05 August 2010

పేకాటోపదేశం

ఇండోర్ గేమ్స్ గా ఆడుకునే ఆటల్లో పేకాటదే అగ్రతాంబూలం అని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ పేకాట కి  పెళ్ళిళ్ళు, పిక్నిక్కులలో మంచి డిమాండ్ ఉంది. చతుర్ముఖ పారాయణం అని కొంచెం సంస్కృతంలో పిలుచుకున్నా చీట్లపేక అని చులకనగా చూసినా పేకాట కి ఉండే ప్రత్యేకత దానిదే.

అలనాడు కన్యాశుల్కంలో కూడా  గురజాడ అప్పారావు పేకాట సన్నివేశాన్ని మహా రసవత్తరంగా నిర్వహించారు. ఇప్పుడు పేకాటని బహిరంగప్రదేశాలలో నిషేదించాక ఎలా ఉందో కాని మా చిన్నప్పుడు ప్రతి పెళ్ళిలోను, వనభోజనాలప్పుడు, రైలు ప్రయాణాలలో  పదిమంది కలిసే సందర్భాలన్నిటిలోను దుప్పటి పరిచి పేకముక్కలు పంచుకునేవారు. హరిహరాదులు వచ్చి పిలిచినా పలకలేనంత మహా బిజీగా ఆడుకునేవారు. పెళ్ళిళ్ళలో మగ పెళ్ళివారికి విడిదిలో పేకాటకి ఏర్పాట్లు చేయడం, పేకాట బృందాలకి కాఫీలు, చిరుతిళ్ళు సప్లై చేయడం ఆడపెళ్లివారు జరపవలసిన ముఖ్యమయిన మర్యాదలలో  ఒకటేమో అనుకుంటాను. 

పేకాటలో బోల్డు రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట, రమ్మీ.   మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్లో  ముక్కలు పడడం  బట్టి గెలవడం ఉంటుంది. మూడుముక్కలాట కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట.  పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ముఖ్యమయినది. పదమూడు ముక్కలాటలో  సీక్వెన్స్, ట్రిప్లెట్, నాచురల్, జోకర్ వంటివి పారిభాషిక పదాలు.   రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు ఆడగాడి నైపుణ్యం, సమయానుకూలంగా స్పందించడం కూడా ముఖ్యమైన అంశాలే. ఇవన్నీ ఇప్పుడెందుకూ అంటే......

ఈ మధ్య పాత కాగితాలు సర్దుతూ ఉంటే మా నాన్నగారు ఎప్పుడో రాసిపెట్టుకున్న కాగితం దొరికింది.46 సంవత్సరాల క్రితం,  1964, అక్టోబరు 28నాటి నాటి ఆంధ్రప్రభ లో ప్రచురించబడిన ఓ కవితని చేత్తో రాసుకున్న కాగితం. కవిత పేరు మిడిల్ డ్రాప్. కవి పేరు వి. నారాయణరావు అని ఉంది.

పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ఆటని జీవితానికి అన్వయిస్తూ కొంచెం సరదాగాను, కొద్దిగా హెచ్చరికగాను, ఇంకొంచెం వైరాగ్యంతోను  చెప్పిన ఈ కవిత నాకు బాగా నచ్చింది.    కవిత రాసినవారు వి.నారాయణరావు - అంటే వెల్చేరు నారాయణరావుగారే అని గుర్తు అన్నారు మా నాన్నగారు. వెల్చేరునారాయణరావుగారు భాషా శాస్త్రవేత్తగా చాలా మందికి తెలుసు. ఆ కవితని ఇక్కడ ప్రచురిస్తున్నాను...ఆయన ఎక్కడ ఉన్నా కృతజ్ఞతాభినందనలతో.......


