింది. "ఓ అభినవ మదనా! నీ యజ్ఞయాగములు, ఈ జపతపములు- స్వర్గసౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీముందు నాయందు లభింపనుండగా ఆలసింతువేల? అనుభవించ రావేలా!"
 అంటూ మంచి లాజిక్ ఉన్న ప్రశ్న వేసింది. మరణించాక దొరికే ఆ స్వర్గసౌఖ్యాలన్నీ జీవించి ఉండగానే తన పొందులోనే అనుభవించవచ్చు కదా అంది.
ప్రవరుడు "శ్రీహరీ  శ్రీహరీ" అని ఆమెనుంచి దూరంగా తప్పుకోవడానికి ప్రయత్నించాడు.

"ఓ సుందరా!!నేనోపలేనురా – ఈ మరుని తొందరా"అంటూ విరహంతో ఆపసోపాలు పడసాగింది వరూధిని.
"నిట్టూర్పు సెగలతో కందెను నా అధరము
ఎదపొంగులతో సడలెను నీవీ బంధము
మేనిలోన చెలరేగెను కానరాని తాపము
ఇకనేను సైపలేను ఈ విరహ దాహము
అంటూ ప్రవరాఖ్యుడిని కౌగలించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు దూరంగా తప్పుకోవడానికి ప్రవరాఖ్యుడు ప్రయత్నించడంతో ఆమె నేలమీద పడిపోయింది. అలా పడడానికి కారణం తన తొందరపాటే అని వరూధినికి తెలిసినా ప్రవరాఖ్యుడిని చూపిస్తూ-

పాటునకింతులోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ
ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట భవన్నఖాంకురము సోకె .....
కనుంగొనుము  అకట! 
వనిత తనంతట తాను వలచి వచ్చిన చుల్కన గాదె ఏరికిన్!!

 అంటూ తనమీద జాలి కలిగేలా జాలి జాలిగా ఏడ్చింది వరూధిని. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన పెద్దనగారి పద్యంలోని మొదటి రెండు పాదాలు మాత్రం తీసుకున్నారు. వరూధిని ఎలా ఏడ్చిందో చెప్పే ఆ పాదాలకు బదులుగా సంభాషణకి అనుగుణమైన వాక్యాలు చేర్చారు సినారె.  ఆ పద్యంలో  నీ గోళ్ళు గుచ్చుకున్నాయి ఇక్కడ అంటూ ప్రవరుడికి వరూధిని     ఇచ్చోట అని ఒకసారి చూపిస్తే  సినారె గారి వరూధిని ఓ మూడు సార్లు ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట అంటూ చూపిస్తుంది. నాటకం కాబట్టి పాత్రకి జీవం పోసాయి ఈ మూడుసార్లు పలికిన మాటలు.

  
పెద్దన ముందు పద్యాలలో అన్న మాటలని ఇక్కడ కలిపి, అకట వనిత తనంతటతాను వలచి వస్తే  ఎవరికైనా చులకనే కదా అని ఇక్కడే వరూధినితో అనిపించారు.

ఇల్లు చేరే దారి చెబుతుందేమో అని ఆశగా ఆమె వద్దకి చేరిన ప్రవరాఖ్యుడికి అర్థమైపోయింది. ఇక ఆమె నుంచి తనకు ఏసహాయము రాదని. అందుకే ఆమె కల్లబొల్లి ఏడ్పులను వినిపించుకోలేదు. నిత్యం తాను ఆరాధించే దైవం, త్రికాలాలలోను తాను ఆహవం చేసే అగ్నికి అధిపతి అగ్ని దేవుడిని ప్రార్థించాడు.

దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండ నేనిఁ పరదార ధనాదుల గోరనేని స
న్మానము తోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన గ్రుంగకయ మున్న రయంబున హవ్య వాహనా
(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ సాయంత్రం లోపల తనను ఇల్లు చేర్చమని ప్రార్థించాడు. అతని విన్నపాన్ని మన్నించి అగ్ని దేవుడు అతనిని అరుణాస్పద పురంలోని  నివాసానికి చేర్చాడు.ఇక్కడితో ప్రవరాఖ్యుడి కథ అయిపోయింది నిజానికి.
కానీ కాదు. అసలు కథ ఇంకా ఇప్పుడే మొదలైంది వరూధినికి.

"ఏనాటినుండో వరూధినిపై మక్కువ పడ్డ గంధర్వుడు( అతని పేరు కలి) ఈ అవకాశాన్ని  పురస్కరించుకుని  ప్రవరుడి రూపం దాల్చి వరూధిని వద్దకు వచ్చాడు. 
ఆ మాయా ప్రవరుని తిలకించి పులకాంకిత యైన వరూధిని "


"నీవేనా స్వామీ నీవేనా
ఇది నిజమేనా మరి కలలోనా "
అనుకుంటూ  మైకంలోంచి లేచింది వరూధిని.

"ఏలరా ఈ చలమేలరా, ఏలరా ఇక  నన్నేలరా
పాల వెన్నెల నురుగుల చెరసాలలో- మాలతీ లతా నికుంజాలలో
ఏలరా ఇకనైనా ఏలరా"
అంటూ ప్రవరుడిని బ్రతిమాలడం ప్రారంభించింది.
ఏలరా ఈ చలమేలరా  అనే ఈ వాక్యాలు మనకు జావళీగీతాలలో తరచు కనిపిస్తాయి. (చలము అంటే ఆలస్యం). ఇక్కడ సినారె ఏలరా అంటే ఎందుకురా అని ఒక అర్థంలో ఒకసారి, ఏలరా అంటే తనను ఏలుకోమని మరో అర్థంలోను చక్కగా వాడారు.

