13 July 2010

నెచ్చెల్లి


అక్కచెల్లెళ్ళ పొత్తు పెళ్లి వరకే అని, అన్నదమ్ముల పొత్తు పెళ్ళి తర్వాతే అని సామెత. పెద్దవాళ్ళు అంటూండగా విన్నాను.

నేనూ మా చెల్లి చిన్నప్పుడు  పోట్లాడుకునేవాళ్ళం కేవలం మాటలతోనే. దాన్ని వాదులాట అనాలేమో.
ఏదో ఒక విషయం  అలా అలా చిలికిచిలికి  వాదనకు దారితీసేది. ఓ పది నిముషాలు,మహా అయితే అరగంట మాట్లాడుకునే వాళ్ళం కాదు. పాపం తనే ముందు మాట్లాడేసేది. నాకు కొంచెం పొగరు ఎక్కువే. నేను దానికి అభిమానం అని పేరు పెట్టుకున్నా దాన్నే అందరూ పొగరు,తిక్క అనేవారు.(యద్దనపూడి హీరోయిన్ లాగా).

 కానీ ఇద్దరం కలిసి సంతోషంగా ఆప్యాయంగా గడిపిన కాలమే ఎక్కువ మా మధ్య.  నాకు పెళ్లయిన తర్వాత కూడా ఈ పొత్తు అప్పటిలాగే నిత్య నూతనంగా నిలిచే ఉంది. ఇందులో గొప్ప విశేషం ఏమీ లేదు. కానీ ఎందుకో చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరేసుకోవాలనిపిస్తుంది. ఆనాటి ఆ హాయి రాదేమి నేస్తం...ఆ జ్ఞాపకాలెంత మధురాతి మధురం... కదూ...

మాది ఉత్తరాంధ్ర ప్రాంతం. నాన్నగారికి  హైదరాబాదులో ఉద్యోగం. నాన్నగారు  ఆఫీస్  టూర్లో  ఉండడం వల్ల కొన్ని కుటుంబ సంబంధమైన కారణాల వల్ల    కొంతకాలం  మా అమ్మకి  హైదరాబాద్ వదిలి అత్తగారి ఊరికి వెళ్ళవలసి వచ్చింది. మాకు చిన్నతనం నుంచి హైదరాబాద్ కన్నా శ్రీకాకుళం అంటేనే మక్కువ. అమ్మమ్మదగ్గర ఉండడమే ఇష్టం. అప్పటికి మా పిన్ని హైస్కూల్, మామయ్య కాలేజీలో చదువుతూ ఉండేవాడు. మమ్మల్ని శ్రీకాకుళం స్కూల్లో జాయిన్ చేసి, మాకన్నా ఐదారేళ్ళు చిన్నదైన చెల్లిని తీసుకొని  అమ్మ వెళ్ళిపోయింది. నాకు ఏడు, చెల్లికి ఐదు ఏళ్ళు. అప్పటినుండి ఓ నాలుగేళ్ళు  శ్రీకాకుళంలో చదువుకున్నాం. నాగావళి ఒడ్డున  ఆడుకున్నాం. తీపి జ్ఞాపకాలెన్నో మూటకట్టుకున్నాం.

పిన్నిరోజూ సాయంకాలం మా ఆటలు అయిపోయాక కూర్చోబెట్టి అందరికీ చందమామ కథలు చెప్పేది. పరోపకారి పాపన్న కథలు, పాదుషా గారి కథలు, బేతాళ కథలు అన్నీ వినేవాళ్ళం. తర్వాత మేమే చదువుకునేవాళ్ళం కూడ బలుక్కుని.

నేను  చందమామ కథలు చదువుతున్నానని,   నేనూ చదువుతా అనేది మా చెల్లి. చందమామ చేతిలోకి తీసుకొని రెండు కాలమ్ లో ఉన్న వాటిని అడ్డంగా కలిపి చదివేది. అర్థంకాలేదు - అనేది. అలాకాదు ఇక్కడ ఇలా బ్రేక్ ఇవ్వాలి అని చెబితే వినిపించుకునేది కాదు.