                       మిడిల్ డ్రాప్   

కావలసిన ముక్కొకటి తగలక పోతుందా అనుకున్నావు
కాంతా నయనాల కాంతులు చూసి భ్రమపడ్డావు
పన్నెండు ముక్కలు పండబెట్టుకోకుండా
కౌంట్ ఆర్ షో లో పెట్టుకున్నావు జీవితాన్ని
ఎప్పుడూ ఆశ పొడుగ్గానే ఉంటుంది
వచ్చేది జోకరనుకొని వెళ్ళు పేకలోకి
ట్రిప్లెట్లెప్పుడూ ఉండనే ఉన్నాయి
నాన్నా అమ్మా తమ్ముడూ లా సీక్వెన్సొకటి ఉంది
బతుకు కోసం కావలసిన రెండో సీక్వెన్సులో
పెయిర్ లోకి ముక్కలందడం లేదు ఇప్పటికీ
అవసరమయిన జోకరు కోసుకోవడం చేతకాలేదు
అమ్మాయిల  మనసుల్లా పక్కవాడి ఆట అర్థం కావడంలేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలి వాడి చేతిలో చిక్కింది
అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి అక్కర్లేని రాణులు
నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా
నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు
ఇక పెయిరయే అవకాశం లేదు
ఇప్పటికయినా 'మిడిల్ డ్రాప్' పడెయ్యి, నా మాట విను
చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు.....
(ఆంధ్ర ప్రభ 28.10.64)                   - వి. నారాయణరావు
  పేకాట ఆడడం తెలిసినవారికి ఈ కవితలోని పదార్థం(పదాల అర్థం)  బాగా అర్థం అవుతుంది. కవిత పేరే మిడిల్  డ్రాప్. రమ్మీ ఆటలో ముఖ్యమయిన పదం. ఎన్ని రౌండ్లు తిరిగినా ఆటలో కావలసిన ముక్కలు రాకపోతే, మన ఆటకి  పనికిరావని  పడేసిన ముక్కలు పక్కన కూర్చున్నవారికి పనికి వస్తుంటే, ఇంక ఆటని షో గా చూపించే అవకాశం రాదనుకున్నప్పుడు మిడిల్ డ్రాప్ చేస్తారు.

మనకు కావలసిన సమయంలో అవకాశాలు అందకపోవడం, మన వైఫల్యాలు అవతలి వాడి సాఫల్యానికి సహాయపడడం, మనం దక్కించుకుందామనుకున్న వస్తువు పక్కవాళ్ళకే దొరకడం  వంటివి జీవన వైఫల్యానకి గుర్తులు. వాటిని  పేకాటతో అన్వయించి చెప్పారు. చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు  అన్న మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తున్నా ఇప్పుడు కొందరు పాటిస్తున్న జీవన ధర్మమే కదా అది. అదే - బ్రతుకులోంచి మిడిల్ డ్రాప్.


15 comments:

