30 July 2010
రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి
రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 జులై 22 న శ్రీకాకుళం లో పుట్టారు. కథా రచయితగా, నవల, నాటక రచయితగా పాఠక లోకంలో రావిశాస్త్రిగా పాఠకలోకానికి సుపరిచితులు. ఈ రోజు రావిశాస్త్రి పుట్టిన రోజు.
ఇతివృత్త స్వీకరణలో, రచనా విధానంలో, శైలీ విన్యాసంలో రావిశాస్త్రి ఎన్నో కొత్త పోకడలు ప్రదర్శించారు. అవి సమకాలిన రచయితలెందరికో మార్గదర్శకమయ్యాయి. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వారి జీవన విధానాలు, సమాజంలో దిగజారిపోతున్నవిలువలు అందుకు అంతర్గతంగా సమాజంలోనే దాగిఉన్న కారణాలు వీటన్నిటినీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు రావిశాస్త్రి.
కథలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే ప్రశ్నలకు రచయిత భావించే సమాధానమే కథాశిల్పంగా రూపొందుతుంది. దానిని బట్టే కథా వస్తువు క్రమంగా పాత్రచిత్రణ, సన్నివేశాలు, సంఘటనలు, నేపథ్యం వంటి ప్రధానాంగాలతో ఏర్పడి వికసిస్తుంది. అలాగే రచయిత భాషా ప్రయోగం కూడా అతను ఉద్దేశించే ప్రయోజనాన్ని బట్టి ప్రకటితమవుతుంది.
రావిశాస్త్రి రచనలు ప్రధానంగా వచన రచనలు. ఆధునిక సాహిత్య రూపాలయిన కథ, నవల, నాటకాలు, పొట్టికథలు వంటి అనేక ప్రక్రియలలో రావిశాస్త్రి రచనలు చేసారు. రావిశాస్త్రి రచనలలో అంతర్లీనంగానే అయినా అత్యంత రసభరితంగా వ్యక్తమయే కవితా ధోరణి రావిశాస్త్రి వచన రచనా శిల్పానికి ప్రత్యేకతను ఆపాదించింది.
"సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొక చోట ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతుంది. ఇంకొక చోట జలపాతంలా ఊపిరి సలపకుండా వుక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొక్కచోట అచ్చమైన కవిత్వంగా మారి కావ్య స్థాయికి తీసుకువెళ్తుంది " అని గొప్ప కథా రచయిత శ్రీ మధురాంతకం రాజారాం రావిశాస్త్రి కవితామయమైన శైలిని ప్రశంసించారు.
సరళమైన వ్యావహారిక భాషలో రచనలు చేసారు రావిశాస్త్రి. ఒకదానివెనుక ఒకటిగా ధారగా వ్యక్తమయ్యే భావాలకూర్పు, వాక్యాలలోని లయ, తేలికగా అర్థమవుతూ సాగే భాష పఠిత మనసులో రచయిత ఊహిస్తున్న భావాన్ని రూపుకట్టిస్తాయి. వెనువెంటనే పాఠకుల అనుభూతిలోకి వచ్చే పదచిత్రాలతో రావిశాస్త్రి వాక్యప్రవాహం అద్భుతమైన వచన కవితా ఖండికలా తోపింపచేస్తుంది. పాఠకుడిలో వివశత్వం కలిగించి రచయిత వెంట లాక్కుపోతుంది.
రావిశాస్త్రి రాసిన కథలలో ప్రధానంగా పాత్ర చిత్రణలో, పాత్రల బహిరంతర పరిస్థితులమధ్య సంఘర్షణ వర్ణనలో ఆయన కవితావేశం కనిపిస్తుంది.
రావిశాస్త్రి కవితాశైలి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పవలసిన కథ వెన్నెల.
ఆద్యంతం కవితాత్మకంగా సాగుతూ ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమయిన ఘట్టాలను వర్ణిస్తూ ప్రకృతిలోని వెన్నెల వెలుగులోనే అవి జరిగినట్టుగా చెప్తారు. తల్లి కడుపున అతను పుట్టినప్పుడు, రోగంతో అతని తల్లి మరణించినప్పుడు, మరొక మూడేళ్ళకి తండ్రి కళ్ళుమూసినప్పుడు పైన ఆకాశంలో పండు వెన్నెల కురుస్తోంది.వరకట్న సమస్యతో అక్క చనిపోయినప్పడు, తనకి పెళ్ళి జరిగినపుడు, అనారోగ్యంతో భార్య చనిపోయినప్పుడు కూడా వెన్నెల కురుస్తూనే ఉంది. కానీ అతని కొడుకుకి మాత్రం వెన్నెలలో సౌందర్యంకానీ, హాయి కానీ కనిపించలేదు. వెన్నెలలోని చల్లదనాన్ని కాక కార్చిచ్చులనే చూసాడు అతను. కథకుని కొడుకులో మానవ ప్రకృతి సహజంగా వెన్నెలలోని సౌందర్యాన్ని చూసి తన్మయత్వం పొంగకుండా అందులో కార్చిచ్చునే చూడడాన్ని అవ్యక్తంగా సూచిస్తూ, కథకుడి పాత్ర ద్వారా రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.
అంతటా వెన్నెలే, కాని ఎచటా చిచ్చులే.
వెన్నెలా వెన్నెలా నువు చూపే దృశ్యాలకి మనసు చెదురుతుంది వెన్నెలా
నువ్వు చూపే చిత్రాలకి గుండె కరుగుతుందో వెన్నెలా
అది సహజమే వెన్నెలా
కాని ఆయా దృశ్యాలకి, చిత్రాలకి, నీ తడితో పడుచు రక్తం ఉండుకుతుందే వెన్నెలా
అది కూడా అతి సహజం కాదటమ్మా వెన్నెలా
అవును -
యువరక్తం ఉడుకుతుందది వెన్నెలా
సుళ్ళుగా పరవళ్ళు తొక్కుతుందది వెన్నెలా...
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వెన్నెల వెలుగులోని హాయి, ఆహ్లాదం సామాన్యులకి కూడా అందాలని ఆశించి అందుకు ప్రయత్నించిన కొడుకు సమ్మెకట్టి కార్మకుడై వెన్నెల వెలుగులోనే పోలీసుల మరతుపాకులకు బలి అయ్యాడు. వెన్నెల వెలుగులోనే కథకుడి జీవన దీపం ఆరిపోయింది.
ఆకాశం నిండా ఏటి చల్లని వెన్నెల పరచుకొని ఉన్నా, వీధినిండా వెండి తెల్లని వెన్నెలే వెన్నెలే నిండి ఉన్నా అధర్మానికి బలి అయిన వారి ఎర్రని రక్తం కలిసి తడి తడిగా ఎర్రనెర్రని వెన్నెల ప్రవహించింది.
కన్న తల్లీ వెన్నెలా
లోకమంతా వెన్నెలే నీ పాలు పొంగిన వెన్నెలే
కాని
మాకు మాత్రం దానినిండా జీరలే.
పేద నెత్తుటి వేడి నెత్తుటి జీరలే
దానికింద మాకు మాత్రం విషపు నల్లని చీకటే కారు చీకటే
వెన్నెలా ఓ వెన్నెలా
ఓహో మా వెన్నెలా
అయ్యయ్యో ఓ వెన్నెలా....
వెన్నెల కథలో రావిశాస్త్రి కథనంలో వాడిన పదచిత్రాలు, వాక్యాల కూర్పుతోనే కథలోని వస్తువును ధ్వనిస్తూ పాత్రలను, సంభాషణలు, సంఘటనలను పరోక్షంగానే పఠితకు రూపుకట్టిస్తారు. భాషమీద, కథన ప్రక్రియ పైన పట్టు ఉన్న గొప్ప రచయితలు మాత్రమే చేయగల ప్రయోగం ఇది.
మెరుపు మెరిసింది కథ లో నేపథ్యం వర్షం. పెళ్ళికాని యువతి నీరజ నిరాశామయమయిన జీవితానికి ప్రతీక వర్షం. వర్షంలో మెరిసే మెరుపులు ఆమె ఆశలు. ఆమె పొందాలనుకున్న జీవితానందానికి ప్రతీకలు. చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి వీల్లేకుండా వర్షం ఆటంకం కలిగిస్తే ఒక యువకుడు ఆమెని తన కారులో గమ్యానికి చేరుస్తాడు. అప్పుడు ఆమెలో చెలరేగిన ఆశలని రచయిత ఇలా వర్ణిస్తారు.
మబ్బుల్లోంచి
వర్షంలోంచి
తలుపుల్లేని కిటికీలోంచి
చీకట్ని తోసేస్తూ
మెరుపులు
ఒకమెరుపు, ఒకటి మరొక మెరుపు రెండు మరో మెరుపు మూడు
ఒకటీ రెండూ మూడు.
మరునాడు కూడా అదే యువకుడు తనను మళ్ళీ కారు ఎక్కించుకుంటాడని ఆశపడిన నీరజకి నిరాశ ఎదురయింది.
అదో మెరుపు ఇదో మెరుపు మరో మెరుపు
ఒకటీ రెండూ మూడూ
హాస్యాస్పదం నవ్విపోతారు
అదిగో మెరుపు
ఇదే మాయమయింది.
మళ్ళీ మెరిసింది మాయమయింది
ఇంతే ఇది
ఆఖరికిదే నిజం.
ఈ చీకటే ఇదే ఈ చీకటే నిజం.
ఆశనిరాశలకి ప్రతీకాత్మకంగా, మెరుపులు, చీకటి మొదలయిన పదబంధాలతో సూచిస్తూ నీరజ పాత్రని కవితాత్మకంగా ఆవిష్కరించారు రావిశాస్త్రి.
జరీ అంచు తెల్లచీర కథలో జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.
ఇది మెరుపు లేని మబ్బు
ఇది తెరిపి లేను ముసురు
ఇది ఎంతకీ తగ్గని ఎండ
ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి
ఇది గ్రీష్మం
ఇది శిశిరం
ఇది దగ్ధం చేసే దావానలం
ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం
ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క
జ రీ అం చు తె ల్ల చీ ర
విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.