ఎవరేమిచ్చినా మా అక్కకో అని అడిగేది. అక్కవంతు కూడా పుచ్చుకున్నాక కానీ తనకి ఇచ్చినది  తినేది కాదు. మా అక్కకో అన్నపదాన్ని కలిపేసి మొక్కకో....అనేదిట. చాలా కాలం దాన్ని వెక్కిరించే వారు మా పిన్ని వాళ్లు.అలా ఎంతో ప్రేమగా ఉన్నట్టే ఉండేవాళ్ళం.కానీ ఏదో విషయంలో ఇద్దరికీ గొడవ వచ్చేసేది. దానికి కోపం వస్తే నాకసలు భయం లేదు. ఎందుకంటే.... అక్కా...నిన్నసలు అక్కా అని పిలుస్తానేమో చూడు....హు అనేది.  ఎప్పుడూ అదే బెదిరింపు.

ఇప్పుడే పిలిచావుగా పోవే అనేదాన్ని. పాపం మొహం చిన్నబుచ్చుకునేది. అంటే అక్కా అనకుండా మాట్లాడలేకపోయేదన్నమాట. నేను చాలాకాలం చెల్లీ అని పిలుద్దామని అనుకునేదాన్నికానీ పిలిచేదాన్నికాదు.
అప్పుడు లేతమనసులు సినిమా లో పప్పి, లల్లి పాత్రల పేర్లతో పిలిచేవాళ్లు మమ్మల్ని కొన్నాళ్లు. ఇద్దరికీ ఒకే రకం గౌన్లు కుట్టించి వేసేవారు.

అమ్మమ్మ ఇంట్లో ఓ కొట్టుగది ఉండేది. అతి చిన్నది. చీకటిది. దానికి ఓ చిన్న కిటికీ. రామదాసుని జైల్లో ఉంచిన గది కిటికీలాగ. ఒక మీటరు చదరం. దానికి  అడ్డంగా  రెండు గజాలు. పిన్ని స్టడీ రూమ్ అది. మేము, మా పిన్ని అందులో దూరిపోయి సినిమా కథలు బోల్డు కబుర్లు చెప్పుకునే వాళ్ళం.  పిన్ని ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయి వాళ్ళ కబుర్లు వింటూ ఉండేదాన్ని.

పిన్ని వాళ్లు అప్పటికి టీనేజ్. కలెక్టర్ జానకి, పండంటి కాపురం సినిమాలు చూసి పిన్ని ఫ్రెండ్స్ జమున ఏ రంగుల చీరలు కట్టిందో  ఒక పాటకి ఎన్నిచీరలు మార్చిందో ..వాణిశ్రీ చెవులకి ఎలాటి దుద్దులు పెట్టిందో చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అవన్నీ బాగానే అర్థం అయేవి. కానీ కొన్ని సార్లు వాళ్లు సినిమా కథలు చెప్పుకుంటున్నప్పుడు నా వంక అదో రకంగా చూసేవారు. వాళ్లలో వాళ్లు కళ్ళు కలిపి నవ్వుకునేవారు. ఇది చెప్పీస్తుందే జాగర్త లాటివి అనేవారు. సినిమా కథ -  వాళ్లు కదా చెప్తున్నారు, నేనేం చెప్పేస్తాను అనుకునేదాన్ని. వాళ్లు కథలో ఎప్పుడు ఆపి ఇలా చేస్తున్నారో క్రమంగా గమనిస్తూ ఉండేదాన్ని. మళ్లీ ఆ సినిమా చూసే వాళ్లం కదా అప్పుడు అర్థమయిపోయేది. అది హీరో హీరోయిన్ ఫస్టు నైట్ సీన్లన్నమాట. అలాగే విలన్ రేప్ సీన్లు వచ్చినప్పుడు. అప్పట్లో గిరిబాబు- ఏదో సినిమాలో మోహన్ బాబు అన్నట్టు  రేపుల రాముడు. రెచ్చిపోయేవాడు విలన్ గా.  తను కమేడియన్ గా మారాక హమ్మయ్య అనుకున్నాను కానీ గిరిబాబును చూసినప్పుడల్లా ఏదో తెలీని భయం వెంటాడేది.