 1. నారాయణ రావు (?) గారి కవిత చాలా బాగుంది.
  తమాషాగా ఉంది. పేకాటలో మిడిల్ డ్రాప్ మనల్ని కొద్దిపాటి నష్టంతో గట్టెక్కిస్తుంది. బతుకులో మిడిల్ డ్రాప్, జీవితంలో యితే, పెను విషాదమే. అలా కాక, జీవన విధానంలోనుండి అయితే కొంత నయం.
  తీరిక ఉన్నప్పుడు కన్యాశుల్కం లోని పేకాట సీను గురించి,
  పేకాట ఆడే వారి తీరు గురించి, వాళ్ళ మూఢ నమ్మకాల గురించి, వారు వాడే పారిభాషిక పదాల గురించి, వాళ్ళ మధ్య వచ్చే చిలిపి తగాదాల గురించి, వాళ్ళు చేసే పేకాట త్యాగాల గురించీ, వారి వైరాగ్యం ధోరణుల గురించీ ... ఇలా చాలా విషయాల మీద పెద్ద టపా రాయండి. చదివి సంతోషిస్తాం.
  మేం పేకాట ఆడే రోజులలో ఒకాయన నోట తరుచుగా చచ్చింది గొర్రె అనే మాట వచ్చేది. దాని అర్ధం తనకు కావలసిన ముక్క వచ్చిందనో , లేక తను ముందు పారేసిన ముక్కకి కనెక్షను ముక్క లేటుగా వచ్చిందనో తెలిసేది కాదు.
  ముక్కలు పంచేక కేవలం ఒక్క సారి చూసి, ఆ తరువాత ముక్కలు చూడకుండా ఆడే పేకాట మహా వీరుల వార గాధలూ, పక్క వాడి ముక్కలు దొంగతనంగా చూసి ఆడే పేకాట చోర శిఖామణుల చాతుర్యాలూ, కౌంటు సరిగా చెప్పకుండా ముక్కలు గిరాటు వేసే పేకాట జబర్దస్తీ గాళ్ళూ, అరువులు పెట్టే అప్పారావులూ ... వీళ్ళూ ఉన్నారు.
  చూసారు, పేకాట ఊసెత్తితే, ఎన్ని ఊసులు రాసీసేనో ? తల్లి పేకాట మాహాత్యం కాబోలు, అది.
  మరింక మిడిల్ డ్రాప్ చేస్తున్నాను.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. హ హ హ సరదాగా ఉంది కవిత

  ReplyDelete
 4. పేక ఆడితే చురుకుదనం పెరుగుతుంది అని చెప్పినది ఎవరో కాని
  అదీ నిజమే

  తార నువ్వు తెలుగులో అంకెలు రాస్తే ఎట్లా

  ReplyDelete
 5. @జోగారావుగారు,
  కామెంట్ రాయడానికి వస్తేనే తల్లి పేకాట అన్ని ఊసులు చెప్పిస్తోందే...ఆటపా ఏదో మీరే రాస్తే మేమంతా డీల్ చేసినంత ఆనందిస్తాం కదా...తప్పకుండా రాయాలి మరి.
  @సౌమ్య...
  కవిత నచ్చిందా.... ఓ.కె. రమ్మీ తెలుసా మీకు....
  @హరేకృష్ణ
  అవునండీ. పేక ఆడితే చురుకుదనంతో పాటు పెరిగే వాటిలో చెప్పుకోవలసినవి...ఇంట్లో గొడవలు కూడా... కదూ.
  : )

  ReplyDelete
 6. @తార
  మీ ప్రశ్నకు జవాబు...
  రమ్మీలో పంచేది పదమూడు ముక్కలు కదా. అందులో కనీసం రెండు సీక్వెన్సు ఉండాలి కదా. మరో రెండు సీక్వెన్సు గాని ట్రిప్లెట్స్ కానీ ఉండవచ్చు. తప్పనిసరిగా ఉండవలసిన సీక్వెన్సు రెండిటిలో కవి చెప్పిన అమ్మనాన్న తమ్ముడు ఒక సీక్వెన్స్ ఉందన్నమాట , రెండవ సీక్వెన్సులో పెయిర్ ఉంటేనే ఆట బతుకుతుంది. ఆ పెయిర్ జోకర్ గానీ, వరుస ముక్క గానీ అవాలి.
  పదమూడు ముక్కలూ ఉండి ఉంటే ఆట పండి షో అయేది. మిడిల్ డ్రాప్ అవసరమే లేదు. పన్నెండు ముక్కలు పట్టుకొని షో అయే అవకాశం కోసం చూస్తున్నట్లుంది. కావలసిన ముక్క జోకర్ గానీ, అరకురాణి గాని అయి ఉంటుంది.
  నాకలా అర్థం అయింది.

  ReplyDelete
 7. బతుకు కోసం కావలసిన రెండో సీక్వెన్సులో
  వచ్చేది జోకరనుకొని వెళ్ళు పేకలోకి
  ఇప్పటికయినా 'మిడిల్ డ్రాప్' పడెయ్యి, నా మాట విను

  అంటే వచ్చే భార్యా??
  పెళ్ళి అసలు చేసుకోవద్దనా?