న్యాయ వ్యవస్థలో వృత్తికి, ప్రవృత్తికీ సంఘర్షణ ఏర్పడి ఏది న్యాయమో తేల్చుకోలేక చిత్తచాంచల్యం పొందిన మెజిస్ట్రేటు పాత్రని చిత్రించారు మోక్షం కథలో. కథా ప్రారంభంలో కోర్టును వర్ణిస్తూ -
పైన భగ్గున మండే సూర్యుడు
బైట ఫెళ్ళున కాసే ఎండ
ఎండ ఎలా ఉంది
పులికోరలా పాము పడగలా
నరకం ఎలా ఉంటుంది
పులితో పాముతో చీకటిగా.
కోర్టులో ఆవరించి ఉన్న చీకటి మెజిస్ట్రేటుగారి మనసునిండా అలముకుంది. న్యాయం పేరుతో కోర్టులో జరుగుతున్న దురన్యాయాన్ని గురించి మథన పడతారు.
ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి
పోలీసువారి ఎర్ర టోపీల నిండా
చారలు చారలుగా చీకటి
చుట్టూ పడున్న ఖాళీ సారా
కుండలనిండా చల్లారని చీకటి
ముద్దాయిల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి
కోర్టులో చట్టాన్ని కాపాడే పేరుతో ప్లీడర్లు, పోలీసులు చేస్తున్న అన్యాయాలకు ప్రతీక ఇక్కడి చీకటి పదం.పదే పదే చీకటి అనే పదం ఒక్కొక్క అర్థంలో ప్రయోగించబడింది. చివరకు నిరపరాధులైనా సాక్ష్యాలు బలంగా ఉండడంతో, కోర్టులోని న్యాయసూత్రాలు తెలియక నిరక్ష్యరాస్యులుగా ఉన్న అమాయకపు ముద్దాయిలను శిక్షించవలసి రావడం మెజిస్ట్రేటుగారిని భయపెడుతుంది.
నామీద కొన్ని వేల పగలు
లోకంలో కోటానుకోట్ల పగలు
అనుకుంటాడు. పగ అనగానే సంప్రదాయపు విశ్వాసం పాములు పగపడతాయని గుర్తువచ్చి చుట్టూ ఉన్న సారా ట్యూబులు పాముల్లా కనిపించాయి.
పాముల్లా వాటి పడగల్లా
ఏమిటి ఏమిటవి
రోజూ ఇలాగే పాముల్లా సారూ ట్యూబులు
మోటర్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి
అన్నిట్లోనూ సారా
కోర్టుకొస్తే సారా
కోర్టులో ఉన్నంతసేపూ సారా
రోజూ దాదాపు ప్రతి కేసూ సారా.....
ఇలా సారా కేసులు తీర్పుల మధ్య నలిగిన మెజిస్ట్రేటుగారికి నిరపరాధులకి జైలు శిక్ష వేసి పాపం మూటకట్టుకుంటున్నాననే అపరాథ భావం కలిగింది.
రావుగారి మెదడంతా
చీకటి గదిలా ఉంది
చీకటి గదిలో చీమల ఏడుపు
వాటి గురించి తేళ్ళు, జెర్రులు
నరకం ఎలా ఉంటుంది
తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా
అక్కడ ఏముంటాయి
పగపట్టిన చలిచీమలు
....
రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని,
చీమల ఏడుపు జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని భయం వేసింది.
నా చేతులు నల్లని తాచులు
నా చేతుల మూతుల్లో ఐదేసి నాలుకలు
అన్నేసి కోరలు
ఈ సిరాలో విషం నా కలంలో కాటు
మెజిస్ట్రేటు పాత్రలో క్రమక్రమంగా కలిగే సంఘర్షణను కవితాత్మకమైన, ప్రతీకాత్మకమైన పదచిత్రాలతో వర్ణించారు రావిశాస్త్రి.
అధికారి కథలో ఆశలన్నీ నిరాశలుకాగా కుప్పకూలిన నూకరాజు మానసిక స్థితిని వర్ణిస్తూ -
అతను వెలిగించుకున్న జ్యోతులన్నీ అకస్మాత్తుగా
అతని కట్టెదుటే ఏట్లోకి దిగిపోయి ఆరిపోయాయి
అతను వేసుకున్న రంగుల డేరా
అతని కళ్ళెదుటే మాడి మసైపోయి మాయమయిపోయింది
అతను వేసుకున్న పూలతోట
అరక్షణంలో పాముల పుట్టగా మారిపోయింది.
అతనికి తూర్పుదిక్కు ఎటో వెళ్ళిపోయి
పడమటి దిక్కు ఎదురొచ్చింది.
అంటూ ఆ పాత్ర మనసులో చెలరేగిన తుఫానులాంటి స్థితిని పదచిత్రాలతో చూపుతారు రావిశాస్త్రి.
పువ్వులు కథలో బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల అవి తలలు వేల్లాడదీయగానే దిగులు పడుతుంది. కానీ రాత్రి పడిన వర్షంతో తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు చూసి సంతోష పడుతుంది. ఆ అమ్మాయి సంతోషాన్ని ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రి-
ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల
అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల
ఇదే కమల ఈ మొక్కా అయింది
ఇదే కమల ఆ మొక్కా అయింది
నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే
నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే
ఆ కమలే ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది
అదే కమల ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది.
ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.
కిటీకీ కథలో వర్ణింపబడే దృశ్యాలు కవితాత్మకంగా సాగుతాయి. బిచ్చగాడి మనసులో అతను పొందలేని సౌఖ్యానికి ప్రతీకగా తాను రోజూ చీకటిలో చూసే కిటికీని స్వర్గంగా భావిస్తూ ఉంటాడు.
నిజానికి బిచ్చగాడి పాత్రకి తన మనసులో ఊహిస్తున్న దృశ్యాలను వర్ణించే శక్తి, భాష లేవు. రచయిత రావిశాస్త్రి రమ్యమయిన పదచిత్రాలతో అతను చూసే దృశ్యాన్ని వర్ణిస్తారు. కిటికీ లోంచి కనబడే స్త్రీ పురుషులను దేవతలుగా భావింపచేస్తూ సమతౌల్యం కలిగిన వాక్య నిర్మాణంతో సాగే ఈ వర్ణన ద్వారా సాధారణమైన దృశ్యాన్ని కూడా అద్భుతంగా భావించడానికి కారణమైన బిచ్చగాడి దైన్య స్థితి పాఠకులకు అవగతమౌతుంది.
పంచరంగుల పువ్వుల తోటల్లోకి
తెల్ల పావురాల మెడ వంపుల మెరపుల్లోకి
కొండ నీడల కులికే చల్లని తోటల నీడల్లోకి
తెలిమబ్బుల తేలిపోయే గాలి మేడల్లోకి
చుక్కల బాటల్లోంచి
ముత్యాల ముగ్గుల్లోంచి
స్వప్నాల స్వర్గాల్లోకి
స్వర్గాల స్వప్నాల్లోకి
అదీ -
ఆ కిటికీ.
తెరిచిన కిటికీలోని దృశ్యాన్ని చూస్తూ తన జీవితంలో అనుభవించలేకపోయిన తనకు దూరమైన జీవితానందాన్ని పొందుతూ ఉన్న ముసలితాత, జల్లుకొడుతోందని అక్కడ కిటికీ మూయబడడంతో తాను కూడా కళ్ళు మూస్తాడు.
చీకటివరదలో
మధుర స్వప్నాలు ములిగిపోయాయి
ఆవరించుకున్న మేఘాల పొగల్లో మాయమయేయి
నిత్యంగా ఉండాల్సిన వసంతం
ఏదీ ఎక్కడికి పోయింది
కదలాడిన ముత్యాలు స్వప్నాలు స్వర్గాలు
అన్నీ కూడా ఏమయిపోయాయి అంటూ ముష్టి ముసలితాత జీవన వైఫల్యానికి కారణాలను వ్యవస్థలో వెతుకుతూ పఠితను ఆలోచింపజేస్తారు. అతని మరణానికి సూచనగా స్వర్గం కరిగిపోవడంగా సూచించారు రావిశాస్త్రి.
రావిశాస్త్రి కి సైగల్ పాటలంటే ప్రాణం. సైగల్ పాట వినడంలో రావిశాస్త్రి పొందే అనుభూతి ప్రత్యేకమైనది. సైగల్ పాటకి పాపాలను కడిగేసే శక్తి ఉందని, ఆ పాట అతి పవిత్రమైనది అని నమ్మారు .
సైగల్ కథలో రామారావు పాత్ర క్రూరమైన మనస్తత్వం కలిగినదే అయినా పార్క్ లో సైగల్ పాట విని అతని మనస్తత్వంలోనే గొప్ప మార్పు కలగడం మంచికి మారడం పాఠకులు నమ్మలేనిదే అయినా రావిశాస్త్రి వర్ణనలో, రూపుకట్టించిన పద చిత్రాలలో, వాక్యాల కూర్పులో, వాడిన అలంకార ప్రయోగంలో రచయిత తో పాటుగా పాఠకుడిలో కూడా సైగల్ గొప్పదనాన్ని విశ్వసించే విధంగా చూపబడింది.
ఈ పాటలో
వెన్నెల వెలుగులున్నాయా
చుక్కల తళుకులున్నాయా
చిక్కని చీకట్ల నునుపులున్నాయా
ఇంద్ర ధనుస్సుల రంగులున్నాయా
వేడికొండల నిట్టూర్పులున్నాయా
ఈ పాటలో
ప్రియురాలి విరహముందా
పడుచు రక్తపు ప్రవాహముందా
స్మృతులే మిగిలిన ముసలివాని బోసి నవ్వుందా
పసిపాపల హాసముందా
సీతాదేవి శోకముందా
రాథేయుని హృదయముందా
ఈ పాటలో
ఏవేవో ఉన్నాయి
ఎన్నెన్నో ఉన్నాయి
కానీ
ఈ పాటలో పాపాల్లేవు
ఈ పాట పాపాన్నెరుగదు....
అలాగే కలకంఠి కథలో మానవ జీవితాలలోని అనంతమైన వైవిధ్యాన్ని వర్ణించడానికి మానవ కంఠాలకు ఆ వైవిధ్యాన్ని ఆపాదిస్తూ కవితాత్మకంగా వాక్యాలు పేర్చారు.
అసహాయంగా జాలిగా కుంగిపోతాయి
అదృష్టం బావుండక పోతే ఉత్తరించుకుపోతాయి
ఇంపుగా పలుకుతాయి
శ్రావ్యంగా పాడతాయి
సొంపుగా కలకల్లాడతాయి
పూలమాలల్తో కావలించుకుపోతాయి
ముత్యాల హారాల్తో ముడివేసుకుపోతాయి
పచ్చటి పుస్తేల తాళ్ళతో బంధించుకు పోతాయి
చిత్రమయిన పనులు చాలా చేస్తాయి మానవ కంఠాలు.