ఇలాంటి కథలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ నాకన్నా చిన్నది కదా అని మా చెల్లిని కొంచెం అవాయిడ్ చేసేవాళ్లం.అప్పుడు దానికి కోపం వచ్చేది. అల్లరి చేసేది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. అమ్మమ్మ, తాతగారు, మామయ్య ఏమయ్యారో మరి. గుర్తులేదు. ఆ రోజు మా చెల్లి రెచ్చిపోయి అల్లరి చేసింది. ఆఖరికి భరించలేక దాన్ని లాక్కొని వెళ్ళి పెరటిలో చెట్టుకు తాడుతో  కట్టేసి వచ్చాం. ఇప్పటివాళ్లకు ఆ ఇళ్లు, పెరడు అంటే తెలీదు. అవి ఎంత పెద్ద ఇళ్ళు, ఎంత పెద్ద పెరళ్ళు. ఆ పెరట్లో అరటి తోట లాగ ఉండేది. చీకటి పడే టైం లో కట్టేసి  పాపం తలుపేసేసి వచ్చాం.

మళ్లీ కొట్టు గదిలో దూరి  దాన్ని ఎలా కట్టేసామోనని నవ్వుకుంటూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఆ వీధి తలుపు ఎంత దూరమో...వెళ్లి తీసేసరికి భౌ మంటూ మా చెల్లి ప్రత్యక్షం. ఆ ఇళ్ళు రెండిటికి కలిపి కామన్ పెరడు అది. పక్కవాళ్లు దీన్ని పెరట్లోకి వచ్చినప్పుడు చూసి అయ్యో అని తాడు ఇప్పేసారుట. పెరటి తలుపు తెరుచుకొని చుట్టూ తిరిగి వీధిలోంచి వచ్చేసింది.

చిన్నప్పటినుంచి చాలా దైవభక్తి ఎక్కువ మా చెల్లికి. ఇంటి పక్కనే కోటేశ్వరుడి గుడి. పక్కనే నాగావళి.  ఇద్దరి కేరాఫెడ్రస్ బడి తప్పితే గుడి. అంతే. కానీ నాకెప్పుడు భక్తి లో గురి కుదరలేదనిపిస్తుంది.

ఓసారి వనభోజనాలకెళ్ళాం ఏటి ఒడ్డున. ఆ స్థలం పేరు నాకు గుర్తులేదు. అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చారు. కొత్తగా పరిచయం అయిన పిల్లలతో మా చెల్లి  ఆడుకుంటూ ఉంది.  ఇంటికి వచ్చేసాం. రాత్రి దానికి చాలా జ్వరం వచ్చిందిట. బాగా ఒణికి పోయిందిట. మర్నాడు మామయ్య చెప్తే నాకు తెలిసింది. ఇంకా తర్వాత తెలిసిందేమిటంటే ఆ ఏటి ఒడ్డున మనుషులను కాలుస్తారు అని, దయ్యాలుంటాయని దాని ఫ్రెండ్స్ చెప్పారుట. అక్కడ కాలుతున్న శవాలు కూడా చూసిందేమో మరి. జడుపు జ్వరం వచ్చిందన్నమాట.పదిరోజులు పట్టింది. ఆ జ్వరం దిగడానికి. మా మామయ్య ఆంజనేయ దండకం నేర్పించాడు దానికి. భక్తిగానే నేర్చుకొని చదివి ఉంటుంది.