వరూధినిని కోరి వచ్చాడు మాయా ప్రవరుడు. అయినా వెంటనే వప్పుకుంటే తన సంగతి తెలుస్తుందేమో నని అనుమానించాడు కాబోలు. బెట్టు సాగించాడు ఆ మాయా ప్రవరుడు.

"నీ వెక్కడా  నేనెక్కడా
 భువి ఎక్కడా దివి ఎక్కడా
ఆ నింగికి ఈ నేలకు ముడి పడే దెట్టులా"
 అంటూ తనకి ఆమెకి ఉన్న అంతరాలను వివరించడానికి ప్రయత్నించాడు. 

"నీ కనులు కనికరించితే మనసు సమ్మతించితే
దివిని మరచి భువినే తలచేనురా
ఈ భువినే ఆ దివిగా తలచేనురా "
అంటూ తను ఈ భూలోకాన్నే తన స్వర్గలోకంగా ఊహించుకుని అతనితో గడపగలనని చెప్తుంది వరూధిని. అతని పై ఆమెకు గల ప్రేమకు నిదర్శనం ఈ మాటలు.

"గాలి తాకిడికే కందే నీ చెక్కిళ్ళూ
పూల తొక్కిడికే  బొబ్బలెక్కే అరికాళ్ళూ
ఇంతటి సుమకోమలివే అంతటి స్వర్గాలు వీడి
ఎటుల నిలువ గలవూ ఈ లోకంలో నరలోకంలో!!

అంటూ వరూధిని సౌందర్యాన్ని ప్రశంసిస్తాడు మాయా ప్రవరుడు. ప్రవరుడు దారికొస్తున్న సూచనలు కనిపించాయి వరూధినికి. మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడేమోనని భయపడింది. అందుకే

"నేను నీ దాననైనా చాలురా!!
 నీవు నావాడవైతే పదివేలురా !!

అంటూ అతడిని చేరింది. నీదాననైనా చాలురా అంటే ఇక్కడ వరూధిని ప్రవరుడికి తనని తాను సమర్పించుకుంటోందన్నమాట. నీవు నావాడవైతే పదివేలురా అంటే ప్రవరుడు కూడా పూర్తిగా వరూధిని పట్ల అనురక్తిని పెంచుకుని ఆమెకు తన మనస్ఫూర్తిగా తనని సమర్పించుకోవడం అన్నమాట. ఈ మాటలు చాలా చమత్కారంగా అనిపించారు వరూధినితో సినారె. ఆమెకు ప్రవరుడి పట్ల కలిగిన అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి ఈ మాటలు.

"నీ పద ధూళిని నిలిచిన నాడు 
నరకమైన అది నందనవనమేరా"
 అంటూ ఆ మాయాప్రవరుడిని తను ప్రేమించిన ప్రవరాఖ్యుడిగానే ఊహించి అతనికి తన జీవితాన్ని కానుకగా సమర్పించుకుంటుంది.

భిన్న లోకాలలో జీవిస్తున్న, భిన్న ప్రవృత్తులు కలిగి ఉన్న ఈ వరూధినీ ప్రవరాఖ్యుల ఇతివృత్తం మనుచరిత్రలోమను సంభవానికి కారణమైంది. వరూధిని గర్భం దాల్చగానే,  ఒకరోజు - తనకు పసరు రాసిన సిద్ధుడు కనిపించాడని, తనకోసం అందరూ ఎదురుచూస్తున్నారని, చూసి వస్తానని, అప్పుడప్పుడూ వస్తూ ఉంటానని చెప్పి మాయా ప్రవరుడు – ప్రవరాఖ్యుడిగానే నటించి వరూధిని నుంచి దూరమయ్యాడు. వరూధినికి ఎప్పటికీ అతను మాయారూపుడని తెలియనే తెలియదు. అప్సరస కావడం వలన నచ్చినవాడిని కోరుకోవడం ఆమెకు ధర్మమే. ఏకపత్నీ వ్రతం, సదాచారం,వైరాగ్యం ప్రవరుడి ధర్మం. అలాంటి ప్రవరుడిలోని అతిలోకసౌందర్యాన్ని చూసి మోహించి అతనినే  ఊహిస్తూ ఆమె జీవించడం వలన అతని ధర్మతేజపు  అంశ  స్వరోచి కుమారుడు మనువుగా రూపెత్తింది.

భక్తి వైరాగ్య సంపన్నుడిగా, విష్ణువును సాక్షాత్కరింపజేసుకున్న గొప్పభక్తుడిగా, సకల భువన రక్షాదక్షుడిగా, ధర్మ స్వరూపుడుగా మనువు గౌరవాలందాడు. మానవలోకంలోనే ఉన్నా మానవాతీతులుగా కనిపించే మనువులకు మూల పురుషుడు స్వారోచిష మనువు. ఈ మనుసంభవమే మనుచరిత్ర. ఆ సంభవానికి పూర్వగాథే ఈ వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం.

రసాభాస కావలసిన గాథని, రసవత్తరమైన కథాంశంగా తీర్చిదిద్దిన పెద్దనగారి ఈ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సాంఘిక చిత్రం కోసం అందమైన నృత్య నాటకంగా సరస సంభాషణలతో రసవత్తరంగా  తీర్చిదిద్దిన మన            సినారె – భళారే.

పాట రచన   సి. నారాయణరెడ్డి.

