02 August 2008

పెళ్ళంటే...

పెళ్ళంటే.....
అడిగాను అమ్మని ఊహ తెలిసీ తెలియని వయసులో.
అలవాటుగా ఓ చిరునవ్వు విసిరి బుగ్గలు పుణికి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది.

పాపాయీ.. బొమ్మలపెళ్ళి చేద్దాం వస్తావా- అంది పక్కింటి మీనా.
మళ్ళీ అడిగాను -

పెళ్ళంటే......అడిగాను దాన్ని.
ఏమోనే. అమ్మ లమ్మంతుంది. అన్నాలు,పప్పులు అన్నీ లెడీగా పెట్టేను.
తొందలగా లా... అని పారిపోయింది రా పలకని మీనాక్షి.
ఏమే..పెళ్ళికి వెళ్ళాలి కదా... పట్టు పరికిణీ వేసుకోవూ అడిగింది పిన్ని.
పెళ్ళంటే ......... అడిగాను పిన్నిని.

పిల్లా... నన్ను పెళ్ళాడతావే... నా ఆస్తంతా రాసిస్తాగాని...అన్నాడు అమ్మకి పెదమామయ్య నాకు వరసకి తాతయ్య.
చాల్లే మావఁయ్యా.చిన్న పిల్లతో ఏవిఁటా ముదురు సరసాలూ... కోప్పడింది పిన్ని చనువుగా.
పదో క్లాసులోనే బావతో పెళ్ళికుదిరి శుభలేఖ ఇవ్వడానికొచ్చిన పద్మని అడిగా -
పెళ్ళంటే....
''పెళ్ళంటే పందిళ్ళు
సందళ్ళు తప్పెట్లు
తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్ళు
ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేళ్లు....హా.."
అని (త్రిశూలం) సినిమా పాట పాడేసి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పెళ్ళంటే అన్న సందేహం మళ్లీ ఎప్పుడూ రాలేదు.
అసలా ప్రశ్నే మరిచిపోయానేమో...

కానీ మర్చిపోలేదేమో...
అరవయ్యేళ్ళ పుట్టినరోజు,పెళ్ళి చేసుకుంటున్న వేడుకలో అత్తయ్య పక్కన చేరి అడిగా...
పెళ్ళంటే......
"పెళ్ళంటే ముంగిళ్ళు
లోగిళ్లు ముగ్గులు
ముత్తయిదు భాగ్యాలూ
ముద్దు ముచ్చట్లు మురిసే లోగిళ్లు
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు..."
పమిట చాటునున్న దాచుకున్న, కొత్తగా మళ్లీ కట్టించుకున్న మంగళసూత్రం
బయటకు తీసి కళ్ళకద్దుకుంది  అత్తయ్య....
ఓహో.... అనుకున్నా...
చెప్పొద్దూ..... ఓ మంచి ముహూర్తాన పెద్దలందరూ పచ్చని పందిట్లో ఫెళ్లుమని నా క్కూడా పెళ్ళి చేసారు.
మీనాక్షి,పద్మ,పిన్ని, అత్తయ్య అందరూ వచ్చారు....
పెళ్ళంటే .....అని ప్రాణాలు తీసేదానివి కదే చిన్నప్పుడు... తెలిసిందిగా... అన్నారు.
సిగ్గుల మొగ్గనయ్యాను.
మూడు నిద్దర్లయ్యాక అత్తారింటికి ప్రయాణం కట్టాను. కొత్తపెళ్ళికూతురు భోగం మరో మూడూ రోజులు....
ఓ రోజు అందరికీ ఎలా తెల్లారిందో గానీ.... నా కు మాత్రం భళ్ళున తెల్లారింది.

అబ్బాయి ఆఫీసుకెళ్ళాలమ్మాయ్.... సెలవయిపోయిందిగా.. లే అమ్మా....
అని కుక్కరుగిన్ని, బియ్యం మూట నాకప్పచెప్పేరు మా అత్తగారు.

ఆతర్వాత నాకే బాగా తెలిసింది... పెళ్ళంటే......
"పెళ్ళంటే......
నూరేళ్ళ వంట....

అది వండాలీ.... కోరు(చేసు)కున్న వాడి ఇంట వండాలి.

కూరలనే కోసుకొని, పోపులనే వేసుకొని

వంట నువ్వు చెయ్యాలమ్మా...

వంట ఇంటి కుందేలమ్మా...."
(మీనా సినిమాలో ' పెళ్ళంటే ' పాటవరసలో పాడుకోవలెను...)

 పెళ్ళంటే....... ఇదే అదన్నమాట....

పిపీలికం కథలో చీమకి తానెవరు అని సందేహం కలిగి బ్రహ్మ జ్ఞానం సంపాదించినా ఆ సందేహం తీరలేదుట.
వేదాంతులు దాచిన జీవన సత్యాన్ని తమ శత్రువైన పాము చెప్పడం ద్వారా తెలుసుకుందిట.
మా వారు పాడిన పాట ద్వారా నేనెవరో తెలుసుకొని నేను కూడా  బ్రహ్మ జ్ఞానాన్ని పొందేను మరి...
కానీ కథలో చీమలాగా పాముమీద తిరగబడ్డానా... లేదా... హారిబుల్ సస్పెన్స్ కదూ.....
నాక్కూడా......