 మా తాతగారు బ్రూక్ బాండ్ కంపెనీ ఏజెంట్ గా పనిచేసేవారు. మా కా టీ ఏజెంట్ పదానికి అర్థం ఏంటో తెలీక పోయినా మీరెవరు అంటే టియ్యేజంట్ గారి మనవలం అని గర్వంగా చెప్పేవాళ్లం. ఆయన మాకు బాంకరు. బాగా డబ్బులిచ్చేవారు. ఒక్కొక్క రోజు చేతి రుమాలు నిండా చిల్లర పైసలు మూటలాగా కట్టి మా ఇద్దరికి ఇచ్చేవారు.  ఆయన పని చేసే డిపో  మా స్కూలు పక్కనే ఉండేది.

మా చెల్లితో  నాకు మరో  పేచీ ఉండేది.

ఆయన రోజు డిపోకి వెళ్లే ముందు ఇద్దరికీ చెరో ఐదు పైసలు పాకెట్ మనీ ఇచ్చేవారు.(రోఝూ) ఒక్కోసారి చిల్లర లేకపోతే చిన్నది కదా దాని చేతిలో పది పైసలు పెట్టి ఇద్దరూ పంచుకోండి అని చెప్పి వెళ్ళేవారు. నేను నాదగ్గర ఉన్న ఐదు పైసలు ఇచ్చి ఆ పది పైసలు ఇవ్వమనేదాన్ని. లేదా నీ దగ్గర  ఐదు పైసలు ఉంటే ఇవ్వమనే దాన్ని. ఊహు....దానికి అర్థం కూడా అర్థమయేది కాదు. నా పది పైసలు నువ్వే తీసుకుంటున్నావు...తాతగారు నాకు ఇచ్చారు అని గోల పెట్టేది. నా ఐదు పైసలు నీకు ఇచ్చాను కదా అంటే  అర్థమయేది కాదు. ఆ పదిపైసల బిళ్ళ నేను తీసుకోవడమే దానికి అర్థమయేది. అదో పేచీ. మళ్ళీ మా మామయ్య వచ్చి పదిపైసలకి చిల్లర తెచ్చి ఇద్దరికీ చెరో ఐదు పైసలు ఇచ్చేవాడు.

ఇలా రోజూ ఐదు పైసలు ఇచ్చినా మళ్లీ డబ్బులు కావలసి వచ్చేవి...ఎందుకంటే  అప్పుడు ఐదుపైసలకి ఒక పాలయిసు, రెండు కలర్ వి- పుల్లయిసులు(స్టిక్ అయిస్ ) వచ్చేవి. ఒక అయిస్ క్రీమ్(గడ్డకట్టిన రంగు నీళ్లు) తో డబ్బులయిపోయేవి. మరి కాశీ పట్నం చూడర బాబూ అని వచ్చేవాడు కదా. అది చూడాలంటే  ఐదుపైసలు ఇవ్వాలి కదా. నాకు నా ఫ్రెండ్స్ కి, ఇంకా  మా చెల్లికి. అప్పుడు పరిగేఠ్ఠుకెళిపోయేవాళ్లం మా బాంకరు తాతగారి దగ్గరికి. చేతికి ఎంత వస్తే అంత చిల్లర పెట్టేసే వాళ్ళు.  ఇప్పుడు మా పిల్లలు అమ్మా క్వాలిటీ ఐస్ క్రీమ్ వాడొచ్చాడు. కార్నెట్టో కొనుక్కుంటాం. 30,30 అరవై రూపాయలు కావాలని అడిగితే, అదీ రోజూ కాకపోయినా మనసు బాధగా ఉంటుంది.