నిజానికి పై ఉదాహరణలలో పేర్కొన్న వాక్యాలన్నీ వచనంగా వరుసగా రాయబడినవే. కానీ పాదాలుగా విభజించే వీలుండే సౌలభ్యం వలన కవితా ఖండికలుగా చూపించడం కోసం ఇలా రాసి చూపడం జరిగింది.
రావిశాస్త్రి వచనంలోన వాక్య నిర్మాణంలోని తూగు, లయ కలిగిన కవితాత్మకత అనే లక్షణం వలన వీటిని కవితా ఖండికల గా చూడగలం. శ్రీశ్రీ తనను ఉర్రూతలూగించాడని, శ్రీశ్రీ గేయాలు రాసే భాషలో కథలు రాయాలని ఉండేది అన్నారు ఒకచోట రావిశాస్త్రి. జీవిత వాస్తవాన్ని చూసే కళ్ళుంటే, కాదేదీ కవితకనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన వస్తువులను కథలుగా మలచడంతోపాటు ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం అని శ్రీశ్రీ అన్నట్టుగానే తన కథలలో కవితావేశం ప్రదర్శించి పాఠకులలో రసనిర్దేశం చేసారు రావిశాస్త్రి.
చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కవితా ఖండికలు దొరుకుతాయి రావిశాస్త్రి వచనంలో.
వచనం రాసే వారిలో నికరమైన కవి......
రావిశాస్త్రి వచనంలో అలా అలా అంతర్లీనంగా ఆయనదే ఐన ఒకానొక అద్భుత కవిత్వం ఒదిగి పోయింది. ....అవకాశం దొరికిన ప్రతిచోటా ఉత్తమ శ్రేణి కవిత్వం స్వాభావికంగా వచ్చి చేరిపోయింది -
అన్న ప్రశంస అక్షర సత్యంగా కనిపిస్తుంది.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి
కథలలో కవిత్వమే రాస్త్రి !!
13 July 2010
నెచ్చెల్లి
అక్కచెల్లెళ్ళ పొత్తు పెళ్లి వరకే అని, అన్నదమ్ముల పొత్తు పెళ్ళి తర్వాతే అని సామెత. పెద్దవాళ్ళు అంటూండగా విన్నాను.
నేనూ మా చెల్లి చిన్నప్పుడు పోట్లాడుకునేవాళ్ళం కేవలం మాటలతోనే. దాన్ని వాదులాట అనాలేమో.
ఏదో ఒక విషయం అలా అలా చిలికిచిలికి వాదనకు దారితీసేది. ఓ పది నిముషాలు,మహా అయితే అరగంట మాట్లాడుకునే వాళ్ళం కాదు. పాపం తనే ముందు మాట్లాడేసేది. నాకు కొంచెం పొగరు ఎక్కువే. నేను దానికి అభిమానం అని పేరు పెట్టుకున్నా దాన్నే అందరూ పొగరు,తిక్క అనేవారు.(యద్దనపూడి హీరోయిన్ లాగా).
కానీ ఇద్దరం కలిసి సంతోషంగా ఆప్యాయంగా గడిపిన కాలమే ఎక్కువ మా మధ్య. నాకు పెళ్లయిన తర్వాత కూడా ఈ పొత్తు అప్పటిలాగే నిత్య నూతనంగా నిలిచే ఉంది. ఇందులో గొప్ప విశేషం ఏమీ లేదు. కానీ ఎందుకో చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరేసుకోవాలనిపిస్తుంది. ఆనాటి ఆ హాయి రాదేమి నేస్తం...ఆ జ్ఞాపకాలెంత మధురాతి మధురం... కదూ...
మాది ఉత్తరాంధ్ర ప్రాంతం. నాన్నగారికి హైదరాబాదులో ఉద్యోగం. నాన్నగారు ఆఫీస్ టూర్లో ఉండడం వల్ల కొన్ని కుటుంబ సంబంధమైన కారణాల వల్ల కొంతకాలం మా అమ్మకి హైదరాబాద్ వదిలి అత్తగారి ఊరికి వెళ్ళవలసి వచ్చింది. మాకు చిన్నతనం నుంచి హైదరాబాద్ కన్నా శ్రీకాకుళం అంటేనే మక్కువ. అమ్మమ్మదగ్గర ఉండడమే ఇష్టం. అప్పటికి మా పిన్ని హైస్కూల్, మామయ్య కాలేజీలో చదువుతూ ఉండేవాడు. మమ్మల్ని శ్రీకాకుళం స్కూల్లో జాయిన్ చేసి, మాకన్నా ఐదారేళ్ళు చిన్నదైన చెల్లిని తీసుకొని అమ్మ వెళ్ళిపోయింది. నాకు ఏడు, చెల్లికి ఐదు ఏళ్ళు. అప్పటినుండి ఓ నాలుగేళ్ళు శ్రీకాకుళంలో చదువుకున్నాం. నాగావళి ఒడ్డున ఆడుకున్నాం. తీపి జ్ఞాపకాలెన్నో మూటకట్టుకున్నాం.
పిన్నిరోజూ సాయంకాలం మా ఆటలు అయిపోయాక కూర్చోబెట్టి అందరికీ చందమామ కథలు చెప్పేది. పరోపకారి పాపన్న కథలు, పాదుషా గారి కథలు, బేతాళ కథలు అన్నీ వినేవాళ్ళం. తర్వాత మేమే చదువుకునేవాళ్ళం కూడ బలుక్కుని.
నేను చందమామ కథలు చదువుతున్నానని, నేనూ చదువుతా అనేది మా చెల్లి. చందమామ చేతిలోకి తీసుకొని రెండు కాలమ్ లో ఉన్న వాటిని అడ్డంగా కలిపి చదివేది. అర్థంకాలేదు - అనేది. అలాకాదు ఇక్కడ ఇలా బ్రేక్ ఇవ్వాలి అని చెబితే వినిపించుకునేది కాదు.
ఎవరేమిచ్చినా మా అక్కకో అని అడిగేది. అక్కవంతు కూడా పుచ్చుకున్నాక కానీ తనకి ఇచ్చినది తినేది కాదు. మా అక్కకో అన్నపదాన్ని కలిపేసి మొక్కకో....అనేదిట. చాలా కాలం దాన్ని వెక్కిరించే వారు మా పిన్ని వాళ్లు.అలా ఎంతో ప్రేమగా ఉన్నట్టే ఉండేవాళ్ళం.కానీ ఏదో విషయంలో ఇద్దరికీ గొడవ వచ్చేసేది. దానికి కోపం వస్తే నాకసలు భయం లేదు. ఎందుకంటే.... అక్కా...నిన్నసలు అక్కా అని పిలుస్తానేమో చూడు....హు అనేది. ఎప్పుడూ అదే బెదిరింపు.
ఇప్పుడే పిలిచావుగా పోవే అనేదాన్ని. పాపం మొహం చిన్నబుచ్చుకునేది. అంటే అక్కా అనకుండా మాట్లాడలేకపోయేదన్నమాట. నేను చాలాకాలం చెల్లీ అని పిలుద్దామని అనుకునేదాన్నికానీ పిలిచేదాన్నికాదు.
అప్పుడు లేతమనసులు సినిమా లో పప్పి, లల్లి పాత్రల పేర్లతో పిలిచేవాళ్లు మమ్మల్ని కొన్నాళ్లు. ఇద్దరికీ ఒకే రకం గౌన్లు కుట్టించి వేసేవారు.
అమ్మమ్మ ఇంట్లో ఓ కొట్టుగది ఉండేది. అతి చిన్నది. చీకటిది. దానికి ఓ చిన్న కిటికీ. రామదాసుని జైల్లో ఉంచిన గది కిటికీలాగ. ఒక మీటరు చదరం. దానికి అడ్డంగా రెండు గజాలు. పిన్ని స్టడీ రూమ్ అది. మేము, మా పిన్ని అందులో దూరిపోయి సినిమా కథలు బోల్డు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. పిన్ని ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయి వాళ్ళ కబుర్లు వింటూ ఉండేదాన్ని.
పిన్ని వాళ్లు అప్పటికి టీనేజ్. కలెక్టర్ జానకి, పండంటి కాపురం సినిమాలు చూసి పిన్ని ఫ్రెండ్స్ జమున ఏ రంగుల చీరలు కట్టిందో ఒక పాటకి ఎన్నిచీరలు మార్చిందో ..వాణిశ్రీ చెవులకి ఎలాటి దుద్దులు పెట్టిందో చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అవన్నీ బాగానే అర్థం అయేవి. కానీ కొన్ని సార్లు వాళ్లు సినిమా కథలు చెప్పుకుంటున్నప్పుడు నా వంక అదో రకంగా చూసేవారు. వాళ్లలో వాళ్లు కళ్ళు కలిపి నవ్వుకునేవారు. ఇది చెప్పీస్తుందే జాగర్త లాటివి అనేవారు. సినిమా కథ - వాళ్లు కదా చెప్తున్నారు, నేనేం చెప్పేస్తాను అనుకునేదాన్ని. వాళ్లు కథలో ఎప్పుడు ఆపి ఇలా చేస్తున్నారో క్రమంగా గమనిస్తూ ఉండేదాన్ని. మళ్లీ ఆ సినిమా చూసే వాళ్లం కదా అప్పుడు అర్థమయిపోయేది. అది హీరో హీరోయిన్ ఫస్టు నైట్ సీన్లన్నమాట. అలాగే విలన్ రేప్ సీన్లు వచ్చినప్పుడు. అప్పట్లో గిరిబాబు- ఏదో సినిమాలో మోహన్ బాబు అన్నట్టు రేపుల రాముడు. రెచ్చిపోయేవాడు విలన్ గా. తను కమేడియన్ గా మారాక హమ్మయ్య అనుకున్నాను కానీ గిరిబాబును చూసినప్పుడల్లా ఏదో తెలీని భయం వెంటాడేది.