20 comments:

 1. ఇలా భయపెట్టేస్తారేంటండి. ఇక్కడ పెల్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు చాల మంది ఉన్నారు. అమ్మాయిలంతా భయపడ్తారు. అబ్బాయిలు కూడా ఎందుకంటే ఇదే ఫీలంగ్ ప్రచారం జరిగితే పెళ్ళి కి అమ్మాయిలు దొరకరు గా?

  ReplyDelete
 2. మంచి ఎత్తుగడ. మొత్తానికి "పెళ్ళంటే నూరేళ్ళ వంట" అని మీరూ సిద్దాంతీకరించేసారన్నమాట!ప్చ్...

  ReplyDelete
 3. అంతేనంటారా సుధారాణి గారూ..?

  ReplyDelete
 4. అమ్మో మురళి గారు ఎంత లోతుగా ఆలోచించారు..
  అబ్బో..:)))))))))))))

  సుధగారు అమ్మో ఇలా పెళ్ళంటె నూరెల్ల వంట అని చెప్పి నిజంగానే భయపెడుతున్నారు..
  నిజం చెప్పాలంటే నేను వంట చాలా బా చేస్తాను.
  కాని తినేవాళ్ళే కరువు...:(

  ReplyDelete
 5. పెళ్ళి గురించి మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఈ విషయంపై నేను భయపెట్టేది కూడా చాలా ఉంది. నా బ్లాగ్‌లో చదవండి. ఏదేమయినాగాని పెళ్ళంటే నూరేళ్ళ తంటా అని అనుభవజ్ఞులు చెపుతారు. http://saradaa.blogspot.com/2008/07/part-1.html

  ReplyDelete
 6. మురళి గారు,
  సరదాకంటున్నారు కానీ..నిజంగా ఎవరైనా భయపడుతారండీ...భయపడి లోకంలో ఎవరు పెళ్ళి మానుకుంటున్నారు చెప్పండి..నాకిలా అవదులే అన్న ఆశకాదూ మనిషిని నడిపించేది...ఏమంటారు.ఏదో చాదస్తంకొద్దీ పెద్దవాళ్ళు చెప్తారు కానీ...

  ReplyDelete
 7. మహేష్ గారూ,
  మీరూ సిద్ధాంతీరించేసారా అంటున్నారే..మీరు కూడా ఒప్పుకున్నట్టేనా..
  పెళ్ళంటే నూరేళ్ళవంట కాదని ఎలా అనుకోమంటారు చెప్పండి.. పొద్దున్న లేవకముందే అంటే రాత్రినిద్రపోకముందే రేప్పొద్దున్న ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం వస్తుంటే..

  ReplyDelete
 8. రాధ గారు,
  పోన్లెండి ఆమాత్రం ధైర్యం ఇచ్చారు.

  ReplyDelete
 9. బాగుందండి మీ వరస nice :)

  ReplyDelete
 10. brahmandangaa undi andi

  ReplyDelete
 11. బాగుంది....కామెడీగా!
  లోతైన అర్ధం కూడా ఉందికదా ఇందులో..

  ReplyDelete
 12. "నాకిలా అవదులే అన్న ఆశకాదూ మనిషిని నడిపించేది"

  చాలా బాగా చెప్పారండి.

  ReplyDelete
 13. హహహ..సుధ గారు.. :D
  మీ బ్లాగ్ కి ఈ రోజే మొదటి సరి వచ్చాను.. :)
  పక్కన పోస్ట్స్ స్క్రోల్ అవుతూ ఉంటె...
  ఇంటరెస్టింగ్ గ ఉంది అని...పెళ్ళంటే తీసాను.. .:D ...
  పెళ్ళంటే వంట అని తేల్చి చెప్పేసారు...బాగుంది మీ ఆన్సర్.. :):)
  నా బ్లాగ్ లో కామెంట్స్ పెట్టినందుకు బోలెడు ధన్యవాదములు.. :)

  ReplyDelete
 14. ఎంత బాగా చెప్పారండి..పెళ్ళంటే వంట గోల..నిజమేనండి..రోబో సినిమా చూసినప్పుడు అనిపించింది..ఇలా వంట చేసే రోబో వుంటే ఎంత బాగుండు అని..

  ReplyDelete
 15. పెళ్ళంటే....నచ్చినందుకు ధన్యవాదాలు. మా చెల్లి(నెచ్చెల్లి అనే పోస్టులో ఉన్న చెల్లి) ఇలా పెళ్ళంటే పాటని నామీద పేరడీ చేసింది. అందులోంచి పుట్టిన టపా ఇది.

  ReplyDelete
 16. @ ప్రవీణ,
  రోబో సినిమాలో లా వంటచేసే రోబో మన సమీప భవిష్యత్తులో చూస్తామనే ఆశలేదు. మన పాపాయిలకేనా ఈ గోల తప్పితే అదే పదివేలు.

  ReplyDelete
 17. @ సుధ
  వంటచేసే రోబోలు లేకపోవడం ఏంటీ? మొగుళ్ళున్నారుగా!

  ReplyDelete
 18. @శరత్ గారు,
  అయితే మీ ఆవిడ చాలా లక్కీ అన్నమాట.
  ఈ జన్మకింతేను నరుడా పాట పాడుకోవలసిందే మేము మరి.

  ReplyDelete
 19. పెళ్ళంటే నూరేళ్ళ వంటని నేనూ సూత్రీకరించాను అప్పుడెప్పుడో! కావాలంటే చూడండి మరి.


  http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_17.html

  ReplyDelete