తర్వాత నేను డిగ్రీ అయిపోయాక కొంతకాలం ఖాళీగా ఉండి తర్వాత  ఓ చిరుద్యోగం చేసాను కొన్నాళ్లు. ఇంక ఈ బ్రతుకు ఇలా తెల్లారి పోవల్సిందేనా అని రెణ్ణెల్లకే నిరాశ వచ్చేసింది. కానీ   మా చెల్లి ప్రయత్నం వల్ల హైదరాబాదు యూనివర్సిటీ లో తెలుగెమ్మే లో జాయిన్ అయాం ఇద్దరం ఒకేసారి. అప్పుడు తన ప్రయత్నం లేకపోతే  పీహెచ్ డీ అనే ఇంత వరకూ వచ్చి డిగ్రీ సంపాదించడం జరిగేది కాదని  మాత్రం కాదని ఘంటాపథంగా చెప్పగలను. మోడల్ పేపర్ ప్రకారం ప్రశ్నలకి జవాబులు తయారు చేసి నోట్సు రాసి చాలా ప్రిపరేషన్ చేసి నాతో కూడా చేయించింది. ఇద్దరం ఒకేసారి  జాయినయ్యాం. ఎమ్మే, ఎంఫిల్, పిహెచ్.డి సమయంలో ఓ ఐదేళ్ళు  ఒక్క రోజు కూడా వదలకుండా కలిసే తిరిగాం.

మా ఇద్దరినీ బాగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు చాలా మంది. అంత పోలికలు లేకపోయినా. పేర్లు ఇద్దరివీ మొదటక్షరం మాత్రమే తేడా. ఒకర్ని చూసి ఒకరనుకోవడం అనే కామెడీ ఎపిసోడ్లు చాలా జరిగాయి యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా. బాగా పరిచయం అయిన  తర్వాత  అబ్బే అంత పోలికలేంలేవే అని వాళ్ళే అనేసేవాళ్లు.

ఇద్దరం షాపింగ్ కి వెళ్తే దాని చేతిలో ఏముందో చూస్తా. అది కొనుక్కో బోతోంది అని నిశ్చయమయితే చాలు మీద పడిపోతా....నాక్కావాలంటూ. అది ఎంచుకున్న రంగే నాకు నచ్చుతుంది. దాని మొహంలో అసంతృప్తి కనిపించిందా మరి ఆ చీర నాకెంత నచ్చినా కొనుక్కోలేను. కట్టలేను. ఒకవేళ కచ్చితంగా కొనవలసి వస్తే కూడా అది కొనుక్కున్నలాంటి  పీస్ కావాలని అడుగుతా.

కొన్నాళ్ళు చెన్నై లో గడపవలసి వచ్చినా ఇప్పుడు హైడ్ చేరిపోయి అమ్మ వాళ్ళ పక్కింట్లోనే ఉండడం వల్ల మళ్లీ హాయిగా గడుపుతున్నాం. రోజూ చూసుకోకపోతే, ప్రతి రెండుగంటలకొకసారి ఫోన్ చేసుకోకపోతే తోచదు కూడా.
మనిషి మీద ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతు ఉంటాయంటారు. అలాంటి సంఘటన మా ఇద్దరి మధ్య జరిగిందోసారి.

తనకి పదహారు, నాకు పద్ధెనిమిది. మంచి ఎండవేళ. పుస్తకం చేతిలో పెట్టుకొని చదువుతూ పడుకున్నా. అమ్మ ఇంటిలో లేదు. మా చెల్లి ఫ్రెండ్ వస్తే దిగపెట్టి వస్తానని బయటకి వెళ్తూ తలుపేసుకోమంది. తలుపేసి పడుక్కున్నా.