  ఇదెదో పెళ్ళికి వెళ్ళి, అక్కడ పెళ్ళి కొడుకుతో పేకాడుకుంటూ, అతన్ని అలా భయపెట్టినట్టున్నది..

  పొద్దున నిద్రమత్తులో ఎదో కామెంటాను, అందుకే తీసేసాను..

  ReplyDelete
 8. @తార
  కామెంట్ మీరే తీసేసారా...అలా తీసేయవచ్చని నాకు తెలియదు. నేనే ఏదోనొక్కితో పోయిందేమో, ఏం చెయ్యాలా అని తల పట్టుకుని కూర్చున్నా..విషయం చెప్పి బతికించారు.

  ReplyDelete
 9. ముఖ్యంగా పెద్ద పండక్కి (సంక్రాంతి) మా ఇంట్లో రోజంతా పేకాట పారాయణం సాగేది. మా తాతగారి కాలేజీ లెక్చరర్లు, మా నాన్నగారి స్నేహితులూ అంతా కలిసి ఒక పది పదమూడు మంది కూర్చొని (అప్పట్లో అందరూ కిందనే కూర్చొనే వారు) మూడో నాలుగో సెట్లు కలిపి రమ్మీ (మేం సీక్వన్స్ అంటాం) మొదలుపెట్టారంటే అది గంటలు గంటలు సాగేది. స్కోరే ఎక్కువ ఆడేవారని గుర్తు. మేం చిన్న పిల్లలం కాబట్టీ ఆడేవాళ్ళం కాదు కాని, వెనకన కూర్చుని చూసేవాళ్ళం!
  అసలు పేకాటకి ఒక బ్లాగు తెరిచి నాకు తెలిసిన పేకాటలన్నిటి గురించీ (బహుశా ఒక పదిహేను ఇరవై దాకా ఉండొచ్చు) రాద్దామని చాన్నాళ్ళనుంచీ కోరిక ఉంది. ఈ టపా ఆ ఆలోచనని తిరిగి ఎగదోసింది :-)

  ఇది వేల్చేరు వారి కవితనే నాకూ గుర్తు. "కౌంట్ ఆర్ షో" అని (దీన్నే ఏసీ/డీసీ అని కూడా అంటారు) మేం సాధారణంగా "నేచురల్" లేకుండా ఆ ఒక్క ముక్కా వస్తే ఆట "షో" అయ్యే "హేండు"ని అంటాం. అలాంటి హేండుకి ఎన్ని జోకర్లు వచ్చినా ఏవీ ప్రయోజనం లేదు! కొందరి జీవితాలు అలాక్కూడా ఉంటాయి :-)

  ReplyDelete
 10. మీకు ఇరవై రకాల వరకూ పేక రకాలు తెలుసంటే బ్లాగు పెట్టాల్సిందే.
  మా ఇళ్ళలో ఆడే ఐదారు రకాలే నాకు తెలుసు.

  ReplyDelete
 11. అవునండి నేనే తీసేసాను, మరీ అర్ధరహితమైన కామెంట్ పెట్టాను, క్షమించగలరు, ఆ తప్పు ఎలా చెసానో నాకే గుర్థులేదు..

  తరువాత టైమ్ స్టాంప్ పక్కన ఒక చెత్త డబ్బా బొమ్మ కనిపిస్తున్నది కదా
  ( August 5, 2010 9:00 AM ॥ ) ॥ అన్న ప్రదేశం లో; ఆ డబ్బా ని నొక్కితే కామెంట్ డిలీట్ ఐపోతుంది, మనం ఎవరి బ్లాగ్ లో పెట్టినది ఐనా, మన బ్లాగ్ లో వెరే వాళ్ళది ఐనా, మీరు కామెంట్స్ చదివే అనుమతిస్తారు కాబట్టి మీరు కామెంట్స్ తీసెయ్యాల్సిన అవసరం రాదేమో..

