15 August 2010

భారతమాతకు జేజేలు...

భారతవాసులందరికీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!

భారతదేశంలో వలసపాలనను అంతమొందించి స్వాతంత్ర్ర్యం సాధించుకోవడానికి జరిగిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా మన దేశం పరాయిపాలన నుండి విముక్తి పొంది 1947 ఆగష్టు పదిహేనున ఎర్రకోటపై తొలిజెండా ఎగరేసింది. హింసాయుతమైనవి, అహింసా యుతమైనవి అనేక సిద్ధాంతాలతో జరిగిన ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో అంతిమ లక్ష్యం భారతదేశాన్ని సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించడమే. ఆ లక్ష్యం నెరవేరిన రోజు -నేడే. నేటితో 63 సంవత్సరాలు పూర్తి అవుతాయి.

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నేడే ఆనందం......ఓఓ....
పాడవోయి భారతీయుడా
పాడి సాగవోయి ప్రగతి దారులా....
మహాకవి శ్రీశ్రీ పాట తలచుకుంటే ఆ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో మనసు నిండిపోతుంది.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ఎందరు అశువులు బాసారో....
వారితో బాటు  ఈనాడు భారతదేశపు సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి, శత్రుదాడులనుండి కాపాడడానికి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎందరు జవాన్లు రాత్రనక పగలనక ఎముకలు కొరికే చలిని లెక్కచేయక కాపలాకాస్తున్నారో వారందరికీ కృతజ్ఞతాభివందనాలు ప్రకటించి వారి దేశభక్తికి నీరాజనాలు అర్పించవలసిన రోజు - ఈ స్వాతంత్ర్యదినోత్సవం రోజు.

నాటి స్వాతంత్ర్యపోరాటంలోనే కాదు, ఈనాడు కూడా   ఏక్షణమైనా వారిని  మృత్యువు కబళించవచ్చని తెలిసినా, వారి మరణం తమ జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో తెలిసినా, తాము అనాథలం అవుతామని ఎరిగి ఉన్నా ఎందరు వీరవనితలు వీరతిలకం దిద్ది తమ కొడుకులను, భర్తలను సైనికులుగా యుధ్ధభూమికి పంపుతారో తలచుకుంటే ఆ మహిళల సాహసానికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

నిజంగా తమప్రతిరూపాలైన బిడ్డలను, తమ ప్రాణానికి ప్రాణంగా భావించే భర్తలను యుద్ధభూమికి పంపాలంటే వారిలో ఎంత స్వాతంత్ర్య స్ఫూర్తి ఉండాలి ?! దేశం పట్ల, తమ బాధ్యత పట్ల ఎంతభక్తి,  నిబద్ధత ఉండాలి!!  అలాంటి తల్లులకు, చెల్లెళ్ళకు కూడా ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలప వలసిన రోజు కదా మరి ఇది.

ఇరవయ్యవ శతాబ్దంలోనే కాదు, దేశ స్వాతంత్ర్యం కోసం , స్వదేశాన్ని పరరాజుల నుండి రక్షించుకోవడం కోసం తమ కన్నకొడుకులను, కట్టుకున్న భర్తలను ప్రోద్బల పరచి, వారిలో పిరికితనాన్ని పోగొట్టి వారిని ధృఢచిత్తులుగా చేసిన మహిళలు ఎందరో ఉన్నారని మన సాహిత్యం కూడా నిరూపిస్తోంది.
తెలుగు భారత రచనచేసిన కవిత్రయంలో తిక్కన సోదరుడు -అతని పేరు కూడా తిక్కనే. ఆయన కవితిక్కన అయితే ఈయన ఖడ్గ తిక్కన గా పేరు పొందాడు.
చోళవంశపురాజు మనుమసిద్ధి కి, ఆయన సామంతుడు కనిగిరి ఎర్రగడ్డపాడు యాదవరాజు కాటమరాజుకు పుల్లరి విషయమై శత్రుత్వం మొదలై పెను యుద్ధానికి కారణమయింది. సైన్యాధ్యక్షుడైన ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడినా, సైన్యాన్ని పోగొట్టుకొని యుద్ధభూమినుండి వెనక్కి వచ్చేస్తాడు. ఖడ్గతిక్కన భార్య పేరు చానమ్మ.