నాకు కల వచ్చింది. అక్కా....అక్కా అని ఏడుస్తోంది మా చెల్లి. తన కాలులో మేకు గుచ్చుకుంది. రక్తం బాగా వస్తోంది. అక్కా అక్కా అని ఒకటే ఏడుపు. నాకు  ఏదో బాధ...కలలో కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. ఇంతలో మెలకువ వచ్చింది. తలుపు శబ్దం...వెళ్లి తలుపు తీసి మా చెల్లిని చూసి అడిగాను...బాగా లోపలికి దిగిందా...నొప్పెడుతోందా అని. తను ఆశ్చర్య పోయింది. నీకెలా తెలుసు అంది. అవును మేకు గుచ్చుకుంది కదా...ఏడ్చావు అన్నాను. అలా ఉండి పోయింది. నెమ్మదిగా  తెలిసింది. తను వస్తుంటే దారిలో పెద్ద మేకు లేదా పదునైన ఇనప వస్తువేమో కాలిలో చెప్పులోంచి పాదంలో గుచ్చుకుందిట. బాగా రక్తం కారుతోందిట. నడవలేక పోతోందిట. అక్క ఇంట్లో ఉంది. అక్కకి తెలీదు. అక్కా ...అక్కా అని చాలా సార్లు మనసులోనే తల్చుకుందిట. అక్కడ ఒక టైలర్ మాకు తెలిసినవాడు చూసి తనదగ్గర ఉన్న బట్టముక్కలతో బాగా నొక్కి కట్టు కట్టి పంపించాడుట. కుంటుకుంటూ వచ్చి గుమ్మందగ్గర నిల్చుందిట. అక్కకి తెలీదు...అనుకుంటూ . నేను ఆ విషయం బాగా తెలిసినట్టు అడగడం తో ఆశ్చర్యంతో అలా ఉండిపోయింది. నాకు ఇప్పటికీ కలలో వచ్చిన ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఇలాంటి వేవ్ లెంగ్త్ కలిసిన విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి.

నేను శ్రీకాకుళం వెళ్లి వచ్చాక నాగావళినవ్వింది అని నా బ్లాగులో టపా రాస్తే ....తాను కూడా జస్ట్ అంతకు ముందే నాగావళిమీద కవిత రాసేనని తెచ్చి చూపించింది. నేను ఒకరోజు పిచికల గురించి బాధ పడుతూ కనబడుటలేదు అని టపా రాసి తనకి చూపిస్తే తను రాసిన నేస్తం కవిత చూపించింది. ఒకే ఆలోచన ఒకే సారి ఇద్దర్లోనూ కలిగిందన్నమాట.

నేను మనసుపడిన ఏదైనా త్యాగం చేసేస్తుంది పాపం. చెప్పానుగా, చీరలైనా, డ్రెస్సులయినా నాకు బాగా నచ్చింది, ఇచ్చేయమంటే ఓకే అనేస్తుంది. కానీ ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు అన్నట్టు... ఒక్క దగ్గర మాత్రం నో.......

ఇద్దరికీ సావిత్రంటే మహా  ఇష్టం. సావిత్రిలా ఉన్నావు అని ఎవరేనా అంటే ఇక ఈనాము లిచ్చేస్తాం. కానీ అన్ని సావిత్రులు ఇద్దరికీ అక్కర్లేదు. సుమంగళి సావిత్రి, నిర్దోషి సావిత్రి ఉన్నాయనుకో. అవి అక్కర్లేదన్న మాట. మూగమనసులు సావిత్రి, ఆరాధన సావిత్రి, కన్యాశుల్కం సావిత్రి లాంటివి మాకిష్టం. అక్కడ మాత్రం ఇద్దరికీ పడదు. ఎవరికి వాళ్ళం నేనే సావిత్రిలా ఉంటామని ఆనందిస్తాం....(చచ్చినా ఫోటో చూపించను....)

ఎప్పుడూ  నా సంతోషాన్ని కోరుకుంటుంది. సదా నా అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఓ బొమ్మ వేసినా, కథ రాసినా  బావుందంటుంది కదా మా చెల్లి.  నేనంటే ఎంతో ఇష్టం నా చెల్లికి.

నాకు చేతనయినది తనకు చేతకానిది కంప్యూటరొక్కటే. అందుకే తన కోసం ఒక బ్లాగు పెట్టాను. తను రాసినవి చాలా ఉన్నాయి. క్రమంగా అన్నిటినీ యూనికోడీకరించి బ్లాగులో పెట్టాలి. నా టపాలు చదివిన వాళ్ళు తనవి కూడా చదవాలి. నాకదో తుత్తి.