ఇలాంటి కథలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ నాకన్నా చిన్నది కదా అని మా చెల్లిని కొంచెం అవాయిడ్ చేసేవాళ్లం.అప్పుడు దానికి కోపం వచ్చేది. అల్లరి చేసేది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. అమ్మమ్మ, తాతగారు, మామయ్య ఏమయ్యారో మరి. గుర్తులేదు. ఆ రోజు మా చెల్లి రెచ్చిపోయి అల్లరి చేసింది. ఆఖరికి భరించలేక దాన్ని లాక్కొని వెళ్ళి పెరటిలో చెట్టుకు తాడుతో కట్టేసి వచ్చాం. ఇప్పటివాళ్లకు ఆ ఇళ్లు, పెరడు అంటే తెలీదు. అవి ఎంత పెద్ద ఇళ్ళు, ఎంత పెద్ద పెరళ్ళు. ఆ పెరట్లో అరటి తోట లాగ ఉండేది. చీకటి పడే టైం లో కట్టేసి పాపం తలుపేసేసి వచ్చాం.
మళ్లీ కొట్టు గదిలో దూరి దాన్ని ఎలా కట్టేసామోనని నవ్వుకుంటూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఆ వీధి తలుపు ఎంత దూరమో...వెళ్లి తీసేసరికి భౌ మంటూ మా చెల్లి ప్రత్యక్షం. ఆ ఇళ్ళు రెండిటికి కలిపి కామన్ పెరడు అది. పక్కవాళ్లు దీన్ని పెరట్లోకి వచ్చినప్పుడు చూసి అయ్యో అని తాడు ఇప్పేసారుట. పెరటి తలుపు తెరుచుకొని చుట్టూ తిరిగి వీధిలోంచి వచ్చేసింది.
చిన్నప్పటినుంచి చాలా దైవభక్తి ఎక్కువ మా చెల్లికి. ఇంటి పక్కనే కోటేశ్వరుడి గుడి. పక్కనే నాగావళి. ఇద్దరి కేరాఫెడ్రస్ బడి తప్పితే గుడి. అంతే. కానీ నాకెప్పుడు భక్తి లో గురి కుదరలేదనిపిస్తుంది.
ఓసారి వనభోజనాలకెళ్ళాం ఏటి ఒడ్డున. ఆ స్థలం పేరు నాకు గుర్తులేదు. అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చారు. కొత్తగా పరిచయం అయిన పిల్లలతో మా చెల్లి ఆడుకుంటూ ఉంది. ఇంటికి వచ్చేసాం. రాత్రి దానికి చాలా జ్వరం వచ్చిందిట. బాగా ఒణికి పోయిందిట. మర్నాడు మామయ్య చెప్తే నాకు తెలిసింది. ఇంకా తర్వాత తెలిసిందేమిటంటే ఆ ఏటి ఒడ్డున మనుషులను కాలుస్తారు అని, దయ్యాలుంటాయని దాని ఫ్రెండ్స్ చెప్పారుట. అక్కడ కాలుతున్న శవాలు కూడా చూసిందేమో మరి. జడుపు జ్వరం వచ్చిందన్నమాట.పదిరోజులు పట్టింది. ఆ జ్వరం దిగడానికి. మా మామయ్య ఆంజనేయ దండకం నేర్పించాడు దానికి. భక్తిగానే నేర్చుకొని చదివి ఉంటుంది.
మా తాతగారు బ్రూక్ బాండ్ కంపెనీ ఏజెంట్ గా పనిచేసేవారు. మా కా టీ ఏజెంట్ పదానికి అర్థం ఏంటో తెలీక పోయినా మీరెవరు అంటే టియ్యేజంట్ గారి మనవలం అని గర్వంగా చెప్పేవాళ్లం. ఆయన మాకు బాంకరు. బాగా డబ్బులిచ్చేవారు. ఒక్కొక్క రోజు చేతి రుమాలు నిండా చిల్లర పైసలు మూటలాగా కట్టి మా ఇద్దరికి ఇచ్చేవారు. ఆయన పని చేసే డిపో మా స్కూలు పక్కనే ఉండేది.
మా చెల్లితో నాకు మరో పేచీ ఉండేది.
ఆయన రోజు డిపోకి వెళ్లే ముందు ఇద్దరికీ చెరో ఐదు పైసలు పాకెట్ మనీ ఇచ్చేవారు.(రోఝూ) ఒక్కోసారి చిల్లర లేకపోతే చిన్నది కదా దాని చేతిలో పది పైసలు పెట్టి ఇద్దరూ పంచుకోండి అని చెప్పి వెళ్ళేవారు. నేను నాదగ్గర ఉన్న ఐదు పైసలు ఇచ్చి ఆ పది పైసలు ఇవ్వమనేదాన్ని. లేదా నీ దగ్గర ఐదు పైసలు ఉంటే ఇవ్వమనే దాన్ని. ఊహు....దానికి అర్థం కూడా అర్థమయేది కాదు. నా పది పైసలు నువ్వే తీసుకుంటున్నావు...తాతగారు నాకు ఇచ్చారు అని గోల పెట్టేది. నా ఐదు పైసలు నీకు ఇచ్చాను కదా అంటే అర్థమయేది కాదు. ఆ పదిపైసల బిళ్ళ నేను తీసుకోవడమే దానికి అర్థమయేది. అదో పేచీ. మళ్ళీ మా మామయ్య వచ్చి పదిపైసలకి చిల్లర తెచ్చి ఇద్దరికీ చెరో ఐదు పైసలు ఇచ్చేవాడు.
ఇలా రోజూ ఐదు పైసలు ఇచ్చినా మళ్లీ డబ్బులు కావలసి వచ్చేవి...ఎందుకంటే అప్పుడు ఐదుపైసలకి ఒక పాలయిసు, రెండు కలర్ వి- పుల్లయిసులు(స్టిక్ అయిస్ ) వచ్చేవి. ఒక అయిస్ క్రీమ్(గడ్డకట్టిన రంగు నీళ్లు) తో డబ్బులయిపోయేవి. మరి కాశీ పట్నం చూడర బాబూ అని వచ్చేవాడు కదా. అది చూడాలంటే ఐదుపైసలు ఇవ్వాలి కదా. నాకు నా ఫ్రెండ్స్ కి, ఇంకా మా చెల్లికి. అప్పుడు పరిగేఠ్ఠుకెళిపోయేవాళ్లం మా బాంకరు తాతగారి దగ్గరికి. చేతికి ఎంత వస్తే అంత చిల్లర పెట్టేసే వాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు అమ్మా క్వాలిటీ ఐస్ క్రీమ్ వాడొచ్చాడు. కార్నెట్టో కొనుక్కుంటాం. 30,30 అరవై రూపాయలు కావాలని అడిగితే, అదీ రోజూ కాకపోయినా మనసు బాధగా ఉంటుంది.
తర్వాత నేను డిగ్రీ అయిపోయాక కొంతకాలం ఖాళీగా ఉండి తర్వాత ఓ చిరుద్యోగం చేసాను కొన్నాళ్లు. ఇంక ఈ బ్రతుకు ఇలా తెల్లారి పోవల్సిందేనా అని రెణ్ణెల్లకే నిరాశ వచ్చేసింది. కానీ మా చెల్లి ప్రయత్నం వల్ల హైదరాబాదు యూనివర్సిటీ లో తెలుగెమ్మే లో జాయిన్ అయాం ఇద్దరం ఒకేసారి. అప్పుడు తన ప్రయత్నం లేకపోతే పీహెచ్ డీ అనే ఇంత వరకూ వచ్చి డిగ్రీ సంపాదించడం జరిగేది కాదని మాత్రం కాదని ఘంటాపథంగా చెప్పగలను. మోడల్ పేపర్ ప్రకారం ప్రశ్నలకి జవాబులు తయారు చేసి నోట్సు రాసి చాలా ప్రిపరేషన్ చేసి నాతో కూడా చేయించింది. ఇద్దరం ఒకేసారి జాయినయ్యాం. ఎమ్మే, ఎంఫిల్, పిహెచ్.డి సమయంలో ఓ ఐదేళ్ళు ఒక్క రోజు కూడా వదలకుండా కలిసే తిరిగాం.
మా ఇద్దరినీ బాగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు చాలా మంది. అంత పోలికలు లేకపోయినా. పేర్లు ఇద్దరివీ మొదటక్షరం మాత్రమే తేడా. ఒకర్ని చూసి ఒకరనుకోవడం అనే కామెడీ ఎపిసోడ్లు చాలా జరిగాయి యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా. బాగా పరిచయం అయిన తర్వాత అబ్బే అంత పోలికలేంలేవే అని వాళ్ళే అనేసేవాళ్లు.
ఇద్దరం షాపింగ్ కి వెళ్తే దాని చేతిలో ఏముందో చూస్తా. అది కొనుక్కో బోతోంది అని నిశ్చయమయితే చాలు మీద పడిపోతా....నాక్కావాలంటూ. అది ఎంచుకున్న రంగే నాకు నచ్చుతుంది. దాని మొహంలో అసంతృప్తి కనిపించిందా మరి ఆ చీర నాకెంత నచ్చినా కొనుక్కోలేను. కట్టలేను. ఒకవేళ కచ్చితంగా కొనవలసి వస్తే కూడా అది కొనుక్కున్నలాంటి పీస్ కావాలని అడుగుతా.
కొన్నాళ్ళు చెన్నై లో గడపవలసి వచ్చినా ఇప్పుడు హైడ్ చేరిపోయి అమ్మ వాళ్ళ పక్కింట్లోనే ఉండడం వల్ల మళ్లీ హాయిగా గడుపుతున్నాం. రోజూ చూసుకోకపోతే, ప్రతి రెండుగంటలకొకసారి ఫోన్ చేసుకోకపోతే తోచదు కూడా.
మనిషి మీద ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతు ఉంటాయంటారు. అలాంటి సంఘటన మా ఇద్దరి మధ్య జరిగిందోసారి.
తనకి పదహారు, నాకు పద్ధెనిమిది. మంచి ఎండవేళ. పుస్తకం చేతిలో పెట్టుకొని చదువుతూ పడుకున్నా. అమ్మ ఇంటిలో లేదు. మా చెల్లి ఫ్రెండ్ వస్తే దిగపెట్టి వస్తానని బయటకి వెళ్తూ తలుపేసుకోమంది. తలుపేసి పడుక్కున్నా.