  ReplyDelete
 12. సుధారాణికి,

  పేక ముక్కల గురించి రిసెర్చ్ చేసినట్టున్నారే! చధువుతూ వుంటే అరచేతులు దురద పెట్టేయి! ముక్కలు కలిపితేగాని దురద తీరదు కాబోలు. అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి చేతులు కలపాలి.
  మీ బ్లాగ్ చూసేక ఒక విషయం గుర్తుకొచ్చింది-గురజాడ కన్యాశుల్కం లో "రాణియనన్ రాణి.... మధురవాణి .." అంటూ పాత ఎత్తుకుంటాడు ఓ పాత్ర పేకాట మధ్యలో. దానికి సుబ్బిసెట్టి-"ఘోరం, ఘోరం.. ఆడి దగ్గర రాణి ఉందన్న విషయం చెప్పిసేడు" అంటాడు. వాళ్ళు ఆడిన ఆట మాత్రం అంతుపట్టడం లేదు నాకిప్పుడు. సమయం దొరికినప్పుడు చదివి తెలుసుకోవాలి.
  నేను మాత్రం "రాణియనన్ రాణి.... సుధారాణి .." అని జేజేలు పలుకుతాను.

  ReplyDelete
 13. @కెకెఆర్ గారు,
  ఏదో మీ అభిమానం....
  గురజాడ కన్యాశుల్కంలో పేకాటసీను బాగా పండుతుంది. ఆ ఆటని బేస్తు అంటారనుకుంటా. మా వాళ్ళు ఎత్తడం ఆట అంటారుట.
  రాణియనన్మధురవాణి అని పూజారి గవరయ్య పద్యం చెప్తే పోలిసెట్టి గోరం గోరం మధురవాణిదగ్గర రాణి ఉందని చెప్పేసాడు అని గోల పెడతాడు.
  జోగారావుగారు చెప్పినట్టు పేకాటలో మూఢనమ్మకాలు, పారిభాషిక పదాలు,అవతలి వాడి ఆట తెలుసుకునే ప్రయత్నాలు....ఓహ్...ఎవరైనా మంచి పోస్టు రాస్తే బాగుండును.

  ReplyDelete
 14. "కౌంట్ ఆర్ షో" అని (దీన్నే ఏసీ/డీసీ అని కూడా అంటారు) ,,,, ఎన్ని జోకర్లు వచ్చినా ఏవీ ప్రయోజనం లేదు! కొందరి జీవితాలు అలాక్కూడా ఉంటాయి :-)

  దీనికి మితబృందం చెప్పిన/పెట్టిన పేరు L&D ..
  లైఫ్ అండ్ డీల్ (తరువాత ఆట) అనుకుంట...

  ReplyDelete
 15. ఈ క్రింది URL ఒకసారి చూడండి. ఈ కవితకి ఇంతమంది (వీర)అభిమానులున్న సంగతి నాకు తెలియదు. నాకు నారాయణరావుగారితో పరిచయముందని తెలిసన, 60 ఏళ్ళ వయసు (2001 నాటికి) పైబడిన వారందరు నన్నాకవితని సంపాదించి పెట్టమని అడిగేవారు. ఫలితమిక్కడ :-)

  http://www.eemaata.com/em/issues/200511/55.html

  ప్రచురణ తేదీ గురించి కచ్చితమైన సమాచారాన్ని అందించినందుకు, ఎంతో జాగ్రత్తగా యాభైఏళ్లకుపైగా రాతప్రతిని భద్రంగా దాచుకున్న మీకు, మీ నాన్నగారికి కృతజ్ఞాతివందనాలతో,

  భవదీయుడు,
  -- శ్రీనివాస్

  ReplyDelete