అదీసంగతి. నావి ఇల్లాలి ముచ్చట్లయితే తను కలభాషిణి అన్నమాట.
సో .... నా చెల్లి నా నెచ్చెలి....ఇప్పుడు నెట్ చెల్లి - నెచ్చెల్లి.....

7 comments:

  1. చాలా చాలా బాగున్నాయండీ అపురూపమైన మీ జ్ఞాపకాలు, మీ అక్కాచెల్లెళ్ళ అనుబంధం కూడా!:-)
    అన్నట్టు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ గురించేనా మీరు చెప్పింది?

    ReplyDelete
  2. నేను విన్న సామెతైతే , 'అన్నదమ్ముల అనుబంధం చిన్నతనాన , అక్కచెళ్ళళ్ళ అభిమానం పెద్దతనానా అని .
    అక్కచెళ్ళెళ్ళు చిన్నప్పుడు అన్నింటికి పోటీ బడి కొట్టుకుంటారట . పెద్దగయ్యాక క్ష్టసుఖాలు కలబోసుకునందుకు ఒకటవుతారట .
    అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసి మెలిసి ఆడుకుంటారుట . పెద్దయ్యక , ఆస్తుపాస్తుల కోసం , తల్లితండ్రులను , అక్కచెళ్ళళ్ళను చేరదీయటనాంకి ఇలా వంతులు వేసుకొని వేర్లు బడుతారుట !

    మీ అక్కాచెళ్ళెళ్ళ అనుభందం బాగుందండి . మీచెల్లెలి కలభాషిణి చూస్తానండి .

    ReplyDelete
  3. @మధురవాణి
    టపా ని చూసి కామెంటినందుకు ధన్యవాదాలండి.
    అవునండి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీయే. పదమూడేళ్ళ క్రితం....
    @మాలా కుమార్ గారు,
    అవునా...పూర్తిగా రివర్సన్నమాట. నాకెందుకో అలా గుర్తుంది. మీరు చెప్పినదాన్ని రివర్సుగా అర్థం చేసుకున్నాను మరి. తెలియచెప్పినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. మీరు రాసిన మొదటి పేరా, చివరి పేరా నాకు అచ్చంగా అలాగే అన్వయమయిపోతాయండీ. మీరు రాసిన చాలా విషయాలు మా అక్కచెల్లెళ్ల విషయంలో కూడా జరిగాయి. నేనూ ఒకసారి అమ్మనాన్న ఇంట్లో లేనప్పుడు మా చెల్లి మీద కోపమొచ్చి వీధి కొట్టులో పెట్టి తాళం వేసేసాను. అమ్మ వాళ్లు వచ్చాక తలుపు తెరిచారు. అబ్బ ఒక్కసారిగా నేను మా చెల్లి కలిసి గడిపిన క్షాణాలన్నీ గుర్తుకొచ్చేసాయి, నన్నేడిపించేసారు మీరు :(. చిన్నప్పటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయాం మేము :)

    మీరు సెంట్రల్ యూనివర్సిటీ లో చదివారా? నేనూ అక్కడే చదివాను. గత యేడాదే PhD పూర్తి చేసాను.

    ReplyDelete
  5. నేనూ మాల గారిలాగే విన్నా ఆ సామెత .. చాలా బాగా రాసారు..

    ReplyDelete
  6. చాలా బావున్నై మీ నెచ్చెల్లి ముచ్చట్లు

    ReplyDelete
  7. చాలా బాగుంది. మీ అక్కా చెల్లెళ్ళ మమతానురాగాలు మురిపించాయి. నెచ్చెల్లి అనే పద బంధమే కొత్తగానూ , ముచ్చటగానూ ఉంది. బ్లాగ్లోకంలో మరో మంచి కొత్త బ్లాగర్ని పరిచయం చేస్తున్నందుకు మీకు అభినందనలు.

    ReplyDelete