నాకు కల వచ్చింది. అక్కా....అక్కా అని ఏడుస్తోంది మా చెల్లి. తన కాలులో మేకు గుచ్చుకుంది. రక్తం బాగా వస్తోంది. అక్కా అక్కా అని ఒకటే ఏడుపు. నాకు ఏదో బాధ...కలలో కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. ఇంతలో మెలకువ వచ్చింది. తలుపు శబ్దం...వెళ్లి తలుపు తీసి మా చెల్లిని చూసి అడిగాను...బాగా లోపలికి దిగిందా...నొప్పెడుతోందా అని. తను ఆశ్చర్య పోయింది. నీకెలా తెలుసు అంది. అవును మేకు గుచ్చుకుంది కదా...ఏడ్చావు అన్నాను. అలా ఉండి పోయింది. నెమ్మదిగా తెలిసింది. తను వస్తుంటే దారిలో పెద్ద మేకు లేదా పదునైన ఇనప వస్తువేమో కాలిలో చెప్పులోంచి పాదంలో గుచ్చుకుందిట. బాగా రక్తం కారుతోందిట. నడవలేక పోతోందిట. అక్క ఇంట్లో ఉంది. అక్కకి తెలీదు. అక్కా ...అక్కా అని చాలా సార్లు మనసులోనే తల్చుకుందిట. అక్కడ ఒక టైలర్ మాకు తెలిసినవాడు చూసి తనదగ్గర ఉన్న బట్టముక్కలతో బాగా నొక్కి కట్టు కట్టి పంపించాడుట. కుంటుకుంటూ వచ్చి గుమ్మందగ్గర నిల్చుందిట. అక్కకి తెలీదు...అనుకుంటూ . నేను ఆ విషయం బాగా తెలిసినట్టు అడగడం తో ఆశ్చర్యంతో అలా ఉండిపోయింది. నాకు ఇప్పటికీ కలలో వచ్చిన ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఇలాంటి వేవ్ లెంగ్త్ కలిసిన విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి.
నేను శ్రీకాకుళం వెళ్లి వచ్చాక నాగావళినవ్వింది అని నా బ్లాగులో టపా రాస్తే ....తాను కూడా జస్ట్ అంతకు ముందే నాగావళిమీద కవిత రాసేనని తెచ్చి చూపించింది. నేను ఒకరోజు పిచికల గురించి బాధ పడుతూ కనబడుటలేదు అని టపా రాసి తనకి చూపిస్తే తను రాసిన నేస్తం కవిత చూపించింది. ఒకే ఆలోచన ఒకే సారి ఇద్దర్లోనూ కలిగిందన్నమాట.
నేను మనసుపడిన ఏదైనా త్యాగం చేసేస్తుంది పాపం. చెప్పానుగా, చీరలైనా, డ్రెస్సులయినా నాకు బాగా నచ్చింది, ఇచ్చేయమంటే ఓకే అనేస్తుంది. కానీ ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు అన్నట్టు... ఒక్క దగ్గర మాత్రం నో.......
ఇద్దరికీ సావిత్రంటే మహా ఇష్టం. సావిత్రిలా ఉన్నావు అని ఎవరేనా అంటే ఇక ఈనాము లిచ్చేస్తాం. కానీ అన్ని సావిత్రులు ఇద్దరికీ అక్కర్లేదు. సుమంగళి సావిత్రి, నిర్దోషి సావిత్రి ఉన్నాయనుకో. అవి అక్కర్లేదన్న మాట. మూగమనసులు సావిత్రి, ఆరాధన సావిత్రి, కన్యాశుల్కం సావిత్రి లాంటివి మాకిష్టం. అక్కడ మాత్రం ఇద్దరికీ పడదు. ఎవరికి వాళ్ళం నేనే సావిత్రిలా ఉంటామని ఆనందిస్తాం....(చచ్చినా ఫోటో చూపించను....)
ఎప్పుడూ నా సంతోషాన్ని కోరుకుంటుంది. సదా నా అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఓ బొమ్మ వేసినా, కథ రాసినా బావుందంటుంది కదా మా చెల్లి. నేనంటే ఎంతో ఇష్టం నా చెల్లికి.
నాకు చేతనయినది తనకు చేతకానిది కంప్యూటరొక్కటే. అందుకే తన కోసం ఒక బ్లాగు పెట్టాను. తను రాసినవి చాలా ఉన్నాయి. క్రమంగా అన్నిటినీ యూనికోడీకరించి బ్లాగులో పెట్టాలి. నా టపాలు చదివిన వాళ్ళు తనవి కూడా చదవాలి. నాకదో తుత్తి.
అదీసంగతి. నావి ఇల్లాలి ముచ్చట్లయితే తను కలభాషిణి అన్నమాట.
సో .... నా చెల్లి నా నెచ్చెలి....ఇప్పుడు నెట్ చెల్లి - నెచ్చెల్లి.....
03 July 2010
అందాల అరకులోయ
అరకులోయని తలచుకుంటే మనసు పులకరిస్తుంది. కొండలు, లోయలు, నీలిమబ్బులు, ఆకుపచ్చని బయళ్ళు , కొండల మధ్య అగాథాలలోకి దూకుతున్న జలపాతాలు అన్నీ అందమైన ప్రకృతికి సాకారాలు.
ఏమాత్రం భావుకత ఉన్నవారికైనా-
ఆకులో ఆకునై , పూవులో పూవునై ,
కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా.....
అంటూ కృష్ణశాస్త్రి ఆవహించి తన్మయత్వంతో పరవశంగా పాడాలనిపిస్తుంది.
పదమూడేళ్ళవయసులో మొదటిసారి అరకులోయను చూసాను.
మా నాన్నగారు అరకులోయలో ఆఫీసుపని మీద ఆడిటింగ్ చేస్తున్నారు అప్పుడు. అనారోగ్యంతో ఉన్న మాతాతగారిని చూడడంకోసం విశాఖపట్నం వెళ్ళాం మేము. అరకులోయ చాలా బాగుంటుందని, తప్పకుండా చూడవలసిన ప్రదేశమని నాన్నగారు చెప్పడంతో ఆదివారం నాడు బయలుదేరాం. పొద్దున్నే 7గం.కి ఎక్కామనుకుంటా విశాఖపట్నం స్టేషన్ నుంచి కిరండల్ పాసెంజరు రైలులో.
అది 19, నవంబరునెల, 1978. ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తుందే అని నవ్వుతుంది మా అమ్మ.
అవును. ఆ రోజు రైల్లో ఓ ప్రయాణీకుడు పేపర్ చదువుతున్నాడు. రైలు మానవ నిర్మితమైన బ్రిడ్జీల మీద కొండలు,గుట్టలు దాటుతూ వెళ్తోంది. పచ్చని ప్రకృతి మనసుని ఆహ్లాద పరుస్తూ ఉన్నా ఏ క్షణమైనా రైలు లోయలో పడిపోతుందేమోనని భయంగా అనిపిస్తూ ఉంది నాకు. అప్పుడే ఆ పేపర్ లో పెద్ద శీర్షికతో జలప్రళయం వచ్చి ఏడాది అయిందంటూ వ్రాసి ఉండడం చూసి ఈ ఏడాది ఈ ట్రైన్ పడి పోయే న్యూస్ ఉంటుందేమోనని భయపడిపోయాను. ఏంకాదులే అని నాన్న ధైర్యం చెప్పారు. అందుకే గుర్తుందన్నమాట.
ఆ రైలు సొరంగాలలోంచి దూసుకుపోతుంటే చీకటిగా అయిపోయింది. బోగీలో ఉన్న కుర్రాళ్ళందరూ ఈలలు, కేకలుతో మహా సందడి చేసారు.
ఈ కిరం డోల్ రైలునే దొంగల బండి అని కూడా అనేవారు మావాళ్లు అప్పుడు. దీనిని కెకె పాసెంజరు అంటారు. కొత్తవలస - కిరండల్ మధ్య నడిచే పాసెంజరు రైలు ఇది.
సరే...అలా రైలు అన్ని చోట్లా ఆగుతూ సాయంత్రం 4 గం.కి అరకు స్టేషన్ చేరింది. అప్పుడు ఇప్పటిలాగా సౌకర్యాలు లేవు. ఆటోలులేవు. అలా నడుచుకుంటూ ఓ కిలోమీటరు వెళ్ళాక టూరిజం వాళ్ళ కాటేజీలకి చేరాం.
అప్పుడు డ్రైవర్ రాముడు సినిమా నిర్మిస్తున్న రోజులు. సినిమాలో చాలా భాగం అరకులోనే తీసారు. ఎన్టీఆర్ లారీ డ్రైవర్, జయసుధ చిన్న కొట్టు నడుపుతూ ఉంటుంది.
ఆ కాటేజీ సినిమా యూనిట్ వాళ్ళు తీసుకోవడం వల్ల కొత్తగా కడుతున్న కాటేజీలని మాకు కేటాయించారు. నవంబరు నెల. అరకులో విపరీతమయిన చలి. పగలే ఒణికిపోయాం. కాటేజి దొరుకుతుందన్న ఉద్దేశంతో పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదు. దుప్పట్లు లేవు. కొత్తగా కడుతు ఉండడంతో కాటేజీ నేల చల్లగా గడ్డ కట్టేస్తామేమోనన్నంత చలి. సినిమావాళ్ళు పక్కనే ఉన్నారన్న ఆనందంలో మాకు పెద్ద బాధనిపించలేదు కానీ మా నాన్నగారు ఈ సినిమావాళ్ళు ఇప్పుడే రావాలా అని చికాకు పడ్డారు.
ఇంతలో మేమున్న గదిలోకి తొంగిచూసారు ఒకాయన- ఏంట్రా ఇక్కడున్నారు అంటూ .
ఎవరో అని చూస్తే ఆయన- మాడా. మాడా వెంకటేశ్వరరావు. మేము 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తూ గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఫస్టుక్లాసులో కలిసి ప్రయాణం చేసాం. ఆ ట్రయిన్ ఆరోజు పొద్దున్న 6 గంటలకి చేరవలసినది, సాయంత్రం 6 గంటలకి చేరుకుంది. ఈ ప్రయాణంలో మాడా గారు మా కూపేలో మాతో పాటే కూర్చొని చాలా సేపు కబుర్లు చెప్పారు. తాను సివిల్ ఇంజనీరని, అనంతగిరి హిల్స్ లో ఉద్యోగానికి శలవుపెట్టి సినీ ఫీల్డు కి వచ్చానని చెప్పారు. అప్పటికి చిల్లరకొట్టు చిట్టెమ్మ ఆయనకి బాగా పేరు తెచ్చిన సినిమా. ఇక సినీ ఫీల్డులో స్థిరపడినట్టుగా భావించి ఈసారి ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పారు. అరకులో షూటింగ్ ఉందని కూడా చెప్పారు. మాకు అప్పటికి అరకు ప్లాన్ లేదుగా..ఆయనకి చెప్పలేదు. అక్కడ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారందుకే. మాకు మాడా ఫ్రెండయినందుకు చాలా సంతోషంగా ఉన్నాం నేను, మా చెల్లి.