గానం          ఘంటసాల, సుశీల, ఎన్ .టి. రామారావు, వాణిశ్రీ,   
      ఈ అంతర్నాటకం రచన శ్రీ డా.        సి.నారాయణరెడ్డి.
  ఏ.పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బి.వి. ప్రసాద్.

































































21 February 2012

గిరిజా కల్యాణం - సంగీత సాహిత్య సమ్మేళనం


రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి రంగులలో చిత్రించబడిన తొలిచిత్రం. దర్శకుడు వేదాంతం రాఘవయ్య.లలితా శివజ్యోతి బేనర్ పై ఎ.శంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం.

సినిమాలో రహస్యం ముందుగానే  బహిరంగ రహస్యంగా  తెలిసిపోవడం వలన ప్రముఖనటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో  వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం  మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంది. సందర్భానుగుణంగా, కధోచితంగా బోలెడు పాటలు, పద్యాలు ఈ సినిమాలో వీనులవిందు కలిగిస్తాయి. వీటిలో మణిపూస గిరిజాకల్యాణం - నృత్యనాటకం.

రహస్యం సినిమా డీవీడీలు సీడీలు రూపంగా వచ్చినప్పుడు కేవలం ఈ గిరిజా కల్యాణం ఎలా చిత్రించబడిందో చూద్దామనే కోరికతో ఎందరో కొనుక్కున్నారు. కానీ ఆ చిత్రంలో అన్ని పాటలు ఉన్నా గిరిజాకల్యాణం మాత్రం మనకు కనిపించదు. తీవ్రమైన నిరుత్సాహం మనసును ముప్పిరిగొని  ఆశాభంగం కలిగిన వారెంతమందో.

ఈ గిరిజా కల్యాణం మనకి  సినిమాలో కూచిపూడి భాగవతుల నృత్య ప్రదర్శనగా మనకి కనిపిస్తుంది. ఆ సినిమా టైటిల్స్ లో  నృత్య దర్శకులుగా  వెంపటి సత్యం, హీరాలాల్ వేదాంతం రాఘవయ్యగార్ల పేర్లు కనిపిస్తున్నాయి. మరి ఈ నృత్యనాటకానికి దర్శకత్వం వహించిన వారు ఎవరో. బహుశః సూత్రధారిగా కూడా ఈ నృత్యరూపకంలో కనిపించే వేదాంతం రాఘవయ్యగారే   ఈ రూపకానికి నృత్య దర్శకత్వం చేసి ఉంటారేమో. ఘంటసాల, మాధవపెద్ది, మల్లిక్, రాఘవులు, సుశీల, పి.లీల,  వైదేహి, సరోజిని,పద్మ, కోమల గానం చేసారు.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత.
ఘంటసాలగారు సంగీత రచయిత.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు గొప్పకవి. అంతే కాక గొప్ప కథారచయిత. ఉషాకల్యాణం అనే సినిమా కోసం ఈ గిరిజా కల్యాణ ఘట్టాన్ని గేయంగా రాసారు మల్లాది. కానీ ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన  ఆయన రచన కేళీగోపాలమ్ నవలలో  ఈ గేయం ప్రచురించబడి తెలుగువారిని ఆకర్షించింది.  ఈ  ఉషా కల్యాణం నాట్యరూపకంలో  కొద్దిమార్పులు చేసి రహస్యం సినిమాకి వినియోగించారు దర్శక నిర్మాతలు.

ఈ పాట సినిమాలో రికార్డు కావడానికి ముందే ఘంటసాలగారు ఈ గిరిజా కల్యాణాన్ని స్వరపరిచి ఆలపించడం ఓ గొప్ప విశేషం.  కంచి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. ఆయన ప్రీతికోసం ఉత్సవనిర్వాహకుల ఆహ్వానం మేరకు ఘంటసాలగారు తన బృందంతో ఈ గిరిజా కల్యాణాన్ని ఆలపించారు. ఇందులో ఫిమేల్ వాయిస్ మనకు వినిపించదు. అది కూడా ఘంటసాలగారే ఆలపించారు. ఈ ప్రైవేటుగీతంలో పాటలో ఘంటసాలతో మనకు వినిపించే ఒక స్వరం  తిరుపతి రాఘవులుగారిది  కాగా, మరొక స్వరం   పట్రాయని సంగీతరావుగారిది. సంగీతరావుగారు  రాగాలాపనతోను, హార్మోనియం పైన, రావూరి వీరభద్రం వయొలిన్ పైన, ఉలిమిరి లలితప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో సహకరించారు. ఈ పాటలో సినిమాలో మనం వినని చరణాలు కూడా వినవచ్చు. అంతేకాక సంభాషణల మధ్య అనుసంధానంగా ఉండే వాక్యాలు కూడా ఈ పాటలో వినిపిస్తాయి. 

ఆలిండియా రేడియో, హైదరాబాద్ వారు రికార్డ్ చేసి ప్రసారం చేసిన ఆనాటి కార్యక్రమంలోని కొన్ని భాగాలను ఈ అపురూపమైన వీడియో  లింక్ ద్వారా వినవచ్చు. (updated on 07/09/2020)



గిరిజా కల్యాణం
తారకాసుర సంహారంకోసం తపోనిష్ఠలో ఉంటాడు శివుడు.  పరమశివుని భర్తగా పొందడానికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన గిరిజ (పార్వతీదేవి) తపోనిష్ఠలో ఉన్న ఈశ్వరుని కనుగొని అతనిని తన సేవలతో ఆరాధిస్తుంది. శివుడి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు మన్మధుడిని పంపుతాడు. మన్మధుడు పంచ బాణుడు. ప్రణయానికి అధిదేవత. పార్వతీదేవికి సహాయం చేస్తానంటూ ఆమె వారించినా వినకుండా ఈశ్వరుడిపై పూలబాణాలు వేసి అతని మూడో కంటి చూపుతో భస్మం అవుతాడు. శివుడి అనుగ్రహంతో తిరిగి ప్రాణం పోసుకున్నా రూపంలేకుండా భార్య రతీదేవికి మాత్రం కనిపించే విధంగా వరం పొందుతాడు. శివపార్వతులు కల్యాణంతో ఐక్యమవుతారు.  
ఇది ఈ కథాత్మక గేయానికి వస్తువు. ఈ వస్తువును సినిమాలో భాగంగా కూచిపూడి నృత్యనాటికగా రూపొందించబడింది. 