పరాజితుడై ఇంటికి చేరిన భర్తకు రెండు బిందెల నీళ్ళు, ఇంత పసుపు ముద్ద పక్కన పెట్టి, ఒక మంచం చాటు గా ఇచ్చి స్నానానికి ఏర్పాటు చేసిందట చానమ్మ. అలా చేయడానికి కారణం చెప్తూ ఇలా అంటుంది.
పగఱకు వెన్నిచ్చినచో
నగరే మన మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేలా జలకమాడ వచ్చిన చోటన్
అంటూ తను, ఖడ్గతిక్కన తల్లి ఆడవాళ్ళమయితే, యుద్ధభూమిలో పోరాడక తిరిగివచ్చిన భర్త కూడా ఆడదానితో సమానమయ్యాడని అంటూ భర్తలో వీరోచిత లక్షణాన్ని ఎగదోస్తుంది.
ఆ పరాభవానికే బాధ పడుతున్న తిక్కనకు తల్లి ప్రోలమ చెప్పిన మాటలు మరీ అవమానం కలిగించాయి. భోజనంలో అన్ని పదార్థాలను వడ్డించిన తల్లి, చివరగా విరిగిన పాలను వడ్డించిందట. పాలు విరిగిపోయాయని చెప్పిన తిక్కనకు ఆమె చెప్పిన సమాధానం ఇది.
అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పంద క్రియన్నీ
వసి వైచి విరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క పాలు విరిగెన్ 

భార్య, తల్లి తమ శూలాల వంటి మాటలతో చేసిన పరాభవాలు తిక్కనలో ధైర్యాన్ని రగిల్చాయి. ఉత్తేజితుడైన ఖడ్గతిక్కన తిరిగి యుద్ధభూమికి వెళ్ళి శత్రువులతో పోరాడి విగత జీవి అయినా విజయం సాధించాడు.
స్వదేశ స్వాతంత్ర్యరక్షణ కోసం తమ కడుపుతీపిని, తమ మాంగల్యాన్ని లెక్కపెట్టని , వీరమాతలు, వీర కాంతలు
ప్రోలమ్మ.చానమ్మ.

చానమ్మ, ప్రోలమ్మలాంటి వీరవనితలు నారీలోకానికి ఆదర్శమూర్తులు. అలాంటి ఆదర్శ మహిళలు ఇప్పుడూ ఉన్నారు. వారందరికీ కూడా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభినందనలు,కైమోడ్పులు.

చిన్నప్పుడు మనం రోజూ స్కూల్లో చేసిన ప్రతిజ్ఞని మరోసారి గుర్తుచేసుకుందాం.

భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
(మా చిన్నప్పుడు ఈప్రతిజ్ఞ ఇంత వ్యావహారికంగా ఉండేది కాదు. ఇప్పుడు ఇలా కొద్దిగా మారింది)

చిన్నప్పుడు అర్థం అంత బాగా తెలియని రోజుల్లో చేయించే ఈ ప్రతిజ్ఞ ఇప్పుడు అన్ని కాలేజీల్లోను, కార్యాలయాల్లోను తప్పనిసరిగా చేయించాలని నా అభిప్రాయం. వ్యక్తిత్వం బాగా వికసించి, నిజంగా దేశభక్తి కలిగిఉండవలసిన యువతరానికి ఇది స్ఫూర్తినిస్తుంది. అవినీతి విషంతో కలుషితమవుతున్న సమాజంలో దేశం పట్ల తమ బాధ్యతను రోజూ గుర్తుచేసినట్లుంటుంది.

భారతమాతకు జై.    

3 comments:

  1. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  2. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    - శిరాకదంబం

    ReplyDelete
  3. మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.

    ReplyDelete