మర్నాడు పొద్దున్న మా నాన్నతో అక్కడ పద్మా గార్డెన్స్ కి వెళ్ళాం. లవంగ మొక్కలు, దాల్చినచెక్క రకరకాల ఔషధ మొక్కలు పెంచడాన్ని అక్కడి వాళ్లు చూపించారు. అన్నిటివీ శాంపిల్ ఆకులు తీసుకున్నా. ఫ్రెండ్స్ కి చూపిద్దామని.( ఇక్కడికి వచ్చేసరికి అన్నీ వాడిపోయి ఏ ఆకు దేనిదో మరిచిపోయి అన్నీ పారేశా)
అక్కడ పట్టు పరిశ్రమ ఏమిటో పట్టు పురుగుల పెంపకం ఎలా జరుగుతుందో చూశాం. పట్టు పురుగులు మల్బరీ ఆకులు తింటూ లుక లుక పాకుతూ ఉన్నాయి.వాటిచుట్టూ అల్లుకున్న గూళ్ళనుంచి పట్టు దారాన్ని ఎలా తీస్తారో వివరించారు.
మధ్యాహ్నం ఆలా షికారు వెళ్ళాం. అక్కడ ఒక మైదాన ప్రదేశంలో కొందరు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇద్దరు కుర్రాళ్ళు తెలిసినట్టుగా అనిపిస్తే ఆగి చూసాం. వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాల కృష్ణ. మాకు మహదానందమయిపోయింది. దారంతా పసుపురంగు పూలతో నేలంతా పసుపు ఎండబోసినట్టుంది. అది అవిస(వలిసె అని అనాలా) పూలని, అందులోంచి నూనె తీస్తారని చెప్పారు.
మా కాటేజీ పక్కన చాలా మంది మూగి ఉన్నారు ఏమిటా అని చూసేసరికి కాటేజి మెట్టుమీద ఎన్టీ రామారావుగారు నిలబడి నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నారు.తర్వాత జయసుధ కూడా బయటకి వచ్చారు. ఇలా తారాదర్శనం మాకు అరకు జ్ఞాపకాలతో పాటు మిగిలింది.
మళ్లీ 1987లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం విహారయాత్రలో భాగంగా బస్ లో అరకు చూసాం.కానీ గుహలలోంచి వెళ్ళే రైలు ప్రయాణం మిస్సయి పోయారు మా ఫ్రెండ్సు. అప్పడు బొర్రా గుహలకి వెళ్లాం. అప్పటికి బొర్రా గుహలని విద్యుదీకరించలేదు. మధ్యాహ్నం వెళ్ళినవాళ్ళం సాయంత్రం చీకటి పడేవరకు గుహలలోనే గడిపాం. అప్పుడు వెలుతురు కోసం కొందరు మనుషులు కాగడాలు పట్టుకొని వచ్చేవారు. కొన్ని చోట్ల ఆడపిల్లలం వెళ్ళలేదు కానీ కొందరు అబ్బాయిలు చాలా లోపలికి వంగి డేక్కుంటూ వెళ్ళారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం.
మళ్లీ 2009 డిసెబరులో పిల్లలతో విశాఖపట్నం లో పెళ్ళికి వెళ్తూ హైదరాబాద్ నుంచే ఎ.పి. టూరిజం వాళ్ళ అరకుపాకేజి టూర్ లో టికెట్లు రిజర్వ్ చేసుకున్నాం. కొత్తవలస- కిరండల్ పాసెంజరు అది. . పొద్దున్న ఆరుగంటలకల్లా బయల్దేరి పోతుందని భయపెట్టారు కానీ 6.30 దాటింది. రైలు కంపార్టుమెంటు మాత్రం ఘోరంగా ఉంది. ప్రయాణీకుల మీద రైల్వేవారికి బొత్తిగా లక్ష్యం లేదని నిరూపిస్తుంది ఈ రైలు. చెక్కబల్లలతో సీట్లు, కంపు టాయిలెట్లు, రిజర్వ్ చేసుకున్నా చోటు చాలనట్టుగా ప్రతి స్టేషన్ లో ఎక్కిపోయి కిక్కిరిసిపోయే జనం.
అయినా ఈ ప్రయాణంలో దట్టమైన అడవులను చీలుస్తూ లోయలతోతులను అధిగమిస్తూ పోతున్న రైలు సరదాలో ఇవన్నీ ఎవరూ పట్టించుకోరని వారి ధీమా.
ఈ సారి నా దగ్గర డిజిటల్ కెమేరా ఉండడంతో నా ఉత్సాహం పట్టనలవి కాలేదు. బోల్డు ఫోటోలు తీసుకున్నాను.
కూ ఛుక్ ఛుక్ మంటూ ఎలా వెళ్ళిపోతోందో చూసారా మా రైలు.. ఈ సొరంగాలలోంచి రైల్లో వెళ్లే అనుభూతిని పొందాలంటే ఇక్కడ చూడండి.అరకులోయలో గిరిజన స్త్రీలు ఎంతదూరంనుంచి వస్తున్నారో ఎక్కడిదాకా వెళ్తారో మరి
అడవులు, కొండలు వాగులు వంకలు ఏవీ తమకు అడ్డు రాలేవన్నట్టుగా నడుస్తూనే ఉన్నారు. తలలమీద భారంతో, చంకల్లో బిడ్డలతో.
అడవులు, కొండలు వాగులు వంకలు ఏవీ తమకు అడ్డు రాలేవన్నట్టుగా నడుస్తూనే ఉన్నారు. తలలమీద భారంతో, చంకల్లో బిడ్డలతో.
మా రైలు చిన్న సొరంగమార్గాల గుండా వెళ్తూ ఉంటే చీకటిగా అయిపోతూ వెంటనే వెలుతురు నిండుతూ గమ్మత్తైన అనుభవం.ఇలాంటి గుహలు సుమారు 42 దాకా ఉన్నట్టున్నాయి. కొన్ని 1 కి.మీ. పొడవున్నాయిట.
ఈ మార్గంలోనే శిమిలిగుడ అనే రైల్వే స్టేషన్ వస్తుంది. భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో ఎత్తైన రైల్వే స్టేషన్ అట ఇది. కానీ నేను ఆ బోర్డు మిస్ అయాను.
మధ్యలో బొర్రా గుహలకి వెళ్ళేవాళ్లు దిగడానికి , అరకు వెళ్ళే వాళ్లు ఎక్కడానికి బొర్రాగుహలు అనే స్టేషన్ లో రైలు ఆగింది.కొందరు ఎక్కారు. కొందరు దిగారు.
ఒక కొండమీదనుంచి ఇంకో కొండమీదకు చకచకా దాటిపోతోంది మా రైలు. ఎన్ని అగాథాలో...ఎన్ని మలుపులు తిరిగే కొండదారులో...వింజన్ డ్రైవర్ కి భయం వెయ్యదో ఏమిటో.
డిసెంబరు నెలాఖరు కదూ..పంటలు కోసినట్టున్నారు. సందడిగా ఉంది.పిల్లా మేక అందరూ దూరంగా కనిపిస్తున్నారు. అవిసె పంట కోసేసారుట అప్పటికే. చిన్నప్పుడు చూసిన అవిసె(వలిసె) పూలు ఇప్పుడు కనిపించలేదు.అక్కడక్కడ వెలుగు రేఖలు తొంగి చూస్తున్నాయి మబ్బుల్లోంచి. చల్లటి గాలి దూరంగా ఉన్న అమ్మ చల్లని చేతి స్పర్శలా ఆత్మీయంగా ఒంటికి తగుల్తూ ఉంది.
అరకు స్టేషన్ కి చేరింది రైలు. 1978 కి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఊళ్ళోకి వెళ్ళడానికి అప్పుడు 2 కి.మీ నడిచాం కదూ. ఇప్పుడు ఎంచక్కా ఆటోలు, టూరిజం వాళ్ళ బస్సులు అన్నీ వచ్చాయి. ఎ.పి.టూరిజం వాళ్ళు విశాఖ-అరకు రైల్లో వచ్చినవాళ్ళకోసం బస్ లు ఏర్పాటు చేసారు. మేం ఎక్కవలసిన బస్ నం. సీట్ నం. వేసిన టికెట్ని రైల్లోనే మాకు ఇచ్చారు.ఆ బస్ చాలా సౌకర్యంగా ఉంది. ఇక విశాఖ చేరేవరకు బస్ లోనే ప్రయాణం.
మొదట అరకులో చూడవలసినది ట్రైబల్ మ్యూజియం. అరకు లోయ మండలంలో నివసించే వివిధ గిరిజన జాతుల పేర్లు, వారి సాంస్కృతిక సంబంధమయిన విశేషాల తోకూడిన బోర్డులు ప్రవేశ ద్వారం దగ్గర మనకి పరిచయం అవుతాయి. గిరిజనుల నిత్యజీవతంలో భాగంగా వారు చేసే చాలా పనులను, వారు ఉపయోగించే వస్తువులను ఇక్కడ ఎంతో అందంగా అంతకన్నా ఎక్కువగా సజీవమూర్తులుగా భాసించే శిల్పాలతో ప్రదర్శించారు.
.వేటకు ఉపయోగించే వివిధ ఆయుధాలు, వంటకు, పంటకు ఉపయోగించే వివిధ సాధన సామగ్రి అంతా ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా నిలువెత్తు ప్రతిమలు, అవి మనుషులుకాదు కేవలం బొమ్మలే అంటే నమ్మలేనంత సజీవంగా కనిపించడం వీక్షకులకు నయనానందకరమైన అంశం.
పెళ్ళిళ్లూ, పండుగలు వంటి సాంస్కృతిక సందర్భాలలో వివిధ వాయిద్యాలు ధరించిన వారి నమూనాలు ఇవి.
ఇంటి పనులు చేసుకొనే స్త్రీలతో పాటు ఆటవిక వస్తువులతో వివిధ కళాకృతులను తయారుచేస్తూ జీవికను పొందుతున్న స్త్రీమూర్తుల రూపాలు మనని ఆశ్చర్యచకితులను చేస్తాయి. నిజమైన వస్త్రాలతోను, వస్తువులతోను వాటి కట్టూ బొట్టూ తీర్చిదిద్దినందువల్ల కాబోలు.
గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసా నృత్య నమూనా కూడా ఎంతో నేర్పుతో నిర్మించారు ఇక్కడ. ఈ థింసా నృత్యరీతులు పన్నెండు రకాలుగా ఉంటాయట. చైత్రమాసంలో కోతల సమయంలోను, ఇతర సాంస్కృతికమైన పండుగలు, వివాహాలు మొదలైన వాటిలో ఈ నృత్యం ప్రధానమైన అంశం. ఇందులో రాజు పేద, పడుచు,ముసలి, మగ ఆడ భేదం లేదు. అందరూ పాల్గొని చేసే సామూహిక నృత్యరీతి ఇది. మగవారు రకరకాల వాయిద్యాలను వాయిస్తుంటే, కొందరు పాడుతూ ఉంటే ఆడవాళ్లు ఈ నృత్యం చేస్తారు.
మరొక మంచి సాంస్కృతిక అంశం ఈ బొమ్మల్లో కనిపించింది. మనం ఒడుగులాగ చేసే తంతు ఏమో అనిపించింది. ఇక్కడి బొమ్మలు చూస్తే.
ఇక్కడ గిరిజనులు ఉపయోగించే వంటింటి వస్తువులు, వ్యవసాయానికి, వేటకి ఉపయోగించే వస్తువులు అన్నీ ప్రదర్శించారు. వాటి పేర్లతో సహా.
గిరిజన తెగలు ఎన్ని రకాలుగా ఉన్నారో వివరించే పటాలు కూడా ఇక్కడ ఉంచారు. విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ గిరిజన తెగలు విస్తరించి ఉన్నారట. వారు ఏఏ ప్రాంతాలలో ఏవిధంగా పిలవబడుతున్నారో వివరించేవి, గిరిజనులు జరుపుకునే పండుగల పేర్లు, ఏఏ మాసాలలో జరుపుకుంటారో ఆ వివరాలు, గిరిజనుల నృత్యకళా రీతులు -ఏఏ తెగల వారు ఏపేరుతో నృత్యం చేస్తారో వివరిస్తూ ఉన్నాయి.
మ్యూజియం పూర్తిగా చూడడానికి టైమ్ సరిపోలేదు. బస్ వాళ్ళు తొందర చేస్తారు. రాత్రిలోగా విశాఖ చేర్చాలంటే త్వరపడవలసిందే మరి. ఇంకా చూడవలసిన కళాకృతులు ఎన్నున్నాయో..రెండు అంతస్థులుగా కట్టిన ఆ భవనంలో.
మ్యూజియం తర్వాత చూసినది -పద్మాపురం గార్డెన్స్.
వందల ఎకరాల స్థలంలో ఎన్నో పూలతోటలు, పండ్ల తోటలు,ఔషధ మొక్కలు సాగుచేస్తున్నారు.వందల రకాల గులాబీలు గుత్తులుగా విరబోసి రంగురంగులతో ముద్దుగా కనిపించాయి. అరుదైన చెట్లు, పిల్లలను ఆకర్షించే డైనోసార్లు,చిన్న మట్టి గుడిసెలు ఓహ్...బోల్డు బొమ్మలు. చుట్టూ నడిచి తిరిగే ఓపిక లేని వారికి రోడ్డుమీద నడిచే టాయ్ ట్రైన్ ఏర్పాటు చేసారు. లవంగ, ఏలకులు, దాల్చిన వంటి సుగంధ ద్రవ్యాలు మనకి ఎలా వస్తాయో వివరిస్తారు ఇక్కడ గైడ్. లీచ్ పండ్ల తోటలు ఉన్నాయట ఇక్కడ.
ఇవి కూడా బొమ్మలనుకుంటున్నారా ఏమిటి ...కాదు లెండి. పిల్లలు ఆడుకుంటున్నారు.
పద్మా గార్డెన్స్ చూసిన తర్వాత ఎపిటూరిజం వారి వసతి గృహంలో అందరికీ భోజనాలు ఏర్పాటుచేసారు. ఎక్కడైనా ఆంధ్రదేశం(బహుశ భారతదేశంలోనే) లో యాత్రికులకు ఇబ్బంది కలిగించే అంశం. శౌచ్యాలయాలు. ఎక్కడా శుచి,శుభ్రత అన్నవి కనిపించవు. ముక్కులు కళ్లు కూడా మూసుకొనే పనిచేసుకోవాలి. కానీ ఈ వసతి గృహంలో ఏర్పాట్లు బాగున్నాయి. యాత్రికులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని పరిచయం చేయడానికి టూరిజం శాఖ వారు గిరిజనులతో థింసా నృత్యాన్ని ఏర్పాటు చేస్తారు. వారు చాలా ఉత్సాహంగా ఆ నృత్యం చేస్తుంటే కొందరు యాత్రికులు వారితో పాదం కలుపుతూ ఉండడం నయనానందకరం.
ఇక్కడ మన విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి విల్లులు, అమ్ములు కూడా దొరుకుతాయి.
ఇక మళ్ళీ ప్రయాణం. బొర్రాగుహలు చూడడానికి. అరకు దాటుతూ ఉండగా మైదాన ప్రాంతాన్ని చూపించాడు గైడ్. మన తెలుగు సినిమాలు అత్యధిక భాగం షూటింగ్ లు జరిపే ప్రదేశాలు అని.
త్రాచులాగా మెలికలు తిరుగుతున్న రహదారిలో బస్సు ముందుకు పరిగెడుతోంది. కొండలు,అడవులు వెన్నంటే వస్తున్నాయి. కొద్ది సేపట్లో అనంతగిరి కొండల వరుసలో అత్యధికమైన ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాం. దాన్ని గాలికొండ అంటారుట. అక్కడ ఓ క్షణం బస్ దిగి కిందకి చూస్తే....అద్భుతంగా ఉండే దృశ్యాలు ఇవి. ఇక్కడ సముద్ర మట్టానికి 3,700 అడుగుల ఎత్తులో ఈ గాలికొండ ఉందిట.
వెనక చాలా బస్సులు వస్తూ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆగడం కుదరదు.
పచ్చని తివాచీ పరిచినట్టుండే కొండలు అన్న వర్ణనకు సరిగ్గా సరిపోతున్నాయి కదూ ఈ కొండలు...
దారిపొడుగూతా పొడుగ్గా సిల్వర్ ఓక్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సన్నగా నవ్వొచ్చింది. ఎందుకమ్మా నవ్వుతున్నావ్ అన్నాడు బాబు. వసంతకోకిల సినిమాలో నీలగిరి చెట్లు చూసి ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాయి అని అడుగుతుంది శ్రీదేవి. ఆకాశానికి బూజు పడితే దులపడం కోసం అని జవాబు చెప్తాడు కమలహాసన్.ఇవికూడా అలాగే చాలా ఎత్తుగా ఉన్నాయి.
ఈ కొండలలో కాఫీతోటలు ఉన్నాయట. రకరకాల పళ్ళ తోటలు కూడా ఉన్నాయట.
ఇక్కడ లోయలో పండించే కాఫీ గింజలతో చేసే కాఫీ పొడి, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క ఈ ప్రదేశంలో అమ్ముతున్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఎన్నో మలుపులు, కుదుపుల తర్వాత బస్సు బొర్రా గుహలు చేరుకుంది.
బొర్ర అంటే ఒరియాలో కన్నం అని అర్థమని చెప్పాడు గైడ్. 1807 ప్రాంతాలలో ఈ గుహలను గురించి తెలిసిందట. ఒకసారి గిరిజనులు ఆవులు కాస్తూ ఉంటే ఒక ఆవు ఈ కన్నంలో పడిపోయిందిట. ఆ ఆవు అప్పుడే గోస్తనీ నదీ తీరంలో కనిపించిందిట. అక్కడ నుంచి వెనక్కి వెళితే ఈ గుహలు కనిపించాయిట. ఇక్కడ ప్రాంతం మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది.ఛత్తీస్ గఢ్, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలను కలుపుతుంది. ఒరిస్సా రాష్ట్రం ఈ బొర్రాగుహలు తమకు చెందినవని వాదిస్తోందట.
్
ఇదే బొర్రా గుహల ప్రవేశ ద్వారం పైనుంచి లోపలికి వస్తామన్నమాట.
ఇలా క్రిందకి దిగడానికి ఇదివరకటి కన్నా మెరుగ్గా మెట్లు వేసారు. పట్టుకోవడానికి రైలింగ్ ఆధారం కల్పించారు. ముఖ్యంగా ఇదివరకు చూడని విధంగా విద్యుదీకరించడం వలన గుహల అందాలు వివరంగా కనిపిస్తూ ఉన్నాయి.
గోస్తనీ నదిలో కొండలమీదనుండి ప్రవహించే అనేక ప్రవాహాలు కొన్ని వేల ఏళ్ళ పాటు సున్నపురాయిని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఈ గుహలు ఏర్పడ్డాయిట. అక్కడక్కడా గుహల పైకప్పునుండి నీటి చుక్కలు రాలి పడుతూ ఉంటాయి. ఇలా కొండలమీద ఉన్న కాల్షియం బై కార్బొనేట్, ఇతర ఖనిజాలు నీటితో జరిపే రసాయన చర్యవలన పై కప్పునుండి జారుతున్న నీటి బొట్లు కొన్ని వేల ఏళ్లకు ఘనీభవించి రక రకాల వింత ఆకృతులు సంతరించుకున్నాయి. వీటిని స్టాలక్టైట్స్ అంటారుట. అలాగే నేలమీదకు జారి ఘనీభవించి ఏర్పడిన ఆకృతులను స్టాలగ్మైట్స్ అంటారుట. అప్పుడు మా లెక్చరర్ గారు చెప్తే విన్నాను. ఇప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్న పాప నోటివెంట మళ్ళీ వింటే బావుంది.
కొన్ని ఆకృతులను శివలింగాలుగా భావించి పూజలు చేయడం కూడా చూశాం.
ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. సముద్ర మట్టానికి 2182 అడుగుల ఎత్తులో ఉన్నదిట ఈ ప్రదేశం. సరిగ్గా ఇక్కడ గుహ పై కప్పుమీద 176 అడుగుల ఎత్తున కొత్తవలస -కిరండల్ రైలు మార్గం వెళ్తోందిట. ఇక్కడ కొండ మందం 100 అడుగులుట.
ఇక్కడ నీటిప్రవాహం పసుపుగా కనిపించింది ఓ మూల.