కూచిపూడి నృత్యం అంటే సంగీత, సాహిత్య, నాట్య సమాహార కళ. అన్నిటికీ సమ ప్రాధాన్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గిరిజాకల్యాణం నృత్యరూపకంగా అందుబాటులో లేకున్నా తెలుగు హృదయాలలో సందడి చేయడానికి ముఖ్యమైన విశేషం మల్లాదివారి సాహిత్యపు బంగారానికి ఘంటసాలగారు అద్దిన స్వరపరిమళం.


తెలుగు భాషలోను, భావంలోను ఎన్నో కొత్తపోకడలు రుచిచూపించిన మల్లాది వారి కలంలో ఈ గిరిజా కల్యాణ ఘట్టం మనను ఎంతగానో అలరిస్తుంది. 

అచ్చ తెలుగుమాటలతో తెలుగువాళ్ళ జీవితాలలోని ఎన్నెన్నో ఘట్టాలను రమణీయమైన భావాలతో రసభరితమైన పద ప్రయోగంతో ఆవిష్కరించారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. వారి సమయోచిత పదప్రయోగం గురించి, ఎన్ని వందలసార్లు చెప్పుకున్నా తనివితీరేది కాదు. అది కథ అయినా, సినిమా పాట అయినా మాటలకుండే ధ్వని,  ప్రయోగంలో మనసులో కలిగించే సద్యస్ఫూర్తిని గ్రహించిన మహా మాటల మాంత్రికుడు మల్లాది. 

ఆ పాటలలో కనిపించే ప్రయోగ శీలత్వాన్ని  వాక్కు, మనసు, జీవన సంస్కారాల త్రివేణీ సంగమంగా అభివర్ణించారు విమర్శకులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.
పాట నిర్మించేతీరులో దక్షిణాంధ్రవాగ్గేయకారుల సంస్కారం , ఆ యుగానికి చెందిన తెలుగు మాటల గమ్మత్తులు, జానపద, శృంగార పదాలలో ఉండే చమత్కారం కనిపిస్తాయని,  సమకాలిన తెలుగు సినిమా కవులలో మల్లాది హృదయసంస్కారం దక్షిణాంధ్రయుగానిదైతే భాష, భావ సంస్కారాలు అత్యాధునికమైనవి అన్నారు ఆయన.

కూచిపూడి నృత్య ప్రబంధంగా, యక్షగాన ప్రక్రియలో తీర్చిదిద్దిన ఈ గేయంలో మల్లాది గారు ప్రయోగించిన తెలుగు మాటలు ఎంత గొప్పగా సమయోచితంగా హంగు చేస్తాయో ఓసారి చూద్దాం. 

కూచిపూడి నాట్యం అత్యంత ప్రాచీనమైన నృత్యగాన సమాహార కళ. కాలక్రమంలో యక్షగాన ప్రక్రియ లక్షణాలను కూడా సంతరించుకుంది. దశరూపకాలలో చెప్పబడిన వీధి నాటక ప్రక్రియ లక్షణాలు కూచిపూడి నాట్య ప్రయోగంలో కనిపిస్తాయి. సంవాదాత్మకమైన సంగీత ప్రధానమైన నృత్య ఫణితిని సంతరించుకున్న పరిపూర్ణ రూపమైన నృత్యనాటకంగా ఈ గిరిజా కల్యాణం రూపొందించబడింది. 

సంప్రదాయ కూచిపూడి నృత్యాలలో కనిపించే అంశాలన్నీ మల్లాది వారు రచించిన ఈ గిరిజా కల్యాణం నాటకంలో కనిపిస్తాయి.
కూచిపూడి నృత్యనాటకాలలో మొదట పరాకు చెప్పడం అంటే ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ (సాధారణంగా సరస్వతీదేవి స్తుతిగా ఉంటుంది) నాటకాన్ని ప్రారంభించడం ఉంటుంది. సూత్రధారి నాటకాన్ని ప్రారంభంలో ఇష్టదేవతా స్తుతి చేయడం ఆ తరువాత నాటకం చూడడానికి వచ్చిన రసికులను ప్రశంసించడం తరువాత కథాంశాన్ని ప్రస్తావించడం, ఆ వెంటనే కథలో పాత్ర ప్రవేశం ఉంటుంది. 

 నృత్యరూపకాలలో ప్రారంభం లో పరాకు చెప్తూ సూత్రధారుడు ప్రవేశిస్తాడు. దేవతా స్తుతితో ప్రార్థనతో ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది.

అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

 అంటూ కళలకి అథి దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతిస్తారు.

తరువాత ప్రతి కార్యక్రమానికి ముందుగా అవిఘ్నమస్తు అనిపించుకోవడం కోసం గణపతి ప్రార్థన.
ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా
బహుపరాక్ బహుపరాక్

ఆ తరువాత గజాననుడి తమ్ముడు షడాననుడు(ఆరు ముఖాలున్నవాడు) – కుమారస్వామిని ప్రార్థిస్తారు.

చండభుజాయమండల దోధూయమాన వైరిగణా –షడాననా.
ఈ దైవ ప్రార్థనతో పాటు  కూచిపూడివారి గ్రామం చుట్టుపక్కల ఉండే దైవస్తుతి –

విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కూచిపూడి గ్రామం. కూచిపూడి గ్రామం పేరు ఒకప్పుడు కుశీలపురం అని, కుశీలపురం కుచేలపురం అయి కూచెన్నపూడి కూచిపూడి గా మారిందని చరిత్రకారులు చెప్తారు. ఈ స్తుతిలో మనకు కూచిపూడి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధదేవాలయాలలోని మూర్తుల స్తుతి కనిపిస్తుంది.

మంగళాద్రి నారసింహ (మంగళగిరిలోని నరసింహస్వామి), బంగరుతల్లి కనకదుర్గ (విజయవాడ కనకదుర్గ),
 కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ( కృష్ణానదీతీరంలోని కూచిపూడి గ్రామంలోని గోపాలస్వామి) అంటూ దైవస్తుతి చేస్తారు.

దైవస్తుతి అనంతరం కథ ప్రస్తావన – “అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా”  అంటూ కథలోకి ప్రేక్షకులను ఆహ్వానిస్తారు. 

“లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే” అంటూ నాటకాన్ని వీక్షించడానికి వచ్చిన  ప్రేక్షకుల కళా ప్రియత్వాన్ని మెచ్చుకుంటూ తమ కళలోని సారస్యాన్ని అనుభవించి పరవశించమంటారు. పదింబదిగ (పదియున్ + పది+ కాన్)అంటే చక్కగా, పూర్తిగా అనే చక్కని అర్థాన్నిచ్చే అచ్చ తెలుగు పదం ఇక్కడ వేసారు శాస్త్రిగారు.

 “ఈశుని మ్రోల హిమగిరి బాల- కన్నెతనము ధన్యమయిన గాథ”  ఈ కథా వస్తువు గా పరిచయం చేస్తారు. కన్నెగా ఈశ్వరుని చేరిన హిమవంతుడి కూతురు ఏ విధంగా ధన్యచరిత అయిందో తాము చెప్పబోతున్నామని, అవధరించ(విన)మంటారు.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ,
ఆ కోపీ-
కాకలు తీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమైన ప్రబంధము –

నిప్పుల ఎర్రదనాన్ని చూపే పదం కణ కణ. అటువంటి ఎర్రని కోపంతో ఉన్న ఆ కోపి అయిన శివుడు  ఆ కాముని రూపాన్ని అంటే మన్మధుడి శరీరాన్ని మసిచేసాడు. కానీ   ఆగ్రహం చల్లారి కాక (వేడి /తాపం) తీరగానే కనులు తెరిచాడు. తనను తెలుసుకున్నాడు. “తన లలనను పరిణయమైన”  అనే పదం ఎంతో చమత్కారంగా అనిపిస్తుంది. తన లలన అనడంలో- ఈశ్వరుడు పార్వతి ఆదిదంపతులు కదా. వారు ఎప్పుడో ఒకరికి ఒకరు చెందినవారు. ఇప్పుడు  ఈ సందర్భంలో మళ్ళీ పెళ్ళిచేసుకొని జంటగా మారారు. అందుకే తనలలనను పరిణయమాడిన కథను వినండి అంటాడు సూత్రధారుడు.

ఇక్కడితో తెరమీద సూత్రధారుడి కధా వస్తువు పరిచయం అయింది. ఇక పాత్రప్రవేశం.

తెర పక్కకు తొలగుతుంది. పార్వతీదేవి  చెలికత్తెలతో ప్రవేశిస్తుంది. 
రావో రావో లోల లోల లోలం బాలక రావో....
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

ఇక్కడ పార్వతీదేవి పాత్రను పరిచయం చేసే వాక్యాలు ఇవి.
రావో రావో  అంటూ పార్వతీదేవిని పిలుస్తారు చెలులు.

లోల లోల లోలం బాలక  రావో...రావో అంటే  లోల లో ల అంటే అలా అలా కదులుతూ ఉన్న లోలంబమైన అలకలు కల అంటే 
కదులుతూ ఉన్న అలకలు అంటే ముంగురులు  కలిగిన దానా, అంటూ పార్వతీదేవి ముఖ సౌందర్యాన్ని ప్రశంసిస్తారు. 

లోల అనే పదం ఇక్కడ మూడుసార్లు ప్రయోగించారు.అందమైన ముంగురులతో ఉన్న స్త్రీని వర్ణించడానికి  ఇంత అందంగా ఒకే పదాన్ని అన్నిసార్లు వాడుతూ  ఆ అందాన్ని ద్విగుణీకృతం చేసారు మల్లాదిగారు.

లోకోన్నతుడైన అంటే  లోకాలన్నిటిలోనూ ఉన్నతమైన వాడు -పర్వతరాజు  హిమవంతుడు, అతని భార్య మేనకాదేవి, వారి తనయ (పుత్రిక)  పార్వతీదేవి.  రాజసులోచన, రాజానన అంటే ఇక్కడ రాజు అంటే చంద్రుడు అని తీసుకుంటే చంద్రుడివంటి ముఖం కలిగినది అయిన పార్వతిని వర్ణించే సార్థక పదప్రయోగాలు ఇవి.

పార్వతీదేవి ఈశ్వరుడి వద్దకే  వెళుతోందని తెలిసినా వారు ఆమెని ఎక్కడకు అని  ప్రశ్నిస్తారు. తద్వారా మనకు కథా గమనం తెలుస్తుంది.

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే

“అందమైన మోములో లేలేత నవ్వులు చిందిస్తూ హంసవలె వయ్యారంగా నడుస్తూ ఓ కలికీ ( అందమైన అమ్మాయి) ఎక్కడికే నీ ప్రయాణం” అని ప్రశ్నిస్తారు.

మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

మానస సరోవరం దగ్గర మణులల ప్రకాశించే పద్మదళాలమధ్య కూర్చుని రాజహంస( యోగి కి మరో పదం)లాగ ఉంటే అతని వద్దకు వెళ్తున్నానని సమాధానం చెప్తుంది పార్వతి.

ఇక్కడ మానససరోవరం దగ్గర ఈశ్వరుడు ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాని తపోనిష్టలో ఉన్న ఈశ్వరుడి గురించి,  మనసనేది సరోవరమైతే అందులో రాజహంసలా ప్రకాశించే ఒక యోగి  అనే ఒక లోతైన వేదాంతవిషయాన్ని గూఢంగా పలికించారు మల్లాది. పైగా ముందు చెలుల మాటలో కలహంస అనే పదం స్త్రీ అయిన పార్వతీదేవికి వేస్తే ఈశ్వరుడి వర్ణనలో రాజహంస అనే పదం సరిగ్గా తూగుతో నిలిచింది కూడా. అదే సార్థక పద ప్రయోగం అంటే.

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే

అంటూ వావిలిపూలదండలు పట్టుకుని వయ్యారపు నడకలతో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తారు.

కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే 

అంటూ పార్వతి కైలాసంలో కొలువై ఉన్న దేవదేవుడి సన్నిధికి వెళ్తున్నానని, త్వరలోనే అతను తన ప్రేమనిండిన కనులతో చూసి ఏలుకోబోతున్నాడని చెప్తుంది.

ఈ సంభాషణ పూర్తవుతూనే మన్మధుడి పాత్ర ప్రవేశిస్తుంది.

తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ   - అంటూ మన్మధుడు పార్వతీ దేవి ఈశ్వరుని కటాక్షపు వీక్షణాలకోసం పడిగాపులు పడనక్కరలేదని, తను సహాయం చేస్తానంటాడు.

అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా 
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...తగదిది తగదిది తగదిది

ఇక్కడ మన్మధుడి ఔద్ధత్యానికి, అహంకారానికి తగిన మాటలు ఎన్ని వేసారో మల్లాది చూడండి. బిందు డకారం ( 0డ) ప్రయోగంతో అర్థ భేదం కలిగిన పదాలను చమత్కారంగా వాడారు.

పార్వతీదేవి వంటి రాజకుమారి, ఉత్తమవంశంలో జన్మించిన (పర్వతరాజు కూతురు కనుక) స్త్రీ, తనకు తానుగా తన భర్తను వెతుకుతూ వెళ్ళడం తగని పని అంటాడు మన్మధుడు. పైగా, తనంతటివాడు, గొప్ప ఆయుధాలు కలిగిన వీరుడు ఆమెకు అండగా ఉండగా అంటూ తన ఆయుధాల పదనును చెప్తాడు. విరిశరములు అంటే మన్మధుని పూల బాణాలు. అవి ఎంత పదునైనవో  అతనికి తెలుసు. పూలబాణాలు కదా అని తేలిగ్గా తీసేయవద్దనే హెచ్చరిక ఇక్కడ కనిపిస్తుంది.

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి -నీ దాసు చేయనా

అంటూ తన శక్తిని చాటుకుంటాడు. పార్వతి ఎవరిని కోరుకుంటోందో అతను “ఎంతటి ఘనుడైనా” సరే తన “కోలనేయనా” అంటే తన బాణాన్ని వేసి, “సరసను కూలనేయనా” అంటే పార్వతి చెంతకు తీసుకువచ్చి పడేస్తాను అంటాడు. “కనుగొనల నన మొనల” అన్న పదంలో మన్మధుని ఆయుధాలైన పూల మొగ్గలతో “గాసిచేసి” అంటే నాశనం చేసి “నీ దాసు”డిని చేస్తాను - అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.

మన్మధుడి వాచాలత్వాన్ని చూసి పార్వతీదేవి సహించలేకపోతుంది. తన దైవాన్ని పాదాలచెంతకు తెచ్చి పడేయగలనంటూ అహంకారంతో అతను అంటున్న మాటలను ఖండిస్తుంది.
 అందుకే-

ఈశుని దాసుని చేతువా -అపసద!! అపచారము కాదా!!
కోలల కూలెడు అలసుడు కాడూ -ఆదిదేవుడే అతడూ !!

తాను ఆరాధిస్తున్న ఈశ్వరుడిని దాసుడిని చేస్తాననడం చాలా తప్పు అని మందలిస్తుంది. “అపసద” అంటే నీచుడా అని అర్థం.  “అలసుడు” అంటే మందమైన బుద్ధిగలవాడు అని అర్థం. “కోలలు” అంటే మామూలు బాణాలు వేస్తే ఓడిపోయి కూలిపోయే సామాన్యుడుకాడని తను కోరుకున్నవాడు,   ఆ ఈశ్వరుడు  ఆది దేవుడని వివరిస్తుంది పార్వతీదేవి, మన్మధుడికి.


సేవలు చేసి ప్రసన్నుని చేయ 
నా స్వామి నన్నేలు నోయీ - నీ సాయమే వలదోయీ...

తను చేసే సేవలతో ఏనాటికైనా ప్రసన్నుడై తనను అనుగ్రహిస్తాడని, మన్మధుడు చేస్తానని చెప్పిన సాయం తనకు అవసరం లేదంటుంది.


ఈలోపున చెలికత్తెలు కూడా మన్మధుడు చెప్పిన మాటలలోని అసంబద్ధతను చెప్తారు.