అది సీతాదేవి స్నానంచేసిన ప్రవాహమని. ఆవిడ వాడిన పసుపు వలన ఆ నీళ్లు పసుపుగా మారాయని చెప్పారు గైడ్. సీతారాములు కొంతకాలం ఇక్కడ వనవాసం చేసారని గిరిజనుల నమ్మకం. ఆ మాటకొస్తే ఆంధ్రదేశంలో సీతాదేవి జలకాలాడిన నీటిప్రవాహాలు, సీతారాములు విడిది చేసిన ప్రదేశాలు, హనుమంతులవారు ఆగి అలసట తీర్చుకున్న ప్రదేశాలు ఎన్నో.
దిగ గలిగినన్ని మెట్లు దిగి, చూడగలిగినంత దూరం చూసి తిరిగివచ్చేసాం.
బొర్రా గుహలున్న కొండల పైనుండి కిందకి ప్రవహిస్తుంది గోస్తని నది. సన్నటి పాయలాగా ప్రవహిస్తూ క్రమంగా విశాఖపట్నం చేరుకొని బంగాళఖాతంలో కలుస్తుందిట. అబ్బ. ఎంత లోతో ఇక్కడ.
ఇది విశాఖ అరకు ప్రయాణ మార్గంలో చివరి మజిలీ.
ఇంకా తైద అనే వెదురు గ్రామం ఉందని చాలా బావుందని, కొంతమంది చెప్పారు. మేం చూడలేకపోయాం. అలాగే జలపాతాలు కూడా. జలపాతం పేరు చిత్రంగా ఉంది. రణజిల్లెడ అని. అలాగే చాపరాయి జలపాతం. మేము మిస్సయ్యాం.
తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. క్రమంగా భానుడు పడమటి కొండల వైపు నుంచి కిందకి జారిపోయాడు. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను చూసి పులకించి పోయాము. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఇక మా కెమేరాకి రెస్ట్.
బొర్రాగుహల నుండి విశాఖపట్టణానికి 90 కి.మీ.దూరం. కమ్ముకున్న చీకట్ల మధ్య బస్సులో ఏకబిగిని 3 గంటలు ప్రయాణం.
కొండ తాచు నడకలా మలుపులు తిరుగుతున్న ఘాట్ రోడ్ లో అత్యంత నైపుణ్యంతో బస్సును పరుగులు తీయిస్తున్నాడు డ్రైవరు. పగలంతా ఎంతో ఆనంద పరిచిన ఆ పర్వత సానువులు చీకటిలో భయ పెట్టాయి. నరసంచారం కనిపించని ఆ అడవుల మధ్య ప్రయాణానికి ఏ ఆటంకం కలగకుండా ఇల్లుచేరిపోవాలి దేవుడా అని ప్రార్థిస్తూ విశాఖ చేరేవరకు ప్రయాణపు అలసటతో మాగన్నుగా నిద్రలోకి జారాను. మళ్ళీ అరకు పునర్దర్శనం ఎప్పుడో......
వెనక చాలా బస్సులు వస్తూ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆగడం కుదరదు.
పచ్చని తివాచీ పరిచినట్టుండే కొండలు అన్న వర్ణనకు సరిగ్గా సరిపోతున్నాయి కదూ ఈ కొండలు...
దారిపొడుగూతా పొడుగ్గా సిల్వర్ ఓక్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సన్నగా నవ్వొచ్చింది. ఎందుకమ్మా నవ్వుతున్నావ్ అన్నాడు బాబు. వసంతకోకిల సినిమాలో నీలగిరి చెట్లు చూసి ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాయి అని అడుగుతుంది శ్రీదేవి. ఆకాశానికి బూజు పడితే దులపడం కోసం అని జవాబు చెప్తాడు కమలహాసన్.ఇవికూడా అలాగే చాలా ఎత్తుగా ఉన్నాయి.
ఈ కొండలలో కాఫీతోటలు ఉన్నాయట. రకరకాల పళ్ళ తోటలు కూడా ఉన్నాయట.
ఇక్కడ లోయలో పండించే కాఫీ గింజలతో చేసే కాఫీ పొడి, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క ఈ ప్రదేశంలో అమ్ముతున్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఎన్నో మలుపులు, కుదుపుల తర్వాత బస్సు బొర్రా గుహలు చేరుకుంది.
బొర్ర అంటే ఒరియాలో కన్నం అని అర్థమని చెప్పాడు గైడ్. 1807 ప్రాంతాలలో ఈ గుహలను గురించి తెలిసిందట. ఒకసారి గిరిజనులు ఆవులు కాస్తూ ఉంటే ఒక ఆవు ఈ కన్నంలో పడిపోయిందిట. ఆ ఆవు అప్పుడే గోస్తనీ నదీ తీరంలో కనిపించిందిట. అక్కడ నుంచి వెనక్కి వెళితే ఈ గుహలు కనిపించాయిట. ఇక్కడ ప్రాంతం మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది.ఛత్తీస్ గఢ్, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలను కలుపుతుంది. ఒరిస్సా రాష్ట్రం ఈ బొర్రాగుహలు తమకు చెందినవని వాదిస్తోందట.
్
ఇదే బొర్రా గుహల ప్రవేశ ద్వారం పైనుంచి లోపలికి వస్తామన్నమాట.
ఇలా క్రిందకి దిగడానికి ఇదివరకటి కన్నా మెరుగ్గా మెట్లు వేసారు. పట్టుకోవడానికి రైలింగ్ ఆధారం కల్పించారు. ముఖ్యంగా ఇదివరకు చూడని విధంగా విద్యుదీకరించడం వలన గుహల అందాలు వివరంగా కనిపిస్తూ ఉన్నాయి.
గోస్తనీ నదిలో కొండలమీదనుండి ప్రవహించే అనేక ప్రవాహాలు కొన్ని వేల ఏళ్ళ పాటు సున్నపురాయిని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఈ గుహలు ఏర్పడ్డాయిట. అక్కడక్కడా గుహల పైకప్పునుండి నీటి చుక్కలు రాలి పడుతూ ఉంటాయి. ఇలా కొండలమీద ఉన్న కాల్షియం బై కార్బొనేట్, ఇతర ఖనిజాలు నీటితో జరిపే రసాయన చర్యవలన పై కప్పునుండి జారుతున్న నీటి బొట్లు కొన్ని వేల ఏళ్లకు ఘనీభవించి రక రకాల వింత ఆకృతులు సంతరించుకున్నాయి. వీటిని స్టాలక్టైట్స్ అంటారుట. అలాగే నేలమీదకు జారి ఘనీభవించి ఏర్పడిన ఆకృతులను స్టాలగ్మైట్స్ అంటారుట. అప్పుడు మా లెక్చరర్ గారు చెప్తే విన్నాను. ఇప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్న పాప నోటివెంట మళ్ళీ వింటే బావుంది.
కొన్ని ఆకృతులను శివలింగాలుగా భావించి పూజలు చేయడం కూడా చూశాం.
ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. సముద్ర మట్టానికి 2182 అడుగుల ఎత్తులో ఉన్నదిట ఈ ప్రదేశం. సరిగ్గా ఇక్కడ గుహ పై కప్పుమీద 176 అడుగుల ఎత్తున కొత్తవలస -కిరండల్ రైలు మార్గం వెళ్తోందిట. ఇక్కడ కొండ మందం 100 అడుగులుట.
ఇక్కడ నీటిప్రవాహం పసుపుగా కనిపించింది ఓ మూల.
అది సీతాదేవి స్నానంచేసిన ప్రవాహమని. ఆవిడ వాడిన పసుపు వలన ఆ నీళ్లు పసుపుగా మారాయని చెప్పారు గైడ్. సీతారాములు కొంతకాలం ఇక్కడ వనవాసం చేసారని గిరిజనుల నమ్మకం. ఆ మాటకొస్తే ఆంధ్రదేశంలో సీతాదేవి జలకాలాడిన నీటిప్రవాహాలు, సీతారాములు విడిది చేసిన ప్రదేశాలు, హనుమంతులవారు ఆగి అలసట తీర్చుకున్న ప్రదేశాలు ఎన్నో.
దిగ గలిగినన్ని మెట్లు దిగి, చూడగలిగినంత దూరం చూసి తిరిగివచ్చేసాం.
బొర్రా గుహలున్న కొండల పైనుండి కిందకి ప్రవహిస్తుంది గోస్తని నది. సన్నటి పాయలాగా ప్రవహిస్తూ క్రమంగా విశాఖపట్నం చేరుకొని బంగాళఖాతంలో కలుస్తుందిట. అబ్బ. ఎంత లోతో ఇక్కడ.
ఇది విశాఖ అరకు ప్రయాణ మార్గంలో చివరి మజిలీ.
ఇంకా తైద అనే వెదురు గ్రామం ఉందని చాలా బావుందని, కొంతమంది చెప్పారు. మేం చూడలేకపోయాం. అలాగే జలపాతాలు కూడా. జలపాతం పేరు చిత్రంగా ఉంది. రణజిల్లెడ అని. అలాగే చాపరాయి జలపాతం. మేము మిస్సయ్యాం.
తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. క్రమంగా భానుడు పడమటి కొండల వైపు నుంచి కిందకి జారిపోయాడు. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను చూసి పులకించి పోయాము. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఇక మా కెమేరాకి రెస్ట్.
బొర్రాగుహల నుండి విశాఖపట్టణానికి 90 కి.మీ.దూరం. కమ్ముకున్న చీకట్ల మధ్య బస్సులో ఏకబిగిని 3 గంటలు ప్రయాణం.
కొండ తాచు నడకలా మలుపులు తిరుగుతున్న ఘాట్ రోడ్ లో అత్యంత నైపుణ్యంతో బస్సును పరుగులు తీయిస్తున్నాడు డ్రైవరు. పగలంతా ఎంతో ఆనంద పరిచిన ఆ పర్వత సానువులు చీకటిలో భయ పెట్టాయి. నరసంచారం కనిపించని ఆ అడవుల మధ్య ప్రయాణానికి ఏ ఆటంకం కలగకుండా ఇల్లుచేరిపోవాలి దేవుడా అని ప్రార్థిస్తూ విశాఖ చేరేవరకు ప్రయాణపు అలసటతో మాగన్నుగా నిద్రలోకి జారాను. మళ్ళీ అరకు పునర్దర్శనం ఎప్పుడో......
Subscribe to:
Posts (Atom)