కానిపనీ మదనా కాని పనీ మదనా !!
అది నీ చేతకానిపనీ మదనా !!
అహంకరింతువ - హరుని జయింతువ !!  
అది నీ చేతకాని పని మదనా .....కానీపనీ మదనా.

ఇక్కడ కాని పనీ అంటే అది చేయకూడని పని అని, నీ చేతకానిపనీ అంటే నీవు చేయగలిగిన పని కాదు అని కొద్దిగా వర్ణ భేదంతో పద ప్రయోగం చేసి  గొప్పఅర్థభేదాన్ని చూపించారు మల్లాదిగారు.

అహంకారంతో హరుడిని జయించడం అనేది తగని పని అని, పైగా ఆ పనికి పూనుకోవడం నీ వల్లకాదనీ చెలికత్తెలు, మన్మధుడిని హెచ్చరిస్తారు.

ఆ హెచ్చరిక విన్న మన్మధుడు ఇక్కడ హుఁ అంటూ హూంకరిస్తాడు వారు  తన శక్తిని సందేహిస్తున్నందుకు.

“చిలుక తత్తడి రౌత “అంటూ మన్మధుడిని సంబోధిస్తూ చెలికత్తెలు మళ్లీ ఇలా అంటారు.

చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో-నీ విరిశరముల పని సరి
సింగిణి పని సరి - తేజోపని సరి - చిగురికి నీ పని సరి మదనా
కానిపనీ మదనా....
మన్మధుడు ప్రణయదేవత. అతను చిలుక వాహనం పైన సవారీ చేసే రౌతు. తాము అతని మంచికోరి చెప్పిన మాటలు వినకపోతే ఏమవుతుందో హెచ్చరిస్తున్నారు చెలులు. తమ మాటలు వినకపోతే పదునైన విరిశరములు అంటూ బీరాలు పలుకుతున్న నీ బాణాల పని ఇక ఆఖరు అని హెచ్చరించారు. చిగురుటాకుల విల్లు సింగిణి కూడా ఇంక నాశనం అవుతుంది. తేజీ పని సరి అనే వాక్యంలో తేజీ అంటే గుఱ్ఱానికి పర్యాయపదం గా చూపిస్తోంది నిఘంటువు. చిలుకను తన వాహనానికి పూన్చాడు కాబట్టి చిలుకపని సరి అని చెప్పారు. చిగురుకు అంటే కడపటికి, చివరకు అని అర్థం. చివరకు అంటే మొత్తానికి నీ పని సరి అని ఈశ్వరుడితో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పి నయానా భయానా చెప్పజూస్తారు చెలికత్తెలు.
కానీ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి తన పరాక్రమం పైన  అచంచలమైన నమ్మకం పెట్టుకున్నవాళ్ళు మంచి మాటలు చెప్తే వింటారా.

 సామగ సాగమ సాధారా -శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా 
అంటూ పార్వతీ దేవి ఈశ్వరుని సన్నిధికి చేరింది.


( ఈ మాటలకు అర్థం నాకు తెలియలేదు. శ్రీ పట్రాయని సంగీత రావుగారిని అడిగి తెలుసుకున్నాను. వారి వివరణ ఇలా ఉంది.


సామగ అంటే సామగానమునకు, సాగమ అంటే ఆగమములు అంటే వేదాలకు ఆధారమైన వాడవు, శారదనీరద అంటే శరత్కాలంలో చంద్రుడి పక్కన ప్రకాశించే తెల్లని మేఘం వంటి రూపం కలిగిన వాడవు, దీనులకు ఆధీనమైనవాడవు,
ధీసారుడు అంటే బుద్ధిబలం కలిగినవాడవు 


అంటూ పార్వతీ దేవి ఈశ్వరుడిని ప్రశంసిస్తూ ప్రార్ధించింది)

ఇవె కైమోడ్పులు            - ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా - ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి          -ఈశా మహేశా

 అంటూ ఈశ్వరుడిని పరిపరివిధాల ప్రశంసిస్తూ  పూలతో పూజలు చేసి వాటితో పాటు తన హృదయాన్ని కూడా అంజలిచేసి సమర్పించుకుంది. అదే సమయానికి ఈశ్వరుని హృదయంలో ప్రణయాస్త్రం వేసి పార్వతికి సహాయం చేసి తన శక్తిని నిరూపించుకోవాలనుకున్న మన్మధుడు పూలబాణాలను సంధించాడు. అవి వెళ్ళి ఈశుని మదిలో గుచ్చుకున్నాయి. తపో భంగమయింది. తన తపస్సుకి భంగం కలిగించిన కారణం ఏదో తెలుసుకున్నఈశ్వరుడు కోపించాడు. వెంటనే తన మూడో కన్ను తెరిచాడు. మన్మధుడు ఆ కోపాగ్నికీలలలో కాలి, మాడి మసైపోయాడు.

మన్మధుడికోసం వచ్చిన అతని భార్య రతీ దేవి విషయం తెలుసుకుంది. తన ప్రాణవిభుడిని రక్షించమని ఈశుని వేడుకుంది.

ఇక్కడ కూడా మల్లాదివారిది బహు చమత్కారం అనిపిస్తుంది.
మన్మధుడు ఈశ్వరుడిని తన బాణాలతో కొట్టి అతనిలో శృంగారభావాలను రేపి విర్రవీగుదామనుకున్నాడు.అందుకే బాణాలు వేసాడు.

 కానీ రతీదేవి ఈశ్వరుడితో ఏమంటోందో చూడండి.
విరులన్ నిను పూజచేయగా - విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ

నిన్ను (ఈశ్వరుడిని) ఒక ఇంటివాడిగా (గేస్తు –గృహస్థు కి వికృతి) చేయడం కోసం పూనుకున్న(దొరకొన్న)  మన్మథుడిని (రసావతారు) చిచ్చరకంటను అంటే  మండుతూ ఉండే మూడవకంటితో చూసి నాశనం చేస్తావా ప్రభూ అంటూ రతీదేవి ఈశ్వరుడిని ప్రశ్నిస్తుంది. పూలతో నీకు పూజచేసి గృహస్థుగా మార్చుదామనుకున్నాడు. ఆయన ఇదంతా చేసింది నీకోసమే కదా. ఉపకారికి అపకారం చేస్తావా అంటూ తన భర్త పనిని సమర్థిస్తుంది.

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
 మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ -పతిభిక్ష ప్రభూ....

“గిరిరాజ కన్య” అంటే పార్వతీదేవి(పర్వతరాజు కూతురు) ని నీవు భార్యగా స్వీకరిస్తావు. మరి మరుడి(మన్మధుని)  సంగతి ఏమిటి? నా మాంగల్యం ఏం కావాలి?  అని ప్రశ్నించి తమని 
రక్షించమని, పతిభిక్ష పెట్టమనీ అర్థిస్తుంది.

పార్వతీదేవి చల్లని తల్లి. లోకాలనేలే మాత. అందుకే మన్మధుడు శివుని కంటిమంటలో కాలిబూడిదయ్యే వేళ “ అంబా! అంబా!(అమ్మా, అమ్మా)” అంటూ పిలిచిన  పిలుపును, అందులోని ఆర్తిని గుర్తించింది. ఇక  భరించలేకపోయింది.

ఈశ్వరుడికి తన తరపునుంచి ఓ మాట చెప్పి రతీదేవి కోరికను మన్నించమంటుంది.

 తనను మన్మధుడు అంబ అంటే అమ్మ అని పిలిచాడు విన్నావా అని ఈశ్వరుడిని అడుగుతుంది.

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో...

తనను మన్మథుడు అమ్మ అని పిలిస్తే మరి తన భర్త అయిన ఈశ్వరుడు అతనికి తండ్రే అవుతాడు కదా.అందుకని జనకుడిగా (తండ్రిగా) భావించి అతనిని కుమారుడుగా చేసుకొని ప్రాణం పోయమని పార్వతీ దేవి బతిమాలుతుంది. ఇక్కడ “అసమ శరుడు” అంటే మన్మధుడు. (మన్మధుడి పుష్పబాణాలు ఐదు. సమసంఖ్య కాని సంఖ్య కదా ‘ఐదు’. కనుక అసమమైన సంఖ్యగల బాణాలు కలిగినవాడు మన్మధుడు అని వ్యుత్పత్తి)

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ !!
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామిన్!!

అంటూ పార్వతీదేవి తన మనసును, తనువును ఈశ్వరుని భావనలో లీనం చేసి ఉన్నానని, అటువంటి గిరి పుత్రి అయిన తనను చేపట్టి ఏలుకోమని కోరుతుంది. తనను పరిపాలించమంటుంది. ఆమె కోరికను మన్నిస్తాడు పరమేశ్వరుడు. మన్మధుడు పునర్జీవం పొందుతాడు.

ఇంకేముంది. తపోభంగం ఎలాగూ అయింది కనుక ఈశ్వరుడు పెళ్ళి కి ఒప్పుకుంటాడన్నమాట.

ముందు బెట్టుచేసి సేవలు చేయించుకుని, మన్మధుని బాణాలు తాకాయన్న వంకతో తపోభంగం చేసుకుని అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు ఈశ్వరుడు. ఆ మాటలను ఎంత చక్కని తెలుగు మాటల్లో చెప్పారో మల్లాది.

బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం

అంటూ జగన్మాతా, జగత్పితల కల్యాణం లోకకల్యాణం గా భావిస్తూ ఈ నృత్యనాటకానికి మంగళం పాడతారు సంప్రదాయబద్ధంగా .

ఇక్కడ సూత్రధారుడు మళ్ళీ తెరపైకి వచ్చి-

కూచెన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం 

అంటూ కూచిపూడిలోని గోపాలదేవునికి జయమంగళ వచనాలు పలికి నాటకాన్ని పరిసమాప్తిచేస్తారు.

కూచిపూడి సంప్రదాయబద్ధమైన నృత్యరూపకానికి తగినట్టుగా  వివిధ ఘట్టాలకు తగిన రాగాలను సమకూరుస్తూ రాగమాలిక పద్థతిలో స్వరపరిచి , తనకు ఎంతో సహజసిద్ధమైన భావయుక్తమైన గానంతో మల్లాది వారి సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు ఘంటసాల.

అందుకే ఇన్నేళ్ళయినా ఇంత పెద్ద పాట అయినా తెలుగు హృదయాలను ప్రతితరంలోను గెలుచుకుంటూనే ఉందీ పాట.

తెలుగును మరో పదికాలాలు బతికించుకోవాలంటే ఈతరం వారు చేయవలసిన ముఖ్యమైన పని, సాహిత్యంలో మాణిక్యాల్లాంటి పద్యాలను, పాటలను ఆధునికపద్ధతిలో సంరక్షించుకోవాలి. పదిమంది కలిసినప్పుడు పాడుకోవాలి. అందులోని పదప్రయోగాల ప్రత్యేకతలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుతరాలవారికి పరిచయం చేయాలి.

"తాళ్ళపాకవారిని(అన్నమయ్య) చదవనిదే తెలుగు రాదు" అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రి.

మల్లాదివారి  పాట అర్థమయిందంటేనే మనకి తెలుగు వచ్చినట్టు.